ఋతుషట్కము
(ఋతువర్ణన)
రచన
డా॥ పాణ్యం శ్రీనివాస
ఎం.ఎ. పిహెచ్.డి.
పాణ్యంవారి ప్రచురణలు
కర్నూలు - 518 002
2023
ఋతుషట్కము
(ఋతువర్ణన)
ప్రథమ ముద్రణ: అక్టోబరు 2023
ప్రతులు: 1000
వెల: పద్యానురక్తి
ప్రచురణ కర్త:
పాణ్యం శ్రీనివాస
81-272-ఎ2, రామకృష్ణనగర్
కర్నూలు-518 002
చరవాణి: 88853 21295
డి.టి.పి.: నాగశ్రీగ్రాఫిక్స్
నెం.1-18, బృందావన కాలనీ
గుండ్లసాగరం గ్రామం, కనమనపల్లి పోస్ట్
గుడుపల్లి మండలం, చిత్తూరు జిల్లా, ఆం.ప్ర.
చరవాణి: 8500619283
ముద్రణ:
ఓంకార్ ఆఫ్‌సెట్ ప్రింటర్స్
3/3, మొదటి మెయిన్ రోడ్
న్యూ తరగ్ పేట, బెంగుళూరు - 560 002
ఫోన్: 080-26708186, 26709026
అభినందన
-
మీ త్రోవల్ సుకవీశ్వరప్రణుతముల్,మీ పద్యబంధార్థవై
చిత్య్రుల్ ప్రౌఢనిఘంటులక్ష్యములు,మీ సిద్ధాశు ధారాచరుల్
స్తోత్రప్రాయముల ధ్బుతంబులనిపించున్ సద్రసజ్ఞాళికిన్,
ధాత్రిన్ పాణ్యము శ్రీనివాసకవిచంద్రా! మీకు దీర్ఘాయువౌ.
-
భగవద్దత్తము రక్తనిష్టము భవత్పద్యానుబంధంబు, మీ
సగుణోపాసన విశ్వరూపఋతులక్ష్యంబై పరాభ్యర్చనా
సుగతిప్రాప్తికి దోహదంబైనదై,స్తుత్యర్హమై యొప్పె, మీ
కగుతన్ పాణ్యము శ్రీనివాస కవివర్యా! సర్వసౌభాగ్యముల్.
-
పాణ్యము వంశ్యుల పుణ్యమ
గణ్యము గీర్వాణి యింట కాపురముండున్
మాన్యులు సత్కవులు యసా
మాన్యులు కవి శ్రీనివాస! మణివవ్వారిన్.
ఇట్లు
సుధీ విధేయుడు
‘‘కళారత్న’’ శతావధాని గండ్లూరి దత్తాత్రేయ శర్మ
ఇం.నెం.7-160, కొత్తపేట, డోన్-518222
నంద్యాల జిల్లా, ఆంధప్రదేశ్. చరవాణి: 9440079522
నమః కాలాయ
కాలమనంగనేమి?లవ ,కల్పము రెండిటిమధ్యనున్న వే
వేల విభాగముల్ కలిసి విజ్ఞులు చెప్పెడి నిత్యసత్యమే!
కాలమనంతమై తనరు, కాలుడు కాళిగ గొల్చుటన్న యా
కాలపుతత్త్వమెన్నుటకఖర్వముపాసన సల్పుటే గదా!
ఋతుషట్కంబిదె, నీకునేనుపదగా నివ్వంగ లోదల్చితిన్
జతగూడంగ సమంచితాదరసుధాసారోజ్జ్వలాసాంద్రమున్
నుతిసేతున్నిను గాలరూపుని లసన్నూత్నానుభావంబునన్
గతి నీవే యని నిల్చియుంటి నభవా!కాలాయ తుభ్యం నమః.
వసంతం
-
ఒక పికకూజితంబును, కవోష్ణసమీరతరంగమొక్కడు,
న్నొక చెమరింపు ఫాలమున,నొక్కనవాంకురపల్లవోత్సవం,
బొక తొలి జల్లు, గంధవతి భూమి వెలార్చు పరీమళంబు, తా
మొకటిగ మారి లోకమున నొప్పె వసంతసమాగమంబుగన్.
-
మామిడిచెట్టునుండి యొక మైమరపించెడి పంచమంబు,తా
కోమలకూజితమ్మదియె కోకిలయంచు జగత్తునంతకున్
యామని రాక దెల్పె, ముదమారగ యామ్రకిసాలయంబులన్
కమ్మగ మెక్కి,యా పికము కౌతుకమొప్పగ గూయసాగెలే.
-
అరె! ఏమందము? దీనియందమిక నత్యాశ్చర్యమున్ జూపదే!
సరిలేనట్టిది, నిన్నమొన్న కనిపించన్ రాదు, నవ్యమ్ములై
తరువుల్ కొమ్మలరెమ్మలన్నియునునూత్నాంకూరపత్రంబులై
యురుమోదంబును గూర్చుచున్ జెలగె నత్యున్నద్ధకాలంబనన్.
-
గంభీరార్భటి జూపుచున్ మొయిలు దా ఖఢ్గోద్భవచ్చాలనల్
సంభూతంబులునా నిరమ్మదములన్ సందీప్తులన్ జూపుచున్
కుంభాకారతగల్గువారిచయమున్ గుర్వంగ సన్నద్ధమై
దంభోళుల్ వడగళ్ళుగా గురియుచున్ దంభంబునున్ జూపెడిన్.
-
తొలకరి జల్లులన్ దడసి తొల్తటి నైజగుణంబు గంధమా
నలుదెసలెల్లెడల్ ముసర, నాసికతర్పణమొంద, దేహమున్
పులకలు నిండ, జీవులకు భూమి యొసంగును హాయినెంతయో,
అలరుచు కర్షకాళి తమ యాద్యపుసేద్యమునుద్యమింపగన్.
-
తెలుగులవత్సరాది సభదీర్చగ వచ్చె వసంతమందునన్
వెలుగులు నింపుచున్ జనుల వీక్షణముల్ ముదమార, నల్గడల్
పిలుపుల నార్ద్రతన్ గురియ, బిల్లలుపెద్దలు నొక్కటై వెసన్
గలియుచు నుత్సహించెదరు కాలమునందలి మార్పుగాంచుచున్.
-
కందుకమున్ పరస్పరము కౌతుకమొప్పగ లీలనేయుచున్
జిందులు వేయు బాలకుల జిత్రపు బోలిక యందగించగన్
విందులు సేసె భూజములు పిండుగ వాలెడు బంభరాళికిన్
సందడి దందడిరప, దమ సౌరును జూపెడి పుష్పవిస్తృతిన్.
-
సానుక్రోశుడు మాధవుండు ధరనుత్సాహంబు దీపింపగన్
నానారూపములందగింప జగతిన్నాందీకరోత్పాదుడ
క్షీణాకర్షితపారివారికుడునై చిత్రంబులన్ జూపుచున్
వీణానాదము బోలునట్టి యులివున్ వీచెన్ సమీరంబులన్.
-
కరికుంభసన్నిభకమనీయకుచకుంభ
ఫలభారకంపిత వామ మధ్యపరిరంభసంరంభప్రారంభవిజృంభ
విస్తారకౌశికీ విభ్రమాంగిఘనజఘనహసిత కనకపులినతల
ప్రియహస్తమర్దనాపృథులమోదఅవిరామచుంబనసవిరాజితాధరో
త్ఫుల్లముఖపద్మ తుష్టనేత్రయగుచు రతికేళి సలుపుచు యర్థదేహ
మగని భాగ్యమ్ము పండగ మరులు గొనుచు
జంటగూడుచుమధుమాససౌరుబెంచి
సంతసమ్మిడుగాదె వసంతవేళ.
గ్రీష్మం
-
ఎఱ్ఱని యెండలో తలలు యెంతయొ మాడుచునుండ, కన్నులన్
జుఱ్ఱని మంటగా యెఱుపు జూపులు బాఱగ, గోవులన్ని తా
మఱ్ఱులు జాచుచున్, నిలువ నస్సలు సాధ్యము గాక గుందగన్
నెఱ్ఱెలు విచ్చె భూమి, మననేరవు జీవులు గ్రీష్మమందునన్
-
కన్నులు బైర్లు గమ్ముకొనె, ఘర్మజలంబది యాగకుండెబో
వెన్నులు మోతమోసెగద! భీషణతాపము చుట్టుముట్టగా
అన్నము దిందమన్న కడుపప్పులతోడనె నిండిపోయెలే
చిన్నపనొక్కటైన, పెను జిక్కుగ మారెను గ్రీష్మమందునన్.
-
దూరముగా మరీచికలు తోచెడు గాదె జలంబులట్లుగా
చేరగబోయినన్ జలము జిక్కదు మరింతదూరమౌ
సారములేనిజీవితపు జాడ్యమువోలె నటద్భ్రమంచనన్
తీరని కోర్కెగా మిగిలె తోయము బొందుట గ్రీష్మమందునన్.
-
ఛత్రము చేతబట్టుకొని, ‘‘ఛాయననుంటిని గాదె నే’’నటం
చాత్రము తోడతన్ జనుచు, శైత్యపుభావన బల్కరింపగన్
చిత్రము గాదె మానవుల చేష్టలు జూడగ వింతలయ్యెడున్
మిత్రుని తీక్ష్ణవీక్ష్ణములు మెండుగ గాయగ గ్రీష్మమందునన్.
-
చండగభస్తినిర్గతమజాండభయంకరమాతపమ్మిదే
చెండుచునుండె జీల్చుచును జీవులు తల్లడమంది శోషిలన్
నిండుకొనంగసాగెగద! నీరము బావుల జెర్వులందునన్
మండెను కాననల్ సతము మంటలు బుట్టగ గ్రీష్మమందునన్.
-
విన్మొకమాటచెప్పెదను వింతగ తోచిన తోచవచ్చులే
జన్మయె సార్థకంబనుచు జంకక భానుని తీక్షణ తాపమున్
మన్మథతాపపీడితులు మైథునమందున మున్గి తేలుచున్
చిన్మయమన్నదింకొకటి జిత్రము గాంచరు గ్రీష్మమందునన్.
-
మల్లెలు మామిడుల్ మధురమంజులభావము గల్గజేయగా
మెల్లగ పిల్లగాలులవి మేనును దాకుచు హాయిగూర్పగా
చల్లని కుండనీళ్ళు చల చల్లగ దప్పిక దీర్చుచుండగా
యుల్లము కొంత తేరుకొనె యుష్ణము బాదెడు గ్రీష్మమందునన్.
-
బేనిషపండ్లబేరమును భేషుగ జేసిరి భాగ్యవంతులే
మానక యూరగాయలకు మామిడి గాయల నాచరీ రకం
బే, నయమంచు బోటిపడి, వీటులనంగనలెంతొ యోర్పుతో
కానగనైరి నంగళుల కౌతుకమొప్పగ గ్రీష్మమందునన్.
-
‘‘మృగశిర కార్తె వచ్చె నిదె, మేలగు నింక’’నటంచు నుల్లమున్
జగములు కించిదూర్పు గనె, చల్లదనమ్మనుభూతమాయెలే
గగనమునందు మేఘములు కన్పడ జొచ్చెను, రైతు గుండెలో
చిగురులు వేసె నాశ,తను సేద్యము జేయును, పంట పండనన్.
వర్షం
-
ప్రోద్యద్భీషణరావముల్ చెలగగాభూతాళి కంపింపగా
విద్యుల్లేఖలు శ్వేతనాగులనగావీక్షింపలేనట్లుగా
సద్యోనిర్గతవారిపూరమనగాసర్వత్ర సంబాధమై
ఖద్యోతచ్ఛవి నల్లబాఱెననగాజలదౌఘంబు పర్యాప్తమౌ.
-
అబ్బురమాయె గన్నులకు నంబరమందున జూచుచుండగన్
బ్రబ్బిగొనంగ మేఘములు వార్షుకముల్ నిముసంబు లోపలన్
బబ్బముగాగ, జిత్రితము వైభవమయ్యది మాయయే గదా!
గొబ్బున మాఱుచుండె, గన గూటపు దైవపు సేతలయ్యెడున్.
-
కనుగొన వర్షమీ ధరణి గప్పుచు రేగుచు నంతకంతకున్
ఘనరసమెల్లెడల్ నిలిచి,కాలిడరాక కబోదులన్ బలెన్
పెనుభయమొందజేయుచును వీడక గొట్టెను జీవజాలమున్
పునుకలు దాల్చు దేవునకు పుట్టిన బుద్ధి యనంగ నుగ్రమై.
-
ద్రాఘిష్ఠంబగు ఘోరరావములు విద్రావంబులై చెచ్చెరన్
మేఘౌఘంబుల రాపిడిన్ వెడలగా,మేల్మేలటంచున్ మయూ
రౌఘంబుల్ పురివిప్పియాడ, గన సార్థక్యంబు నొందెన్ గనుల్
మాఘవ్యంబగు చాపమేర్పడె, జగన్మాయావినోదంబనన్.
-
వరదల నచ్చోట వాన లేమి యిచట
కొట్టుకు పోవుచు కూడు లేకపండిన పంటలు పాడయ్యె నచ్చట
ఎండిన పొలముల యేడ్పులిచటపిల్లమేక యనక పేదల గుడిసెలు
నీట గలసిపోవ నీడ లేకపిల్లమేక యనక పేదల గుండెల
బగుల జేయుచునుండె పనులు లేవువానకాలమందు వగచుచుండుటె గాని
లబ్ధి లేదు గనగ లవము గాని
వరుణ పాశ మనెడి వైఖరి గనుపట్టె
ధర్మహాని యనియె ధార్మికుండు.
-
మెల్లగ మెల్లమెల్లగ సమీరము తాకగ నాకసంబునన్
జల్లులు రాల్చు గొన్ని, పెను సవ్వడి జేయుచు బారు గొన్నియున్
దెల్లని దూదిపింజలన దేలుచు పోవును వెంటవెంటనే
నల్లని యేన్గుగున్నలుగ నాట్యము సేయును వార్షకాభ్రముల్.
-
వాగులు వంకలున్ గలసి బారుచు నూళ్ళను ముంచుచున్, వెసన్
జేగురు రంగు దాల్చుచు, నశేషతటస్థమహీరుహంబులన్
వేగముగా బెకల్చుచును, భీతిల జేయుచు బ్రాణులన్నిటి
న్నోగిరనీరముల్ యిడక యూపిరి తీసెను జూచుచుండగన్
-
ఎడతెఱపిన్ గనంగ జననీయదు రోజులు వారముల్ తరం
బడి, వడగండ్ల మోదు, ధర బచ్చని బైరుల నుండనీయదా
బెడిదపు వర్షపాతము కరిబృంహిత భీకర రావముల్ దెసల్
జడియగ జేయుచున్, జనుల చావుకు వచ్చెననంగ దోచెడిన్.
-
ఉల్లసిల్ల మనము నందు నూరడిరచు కైవడిన్
మెల్లనొక్క వెలుగు రేక మింట గాన వచ్చెడిన్
గల్ల కాదు సత్యమౌనె? కైతవమ్ము కాదనన్
గిల్లి జూచు గొన్న గాని కేల, విశ్వసింపరే.
శరత్తు
-
అలుపపు బల్కులన్ బొగడనౌనె? జగత్తు శరత్తునందునన్
జిలికెడి సౌరులన్, దెసల జిందుచు నందములెల్ల వింతలై
కులుకుల జూపుచుండ, గనుగొల్కుల హర్షపు బాష్పబిందువుల్
జలజల రాలజేయ, జలజాతభవోద్భవ సర్గశోభనన్.
-
సమమైన సౌఖ్యంబు సంతరించుచు నుండు
రాత్రింబవళ్ళు సరాగమెలయవడగాడ్పులుండవు వడగళ్ళు రాలవు
తీక్ష్ణమై మండడు తిగ్మరుచియుమందానిలమ్ములు మంచిగంధమ్ముల
బంచ వీచుచునుండు బవలు రేయిసకలజీవంబులు సంతోషమొందగ
క్షణదాకరుని కాంతి క్షమతనొందుసకలసృష్టిచయము సర్వశోభలెలయ
చిందులేయు మనము జిగిని గాంచ
ప్రాభవంబు తోడ పరిఢవిల్లును ధాత్రి
శరతు కూర్చ గలదు సంతసంబు.
-
ఆనందంబున నర్ధరాత్రమున రత్యాసక్తులై దంపతుల్
మానంజాలరు, గాఢచుంబనమహామాధుర్యసమ్మోదమా
పానంబెంతకు బొద్దుబోదురుగదా ప్రాసాదవాతాయనో
ద్భిన్నంబో యన బుక్కిలించు సితచాంద్రీశీతతాపంబునన్
-
మదనుని పుష్పబాణములు మత్తిలజేయగ, జంద్రకాంతిలో
వదనములందు నొండొరుల ప్రబ్బినమోహపుటూర్పులుబ్బగా
జెదరని కాంక్షతో నిశల సిగ్గిలకుండగ గామకేళిలో
వదలక పెన్గుచుండిరట ప్రౌఢవయోపరిరంభణార్భటిన్.
-
తెల్లని మేఘముల్ కదలు తీరును జూడగ నుల్లమయ్యెడిన్
ఫుల్లనవాబ్జమో యనగ, భూరుహ సంతతి వీచుచుండగన్
జల్లని పిల్లతెమ్మెరలు, ఛాయల జేరుచు సేదదీరగా
నెల్లెడలన్ ముదాకరమవెంత విచిత్రమొ శారదీప్రభల్.
-
నవరాత్రంబుల నేకనిష్ఠగొనుచున్నానాస్వరూపంబులన్
శివవామాంకమునందు నొప్పెడి శివాచిద్రూపసంభావ్యులై
భవముల్ దొల్గగ బూజసేతురు గదా వైరుధ్యమూహింపకే
భువి భక్తుల్ శరదాగమంబు గనుచున్ పూతాత్మతాగమ్యులై.
-
పంచచామరం: క్షపాకరుండు శారదీనిశన్నిజాచ్ఛకాంతి గా
శ్యపీసమంతవింతసౌరు జల్లచేయుచుండగన్ కృపాకటాక్షవీక్షణంబు, కృత్స్నలోకపాలనం బపావృతంబు దేవి దృక్కు నధ్భుతంబు బోలెడిన్. -
నిర్మలవారిపూరములు, నిర్మలమాకసమున్ శరత్తునన్
నిర్మలభూరుహంబులును, నిర్మలగాంతినొసంగుభానుడున్
నిర్మలచంద్రికన్ జగతి నిగ్గులదీర్చెడిశీతభానుడున్
నిర్మలదిక్చయంబు, పరినిర్మలపావనతత్త్వవీచికల్.
-
వనముల్ పర్వతముల్ నదీనదములా భవ్యోజ్జ్వలత్తారకల్
ఘనభూజంబులు పట్టణంబులును ప్రాకారంబులున్ వీధులన్
పునరాయాతసమీరపూరణములై పూర్ణేన్దుసంకాశముల్
కనువిందొప్పెను శారదీనిశలు పైగప్పంగ ధావళ్యమున్.
హేమంతం
-
హేమంతంబున గానిపించు మిహికాహేలావిలాసంబులే
శ్రీమంతంబగుచున్ ప్రభాధవళమై,చేతమ్ము నాట్యమ్ము స
ల్పన్, మించున్ జగమంతటిన్ మివుల జల్లంజేయగా నేర్పుమై
స్తోమంతంబదె మార్గశీర్షమెలమిన్ సుశ్లోకునర్చింపగన్.
-
మార్గశిరంబె మాసముల మామకమైనది యంచు వెన్నుడే
మార్గము జూపుచున్ తనదు మంజుల వీక్షణముల్ ముదంబునన్
స్వర్గపువాకిళుల్ దెరచి,సౌఖ్యము శాంతియు నొందగల్గ,వే
యార్గురు దాయలన్నణచి నంతికమున్ దగ జేర బ్రోచెడిన్.
-
ప్రాతర్వేళల మంచుబిందువులువిభ్రాంతిన్ విడంబించుచున్
స్ఫీతాష్టాపదవర్ణసంచయసమాస్ఫేష్ఠామనోహారులై
యాతాయాతదివాకరాకరముఖాహ్లాదానుభోగంబులై
చేతోనిర్వృతినొందజేయునుగదా శ్రీమార్గశీర్షంబునన్
-
కనుజూపెంతగ బారునో గనగనౌ కైవారముల్ సల్పుచున్
మనుపన్ శక్యము గాని శోభలను హేమంతంబు జూపట్టెడిన్
గనగన్ శాద్వల భూములన్, వనములన్, క్ష్మాజంబులన్, దిక్కులన్
ఘనమైనట్టి మహీధరంబులను దాగప్పంగ నీహారముల్.
-
ఉహుహూ యంచు వణంక జొచ్చె చలితో! యూర్పుల్ సుదీర్ఘంబులై
మిహికాపాతము తీవ్రమై జెలగగా మేనుల్ స్పర్శ గోల్పోవగా
దహనుండెంతయొ బ్రీతి గూర్చె సకలాధారంబునై నిల్చుచున్
సహనంబింతయు జూపజాలరు జనుల్ శౌచాదికార్యంబులన్.
-
వాకిళ్ళు కిటికీలు వారగా దెరచిన
వాయింప జొరబడు వాయువెపుడువంటలు జేయంగ వడ్డన సలుపంగ
ఆవటిల్లి పోదురు ఆడవారువెన్నలు నేతులు వీడక వాడుచు
మూతుల పగుళ్ళు మూయు చుంద్రుఆపాదమస్తక మాచ్ఛాదనమ్ములు
తొలగనీరు ముసుగు తొట్రుపడుచుఅహము లెంతొ కుఱుచ, అతిదీర్ఘ ములు నిశల్
కాల మహిమ జూడ కళ్ళు తిరుగు
చలి చలి చలి యంచు జగతి వణుకుచుండె
వెచ్చదనము గూర్చి వెతను జెంది.
-
మకరమునందు జేరుకొనె మార్గము మార్చిన భాస్కరుండు,వే
సుకరము యౌచు తేరుకొనె,స్రుక్కగ శీతము యెట్టకేలకున్
పకపకనవ్వినట్లు గనుపట్టెను మేదిని పంటచేలచే
సకలము భద్రమంచనగ సస్యములింటికి జేరసాగెలే.
-
హేమంతఋతురాజు హృష్టాంతరంగంబు
గన్పింప రేగెలే గాడ్పురేడుహేమంతఋతురాజు హెగ్గడికత్తెలై
కనువిందుజేసెలే కైరవములుహేమంఋతురాజు హేలావిశేషంబు
మసకజూపుల సాగె మంచుతెరలుహేమంతఋతురాజు హింసావధియనగ
రెచ్చిపోయెను గదా రేల హిమముమంచుబిందువు లెంతయో మనసు దోచ
పుష్పలావికాలాస్యంబు బొద్దు బొడవ
గమ్ముకొన్నట్టి పూతావి గడలుకొనగ
నుదయవేళల సందడి నుద్యమించె.
-
హిమవంతంబగు రాత్రులన్ బవళులన్ హేలావిశేషంబులన్
తమకంబించుక తగ్గకుండ రతి నుద్దామాకృతిన్ దంపతుల్
సమయుజ్జీలన బెన్గులాడెదరు తా సైదోడువాదోడుగన్
కమనీయంబుగ సల్పుదుర్ మదను సాకారంబు గావించుచున్.
శిశిరం
-
తెలతెలవాఱుచుండ,కనుదిప్పుకొనంగను రాక,చిత్రమై
వెలవెల బాఱె తామరలు బెట్టిదమౌ శిశిరంపు తాకునన్
జలజల రాలసాగె తమ చక్కని పత్రములన్ని గుంపులై
విలవిల దన్నుకొంచు విడి, వేగమె మోడులు గాగ నయ్యయో!
-
విశసనమో యనంగ గనువేదుర గల్గగజేయసాగెడిన్
శిశిరము ధాటిగా విసరె శీతలవాయువులన్నిదిక్కులన్
నిశలు పవళ్ళు వంతులుగ నీరసబర్చెను జీవజాలమున్
కుశలము నించుకేని యొనగూర్చవు గాదె భయమ్ము బెంచుచున్.
-
పండితలోకమా యనగ పండిన యాకులు చెట్లపై వెసన్
మండనమౌచు బోధనలు మానితజీవితసత్యశోధనల్
మెండుగ జేయుచుండుగద ‘‘మిథ్య జగత్తుగ దందడిరచెడిన్
దండిగ జూపు మాయలను దానికి వశ్యులు గాక యుండుడీ’’.
-
ఆకుల్ రాలెడికాలమిద్ది శిశిరమ్మశ్రాంతమాక్రందనల్
మ్రాకుల్ సల్పగ, పర్ణమొక్కటియు దారాడంగ లేకుండగన్
జీకుల్ జింతలు లేని యోగులనగా జెట్లుండెడిన్, ధీకులై
లోకుల్ మెచ్చగ, డుల్చివేసిన మహాలోభాదులన్ బోలుచున్.
-
రథసప్తమి తెలుపు రవిరథ గమనము
జక్కులేడును గూడి జవము మీరభీష్మైకాదశి దెల్పు వేదవేద్యు గొలువ
గోరిన కాలమున్ గూడు మిత్తిశ్రీపంచమి తెలుపు శ్రీవాణి గొలువగ
బొందగల్గునట్టి భూరివిద్యహోళిక దెల్పును హుమ్మను రాక్షస
భావమ్ము గాల్చుట భక్తి తోడమాఘఫాల్గుణంబు లఘముల ద్రుంచుచు
శిశిరమందు నిల్చు చిత్త మలర
ఘనముగాదె మహిని గనగ నబ్బురమగు
ఋతువులందు నిదియె ఋతము గూర్చు.
-
మంచిముహూర్తముల్ దెలిసి మాఘము ఫాల్గుణమందునన్ జనుల్
సంచితజన్మకర్మఫలసంగమజీవనసౌఖ్యవాంఛతో
నంచిత రీతిజేయుదురు నైహికమార్గశుభమ్ములందగన్
మించినఖర్చులన్ గనక మెప్పులకుబ్బుచు గ్రిందుమీదులై.
-
ఉత్తరాయణమంచు నుత్సాహమెలయంగ
తీర్థయాత్రలుసల్ప తీరికనగచలికాలముగాదు చండభానుడుకాదు
ఆహ్లాదమైనట్టి యదనుజూచిపిల్లపెద్దలనక పేరుపేరునబిల్చి
విందుగూర్చగల్గు వేడ్కతోడతిరుణాళ్ళు పెళ్ళిళ్ళు తేరు లాగుటలుగ
పుణ్యక్షేత్రమ్ములు పోహళింపమాఘఫాల్గుణములు మహితమై యొప్పారు
జనులకెల్లగూర్చు వినుత సుఖము
శిశిరమిద్దిజూపు చిరమగు మురిపెమ్ము
సూచననగ దోచు సురభి రాక.
-
శిశిరము జూపు రాత్రులనశేషమహోత్సవసంగమంబులన్
శశిరవితారలుండెడి విశాలనభమ్మును బోలునట్టియా
యశమును గూర్చగల్గు యఘహారి సురేంద్రవంద్యుడున్
శశిధరు గొల్చుచున్ దిరిగి జన్మనునొందని దివ్యరాత్రులన్.
-
శిశిరము జూపు రాత్రులను జిక్కినజంటల పంటపండగన్
నిశితమయూఖముల్ విసరినిండుగ మోదమునందు మున్గగన్
పిశునుడు మన్మథుండు పరిపీడనమార్గసుఖానుభూతికిన్
వశులను జేయుచుండు మరువాంఛలనొప్పెడి దివ్యరాత్రులన్.