శ్రీ పాణ్యం వాఙ్మయ నిధి పాణ్యం వంశ రచయితల సాహిత్యము

త్రిపుర › భాగము 1

భాగము 1

త్రిపుర · భాగము 1 / 1

త్రిపుర

ప్రథమ జన్మదినోత్సవ పురస్సర పితామహుని బహూకృతి (21.12.2023)

రచన

డా॥ పాణ్యం శ్రీనివాస

ఎం.ఎ. పిహెచ్‌.డి.

పాణ్యంవారి ప్రచురణలు

కర్నూలు - 518 002

2023

ముందుమాట

పసిపిల్లలున్న ప్రతి యింటిలో జరుగునట్టి సన్నివేశాలను, శైశవ చేష్టలను ముచ్చటలను ముద్దులు మూటగట్టునట్లు ఇంటిల్లిపాదీ అనుభవించే మధురానుభూతులను నా మనుమరాలు ‘‘త్రిపుర’’లో చూచుకొంటూ ఆ ముగ్ధ భావనలందరికీ పంచిపెట్టు యత్నమే ఈ రచన. అలతి అలతి పదములతో ఆటవెలది ఛందస్సులో అందరికీ సులభగ్రాహ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో సాగినది. గుర్రం జాషువాగారి ‘శిశువు’ ఖండిక పాణ్యం సోదరుల ‘మాపాప’ ఖండిక ఈ రచనకు ప్రేరణలు. వారు 7,8 పద్యాలలో వెలిబుచ్చిన భావాలను నేను దాదాపు పాప ప్రతిచేష్టను (జన్మాదిగ నేటి పర్యంతము) వెలిబుచ్చాలని ప్రయత్నించినాను. కొన్ని చోట్ల వ్యాకరణ విరుద్ధంగా విసంధులను పాటించడం జరిగింది. పండితులు క్షమింతురుగాక! కేవలం రసనిర్భరతే ధ్యేయంగా సాగిన రచన ఇది.

ఇతిశమ్‌

  • పాణ్యం శ్రీనివాస

త్రిపుర

  1. నేడు వచ్చె పాప, నిజముగా మాయింట

    వెలుగు నింపె తనదు వేడ్క తోడ

    అందరామె తోడ నాడుకోవాలని

    అహమహమిక తోడ నావటిల్ల.

  2. బోసినవ్వు జూడ బోలును వెన్నెల

    మూగిరందరెంతొ ముచ్చటగను

    పాప నవ్వు కొరకు పనిపాట లేనట్టు

    ఇంత కన్న మాకు నేమి వలయు?

  3. ’’త్రిపుర’’యంచు బిల్వ తేటకన్నులతోడ

    తన్నె పిలుతు రంచు తలను తిప్పు

    చుట్టు నున్నవన్ని జూచును వింతగ

    మరల మరల జూచు మానకుండ.

  4. సుద్దులెన్నొ చెప్పు జూపుల తోడనె

    ఒకటి రెండు మూడు ‘‘ఊ’’ల తోడ

    తనదు భాష గాగ, తనియగ మేమంత

    నిత్యకృత్యమాయె నిజము మాకు.

  5. ఇంటి లోని వన్ని యిరకటముగ సర్ది

    పాప కొరకు లాలి పరుపు జేర్చి

    మూలనున్నవన్ని ముచ్చట గూర్పగా

    బయట జేర్చినాము పాప కొరకు.

  6. పాలు తాగు చుండు బాగుగా నిద్రించు

    రెండు పనులె కాగ రేయి పగలు

    గడుపు,మేలుకున్న కాలమ్ము కొలదియె

    అదియె మాకు కాగ ఆట పాట.

  7. ఏడుపన్న తనకు ఏమిటో తెలియదు

    నవ్వుచుండునెపుడు నైజమనగ

    పాట విన్నయంత పరవశించుచునుండు

    గాన మహిమ జూడ ఘనము గాదె.

  8. ఎంత మంది ఉన్న ఏమిటో ఆవింత

    అమ్మ జూచి నంత హాయి జెందు

    అమ్మతనము జూడ అమృతమయమది

    ధన్య మగును జన్మ తల్లి గాగ.

  9. తాను మాకు కొత్త,తనకేమొ కొత్తలే

    మేము జూడ,తనకు మేము,తాను

    మాకు,జన్మ జన్మ మాధుర్య బంధమే

    కలదు.లేక యున్న కల్గునె ఇది?

  10. ఒకపరి యిటుజూచి నొకపరి యటుజూచి

        కాంతులు జిమ్మెడి కనులు దిప్పు
    

    ఒకపరి యమ్మపై నొకపరి నాన్నపై

        మాటిమాటికి దూకు మార్చి మార్చి
    

    తాతను జూచిన తగని యుత్సాహము

        బోసినోటినిదెర్చి పొంగి పోవు
    

    వటపత్ర శాయిగా పాదము పట్టును

        నోట వేలు జొనిపి నొక్కుచుండు
    

    నిద్ర పోవు నపుడు నిర్మల వదనము

    కాలు పైన కాలు గనగ ఠీవి

    తనరుచుండు, మాకు తానౌను యువరాణి

    మనుమరాలు జూచి మైమరతుము.

  11. బైట తిరుగుటన్న బహు పసందు తనకు

    చూచుచుండు నన్ని చోద్యముగను

    వారి వీరి ననక వర్షించు నవ్వులు

    పల్కరించినంత పైకిబ్రాకు.

  12. మాటలాడువారి మాటలు వినుచుండు

    అర్థమైనయట్లు హాసమొదవు

    చిత్రమగును గాదె చేష్టలు చూడగ

    త్రిపుర యున్న మాకు తీరు చింత.

  13. చిట్టి తల్లి జూచి చేసైగ జేసిన

    మొగము ద్రిప్పుకొనును,మూతి ముడుచు

    ఎప్పుడేమి తనకు యెయ్యది నచ్చునో

    ఎవ్వరెఱుగరైరి యెంత వింత?

  14. బాధ గల్గి గూడ బైట పెట్టదు గదా!

    మనమె తెలియవలయు,మాన్ప వలయు

తండ్రి నుండి వచ్చు తాలిమి యిదిగదా

రక్తనిష్టగుణము రాకపోదు.

  1. అమ్మ జేరి నంత నారాట మణగును

    చిన్ని బొజ్జ నిండ చిందు నగవు

    సానుకూలమగును స్నానంబు నిద్రయు

    మొండి జేయదెపుడు ముద్దు లొల్కు.

  2. పార్కులోన యుడుత పరుగు వెట్టుచునుండ

    పట్టబోదమంచు బాకులాడు

    నడక రాదు తనకు నవ్వుచు జూచిన

    తాను గూడ నవ్వు తప్పదనగ

  3. పార్కు లోన లాలి బాగుంది కాబోలు

    మాటిమాటికచటె మసలగోరు

    చేతిసైగతోడ జేఱంగ జూపుచు

    బోవు వఱకు మనల బోరుచుండు.

  4. పార్కులోననెగురు పక్షులజూచుచు

    బులకరించు వాని బలకరించు

    అనుకరించజూచు నరుపులనన్నిటి

    సహజగుణము కాదె శైశవము

  5. పార్కు లోని యాటవస్తువులన్నచో

    చెప్ప శక్యమగునె చిందులేయ

    పోయి జూడవలయు పొందవలయు గాదె

    పట్టరాని ముదము పరిఢవిల్ల.

  6. పార్కు లో వెలసిన ప్రభుదత్తదేవుండు

    మేడిచెట్టులోన గూడియుండ

    భక్తి జూచి మొక్కు రక్తిజెందగ మేము

    దత్తభక్తి పితృదత్తమనగ.

  7. రోజుకొక్కవిద్య రూపుగట్టించును

    గంటకొక్కలీల గనగనిచ్చు

    కొత్తకొత్తవన్ని కోరుకొనుచునుండు

    చుట్టుపక్కలెపుడు చోద్యమెసగ.

  8. నేలమీదివాని నిశితజూపులజూచి

    వేళ్ళు రెండు కలిపి బిగియబట్టి

    దూకుడెంతొజూపి దోగాడుచుండియు

    నోటబెట్టజూచు నూత్న మట్లు.

  9. కిందనున్నదేదొ యందవలయు నంతె

    పురుగలైన నవియు బొరుగులైన

    సమతజూచునట్టి సమవర్తి తానెjైు

    ముద్దుగూర్చుగాదె ముగ్ధశిశువు.

  10. రెండుచేతులందు రెండుపట్టుబడగ

    నిట్టనిలువు నిల్చు దిట్టముగను

    పట్టుజిక్కువరకు పడునడుగులు వడి

    కూలబడును తాను కుంఠితముగ.

  11. చేతనున్నదాని జేసాచియడుగంగ

    నిచ్చివేయు,గొంకదింతjైున

    థాంక్సు జెప్పవలయు తానుమురియవలయు

    నత్తనేర్పినట్టి కొత్తవిద్య

  12. చిన్నతనమునుండి జిజ్ఞాస గల్గుట

    జీవలక్షణంబు చిత్రగతుల

    మానవుండు మాఱు మహనీయుడై తాను

    తత్త్వవేత్త యగును తఱచి చూచి.

  13. దొరకబుచ్చుకున్నదొక్కటినేదైన

    తిప్పితిప్పిచూచు విప్పిచూచు

    వెనుక ముందు పక్క వెదుకును పలుమార్లు

    తెలుసుకొనునదేమొ తెలియలేము.

  14. నేతి నేతి యనుచు నేర్చుకోవలయును

    సిద్ధవస్తువేదొ శిష్టబుద్ధి

    ననెడి మాట నిజమె యనగ బోవుచునుండు

    దానివైపె,మరొకదానిబోక.

  15. చుట్టునెన్నియున్న జూడనే చూడదు

    పట్టుబట్టినట్టు బిట్టునఱుగు

    తాను కోరుకున్నదానిమాత్రమెజూచు

    నడ్డగించబోవ నందబోదు.

  16. జోతయన్నజాలు జోడిరచి పైకెత్తి

    హస్తయుగము జేర్చు మస్తకమున

    భజన యన్న జాలు పరిపరి నఱజేతు

    లప్పళించి గొట్టు చప్పటులను.

  17. నేను నాది యనెడి నిజజీవధర్మంబు

    పట్టువడును గాదె పుట్టునపుడె

    పెరుగుచున్నకొలది పెంపొందసాగును

    పతనహేతు వగును బలుపు నొంద.

  18. నాది యమ్మ నాది నాన్న యనుచు పైన

    వేయునట్టి చేతినేయు విసరి

    అమ్మనాన్నపైన హక్కుతనదె యన

    నేర్వసాగెనన్ని నేర్పుమీఱ.

  19. ఉప్పుయాటయాడు నుత్సాహమొప్పంగ

    నెత్తి నుంచు కొనుచు నిక్కిజూచు

    చేతనున్నదాన్ని శిక్షితమతితోడ,

    గిందపడిన నవ్వు కిలకిలకిల.

  20. కుంకుమలదుకొనగ నంకువ జూపించు

    చిట్టి వేలు నద్ది పట్టి నట్టి

    కుంకుమెక్కడైన గురిచూసి ముఖమందు

    పెట్టుకొంచుజూపు పెద్దరికము.

  21. చుట్టునెందరున్న జూడనేచూడదు

    మఱువబోదు తాను మాన్పబోవ

    నమ్మకావలె ననునంతమాత్రముననె

    అమ్మజూడవలయు హర్షమెసగ.

  22. నిలువదొక్క చోట నిలువనీయదసలు

    నిద్ర వోవు నపుడె నెమ్మదించు

    లేచిలేవగానె లేతనవ్వులురువ్వు

    లేనె లేదు యేడ్పు తేనె పలుకె.

  23. చిన్నమొన్న దెబ్బలన్న లెక్కకురావు

    నడుచునపుడు తగులు దుడుకు హెచ్చ

    నడక మీదె చూపు నైశిత్యమంతయు

    పడుట లేచుటదియ పాడి గాదె.

  24. అమ్మనాన్నతాత యమ్మమ్మనాన్నమ్మ

    మేనయత్తగలసి మేలమాడ

    కేకిసలు సలుపుచు కిందౌచు మీదౌచు

    నందరందుకొందురందగింప.

  25. తనకుపెట్టునట్టిదానివైపేపోదు

    ఎదుటివారు తినునదేదొ జూచి

    నదియె పెట్టుమంచు నఱ్ఱులుజాచును

    కొత్తకొత్తరుచుల గోఱుచుండు.

  26. బొమ్మలెన్నియున్న బోదుయావైపుకు

    జీవమున్న మనమె కావలయును

    పలుకునులుకు లేక పడియుండనీయదు

    సందడిరచుచుండు దందడిరప.

  27. నాయనమ్మ సల్పు నైష్ఠిక కర్మలు

    తులసిదీపపూజ తుష్టి గూర్చు

    రెప్పవాల్చకుండ జెప్పనలవిగాని

    సంభ్రమంబుతోడ జక్కజూచు.

  28. జపముసేయునపుడు జపమాలగైకొని

    తాను పాఱవేయు తావళమును

    కంఠమందు దాల్ప కౌతుకమొప్పగ

    తిప్పితిప్పిజూచు తృప్తిగనదు.

  29. గంటకొట్టునపుడు గణగణశబ్దంబు

    చెవిని బడ్డ జాలు చెంతజేఱు

    గంట గుంజు కొనుచు వెంటనె మోగించు

    మోత రాదు వెలికి మూతి ముడుచు.

  30. హారతిచ్చునపుడు హస్తంబులనుజాచి

    యద్దుకొనుటజూచి యనుసరించు

    చేయి చుఱుకు మనని చెంతకు బోనీయ

    కున్న గీచు మనుచు గూతవెట్టు.

  31. తీర్థ సేవనమును సార్థకమనునట్లు

    చేయి జాపి తానె చేయవలయు

    త్రాపబోదమన్న జూపదు తననోరు

    కొంటె చేష్ట లెంతొ కొత్త లగుచు.

  32. బుడిబుడి యడుగులు నడువబోవ నుత్స

    హించి,తడబడ నొకటి రెండెంచి దబ్బు

    నట్లె కూలబడుచునుండు,నట్లె మరల

    నడుచు చుండును మానదు ,నవ్వు లొలుక.

  33. విసవిస గునగునగ వేగమె దోగాడు

    చుండి,వెనుక నెవరొ నుండి పట్టు

    కొందురంచు, జిక్కకూడదనెడియాత్ర

    మొప్ప, సాగుచుండు ముదము మీర.

  34. అందరు తనచుట్టు చేరి ఆర్భటి నెసలారగా

    తందనాన భళ యనంగ తాళముల్‌ చఱుప వలెన్‌

    చిందులేయు నిలువ బెట్ట చిత్రమైన రీతులన్‌

    నందనందనుండె గాదె నాట్యభంగిమంబునన్‌.

  35. రమణతాత పాడు రాగాల నన్నింటి

    ననుకరింప జూచు హాయి గూర్చు

    చేతు లిట్టు లట్టు చిత్రగతులనాడ

    సాగదీసిపాడు సంభ్రమించు.

  36. రమణ తాత జూడ రంజిల్లు వదనమ్ము

    ఎత్తుకున్నవారు ఎదవలైరి

    మీదకురికి జూచు మిలమిల గన్నుల

    తనదుమాటె నెగ్గె తగ్గననగ.

  37. పల్కరించకున్న వదలిపెట్టుటలేదు

    తానె పల్కరించు,తప్పదింక

    పల్కరించి, నవ్వి, పట్టంబు గట్టంగ

    చచ్చినట్లు నటన సాగవలయు.

  38. చూడజూడ జేరె శోకభయాదులవియె

    జీవలక్షణంబు జిత్రమగుచు

    మానవీయధర్మ మంచునెఱుగజేయు

    మూలమాయె సకలమోహములకు.

  39. సృష్ఠి చేయునట్టి చిత్రమిదియె గాదె

    నిత్యనూత్నమట్లు నెగడుచుండు

    మాయగప్పు, నిజము మఱుగున పడవలె

    చక్రనేమిబోలు జన్మకర్మ.

  40. ఫలరసమ్ములన్న చాల యిష్టమగును

    చుట్టు తిరుగు చుండు పట్టువరకు

    ఆలసించు కొలది ఆరాట పడుచుండు

    ముచ్చటెంతొ జూడ మురిపెమదియె.

  41. తిండి తినుట యన్న మొండి చేయుట లేదు

    వలసినంతె తినును వలదు ననదు

    అన్ని రుచులు తనకు ఆస్వాదనంబులె

    తీపి పులుపు మివుల తృప్తి నొసగు.

  42. పెరుగు బువ్వ తినుచు పరుగులెత్తుచునుండు

    ముద్దులొలుక చాల సద్దు చేయు

    మూతిచుట్టిపులుము ముద్ద మనకు కూడ

    వెన్న దొంగలించు కన్న వోలె.

  43. తనకు నచ్చినట్లె మనము చేయ వలయు

    మరలింతమన్న మరచి పోదు

    వస్తువైనగాని, వ్యక్తులేగాని ,చే

    రవలె నంతె, చేయ రాదు వేఱు.

  44. లక్ష్యసిద్ధి కొఱకు, లక్షచెప్పు వినదు

    ఎన్నియున్న మధ్య ఏమి ఫలము

    వేగగామి యగుచు వింతలు జూపుచు

    చేరు కొన్న గాని తేరు కొనదు.

  45. ఎత్తుకున్నవారు ఎవరైన తనకేమి

    ముక్కు మూతి చెవులు పీకు చుండు

    గోళ్ళ గిచ్చి నవ్వు కుయ్యిమంచునరవ

    జుట్టుపట్టి గుంజు చురుకు మనగ.

  46. ఆడవారి ముక్కుపుడకలు కమ్మలు

    బొట్టుబిళ్ళలన్ని బిట్టు లాగు

    నుదుట గుంకుమున్న నునుగోర గీకును

    ఎఱ్ఱరంగు జూడ నెంతొ వింత

  47. సెల్లుఫోనులోని చిత్రములన్నియు

    కళ్ళు విప్పి జూచు కౌతుకంబు

    నెసగ,కరము బట్టు,విసరికొట్టంగజూచు

    ఎర్ర బటను నొక్కు,కుర్రచేష్ట.

  48. చిన్నశబ్దమైన చెవులొగ్గి వినగోరు

    తలను దిప్పి జూచు,తన చుట్టు

    పక్కలెవ్వరంచు పరికించి గమనించి

    శబ్దమూలమేదొ సంగ్రహించు.

  49. నడక బండి నుండు,నలువైపుల దిరుగు

    అంది పుచ్చుకొనుట, అంతలోనె

    విసరి కొట్టుటగును,వివిధ మార్గంబుల

    వస్తుతతిని నెంతొ వాటముగను.

  50. లోన బుట్టి నట్టి లోతైన భావాలు

    వెలికి వచ్చు రీతి వింత గొలుపు

    సర్వజీవులకును సామాన్యధర్మంబు

    ధ్వనులరూపమూని ధరణి జెల్లు.

  51. అర్థమిచ్చునట్టి యక్షరమ్ములెకాదె

    భాషయనగ వేరు భావమేల

    పక్షిజంతుతతులు వ్యక్తంబు గావించు

    నరచి, కేక వెట్టి యంతరంబు.

  52. మానవుండె ఘనుడు మహిని మాటాడంగ

    శైశవంబునుండి చావు వరకు

    పాశవికము గనగ పలుకుల తొలిరాక

    శిశువు నేర్చు కొనను చిత్రగతుల.

  53. అక్షరంబు పదము యరయంగ వాక్యంబు

    వరుసనెసగు కాదె భాష మివుల

    రెండు మూడు నాల్గు రీతుల గూడుచు

    వర్ణ మాల యొప్పు భద్రముగను.

  54. తొక్కుపలుకులనగ తోచుచుండునుగాదె

    చెవినబడ్డవన్ని చెప్పబోవు

    శబ్దరూపమూని సైగలగూడుచు

    తన్ను జూచు వారు తనివి నొంద.

  55. ప్రణవమందునున్న వ్యక్తపరంబ్రహ్మ

    అఉమ లవియె కావె యాది శక్తి

    శబ్ద మగుచు నిండె సచ్చిత్తు లంతట

    అందువల్లనేమొ యత్త్వమొచ్చు.

  56. తత్తతతతతత్త తనకొత్త పరిభాష

    మొదలుపెట్టెనదిగొ ముచ్చటొదవ

    ఒకటి రెండు నాళ్ళ కూపందుకొని సాగె

    నదియె మారసాగె నత్త యగుచు.

  57. అత్త యక్క యనుచు నారంభమునుసేయు

    ‘నమ్మ’ రాదు తొలుత నదియె వింత

    గొంతు నందు నమఱు గూయుయంత్రము తోడ

    శిశువు నొందు నట్టి శిక్షణమన.

  58. రోజుకొక్కరీతి రూపంబులవిమాఱు

    నెట్లు సాధ్య మగునొ యెఱుగ లేము

    సృష్టికర్త జేయు చిత్రంబులవియెన్నొ

    భాషనేర్చు శిశువు వైనమొప్పు.

  59. చెవినిబడ్డ మాట సిద్ధమౌ మదియందు

    వెలికివచ్చువఱకు విడువబోదు

    కార్యసాధనమున కౌశికుండె యనగ

    పోరుసల్పుచుండు బొందువరకు.

  60. మొగమునుండునట్టి ముసలితనపుగుర్తు

    నెత్తుకున్నవారి దెవరి దైన

    కళ్ళజోడు చూసి కసిగ గుంజి విసరి

    కొట్టుటందు మివుల పెట్టుదిట్టు.

  61. కింద గూరుచున్న నందలంబనునట్లు

    పాకుచుండిబోవు పైకిపైకి

    భుజము పైనజేరి బోసినవ్వులజూచు

    పట్టువదలనట్టి దిట్టయనగ.

  62. నాన్న తాత లెంచ నరవాహనమ్ములె

    మోయుచుండవలయు మోదమంద

    కింద దించ బోవ కినుకజూపులగాల్చు

    పట్టు వడెను గాదె వరుస కళలు.

  63. అన్నపానములను అమ్మమ్మ శ్రద్ధగా

    వండిపెట్టుచుండ వగలబోయి

    తినును తినదు, తనదు తీరుదెలియలేము

    పూటకొక్కరీతి బుట్టబుద్ధి.

  64. మార్చి మార్చి మివుల మాధుర్య మెసగంగ

    కొత్త రంగు రుచియు కూడుకొనగ

    నెల్లపాట్లుపడుచు నెంతయొ శ్రమకోర్చి

    వండిపెట్టుచుండు వదలకుండ.

  65. పిల్లజిక్కెనంచు తల్లడిల్లుచునుండు

    తిండితినకయున్న తృప్తిగనదు

    మనసు నిలుప లేదు మాతామహి యదేమొ

    మనుమ రాలు గూర్చి మథన పడుచు.

  66. వంటమనిషి తులసి పంటపండినయట్లు

    ముఱిసి పోవుచుండు ముద్దులాడు

    తనను జూచి నంత తన్మయత్వమునొందు

    ప్రాక్తనంబునున్న బంధమేమొ.

  67. చిచ్చుబుడ్డి పైకి జిమ్మునట్టివెలుగు

    జూడనుత్సహించి జోద్యమొందు

    విప్పుకన్నులవియె విరిసినపద్మంబు

    లనుట తనకు దగినదనుట యొప్ప.

  68. లక్ష్మిబాంబు పేలి ఢామ్మంచు మోగగ

    నొక్కసెకనుబెదరి జక్కనవ్వు

    భయము లేదొ యుందొ వ్యక్తంబు గాదద్ది

    యంతు బట్టబోదు తంతుజూడ.

  69. కాకరొత్తులెంతొ కాంతులు వెదజల్ల

    కన్నులప్పళించి కాంచగోరు

    పాపకంటివెలుగె దీపావళియనంగ

    యింటియందుమసలె చంటిపిల్ల.

  70. రివ్వుమంచునెగురు రాకెట్టులనుజూచి

    చివ్వున దలదిప్పి నవ్వుచుండు

    పైకి జూడ వలయు, పడుచున్నరాకెట్టు

    యెట్టు లుండు ననగ నేమి జెప్ప.

  71. నాన్నవచ్చెనదిగొ యన్నమాటనువిన్న

    నెక్కడున్నసరియె తొక్కటపడు

    నిల్వబోదునెచట నిముసముసేపైన

    పడుతు లేస్తు వచ్చు పట్టనీదు.

  72. కారుహారనువిని కనిపెట్టు నాన్నను

    వచ్చెనంచుబోయి పల్కరించు

    నాన్నజూచినంత నవ్వులు నవ్వులే

    ఎత్తుకొనెడివఱకు నెంతతపనొ.

  73. నాన్నజేరినపుడు నచ్చదు మనలను

    తలను దిప్పుకొంచు దప్పుకొనును

    నాన్నె లోకమాయె నగవుల జిందుచు

    మనము పట్టబోము మర్మమేమొ.

  74. గణగణగణ మోగు కాలింగు బెల్లును

    నొక్కబోవు కాని నొక్కలేదు

    మనము నొక్కిజూప మందహాసముజేయు

    లోనమోగుగంట వినగబోయి.

  75. పరుపుపైననుండి పడకుండమెల్లగ

    వెనుకవైపుతిరిగి వీలుజూచి

    కాళ్ళు జాపుకొంచు కౌశలమొప్పగ

    గిందదిగుటనేర్చె నందమొప్ప.

  76. ఎంతతొందరున్ననేమఱకుండగ

    చాలయొడుపుతోడ సద్దులేక

    జాఱిపోవుచుండు మాఱిపోకనెపుడు

    తాతనేర్పినట్టిదౌనుగాదె.

  77. ఆంజనేయు దలచి యంచిత భక్తితో

    అమ్మ గొల్చుచుండు నమ్మకముగ

    పిల్లనేమరకనె చల్లగా గాచుట

    స్వామినందె నిల్పి తమిని బొందు.

  78. ఆంజనేయునెదుట హద్దులేని ముదము

    తెలియజాలనట్టి తీరుగాదె

    రక్తనిష్ఠగుణము రామభక్తు బూజింప

    నమ్మనుండెబొందె ననుట సబబు.

  79. స్వామి హనుమ గనుచు సామికన్నులతోడ

    భక్తిభావమొప్పు వైఖరద్ది

    ముఖము నందు దోప,మోడ్చుచు కరముల

    జోత వెట్టు తాను చోద్యమొదవ.

  80. అర్చకుండు తనకు నద్దంగ సింధూర

    తిలకమెంతొ మురియు ఫాలమందు

    దేవళంబునందు దిక్కులు జూడక

    మూర్తి వైపె చూచు ముగ్ధ యగుచు.

  81. నలువది శనివారములు సడలని దీక్ష

    దాల్చి తనను గూర్చి తల్లి చేయు

    సేవలంది తనిసి,పవమాన సుతుడిచ్చు

    గాక సకలశుభము లేకబిగిని.

  82. జోలపాట యనగ జోఅచ్యుతానంద

    తాత పాడ సాగె తాళమొప్ప

    ఆలకించుచుండి యాలాపనము సేయు

    నెంతదనుక సాగు నంతదనుక.

  83. తాతగొంతుపైన తారాడు చేతుల

    పులిపిరులను బట్టి నలిపి వేసి

    గిల్లు,కీచుమన్న కిలకిల నవ్వును

    తనకు యాట గాగ మనకు బాధ.
    
  84. అందరిండ్ల యందు నందమ్ము జిందెడి

    శిశువు చేష్టలేను చిత్రగతుల
    

    చెప్పినాడనంతె! యొప్పిదము గనుడు

    రసికులార! చిత్తమరసి జూచి.
    
  85. దేవి లలిత తనదు దివ్యమౌ భవ్యమౌ

    కరుణ, చూపు లందు కఱుగు చుండ,

    మాత జగతి నంత మహిమ బ్రోచెడిదేవి

    త్రిపుర కాచు గాక! ‘‘త్రిపుర’’ నెపుడు.

  86. మంగళమహాశ్రీ.

    మంగళము మంగళము మాత్రిపురపాపకని మైమరచి పాటలను బాడన్‌

    మంగళము మోహనము మంజులము మాన్యమును మండనము మాధవుని రూపం

బంగజుని తండ్రి నిను భధ్రముగ గాచునని భావమున మేమెపుడు నీ, తా

రంగమని చేతులను రమ్యమగు నాట్యమని రంజిలగ మంగళమహాశ్రీ.

సమాప్తం