మానవ జన్మ గమ్యమేమి? అని అనాదినుండి తత్త్వవేత్తలు, ఋషులు, జ్ఞానులు, యోగులు, ద్రష్టలు వంటి మహానుభావులు వారివారి సాధనలద్వారా చింతనలద్వారా దర్శనానుభవముల ద్వారా తపస్సులద్వారా నిగ్గుతేల్చినది ‘‘నిత్యానందమైన స్వయంప్రకాశమైన పరిపూర్ణమైన స్థితిని పొందడమే!’’ కానీ మన పరిస్థితి సుఖమనే భ్రాంతిలో (అదికూడా అన్యమైన, అశాశ్వితమైన భౌతిక వస్తువులపై ఆధారపడి) పడి దుఃఖాన్నే ఎప్పుడూ అనుభవిస్తూ ఉండడమే కదా? పైన పేర్కొన్న గమ్యాన్ని చేరడానికి ఎందరో ఎన్నో విధానాలను సిద్ధాంతాలను బోధించినప్పటికీ నేరుగా సాధనచేయవలసిన విధానము ఏకాగ్రతా రూప అభ్యాసయోగమే. ‘‘అభ్యాస వైరాగ్యాభ్యామ్ తన్నిరోధః’’ అనే పతంజలి యోగ సూత్రము ప్రాథమికంగా బోధిస్తుంది దీన్నే.
అభ్యుదయ పూర్వక నిశ్శ్రేయస్సును పొందే ఏకైకమార్గం ఇదే. కారణం నేరుగా ఇంద్రియములకు రాజైన మనస్సుద్వారా చేసే సాధన ఇది. అందుకే ఇది రాజయోగంగా పేర్కొనబడిరది. రాజ శబ్దం ప్రకాశం, వెలుగు అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. ఏ సాధనలో ప్రకాశవంతమైన దివ్య జ్యోతిస్సు మనకు ప్రారంభదశ నుండే (కన్నులు తెరచి చూస్తూ) అనుభవానికి వస్తుందో అదే రాజయోగము. నీ ప్రస్తుత స్థితి ఏమి? నీవు పొందవలసి స్థితి ఏమి? దానికై చేయవలసిన సాధన ఏమి? చేసే విధానమేమి? వంటివన్నీ తెలిసేది గురువుల కరుణతోనే. మనకర్మ పరిపాకమైనప్పుడే సద్గురువు లభిస్తాడు. ‘‘ఆచార్యవాన్ పురుషో వేద’’ అతనికొరకు తపించి వెతికి కనుగొనుట మొదటి మెట్టు. ‘‘తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్ఛేత్, ప్రయత పాణిః, శ్రోత్రియం బ్రహ్మ నిష్టం’’ అనెడి శ్రుతివాక్యాన్ని అనుసరించి సమిత్కుశ ఫల పుష్పాంజలితో గురుచరణములను ఆశ్రయిస్తాడు.
‘‘తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా’’ (గీత 4-34) అనే శ్లోకంలో శిష్యుడు గురువు వద్ద ప్రవర్తించాల్సిన విధానం వివరించారు. ప్రణతి, ప్రశ్న, ఆప్త, అంగ, స్థాన, సద్భావ, సేవ-అనే ఏడు విధాలుగా గురువును సేవించినప్పుడే గురువు సంపూర్ణ కృపకు పాత్రుడై జ్ఞానాన్ని పొందగలడు. విధేయత, విశ్వాసం, వినయం, కల్గి ఉన్నప్పుడే గురువు సంప్రీతుడై అనుగ్రహిస్తాడు. నిజమైన ఆర్తితో శరణుజొచ్చిన వానిని సద్గురువు ఈవిధంగా ప్రశ్నిస్తున్నాడు. ‘‘నాయనా! నీవెవరివి? ఏమి కోరి ఇక్కడకు వచ్చినావు?’’
శిష్యుడు : ‘‘స్వామీ! నేను సంసార దావాగ్ని తప్తుడను. దుఃఖాబ్ధి మగ్నుణ్ణి. నన్నుద్ధరించండి.’’
గురువు : వత్సా! భయపడకు. నీవు నిత్యానంద స్వప్రకాశ పరిపూర్ణుడవు. అజ్ఞానం కారణంగా దుఃఖిస్తున్నావు. తాడును చూచి పామని భ్రమిస్తున్నావు.
శిష్యుడు : స్వామీ! అజ్ఞానం అంటే ఏమి? అది ఎట్లుంటుంది? ఎక్కడ ఉంటుంది? అది ఎలా నశిస్తుంది?
గురువు : ‘‘అతస్మిన్ తద్బుద్ధి రవిద్యా’’ లేనిదాన్ని ఉన్నట్లుగా నిశ్చయించుకోవడమే అజ్ఞానము. నీవు నిత్యునివి. ఆనంద స్వరూపివి. కానీ నిన్ను నీవు అశాశ్వితుడవని దుఃఖములలోనే ఉన్నట్లు నిశ్చయించుకున్నావు. అదే అజ్ఞానం. దీన్నే శ్రుతి ఈ విధంగా వివరిస్తుంది. ‘‘సంసారో పరమార్థోయం సంలగ్నశ్చ ఆత్మ వస్తుని ఇతి భ్రాంతి రవిద్యా స్యాత్’’ ఈ సంసారమే నిజమని ఇదే నిత్యమని నీకు నిత్యం అనుభవంలో ఉండడంవల్ల దాన్ని బుద్ధిలో స్థిర పరుచుకొని దుఃఖిస్తున్నావు. అదే అజ్ఞానం. అది నీయందే ఉన్నది. ఇది అనాదినుండి జీవుణ్ణి భ్రాంతి పరుస్తూ ఉంది. ఇది మహాప్రభావవంతమైనది. మరి దీన్ని తొలగించే మార్గమేమి? దీనికి సమాధానం ‘‘విద్యయైషా నివర్తతే’’ నీ నిజ స్వరూపాన్ని నీవు తెలుసుకోవడమే! ‘‘భ్రాంతి వదలిన బ్రహ్మంబు బట్టబయలు’’ అన్నది అందులకే!
శిష్యుడు : గురుదేవా! మనం నిత్యం అనుభవించేదానిని అబద్ధం అని ఎలా నమ్మగలం? శ్రుతిని ప్రమాణంగా ఎలా గ్రహిస్తాం?
గురువు: శిష్యా! నీకు నిత్యం అనుభవాన్ని కల్గిస్తున్నవి ఇంద్రియాలు. ఇవే నీకు ప్రమాణమని అనుకుంటున్నావు. ఇవి నీకు సాధనాలుగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ రూపాలలో ప్రాపంచిక విషయజ్ఞానాన్ని కల్గిస్తాయి. ఇవి నీ నిజస్థితిని తెలియజేయలేవు.
శిష్యుడు : ఇంద్రియాలు ప్రమాణం కానప్పుడు మనస్సు ప్రమాణం అవుతున్నది కదా!
గురువు : కాలేదు. ఇంద్రియాలు మాత్రమే ప్రమాణము. అది ఇంద్రియము కాదు.
‘‘ఇంద్రియాణి పరాన్యాహుః ఇన్ద్రియేభ్యః పరమ్ మనః’’ (గీత 3-42). ఇంద్రియములకన్నా శక్తివంతమైనది మనస్సు. కానీ అది కూడా నీకు ఇతర ప్రమేయములను (నీకన్నా వేరైన విషయాలను) తెలుపుతుంది. అంతే కానీ నిన్ను గురించి తెలపలేదు. దానికి అంత సమర్థత లేదు.
శిష్యుడు : స్వామీ! ‘‘మనషష్టానిన్ద్రియాణి’’ అని శాస్త్ర వచనం కదా! అంటే మనస్సుతో కలిసి ఇంద్రియాలు ఆరు. అంతే కాకుండా నా చేతనే నా నిజ స్వరూపాన్ని తెలుసుకోగలను కదా!
గురువు : ఇదిచాలా తప్పు. కర్త అంటే చేసేవాడు. క్రియ అంటే చేసేపని. వేరువేరుగ ఉంటాయి. నన్ను నేనే తెలుసుకోవడం అనడం అజ్ఞానమే. దీన్ని వివరిస్తూ సురేశ్వరాచార్యులు ఈ విధంగా చెప్పినారు....
‘‘స్వవర్ణాశ్రమ ధర్మేన తపసా హరి తోషణాత్
సాధనం ప్రభవేత్ పుంసాం వైరాగ్యాది చతుష్టయమ్’’
వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా పాటిస్తూ భగవంతునికి ప్రీతిగా తపోదానాది కర్మాచరణాలవల్ల శుద్ధచిత్తుడై ప్రస్థానత్రయాన్ని (బ్రహ్మసూత్రములు, భగవద్గీత, ఉపనిషత్తులు) గురుముఖంగా అధ్యయనంచేసి వాటి సారాన్ని మననం చేస్తూ నిర్గుణసాధన చేసేవాడు ఆననందమయ కోశాన్ని దాటి ‘‘బ్రహ్మపుచ్ఛం ప్రతిష్టా’’ అనే నిత్యానంద స్వప్రాకాశ పూర్ణస్థితిని పొందగలడు. ఈ ఆనంద శబ్దమే ఎంతో విశేషమైనది. సామాన్యార్థములో వాడే సుఖం, హాయి, సంతోషమువంటిది కాదు. ఆనంద చర్చను తైత్తరీయోపనిషత్తు వివరించింది. అందులో మానుషానందమును గురించి చెప్పినదాన్ని గురించి వింటేనే అది అసాధ్యమని తెలుస్తుంది. యువకుడు, బలిష్ఠుడు, ధ్రఢష్టుిడు, మహాసామ్రాజ్యాధినేత, సర్వతంత్ర స్వతంత్రుడు, నిరంకుశాధికారము కల్గినవాడు. ఇన్ని లక్షణములు గల్గినవాడు పొందు పరమసుఖము ‘‘మానుషానందము’’. ఇట్టివి వందరెట్లు కలిసి మనుష్య గన్ధర్వానందము. దీనికి వందరెట్లు దేవగంధర్వానందము. దీనికి వందరెట్లు పితృదేవానందము. దీనికి వందరెట్లు దేవానందము. దీనికి వందరెట్లు ఇంద్రానందము. దీనికి వందరెట్లు బృహస్పతి ఆనందము.దీనికి వందరెట్లు ప్రజాపతి ఆనందము. దీనికి వందరెట్లు బ్రహ్మానందము. అబ్బ! ఊహించడానికే భయమైతున్నదే! ఇట్టిస్థితి నీది అని శృతి మాత ఎంతగా ఘోషిస్తున్నా మన చెవికెక్కదు కదా! అదే మాయాప్రభావము. దీన్ని దాటడం మహామహులకే సాధ్యంకాలేదు. కనీసం ఇంత విషయం ఉంది అని తెలుసుకుంటే కొంత వరకు మన భావాలలో మార్పు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇదంతా సాధనావిధానాలలో శ్రవణంగ భావించవచ్చు. ‘‘తత్కారణం సాంఖ్య యోగాభిపన్నం’’ అన్నట్లు పైనపేర్కొన్న స్థితిని సాంఖ్యము, యోగములద్వారా పొందవచ్చు. దీన్ని బోధిస్తూ శ్రీహరి వ్యాసుఁడై బ్రహ్మసూత్రాలను, శ్రీకృష్ణుడై యోగశాస్త్రముగా భగవద్గీతను లోకానికి ప్రసాదించాడు. అందులో విచారమార్గాన్ని ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు బోధిస్తాయి. యోగమార్గాన్ని గీత బోధిస్తుంది. ఇది స్థూలవిభజన మాత్రమే. అన్నిటిలో రెండుమార్గాలు ఉంటాయి. కానీ ప్రధానంగా ఆయా మార్గాలు.
‘‘అవిచారకృతో బంధః విచారేణ నివర్తతే’’ (ముక్తికోపనిషత్) నేనెవడను? ఈశ్వరుడు ఎవరు? ఈజగత్తుకు ఆధారమేది? ఈజగత్తు ఏవిధంగా ఎవరిచేత ఉత్పత్తి చేయబడిరది? అనే అంశాలు గురించి చర్చ, విచారం చేయకపోవడం వల్లనే జీవుడు సంసార బద్ధుడై, విషయ మోహమునకు వశుడై, అహంకార మమకారములకు వశుడై, జననమరణ చక్రములో చిక్కుకున్నాడు. బైట పడలేకున్నాడు. కావున జీవజగదీశ్వరుల విచారచర్చతోకాని ఆత్మసాక్షాత్కారం పొందలేము.అందుకే శ్రీబాదరాయణులవారు (వ్యాసమహర్షి) బ్రహ్మ సూత్రములను ‘‘అథాతో బ్రహ్మ జిజ్ఞాసా’’ అనే సూత్రముతో ప్రారంభించినారు. దీన్ని వ్యాఖ్యానిస్తూ భాష్యకారులు ‘‘అథ’’ శబ్దాన్ని చాలా లోతుగా వివరిస్తూ అధికారి అయినవాడు మాత్రమే విచార చర్చకు పూనుకొనాలని చెప్పారు. అట్టివాడు ఎవరు? సాధన చతుష్టయమ్ (4 విధాలైన సాధనలను) పొందినవాడు. అవి 1) ఆత్మానాత్మవివేకము, 2) ఇహాముత్ర ఫల భోగ విరక్తి, 3) శమాది షట్కమ్ (శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానము), 4) ముముక్షత్వము. ఈ గుణాలను కల్గినవాడే విచారచర్చకు అర్హుడు. అందుకే అందరికి జ్ఞానమార్గాన్ని బోధించరాదు అని శాస్త్రవచనం. కానీ నేటికాలంలో అది చాలా ప్రచారానికి వచ్చి సామాన్యులను తప్పుదోవ పట్టిస్తుంది. పైనపేర్కొన్న గుణాలులేని వారందరు యోగప్రస్థానానికే అర్హులు. అందుకే విద్యారణ్యులవారు వేదాంత పంచదశిలో -
‘‘బహు వ్యాకుల చిత్తానాం విచారాతత్వధీ ర్నహి
యోగో ముఖ్యః తతః తేషాం ధీ దర్పస్తేన నశ్యతి’’- అని హెచ్చరించినారు.
పై శ్లోకములో ‘‘ఎన్నోవిధాలుగా లంపటలతో బాధపడేవానికి విచార మార్గముతో తత్త్వజ్ఞానము సిద్ధించదు. అటువంటివారికి యోగప్రస్థానము మార్గమే శరణ్యము. దీనివలన కర్తృత్వ, భోక్తృత్వ రూపాత్మకమైన బుద్ధి అనే ప్రమాదం నుండి తప్పిచుకుంటాడు’’ అని చెప్పబడిరది. దీన్ని ఇంకొంచం వివరించు కుంటే ప్రతిక్షణం మనం నేనే చేస్తున్నాను. నేనే అనుభవిస్తున్నాను. అనుకుంటూ ప్రతి పనిలో మనలను చూసుకుంటున్నాము. ఇదంతా అజ్ఞానలక్షణం. దీన్ని అర్థం చేసుకోవడానికి తాను ఈ శరీరము కాదు అనే నిశ్చయ జ్ఞానం కల్గవలెను. దానికి ఆధ్యాత్మదర్శనము ఒక్కటే మార్గం. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను తనుకాదని తెలుసుకోవడం వల్లనే కర్తృత్వ, భోక్తృత్వ భ్రాంతి వదుల్తుంది.
‘‘అకర్తృత్వానుభవ పూర్వకసాంఖ్యః’’ నేను దేనికీ కర్తను కాను. అనే తెలివిడి అనుభవ పూర్వకంగా నిశ్చయించుకోవడమే జ్ఞానము. ఇది విచారమార్గముతో లభించదు. యోగవిధానములో దేహభ్రాంతి వదిలేవరకు దీన్ని స్వీకరించలేము. కర్తృత్వం ఉండేవరకు మనశ్చాంచల్యం పోదు. దీనిని ఇంకా లోతుగా పరిశీలిస్తే దేహాదులందు అభిమానము ఎలా అజ్ఞానమో అట్లే వాటియందు అనాత్మ బుద్ధి (దేహాదులు నేను కాదు అనుకోవడం) కూడా అజ్ఞానమే. ‘‘ఆత్మత్వమివ అనాత్మ త్వమపి సా అవిద్యస్యైవ’’ అనే వాక్యం దీన్నే వివరించింది. అందుకే గీతలో
(4-41) ‘‘యోగాసన్న్యస్త కర్మణామ్ జ్ఞాన సంచిన్న సంశయం, ఆత్మవంతం న కర్మాణి నిబద్నన్తి ధనంజయ’’ అన్నాడు. యోగపద్ధతిలో అహం పదార్థ విజ్ఞానాన్ని పొంది విచారపద్ధతిలో స్వపరా భేదరహితుడుగా అనుభవాన్ని పొంది బ్రహ్మజ్ఞానిగా మారుతున్నాడు.
‘‘నావిరతో దుశ్చరితాత్ నాశాంతో న సమాహితః
నాశాంత మానసోవాపీ ప్రజ్ఞానేనైన మాప్నుయాత్’’ అశాస్త్రీయ పనులను చేసేవాడు, ఇంద్రియనిగ్రహం లేనివాడు, ఏకాగ్రత లేనివాడు, నిశ్చలమైన, ప్రశాంతమైన మనస్సు లేనివాడు ఆత్మజ్ఞానాన్ని పొందలేదు. అట్టివానికి యోగ ప్రస్థానమే తగినది. అంటే ఆధ్యాత్మదర్శన అభ్యాసయోగమే శరణ్యము. అందుకే ‘‘సన్యస్య శ్రవణం కుర్యాత్’’ అన్నారు.
‘‘న కర్మాణమనా రంభా నానైష్కర్మ్యము పురుషో-ష్ణు తే
నచ సన్యసనాదేవ సిద్ధిమ్ సమాధిగచ్ఛతి’’ (గీత 3-4)
పాప క్షయమునకు కారణమైన కర్మయోగాన్ని అనుసరించకుండా కేవలం సన్యసించి నంతమాత్రాన నిష్కర్మభావాన్ని పొందడం అసాధ్యం. కర్మయోగం అంత ప్రభావం కల్గినట్టిది. ఏదో విన్న మాటలను వల్లెవేస్తూ ఉపన్యాస కేసరిగ పేరుపొంది మఠాలు, ఆశ్రమాలు నిర్మించి మహాభోగమయ జీవితాన్ని అనుభవిస్తూ సన్యాసిని అంటూ లోకాన్ని తనను మోసగిస్తూ ఉండేవారు ‘‘కర్మబ్రహ్మాముభయ భ్రష్టమ్’’ అన్నట్లు కర్మకు, జ్ఞానానికి రెంటికి చెడినవారైతారు. నేడు ఎటుచూసినా కనిపిస్తున్నది అదే. ‘‘కలౌ వేదాంతినస్సర్వే’’ కలియుగంలో అందరూ వేదాంతం చెప్పేవారే. మనం దేనికి అర్హులము కాదని శాస్త్రం విధిస్తుందో దాన్నే చేస్తాం. అదే కలియుగ ధర్మం. దానికే ప్రచారం, అన్నిరకాల వత్తాసు లభిస్తాయి. ఇట్టివారిని గూర్చి వేదాంతపంచదశిలో ‘‘ఆసుప్తే రామృతేః కాలం నాయెద్వేదాంతచిన్తయ, సుప్తేరుథాయ సుప్య్నతం’’ ఒకసారి వేదాంతం, ఒకసారి రాజకీయాలు, ఒకసారి దేవతారాధన, ఒకసారి శాస్త్రచర్చ, ఒకసారి కావ్యసంగీత చర్చ వంటి కార్యక్రమాలతో ధ్యేయమంతా లోకోద్ధరణమే అన్నట్లుగా కాలంగడిపే సన్న్యాసి ఎప్పటికీ జ్ఞానాన్ని పొందజాలడు.
సామాన్యుడునుండి సన్న్యాసి వరకు ప్రతివాడు తన ఇప్పటి స్థాయినిబట్టి తాను అనుసరించి పాటించాల్సిన విధానమేదో సరైనా అవగాహనతో, మార్గ దర్శకత్వంలో నిశ్చయించుకుని తదనుగుణంగా సాధనచేస్తూ క్రమంగా
ఉన్నత స్థాయిని అందుకోవాల్సిందే. వేరు మార్గంలేదు.