భగవద్గీతలో పరమాత్మ ప్రభోధం వింటున్న అర్జునునికి కొన్ని సందేహాలు కల్గినాయి. గురువు చేసే జ్ఞానబోధను శ్రద్దగా భక్తి యుక్తుడై వినే శిష్యునికి తన బుద్ధిశక్తికి తగినట్లు సందేహాలు రావడం సహజమే. అనుమానాలు తొలిగి పోయినప్పుడే జ్ఞానం స్థిరపడుతోంది. ‘‘సంశయాత్మా వినశ్యతి, శ్రద్దావన్ లభతే జ్ఞానం’’ వంటి వాక్యాలు దీన్నే తెలుపుతాయి. కర్మను గురించి, జ్ఞానాన్ని గురించి, యోగాన్ని గురించి ఎంతో విపులంగా, లోతుగా వివరిస్తున్నప్పుడు వింటున్న అర్జునునికి కల్గిన సందేహాలు ఏవి? ఎందుకు కల్గినాయి? వాటిని భగవానుడు ఎలా నివృత్తి చేశాడో తెలుసుకుందాం.
1) స్థిత ప్రజ్ఞస్య కా భాషా? సమాధిస్తస్య కేశవ?
స్థితధీః కిమ్ ప్రభా పీత? కిమసేత? వ్రజేత కిమ్?
2) జ్యాయసేయచేత కర్మణాస్తే మతాబుద్ధిః జనార్దనా
తత్కిమ్ కర్మణి ఘోరే మాం నియోజసి కేశవ?
3) వ్యామిస్రేణ వాక్యేన బుద్ధిమ్ మోహయసీవ మే
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయో -హమాప్నుయాన్.
4) అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః
కథమేతత్ విజానీయం త్వమాదౌ ప్రోక్తవానితి
5) అథ కేన ప్రయుక్తో-యం పాపం చరతి పురుషః
అవిచ్చిన్నపి నాదే య బలాత్ నియోజిత
6) సన్న్యాసం కర్మణామ్ కృష్ణ !పునర్యోగంచ శంసని
యచేయ ఏతయోరేకం మీ బ్రుహి సునిశ్చితం
7) యో-యం యోగః త్వయా ప్రోక్తా సామ్యేన మధుసూదనా!
ఏతస్య-హం న పశ్యామి చంచలత్వాత్ స్థితిమ్ స్థిరాత్
8) చంచలం హి మనః కృష్ణ! ప్రమాథి బలవత్ దృఢం
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం
ముందుగా పై శ్లోకముల అర్థం తెలుసుకొని ఆపై వివరించుకుందాం. స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏవి? అతని మాటలు చేష్టలు ఎట్లుంటాయి?
కర్మ కంటే జ్ఞానమే మేలని నీ తాత్పర్యమా? మఱి ఘోరమైన కర్మకు నన్నెందుకు నియోగిస్తున్నావు?
ఒకసారి కర్మ సన్న్యాసం చేయమని మరొకసారి కర్మ యోగాన్ని అనుసరించమని ఉపదేశిస్తున్నావు. ఈ రెండిటిలో ఏది మంచిదో నాకు తేల్చి చెప్పు.
సూర్యుని జన్మ ఏనాటిదో? నీవు ఇప్పటివానివి. అటువంటప్పుడు నీవు సూర్యునికి ఎలా ఉపదేశించావో ఊహించ లేకున్నను.
తనకిష్టం లేకున్నా మానవుడు దేని బలవంతం చేత పాపాలు చేస్తున్నాడు.
ఏ సమత్వ స్థితినే నీవు యోగంగా వివరించినావో ఆ యోగంలో నేను స్థిరంగా ఉండలేకున్నాను.
మనస్సు చాల చంచలమైనది. సంక్షోభాన్ని కల్గిస్తుంది. దీన్ని నిగ్రహించడం గాలిని బంధించడం వంటిదే.
గమనిక: 2,3 శ్లోకాలకు కలిపి ఒకే అర్థం చెప్పబడిరది. స్థితప్రజ్ఞ కలిగిన వాని లక్షణాలను ఎలా ఉంటాయో వివరించామన్నాడు అర్జునుడు. అతడెట్లు మాట్లాడును? ఎట్లు కూర్చొనును? ఎట్లు నడుచును? అని ప్రశ్నిస్తున్నాడు. ఇవేమి ప్రశ్నలు? మనం ఎప్పుడూ చేసేవే. వీటిని బట్టే ఎదుటి మనిషి లక్షణాలను అంచనా వేయడం లోకధర్మం. ఇతరులకు యోగికి మధ్యగల తేడా వీటివల్ల తెలుస్తుందా? కానీ వీటిలో గల విశేషార్థాన్ని తెలుసుకోవడం ముఖ్యం. మాట్లాడడం అంటే అతని మనసులోని భావాలను తెలుసుకోవడం. ఇతరులు లౌకిక విషయాలను గురించి ఆలోచిస్తే యోగి నిరంతరం పరమాత్మస్మరణలో ఉండి అవే భావాలను తనమాటలద్వారా వెలిబుచ్చుతాడు. అట్లే కూర్చొనుట. దీన్ని వ్యవహారరహిత కాలంలో అతని స్థితిగా అర్థం చేసుకోవడం అవసరం. మూడవది నడచుట. అంటే ప్రవర్తనగా తెలుసుకోవచ్చు. యోగి కొన్ని సందర్భాలలో మనవలెనే ప్రవర్తిస్తాడు. దాన్ని చూసి పొరపడి అతడు మనలాంటి వాడే అనుకుంటాం. చులకనగా చూస్తాం. అది మనకే నష్టాన్ని కలిగిస్తుంది. దీని వెనుక శ్లోకంలో పరమాత్మ నానావిధ వచనములను విని బుద్ధి విచలితంగా మారిపోతుంది. యోగాన్ని పొందడానికి నీవు పరమాత్మయందు స్థిరంగా నిశ్చలంగా ఉండాలన్నారు. దానికి వివరణగా పార్థుడు ఈ ప్రశ్న వేశాడు. దీనికి అభ్యాసయోగం కన్నా మరో మార్గం లేదు. దీనిలో ఉత్తమస్థాయి పొందినవాడే స్థితప్రజ్ఞుడు.
__రెండవ శ్లోకం: __సాంఖ్యయోగంలోని వివరణలను విన్న అర్జునుడు కర్మ కన్నా జ్ఞానమే గొప్ప అని భ్రమకు లోనైనాడు. అందుకే కర్మకన్నా జ్ఞానమే గొప్పదైతే నన్ను యుద్ధకర్మను ఎందుకు చేయమన్నావు అన్నాడు. మూడవ శ్లోకంలో నీ మాటలు కలగాపులగంగా ఉన్నవి. వాటివల్ల నా బుద్ధి భ్రమకు వశమైపోయింది. నాకు శ్రేయస్కరమైన ఒకే మార్గాన్ని నిశ్చయంగా తెల్పు అన్నాడు అర్జునుడు. ఈ రెండు శ్లోకాలలో మనవిచలిత బుద్ధి, అయోమయం, గురుబోధను వక్రీకరించు కోవడం, మనహేతువాదాన్ని వినిపించడం వంటి లక్షణాలన్నిటికి అర్జునుడు ప్రతినిధిగా నిలుస్తున్నాడు. కర్మలను వదిలివేయమన్నట్లు అర్జునునకు తోచింది. మళ్ళీ యుద్ధం ఎందుకు చేయమన్నాడు? దిక్కుతోచక తనకు శ్రేయస్కరమేదో చెప్పమన్నాడు. ఇక్కడ ‘‘శ్రేయస్సు’’ అనే పదం చాల గంభీరార్థంలో వాడినారు. రాజ్యభోగాలు అని కాదు. అట్లే స్వర్గసుఖాలు కాదు. ఇవి తన శోకాన్ని తొలగించలేవు అని ముందే చెప్పాడు అర్జునుడు. మరి ఇక్కడ మనం శోక మోహాలను నశింపచేసే శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించే నిత్య వస్తు ప్రాప్తినే శ్రేయస్సుగా పేర్కొన్నాడు. ప్రతి మానవుడు కొరవలసినదిదే. పొందవలసినదిదే. దీని ప్రారంభ సాధన అభ్యాసయోగమే.
నాల్గవ శ్లోకం: దీనిలో అర్జునుడు శ్రీకృష్ణుని తన బావగా, సఖునిగా, బంధువుగా మాత్రమే తలుస్తున్నాడు. అందుకే ‘‘నీ జన్మ ఇప్పటిది’’ అంటున్నాడు. శిశుపాలవధ వంటి సందర్భాలలో శ్రీకృష్ణుని అతి మానుషలీలలు ప్రత్యక్షంగా చూసినప్పటికీ అర్జునుడు మోహంతో కప్పబడిన బుద్ధి కలవాడై భగవానుని శాశ్వతత్వాన్ని తెలుసుకోలేక నీవు సూర్యునికి యోగాన్ని ఎలా ఉపదేశించావు? అనిప్రశ్నిస్తున్నాడు. దానికి జవాబుగా కృష్ణుడు ‘‘నీకు, నాకు ఎన్నో జన్మలు జరిగాయి. ఆ విషయం నీకు, నాకు తెలుసు. నాకు ప్రియుడవు కావున యోగాన్ని బోధిస్తాను’’ అన్నాడు. ఇక్కడ ఒక విషయం తెలుస్తుంది. పరమాత్మ ప్రతియుగంలో ధర్మగ్లాని కలిగినపుడు దుష్టశిక్షణకు, శిష్ట రక్షణకు తనను తానే సృజించుకుంటాడు. మనందరికోసం అర్జునుడు ఈ విధంగా ప్రశ్నించాడు.
ఐదవ శ్లోకం: మానవుని పాపాచరణకు కారణమేది? తనకు ఇష్టం లేకున్నా దేని ప్రభావంతో పాపములు చేస్తున్నాడు? దీనికి ప్రేరేపించేది ఎవరు? భగవంతుడే దీనికి కారణమా? లేక ప్రారబ్ధవశుడై ఇంద్రియముల చేత బలంగా ఆకర్షించబడి పాపకర్మలను చేస్తున్నాడా? వివేకి కూడా వీటికి వశుడు కాక తప్పదు. దీనికి భగవానుడు రజోగుణము నుండి పుట్టిన కామమే (కోరిక) క్రోదంగా మారుతుందని, ఇది నిరంతరం మండే అగ్ని జ్వాల వంటిది అని కోరికలు తీరేకొద్దీ విజృంభిస్తుందే కానీ చల్లారదు. అన్ని పాపాలకు ఇదే కారణమని ఈ కామమే జ్ఞానాన్ని కప్పివేస్తుందని వివరించాడు. ఇది జ్ఞానికి నిత్యశత్రువు. ప్రాపంచిక విషయ భోగములపట్లగల కామమే పాపాలకు పురికొల్పుతుంది. దీని నివాస స్థానములు ఇంద్రియాలు. బుద్ధి, మనస్సు. కాబట్టి మొదట ఇంద్రియాలను వశం చేసుకొని మనోబుద్ధులను నియమించి కామాన్ని రూపుమాపమని స్వామి బోధిస్తున్నాడు. దీనికి తరుణోపాయం అభ్యాసయోగమే. సూక్ష్మశరీరదర్శనంద్వారా కొంత ఇంద్రియ ఉబలాటం తగ్గుతుంది. క్రమ సాధనతో వైరాగ్యం సిద్ధిస్తుంది.
ఆరవ శ్లోకం: ఈ శ్లోకంలో కర్మసన్న్యాసం, కర్మయోగంల మధ్యగల భేదాన్ని అర్థం చేసుకోలేని అర్జునుడు మనకు కనిపిస్తాడు. కర్మసన్న్యాసం అంటే కర్మలను భౌతికంగా త్యజించడం అని అర్జునుడు తప్పుగా అర్థము చేసుకున్నాడు. మరి కర్మసన్న్యాసమంటే ఏమి? నిష్కామకర్మాచరణమే కర్మసన్న్యాసం. కర్మలను ప్రతిఫలాపేక్ష లేకుండా, కర్త్తృత్వ, భోక్తృత్వములు విడిచి, నిరంతరమూ పరమాత్మ యందే ఏకీభావంతో సర్వకర్మలు వసుదేవార్పణంగా ఆచరించడమే! జ్ఞాన యోగం లేక సాంఖ్య యోగం కర్మసన్న్యాసమే! అందుకే జ్ఞాని కూడా కర్మలను త్యజించరాదని భగవానుని నిర్దేశం. దీనికి మనకు ప్రత్యక్ష నిదర్శనం కంచి పరమాచార్యులు చంద్రశేఖర సరస్వతీ స్వాములు. బ్రహ్మీభూతులు ఐనప్పటికిని వారు కర్మాచరణను విడువలేదు. లోకసంగ్రహణార్థమే జ్ఞానులు కర్మలను ఆచరిస్తారు. శ్రీకృష్ణపరమాత్మ నాల్గవ అధ్యాయంలో కర్మ, జ్ఞానయోగములను రెంటిని రెండు నిష్టలుగా యజ్ఞములనే పేరుతో వివరించాడు. ద్రవ్యములతో జరిపే యజ్ఞములకన్నా జ్ఞానయజ్ఞము శ్రేష్టమన్నాడు. అట్లే కర్మయోగముద్వారా సంపూర్ణసిద్ధి పొందినవానికి తత్త్వజ్ఞానము తనకు తానే లభిస్తుందన్నారు. ఇక్కడే అర్జునునికి సందేహం ఏర్పడిరది. దానికి పరమాత్మ కర్మయోగసాధన సులభమని అదే కర్మసన్న్యాసము కంటే శ్రేష్టమైనదని తెల్పినాడు.
ఏడవశ్లోకం: దీనిలో అర్జునుడు ‘‘సమత్వం యోగ ఉచ్యతే’’అని సుఖదుఃఖాలను, మానావమానాలను, శీతోష్ణములను సమానంగా చూడగలిగే స్థిరమైన స్థితిని పొందలేకున్నానని, దానిలోకి కారణము తన మనశ్చాంచల్యమని పేర్కొన్నాడు. రాగ ద్వేషములే చంచలత్వానికి కారణం. ఇవి సమత్వానికి ప్రతిబంధకాలు.
ఎనిమిదవ శ్లోకం: దీనిలో మనస్సు లక్షణాలను తెల్పుతున్నాడు. 1) మిక్కిలి చంచలమైనది. 2) తీవ్రంగా మధించే స్వభావం కలది. 3) ధృడమైనది. 4)చాల బలీయమైనది. కావున దీన్ని నిగ్రహించడం అసాధ్యం అని అర్జునుని తీర్మానం. దానికి సమాధానంగా ప్రభువు - అభ్యాసము, వైరాగ్యము ఈ రెండిరటివల్ల మనస్సును నిగ్రహించగలవు అన్నాడు.
__ముగింపు: __కేవలం నేరుగా మనస్సుపై చేసే అభ్యాసయోగమే దీనికి ఉపయోగిస్తుంది. సూక్ష్మ శరీర దర్శనంవల్ల దేహభ్రాంతి వదిలి వైరాగ్యం ఉదయిస్తుంది. మస్సును నిగ్రహించడం ఇతర మార్గాలతో శక్యం కాదు. ఆధ్యాత్మ దర్శన అభ్యాస యోగమే దీనికి ఉపకరించే ఏకైక మార్గం. తరుణోపాయం.