నేటికాలంలో యోగా, ధ్యానం వంటి పదాలు చాలా ప్రాచుర్యం చెందినాయి. శాస్త్రీయంగా వాటికి ఉన్న అర్థం వేరు. నేడు వాడుకలో నున్న అర్థం వేరుగా ఉంది. పతంజలి మహర్షి యోగసూత్రాలలో చెప్పన దానికి ఇప్పుడు చేస్తున్న దానికి చాలా తేడా ఉంది. ‘‘యోగః చిత్తవృత్తి నిరోధః’’ మనస్సులో కలిగే రకరకాల ఆలోచనలను అరికట్టేది యోగము అని అర్థం. కాని కేవలం స్థూలశరీరానికి సంబంధించిన విన్యాసాలైన ఆసనాలు యోగ అయ్యింది. ఇవి కొంతవరకు శారీరక ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. సందేహం లేదు. కొన్ని సంస్థలు నిర్వహించే యోగా శిబిరాలు 15, 30 రోజుల శిక్షణ కాలంలో అక్కడ పాటించే నియమాలు, ఆహారం వంటి వాటివల్ల సత్ఫలితాలిస్తాయి. కాని తిరిగి ఇంటికివచ్చిన తర్వాత మామూలే. మన నిత్యజీవితంలోని వత్తిడి, ఉరుకులు పరుగులు, వెనుకటి పరిస్థితికే తీసుకపోతాయి. చాలామంది అనుభవంలో ఇదే ఉంది. ప్రకృతి చికిత్స కూడా ఇటువంటిదే. సహజమైన జీవన పద్ధతులు లేనప్పుడు ఇవన్నీ ప్రయోజనం లేకుండా పోతున్నాయి.

మనచుట్టూ వ్యాపించిన సాంకేతిక వలయాలు యెంత ప్రమాదకరమో మనకు తెలుసు. కానీ అవి లేకుండా మనం బతకలేకున్నాం.10 నిమిషాలు నెట్‌ లేకుంటే పిచ్చి పడుతుంది కదా. అంతగా బానిసలైనాము. తీరాచూస్తే దానితో పెద్ద ఉపయోగకరమైన కాలాన్ని గడుపుతున్నామా అంటే అదీ లేదు. కాలాన్ని వ్యర్థం చేయడం తప్ప. పోస్ట్‌లు పెట్టడం. గుంపులకు పంపడం.

అట్లే మనం తింటున్న తిండి, తాగే నీరు, పీల్చే గాలి అన్నీ కల్తీలే. విషపూరితాలే. ఇంత దుర్భరజీవితం గడుపుతూ ఇదే మహావైభవంగా భ్రమిస్తున్న మనలను చూచి మనమే జాలిపడాల్సి ఉంది. కొందరిలో దీనికి సంబంధించిన స్పృహ ఉన్నా ఆచరణలో ఏమి చేయాలో తెలియదు. నిస్సహాయంగా దిక్కులు చూసే పరిస్థితే. పరిస్థితులకు అనుగుణంగా మనలను మనం మలచుకోవడం అవసరమని అందరికీ తెలిసినదే. కాని అది ఎంతవరకు సాధ్యం? దీనికి ముందుగా కావలసింది శ్రద్ధ, ఆసక్తి. ఇవి లేకుండా ఏ పనీ చేయలేము.

యుక్తాహార విహారాలు అంటే మనకు తగిన (వండిన) ఆహారం. ఏది తింటే శారీరకంగా, మానసికంగా అలజడి, ఇబ్బంది ఉండదో, ఏది చేస్తే ఆందోళన వత్తిడి వంటివాటి బారిన పడమో అది అని అర్థం. దీనికి కొన్ని సూత్రాలు చెప్పబడినా మళ్ళీ యెవరికి వారు తనకు తగిన వాటిని అనుభవంలో తెలుసుకొని ఆచరించవలసిందే. ఏవో అంతర్జాతీయ సంస్థలు పెట్టిన నియమాలు యథాతథంగా పాటించరాదు. వాతావరణం, దొరికే తిండి, దాని నాణ్యత వంటి అంశాలు చాలా ప్రభావం చూపిస్తాయి. అంతే కాకుండా వ్యక్తికీ వ్యక్తికీ శారీరిక, మానసిక వ్యవస్థలలో తేడాలు ఉన్నాయి. ఒకరికి సరిపోయేది మరొకరికి సరిపోదు. కేవలం వైద్యుల పైన ఆధారపడకుండా మనకు మనం విమర్శించుకొని, వివేకముతో నిర్ణయించుకోవడమే ఉత్తమం. ఇదంతా మనమే స్వయంగా చేయలేమే అనుకుంటే మన సన్నిహితులు, శ్రేయోభిలాషులు వంటివారి సలహాలు పొందవచ్చు. వారు కూడా మన వంటి వారైతే కష్టం. కొంచెం ఆలోచనా పరులై మనపట్ల సహానుభూతి కల్గినవారై ఉండడం అవసరం. ఇదంతా ప్రయత్నం కొద్దీ నిరంతరం జరగవలసిన ప్రక్రియ. ఈ విధంగా భౌతిక పరిస్థితులను సమన్వయ పరచుకుంటూనే, మానసిక స్థైర్యం పెంపొందించుకోవడానికి మన భావజాలంపై దృష్టి కేంద్రీకరించడము ప్రారంభిస్తాము. మన ఆలోచనలు ఏవిధంగా ప్రసరిస్తున్నయి? ఇతరులతో వ్యవహరించే సమయంలో మన ఆవేశాలు, ఉద్రేకాలు యెంతవరకు అదుపులో ఉంటున్నాయి.

మాటతీరు ఏ విధంగా ఉంది? వారిని బాధిస్తున్నయా? వంటి వాటిని గురించి సింహావలోకనం చేయడం అవసరం. దీనికి రోజులో కొంతసమయం కేటాయించుకొని, ప్రశాంతంగా ఆ రోజు ఉదయం నుండి మనం చేసిన పనులను గుర్తుచేసుకుంటూ ఆయా సమయాలలో మన ప్రతిస్పందనలను విశ్లేషించుకొవడం, దాని మంచిచెడ్డలను నిర్ణయించుకొని చేయవలసిన, చేయకూడని వాటిగా విభజించుకొని అవి మళ్ళీ చేయకూడదని నిశ్చయించుకోవడం ఈ అభ్యాసంలో మొదటిమెట్టు. ఈ పనిచేయడం నిజానికి చాలాకష్టమే. ప్రారంభంలో విసుగనిపిస్తుంది. మానేద్దాం అనిపిస్తుంది. అవసరమా అనిపిస్తుంది. ఇవన్నీ విఘ్నాలుగా భావించి వాటిని అధిగమించాలనే తపనతో కొన్నిరోజులు కొనసాగిస్తే అదే నిత్యకృత్యంగా మారుతుంది. చేసి చూస్తే దీని ఫలితం అద్భుతంగా ఉంటుంది. ప్రయత్నించవలసిందిగా నా మనవి. ఇది నేరుగా మనస్సు మీదనే మనంచేసే ఒక నియంత్రణాభ్యాసం. నిద్రించేముందు ప్రతి రాత్రి 10, 15 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది. ఏళ్ళకొద్దీ యోగా ధ్యానం చేసే వారిలో ఏ స్థాయి పరివర్తన వస్తుందో (అసలు వస్తుందో రాదో తెలియదు కూడా) అంతకు మించిన మార్పు కొద్దికాలంలోనే కనిపిస్తుంది. ఇది అనుభవంతో చెపున్నమాట. సహృదయంతో స్వీకరించండి.