(ఎవరా మహానుభావులు)- ఒక వివరణ:

త్యాగయ్య పంచరత్నకీర్తనలలో మకుటాయమానం ఈ కీర్తన. దీన్ని ఎన్నోసార్లు విన్నప్పటికీ దాని తాత్పర్యం మీదకు దృష్టి పోలేదు. ఇటీవల శ్రీపాద్‌ (మా కుమారుడు) దీన్ని విని ప్రస్తావించినాడు. మా మధ్య సారభూతమైన చర్చలే సాగుతుంటాయి సాధారణంగా. శుష్క ప్రసంగాలు చాలా తక్కువ.

మా చర్చలో చోటుచేసుకున్న అంశాలను విపులీకరించి వెలువరించాలనే ప్రయత్నమే ఇది.

ఎందరో మహానుభావులు అందరీకీ వందనములు:

‘‘చందురు వర్ణుని అందచందమునుహృదయారవిందమున

జూచి బ్రహ్మానందమనుభవించువారెందరో’’

వ్యాఖ్య: త్యాగయ్య జ్ఞాని. అందుకే కీర్తన ప్రారంభంలోనే ఆ తత్త్వానుభవాన్ని పేర్కొన్నాడు. ఈ కీర్తనంతా రాముణ్ణి వర్ణిస్తుందని సామాన్యాభిప్రాయం. ఎందుకంటే త్యాగయ్య సాహిత్యమంతా రామార్పణమే కాబట్టి. అంతే కాకుండా 9వ చరణంలో రఘువర అనే సంబోధనుంది. మఱి చందురువర్ణుని అని ప్రారంభించడం ఏమి? శ్రీరాముడు కేవలం దశావతారాలలో ఒకటి అనుకుంటే పొరబాటే... పరబ్రహ్మగా భావించి ఆత్మానుభవాన్ని పొందడమే త్యాగయ్య పరమార్థం.

శుద్ధసత్వమైన చిదానందస్వరూపం దివ్యతేజోవిరాజితమై తత్త్వవేత్తలకు అనుభవానికి వస్తుంది. ఆ ప్రకాశమే చందురు వర్ణము. దీన్ని ఇంకా వివరిస్తే సహస్రారకమలంలో అమృతధారలనజస్రం స్రవించే చంద్రుడున్నాడు. దానికి ప్రతీకగనే శివశక్తుల శిరోభూషణంగా చంద్రరేఖ ఉండడం.

అదీ చందురు వర్ణుని అంటె. లేకుంటే రాముడు నీలమేఘశ్యాముడు కదా! కుదరదు...

ఈ కీర్తనలో భక్తి జ్ఞాన యోగ కర్మ మార్గాలలో చెప్పబడిన అనుభవాలన్నీ పేర్కొన్నాడు త్యాగయ్య. ఆయనకు తెలియనిది లేదు. సంపూర్ణ తత్త్వమును ఆవిష్కరింప జేసినాడు.

__రెండవ చరణం: __

‘‘సామగాన లోల మనసిజ లావణ్య ధన్య మూర్ధన్యు లెందరో’’

సామవేదం దేవతలను గూర్చి కీర్తిస్తుంది. ఋగ్వేదం తర్వాత ప్రముఖ స్థానం దీనికే. గీతలో వేదానాం సామవేదోస్మి అన్నాడు.

అంతటి మహత్తరమైనదిది. యజ్ఞాలల్లో ఉద్గాత అనే వాడు ఈ సామవేద మంత్రాలను దైవప్రీతికరంగా గానం చేస్తాడు. దీనికి ప్రత్యేక అధ్యయనం శిక్షణ అవసరం. ఇది దాదాపు నాదానుసంధానానికి దగ్గరగా ఉంటుంది. ఈ మార్గంలో ధన్యులైనవారు మహానుభావులు ...

__మూడవచరణం: __

‘‘మానసవనచరవరసంచారము నెరపి మూర్తి బాగుగ పొడగనే వారెందరో’’

మనస్సనే అరణ్యంలో శ్రేష్టమైన సంచారం చేసి, దర్శనం పొందేవారు. ఇది యోగుల పద్ధతి. మనస్సును యమనియమాదులద్వారా ఏకాగ్రంచేసి దివ్య దర్శనానుభవం పొందే సిద్ధయోగులు వీరు. ఇక్కడ ‘‘పొడ’’ అనె పదప్రయోగం చాలా అద్భుతం. ఇది అచ్చతెనుగుపదం. అంటే ఏమి. ఒక దాని అస్తిత్వాన్ని గుర్తించడం. అన్నమయ్య గూడా ‘‘పొడగంటి నయ్యా నిన్ను పురుషోత్తమా!’’ అన్నాడు. ఉన్నదాన్ని గుర్తించడమే. జ్ఞానం అంటే ఇదే. మొత్తానికి ఈ చరణంలో యోగదర్శనాన్ని తెల్పినాడు.

__నాల్గవ చరణం: __

‘‘సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువారెందరో’’

శరణాగతి పద్ధతిలో జీవ దేవ భ్రాంతులను వీడక తన్ను తాను సమర్పించుకోవడము. ఆత్మనివేదనం అంటే ఇదే వీరుకూడా మహానుభావులే.

__ఐదవ చరణం: __

‘‘పతితపావనుడనే పరాత్పరుని గురించి పరమార్థమగు నిజమార్గములోను బాడుచును సల్లాపములో స్వరలయాదిరాగముల దెలియువారెందరో’’

ఇది త్యాగయ్య పద్ధతి. సంకీర్తనం. నిజమార్గం తనపరంపరాగతమైన ధర్మం దేన్ని బోధిస్తుందో అది నిజమార్గం. ఆ పద్ధతిలో స్వామిని కీర్తిస్తూ అదీ సంగీతపరంగా స్వరలయరాగ బద్ధంగా పరమార్థాన్ని చాటిచెప్పడం. ఇదీ మహానుభావుల మార్గమే.

__ఆరవ చరణము: __

‘‘హరిగుణమణిమయసరములు గళమున శోభిల్లు భక్త కోటు లిలలో తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచువారెందరో’’

హరి గుణములనే హారములను మెడలో దాల్చిన భక్తులు తామే కాకుండా లోకులందరిని ఉద్ధరించేవారు. అదీ తెలివితో చెలిమితో కరుణ గల్గి. ఈ పదాలు చాలా గూఢార్థంలో వాడబడినాయి.

మొదటినుండి వస్తాము. హరిగుణాలు అంటే భగవంతుని లక్షణాలు.వాటిని దండలుగా ధరించడం అంటే వాటిని తాముగూడా అలవర్చుకొని వాటి ప్రభావం తో తన్నునాశ్రయించిన వారిని బోధనల ద్వారా ఉద్ధరించే వారు.

తెలివితో పరమార్థమేదో తెలుసుకొని, తెలివి అంటేనే జ్ఞానమని అర్థం. పోతన ‘‘భాగవతము తెలిసి పలుకుట శక్యమ్మె శూలికైన తమ్మిచూలికైన’’ అన్నాడు.

రెండవపదం చెలిమి.స్నేహం సౌహార్థం. ఒకరకమైన స్నిగ్ధ భావంతో దయామూర్తులై లోకులనుద్ధరిస్తారు. వీరూ మహానుభావులే!

ఏడవ చరణం:

‘‘హొయలుమీఱ నడలుగల్గు సరసుని సదా కనుల జూచుచును పులకశరీరులై ఆనందపయోధినిమగ్నులై ముదంబునను యశముగలవారెందరో’’

నామరూపాత్మకమైన పరిమితతత్త్వాన్ని దైవంగా భావించే కర్మ పద్ధతి ఇది. రాముడంటే కోదండరాముడు దశరథ తనయుడు సీతాపతి రావణాంతకుడు సుపరిపాలకుడు ధర్మమూర్తివంటి భావాలకు మాత్రమే పరిమితమై దానితోనే పులకించిపోయే వారు. లోకంలో సామాన్యంగా అందరం ఈ స్థితిలోనే ఉంటాం.

ఈ భావంతోనే చరిస్తాం. ఇదే తీవ్రంగా మల్చుకొన్నవారు దాన్నే సర్వస్వంగా భావించడం కూడ ధన్యతే.వీరికి రాముడు పరబ్రహ్మమనే మాట నచ్చదు. జీవేశ్వరాభేదం, లేదా జీవేశ్వరైక్యం వంటివి నచ్చని సిద్ధాంతాలు. ద్వైతులు వీరే.

ఎనిమిదవ చరణం:

‘‘పరమభాగవతమౌనివర శశివిభాకర సనకసనందన దిగీశసుర కింపురుష కనకకశిపుసుత నారద తుంబుర పవనసూను బాలచంద్రధర శుక సరోజభవ భూసురులు పరమపావనులు ఘనులు శాశ్వతులు కమలభవసుఖము సదానుభవులు గాక ఎందరో’’

పైన పేర్కొన్న పద్ధతులన్నిటికీ ఉదాహరణగా కొంతమందిని పేర్కొంటున్నాడు ఈ చరణంలో. వారు మునులు, దేవతలు, కింపురుషులు, నరులు, రాక్షసులు, ఎవరైనా సరే పరమభాగవతులే. రవి చంద్రులు, సనకసనందనాదులు, దిక్పాలకులు, ప్రహ్లాదుడు, నారద తుంబురులు, హనుమ, శివుడు, బ్రహ్మ, వంటివారు. వీరంతా శాశ్వతమైన బ్రహ్మానందాన్ని నిత్యం అనుభవించే వారే.

తొమ్మిదవ చరణం:

‘‘నీ మేను నామవైభవంబులను, నీ పరాక్రమధైర్యముల, శాంతమానసము, నీవియును, వచనసత్యమును, ‘‘రఘువర!’’ నీ ఎడ సద్భక్తియు జనించగను, దుర్మతములను కల్లజేసినట్టి నీ మది నెఱింగి, సంతసంబునను గుణభజనానంద కీర్తనము చేయువారెందరో’’

ఇంక నేరుగా రామునితోనే చెప్తున్నాడు. నీ రూపలావణ్యాలను, రామనామ మహిమను, నీసద్గుణాలైన ధైర్య పరాక్రమాలు శాంతము, దానగుణము, సత్యవ్రతము, వంటివానిని నిత్యం కీర్తిస్తూ ఉండేవారు.దీనికి కారణం సద్భక్తి కల్గడం.తద్వారా నాస్తిక చార్వాకాది పాషండ మతాలను ఖండిరచగల్గడం. ఇవన్ని మహానుభావుల లక్షణాలే.

పదవ చరణం:

‘‘భాగవత రామాయణ గీతాది శృతిశాస్త్ర పురాణము మర్మములన్‌, శివాది షణ్మతముల గూఢములన్‌, ముప్పదిముక్కోటి సురాంతరంగముల భావంబులనెఱిగి, భావరాగలయాది సౌఖ్యముచే చిరాయువుల్‌ కలిగి, నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారెందరో మహానుభావులు’’

భాగవతరామాయణాలు భగవద్గీత వేదశాస్త్ర పురాణాలు షణ్మతాలు వీటన్నిసారాన్ని తెలుసుకొని సర్వదేవతాస్వరూపమైన దివ్యతత్త్వాన్ని అర్థం చేసుకోవడం ద్వారా అభేదదృష్టులై నిత్యభావనసల్పి బ్రహ్మానందాన్ని పొందేవారు. దాన్ని గానం ద్వారా లోకానికందించి శాశ్వతమైన కీర్తిని మూటకట్టుకున్న వారు త్యాగరాజునకు ఆప్తులు.తానూ అట్టివాడననే చెప్పకనే చెప్పుతున్నాడు.ఆత్మప్రత్యయం లేనివారి వాక్కు ప్రభావవంతంగా ఉండలేదు కదా!

ఇక్కడొక విశేషం. షణ్మతములు. ఇవి ఏవి. ఆదిశంకరులకు షణ్మతస్థాపనాచార్య అనే ప్రసిద్ధి ఏల కల్గింది. చూద్దాం.

జ్ఞానం, ఐశ్వర్యం, బలం, వీర్యం, తేజస్సు, శక్తి ఈ షడ్గుణాలను భగము అంటారు. ఇవి సమగ్రంగా కలిగి ఉన్నవాడే భగవంతుడు. వీటికి ఒక్కొక్కదానికి ప్రతీకగా ఆరు పద్ధతులను ఏర్పరచినారు. అవే షణ్మతాలు.

జ్ఞానం : విశ్వచైతన్యమంతా దీనితోనే నిండిఉంది.దీనికి ప్రతీక వైష్ణవం.

ఐశ్వర్యం: అన్నిటినీ లొంగదీసుకునే తత్త్వం.దీనికి ప్రతీక శైవం.

బలం : అనాత్మ రూపాన్ని నశింపచేసేది ఇది.దీనికి ప్రతీక గాణాపత్యం.

వీర్యం : సృష్టిక్రియ అనంతం గా జరుగుతుంది.దీనికి ప్రతీక కౌమారం.

తేజస్సు : మనకు కాంతినిచ్చే తత్త్వం.విశ్వాన్ని దృశ్యమానం చేస్తుంది.ఇదే సౌరం.

శక్తి : ఇదే మాయాశక్తి. ప్రసరించేతత్త్వమిది. సృష్టిస్థితిలయాలనొనరించేది

  ఇదే. దీనికి ప్రతీక శాక్తేయం.

ఈ ఆరు కాలక్రమంలో వైషమ్యాలకు దారితీసినాయి.సంఘసుస్థితికి ఆటంకంగా పరిణమించినాయి.ఇది బౌద్ధ చార్వాకాది దుష్టమతాలకు కారణమైంది.అందుకే భగవత్పాదులు ఆయా మార్గావలంబులకు పంచాయతన విధానాన్ని ఏర్పరచినారు. వారి వారి సంప్రదాయాన్ని బట్టి ప్రధాన దేవతను మధ్యలో ఉంచి, నాల్గువైపుల మిగిలిన వారిని ఉంచి పూజించే పద్ధతిది. శివ పంచాయతనం, విష్ణుపంచాయతనం వంటి సంప్రదాయాలు నేటికీ ఆచరణలో ఉన్నాయి.

(ఆదిత్య, అంబిక, విష్ణు, గణనాథ, మహేశ్వర ఇక్కడ గణనాథ శబ్దం గాణపత్య, కౌమారాలను రెంటినీ సమన్వయిస్తుందని పండితాభిప్రాయం.)

పదునొకొండవ చరణం:

‘‘ప్రేమ ముప్పిరి గొన్నవేళ నామము దలచే వారు,రామభక్తుడైన త్యాగరాజనుతుని నిజదాసులైనవారెందరో మహానుభావులు అందరికీ వందనములూ ఎందరో మహానుభావులూ అందరికీ వందనములూ’’

‘‘ప్రేమ ముప్పిరి గొన్నవేళ’’ చాలా సార్థకమైన ప్రయోగం. నారద భక్తి సూత్రాలలో ‘‘సా పరమ ప్రేమ రూపా భక్తిః’’ అన్నదానికి తెనుగుసేత ఇది. భక్తి పరవశులై రామనామస్మరణం చెసేవారందరూ తనవలెనే రామభక్తులు. ఆ రాముడు త్యాగరాజనుతుడు.అంటే త్యాగరాజు చేత కీర్తించబడేవాడు. రామభక్తులంతా మహానుభావులే. రామభక్తులెవరో 8వ చరణంలో పేర్కొన్నాడు. శివుని నుండి మొదలైంది కదా రామభక్తుల జాబితా.

రాముణ్ణి ఆత్మారామునిగా పరబ్రహ్మగా తత్త్వానుసంధానంతో హృద్గతమొనర్చుకున్నవారు. అంతే కాకుండా నామరూపసంకీర్తనలే అర్చనలే పరమార్థంగా భావించేవారు .అందరిని మహానుభావులుగా పేర్కొన్నాడు. రామతత్త్వాన్ని ఏ స్థాయిలోనైనా సరే అనుభవానికి తెచ్చుకోవడమే ముఖ్యం అని సారభూతంగా ప్రవచించడమే త్యాగయ్య హృదయం అని నా భావన.