త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలలో ‘‘దుడుకుగలనన్నే’’కీర్తన ఒక అద్భుతమైన భక్త్యావేశాన్ని,పశ్చాత్తాపాన్ని,మానవజీవితం లోని వికృత పార్శ్వాన్ని ఆవిష్కరిస్తుంది.జీవితమంతా దుష్టమార్గం లో గడిపి,చివరిలో తెలివితెచ్చుకున్న ఒక పాపి తన జీవితమెట్లా నాశనమైనదో గుర్తుతెచ్చుకున్న సందర్భము ఇది. 9 చరణాలుగా ఉంటుంది. గౌళరాగం, ఆదితాళంలో కూర్చబడిరది.
‘‘దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా! ఎంతో దుడుకు గల నన్నేదొరకొడుకు బ్రోచురా!’’ ఇది పల్లవి.
1వ చరణం:
‘‘కడు దుర్విషయాకృష్టుడై గడియ గడియకు నిండారు దుడుకు గల..........’’
అసలు త్యాగరాజు భాషా శైలి అంతా తేలికైన తేటతెలుగులో ఉంటుంది. ఎత్తుగడే ఒక విచిత్రం.దుడుకు అనే పదం సర్వసామాన్యమైన వాడుక పదం. దానికి నిఘంటువులలో ‘‘పెంకితనం’’, ‘‘ఇతరులను అవమానించునట్టి’’ అన్న అర్థాలు, ఆంగ్లంలో (ఇంసొలెంట్) ఱఅంశీశ్రీవఅ్ సమానార్థకంగా కనిపిస్తాయి. కావ్యాలలో ‘‘దుందుడుకు’’ అని వాడుతుంటారు.ఈ దుడుకుగలవాని లక్షణాలను కన్నులకు కట్టిస్తాడు. అక్కడక్కడ సంస్కృతపదాలు సమాసాలున్నప్పటికీ, తెలుగు జీవధ్బాషగా తొణికిసలాడుతుంది ఈ కీర్తనలో. ఇదే కాదు. త్యాగయ్య ప్రతికీర్తనా ఇటువంటిదే. అసలు తమిళదేశంలో ఉండి, అదీ ముస్లిం రాజుల పాలనాకాలంలో తెలుగుభాష జీవనాడిని రసప్రవాహంగా మార్చి, భక్తి, వేదాంత, తత్త్వ రహస్యాలను ఆత్మానుభూతిలో రంగరించి అందించిన మహానుభావుడు త్యాగయ్య. ఆయన భాషాసేవ ఒక అద్భుతం. ఒక్క తమిళపదమైన ఆయన సాహిత్యంలో చోటు చేసుకోలేదు. కాని వారందరికి తరతరాలుగా ఆరాధ్యుడైనాడు. బ్రహ్మశబ్దంతో కూడి పేరు ఉచ్చరింపబడ్డ వారిద్దరే. శుకబ్రహ్మ, త్యాగబ్రహ్మ. ఆ పరబ్రహ్మస్థితిని నిత్యానుభవం లో నిల్పుకున్నవారు.
నాదానుసంధానంతో శబ్దబ్రహ్మలో లీనం కావడం అసలు సంగీతం యొక్క ప్రయోజనం. భారతీయార్ష సంస్కృతి ప్రబోధమే అది. ‘‘యోగో జ్ఞానం తథా సాఖ్యం విద్యాశ్శిల్పాది కర్మ చ, వేదాశ్శాస్త్రాణి విజ్ఞానమేతత్సర్వం జనార్దనాత్’’ అని విష్ణుసహస్రనామం బోధిస్తున్నది కదా. అన్ని శాస్త్రాలు కళలు పరమాత్మ నుండే ప్రభవించినాయి. అవన్నీ మళ్ళీ పరమాత్మనే చేరుకునే మార్గాలుగ మార్చుకోవడమే ఆయా కళాభ్యాసము.అదే సాధన. దీన్ని ఋజువుపర్చినవాడు త్యాగయ్య.కళను వినోదముగా కాకుండా మోక్షవిద్య గా ఎలా ఉపాసించాలనో త్యాగయ్య జీవితమే ప్రబలోదాహరణము.ఈ భావలనన్నీ హృద్గతం చేసుకొని త్యాగరాయకీర్తనలను అర్థం చేసుకునే ప్రయత్నం కొనసాగిద్దాం.
‘‘త్యాగమహర్షి ఆత్మలో రసభావముల ఐక్యమరసిన తెలుగు భాష’’ అంటాడు విశ్వనాథ.మహర్షి కావునే ఆత్మదర్శనం చేయగలిగినాడు. నారదమునీంద్రుని దర్శనం పొంది ఆశీస్సులందుకున్నాడు. త్రిమూర్తులు ఆయా స్థానములకు చేరడానికి కారణం నాదోపాసనే అని త్యాగయ్య తీర్మానం. ‘‘నాదోపాసన చేసే శంకర నారయణ విధులు వెలిసిరి మనసా’’ అని బేగడరాగంలో ప్రసిద్ధమైన కీర్తన ఉంది.
ప్రస్తుతానికి వస్తే ‘‘కడు దుర్విషయాకృష్టుడై గడియగడియకు నిండారు దుడుకు గల నన్ను’’ అని మొదటి చరణం గదా. ఎన్నో దుష్టమైన విషయవాంఛలచేత చుట్టబడ్డ నన్ను ఏ దొర కొడుకు కాపాడుతాడు అని ఆక్రోశిస్తున్నాడు. ఇక్కడ ఇంకొక విశేషముంది. ఏ దైవం కాపాడుతాడు అనకుండా ఏ దొరకొడుకు రక్షిస్తాడు అనడం ఏమిటి. దొర బ్రోచురా అన్నా ఒకరకం. అదీ కాకుండా దొరకొడుకు బ్రోచడమేమి. రామచంద్రుడు దశరథపుత్రుడు. ఇక్కడ దొర దశరథుడే. రాజపుత్రుడు తన చేసే నేరములనుండి కాపాడుతాడని భావిస్తున్నాడా. ఆలోచించవలసినదే. స్పష్టత లేదు. ‘‘నన్ను’’ మనందరికీ వర్తిస్తుంది. త్యాగయ్య ఆత్మాశ్రయంగా చెప్పినా, అది సార్వజనీనమే.
2వ చరణం: ‘‘శ్రీ వనితా హృత్కుముదాబ్జ! అవాఙ్మానస గోచర! సకలభూతములయందు నీవై యుండగ మదిలేకబోయిన దుడుకు గల’’
లక్ష్మి హృదయమనే కలువకు చంద్రునివంటివాడా! మాటలకు, భావనకు అందనివాడా! నీవు సర్వాంతర్యామివి.అనే పరమార్థాన్ని గ్రహించలేని జడుడను. నన్ను కాపాడే రాజపుత్రుడేది?కుముదాబ్జ అనే సంబోధన సామాన్యమైనదేమీ కాదు.అబ్జమంటే వెంటనే మనకు పద్మమనే తోస్తుంది. కాని ఆప అంటే పాలు అనే అర్థంలో పాలసముద్రం లో ప్రభవించినవాడు చంద్రుడు అని తెలియదు. నిఘంటుసాయంతో గాని అర్థం కాలేదు.
3వ చరణం: ‘‘చిరుతప్రాయములనాడే భజనామృతరసవిహీనకుతర్కుడైన’’
బాల్యం నుండే దైవభక్తి,విశ్వాసములను ఖండిస్తూ,నాస్తిక చార్వాకధోరణులతో విర్రవీగుతూ, నీ నామస్మరణ అనే అమృతాన్ని కోల్పోయినట్టి మూర్ఖుడను నన్ను కాపాడేదెవరు.
4వ చరణం: ‘‘పరధనములకొఱకు నొరుల మదికఱగ బలికి కడుపు నింప తిరిగినట్టి’’
మాయమాటలతో ఇతరులను మోసంచేసి, వారి సంపదలను కొల్లగొట్టి ధనసంపాదనకు పాల్పడిన నీచుణ్ణి నన్ను బ్రోచేవారెవరు?
5వ.చరణం: ‘‘తనమదిని భువనసౌఖ్యపు జీవనమే యనుచు సదా దినములు గడిపే’’
మొదటి చరణ భావమే దాదాపు దీనిలో ధ్వనిస్తుంది.ఈ లోకము లో ఉన్న సుఖములు,భోగాలు మాత్రమే జీవితపరమార్థం గా అనుకుంటూ వాటికోసమే బతుకంతా వ్యర్థం చేసుకుంటున్నాం.
6వ చరణం: ‘‘తెలియని నటవిటక్షుద్రులువనితలుస్వవశమవుట కుపదేశించి, సంతసిల్లి, స్వరలయంబులెరుంగకను శిలాత్ములై సుభక్తులకు సమానమను దుడుకుగల నన్నే’’
క్షుద్రులు, దుష్టులు గానున్న గురువులను సూచిస్తున్నాడు. వనితలను, ధనాన్ని, అధికారులను వశపరచుకునే నీచమైన విధానాలను ఉపదేశిస్తాడు ఈ గురువు. ఇట్టివారినే విత్తాపహారులుగా ‘‘గురుగీత’’ పేర్కొంటుంది. గురువులను రెండు విధాలుగా చెప్తూ హృత్తాపహారులుగా, విత్తాపహారులుగా పేర్కొంటుంది. అంటే శిష్యులహృదయంలోని బాధను, దుఃఖాన్ని తొలగించేవాడు హృత్తాపహారి. ఎవరో సద్గురువులు మాత్రమే ఈ పని చేయగలరు.మిగిలినవారంతా విత్తాపహారులే.అంటే శిష్యులధనాన్ని అపహరించేవారు. పాదపూజలు, సేవలు, వంటివన్ని ఇవే. ఈ పనులతో ‘‘సంతసిల్లి’’అంటే వారందరినీ ఉద్ధరిస్తున్నాను అనే ఆత్మవంచనతో ‘‘స్వరలయంబులెరుగకశిలాత్ములై’’ సంగీతజ్ఞానంలేకుండా పాషాణహృదయులై జీవితాలను భ్రష్టుపట్టించుకున్నవారు.‘‘సుభక్తులకు సమానమను’’ ఇట్టి వారంతా తమను తాము మహా భక్తులుగాప్రకటించుకుంటారు.
7వ చరణం: ‘‘దృష్టికి సారంబగు లలనాసదనార్భకసేవామితధనాదులను, దేవాధిదేవ! నెఱనమ్మితి గాకను,నీపదాబ్జభజనంబు మఱచిన దుడుకుగల’’
భార్యాపుత్రధనాదులనే (ఈషణత్రయం) దారేషణ, ధనేషణ, పుత్రేషణ అని చెప్పినట్టు ఇవే జీవిత పరమార్థంగా బతికినాను. ఓ రామా!నీ పదసేవను మరచిపోయినాను.ఇటువంటి అవివేకిని ఏ దొర కొడుకు రక్షిస్తాడు నీవుతప్ప. మనకు నిత్యం అనుభవములోనున్న ప్రాపంచికమైన వ్యవహారంపై వాటికోసం ఆరాటం,అవే శాశ్వతమనుకుంటూ సత్యమైనది,పరమార్థమైనదాన్ని మరచి పోవడమే మాయాప్రభావం. ‘‘జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా, బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయఛ్చతి’’ జ్ఞాని కూడా మాయాప్రభావాన్ని తెలుసుకోలేడు ఒక్కోసారి. అది సర్వులను మోహంలో ముంచేస్తుంది.అదే దేవీ తత్త్వం. భక్తిశ్రద్ధలతో సేవిస్తే క్రమానుగతమైన సాధనా రూపాన ఈ మాయను దాటగల్గిన మార్గాన్ని చూపేది కూడా ఆ దేవీ తత్త్వమే. దీనినంతా పదాబ్జభజనంబు మరచిన అని పేర్కొన్నాడు త్యాగయ్య.
8వ చరణం: ‘‘చక్కని ముఖ కమలంబును సదా నామదిలో స్మరణలేకనే, దుర్మదాంధజనుల కోరి,పరితాపములచే దగలి,నొగలి, దుర్విషయదురాసలను రోయలేక, సతతమపరాధినయి, చపలచిత్తుడనై, దుడుకు గలనన్నే’’
సగుణ సాకారోపసనగా రామచంద్రుని నామరూపాలను దివ్యగుణాలను కీర్తిస్తూ తద్వారా నిర్గుణపరబ్రహ్మానుభవాన్ని పొందిన జ్ఞాని త్యాగయ్య.దాని మార్గాన్ని సూచిస్తున్నాడు. శ్రవణ, మనన, నిధి ధ్యాసములనే క్రమసాధనాసోపానాలను పేర్కొంటున్నాడు. తొలి వాక్యమదే.
అసలు మన కోరికలు తీరాలని తాపత్రయపడి, దానికోసం అడ్డదార్లు తొక్కి భయంకరమైన ఫలితాలను పొందుతుంటాం. ఐనా బుద్ధి రాదు. మళ్ళీ మళ్ళీ అవే చెస్తుంటాం. అందుకే ‘‘సతతమపరాధినయి’’ అంటాడు.
9వ చరణం: మానవతను దుర్లభమనుచు నెంచి, పరమానందమునొందలేక, మదమత్సరకామలోభ మోహాలకు దాసుడనై, మోసపోయితిగాక, మొదటి కులజుడగుచు, భువిని శూద్రులపనులసల్పుచునుంటిని గాక, నరాధములును రోయు, రసవిహీనమైనను సాధింప తారుమారు, సతులకుకొన్నాళ్ళు, ఆస్తికై సుతులకు
కొన్నాళ్ళు, ధనపతులకై కొన్నాళ్ళు తిరిగితినయ్య! త్యాగరాజాప్త! ఇటువంటి దుడుకు గల నన్నేదొరకొడుకు బ్రోచురా’’
‘‘యత్సారభూతం తదుపాసితవ్యం’’ అని ఉపనిషత్ ప్రబోధిస్తుంది. రసం, సారం రెండూ ఒక్కటే.రసోవైసః అన్నదే పరమాత్మతత్త్వం.అదే పరమానందమొందుట. అది తారుమారైంది.
కారణం అరిషడ్వర్గాలు. వర్ణాశ్రమధర్మచ్యుతి. ‘‘సర్వాగమానాం ఆచారః ప్రథమం పరికల్పతే. ఆచారప్రభవో ధర్మః,ధర్మస్య ప్రభురచ్యుతః’’ అన్న విష్ణుసహస్ర నామాన్ని దినం పారాయణం చేస్తాం.చేసే పనులన్నీ దానికి వ్యతిరేకం. ఇదే ‘‘తారుమారు.’’ ధర్మం పుట్టేదే ఆచారంతో.అనాచారంగా ఏమి చేసినా ఫలించదు. మనం అది కూడా దాటి పోయి దురాచారంగా ప్రవర్తిస్తున్నాం,. మనందరి దుడుకుతనాన్నే త్యాగయ్య ఈ కీర్తనలో వివరించినాడు.