పరంపరాగతంగా సిద్ధించిన ఆర్షధర్మవిభూతి , సదాచారనిష్ట వంటి వాటి ప్రభావం నిత్యజీవితంలో భాగంగా కలిసిపోయునాయి.నా తల్లితండ్రులు మలచిన రీతిలో లౌకికాముష్మికాలను భావిస్తూ,పాటిస్తూ గడిపే జీవనపయనంలో భాగంగా పుస్తక రచన ప్రచురణ లను విశ్రాంతజీవితవ్యాసంగాలుగా ఏర్పరచుకున్నాను. జీవితసాఫల్యానికి ఇదే మేలుచేకూరుస్తుందని నా ప్రగాఢ విశ్వాసము. మానవజీవితపరమార్థమేది? అనే ప్రశ్న అనాదిగా భారతీయ చింతనకు ఆలంబనంగా నిలిచింది.దాని ఫలితంగనే వేదవేదాంగములు ఉపనిషత్తులు స్మృతులు పురాణాలు కావ్యాలు వివిధ దర్శనములు వంటి అనంతవాఙ్మయం ఏర్పడిరది.ఎవరి ఆలోచనామార్గం వారిది. దానికి చాలా కారణాలున్నాయి.స్వధర్మే నిధనం శ్రేయః అన్నట్లు మనప్రాచీన ఋషులేర్పరచిన ఆత్మజ్ఞానానుభవమే చరమలక్ష్యము గా సిద్ధాంతమైనది.దానికి కావలసిన శమదమాదులు చింతన పరమార్థవిచారము సాధనామార్గాలు వంటివన్నీ మద్గురువులు,పితృపాదులు బ్రహ్మశ్రీ పాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి గారు వివరించే వారు.బ్రహ్మీభూతులైన సద్గురువు తండ్రిగా లభించడం ఒక అద్భుతం, పురాకృతజన్మసంచయ పుణ్యఫలం.’’ ఎన్ని భవంబులందు గడియించిన యా సుకృతంబు లెన్నియో, యన్నియ మూర్తియై మనకహా!లభియించె

గురూత్తముండు’’అని తమ గురువులైన శివసచ్చిదానంద సరస్వతీ స్వామివారిని గురించి చెప్పుకున్నారు. నాకూ అదే వర్తిస్తుంది.అంతకన్నా ఎక్కువకూడా.ఎందుకంటే జన్మనిచ్చిన తండ్రే జ్ఞానోపదిష్ట కావడము విరళము.భహుశా దుర్లభము కూడా.దాదాపు 25 సంవత్సరాలు వారి శిక్షణలో భారతీయ విజ్ఞానవశేషాలను రహస్యాలను శాస్త్రీయంగా తెలుసుకునే భాగ్యం కలిగింది.వారు యశస్కాయులై 20 సంవత్సరాలైనా ఇప్పటికీ వారి ప్రబోధాలు నన్ను ప్రచోదిస్తూనే ఉన్నాయి.ఆ యా సందర్భాలలో అలవోకగా వెలిబుచ్చిన

సంగతులు అప్పుడు అర్థం కాకున్నా ఇప్పుడిప్పుడే మననము, చింతనల ద్వారా అవగతమైతున్నయనిపిస్తుంది.ఇది వాస్తవమా భ్రమా అన్నది కాలమే నిర్ణయించవలసిఉంటుంది.ఎందుకంటే అలౌకికానుభవాలన్నీ ఎవరివి వారికే తెలుస్తాయి.కొంతవరకు శాస్త్రం ఉపకరించినా అనుభవమే ప్రమాణం కదా. ఈ సాధనలో భాగమే నేటి మాండూక్యోపనిషత్‌ ప్రచురణ. మద్గురువులు తరచుగా మాండూక్యాన్ని గూర్చి వివరించేవారు.వారి గురువులు, మాపరమ గురువులు కూడా వారి ప్రబోధాలలో పేర్కొనేవారట మాండూక్యాన్ని. కారణం జగద్గురువుల అద్వైతసిద్ధాంతానికి మూలమైన అజాతవాదం వారి పరమగురువులైన గౌడపాదా చార్యుల కారికల ద్వారా ప్రవచించబడడమే.అదే నా మనస్సులో నాటుకు పోయింది. నిజంగా నేనీ పనికి అర్హుణ్ణా కాదా చాలాకాలం సంశయించి నాను. కాని గురువుల పైన భారం వేసి, కర్తృత్వభావనను వదలించుకొని, ఈ ప్రయత్నం కొనసాగించినాను.

లోతైన అంశాలను అక్కడక్కడ తడిమినా జిజ్ఞాసువులకు ఉపకరించే ధోరణిలోనే నా అనువాదాన్ని కొనసాగించాలని ప్రయత్నించినాను. ఎంతవరకు సఫలమైనదో నాకృషి! విజ్ఞులే నిర్ణయించగలరు. దాదాపు 2,3 సంవత్సరాలనుండి నేను అనుసరిస్తున్న బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావుగారి అద్వైతప్రవచనాలు చాలా దోహదంచేశాయి. వారి తార్కికవాదం ఆదిశంకరుల భాష్యవివరణ అద్యతన కాలమునందు నాన్యతోదుర్లభము కదా! గొప్ప స్ఫూర్తిని కలిగించే వాక్కు అది.

ఈ పుస్తక ప్రచురణకు ఆర్థికసహాయం అందించిన మా మేనల్లుడు శిష్టా మంజునాథ్‌ బెంగుళూరు గారికి, వారి కుటుంబానికి నా శ్రేయోకామనల నందిస్తున్నాను. మా మంజు ఆధ్యాత్మిక రంగములో చక్కటి కృషి సల్పుతున్నాడు. కేవలం వాగ్వ్యవహారం కాకుండా జీవనశైలిని తదనుగుణంగా మార్చుకోవాలనే ప్రయత్నపరుడై ఉన్నాడు.ఇదే కదా అనుష్టానవేదాంతమంటే.ఈ ప్రయత్నంలో కృతకృత్యుడు కావలెనని మనసారా ఆశీర్వదిస్తున్నాను.