మానవుడు కోరే ప్రయోజనాలు రెండే. ఒకటి జ్ఞానం, రెండు సౌఖ్యం. అంటే అన్నీ తెలుసుకోవాలనీ, అన్నీ అనుభవించాలనీ కోరబడేది అర్థం. పురుషుడు అంటే మానవుడు కోరేది పురుషార్థము (ణవంఱతీవస). మనం చేసే ప్రతి పనిలో ఇవే ఇమిడి ఉన్నాయి. ఐహికమైన అర్థకామాలు అన్నీ ఇవే. సంపాదన, ఇల్లు, అన్నం, వస్త్రం వంటివన్నీ. స్త్రీ పురుష అన్యోన్యానురాగమే కామం. ఇవి మనమనుకున్నట్టు సిద్ధించవు. జీవితాంతం అనుభవించినా తీఱవు. చివరికి అన్నిటిని వదలాల్సిందే.

మరొకటి ఆముష్మికం. అంటే ధర్మం. ధర్మాచరణవల్ల పరంలో అనుభవానికి వస్తుంది. కాని ఇది కూడా తాత్కాలికమే. ఫలానుభవం ముగిసిన వెంటనే తిరిగి మళ్ళీ జన్మ, కష్టసుఖాలు తయారైతాయి. ఇదే జనన మరణ చక్రం.

దీనిని బట్టి ధర్మార్థకామాలవల్ల ప్రయోజనం లేదని తేలింది. ఇవి సంపూర్ణం కాదు. కొరతగనే ఉంటాయి. ఈ కొరతే అనర్థం (Undesired). ఈ అనర్థాన్ని తొలగిస్తుంది ప్రమాణం. ప్రమ అంటే జ్ఞానం. అది సిద్ధించడానికి చేసే సాధనే ఇది. ఉపనిషత్తులు దీనినే ఆగమప్రమాణంగా పేర్కొన్నాయి. దీని ద్వారా ఆత్మజ్ఞానం కల్గుతుంది. అంటే యేమి? అనాత్మరూపమైన భేదప్రపంచాన్ని లయం చేసుకొని, అంతా ఆత్మస్వరూపంగా భావించడమే.

మనకు నిత్యవ్యవహారంలో ఉన్న ఈ జగత్తు అంతా మిథ్య, మాయ అని చెప్తున్నాయి ఉపనిషత్తులు. ఉపనిషత్‌ అంటే రహస్య విజ్ఞానం అని అర్థం. మానవుని అనుభవంలో లేనిదే రహస్యం. ఈ రహస్యాలను రెండిరటిని మనకు బోధిస్తాయి ఉపనిషత్తులు. అవి ఒకటి ఆత్మ అనే పదార్థం ఉంది. రెండు అది తప్ప దానికి భిన్నంగా మరొకటి ఏదీ లేదు. ఈ రెండూ రహస్యాలే. యెందుకంటే ఇవి రెండూ మనకు అనుభవంలో లేవు. మన అనుభవంలో ఆత్మ మనకెక్కడా కనిపించదు. అది లేదనే అనాత్మ ప్రపంచమే చుట్టూ కనిపిస్తుంది. ఇటు లోకదృష్టికి కాని, అటు శాస్త్ర దృష్టికి కాని అందే విషయం కాదు ఆత్మ. ఒక్క ఉపనిషత్తులు మాత్రమే దీన్ని గురించి ఘంటాపథంగా చెప్పగలవు.

అనుభవంలోలేని ఆత్మను ఉపనిషత్తులు చెప్పినంతమాత్రాన నమ్మివేయాలనా? అనే ప్రశ్నకు జవాబుగా అనుభవం వేరే, యథార్థం వేరే. అనుభవంలో ఉన్నదంతా యథార్థం కాదు. ఉదాహరణకు ఎండమావులు, నక్షత్రాలు వంటివి. మనకు కనిపిస్తున్నట్లు అవి లేవు కదా! దీన్ని బట్టి కేవలం అనుభవాన్ని బట్టి మాత్రమే యథార్థం తెలుసుకోలేమని అర్థమైంది. సహేతుకమైన విచారణ చేయడం ద్వారా మాత్రమే యథార్థం తెలుసుకోగలం. విచారణ చేస్తూ పోతే చివరికేది నిలుస్తుందో అదే ప్రమాణం. విచారణ చేసి చూస్తే ఆత్మ అనేది ఒకటి ఉందని, దానికి భిన్నంగా మరొకటి యేదీ లేదని తెలుస్తుంది. దీన్ని కొంచెము వివరించుకుందాం. మనకు కనిపించే ఈ ప్రపంచమంతా ఒక పెద్ద జడపదార్థం. దీనికి తానున్నాననే జ్ఞానంలేదు. ఉన్నాననే జ్ఞానం లేకపోతే ఉండటానికి వీలులేదు. ఒకటి ఉండాలంటే ఆ ఉనికికి ఒక సాక్షి ఉండి తీరాల్సిందే. అసాక్షికమైన ఉనికి అసంభవం. కళ్ళు లేకున్నా కనిపిస్తుంది అన్నట్లుంది ఇది. కాబట్టి పదార్థం ఉందంటే సాక్షి

ఉండవలసిందే. ఆ సాక్షి ఏదో కాదు. జ్ఞానమే. అచేతనమైన ప్రపంచానికి అది ఉందని నిరూపించడానికి ఒక సాక్షిజ్ఞానం కావాల్సి వస్తుంది. ఇది మనలాంటి జీవులలో గోచరిస్తుంది. కాని ఇది పరిమితంగా ఉంది మనవద్ద. దేశకాలాలు అడ్డుతగుల్తున్నాయి మనజ్ఞానానికి. అందుకే అది పరిమితం. అపరిమితమైన జ్ఞానం ఉందని ఇప్పుడు అర్థమౌతుంది మనకు క్రమంగా. జగత్తుకే కాకుండా జీవునికి కూడా సాక్షి ఉండాల్సిందే. అది లేకుండా అస్తిత్వమే లేదుకదా. అట్టి అఖండ చైతన్యమే ఆత్మగా పిలువబడుతుంది. పరమాత్మ, దేవుడు, ఈశ్వరుడు, బ్రహ్మము వంటివన్నీ దానికి నామాంతరాలే. ఇప్పటికి ఆత్మ అనే పదార్థముందని నిర్ధారణమయ్యింది కదా!

ఇది మొదటి రహస్యము. ఇక రెండవది ఆత్మకు భిన్నంగా మరేదీ లేదు అన్నది నిరార్ధరింపబడవలసి ఉంది. దాన్ని గూర్చి విచారిద్దాం. ఆత్మకు భిన్నంగా మనకు అనుభవంలో కనిపించేవి రెండే. అవి ఒకటి జీవుడు. రెండు జగత్తు. వేరుగా కనిపిస్తున్నా నిజానికి అవి రెండూ వేరు కావు. ఎట్లా అంటే బింబ ప్రతిబింబ భావాన్ని బట్టి జీవుడు లేడు. కార్యకారణ భావాన్ని బట్టి జగత్తు లేదు. వివరిస్తే మనముఖం అద్దంలో వేరుగా అంటే ప్రతిబింబంగా కనిపిసుంది. అద్దం తొలగిస్తే ప్రతిబింబం లేదు. అద్దం అనే ఉపాధి కారణంగానే అది ఏర్పదింది.

ఉపాధి తొలిగితే అదీ తొలిగింది. అప్పూడు మిగిలేది మనముఖమే. బింబంకన్నా ప్రతిబింబం వేరుకాలేదు అని అర్థమైంది. అట్లే ఆత్మకు భిన్నంగా జీవుడు లేడు. ఆత్మ బింబం. జీవుడు దాని ప్రతిబింబం. శరీరం అద్దం వంటిది. అఖండాత్మ చైతన్యం దానిలో ప్రతిఫలించింది. దాన్ని మనం జీవుడనుకుంటున్నాం. కేవలం శరీరాది సంసర్గం వల్ల ఏర్పడిరది ఇది. ఇది తొలిగితే అదీ తొలగుతుంది. అప్పుడు మిగిలేది ఆత్మచైతన్యం ఒక్కటే. దీన్ని బట్టి ఆత్మకు భిన్నంగా జీవుడు లేడు అని అర్థమైంది.

ఇక జగత్తు. కార్యకారణసంబంధం ద్వారా జగత్తు లేదని నిరూపించ బడుతుంది. దేనినుంచి ఒకటి జన్మిస్తుందో అది కారణం. ఏది జన్మిస్తుందో అది కార్యమ్‌. సాక్షి ఆత్మచైతన్యం. దాని ద్వారా ఈ ప్రపంచమంతా జనించింది. ఆత్మ కారణం. ప్రపంచం కార్యం. ఈ రెంటికీ భేదం ఉండరాదు. బంగారానికి ఉన్న గుణాలే ఆభరణాలకున్నట్లు. మట్టికున్న గుణాలే కుండకున్నట్లు అన్నమాట. ఆత్మకున్న గుణాలే ప్రపంచానికుంటాయి. ఆత్మకున్న గుణాలేవి? సత్తు, చిత్తు. సత్తు అంటే ఉండడం, చిత్తు అంటే ప్రకాశించడం. ఈ రెండు గుణాలే ప్రతిపదార్థానికీ ఉన్నాయి. నామరూపక్రియలనే మూడు కూడా సచ్చిత్తులకన్నా వేరుకావు. ఇవీ ఆత్మరూపమే. కాబట్టి జగత్తు కూడా ఆత్మకన్నా భిన్నం కాదు అని తేలింది.ఈ సిద్ధాంతాన్నే ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. కానీ అనుభవంలో మనకు వేరుగా కనిపిస్తుంది. దీనికి కారణం అజ్ఞానం. సత్యమసత్యంగా, అసత్యం సత్యంగా కనిపించడమే అజ్ఞానం. నిత్యసిద్ధమైన ఆత్మ దర్శనమైనప్పుడే మనకు నిజమైన క్షేమం కల్గినట్లు. ఇది ఎలా సాధ్యం. దృష్టిని మార్చుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమైతుందిది. ఉదాహరణకు మసక చీకటిలో తాడును పాముగా భ్రమించడం అది తాడనే సత్యజ్ఞానం లేకపోవడం వల్లనే. అదే వెలుతురులో తాడును చూసినప్పుడు అంతవరకున్న సర్పభ్రాంతి పోయింది. అంటే దృష్టి మారిందన్నమాట. మనకు కనిపించేదంతా అవాస్తవం అన్న దృష్టి కల్గిన మరుక్షణమే అనాత్మప్రపంచం మాయమై ఆత్మైకత్వం అనుభవానికి వస్తుంది. దీనినే ఉపనిషత్‌ భేదరూపంగా ప్రారంభంలో చాలా విధాలుగా వివరిస్తూపోతుంది. మన అనుభవాన్ని కాదను కుండా విశ్వాసం కలిగిస్తూ క్రమంగా భేదరూపంగా జగత్తును ఆరోపించి సహేతుకంగా అది కాదని విచారిస్తూ నిరూపిస్తుంది. దీనితో అనాదిగా మనలో పేరుకున్న భేదవాసన తొలగి, అభేదవాసన ఏర్పడుతుంది. దీనినే అధ్యారోపవాద న్యాయమని తర్కశాస్త్రం పేర్కొంటుంది. అఖండమైన ఆత్మచైతన్యాన్ని అందుకోవడమే ఉపనిషత్తుల లక్ష్యం. దీన్ని మాండూక్యం ఏవిధంగా నెరవేర్చిందో చూద్దాం.

పైన పేర్కొన్న ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఇదొక్కటే చాలని చెప్పే శాస్త్రవాక్యం. ‘‘మాండూక్యమేకమేవాలం’’. అది ఎట్లో చూద్దాం. మానవుని అనుభవములన్నింటిని అన్ని దశలలోనున్న వానిని గణించి, వాని ఆధారంగా పరమతత్త్వమును వేదాంతశాస్త్రం సిద్ధాంత పరుస్తుంది. ఈ మాండూక్యోపనిషత్తు ప్రాణుల మూడవస్థలను (జాగ్రత్‌, స్వప్న, సుషుప్తులు) లోతుగా వివేచించి నిగ్గు తేలుస్తుంది. ఇందు 12 మంత్రములున్నాయి. ఇవి అత్యంత సంగ్రహములుగా ఉన్నాయి. వీటికి శంకరుల పరమగురువులు గౌడపాదాచార్యులు కారికల రూపంలో వివరించిరి. కారికలు లేకున్న ఇది సంపూర్ణము కాదు. శ్లోక రూపములో ఉన్న వ్యాఖ్యానములే కారికలు. వీటికి శంకరులు భాష్యమును సంతరించిరి. దానికి తెలుగు సేతయే ప్రకృత గ్రంథము. మహావాక్యములలోని ‘‘అయమాత్మా బ్రహ్మా’’ అనేది అధర్వణ వేదవాక్కును ఈ ఉపనిషత్‌ గ్రహించినది. ‘‘మనలోని ప్రత్యగాత్మయే ఆ పరమాత్మయగు బ్రహ్మ’’ అని నిరూపించుచున్నది.

మొత్తం 215 కారికలు నాలుగు అధ్యాయాలుగా విభజింపబడినాయి.

  1. ఆగమ ప్రకరణము ... 29

  2. వైతథ్య ప్రకరణము.... 38

  3. అద్వైతప్రకరణము... 48

  4. ఆలాత ప్రకరణము... 100

కారిక భాష్యము కాదు. ఆ రెంటికి గల భేదాన్ని చూద్దాము.

భాష్యము: ప్రతి సూత్రమునకు, ప్రతి పదమునకు సంపూర్ణ వివరణ, సమగ్ర వర్ణనలు కలిగి ఉంటుంది. (గద్యరూపం).

కారిక: తనకు ముఖ్యమని తోచిన వానినే వివరిస్తుంది. (శ్లోకరూపం). సంగ్రహంగా గంభీరంగా ఉండే ఉపనిషద్రహస్యాలను వివరించడంలో కారికాకారుని ప్రజ్ఞాపాటవాలు తెలుసుకుంటాము. తురీయమగు అద్వైత బ్రహ్మతత్త్వాన్ని సులభముగా బోధిస్తాయి ఈ కారికలు.

ప్రకరణ పరిచయము:

  1. ఆగమ ప్రకరణము: దీనిలో జాగ్రత్స్వప్నసుషుప్త్యవస్థలను, తదను భవములను, విశ్లేషించి, వివరిస్తూ వాటికి పైనున్న తురీయావస్థను మనబుద్ద్ధి గ్రహించునట్లుగా వివరించబడినది.

  2. వైతథ్య ప్రకరణము: జగత్తు మిథ్య యని వాద ప్రతివాదముల ద్వారా నిరూపించబడిరది. జాగ్రత్‌, స్వప్నం రెండూ ఒకటేనని, భేదంలేదని అది నిజమైతే ఇదికూడా నిజమే, అది మాయయైతే ఇది కూడా మాయే అని స్థాపించబడిరది.

  3. అద్వైత ప్రకరణము: దీనిలో విశేషంగా అస్పర్శ యోగం అనే ఒక కొత్త సాధనా విధాన్నాన్ని వివరిస్తూ అజాతవాదం ద్వారా సత్యతత్త్వమే పరమాత్మ అని నిరూపిస్తాడు.

  4. ఆలాత శాంతి ప్రకరణము: ఈ ప్రకరణంలో జగత్కారణత్వకల్పనే మూర్ఖత్వమని, ఆలాతమును (కొఱవి) తిప్పడం ద్వారా ఏర్పడే వివిధాకృతులతో జగత్తును పోల్చి, మిథ్యగా నిరూపిస్తూ, పరమసత్యం అజం, శాశ్వతం, అద్వైతం అని నిరూపించడము జరిగింది.

ఓంకారం విశ్వవ్యాప్త చైతన్యాన్ని సూచించే ఒక శాబ్దిక ప్రతీక. ‘‘తస్య వాచకః ప్రణవః’’ అన్న యోగ సూత్రం దీన్ని వివరిస్తుంది. ఓంకారంలోని మూడు మాత్రలు అ, ఉ, మ. మాత్ర అంటే కొలిచేది అని అర్థం. ఓంకారాన్ని ఇవి కొంత కొంత కొలుస్తున్నాయి. ఇవి కాక నాల్గవది ఒకటుంది. అది కొలవబడేది. అందుకే అది అమాత్ర. ఇదే నిశ్శబ్దరూపమైన తురీయావస్థ. ఈ నాల్గు ఓంకారంలో

ఉన్నట్లే ఆత్మకు గూడా నాల్గు పాదాలున్నాయి. ‘‘సోయమాత్మా చతుష్పాత్‌’’. జాగ్రత్‌, స్వప్న, సుషుప్తులు పరిశుద్ధ చైతన్యం ఇవే ఈ నాల్గు పాదాలు. ఈ చైతమ్యమే ఓంకారంలోని అమాత్రయైన తురీయం. మొదటి మూడు పాదాలు ఈ నాల్గవ దాన్ని చేరడానికి సాధనాలు. నాల్గు పాదాలు అంటే జంతువులకున్నట్లు విడివిడిగా నాలుగు ఉంటాయనికాదు.ఒక రూపాయలో నాలుగు పావులాలున్నట్లు రూపాయలో కనిపించవు కదా. పావులా అర్ధలో, అర్ధ మొప్పావలాలో, ముప్పావలా రూపాయలో లీనమైమట్లు ఉంటాయి. అట్లే జాగ్రత్‌ స్వప్నంలో, స్వప్నం సుషుప్తిలో, సుషుప్తి చివరకు సమాధిలో చేరిపోతాయి. ‘‘పాదా మాత్రా మాత్రాశ్చ పాదాః’’ అని మాత్రలకు పాదాలకు భేదంలేదని ఉపనిషత్‌ బోధిస్తుంది. అ కారం జాగ్రత్‌ను, ఉ కారం స్వప్నాన్ని, మ కారం సుషుప్తిని సూచిస్తాయి. ఆయా దశల అధిష్టానాన్ని క్రమంగా విశ్వ తైజస ప్రాజ్ఞులని వ్యవహరిస్తారు. ఇవే స్థూల సూక్ష్మ కారణ దేహాలనుకూడా పేర్కొంటాయి. ఇది వైయక్తిక జీవతత్త్వము. ఇదే సమష్టిగా మారినప్పుడు స్థూలసూక్ష్మకారణ జగత్తులుగా పరిణమిస్తాయి. ఇట్లే త్రిపుటిగా నున్నవన్నీ ప్రణవము ద్వారా సూచించబడతాయి. ప్రణవోపాసకుడు మొదట ఈ సిద్ధాంతాన్ని గాఢంగా మదిని నిలిపి, గురుముఖంగా ఉపదేశం పొంది, క్రమంగా సాధన చేయాల్సి ఉంటుంది. ఒక మాత్రలో మరొక మాత్రను కలిపేస్తూ సాధన చేయాల్సి ఉంటుంది. మూడూ చివరకు తురీయంలో కలిపివేయడమే ఈ సాధనా పద్ధతి. ఓంకారాన్ని ఉచ్చరించడంలో అ ఉ లు స్పష్టంగా పలుకవు. ఓ అనే ధ్వనిస్తుంది. అంటే సహజంగానే ఒకదానిలో ఒకటి లీనమై ఉన్నట్లే. ఓంకారం మాత్రం నాదంగా పరిణమిస్తుంది. రెండు ఓంకార నాదాలమధ్యనున్న నిశ్శబ్దాన్ని గమనిస్తే తురీయం అర్థమైతుంది. ఒకదానిలో ఒకటిలీనమైతూ పరిశుద్ధమైన ఆత్మగా నిలిచిపోతాయి.

సారాంశం: అవస్థాత్రయం లయం కావటమే ఇక్కడ జరుగుతున్న కార్యం. వాటితో పాటు విశ్వ తైజస ప్రాజ్ఞులు, స్థూల సూక్ష్మకారణ తత్త్వాలు అన్నీ లయం కావలసిందే. ఇదంతా అనాత్మ. అనాత్మను ఆత్మలో లయం చేయడమే మనకు మాండూక్యం ఓంకారాన్ని ఆలంబనంగా చేసుకొని చేసే సాధనగా ప్రబోధిస్తుంది.

ఓమ్‌ తత్సత్‌