మనమంతా నిత్యం చదువుతూ వింటూ పారాయణం చేస్తూ భక్తి శ్రద్ధలతో నారాయణుని స్తుతిస్తూ సర్వకామ్యాలు సిద్ధింప జేసుకునేందుకు మనకు లభించిన సులభోపాయం విష్ణుసహస్రనామ స్తోత్రం. అసలు సహస్రనామమంటే ఏమి? వెయ్యి పేర్లు అని మనకందరికి తెలిసినదే! సహస్రం అంటే అనంతం అని కూడా మరొక అర్థముంది. ఒక్క నామం పరమాత్మ యొక్క ఒక ఒక తత్త్వాన్ని తెలుపుతుంది.

ఉదాహరణకు ‘‘విశ్వం’’ అనే నామం పరమాత్మ యొక్క సర్వ వ్యాప్త చైతన్య తత్త్వాన్ని సూచిస్తుంది. జీవ, జగత్‌, ఈశ్వర ఈ మూడుగా మన వ్యవహారం నడుస్తూ ఉంది. మనకు నిత్యానుభవంలో మొదటి రెండూ ఉన్నాయి. మూడవది మన విశ్వాసం. జీవభావంతో నీవు పరిమితమైన ఒక ఆకారం దానికి ఒక పేరు తగిలించుకుని సర్వవ్యవహారం చేస్తున్నావు. నీవు తప్ప మిగిలినదంతా జగత్తు. అంటే నీ కుటుంబం, బంధువులు, మిత్రులు వంటి సర్వజనులు వారితో నిత్యం నీవు జరిపే సకల వ్యవహారాలు సమస్త వస్తు ప్రపంచం. ఇంక మూడవది ఈశ్వరుడు. అదే పరమాత్మ, దేవుడు. మనకు నచ్చిన ఆకారాన్ని నచ్చిన పేరుతో పిలుస్తూ తెలిసిన, నచ్చిన విధానంలో పూజ, స్తోత్ర, జప, ధ్యాన పద్ధతుల్లో ఉపాసిస్తున్నాం ఈశ్వరతత్త్వాన్ని. ఇక్కడ ఈశ్వరుడు అంటే శివుడు అని మాత్రమే అర్థం తీసుకోరాదు. సర్వ జగన్నియంత. సృష్టి స్థితి లయ కారకుడని అర్థం గ్రహించాల్సి ఉంది. ఇట్టి ఈశ్వరుని సర్వతోముఖమైన అనంత తత్త్వాలను సహస్ర విధాలుగా తెలిపేదే సహస్రనామం. దీనినే ఆదిశంకరులు తమ భాష్యమ్‌లో వివరించినారు.

‘‘సగుణే బ్రహ్మణి సవికారే చ సర్వాత్మకత్వాత్‌ తేషాం శబ్దప్రవృత్తి హేతూనాం సంభవాత్‌ సర్వే శబ్దాః పరస్మిన్‌ పుంసి వర్థనే’’

సర్వాత్మకుడైన పరబ్రహ్మం నిర్గుణమైనప్పుడు ఏవీ వుండవు. అదే సగుణంగా మారినప్పుడు ఈ సర్వ జగత్తుగా తన్ను తాను పరిణమింప జేసుకుంటుంది. ఆ పరిణామంలో మొదటిది శబ్దం. అదే ప్రణవం. (ఓమ్‌) ఇది ఆకాశతత్త్వం సర్వవ్యాపకం. ఆకాశాన్ని అనంత తత్త్వమునకు ప్రతీకగా పేర్కొంటారు. అదిలేని చోటే లేదు. బైటా లోపలా అంతటా వ్యాపించినదే ఆకాశం. సర్వలోకాలు గ్రహాలు నక్షత్రాలు అన్నీ ఈ ఆకాశంలోనే పరిభ్రమిస్తున్నయి. దీనినే విశ్వం, విష్ణుః అనే రెండు నామాలు మనకు జగత్తుగా కనిపిస్తూ సర్వ వ్యవహారాలను నడిపించే చైతన్య తత్త్వమును తెల్పుతున్నయి. ఇట్టి పరమపురుషుని మాటల్తో పేర్కొనే ప్రయత్నమే సహస్ర నామ స్తోత్రం. వేదాది సర్వశబ్ద ప్రపంచం నిరంతరం చేసెడి యత్నమదే. (కొనసాగుతుంది)

ఉపాసన విద్యలెన్నో ఉపనిషత్తులలో చెప్పబడినాయి. అవి అన్నీ నామసహస్రంలో పొందుపర్చ బడినాయి. సహస్రనామం మొత్తంగా తీసుకుంటే మాలామహా మంత్రమవుతుంది. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రంగా మారుతుంది. 27 నక్షత్రాలు ఒక్కొక్క దానికి 4 పాదాలు. మొత్తం 108. సహస్రనామంలో మొత్తం 108 శ్లోకాలు. ఆయా జన్మ, నామ నక్షత్రపాదానికి తద్దోష నివారణకు ఆయా శ్లోకం మంత్రంగా విధి విధానంతో జపిస్తే తప్పక ఫలితం లభిస్తుంది. లేదా ఒక్కో నామం దాని అర్థాన్ని భావిస్తూ ఆయా ఫలితాలకోసం జపించవచ్చు. ఇవన్నీ ఉపసనా విద్యలే! కేవలం కామ్యాలకే కాకుండా ఆముష్మిక ఫలితాల కోసం కూడా సహస్రనామాన్ని ఉపాసించవచ్చు. పురాణాలలో, సంహితలలో, తంత్రాలలో, యామళములలో, డామరములలో, ఉక్తముల్లో, అనుక్తముల్లో ఈ పద్ధతులు ఎన్నో ఉన్నాయి. సర్వోపాసనా గమ్యుడిగా విష్ణువు సహస్ర నామంలో నిరూపించబడినాడు. చతుర్భుజుడుగా విష్ణువు నాలుగాయుధములు ధరించినట్లు తీర్మానించబడిరది. మరి ఈ ఆయుధాలేవి? సహజంగా శంఖం, చక్రం, గద, ఖడ్గం అని పేర్కొంటాం. కాని సహస్రనామంలోనే ఒకచోట ఆయుధషట్కం, మరొకచోట ఆయుధ పంచకం చెప్పబడిరది. ‘‘శంఖభృన్నందకీచక్రీ శార్‌ఙ్నగధన్వా, గదాయుధః రథాంగపాణిః’’. ఇక్కడ చెప్పిన ఆయుధాలు శంఖం, నందకం, చక్రం, ధనుస్సు, గద, రథాంగం. చక్రం అన్నా రథాంగం అన్నా ఒకటే అర్థం. ‘‘చక్రం రథాంగం ఇత్యమరః’’. కరోతి రథగమనం ఇతి చక్రం అని వ్యుత్పత్తి.రథాన్ని నడిచేటట్లు చేసేది అని అర్థం. ఇంకోరకంగా అమరం లోనే ‘‘స్యాత్‌ రథాంగం అవస్కరః’’ అని కూడా ఉంది. తదుచితస్థానే నిక్షిప్యత ఇతి అవస్కరః అని వ్యుత్పత్తి. ఆయా స్థానాలలో అవసరం కొద్దీ ఉంచబడేది అని అర్థం. రథానికి కాడి, నొగ, వంటివని... అట్లే చక్రమ్‌ కూడా. దీని గురించి పండితులు ఇంకా లోతైన విమర్శ చేసి నిగ్గు తేల్చాల్సి ఉంది.

‘‘గదీ శార్జ్గీ శంఖీ చక్రీ చ నందకీ’’ ఇక్కడ 5 ఆయుధాలుగా చెప్పినా ప్రసిద్ధంగా చతుర్బాహువులల్లో శంఖ చక్ర గదా ఖడ్గం మాత్రమే! కానీ సర్వ ప్రహరణాయుధునిగా మళ్ళీ మళ్ళీ చెప్పబడిరది. అన్ని రకాల ఆయుధములను ధరించిన రూపం మనకు తెలిసి విశ్వరూపం.కాని ఇక్కడ ఒక రహస్యం ఉంది. అనంతాకారాలలో అనంత విభూతులుగా అభినవగుప్తుడు ‘‘నాతీవ ప్రకాశ్యం, నాతీవ గోప్యం’’ అన్నాడు. బైటికి కనిపించేవి కొన్నైతే, కనిపించనివి కొన్ని. మరొక లెక్క ప్రకారం నాలుగు ఆయుధాలనే నాలుగు చేతులలో మార్చి మార్చి భావిస్తే 24 ఆకార విశేషాలు వస్తాయి. ఒక్కొక్క ఆకృతి ఒక్కొక్క నామంగా ఏర్పడుతుంది. అవే కేశవనామాలు. దీన్నే గణితశాస్త్రంలో nfactorial formula n! Rnx(n-1)x(n-2) పేర్కొంటారు. ఇంకా బాగా అర్థమయ్యేందుకు 4 ఆయుధాలకు వరుసగా 1) శంఖం, 2) చక్రం, 3) గద, 4) ఖడ్గం - అని అంకెలు వేసుకుంటే నాలుగు చేతులలో వీటి క్రమం మారినప్పుడు ఆకారం మారుతుంది. నామం మారుతుంది. దీన్ని కొంచెం లోతుగా భావన చేస్తే అర్థమైతుంది. కొన్ని

ఉదాహరణలు చూద్దాం.

1వ రూపంలో ఆయుధ క్రమం 1, 2, 3, 4.

2వ రూపంలో ఆయుధ క్రమం 2, 1, 3, 4.

3వ రూపంలో ఆయుధ క్రమం 1, 2, 4, 3.

4వ రూపంలో ఆయుధ క్రమం 1, 3, 2, 4.

ఇట్లే మారుస్తూ పోతే 24 ఆకారాలు సిద్ధిస్తాయి. ఇంకా విస్తరించ గలిగితే సహస్ర రూపాలుగా కూడా ఉపాసించవచ్చు.

శ్రీ మహావిష్ణువు యొక్క 24 చతుర్వింశతి నామాలు కేశవాయనమః నుండి శ్రీ కృష్ణాయనమః వరకు ఉన్న 24 విశేష రూపాలు శంఖ చక్ర గదా ఖడ్గ ధారిగా నున్న వివరాలు పాంచరాత్ర సంహిత, బ్రహ్మ పురాణము, అహిర్బుధ్న్య సంహిత వంటి గ్రంథాలలో పరిశీలించవచ్చు. ఇట్లే చతుర్భుజుడైన శివునికి, చతుర్భుజ ఐన శ్రీదేవికి కూడా నామరూప భేదాలను రూపొందించవచ్చు. ఉపాసనలో ఇవి చాలా ఉపకరిస్తాయి. పాశ, అంకుశ, కోదండ, సాయకము అనే ఆయుధాలు ఇదే విధానంలో విస్తరిస్తే 24 భేదాలతో దేవీ నామరూపాలు ఏర్పడతాయి.

ఉపాసక సాధక అనుగ్రహం కోసం కొన్ని రూపాలనే నామాలు సూచిస్తున్నాయి. అష్టభుజ దేవిగా హస్తగతాయుధముల విన్యాస బేధంతో కొన్ని వేల రూపాలు సాధించవచ్చు. విష్ణు సహస్రనామంలో ఈ రహస్యాలు నిక్షిప్తమైనాయి. పరిశోధక పండితులు, మంత్రరహస్యవేత్తలు దీనిపై సంశోధించవలసి ఉంది. ఆది శంకరులు నామాక్షరోపాసనను కూడా ‘‘నామవతః ఉపాసనం’’ అన్నారు.

విష్ణుసహస్రనామంలో 108 శ్లోకాలు. శ్లోకానికి 32 అక్షరాలు. మొత్తం 108  32 = 3456 అక్షరాలు. ఇన్నివిధాలుగా సహస్రనామాక్షరోపాసన.

108 సంఖ్య. విశేషాలు: జీవుని ఉచ్ఛ్వాస నిశ్శ్వాసల సంఖ్య రోజుకు 21600. ఇది సోహం ప్రక్రియ. ఇదే హంసోపాసన. 108 పూసల జపమాలతో 200 సార్లు జపిస్తే వచ్చె సంఖ్య 21600. ఇది హంస మంత్ర జపం.

మరొక రకంగా 1+0+8=9. దీనిలో 1 అద్వితీయ బ్రహ్మం. 0 మాయా మయ జగత్తు. 8 అష్టధా ప్రకృతి. ఈ 8 కి 1 కలిపితే 9. తొమ్మిది ప్రణవం. ఉద్గీథ కూడా ఇదే. బ్రహ్మము ఇదే.

విష్ణువు: ‘‘నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్‌ అణూపమ తస్యాః శిఖాయాః మధ్యే పరమాత్మా వ్యవస్థితః’’ అని నారాయణ సూక్తమ్‌లో చెప్పిన సర్వాంతర్యామి యే విష్ణువంటే. ఈ తత్త్వమే సహస్ర నామంలో ప్రతిపాదింపబడిరది. పారమార్థిక సత్య స్వరూపుడు మరియు వ్యావహారిక సత్య స్వరూపుడు ఈ తత్త్వమే. సగుణ నిర్గుణ సమైక్యమంగీకరించువారి భావ వ్యూహములు భగవత్పాదుల భాష్యంలో ఉన్నవి. బ్రహ్మాద్వైత ప్రవక్త శంకరుడు విష్ణు సహస్ర భాష్యంలో ప్రతిపాదించినది అద్వైత సిద్ధాంతమే. శంకరుని ప్రసిద్ధ రచన ‘‘విష్ణుపాదాది కేశాంత-కేశాది పాదాంత’’ స్తుతిలో కూడా దీనినే ప్రతిపాదించినారు. నిర్వికారుడు శుద్దుడు నిత్యుడు పరమాత్మగా విష్ణువును సహస్ర నామం స్మరిస్తుంది. ఇది జన్మ సంసార బంధ మోచకం. దీని వివరణే ధర్మజుని ప్రశ్నలు ఆరు. దానికి భీష్ముని సమాధానమే విష్ణు సహస్రనామం.