ఇది అనాదిగా మనలనందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఇదే ధర్మజునికి కూడా ఏర్పడిరది. ‘‘యదాజ్నయా ప్రవర్తంతే సర్వే’’ అని శంకర భాష్యం. అంటే వేద పురాణ న్యాయ మీమాంస ధర్మశాస్త్రాలలో సమస్త విద్యలలో కీర్తింపబడినవాడు ఒక్కడే ఐన దేవుడెవరు? ఎవరి ఆజ్ఞకు లోబడి సర్వజగత్తు ప్రవర్తించుచున్నదో వాడు అని అర్థం. అట్టి వాడెవరు అని ధర్మజుని మొదటి ప్రశ్న. భీష్ముని సమాధానము ఇది.
‘‘పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం
దైవతం దేవతానాం చ భూతానాం యో అవ్యయః పితా’’
‘‘యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్య శిల్పాది కర్మ చ
వేదాశ్శాస్త్రాణి విజ్నానమేతత్ సర్వం జనార్దనాత్’’
పావనమౌ తీర్థాదులలో పవిత్రం, మంగళములకెల్ల మంగళము, దేవతలకెల్ల దేవుడు, సర్వ భూతములకు(ప్రాణులకు) జనకుడో అతడే అవ్యయుడు.
యోగము జ్ఞానం సాంఖ్యం వంటి సర్వ సిద్ధాంతాలు వేద శాస్త్రాలు శిల్పం సంగీతం వంటి కళలు ఇవన్నీ ఆ జనార్దనుని నుండే ఉద్భవించినాయి. సర్వ విజ్ఞానసారం ఆ పరమాత్మే.ఆయనే విష్ణువు. ఆయనే దైవతమూ. పరమాత్మ పరమ పవిత్రుడెందుకైనాడు? ధ్యాన, దర్శన, కీర్తన, స్తుతి, పూజా, స్మరణ, ప్రణామముల చేత సర్వ పాపాలను పోగొట్టేవాడు కాబట్టి. ఇంతే కాకుండా సంసార హేతు భూతమైన పుణ్య పాప కర్మలను, వాటికి కారణమైన అజ్ఞానాన్ని, స్వస్వరూప జ్ఞానంచేత పోగొట్టే వాడు కాబట్టి పరమ పవిత్రుడు.
మంగళంఅంటే సుఖం, సుఖసాధనం, సుఖజ్ఞాపకం. వీటిలోకూడా పరమానంద స్వరూపం కనుక పరమ మంగళం.
ప్రకాశనాదుల చేత సర్వోత్కృష్టుడు కనుక దేవదేవుడు.
2. ఒకేఒక పరాయణమేది? (కిం వాప్యేకం పరాయణం):
‘‘భిద్యతే హృదయ గ్రంధిః ఛిద్యంతే సర్వ సంశయాః
క్షీయంతేస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే’’
‘‘నాన్యః పంథా విద్యతేయనాయ’’
బ్రహ్మవిత్ బ్రహ్మ్హైవ భవతి’’
- వంటి ఉపనిషద్వాక్యాలన్నీ దేన్ని ప్రతిపాదిస్తున్నాయో అదే ఏకం పరాయణం.విద్యాస్థానాలల్లో ప్రాప్తవ్య స్థానంగా ఏది కీర్తించబడిరదో అంటే అన్నివిద్యలకూ లక్ష్యం యేదో అది పరాయణం. లౌకిక, శాస్త్ర, వేద, కళా, కార్మిక విద్యలన్నీ సంపూర్ణ లక్ష్యాన్ని అంటే మోక్షాన్ని సాధించలేవు. అందుకే ‘‘అధ్యాత్మ విద్య విద్యానాం’’ అని విభూతియోగంలో పరమాత్మ తన స్వరూపం అధ్యాత్మ విద్యగా పేర్కొన్నాడు.అదొక్కటే పరమగమ్యాన్ని సాధిస్తుంది. దీనితో మాత్రమే హృదయ గ్రంధి విడివడుతుంది. అంటే సంశయాలు తొలిగి సదసద్వివేకం కల్గుతుంది. అట్లే దేన్ని తెలుసుకుంటే ఆనందమయమైన మోక్షం లభిస్తుందో అది పరాయణం. దేని సాక్షాత్కారంతో తాను దానిగా మారుతాడో అంటే ఆత్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మానుభవ సంపన్నుడవుతాడో అది పరాయణం. లోకులకు ఏది తప్ప మరో మార్గాంతరము లేదో అది పరాయణము. అదే ఒక్కటి. ‘‘ఏకం సత్ విప్రాః బహుధా వదంతి’’ అదే నిత్య సత్య శుద్ధ బుద్ధ బ్రహ్మాత్మ భావన. అదే పరమాత్మ. దానికి చేరే మార్గమే పరాయణం.అయణం అంటే గమనం.పరం వైపు చేసే సాధనే అది,అది ఏది? అని ధర్మజుని ప్రశ్న. దీనికి గాంగేయుని సమాధానం.
‘‘పరమమ్ యో మహత్తేజః పరమం యో మహత్తపః
పరమం యో మహద్బ్రహ్మ పరమః యః పరాయణం’’
ఏది ఉత్కృష్టమైనదో, సూర్యునకు కూడా తేజస్సునిచ్చే సర్వప్రకాశమో, జ్యోతిస్సులకెల్ల జ్యోతిస్సో, వేదశాస్త్ర పురాణాదులచే కీర్తింపబడుచున్న చైతన్య రూప మహాతేజోరూపమో, సర్వజగన్నియంత ఎవరో, వాయు సూర్య అగ్ని ఇంద్ర మృత్యు దేవతలు కూడా ఎవరికి దాసులో, పరమతపో రూపమెవరో, సర్వేశ్వరుడుగా కీర్తింపబడే అపరిమితైశ్వర్య శాలి ఎవరో అతడే పరాయణం. పరంబ్రహ్మ, సత్యజ్ఞానానంద లక్షణమై పూజనీయమైన పరబ్రహ్మ స్వరూపమో, ఎవరు పునరావృత్తి శంకా రహితమైన పరమప్రాప్య స్థానమో ఆ విష్ణువే సర్వ భూతములకు పరాయణం.