ఈ ప్రశ్నకు సమాధానం గా క్రింది రెండు శ్లోకాలు చెప్పబడినాయి.

‘‘అనాది నిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం

లోకాధ్యక్ష్యం స్తునన్నిత్యం సర్వ దుఃఖాతిగో భవేత్‌’’

‘‘బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తి వర్ధనం

లోకనాథం మహద్భూతం సర్వభూత భవోధ్భవం’’

ప్రతి ప్రాణి లేదా పదార్థం పుట్టుక నుండి మరణం వరకు ఆరు దశలను కల్గి ఉంటుంది.ఈ ఆరు వికారాలు (మార్పులు) లేనివాడు సర్వవ్యాపకుడు విష్ణువు. బ్రహ్మాదులకు ఇంద్రాది దిక్పాలకులకు అధినేత. సర్వ సృష్టిని తన్నుతానుగా ఉద్భవించజేసుకొనెడి దేవుడు. అతన్ని నిరంతరం స్తుతిస్తే సర్వ దుఃఖాలనుండి (ఆధ్యాత్మిక, ఆధి దైవిక, ఆధ్యాత్మిక) విముక్తుడైతాడు.

ఈ శ్లోకమ్‌ లోకూడా ఇంకా కొన్ని విశేషాలు పరమాత్మకు చెప్పబడినాయి. బ్రహ్మణ్యుడు అంటే సృష్టికర్త ఐన బ్రహ్మకు బ్రాహ్మణునికి వేదమునకు హితుడు. సర్వధర్మములు తెలిసినవాడు. లోకుల కీర్తిని పెంచేవాడు. లోకాలనన్నింటిని శాసించేవాడు. పరమార్థ సత్యమైనవాడు కాబట్టి మహద్భూతం. ఇట్టివాడైన విష్ణువును నిత్యం స్తోత్రం చేయవలెను.

4. కమర్చన్తః మానవాః శుభం ప్రాప్నుయుః? ఎవరిని అర్చించడం ద్వారా లోకులు శుభాన్ని పొందగలరు?:

అనెడి నాలుగవ ప్రశ్నకు సమాధానం ఇది.

‘‘తమేవచార్చయన్‌ నిత్యం భక్త్యా పురుషమవ్యయన్‌

ధ్యాయన్‌ స్తువన్‌ నమస్యన్‌ చ యజమానిస్తమేవచ’’

అవ్యయుడు, నిత్యుడు ఐన దేవదేవుని భక్తి తత్పరలతో ధ్యానిస్తూ, బాహ్యాంతర విధానములతో అర్చిస్తూ, సహస్రనామముతో స్తుతిస్తూ, నమస్కరించేడి భక్తుడు సకల శుభాలను పొందగలడు. స్తుతులు, నమస్కారములు పూజలో (శోడషోప చారాలలో) భాగాలౌతాయి. అర్చన రెండు విధాలు. ఆంతరం, బాహ్యం. కేవలం మనస్సులోనే ఏవిధమైన బాహ్యోపకరణాలు లేకుండా చేసేది.దీన్నే అంతర్యాగం, మానసిక పూజా అంటాం. దీనికి చాలా సాధన, ఏకాగ్రత, ఆధ్యాత్మికతావివేకం అవసరం. నేటికాలంలో దైవసంబంధమైన ప్రతిదాన్ని ఆధ్యాత్మికం అంటున్నారు. అది చాలా తప్పు. ఆది భౌతికం, ఆధిదైవికం, ఆధ్యాత్మికం ఇదీ క్రమం. నిత్యపూజలు ( ఇంట్లోగాని, గుడిలో కాని) ఆధ్యాత్మికం కావు. సూక్ష్మ శరీరతత్త్వాన్ని ఆధ్యాత్మమని గీత చెప్పింది. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగమంతా అదే. అభిషేకాలు, అర్చనలు, హారతులు ఇవన్నీ ఆధ్యాత్మికత కాది. స్థూల సూక్ష్మ తత్త్వభేదాన్ని స్పష్టంగా తెలుసుకొని స్థూలమనబడే దేనితో కూడా సంబంధం లేకుండా కేవలం సూక్ష్మమ్‌ తోనే జరిగే ప్రక్రియనే ఆధ్యాత్మంగా చెపాల్సిఉంది.

రెండవది బాహ్యార్చన, పూజాద్రవ్యాలతో ఎదుట విగ్రహం, పటంవంటి వానిని ఉంచుకొని చేసేది. ఇది అందరం నిత్యం చేస్తుండేదే. లేదా ఇంకో విధమైన వ్యాఖ్యానంగా మానసికమైన ధ్యానం, వాచికమైనస్తోత్రం, కాయికమైన నమస్కారంగా చెప్పబడ్డాయి.