ఉత్తమ ధర్మమేది?:

దీనికి సమాధానంగా చెప్పబడ్డ శ్లోకమిది

‘‘ఏష మే సర్వ ధర్మాణాం ధర్మోధికతమో మతః

యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరస్సదా’’

అర్చన రూపమగు ధర్మము సర్వోత్తమం.కారణం ఏమి? అంటే దీనికి పురుషాంతరాపేక్ష గాని, ద్రవ్యాన్తరాపేక్ష గాని, దేశకాలాది నియమాపేక్షగాని లేకపోవడమే. నిష్కామ కర్మనే ఇక్కడ చెప్పబడిరది. కృతయుగంలో ధ్యానం, త్రేతలో యజ్ఞం, ద్వాపరలో అర్చన, కలిలో నామసంకీర్తనలు సమాన ఫలాన్నిస్తాయి. ఈ సన్నివేశం ద్వాపరయుగంలోనిది కావున అర్చననే ఉత్తమధర్మంగా చెప్పబడిరది. పూజ, స్తుతి, అర్చన, జపం, ధ్యానం ఏది చెసినా నిష్కామమ్‌గా అంటే ఫలం కోరకుండా భగవదర్పణంగా చేయడం ఉత్తమధర్మం. కడకు మోక్షంకూడా కావాలనుకోరాదు. అది కూడా కోరికే. అందుకే గీతలో మోక్ష సన్న్యాసయోగం చెప్పబడినది. ఇది నిజంగా సాధ్యమేనా? అన్నది ప్రశ్న. సాధ్యమే! దానికి కావలసినదల్లా నిత్యాభ్యాసమే. ముందుగా సంకల్పం చెప్పరాదు. సంకల్పంలోనే మన కోర్కెల చిట్టా విప్పుతాం. దాని బదులుగా నేను చేసే ప్రతి పనీ కృష్ణార్పణం, రామార్పణం అంటూ చేయడాన్ని అలవాటు చేసుకోవాల. కేవలం పూజలే కాకుండా మనం చేసే ప్రతి పనీ అంటే తినడమ్‌, తాగడం, కూర్చోవడం, లేవడం వంటి ప్రతి పనీ సమర్పణ బుద్ధితో చేయడమే.