దేనిని జపించడంద్వారా ప్రాణులు జననమరణ చక్రం నుండి తప్పించుకో గలవు? ఇది ఆరవప్రశ్న. దీనికి సమాధానంగా
‘‘జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం
స్తువన్నామ సహస్రేణ పురుష స్సతతోత్థితః’’
అని చెప్పబడిరది. స్థావర జంగమాత్మక జగత్తునకంతా ప్రభువు, బ్రహ్మాది దేవతలకు దేవుడు, అనంతుడు, దేశం, కాలం, వస్తువులచే అపరిచ్చిన్నుడు, పురుషోత్తముడైన విష్ణువును సహస్ర నామములచేత నిరంతరం స్తోత్రం చేయువాడు సర్వదుఃఖముల నుండి తొలగును. దీన్ని వివరించుకుంటే జపన్ అనేపదం, జంతు అనే పదం ఒకటి చాలా కీలకములు పై ప్రశ్నలో. జపం అంటే ఒకదాని అర్థాన్ని నిరంతరం భావించడం. ‘‘జపస్తదర్థభావః’’ అనిపతంజలి యోగ సూత్రం. ఇది కేవలం మనస్సులో జరిగే నిరంతర ప్రక్రియ. అట్లే ‘‘మననాత్ త్రాయతే మంత్రః’’ నిత్యం మనసులో భావిస్తూ ఉండడం వల్ల మనలను రక్షించేది అని అర్థం. జపం రెండు విధాలు. ఉచ్చ, ఉపాంశు. బైటికి వినిపించేటట్లు ఉచ్చరించడం. మనస్సులోనే భావించడం. ఈ రెంటిలో ఉత్తమం ఉపాంశు. ఇక జంతు శబ్దం. జన్మకలది జంతువు. సకల ప్రాణులు అని అర్థం. సర్వ ప్రాణులు సహస్రనామజపం వల్ల జన్మ సంసార బంధనాన్ని తప్పిమ్చుకోగలవు.అంటే మోక్షము పొందగలవని తెలుస్తున్నది. భక్తులుగా సర్వ ప్రాణులూ తరించిన నిదర్శనాలు కొల్లలు. ఇంకా లోతుగా భావిస్తే సంసార శబ్దం అవిద్యను అంటే అజ్ఞానాన్ని సూచిస్తున్నది. ఇది బంధహేతువు. దీనినుండి విముక్తి పొందడానికి సహస్రనామ జపం తోడ్పడగలదు. ఇంకా ఇతర ఫలితాలను కూడ ఇవ్వగలదు.
ఈ విధంగా ధర్మజుని ఆరు ప్రశ్నలకు భీష్ముడు సమాధానంగా సహస్రనామ ప్రభావాన్ని వివరించాడు.