శ్రీ విద్య, శ్రీ చక్రము, శ్రీమాతలకు భేదంలేదు.ఇది తెలిసి ఉపాసించే వారు ఉత్తమ స్థాయి ఉపాసకులు.మధ్య, మంద స్థాయి అర్చనలు ఆయా విధానాలను బట్టి తగిన ఫలితాన్ని ఇస్తాయి. వీటిలో మళ్లీ స్థూల సూక్ష్మ కారణ శ్రీచక్రములను భావించి, అర్చించే సాధనలు ఉన్నాయి. భోగ మోక్ష ప్రాప్తికి మనకున్న ఒకేఒక మార్గం శ్రీవిద్య, శ్రీచక్రార్చన.
శ్రీచక్రం అంటే ఏమి? సృష్ఠి జరిగిన క్రమం తెలిపే ప్రతీక. జగన్మాతా పితరుల స్వరూపం. ఇది చక్రరాజం. అద్వితీయ బ్రహ్మంనుండి నిర్గుణ, సగుణ తత్త్వములు, నామరూపాలుగా జగత్తు, జీవుడు, ఏర్పడిన సృష్ఠిక్రమం వంటి పరమ రహస్యాలు శ్రీచక్ర ఉపాసనలో సాధకుడు పరిణితిచెందేకొద్ది తెలుసుకుంటాడు.
అద్వితీయ బ్రహ్మ నిశ్చలం. వాగ్మనో-తీతం. ఆ చిదానంద చైతన్యం ప్రశాంత గంభీర నిశ్చల సముద్రం వంటిది. దానిలో కలిగిన చిన్న అల ఇచ్ఛా శక్తి. నీశ్చల చైతన్యమే శివ. అందునుండి ఉద్భవించిన ఇచ్చ యే శక్తి. ఈ శివశక్తుల సమ్మేళనం కారణంగా ఏర్పడే కార్యమే జగత్తు. ఈ కార్యకారణ సంబంధ సంవిధానం శ్రీచక్రం.
నిర్వికార నిరంజనమైన బ్రహ్మ తత్త్వము (శివ) శక్తి సంపర్కము వలననే స్పందనస్థితిని పొందుతుంది. దీన్ని బిందువులు అని పేర్కొంటారు. స్వప్రకాశ(అ), విమర్శ(హం) బిందువులు. ఈ రెండిరటినుండి ఏర్పడేది మిశ్రమ బిందువు. (అహం). ఇదే నామరూపాలుగామారి జగత్తుగా వ్యవహరిస్తుంది.
‘‘త్రికోణ రూపిణీ శక్తిః బిండురూపః శివః’’ ఇది బ్రహ్మాండ, పిండానడాల విరాట్ స్వరూపం.
ఇదే జగత్ సృష్టి స్థితి లయలకు ప్రతిరూపం.
‘‘అహం పంచాక్షరి స్యాత్, త్వం తు పంచ దశాక్షరి’’ అని తాను పంచాక్షరి మంత్రమని, పరాశక్తిని పంచదశాక్షరీ మంత్రమని సదాశివుడు పేర్కొన్నాడు.
భావనGఉపనిషత్. ఉపనిషత్‌ను సురేశ్వరాచార్యులు ఈ విధంగా నిర్వచించారు. ‘‘అనాత్మ భూతములగు దేహేంద్రియ మనస్సుల యొక్క ప్రవృత హేతువులగు కామాదులను, వాటికి కారణమైన అవిద్యను నిర్మూలించి, అద్వితీయ సచ్చిదానంద బ్రహ్మమును బోధిస్తూ, నిరంతర భావనచే అపరోక్షానుభుతిని కలిగించునది ఉపనిషత్.’’ మరి భావన అంటే ఏమి? అజ్ఞానముతో మనకు తోచినవన్ని భావనలు కాదు. శాస్త్ర ప్రమాణ జనితమైన సర్వాత్మ భావనయే భావన అని తీర్మానించడం జరిగినది. దీనికి సద్గురువు అనుగ్రహం తప్ప మరో మార్గం లేదు. అందుకే ఈ ఉపనిషత్ ‘‘శ్రీ గురుః సర్వ కారణ భూతాశక్తిః’’ అని ప్రారంభం అవుతుంది. మన శరీరం పిండాండం. దీనిలో బ్రహ్మాండం చూడడమే భావనోపనిషత్తు వివరిస్తున్నది. యోగశాస్త్రంలో శ్రీచక్ర దర్శన విద్య ఇదే. ‘‘నవచక్ర రూపం శ్రీచక్రం’’.
1) త్రైలోక్య మోహన; భూపురత్రయం. పాదాలు
2) సర్వాశా పరిపూరక; 16దళాలు. కటిభాగం
3) సర్వ సంక్షోభణ; 8 దళాలు. నాభి
4) సర్వ సౌభాగ్య దాయక; 14 దళాలు. హృదయం
5) సర్వార్థ సాధక; 10 దళాలు. కంఠం
6) సర్వ రక్షాకర; 2 దళాలు. భ్రూమధ్యం
7) సర్వ రోగాహర; 8 దళాలు. లలాటం
8) సర్వసిద్ది ప్రద; త్రికోణం. మస్తకం
9) సర్వానంద మయ; బిందు. బ్రహ్మ రంధ్రం
‘‘వారాహి పితృరూపా, కురుకుళ్ళా బలి దేవతా మాతా’’నే దేహములో సంక్రమించిన మాతా పితరుల అంశాలు (సంస్కారములు, వాసనలు) ఇవే వారాహితత్త్వం. మూలాధారంలో ఇవి ఇమిడి ఉన్నాయి. స్వాధిష్ఠాన చక్రమునందు మాతృరూపంలో కురు కుళ్ళ పాశవిక వృత్తులను సంహరించి కుండలినీ యోగంతో దేహత్రయాభిమానం వీడడం. ఇదే బలిహరణం. స్థూలంగా చేసే జంతు బలి కాదు. ఇంకా విశేషంగా అహంకారం, చిత్తం రెండిరటి మధ్యలో విమర్శ వ్యాపికలో కురుకుళ్ళను ధ్యానించడం అని భాసురానందులు వివరించారు.
‘‘పురుషార్థాః సాగరాః’’ చిద్రూపిణి యొక్క సర్వ వ్యాపకత్వమే నలువైపుల నున్న సముద్రాలు.
4 పురుషార్థాలు (ధర్మ, అర్థ, కామ, మోక్షములు) సముద్రం వలె అనంతమైనవి. ముఖ్యంగా అర్థ కామాలు. పిండాండ అండాండములకు ఏకత్వం చెప్పారు’’
అందుకే ‘‘భోగమోక్షకరీ విద్యా శ్రీవిద్యా’’ అన్నారు. ‘‘దేహో నవరత్న ద్వీపః త్వగాది సప్త ధాతు రోమ సంయుక్తః’’ రత్నములు అంటే సిద్ధులు.దేహమే దేవాలయం అంటే ఇదే. 9 ధాతువులు : రత్నములు:
1) మాంసం : పుష్యరాగం
2) రోమం : నీలం
3) త్వక్(చర్మం) : వైడూర్యం
4) రుధిర (రక్తం) : విద్రుమం(పగడం)
5) శుక్రం : ముత్యం
6) మజ్జ : మరకత
7) అస్థి (ఏముక) : వజ్రం
8) మేధస్సు : గోమేధికం
9) ఓజస్సు : పద్మరాగం
అజ్ఞానమనే నిర్మాల్యము తొలగించే సాధన ఇదే. 24, 36 తత్త్వాలుగా చెప్పడంలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి.
‘‘సంకల్పాః కల్పతరవః తేజః కల్పకోద్యానం’’
తేజం అంటే సర్వాత్మ భావచిద్వికాసం.
మనస్సు సంకల్ప స్థానం. అది కల్పవక్షం. శ్రీవిద్యా సాధకునికి సంకల్పసిద్ధి కరతలామలకం. అట్లని క్షణికములైన పతన హేతువులైన కోరికలు వాంఛించరాదు. మనకేమి కావలెను అనునది నిజంగా మనకు తెలియదు. అంబకు తెలుసు. అందుకే ‘‘నిష్కామానామేవ శ్రీవిద్యా సిద్ధిః’’ అన్నారు.
‘‘రసనయా భావ్యమానా మధురామ్ల తిక్త కటు కషాయ లవణ రసాః షడ్రుతవః’’ జిహ్వేంద్రియ నిగ్రహం మొదటిగా మనం సాధించవలేను. కారణం తినడం, మాట్లాడడం, అనే రెండు పనులు చేసేది జిహ్వ. ఇది మన వశంలో లేకుంటే అన్ని రకాల అనర్థం. తిండి వల్ల ఆరోగ్యం, మాట వల్ల వ్యవహారం ఆధారపడి వుంటాయి. తేడా వస్తే రెండూ చెడి పోతాయి. ఇక శ్రీవిద్యాసాధనలో 6 చక్రాలలో సాకిన్యాధి దేవతలను అర్చిస్తాము. వారికి ముద్గౌదనం, గుడాన్నం, హరిద్రాన్నం మొదలైనవి ఇష్టం అని నైవేద్యం సమర్పించి పూజిస్తాం. దాని అంతరార్థం ఇదే. జిహ్యేంద్రియ అధిష్టాన దేవత వరుణుడు. తినే ఆహారం, దాని రుచి, దాన్ని ఆస్వాదించే బుద్ధి వంటివన్నీ లలితయే అని భావించినప్పుడు, ఇంద్రియములను రంద్రములనుండి రసవంతమైన మధువును గ్రోలేది పరాభట్టారికే అని భావించి, ధ్యానిస్తూ సర్వం బ్రహ్మార్పణంగా సమర్పించడం ద్వారా ధన్యత నొందగలం.
‘‘జ్ఞాన మర్ఘ్యంజ్ఞేయం హవిః,
జ్ఞాతా హోతా, జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయానా మభేద భావనమ్ శ్రీచక్ర పూజనమ్’’
త్రిపుటీ భేదనం అని ధ్యానంలో చెప్పేది ఇదే. ఇంకా వివరిస్తే;
జ్ఞాత - పరదేవతను తెలుసు కొనడానికి సాధన చేసేవాడు.
జ్ఞేయం-లక్ష్యమైన పరదేవతా తత్త్వం
జ్ఞానం - తెలుసుకునే సాధనా పద్ధతి
ఇవి మూడు విడివిడిగా ఉంటాయి. వీటికి భేదంలేదని, ఈ మూడు ఒకటే అని భావనను స్థిర పర్చుకోవడమే శ్రీచక్ర పూజ. సోహమ్ భావన అన్నా ఇదే.
మంత్రమునకు, మంత్రాధిష్టాన దేవతకు, మంత్ర జపం చేసేవానికి తేడా లేకుండా పోవడం. అట్లే ధ్యానం చేసేవానికి, ధ్యేయమైన ఆత్మ తత్త్వమునకు, జరిగే ప్రక్రియ ధ్యానానికి భేదం లేకుండా లయం కావడం వంటివన్నీ జ్ఞాన యజ్ఞం చేయడం వంటివే. పరమోత్కృష్ట స్థితి ఇది. దీన్ని సాధించడమే మోక్షం.అదే కైవల్యం.
దీన్నే ఉపనిషత్ ‘‘మామ్ జూహోమి స్వాహా’’ అని వైశ్వానరాగ్నిలో తనను తాను ఆహుతిగా వ్రేల్చడంగా బోధిస్తుంది. ఇదే తురీయావస్థ జీవన్ముక్తి.
‘‘చైతన్య స్య ఏక రూపత్వాత్ భేదో యుక్తో న కర్హి చిత్’’.
‘‘నియతి శృంగార దయో రసా అణిమా దయః’’
ప్రథమావరణలో అణిమా సిద్ధిని పూజిస్తారు. ఈ అష్ట సిద్ధులు నియమంతో కూడిన శృంగారం మొదలైన నవరసాలు.
నియతి; ఆత్మ నిగ్రహం. ఇది ధర్మబద్ధమైన అర్థ కామములతో సాధ్యం. శ్రీచక్ర నవావరణములలో కలిగే సిద్ధులు, వాటి రసాలు ఇవే.
ఆవరణం - సిద్ధి, రసము.
-
ఆణిమ - శాంతం
-
లఘిమ - అద్భుతం
-
మహిమ -కరుణ
-
ఈశిత్వ - వీరం
-
వసిత్వ - హాస్యం
-
ప్రాకామ్య - భీభత్సం
-
భుక్తి - రౌద్రం
-
ఇచ్ఛా - భయానక
-
ప్రాప్తి - శృంగారం
-
సర్వకామ - నియతి. శ్రీచక్ర అర్చనలో 10 సిద్ధులు చెప్పబడినాయి. సౌదర్యలహరిలోని ఈ శ్లోకము ఇదే అంశంపై వ్యాఖ్యగా ఉంది.
‘‘శివే శృంగార ఆర్ద్ర తదితర జనే కుత్స న పరా; స రోషా గంగాయాం గిరిశ చరితే విస్మయ వతి హరాహీ-భ్యో భీతా సరసి రుహ సౌభాగ్య జననీ; సఖీషు స్మేరా తే మయి జనని దృష్టిః సకరుణా.’’
భావం: భర్త యందు శృంగారం, చెలులతో హాస్యం, భక్తులకు కరుణ, సవతి యందు రౌద్రం, శత్రువులందు వీరం, పాములందు భయానకం, ప్రళయ సమయంలో భీభత్సం, శివలీలలో అద్భుతం, సర్వకాలములలో శాంతం వహించే పరదేవతను భావించి ధన్యత నొంద వలె.
‘‘కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్య పుణ్య పాప మయా బ్రాహ్మ్యా ద్యష్టశక్తయః’’
రెండవ భూపురంలో భావించే బ్రాహ్మీ మొదలైన 8 శక్తులు కామాదులని భావించి సర్వ వాసనలు లలితారూపమే అని స్థిర పర్చవలె. వాసన - శక్తి.
1) కామం - బ్రాహ్మీ
2) క్రోధం -మహేశ్వరి
3) లోభం - కౌమారి
4) మోహం - వైష్ణవి
5) మదము -వారాహి
6) పుణ్యం - చాముండ
7) మాత్సర్య - మాహేంద్రి
8) పాపం - మహాలక్ష్మి
‘‘చతుర్భుజ త్రినయనాః పద్మ మాలాధి హేత యః
విచిత్రా భరణా దేవ్యైః ప్రసీద త్వమ్ మాతరః’’
పై శక్తులు ఒక్కొక్కటి 8 కోట్ల రూపములను ధరంచగలవు. 64 కోట్లు. చతుషష్టి కోటి యోగిని దేవతలు వీరే.
‘‘ఆధార నవకం ముద్రా శక్తయః’’
9 చక్రములలో 9 ముద్రాశక్తులను భావించవలెను. చక్రము. ముద్ర.
-
మూలాధారం - సర్వ సంక్షోభిని
-
స్వాధిష్ఠాన - సర్వ విద్రావిణి
-
మణిపూరక - సర్వాకర్షిణి
-
అనాహత - సర్వ వశం కరి
-
విశుద్ధ - సర్వో న్మా ది నీ
-
ఆజ్ఞా - సర్వ మహాంకు శ
-
సర్వ రోగ హర - సర్వ ఖేచరి
-
త్రికోణ - సర్వ బీజ
-
బిందువు - సర్వ యోని
-
తురీయ - త్రిఖండ
అసలు ముద్ర అంటే ఆనందాన్ని కలిగించేది. అని అర్థం. ముదంరాతీతి ముద్రా. ఆయా స్థానముల వికాసమునకు తోడుపడి అద్వైత పరమానందం కలిగించునది.
‘‘పృథి వ్యా యువ కాశా శ్రో త్ర త్వక్ చక్షు ఘ్రాణ వాక్ పాణి పాద పాయూ పస్థాని మనోవికారాః కామాకర్షిణ్యాధి షోడశశక్తయః’’
ద్వితీయ ఆవరణలో. పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సును కలిపి మొత్తం 16 శక్తులుగా భావన. మనో వికారాః అంటే మనోబుద్ధి చిత్యహంకారాలు. ఇక్కడి మనస్సు మాయావరణంలోనిదని గ్రహించవలెను.
ఎందుకంటే రాబోయే మంత్రంలో ‘‘మనః ఇక్షు ఖండః’’ అన్న చోట అక్కడ తురీయావస్థలోని నిర్వాసనమైన మనస్సు.
చక్రము - తత్త్వం, ఇంద్రియ
-
మూలాధర - పృథ్వీ, ఘ్రాణ్
-
స్వాధిష్ఠాన - జల, జిహ్వ
-
మణిపూరకా - అగ్ని, ఛక్షు
-
అనాహత - వాయు, త్వక్కు
-
విశుద్ధ - ఆకాశ, శ్రవణ
-
ఆజ్ఞ - మనస్సు, బుద్ధి
‘‘వచనాదాన గమన విసర్గానాంద హానోదాన ఉపేక్షాఖ్య బుద్ధయో అనంగ కుసుమాద్యష్టౌ’’
ఇది మూడవ ఆవరణంలో సాధకుడు భావించే అనంగ కుసుమ మొదలైన 8 దేవతలను వారు వేటికి సంకేతాలో వివరించే మంత్రం. మనము చేసే పనులన్నింటినీ ఈ దేవతలకు సంకేతాలుగా భావించాలి. ఇది సర్వసంక్షోభిణీచక్రం. చక్రేశ్వరి త్రిపుర సుందరి. రక్త వర్ణం.
శక్తి. అధిభూతం. అధ్యాత్మం. అధి దేవత
-
అనంగకుసుమ. వచన. వాక్కు. అగ్ని
-
అనంగమేఖల. ఆదాన. హస్తం.ఇంద్ర
-
అనంగమదన.గమన.పాదం.విష్ణు.
-
అనంగమదనాతుర.విసర్గ.పాయు.మృత్యువు
-
అనంగరేఖ.ఆనందం. ఉపస్థ.ప్రజాప్రతి.
-
అనంగవేగిని.హనము.బుద్ధి. బ్రహ్మా
-
అనంగాంకుశ.ఉపాదానం(గ్రహించు).చిత్తం.క్షేత్ర జ్ఞుడు.
-
అనంగమాలిని.ఉపేక్ష.(విడుచుట).అహంకారం. రుద్రుడు.
దీన్ని బట్టి ఆయా ఇంద్రియాలు గ్రహించే శక్తి లలితయే అని తెలుస్తోంది. దీనికి సాధనలో ఉత్కృష్ఠమైన సుషుమ్నా వికాసం జరిగినప్పుడే సాధ్యమైతుంది.
‘‘అలంబుసా కుహూర్విశోదరా వారణా హస్తిజిహ్వా యశోవతీ పయస్వినీ గాంధారి పూషా శంఖినీ సరస్వతీ ఇడా పింగళా సుషమ్నా చేతి చతుర్దశ నాడ్యః.సర్వసంక్షోభిణీ ఆది చతుర్దశ శక్తయః.’’
ఇది చతుర్థావరణం. యోగసాధనలో నాడుల దర్శనం సాధ్యం. త్రిపుర వాసిని చక్రేశ్వరి. అనాహత చక్రంలో ఈ ఆవరణం దర్శనం చేసుకొని భావించవచ్చును.
-
సర్వసంక్షోభిణీశక్తి. అలంబుసా
-
సర్వవిద్రావిణీశక్తి.కుహూ
-
సర్వాకర్షిణీశక్తి.విశ్వోదర
-
సర్వాహ్లాదినీ శక్తి. వారణ
-
సర్వసమ్మోహినీశక్తి.హస్తిజిహ్వా
-
సర్వస్తంభినీశక్తి.యశోవతీ
-
సర్వజృంభిణీశక్తి.పయస్వినీ
-
సర్వవశంకరీశక్తి.గాంధారి
-
సర్వరంజనీశక్తి.పూష
-
సర్వోన్మాదినీశక్తి.శంఖినీ
-
సర్వార్థసాధినీశక్తి.సరస్వతి
-
సర్వసంపఛ్చక్తి.ఇడ
-
సర్వమంత్రమయీశక్తి.పింగళా
-
సర్వద్వంద్వక్షయంకరీశక్తి.సుషుమ్నా
ఇంకా వివరిస్తే తత్త్వశోధనలో ఈ విధంగా భావిస్తారు.
-
ప్రకృతి, అహంకారం, బుద్ధి, మనసు- 4
-
జ్ఞానేంద్రియాలు-5
-
కర్మేంద్రి యాలు-5
-
పంచభూతాలు-5
-
వాటి గుణములు-5
మొత్తం-24. ఇవి క్రియాశక్తి స్థానములు
1.మాయ, 2. కల, 3. అవిద్య, 4. రాగము, 5. కాలము, 6. నియతి, 7.పురుషుడు.
ఈ 7 విద్యాతత్త్వం. జ్ఞాన శక్తిస్థానములు.
శివుడు, శక్తి, సదాశివ, ఈశ్వరుడు, శుద్ధవిద్య ఈ 5 శివతత్త్వం. ఇచ్ఛాశక్తిస్థానములు.
24+7+5=36 తత్త్వములుగా భావిస్తున్నారు. నాడులన్నీ మూలాధారంలోనే ప్రారంభమైతాయి.
‘‘ప్రాణాపానవ్యానోదాన సమాన నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయా దశ వాయవః సర్వసిద్ధిప్రదాది బహిర్దశార దేవతాః’’
ఇది శ్రీచక్రంలో పంచమావరణం. విశుద్ధచక్రంలో దీని దర్శనం కల్గుతుంది. దశ వాయువులతో పంచమావరణ దేవతల సమన్వయం చూద్దాం.
వాయువు - దేవత
1) ప్రాణ - సర్వసిద్ధిప్రదా.
2) అపాన - సర్వసంపత్ ప్రదా
3) వ్యాన - సర్వ ప్రియంకరీ
4) ఉదాన - సర్వ మంగళ కారిణీ
5) సమాన - సర్వకామప్రదా
6) నాగ - సర్వదుఃఖ విమోచనీ
7) కూర్మ - సర్వమృత్యు శమనీ
8) కృకర - సర్వవిఘ్న నివారిణీ
9) దేవదత్త - సర్వాంగ సుందరీ
10) ధనంజయ - సర్వ సౌభాగ్య దాయినీ
పై వాయువులలో మొదటి 5 వేదోక్తములు. మిగిలిన 5 ఉప వాయువులు యోగశాస్త్రం చెబుతోంది.
నాగం - వెక్కిళ్ళు
కూర్మం - కనురెప్పల కదలిక
కృకరం - ఆహారం జీర్ణం కావడానికి
దేవదత్తం - శరీరం విజృంభించడానికి
ధనం జయము.శరీర బరువు ఆకృతి దీనిపై ఆధారపడి ఉంటాయి. మిగిలిన 9 వాయువులు మరణంతో వదులుతాయి. కానీ ఇది శవాన్ని కూడా వీడదు.
‘‘ఏతద్వాయు సంసర్గకోపాధి భేదేన రేచకః పాచకః శోషకఃదావకః ప్లావకః ఇతి ప్రాణ ముఖ్య త్వేన పంచధా జఠరాగ్నిర్భవతి.’’
‘‘క్షారకః ఉద్గారకః క్షోభకః జృంభకః మోహక ఇతి నా గప్రాధాన్యేన పంచవిధాస్తే మనుష్యాణాం దేహగా భక్ష్య భోజ్య చోహ్య లేహ్య పేయాత్మకం పంచవిధమన్నం పాచయంతి. ఏతే దశ వహ్నికళా స్సర్వజ్ఞాద్యా అంతర్దశార దేవతాః’’
ఇది శ్రీచక్రంలో షష్ఠమావరణం. ఆజ్ఞా చక్రంలో దర్శనం ఇస్తుంది. ఇందులో నిగర్భ యోగినులుగా సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వైశ్వర్యప్రదా, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధి వినాశినీ, సర్వాధార స్వరూపా, సర్వ పాపహరా, సర్వానందమయీ, సర్వ రక్షాస్వరూపిణీ, సర్వేప్సిత ఫల ప్రదా, అనే 10 మంది దేవతలు పంచ జఠరాగ్నులుగా మారి మనం తీసుకునే ఆహారంలో ఉన్న 5 రకాలను జీర్ణం చేస్తాయి. ఇదంతా పరాశక్తి యని భావన చేయడం ఉపాసన.
‘‘శీతోష్ణ సుఖదుఃఖేచ్ఛాః సత్వరజస్తమో వశిన్యాదిశక్తయోః అష్టౌ’’
ఇది సప్తమావరణం. వశిని మొదలుగాగల వాగ్దేవతలు 8 మంది ఈ సర్వరోగహరచక్రములో ఉన్నారు. లంబికాగ్రములో సాధకుడు ధ్యానించి, శీతము మొదలైన వాటిని భావించి, ఏకత్వం సాధించగలడు.
దేవత - అనుభూతి
-
వశినీ - చలి
-
కామేశ్వరి - వేడి
-
మోదిని - సుఖం
-
విమల - దుఃఖం
-
అరుణ - కోరిక
-
జయినీ - సత్వ
-
సర్వేశ్వరీ - రజో
-
కౌళినీ - తమో
8 దిక్కు లయందు ఉన్న ఈ దేవతలను ధ్యానించి, చక్రేశ్వరి త్రిపురాసిద్ధను పూజించాలి.
‘‘శబ్దాది తన్మాత్రాః పంచ పుష్ప బాణాః మన ఇక్షు ధనుః రాగః పాశః క్రోధో అంకుశః’’
ఇది అష్టమావరణము. అతి రహస్య యోగినీ దేవత. ఇక్కడే కామేశ్వరీ కామేశ్వరుల ఆయుధాలు పూజించాలి. వాటిని భావనలో ఈ విధంగా ధ్యానిస్తాము. వికారాలు లేని మనసు చెరకువిల్లు. ఇంద్రియాలను ప్రేరేపించేది ఇది. పంచతన్మాత్రలు 5 పుష్పబాణాలు. వీటితో కామక్రోధాదులను జయించడం ధ్యేయం. అట్లే పాశము ఇచ్ఛాశక్తి. రాగము. అంకుశము జ్ఞానశక్తి. ఇది క్రోధం. ధనుర్బాణాలు క్రియాశక్తి. మస్తకమునందలి త్రికోణంలో భావన.
1 2 3 4 5
ఆయుధం - శక్తి - తత్త్వం - దశ - గుణం
పాశం - ఇచ్ఛ - సోముడు - సుషుప్తి - సత్వం
అంకుశం - జ్ఞాన - సూర్యుడు - స్వప్నం- రజస్సు
ధనుర్బాణములు - క్రియా - అగ్ని - జాగ్రత్ - తమస్సు
విజయదశమి నాటి ఆయుధపూజ అంతరార్థం ఇదే.
‘‘అవ్యక్తమహదహంకారాః కామేశ్వరీ వజ్రేశ్వరీ
భగమాలిన్యో అంతస్త్రికోణగా దేవతాః’’
నిర్గుణ పరబ్రహ్మము సృష్ఠి సంకల్పం కల్గగానే అవ్యక్తముగా అందుండి మహత్తత్త్వముగా అందుండి అహంకారంగా పరిణమించింది. దానినుండి పంచభూతాత్మకమైన జగత్తుగా మారింది. ఇదే సృష్టిన్యాసము. ఇది సర్వసిద్ధి ప్రదచక్రం. అతిరహస్యయోగినిగా లలిత, త్రిపురాంబ చక్రేశ్వరి.
కామేశ్వరి - అగ్ని చక్రం - బ్రహ్మాత్మకశక్తి .
వజ్రేశ్వరీ - సూర్య చక్రం - విష్ణ్వాత్మకశక్తి.
భగమాలిని - సోమచక్రం - రుద్రాత్మకశక్తి.
‘‘నిరుపాధిక సంవిదేవ కామేశ్వరః సదానంద పూర్ణా స్వాత్మైవపరదేవతా లలితా’’
సర్వశక్తిసంపన్నుడై జగద్రూపముగ మారుటకున్ముఖమైన తత్త్వం కామేశ్వరుడు. ప్రత్యగాత్మయైన ఆనందావేశమే లలిత. సర్వ తత్త్వవ్యాపిని.
‘‘రుద్రో గంధః ఉమా పుష్పం తస్మై తస్యై నమో నమః’’
ఇంతవరకు శ్రీచక్రంలోని నవావరణములలోని తత్త్వం సూక్ష్మశరీరం, షట్చక్రాల సమన్వయం చూశాం. ఇక్కడనుండి ఉపచారాలను భావనతో ఎలా సమర్పించాలో తెలుసుకుందాం.
‘‘లౌహిత్యమేతస్య సర్వస్య విమర్శః’’
ఆత్మశక్తి దేవత తురీయరూప కుంకుమ వర్ణం. ఎర్రని తేజం ప్రాణశక్తియైన ఆత్మ వికాసంగా భావించవలెను.ఇది అవస్థాత్రయభావాభావ సాక్షి. స్వయం భావరహితమగు జీవన్ముక్త స్థితి. ఛాంద్యోగ్యంలో తెలుపు జలతత్వం. ఎరుపు తేజస్సు. నలుపు అన్నమయం (స్థూలరూపం)గా పేర్కొన్నారు.
‘‘అనన్య చిత్తత్త్వేనసిధ్దిః’’
ఇది సర్వసిద్ధులకు మూలమైన తురీయదశ. జీవన్ముక్తి. ఈసర్వాత్మ భావ సామ్రాజ్య పట్టపురాణి లలితయే. భోగమోక్షకరీ విద్య శ్రీవిద్యయే అనడం ఇందువల్లే. సర్వమ్ బ్రహ్మమయమ్ అని భావించడం ఇక్కడ అనుసంధానం చేయబడుతుంది. దీనికి సద్గురువు అనుగ్రహం తప్పనిసరి. వేరే మార్గం లేదు.
‘‘భావనాయాః క్రియాః ఉపచారాః’’
షోడశోపచారాలతో పూజను మానసికంగా భావించడం. ఆత్మ లింగ పూజ, మానసిక పూజలన్నీ ఇటువంటివే. ఇదే అంతర్యాగం. అంతర్ముఖ సమారాధ్యగా దేవిని పేర్కొనడంలో పరమార్థం ఇదే.
‘‘అహం, త్వమ్, అస్తి, నాస్తి, కర్తవ్య, మకర్తవ్య, ముపాసితవ్యమితి వికల్ప నానామాత్మని విలాపనమ్ హోమః’’
సంకల్పం -ఏకత్వభావన. వికల్పం - భిన్న త్వభావన. నేను, నీవు, ఉంది, లేదు, చేయదగినది, చేయకూడనిది వంటి వాటిని చిదగ్నిలో ఆహుతి చేయడం పరమమైన హోమం.హోమంలో వేసినవన్నీ బూడిదగా మారుతాయి. పైన పేర్కొన్న భావనలన్నీ సమసిపోవడంతో ఏకత్వభావన స్థిరపడుతుంది. ‘‘ఏకంసత్ విప్రాః బహుధా వదంతి’’ అన్న వాక్యం అనుభవానికి వస్తుంది. ‘‘ఆర్ద్రం జ్వలతి జ్యోతిః అహమస్మి’’ అను వేద మంత్రము భావమిదే.
‘‘భావనా విషయానాం అభేద భావనా తర్పణం’’
తర్పణం అంటే సగుణ నిర్గుణ భేదభావనను వదలుట.స్థూల, సూక్ష్మ, కారణ శరీరాల ఏకత్వం సుషుమ్నా వికాసం తో బోధపడుతుంది. ఇదే పరాపర పూజ. కుండలినీ సాధనలో సహస్రారంలో అమృత స్రావం కల్గడం తర్పణం. ‘‘బ్రహ్మరంధ్రాత్ సుధాసృతిః’’ ఇదే.
‘‘పంచదశ తిథి రూపేణ కాలస్య పరిణామావలోకనం’’
శుద్ధపాడ్యమి నుండి పౌర్ణమి వరకు రోజునకొక నిత్యా దేవతను ఉపాసించడం అట్లే కృష్ణ పాడ్యమినుండి అమావాస్య వరకు చిత్రా నిత్యానుండి కామేశ్వరి వరకు విలోమంలో ఉపాసించడం చంద్రకళావిద్య. 16వ కళ సాదా కళ. మహానిత్యా. అదే లలిత. ఒక రోజుకు 20600ల శ్వాసల రూపంలో దేవిని అదే హంస గాయత్రీ. కాలమే భగవంతుడు. అదే కాలాయనమః. అదే కాళి.
ఫలశృతి : ‘‘ఏవం ముహూర్తత్రితయం ముహూర్త మాత్రం వా భావనాపరో జీవన్ముక్తో భవతి, స ఏవ శివ యోగీతి గద్యతే’’
బ్రహ్మ చైతన్య సాక్షాత్కారం ఒక ముహూర్త మాత్రం అనుభవించినా చాలు. తురీయదశ పొందవచ్చు. సందేహం తీరి పరమగమ్యము చేరగలం. ఇటువంటి స్థితి పొందిన వానిని ‘శివయోగి’ అని వ్యవహరిస్తారు.
‘‘అఖండాకార రూపోస్మి’’ ‘‘బంధమోక్ష విహీనో-స్మి’’అనే వాక్యాలు అతని పట్ల ఋజువుగా నిలుస్తాయి. నిత్య నైమిత్తికములను వీడకుండా పాటిస్తూ శమదమాదులతో జీవనయజ్ఞాన్ని నిర్వహిస్తూ ‘‘శివో-హం’’ భావనతో దేహ మోహము వీడి సందేహముడిగి సచ్చిదానంద పరబ్రహ్మ భావన ఒక ముహూర్త కాలం నిల్చినా అది అజ్ఞానాన్ని నశింప జేస్తుంది. ‘‘జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసాత్కురుతే-ర్జున!’’ అనే గీతా వాక్యం చెప్పిన స్థితి ఇదే.
‘‘కాదిమతేనాంతశ్చక్ర భావనాః ప్రతిపాదితాః
య ఏవం వేద సోథర్వశిరో అధీతే’’
ఈ ఉపనిషత్తు ‘కాదివిద్య’ ననుసరించి ఆంతరోపాసన భావనా విధానాన్ని ఈ విధంగా వివరించింది. అథర్వ వేదములోనిది. ఈ విధంగా యథాశక్తి ఉపాసన చేసేవారు ధనదారాపుత్రాది భౌతిక సంపదల తోపాటు తేజస్సు, బ్రహ్మవర్చస్సు పొంది దీర్ఘాయుష్మంతుడై అంతంలో సాయుజ్య ముక్తి నొందును. ‘‘చరమే జన్మని శ్రీ విద్యో-పాసకో భవేత్’’
భావనోపనిషత్ సర్వం సంపూర్ణం.
ఓం శాంతిః శాంతిః శాంతిః