త్రికాలజ్ఞాని మహాయోగి - ’’గోల్లా పిన్ని మల్లికార్జున శాస్త్రి’’ సిద్ధయోగి పుంగవులు-
ఈ మహాత్ములు రాయపెద్ది అప్పాశేషశాస్త్రి (రిటైర్డ్ ప్రిన్సిపల్, ఆర్ట్స్ కాలేజ్ ఆదోని)గారి మాతామహులకు మాతామహులు.
పాత నిజాంరాష్ట్రం రాయచూరుజిల్లా అలుకూరు గ్రామంలో శ్రీవత్స గోత్రీకులైన గోల్లాపిన్ని అనే ఇంటి పేరున్న వైదిక బ్రాహ్మణులు ఉండేవారు. ఏడు తరాలకు పూర్వం మోటప్ప అనే ఈ వంశీకుడికి ‘వల్లెలాంబ’ అనే దేవత ప్రత్యక్షమై, బంగారు పలకా, బలపం ఇచ్చి, ఏడుతరాలవారు ఆ వంశంలో పండితులౌతారని దీవించింది. ఆ వంశంలో 1871 సం॥లో జన్మించిన వారే మన మల్లికార్జున శాస్త్రి. తండ్రి రామశాస్త్రి - తల్లి సుబ్బమ్మ.
నాలుగేళ్ల వయసులో వీథి బడికి పంపారు శాస్త్రిగారిని. ఆ సాయంత్రం పంతులుగారు ఈ బాలున్ని ఇంటికి తీసుకొని వచ్చి, తండ్రికి అప్పగించి, తనకు వచ్చిందంతా శాస్త్రి ఒక్క రోజులోనే నేర్చుకోన్నాడని ఇంకా తాను చెప్పవలసినదేమీ లేదని చెప్పాడు. అంతటి ‘బాల లీలా సరస్వతి’ మల్లికార్జునశాస్త్రి.
తండ్రి, పినతండ్రుల వద్ద నాటకాంత సాహిత్యాన్ని, తత్త్వబోధినీ వ్యాఖ్యతో కౌముది, న్యాయ వేదాంతశాస్త్రాలు నేర్చాడు. తండ్రి వెనక గద్వాల, వనపర్తి, ఆత్మకూరు సంస్థానాలు తిరిగి తన విద్యా వైదుష్యాన్ని ప్రదర్శించి ‘‘భారతీ బాల లీల స్వరూప’’ బిరుదు పొందాడు. జ్యోతిషం, భాష్యంత వ్యాకరణం ముహూర్త, జాతక, సిద్ధాంత రూప స్కంద త్రయ జ్యోతిషం గురుముఖతా నేర్చాడు. ఆనాటి జ్యోతిష పండితుడు విక్రాల రాఘవాచార్యులు ‘‘కన్నుస్వామి’’ అనే మారుపేరుతో Indian Ephimeries లో రాశాడు. ఆయనగారి అనుమతిపొంది మల్లికార్జునశాస్త్రి ‘‘10 వేల సంవత్సరాలకు సరిపోయే తిది, వార, నక్షత్ర, యోగ, కరణ, ఘటిక, విఘటికలకు సరైన ప్రమాణం ఉన్న ‘‘ఖచర మణిపేటి’’ అనే అత్యద్భుతమైన పంచాంగాన్ని తయారుచేశాడు. గురువు అనుమతి తీసుకొని ‘‘కాళహస్తీశ్వరాలయం’’ లో నిష్టగా కూర్చుని ‘‘శని అష్టవర్గు’’ వేస్తుంటే శనైశ్చరుడు ప్రత్యక్షమైనాడు. అలుకూరు తిరిగివచ్చి తాతగారివద్ద వేదాంత అధ్యయనంచేసి మొత్తం చదువునంతా 21 ఏళ్ళ వయస్సులోనే సాధించాడు.
ఈయన తమ్ముడు రామశాస్త్రి గొప్ప సూర్యోపాసకుడు, సూర్యోదయంనుండి మధ్యాహ్నం పన్నెండుగంటలవరకు రెప్పవాల్చకుండా సూర్యుని చూస్తూ ధ్యాన నిమగ్నమయ్యే వాడు. మల్లికార్జునిలానే ఈయనా త్రికాలజ్ఞాని.
మల్లికార్జున శాస్త్రి కడప, బళ్ళారి నగరాలల్లో అనేక ‘‘శతావధానాలు’’ చేశారు.
అనేక సంస్థానాల్లో తన పాండిత్య ప్రకర్ష చూపి ‘‘కవితాసార్వభౌమ’’ బిరుదు పొందారు.
ఆదిశంకరాచార్యుల జన్మస్థానం ‘కాలడి’లో శృంగేరి జగద్గురువులు ‘‘శ్రీనృసింహభారతీ స్వామి’’వారి ఆహ్వానంపై వెళ్లి జగద్గురువుల ‘‘శ్రుత్యంత గీతాల’’తో స్తుతిస్తూ తన్మయత్వంతో పాడుతూ ఉంటే వీరి బ్రహ్మాత్మానుభావాన్ని గుర్తించిన భారతీస్వామి అభినందించారు.
శృంగేరి స్వామి అనుజ్ఞతో తాను రచించిన ‘‘ఖచర మణి’’ గ్రంథాన్ని తెచ్చి అందులోనుంచి 2000 నాటి స్వాములవారు అడిగిన తిథికి పంచాంగ గణనం చేయమని సభాసదులను కోరారు. చాలా మంది చెప్పలేమన్నారు. కొందరు మూడుగంటల వ్యవధి కోరారు కానీ మల్లికార్జున శాస్త్రి ఇరవై నిమిషాలలో గణించి సరైన సమాధానం చెప్పి తన ప్రజ్ఞను రుజువు చేసుకొన్నారు. స్వామితో సహా అందరు ఆశ్చర్యపోయారు. జగద్గురువులు ‘‘పండిత సార్వభౌమ’’అనే బిరుదుతో సగౌరవంగా సత్కారం చేశారు.
‘‘ఉపాధి భేదం చేత మీరు అక్కడ మేము ఇక్కడ, మీరే మేము, మేమే మీరు’’ అని జగద్గురువుల చేత ప్రశంసలు పొందిన మల్లికార్జునశాస్త్రి ధన్యజీవి.
ఆయన సంస్కృతంలో ‘‘శ్రీవాసుదేవానందం’’ అనే అలంకారశాస్త్రాన్ని రాశారు. ఇది ఒక చిత్ర విచిత్ర కవితా భాండారం. అనేక కవితా బంధాలు అందులో ఉన్నాయి. అందులో బాగా ఆశ్చర్యపరచేది ‘‘సహస్ర దళ పద్మ బంధం’’ 1008 దళ పద్మాలతో అనేక శ్లోకాలు నిక్షిప్తమైన అపూర్వసృష్టి. ఇందులో 500 శ్లోకాలు, 16 ప్రకరణాలున్నాయి. అయితే ఇందులో నూరు శ్లోకాలున్న గ్రంథమే ముద్రితమైంది. దీనిని నలభై రోజుల్లో రాశారు. ఇరవై అయిదు వివిధ ఛందస్సులతో ‘‘పురుషోత్తమ శతకం’’ రాశారు.
జ్యోతిశ్శాస్త్ర సుధర్మసార నిబంధం, ధర్మశాస్త్ర రత్నాకరం అనే తెలుగు రచనలు చేశారు కానీ ప్రస్తుతం లభ్యం కావటం లేదు.
పాతంజలి భాష్యార్థం, ఖచరమణి పేటి, 10,000 సం॥ల పంచాంగం వీరి ఇతర రచనలు.
శాస్త్రిగారు 15-1-1906 తమ స్వగ్రామం అలుకూరులో ఒక ఏడాది పాటు ‘‘దీర్ఘ బ్రహ్మసత్రయాగం’’ నిర్వహించారు. వందలాది పండితులు రాజులు, మంత్రులు, ధనవంతులు, వేలాదిమంది పేదలకు కుల మత భేదం లేకుండా అన్న సంతర్పణ జరిగింది. అందరిని సత్కరించి పంపిన రాత్రి శ్రీవిరూపాక్ష స్వామి కలలో కనిపించి ‘‘అవభృథ స్నానం’’ కాశీలో చేయమని ఆజ్ఞాపించారు. బంధుజనంతో కాశీ వెళ్లి ఆ కార్యక్రమం సంతృప్తిగా నిర్వహించి ప్రయాగ, గయాది క్షేత్ర సందర్శనంచేసి ఇంటికి తిరిగివచ్చారు.
గద్వాల రాజు రాంభూపాల్ మరణించగా సంస్థానం పదేళ్లు ‘‘కోర్ట్ ఆఫ్ వార్డ్స్’’లో ఉంది. అప్పుడు వారసుడైన సీతారాం మల్లికార్జునుని శరణు వేడాడు. ఈయన ఏడాది గడువు పెట్టి, హంపీ విరూపాక్షునికి ‘‘అగ్నిస్తోక, కోటి బిల్వార్చన చేయ సంకల్పించి అందరి సహకారంతో ఆ పని పూర్తీ చేశారు. గడువు లోపలే సీతారాంకు గద్వాల రాజ్యం దక్కింది.
ఒకసారి యవ్వనంలో శాస్త్రిగారు ఎండలో నడిచి వస్తున్నాడు. ఒక పేద రైతు కనిపించి వర్షాలు లేవని కరువుతో జనం అలమటిస్తున్నారని చెప్పాడు. ‘‘పెద్ద వర్షం వస్తుంది ఇంటికిపో’’ అన్నారు శాస్త్రి. అంతే కుండపోతగా వర్షం కురిసింది. ఇంకోసారి స్వగ్రామం బయట ఏటి ఇసుకలో ధ్యాన నిష్ఠలో ఉండగా విపరీతంగా వర్షం కురిసి ఇసుకలో కూరుకు పోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆ వాగు ఎండిపోయింది. మంచినీటి కోసం చలమలు తవ్వుతుంటే శాస్త్రిగారు పద్మాసనంలో అలానే చలించకుండా కనిపించారు. ఏదైనా మహిమ చూపమని ఒక శిష్యులు అడిగితే ‘‘ఒక శివాలయంలో నాలుగు స్తంభాల మధ్య శివుడికి ఎదురుగుండా కూర్చొని కనులు మూసుకొని ఒక్కసారిగా శరీరాన్ని గాలిలోకి లేపి, ఆ స్తంభాల మధ్య చుట్టూ వేగంగా గిరగిరా తిరిగి మళ్ళీ కిందికి దిగి శివుని ధ్యానించారు.
మరోసారి మల్లేశ్వరాలయంలో బావమరిది దోనేకంటి రామయ్య భాగవతంలో ‘‘పురంజనో పాఖ్యానం’’ చదువుతుంటే శాస్త్రిగారు ఆధ్యాత్మపరంగా వ్యాఖ్యానం చేస్తున్నారు. పూర్తి అవగానే రామయ్య ‘‘అంతేనా బావా?’’ అన్నాడు. శాస్త్రిగారు ‘‘అంతేరా’’ అన్నారు. అంతే - రామయ్య వెంటనేలేచి భుజంపై ఖండువా దులిపి మళ్ళీ భుజంమీద వేసుకొని వెళ్లిపోయారు. తల్లీ, శాస్త్రిగారి భార్యా మొత్తుకొన్నా వేను తిరిగి చూడలేదు. వాడిక రాడులే అంతే అని వారికి సమాధానం చెప్పాడు శాస్త్రి. అంటే ఆత్మబోధ అయిందన్నమాట బావమరదికి.’’
శాస్త్రిగారి లీల ఇంకోటి. గద్వాలరాజు మూడురోజుల పండితగోష్టిలో
ఉండగా ఒకరోజు నిజాం ప్రభువు తాను రాయచూరు వస్తున్నానని తనను అక్కడ కలుసుకోమని రాజుకు ఫర్మానా పంపాడు. ఏమి చేయాలో తోచక శాస్త్రిగారిని అడిగాడు రాజు. కంగారేమీ పడక్కరలేదని నిజాం రాడనీ రేపే ఆ విషయం తెలుస్తుందని చెప్పాడు. ఇరకాటంలో పడ్డాడు రాజు. అనుకొన్నట్లే నవాబు వాడీ వరకు వచ్చేసరికి కడుపునొప్పి ఎక్కువై హైదరాబాద్ తిరిగివెళ్లి పొయ్యినట్లు మర్నాడు వార్త వచ్చింది. అంతటి వస్యవాక్కు శాస్త్రి గారిది.
1917సం॥లో అలుకూరు గ్రామంలో ప్లేగు వ్యాధి విపరీతంగా వ్యాపించింది. శాస్త్రిగారు మల్లికార్జున పుష్కరిణిని ‘‘అష్ట దిగ్బంధం’’ చేసి ఆ నీళ్ళు తాగిన వారికి ప్లేగు రాదనీ చెప్పారు.
మారికాదేవి ప్రత్యక్షమై అంత కఠోర నియమం పనికిరాదనీ అది తనకే నష్టం అని చెప్పింది. అందర్నీ ధర్మవరం పంపించి తానొక్కడే ఆ ఊర్లో
ఉండిపోయాడు. గ్రామ ప్రజలందర్నీ బయటికి పంపించేశాడు. తాను కుటుంబంతో తుంగభద్రానది ఒడ్డున ఉన్న రామాపురం వెళ్లారు. శాస్త్రిగారికి ప్లేగు సోకింది. కుండపోతగా వర్షం కురుస్తోంది. ఎవరు బయటకు వచ్చే అవకాశంలేదు. శాస్త్రిగారికి ఆ సమయంలో వైద్యసాయం అందలేదు. అంతే 5-9-1917 నాడు శివైక్యం చెందారు. ధర్మవరంలో ఉన్న అల్లుడు శ్రీనివాసశాస్త్రి టెలిగ్రాం చూసి వచ్చాడు. అప్పటికే ఆలస్యమై పోయిందని శవదహనం చేశారు. చితాభస్మం వర్షపు నీటిలో అంతా కొట్టుకుపోయింది. చితాభస్మం కూడా మిగులకుండా చేసి యాభై ఏళ్ళ వయసులోనే శివైక్యం చెందిన మహాజ్ఞాని గోల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రిగారు.
వీరి అమూల్యమైన రచనలు అందుబాటులో లేకపోవడం విచారకరం. అంతటి గొప్ప అనుష్ఠానపరులు, సంకలనకర్త, నిష్టాగరిష్టుల గురించి తెలుసుకోవడం, తెలియచేయటం కూడా మనందరి బాధ్యత.