‘నాస్వామి’. ఈ పద్యకావ్యం ఒక భక్తి రచన. నామరూపాత్మకమైన యొక దివ్య తత్త్వాన్ని తనకు నచ్చిన రీతిలో భావించి పూజించడమే స్థూలంగా భక్తియని వ్యవహరింపబడుతుంది. భక్తినొక శాస్త్రంగా నారదభక్తి సూత్రాలు వివరిస్తాయి. ‘సా పరమప్రేమరూపా’ అని నిర్వచించింది. తాను నమ్మిన తత్త్వాన్ని ఆనామంలోనే ఆ రూపంలోనే సంపూర్ణంగా ఆత్మీయ భావంతో నిత్యభావనగా స్థిరపర్చుకోవడమే పరమప్రేమ. ఇది ద్వైత సిద్ధాంతము. తాను జీవుడనని, తాను భజించే తత్త్వం దేవుడని ఇవి రెండూ ఎప్పటికీ విడివిడిగా ఉంటాయనే భావనే భక్తికి ఆలంబనం. ఈ పద్ధతిలో భావనను స్థిరపర్చుకొని క్రమంగా దాన్ని విస్తరిస్తూ పోవడం క్రమ సాధన. అసలు విగ్రహారాధన పరమార్థం అదే! కాని అంతదూరం వెళ్ళేవాళ్ళు ఎవరో మహానుభావులు. మనమంతా ఇక్కడే నిలిచిపోతాము. అంతేకాకుండా కామ్యమైన కర్మలకే పరిమితమైతాము. క్వాచిత్కంగా ముక్తి, మోక్షం, జ్ఞానం అనే పడికట్టు పదాలను ఉపయోగించినా అవేమిటో శాస్త్రీయంగా మనకు తెలియదు. ప్రచారంలో ఉన్న భావాలనే వెలువరిస్తుంటాము. ఇంకో తమాషా ఏమంటే అన్నీ చేసేది దేవుడే అని అనుకుంటూ అన్నీ అతనికే అంటగడ్తాము. లోకంలో ఉన్న అవ్యవస్థకు, అక్రమాలకు, దుర్మార్గాలకు, దురాగతాలకు అన్నిటికీ దేవుణ్ణే కారణంగా చూపుతుంటాం. అవన్నీ సరిజేయడేమి అని ఆక్రోశిస్తుంటాం. వైయక్తిక కష్టనష్టాలు, సాంఘిక, సామాజిక వైకల్యాలన్నీ తొలగించమని ప్రార్థిస్తుంటాం. ఆ దేవుడు తనవాడని, తనవంటివాడేనని చనవు తీసుకొని మేలమాడడం, మందలించడం, లాలించడం వంటివన్ని చేస్తుంటాం. ఇదంతా మనకు ప్రాచీన సాహిత్యంలో మహాభక్తుల చరిత్రలలో కన్పిస్తుంటాయి. అనూచానంగా వస్తున్న ఈ భావజాలమంతా మన భక్తి సంస్కారంగా మారుతుంది. కొంచెం హెచ్చుతగ్గులున్నా మనభక్తి దాదాపుగా ఇట్లే ఉంటుంది.

ఈ లక్షణాలన్నీ ‘నా స్వామి’లో పుష్కలంగా ఉన్నాయి. కవి శ్రీ కోడూరి శేషఫణిశర్మగారు తమ ఇలవేల్పు ఇష్టదైవమైన వెంకటేశ్వరునిపట్ల సగుణ సాకార భక్తిని చక్కగా ప్రదర్శించినారు. వీరి కవిత్వం లలిత సుందరంగా, మనోహరంగా, చక్కగా పఠితులనాకర్షిస్తుంది. లోతైన భావాలను చిన్ని చిన్ని పదాలతో సరళమైన శైలిలో వ్యక్తపరుస్తారు. లోక సాధారణమైన అంశాలను కూడా ఆత్మాశ్రయంగా వెలువరిస్తున్నారు. రసగుళికలుగా కొన్ని పద్యాలు భక్తిభావ రంజకంగా అలరిస్తాయి. మధ్యమధ్య చమత్కృతులు, నిష్ఠూరాలు, క్షమాపణలు, భావవైరుధ్యాలు వంటివన్నీ కలగాపులగంగా నుండి ఈ రచన అందరినీ అలరిస్తుంది. విడవకుండా చదివించే లక్షణం ఈ కవి స్వంతం. వెనుకటి రచనలకన్నా ‘నాస్వామి’ మంచి పరిణితిని చూపుతుంది. భావం, భాష, పోటీపడి మనముందుకొస్తున్నాయి. ఛందోబద్ధ రచనలో ఈ లాలిత్యం, సారళ్యం సాధించడం చిన్న విషయమేమీ గాదు.

‘విశ్వం విష్ణుః’ అన్న భావనను ‘‘విశ్వమంతయు నీవని

విశ్వసించి నీవె విశ్వమ్ముకద యను భావమున మెలగు చుంటివి’’ అని విస్తరించినారు.

హరిహరాద్వైతం - ‘శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే’ అన్న దాన్ని ‘‘ఈశుడైనను శ్రీ వెంకటేశుడైననొక్కడే యని నమ్ముచునుందు’’, ‘వరములిచ్చుట యందును స్వామి నాకు భేదమేమియు గన్పడలేదు సుమ్ము’’ - వంటివన్నీ అవే.

కొన్ని చోట్ల ఉదాత్త భావములున్నాయి.

‘‘యత్నపూర్వకముగ నజ్ఞానమును వీడ

జేయుమయ్య! గురుని జేర్చవయ్య’’

‘సాధనమ్ముచేసి జ్ఞానమున్‌ బడయగ

మెట్టునొక్క టొకటి యెట్టులైన

నెక్క నిన్ను జేరనేర్పాటుగా దోచె

స్వామి! అర్థమయ్యె!’’

పేదల కష్టాలు, రైతుల కడగండ్లు, ధనికుల దౌర్జన్యాలు వంటి సామ్యవాదపు పలుకులు పఠితలకు కవినొక మానవతామూర్తిగా స్ఫురింపజేస్తాయి. కవి కుటుంబంలో, ఆత్మీయులలో వైద్యవృత్తిని చేపట్టిన వారెందరో ఉన్నారు. కాని నేటి వైద్య పద్ధతిని నిరసిస్తారు. నిర్భయంగా నిర్మొహమాటంగా దేవుడు ‘‘ట్రీట్‌మెంటు వైద్యులకిమ్మని’’ కోరుతాడు.

‘‘నీదు పాదాలముద్రలు నాదుకనులగాంచగలుగుదు’’ వని తనను దేవుడు గుర్తుపట్టేమార్గం తెల్పుతాడు. ఇదొక గంభీర భావన. రవీంద్రుని గీతాంజలిలో ఇటువంటిదే ఉంది. ‘‘ప్రభూ! నేను నిన్నుగాంచలేను. ఏలన నా కనులలో నీవే ఉన్నావు’’ అని.

నిత్యం నీ స్మరణలోనే ఉంటాను ‘‘నిన్ను స్మరియించనేరని నిముషములను లెక్కగట్టంగనేనియు లేనెలేవు, నిన్ను స్మరించుకాలమ్ము నెన్నబూన సాధ్యపడదయ్య లెక్కించ’’ అని తెల్పుతాడు.

విశ్వనాథ కల్పవృక్షంలో ‘‘జాగ్రదవస్థనననేమి? స్వప్న సుషుప్తుల గూడ నాదగుమానస జిహ్వలు నీదు నామమే మానక సేయుచునుండు’’ అన్న భావనకు సాటి ఇది.

చమత్కారాలు కొల్లలుగా ఉంటాయి. మచ్చుకు

‘‘అలుగలదు నీకు నల్లంత దూరాన, భార్యచెంతనున్న బాధ తెలియు’’

‘‘ఉవిదతోడనూయలూగలవు, పెట్టిపుట్టు బిడ్డ పెనిమిటి వీవయా’’

‘‘అప్పులు చిత్తమందు కలతగలిగించవా! కంటికెటులనిదురవచ్చుట సాధ్యమ్ము’’

‘‘అప్పచేగొని పెండ్లియా! అందుకొరకు వడ్డి చెల్లింపు మాదియా!’’

మొత్తానికి నేటి కాలానికిదొక చక్కని భక్తిరచనగా ఖ్యాతినొందగలదనుట నిస్సంశయము.