- బ్రహ్మశ్రీ పాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి
శ్లో॥ శ్రీ గురు చరణ స్మరణం హరణం శతకోటి జన్మదురితానాం।
ప్లవనం భవసింధు సముద్ధరణం మమాస్తు సచ్చరణం ॥
శ్రీ గురు స్తోత్ర రత్నావళి శ్రీ గురువులు శివసచ్చిదానంద సరస్వతీస్వామి మహత్త్వపూర్ణ సగుణ నిర్గుణ తత్త్వాలను సమన్వయ పరుస్తూ రచింపబడినది.
శ్రీ గురువుల జయంతికి తప్పక హాజరయ్యే అంతేవాసులలో బ్రహ్మశ్రీ పాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రిగారు ఒక జయంతి సందర్భంలో శ్రీ గురువుల కరుణతో శ్రోతస్సుగా వెలయించిన కృతి ఇది. ఇది కేవలం శ్రీ గురు పాదార్పణంగా సమర్పించబడిన లక్ష్మీనరసింహశాస్త్రిగారి వరివస్య.
ప్రథమ శ్లోకములో శ్రీ గురు పాదుకా మహిమ తెల్పబడిరది. సద్గురువుల పాద కమలములను భక్తితో స్మరించడం అనంతకోటి జన్మల పాపరాశినంతటినీ భస్మీపటలం చేస్తుంది. అంతేకాకుండా, సంసార సాగరాన్ని దాటడానికి ఉపకరించే నావ. ఇంతకుమించిన శరణాగతి వేరొకటేమున్నది? అని పేర్కొనబడిరది.
శ్లో॥ సదేక మాద్యం పరమాత్మతత్త్వం గురస్వరూపేణ విభాతిసాక్షాత్।
అణోరణీయాన్ మహతో మహీయాన్ చకాస్తి వేదాంత వినిశ్చితార్థః॥
సచ్చిదానంద రూపమైన పరమాత్మ తత్త్వంలో మొదటిది సత్. అది ఒక్కటే. అన్నిటికీ అదే మూలం. శృతి ప్రమాణానుసారముగా ‘‘ఏకం సత్ విప్రాః బహుధా వదంతి’’. సర్వ జగత్తునకు ఆధారమైన ఒకే ఒక ఆత్మ తత్త్వం. దాన్ని ఎన్నో రకాలుగా పేర్కొన్నారు. కానీ, దాన్ని మనం ప్రత్యక్షంగా దర్శించగలిగేది సద్గురువు రూపంలోనే. అందుకే ‘‘గురుస్సాక్షాత్ పరబ్రహ్మా’’ సాక్షాత్కరించే పరబ్రహ్మమే సద్గురువు. ఆ గురు తత్త్వం అణువుకన్నా అణువు. మహత్తు కన్నా మహత్తు.
ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు వంటి వేదాంతశాస్త్రం నిరూపించిన పరతత్త్వం గురు స్వరూపంగా వెలుగొందుతుంటుంది. సాక్షాత్కరించిన బ్రహ్మమే గురువు.
శ్లో॥ యద్వేదాంత శిరో విభూషణ మఖండానంద కందం మహా
ధీరైశ్శిష్యగణైస్సమా హిత సుసంపన్నైస్సదా సేవితం ।
శాంతం శ్రీ గురుధామ సత్వమఖిలౌన్నత్యం కృపాసుందరం
నిత్యోదార ముపాస్మహే వయమహో!తచ్ఛ్రీ నివాసం మహః॥
భావము: శ్రీశ్రీ శివసచ్చిదానంద సరస్వతీ స్వామిగా ఖ్యాతినొందిన శ్రీగురువుల పూర్వాశ్రమ నామము సాధు శ్రీనివాసశాస్త్రి. గురువులు సిద్ధ సంకల్పులు కావున వారి దేహత్యాగ కాలమునకు ఒకరోజు ముందుగనే సన్యాసాశ్రమం స్వీకరించినారు. వారి పూర్వాశ్రమ నామమే ఈ రచనలో పేర్కొనబడుచున్నది. శ్రీ గురు స్వరూపం ఉపనిషత్తుల ద్వారా సిద్ధాంతీకరింపబడిన నిత్యానంద స్థితికి హేతుభూతం. పరమశాంత స్వరూపం. అన్నిటికన్నా గొప్పది. అనంతమైన దయతో నిండడం వల్ల సుందరమైనట్టిది. గొప్ప ఉదారమైనట్టిది. శ్రీ గురువుల చేత శిక్షణ నొందిన అభ్యాసయోగసాధకులు గొప్ప ఏకాగ్రత కల్గినట్టివారు. ధీర సంపన్నులు. అట్టివారిచేత నిత్యమూ సేవింపబడునట్టిది. ఇట్టి శ్రీనివాస గురుతత్త్వాన్ని నిత్యముపాసించెదనని శ్లోకభావము.
విశేషము: గురువులు తమ ఆధ్యాత్మ విద్యాప్రబోధము ద్వారా శిష్యుల సంస్కారాది యోగ్యతల బట్టి వారికి తగిన స్థాయిలో విద్యలననుగ్రహించేవారు. క్రమంగా తరగతుల వారీగా నేర్చుకోవలసినది విద్య. మన భౌతిక శరీరము మొదలుకొని, సూక్ష్మ, కారణ శరీరాలు (ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, జీవాత్మ పరమాత్మ) వరకు. శాస్త్రం బోధించిన అంశాలన్నింటినీ క్రమమైన సాధన ద్వారా దర్శిస్తూ, దర్శించిన ప్రతిదీ తాను కాదు అని తెలుసుకోవడమే ఆధ్యాత్మ విద్య. దీన్నే క్షేత్రం, క్షేత్రజ్ఞుడుగా భగవద్గీత పేర్కొంది. ఈ విషయాలన్నీ కేవలం గ్రంథాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా విని చదవడం కాకుండా గురుముఖతః శ్రద్ధగా, క్రమంగా నిత్యమూ సాధన చేసి చాలా తరగతులు దాటి, గొప్ప దర్శనానుభవాలను పొందినట్టి సాధక శిష్యులనెందరినో శ్రీ గురువుగారు అనుగ్రహించినారు. ఈ సంగతి పై శ్లోకములో ‘‘మహాధీరైశ్శిష్య గణైస్సమాహిత సుసంపన్నై స్సదాసేవితం’’ అని పేర్కొనబడిరది. శివతత్త్వం, సచ్చిదానంద స్వరూపం. అందుకే శ్రీ గురువులు శివసచ్చిదానందులైనారు. అఖండమైన ఆనందానికి మూలస్థానం అని పేర్కొనడం ద్వారా కొందరు శిష్యులకు అటువంటి అనుభవాన్ని కల్గజేసినారు అని తెలుస్తుంది. ఆది గురువు దక్షిణామూర్తి స్వరూపమైన శివుడే. అందుకే
‘‘సదా శివ సమారంభాం శంకరాచార్య మధ్వమాం।
అస్మదాచార్య పర్యంతాం వందేగురు పరంపరాం॥’’
అని పేర్కొనబడిరది. సదాశివుడైన దక్షిణామూర్తి ఆదిగురువుగా, అద్వైత మత స్థాపకుడైన శంకర భగవత్పాదులు మధ్వముడుగా, స్వగురువు వరకు ఉన్న గురుపరంపరకు ప్రణమిల్లుతున్నానని భావము. గురువులు బోధించిన విద్యా ప్రణాళికలో ప్రతి విద్యనూ సాధకుడు కన్నులు తెరచికొని అందులో చెప్పబడిన విధానాన్ని అనుసరించి, సాధన చేయడం ద్వారా ఆయా దర్శనములతోపాటు ఏకాగ్రతనూ సిద్ధించుకునేవారు. అందుకే వారిని ‘‘సమాహిత సుసంపన్నులు’’గా పేర్కొన్నారు.
శ్లో॥ ఆనందామృతదీధి తేస్తు ప్రభవోహ్యధ్యాత్మ విద్యామహా
ముక్తా కౌస్తుభ రత్న గర్భిత తలో విజ్ఞాన కల్పద్రుమః
నిస్సంకల్ప తరంగ ఏషబుధముక్తి శ్రీనివాసోజ్జ్వలో
గాంభీర్యోన్నత శాంతిపూరిత సుధాంభోరాశి రుజ్జృంభతే॥
భావము: ఈ శ్లోకంలో గురుతత్త్వాన్నొక పాలకడలిగా రూపకంతో వర్ణించబడిరది. దానినుండి వెడలునది ఆనందామృతం. దానిలోనున్న ముత్యములు రత్నములు కౌస్తుభము వంటివన్నీ ఆధ్యాత్మ విద్యలు. దానినుండి వెడలిన కల్పవృక్షము విజ్ఞానము. నిస్సంకల్పమైన అంటే సంకల్పములే లేని నిశ్చల తత్త్వము తరంగములు. ఇది విరోధాభాసము. తరంగములు నిత్యం చంచలంగా ఉంటాయి. కాని సముద్రాంతర్భాగము నిశ్చలత్వమునకు ప్రతీక. పండితులకు ముక్తినిచ్చునది. గాంభీర్యములో ఔన్నత్యమనుపొంది పరమశాంతితో నిండినది శ్రీనివాస గురువుల తత్త్వము ఒక పాలసంద్రమువంటిది. అది దీపిస్తున్నది. ఇక్కడిరకొక విరోధాభాసము. శాంతిపూరితము ఉజ్జృంభిస్తుందట. ఉజ్జృంభిస్తే శాంతిపూరితమెట్టైతుంది. అంటే ఆయా గుణములన్నీ కలిసి ఒక దివ్యతత్త్వాన్ని తేజస్సును వెలువరిస్తున్నాయని అంతరార్థము.
శ్లో॥ లీలామనుష్యదేహప్రకటిత విభవో హృద్యవాత్సల్యకల్యో
యోగజ్ఞానప్రణాళీ ప్రణిహితమధురాధ్యాత్మ విద్యాప్రబోధ
జ్యోత్స్నాసంఫుల్ల శిష్యప్రకరవిమల హృత్కైరవో మోదతేయో
జ్యోతీరూపప్రకాశః సజయమ్ భగవాన్ శ్రీనివాసాఖ్యదేవః
తాత్పర్యం: లీలామానుష విగ్రహము శ్రీగురువులది. అది ప్రకటితమైన తత్త్వవిభావము. శిష్యులపట్లనున్న వాత్సల్యమనెడి నీటి పడియ. ఆధ్యాత్మ దర్శన అభ్యాసయోగమునకు చక్కని ప్రణాళికను ఏర్పరచడం ద్వారా అంటే శిష్యులకు బోధించడం ద్వారా వారి హృదయ కమలములు చక్కగా విచ్చుకున్నాయి. అంటే వారికి అజ్ఞానం అంతరించి జ్ఞానం ఉద్భుధమైనది. ఆ విధంగా వారిని సంతుష్టాంత రంగులను చేసినారు. అది జ్యోతీరూపప్రకాశం. అదే శ్రీనివాస గురువులు. అదే భగవత్తత్త్వము.
ఉత్పత్తించ, వినాశంచ, భూతానామాగతిమ్
గతిమ్ వేత్తి విద్యామవిద్యాంచసవాచ్యోభగవానితి.
సమస్త భూతముల ఉత్పత్తిని, వినాశనాన్ని, సపత్తును, విపత్తును జ్ఞానమును అజ్ఞానమును ఎవడెరుంగునో వాడే భగవంతుడు. అంతేగాక
ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియః
వైరాగ్యస్సాధమోక్షస్య షణ్ణాం భగ ఇతేరినా
సమగ్రమైన అంటే కొరతలేని ఐశ్వర్యము, ధర్మము, యశస్సు సంపత్తు, వైరాగ్యము కైవల్యము వీటిని భగములంటాం. ఇవి ఎవనియందున్నాయో వాడు భగవంతుడు.
లీలామానుష, మాయామానుష అని దశావతారాలలో కృష్ణ, రామ అవతారాలను గురించి చెప్పడం పరిపాటి. ఇక్కడ గురువులు లీలామానుష విగ్రహులు. అంటే కృష్ణతత్త్వం. జ్ఞానోపదేశార్థం గీతాచార్యునిగా లోకోద్ధరణం. కర్మయోజ్ఞానములను చక్కగా నేరుగా అందించడం వంటివన్నీ కృష్ణావతార లక్ష్యాలు. అదే గురువుల తత్త్వం.
ఇంక అధ్యాత్మ విద్యాప్రణాళిక అంతా జ్యోతిర్మయము. జ్యోతిస్సు రూపంగానే విద్యాదర్శనము లున్నాయి. సూక్ష్మతత్త్వాన్ని జ్యోతీరూపంగానే దర్శిస్తామ్. అసలు ‘దేవ’ శబ్దమే జ్యోతిస్సును తెల్పుతుంది. ‘దివ్’ అంటే ప్రకాశం. చైతన్యదీప్తే దైవత్వం. అదే గురువుల లక్ష్యం. బోధ. శిష్యులందరిలో ఆ దీప్తినుత్తేజితము చేసినారు. ఈ విధంగా గురువుల తత్త్వాన్ని సమగ్రంగా ఈ 5 శ్లోకాలలో వివరించినారు వారి శిష్యులలో ముఖ్యులైన బ్రహ్మశ్రీపాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రిగారు.