- శ్రీ గురువులు

(అస్మద్గురువుల రచనకు స్వేచ్ఛానువాదం)

వేదములు రెండు రకాల ప్రయోజనములను కల్గించుచున్నవి. 1) అభ్యుదయం అనగా అభివృద్ధి లౌకిక మౌనమానుషానందము మొదలు బ్రహ్మానందము వరకు. ఇది తైత్తరీయంలోని ఆనందవల్లిలో వివరించినదే. ఈ ఆనందాన్నే స్వవిశేషానందం అంటారు. కర్తృభావనతో అర్థకామనలతో కూడిన ధర్మాచరణ అన్నమాట. ‘చోదనాలక్షణార్థో ధర్మః’ అన్నట్లు వేదమునందు చెప్పిన విధానమే ధర్మాచరణ. దీని వల్ల ఇహపరములలో ఉత్కృష్ట విషయములు పొందవచ్చును. దీన్నే విషయానందం అంటారు. అంటే రిలేటివ్‌ అన్నమాట. ఒకదాన్ని ఆధారంగా పొందే ఆనందం. ఇది తాత్కాలికం. అర్థకామనలలో అర్థము రెండు రకాలు. అది ఒకటి ఐహిక ధనము. అంటే ఈ లోకానికి సంబంధించినది. వయో ధన పశు బంధు వస్త్ర పుత్ర గో అశ్వ భార్యా అధ్యయనాది రూపములుగా ఉంటుంది. రెండవది దైవీధనము. అనగా ఏఏ విషయానందలాభము ఏఏ దేవతాధీనమై

ఉంటుందో తెలియడం అన్నమాట. వీటినే మానుష, దైవీధనములందురు.

‘‘యో అర్థవిత్‌ సకలమ్‌ భద్రమశ్నుతే’’

కామ్యప్రదయైన దేవతా జ్ఞానం లేక చేసే ధర్మాచరణకు ఉత్కృష్ట ప్రయోజనం ఉండదు. దీనినే ‘అవిద్య’గా పేర్కొన్నారు. దేవతా విజ్ఞానం కల్గి చేసే ధర్మాచరణకు ‘విద్య’ యని పేరు.

ఈశావాస్యమునందు పై రెండు విధాల ధర్మాచరణం చేసే వారికి మాత్రమే భద్రమైన స్థితి లభిస్తుందని పేర్కొనబడిరది.

‘‘అంధతమః ప్రవిశంతి యో-విద్యాముపాసతే

తతోభూయయువతే తమోయమ విద్యాయాగ్‌ రతాః’’

పై రెంటిలో ఏదో ఒకదాన్నే ఆచరించే వారు అంధతమస లోకాలను పొందుతున్నారు.

అందుకే దేవతాజ్ఞానం పొందేందుకు యోగము ఉపదేశించబడిరది. స్వాధ్యాయము, యోగము రెండూ పరస్పర పోషకాలు. రెండూ అభ్యసనము చేయవలసినదే.

‘‘స్వాధ్యాయా ద్యోగ ఆశీత్‌, యోగాత్‌ స్వాధ్యాయ అవసేత్‌’’

స్వాధ్యాయమునుండి యోగము, యోగానుభవం పొందిన పిదప మరల స్వాధ్యాయం చేయవలెను.

స్వాధ్యాయం అనగా వేదాధ్యయనం అని అర్థం.

శంకరులు కూడా ‘‘శాంతో భవ వత్స్‌! స్వాధ్యాయమ్‌ యోగమ్‌ చానుతిష్ఠ. తధా తే శ్రేయోభవతి’’ అని బోధించినారు.

కేవలం వేద శాస్త్ర అధ్యయనం వల్ల బహిః ప్రవృత్తి మాత్రమే అలవడును. మేధావితత్వమును పొందుటకు సమాహిత యోగాభ్యాసమును చేయవలెను. అటుల చేసినప్పుడు శ్రేయోలాభము చేకూరును. కాని ఈ రెండు మార్గములు కూడా జననమరణ చక్రమునుండి తప్పింపలేవు. కారణము అవి కామనా విద్ధములగుటయే. అందుకే వేదార్థరూప రహస్యాన్ని జనులందరికి తెలియజేయ వలెనని జన్మరహితుడు, పూర్ణకాముడు, నిత్యశుద్ధబుద్ధ పూర్ణానందరూపుడగు పరమాత్మలోకానుగ్రహబుద్ధితో శ్రీకృష్ణునిగా నవతరించి, కురుక్షేత్రమున పాండవమధ్యముడైన అర్జుననకు భగవద్గీతగా బోధించినాడు.

ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నించుటతో అది ప్రారంభమగును

ధర్మక్షేత్రే కురుక్షేత్రే

సమవేతాయుయుత్సవః

మామకాః పాండవాశ్చైవ

కిమకుర్వత్‌ సంజయ.

కురుక్షేత్రం ధర్మక్షేత్రం. అంటే ధర్మమే ప్రధానమైనది, ధర్మమునిచ్చునది, ధర్మనాశనమునుండి రక్షించునది, నివాసమాత్రముననే ధర్మఫలమునిచ్చునది అని అర్థం. అక్కడ యుద్ధానికి సిద్ధమైన తన పుత్రులు, పాండవులు ఏమేమి చేసినారని ప్రశ్నించినాడు.

యుద్ధమున సిద్ధమైన రెండు పక్షములను చూచి దుర్యోధనుడు ద్రోణాచార్యునితో యుద్ధ వివరములను ప్రస్తావించినాడు. రెండువైపులనున్న వీరుల బలాబలములు, సేనల సంఖ్య, వంటివన్ని వివరించి అప్రమత్తతో జయమునొంద వలెనని కోరినాడు. వెంటనే భీష్మద్రోణాదులందరూ సింహనాదములను, శంఖనాదముల నొనరించినారు. పోటీగా పాండవసైన్యము రణభేరీనాదములను సల్పెను. అప్పుడు కృష్ణునితో అర్జునుడు ప్రతిపక్షమునందరి వీరులను చూడవలెనని యున్నదని కోరినాడు. వెంటనే అర్జునుని రథమును సేనామధ్యమునకు పరమాత్మతోలుకొని వచ్చినాడు. సమస్త బంధువర్గమును చూచి అర్జునుడు అధిక కృపావశుడై పరితపించుచు కృష్ణునితో ననుచున్నాడు.

ఇక్కడి నుండి స్వధర్మత్యాగ, పరధర్మస్వీకరణ రూపమగు అర్జునుని భ్రాంతి నిరూపితమగును. శరీరరము స్వాధీనము తప్పినదని, నోరెండుకుపోతున్నదని, వణుకున్నదని, చేతినుండి గాండీవము జారిపోతున్నదని, నిలుచుటకు శక్తి లేనివాడనయినానని విలపించినాడు. స్వజనవధ సేయవలెనాయని వాపోవుచు, యుద్ధము చేయనని విజయమక్కరలేదని, రాజ్యభోగములపై నాశలేదని పేర్కొన్నాడు. ముల్లోకములు చేకూరునన్నను స్వజనబంధువధ చేయనన్నాడు. అది పాపహేతువుగా పేర్కొన్నాడు. కాని నీతి శాస్త్రముననుసరించి

‘‘అగ్నిదోగరదశ్చైవ శస్త్రపాణిర్థనాపహః

క్షేత్రదారాపహర్తా చ షడితేహ్యాతతాయినః’’

‘‘సఏవ పాపిష్టితమో యాః కుర్యాత్‌ కులనాశనమ్‌’’

‘‘అర్థశాస్త్రాత్తు బలవాన్‌ ధర్మశాస్త్రావితిస్థితః’’

దురాశాయుక్తమనస్కులగు దుర్యోధనాదులను చంపవలెననే బోధించు చున్నావు, నాకిది యుక్తముగా తోచుటలేదన్నాడు.

‘ఆహూతో నవివర్తేత ద్యూతాదపి, రణాదపి’

పిలువబడిన క్షత్రియుడు జూదమునుండిగాని, యుద్ధమునుండిగాని వెనుకకు బోరాదు అన్న నీతిశాస్త్రానుసారం జూదధనం, యుద్ధధనం క్షత్రియునకు ధర్మధనమే అగుచున్నది. ప్రజానాశనము కులనాశనము జరుగును యుద్ధము వలన, కులనాశనము వల్ల కులమునందలి పురుషులందరు మరణించుట వలన సనాతన ధర్మాచరణము కుంటువడును. స్త్రీలంతా స్వేచ్ఛకు లోబడి దుష్టులగుదురు. సంకరసంతానం కల్గును. వీరివల్ల పితృకర్మలన్నీ లుప్తమై పితృదేవతలు విలపించుదురు. వర్ణాశ్రమ ధర్మము గతిదప్పును. దీనికి కారకులైనవారికి శాశ్వత నరకనివాసము తప్పదని ధర్మశాస్త్రవచనం. అన్నీ తెలిసి తెలిసి పాండవులమైన మేము ఈ విధమైన ధర్మద్రోహం చేయతగదు. ప్రాణివధ చేయకుండుటే శ్రేష్టమని పల్కెను. శరచాపములను త్యజించి శోకమోహములచే చలించిన మనస్సుతో అర్జునుడు రథములో కూలబడెను. (విషాదయోగ సారాంశం సమాప్తం)

ద్వితీయోధ్యాయం:

‘తం తథా కృపయావిష్టమశ్రు పూర్ణాకులేక్షణం

విషేదం తమిదం వాక్సమువాచ మధుసూదనః’

అహింస, భిక్షాటన పరమధర్మములనియెడు బుద్ధిచే అర్జునుడు యుద్ధ విముఖుడైనాడని తెలిసి, ధృతరాష్ట్రుడు తన కుమారులకే విజయము తథ్యమని స్థిరపరచుకున్నాడు. ఈ విధముగా భావించిన రాజుకు సంజయుడు ఈ విధంగా చెప్పుచున్నాడు.

అహంకారమమకార భ్రాంతిచేత అసంగతమగు కృపా పరవశుడై కన్నీరు కార్చుచు దుఃఖించుచున్న అర్జునుని గురించి పరమాత్మ ఈ విధంగా పలుకుచున్నాడు. శ్రీ భగవానువాచ!

‘‘కుతస్త్వాకశ్మలమిదం విషమేసముపస్థితం

అనార్యజుష్టం, అస్వర్గ్యం అకీర్తికరమర్జున!’’

ఓ అర్జునా! క్షత్రియ శ్రేష్టుడవైన నిన్ను ఇట్టి సంకట సమయములో పామరజన సేవితమై, స్వర్గహేతువునుకాని, అపకీర్తిని కలిగించెడి, భ్రాంతిజన్య కృపా పరవశత్వము కన్నీరు కార్చుట, దుఃఖించుట యనునవి శిష్ఠులు మెచ్చరు. దీనికి కారణమేమి? మోక్షమును కోరియా? స్వర్గమును కోరియా! కీర్తిని కోరియా? మొదటిది కూడదు. ముముక్షువులు స్వధర్మానుష్ఠామువల్ల చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రతను కోరుదురు. స్వధర్మత్యాగమును నెట్టిపరిస్థితులలోను కోరరు. స్వర్గకామనయుకా కూడదు. ఏలన స్వధర్మ త్యాగికి స్వర్గము లభించదనే శాస్త్రములు ఘోషించుచున్నవి. మూడవదైన కీర్తికామనకస్సలు స్థానములేదు. శూరాగ్రగణ్యుడవని కీర్తినొందిన నీవు ఇప్పుడు యుద్ధవిముఖుడవని తెలిసిన శత్రువులు పవిహసిస్తారు. అది అపకీర్తికారణమే గదా!

నీ దుఃఖము, కృపావిష్టత, భ్రాంతి జన్యమాలిన్యము నిన్నెట్లు గూడెనో తెలియకున్నది. నీవు చెప్పిన మాటలు ధర్మాభాసమేగాని ధర్మముగాదు. అది నీ క్లైబ్ల్యము సూచించుచున్నది. ఇంతపిరికితనము నీకెక్కడిది? నీ హృదయ దౌర్బల్యం నీవివేకమును మింగినది. లెమ్ము అని పల్కిన కృష్ణునితో అర్జునుడు పల్కుచున్నాడు. పూజార్హులైన మహానుభావులు భీష్మద్రోణాదులు. వారిని వధించడం మహాపాపము గురువధ బ్రాహ్మణవధ కోరదని శాస్త్రవచనం. రాజసూయాది యాగములచేత రాజు బ్రాహ్మణుడే అగుచున్నాడు. అట్టిరాజు తిరస్కార బుద్ధితో బ్రాహ్మణవధ సల్పిన పాపిష్ఠుడై నరకము నొందును. పితృహత్యా సమానము అది. నీవన్నట్లు నేను పిరికి పందనై యుద్ధము వద్దనలేదు. పాప భీతితోడనే అనుచున్నాను.

‘‘గురోరప్యవలిప్యస్య కార్యాకార్యమజానతః

ఉకృధం ప్రతిపన్నస్య పరిత్యాగో విధేయతే!’’

ధర్మమార్గమును విడిచి గర్వించెడి గురువును విడిచిపెట్టవలెను. అంతేకాని వధించరాదని నీతిశాస్త్రము. దానికన్నా భిక్షాటనమే శ్రేష్ఠము. కాని నా మనస్సు భ్రమచెందియున్నందున నిర్ణయించలేకున్నాను. యుద్ధమా, భిక్షాటనమా! యుద్ధము చేసినంత మాత్రమున జయము కల్గుననెడి నిశ్చయము లేదు కదా! నేను కృపణుడను. అనగా జితేంద్రియుడనుగాను. కావున ధర్మసూక్ష్మనిర్ణయము చేయజాలను. నాకేది శ్రేయస్కరమో దానిని నిర్దుష్టముగా వివరించుము. అని ప్రార్థించినాడు. ఇది నిజమైన శిష్యునిలక్షణం. సత్యరహస్యమును శరణన్న శిష్యునికే ఇవ్వవలెను. ‘‘నా పుత్రాయాశిష్యాయవదేత్‌’’ ఇంతవరకు మన మధ్య గురుశిష్య ధర్మములు లేవు. కేవలం బంధుత్వమే. స్నేహమే. నీకన్నా సంశయచ్ఛేత్తయగు గురులెవరున్నారు నాకు. నన్ను తగు విధముగా శిక్షించి నడుపుము. నేను నీకు సర్వాత్మనా శిష్యుడను. నీవు సర్వజ్ఞుడవు. నేను అల్పజ్ఞుడను. పరమపురుషార్థమైన శ్రేయస్సునే కోరెదను. అన్న అర్జునుని మాటలు విని శ్రీకృష్ణుడు ‘‘నా-పృష్టః కస్యచిత్‌ బ్రూయాత్‌’’ పది ప్రశ్నించనవానికి బోధించరాదనే నియమానుసారం ఇంతవరకు మౌనము వహించి అర్జునునిలోని మార్పును గ్రహించి పరహసించు వానివలె ఈ విధముగా పలుకుచున్నాడు పరమాత్మ.

నీవు విషాదమును చెందుటకు కారణములేదు. దీనుల అనాథలను వధించుటకు కృపావిషాదములు కల్గవలెనేగాని శత్రువులను వధించుటకుగాదు. క్షాత్రధర్మానుసారం యుద్ధమునకు వచ్చిన వారు మూర్ఖులుకాదు. మరియు బలహీనులు కాదు. వారందరినీ హతమార్చుదునని నీవెటుల భావించెదవు? నాతో నీ పరాక్రమమునుగ్గడిరపకుము. నా సహాయమువల్లనే చంపగల్గుదువా! అప్పుడు నీ కర్తృత్వమేలేదు. దుఃఖమునకు అవకాశమే లేదుకదా! కావున నీది ఆత్మవంచనే గాని ధర్మబద్ధముకాదు. అది విని లజ్జితుడైన అర్జునుడు సత్యబోధకు ఆభిముఖ్యుడైనాడు. భగవద్గీత ఆవిర్భవించెను.