- శ్రీ గురువులు

  1. శ్రీ భీమా అమరజాతటీం అధివసన్‌, శ్రీశో అవధూతోముదా

    దత్తాత్రేయ సురోత్తమో అవతి, నిజాన్‌ త్రయ్యంత చూడామణిః।

    పాపారణ్య దవానలో అమిత కృపారాశి రీశోపిసన్‌,

    భూత్వా శ్రీ యతిశేఖరో, విజయతేగాణ్గాపురేసంతతం॥

ఉపోద్ఘాతము:- శ్రీ గురువులు శివ సచ్చిదానంద సరస్వతీ స్వామి కర్నాటక ప్రాంతంలోని గాణగాపురంలో చాలాకాలం తపస్సమాధి స్థితిలోనుండి దివ్యదర్శనానుభవం ద్వారా సంపూర్ణ బ్రహ్మవేత్తలై లోకోద్దరణ కోసం యోగ దర్శన ప్రణాళికను ఏర్పరచిన సంగతి విదితమే. గాణగాపురక్షేత్రము శ్రీ గురుదత్త క్షేత్రములలో అత్యంత ప్రాచుర్యమునొందినది. మిగుల ప్రభావవంతమైనది. నిర్గుణ పాదుకా రూపంలో ఇప్పటికి శ్రీ నృసింహసరస్వతీ అవతారమున శ్రీ దత్త ప్రభువు భక్తులను రక్షిస్తూనే ఉన్నారు. నిర్గుణ పాదుకాదర్శన ప్రథమక్షణముననే శ్రీ గురువుల వాగమృతధారగా వెలువడినది శ్రీ పాదుకా పంచకస్తోత్రమే. అట్టిదే శ్రీ గురునాథాష్టకము కూడ.

భావము:- గాణగాపురము భీమా, అమరజా అనే రెండు నదుల సంగమ తీరముననున్న క్షేత్రము. ఇక్కడ దత్తాత్రేయులు కొలువున్నాడు. అవధూత స్థితిలో సత్యజ్ఞాన స్వరూపంగా నరసింహసరస్వతీ అవతారంలో ఈ క్షేత్రంలో నిత్యం శరణార్థుల పాపములను తొలగిస్తూ అవ్యాజకరుణామూర్తిగా విరాజిల్లు తున్నారు.

  1. యోనాదివ్యధునీం దధార శిరసా, వామాంగశైలాత్మజః

    యోవై చక్రధర స్సురేఢ్య విభవో, వక్షస్థ చంద్రానుజః।

    యోవా జంతువితాన సర్జన చణో, వాణీ విలాసావధిః

    సోయం శ్రీయతిరాట్‌ అపారకరుణో, బాభాతి గాణ్గాపురే॥

భావము:- తలపై సురగంగను ధరించి ఎడమవైపు పార్వతితో కూడిన మహేశ్వర, శంఖ చక్రధారియై మహావైభవోపేతమైన శ్రీ లక్ష్మిని వక్షఃస్థలమునందు ధరించిన శ్రీ మహావిష్ణువు, సర్వజీవజాలాన్ని సృష్టిస్తూ సరస్వతీవిలాసానికి పరమావధియైన బ్రహ్మ, ఈ ముగ్గురితత్త్వముల సమైక్య స్వరూపంగా శ్రీ దత్తప్రభువు అపార కరుణామూర్తిగా, గాణగాపురంలో వెలసినాడు.

  1. సోయం శ్రీయతి రాట్‌ విధిఃయది నచేత్‌ వంధ్యాప్రసూతాకథం

    శ్రీశోనైవ యతీందురేషయది భోభాగ్య ప్రదత్వం కథం ।

    నైవాయంమదనాంతకోయది యతిః ప్రాణ ప్రదత్వం కుతః

    తస్మాదేషయతి త్రిమూర్తిపదభాక్‌ బాభాతి గాణ్గాపురే॥

భావము:- పై శ్లోకంలో గురుదత్త స్వరూపము త్రిమూర్త్యాత్మకము అనే విషయం నిరూపించబడిరది. శ్రీ గురుచరిత్రలో నృసింహసరస్వతీ అవతారంలో భక్తుల నుద్ధరించే వివిద ఘట్టాలున్నాయి. వాటిలో శ్రీ నరసింహ ప్రభువు చూపిన మహిమలను ఆధారంగా త్రిమూర్తుల తత్త్వాలను నిరూపిస్తున్నారు. నృసింహయతి బ్రహ్మకాకుంటే గొడ్రాలికి సంతానము కలుగునట్లుగా ఎలా తన మహిమను చూపగలడు. లక్ష్మీపతి శ్రీ మహావిష్ణువు కాకుంటే ఏ విధంగా దరిద్రులైన భక్తులకు సంపదలనొసంగగలదు. నృసింహయతి శివుడు కానప్పుడు చచ్చినవాడిని తిరిగి ఎలా బ్రతికించగలడు. కాబట్టి యతి శేఖరుడైన శ్రీ నృసింహసరస్వతి త్రిమూర్తి స్వరూపంగా గాణగాపురంలో ప్రకాశిస్తున్నాడు.

  1. సోయం శ్రీయతిరాట్‌ ఉపేత్య, కృపయాగాణ్గాపురే సద్గురుః

    దేవానీక సమర్చిత అంఘ్రియుగళః సద్భక్త చింతామణిః

    అన్యాత్యంత సుదుష్కరాణి, కృతవాన్‌ చిత్రాణి కర్మాణ్యహో

    సాకల్యేన నకోపి వక్తుమధికో, భువ్యస్తితా నీశితుః

భావము:- సద్గురువు శ్రీ నృసింహసరస్వతీ యతీశ్వరులు కృపతో గాణగాపురము నందు సద్భక్తచింతామణిగా సకల దేవతల చేత అర్చింపబడుచున్న పాదపద్మములతో విరాజిల్లుతున్నాడు. చిత్రములైన మహాద్భుతములైన ఇతరుల కెవ్వరికి శక్యముకానట్టి మహిమలను ప్రదర్శించి భక్తులనుద్ధరిస్తున్నాడు. ఈ భూలోకమునందు వారికి సాటిరాగలవారెవురూ లేరు.

  1. కైలాస అచల కందరాంతరఃలసన్‌ న్యగ్రోధ భూజాంతకే

    మౌనీశాన్‌ సనకాది సిద్ధనికరాన్‌, ఉద్దార్యయః ప్రేమతః

    ఉద్దర్తుంభువిదానవర్గమధునాశ్రీ దక్షిణాస్యోగురుః

    సోయంశ్రీయతిరాడనంత మహిమాబాభాతి గాణ్గాపురే॥

భావము:- కైలాస పర్వత శిఖరవాసిగా సదాశివరూపంలో మఱ్ఱిచెట్టు క్రింద సనకాది సిద్ధసమూహానికి దక్షిణామూర్తి స్వరూపంగా మౌనవాఖ్యతో బ్రహ్మతత్త్వాన్ని బోధిస్తూ వారినుద్ధరించిన శ్రీ దక్షిణామూర్తి గురుదేవులు ఇప్పుడు భూలోకము నందలి ఆర్తభక్తదాసవర్గములను ఉద్దరించేందుకై నృసింహయతిగా గాణగాపురము నందు విలసిల్లినారు.

  1. త్వాం ఆనందఘనంయతీశ । శరణంయాతో దయాబ్దే అవమాం

    అజ్ఞానాంధ నిమగ్నమస్త ధిషణం దేహాది అహంతా వృతం

    హత్వా అంతఃకరణస్థ శత్రునివహం ఛిత్వాపి పాశాష్టకం

    దత్వాత్వచ్చరణాబ్జ సంతతమతిం సర్వాన్తర శ్శ్రీగురో॥

భావము:- ఆనంద స్వరూపుడవైన శ్రీ నృసింహయతీశ్వరా! హే కృపాసింధో! శరణు శరణు. అజ్ఞానాంధకారంలో మునిగిన బుద్ధిగలవానిని దేహాది ఆవరణములతో కూడిన వానినైన నా అరిషడ్వర్గాన్ని నశింపజేసి భవబంధాలను తెంచి నిత్యం నీ చరణారుణ నవ పద్మధ్యానమతినిగా మార్చి ఉద్ధరించుప్రభో.

  1. త్వన్నామ్ని అస్తి గురూత్తమా అఘహరణేశక్తిః విభోయావతీ

    తావత్‌ కర్తుం అసౌఅఘందురితకృన్నాలం, స్వపూర్ణయుషా,

    ఇత్యస్తి స్మృతిరీశమయ్య ఘకణో నాల్పోపితత్‌ స్మర్తరి

    తస్మాత్‌ మాం అవిచార్య దేహి, సుపదం శృత్యంతరాద్ధాంతికమ్‌.

భావము:- గురునామ స్మరణ సర్వపాపములను నశింపజేసే శక్తికలది. అట్టి నామ స్మరణ యనె సేవతో నిన్ను భజిస్తాను. ఓ ప్రభో! నా పాపరాశిని నీ స్మరణ కారణంగా నశింపజేసి నాకు మోక్షాన్ని ప్రసాదించు.

  1. శ్రీ గాంధర్వ పురాబ్జ భాస్కర గురో, త్వత్పాదుకాబ్జ ద్వయం

    దేవేంద్రాది కిరీటకోటి మణిభిర్నీరాజితం నిర్మలం

    మూలాజ్ఞాన విభావరీ విమధనప్రోద్యత్‌ శతార్కప్రభం

    సత్యజ్ఞాన సుఖప్రదాన చతురం, త్వద్దర్శనే కారణమ్‌.

భావము:- గాంధర్వ పురమనెడి పద్మమును వికసింపజేయు సూర్యుడవైన ఓ గురుదేవా! నీ పాదుకా పద్మద్వయం దేవేంద్రుడు మొదలుగా గల సర్వదేవతల కిరీటముల యందలి మణుల నీరాజనమును నందుకొనునట్టిది. పరమశుద్ధమైనది. సర్వ దుఃఖములకు మూలమైన అజ్ఞాన మనెడి చీకట్లను చెల్లాచెదురుచేసే వంద సూర్యులు కలది సత్యమైన జ్ఞానాన్ని తద్ద్వారా నిత్యానందాన్ని ప్రసాదించుటకు సమర్థమైనది అట్టి చరణ పద్మయుగళమును ధ్యానిస్తాను.

  1. స్వామిన్‌ మత్స్య సుకూర్మ కోల నృహరీ శ్రీవామన శ్రీధర

    శ్రీరామావనిపాలహంతృముసలీశ్రీకృష్ణ బౌద్ధాభిద

    శ్రీ కల్క్యాద్యవతార కేళిభిరిమాం అపాల్యగాంప్రేమతః

    పాసి, ఈశోఅపి, అధునా నిజాన్‌ గురువర స్వీకృత్యతుర్యాస్రమం

భావము:- హే నృసింహయతీశ! మత్స్యకూర్మవరాహ నృసింహ వామన పరశురామ, రామ, శ్రీకృష్ణ బుద్ధకల్కి అనెడి దశావతారములలో లోక కంటకులైన రాక్షస దుష్టులను తునుమాడి భూమిని కరుణతో రక్షించినావు. ఇప్పుడు తురీయాశ్రయమైన యతీశ్వర స్వరూపంలో ఈ లోకము నుద్ధరించుటకు అవతరించినావు ప్రభూ.

  1. నుతిరేషా గురుప్రీత్యై శ్రీనివాసము ఖోద్గతా।

    పఠతామిష్టఫలదా భవతాత్‌ అఘశోధినీ॥

    ఇతి శ్రీ గాంధర్వ పురశ్రీగురునాథాష్టకమ్‌ సంపూర్ణమ్‌.

భావము:- ఈ స్తోత్రము శ్రీ గురువుల ప్రీతికై సాధు శ్రీనివాస శాస్త్రిముఖమునుండి ప్రభవించినది. దీనిని భక్తితో పఠించువారలకు సకలేప్సితార్థసిద్ధి, పాపనివృత్తి కలుగగలదు.

శ్రీ గాంధర్వపుర గురునాథాష్టకమ్‌ సంపూర్ణమ్‌!

సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు!

శ్రీ గురుశ్శరణం మమ!