‘‘భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు,
శూలికైన తమ్మి చూలికైన
విబుధజనుల వలన విన్నంత కన్నంత
తెలియవచ్చినంత తేటపరతు.’’ (- పోతన భాగవతం)
భాగవతాన్ని గూర్చి తెలుసుకొనుట, దానిని గూర్చి పలుకుట ఈశ్వరునకైనను, బ్రహ్మకైనను, చాలా కష్టము. అట్టి భాగవతాన్ని నేను విన్న దానిని చూచిన దానిని, నాకు తెలిసిన దానిని తేట తెల్లము చేయుదును.
అంత కష్ట తరమని చెప్పుతూ చెప్పిన భాగవతమే యింత గొప్పగా మందార మకరంద మాధుర్యాలు నింపుకొన్నదీ అంటే పోతన మదిలో భాగవతం ఇకా ఎంతటి గొప్పగా అమృతోపమానమై నిలిచినదో కదా. అట్టి మహాకవి రచించిన తెలుగు భాగవతం వలన ఎందరు భక్తులు ముక్తినొందారో కదా.
తెలిసి పలుకుట, తెలియక పలుకుట ఈ రెండిరటికీ తేడా ఏమి? మనమంతా తెలియక పలుకుతుంటాం. తెలియడం అంటేనే జ్ఞానం అని అర్థం. జ్ఞానులనే విబుధవరులుగా పోతన్న పేర్కొన్నాడు.
అసలు భాగవతం అంటే ఏమి? భగవంతునికి సంబధించినదని అర్థం. భగవంతునికి సంబంధించనది ఏదైనా ఉందా? అని ప్రశ్న. ‘సర్వం ఖల్విదం బ్రహ్మ’ అన్న మహావాక్యాను సంధానమే భాగవతం. అంటే జీవ జగత్తు లన్నమాట. జీవుడవైన నీవు నీచుట్టూ ఉన్న జగత్తు అంతా భాగవతమే. ఈ వివేకం కలిగి ఉండడమే బ్రహ్మాకారవృత్తి. అది అనుభవానికి రావడమే బ్రహ్మానుభవము. అట్టి అనుభవాన్ని పొందినవాఱే విబుధజనులు. వాఱే సద్గురువులు. ప్రకృతానికి వ్యాసభగవానుడు, శుకబ్రహ్మ. వారివలన విన్నంత అంటే శ్రవణం, కన్నంత అంటే మననం, తెలియవచ్చినంత అంటే నిధిధ్యాసం ఈ 3 సాధనల ద్వారా పొందిన బ్రహ్మానుభవం పొందినవాడు పోతన్న. అందుకే అతన్ని ‘‘పోతన్న తెలుగుల పుణ్యపేటి’’ అని కొనియాడుకున్నాము.
భాగవతం అంటే జగత్తు ద్వారా భగవత్తత్త్త్త్వం తెలుసుకోవడం అన్నమాట. దీన్ని భగవద్గీత ద్వారా నిరూపిద్దాం.
‘‘అహం సర్వస్వ ప్రభవః
మత్తః సర్వం ప్రవర్తతే
ఇతి మత్త్వా భజంతే మాం
బుధాః భావ సమన్వితాః’’
(పరమాత్మ) నా నుండే అంతా పుట్టింది. నా వల్లే సర్వజీవులు వ్యవహరిస్తున్నాయి. అని తెలుసుకున్న వారే నిజమైన పండితులు. వారే బ్రహ్మవేత్తలు.
శంకరులు భాష్యంలో భావం అంటే పరమార్థాభినివేశం అని పేర్కొన్నారు. అంటే బ్రహ్మజ్ఞానం.
భావసమన్వితాః అనేదాన్ని అవగతపరమార్థతత్త్వాః అని వివరించినారు. సంకేతం ద్వారా సత్యాన్ని పట్టుకునే వారే విబుధవరులు.భాగవతమంతా సంకేతమే. దానిద్వారా పరమార్థాన్ని అనుభవానికి తెచ్చుకున్నవారే వ్యాస శుక పోతనాదులు.
ఇంకోరకంగా చెబితే శబ్దార్థాలలో శబ్దం ద్వారా అర్థం పట్టుకోవడమన్నమాట. భాగవతమంతా శాబ్దిక ప్రపంచం. దానిద్వారా అంటే అందలి కథలు పాత్రల ద్వారా పరమాత్మను పట్టుకోవడమే. ఇదే విమర్శ ద్వారా ప్రకాశాన్ని పట్టుకోవడం. అందుకే అమ్మవారు ‘‘శివదూతి’’ అయినది.
ఈ సారవంతమైన రహస్యాన్ని భాగవతంలోని చివరి శ్లోకం వివరిస్తుంది.
‘‘కథా ఇమా స్తే కథితాః మహీయసాం
విహాయ లోకేషు యశః పరీయుషాం
విజ్ఞాన వైరాగ్య వివేక హేతోః
విభూతిరేషాః న తు పారమార్థికం.’’
‘‘ఓ పరీక్షిత్తూ! నీకు వివరించిన మహనీయుల కథలన్నీ పరమాత్మ విభూతులుగా తెలుసుకో.వానివల్ల నీకు కల్గవలసినవి వీవేకం, విజ్ఞానం, వైరాగ్యం, అంతే కానివాటినే పరమార్థమని భావించకు’’ అని శుకుని ద్వారా వ్యాసభగవానుడు మనలను హెచ్చరిస్తున్నాడు.
దీనినంతా త్యాగరాజు క్రింద పేర్కొన్న కీర్తనలో వివరిచినారు. ఆయన తెలిసి రామచింతన చేసినాడు.
తెలిసి రామ చింతనతో నామము సేయవే ఓ మనసా తలపులన్ని నిలిపి నిమిషమైన తారక రూపుని నిజ తత్వములను...తెలిసి రామ
రామాయన చపలాక్షుల పేరు కామాదుల పోరు వారు వీరు రామాయన బ్రహ్మమునకు పేరు ఆ మానవ జననార్తులు తీరు...తెలిసి రామ
అర్కమనుచు జిల్లెడు తరు పేరు మర్కట బుద్ధులెట్టు తీరు అర్కుడనుచు భాస్కరునికి పేరు కు-తర్కమనే అంధకారము తీరు...తెలిసి రామ
అజమనుచు మేషమునకు పేరు నిజ కోరికలేలాగీడేరు అజుడని వాగీశ్వరునికి పేరు విజయము కల్గును త్యాగరాజ నుతుని...తెలిసి రామ
ఓ మనసా! ఆ పరతత్వ స్వరూపుడైన రాముని త్యాగరాజుచే పొగడబడే వానిని తలచుచు ఆ తత్త్వ స్వరూపుడి నామమును సదా పఠించు, స్మరణచేయు మరవకుండా. అది కూడ ఎలాగు అంటే మన మనస్సులో వచ్చే ఆలోచనలన్ని కూడ ఆపేసి లేదా రాకుండా సాధన చేసి కనీసము ఒక్క నిమిషము పాటు మన మనస్సుని ఆ రాముని పాదాలపై లగ్నము చేసి, తరింపచేసే మహిమాన్వితమైన రూపము కలిగిన శ్రీరాముని మరియు అతని తత్త్వములను తలచుకొంటూ స్మరణ చేయవే ఓ మనసా.
రామ అని స్త్రీలకు (చపలాక్షులు) (చంచలమైన కన్నులు కలవారు) పేరు, ధ్యానములో ఉన్నప్పుడు ఆ పరతత్త్వమైన రాముడికి బదులు ఈ స్త్రీలను తలచిన దాని పర్యవసానము కామాది అరిషడ్వర్గమునకులోనై పతనము అవుతాము. కాని ఆ బ్రహ్మ స్వరూపుని తలచితే మానవుల పుట్టుకకు కల కారణం తెలసివాడి అన్ని కోరికలను తీర్చివేసి ముముక్షత్వమును ప్రసాదించగలదు ఆ రామ నామము దానిని స్మరించు.
అర్కము అంటే జిల్లేడు చెట్టుకు పేరు, మనలోని కుతర్కము లేదా వృథాగా వాదించుట అనేది అంధకారము. అంటే కటిక చీకటి లేదా అజ్ఞానము దానిని తోలగించే వాడు భాస్కరుడు ఇతనికి కూడ అర్కుడు అన్న పేరు వుంది. మానవుడి బుద్ధి కోతితో సమానం నిలకడ లేకుండా వుండును, ధ్యానములో కూడ మన బుద్ధి కొతిలా నిలకడ లేకుండా వుండును. ధ్యానించునపుడు ఆ భాస్కరుడికి (రాముడికి) బదులుగా జిల్లేడును స్మరించిన ఎడల అది నిష్ప్రయోజనము. నిలకడ కోసం ఆ రవి వంటి రాముని ధ్యానించు.
అజము అంటే మేక దానిని స్మరించిన మన కోరికలు ఎలా ఫలిస్తాయి. అజుడు అని ఆ బ్రహ్మకు (వాగీశ్వరుడు) పేరు అటవంటి ఆ బ్రహ్మను (సృష్టికర్తకు తండ్రి అయిన) రాముని తలచిన మన కోరికలు తీరి విజయము చేకూరును. కావున అట్టి పరబ్రహ్మను, అజ్ఞాన ఛేదకుణ్ణి, మన్మథ జనకున్ని సదా ధ్యానించు. అనే బోధద్వారా త్యాగరాజు రామచంద్రపరబ్రహ్మాన్ని నాదోపాసన ద్వారా అందుకున్నాడు. ‘‘తెలిసి’’ అన్న చక్కని తెలుగు పదము ద్వారా పరమార్థతత్త్వాన్నంతా తేటతెల్లం చేసినారు త్యాగ పోత రాజులు. వారు ఆచంద్రతారార్కంగా విరాజిల్లే బ్రహ్మవిదులే.
20. శ్రీరామ__మ్ - అభిప్రాయం__
డా॥ కల్లూరి వెంకటేశ్వరరావుగారి భక్తిరచన శ్రీరామమ్. ఈ పేరేమిటి? ‘‘రామమ్’’ సంస్కృతపదం. ద్వితీయైకవచనం. అర్థం తెలుగులో ‘‘శ్రీరాముణ్ణి’’ అని, ‘‘ప్రశ్నోత్తరసుమహారమ్’’ దానికి వివరణ. ఈ ప్రశ్నోత్తర సుమహారంతో శ్రీరాముణ్ణి అర్చించడమే రచయిత ఉద్దేశ్యమేమో. ఇది వాల్మీకి రామాయణానికి సలక్షణమైన తెలుగుసేత. ప్రశ్నోత్తరరూపంలో సంతరించినారు. ఈ ప్రశ్నోత్తరా లెందుకు? అదీ 2400 ప్రశ్నలు. వాల్మీకి రామాయణం 24000 శ్లోకాలు, 2400 అంటే అందులో పదోవంతు. తద్దశాంశం. వైదిక పద్ధతిలో జపం, తద్దశాశం తర్పణం, తద్దశాంశం హవనం అనేపద్ధతి ప్రసిద్ధమైనదే.
అది అట్లుంచి ప్రశ్నోత్తర విధానమెందుకు? అని ప్రశ్న. ఆర్ష వాఙ్మయమంతా సంవాదరూపమేకదా. సూతుడు శౌనకాదుల ప్రశ్నలకు జవాబుగా పురాణములు చెప్పడం, ఉమామహేశ్వర సంవాదంగా గురుగీతవంటి బోధలు, నోములు, వ్రతాలు, అగస్త్యహయగ్రీవ సంవాదంగా దేవీతత్త్వకథనం, పరశురామ దత్తాత్రేయ సంవాదంగా త్రిపురారహస్యం ఇట్లా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ‘‘పరిప్రశ్నేన సేవయా’’ గురువును శిష్యుడు భక్తిశ్రద్ధలతో జిజ్ఞాసువై ప్రశ్నించడమే పరిప్రశ్న. సాధనలోగానీ తత్త్వవివేచనలోగానీ కలిగే సందేహాలే పరిప్రశ్నగా శాస్త్రం పేర్కొంది.
అసలు రామాయణం కూడా వాల్మీకి ప్రశ్నలతో ప్రారంభమవుతుంది. కోన్వస్మిన్ సాంప్రతంలోకే? అని నారదులవారు బ్రహ్మదేవుడు వాల్మీకి ప్రశ్నలకు జవాబుగా రామాయణం దర్శనం చేయించినారు. అదే ఆదికావ్యంగా పరిణమించింది. సర్వవేద వేదాంతసారము రామాయణము. రాముడు సాక్షాత్తూ పరబ్రహ్మమే. అసలు రామాయణము అద్వైతప్రాతిపదికమేకదా! అన్నిటికీ మించి ఈ రచయిత రామభక్తుడు. రాముని ప్రబోధనముతో ఈ కార్యము సమకట్టినాడు. మురారి ‘అనర్ఘరాఘవము’ లో చెప్పినట్లు ‘‘యదిక్షుణ్ణం పూర్వైరితి జహతి రామస్య చరితమ్, గుణైరేకావద్భిః జగతి పునరన్యో జగతి కః’’ (అపూర్వమైన కళ్యాణగుణములు కల్గిన రామునికన్న అన్యులెవరున్నారు. కావ్యనాయకునిగా నుండడానికి). అట్లే కాళిదాస మహాకవి ‘‘అథవా కృత వాగ్ద్వారే వంశేస్మిన్ పూర్వసూరిభిః...’’ అని భోజమహారాజు గంగాజలైః భువి భగీరథ యత్నలభైః తృప్తింకరోమి కథమప్యధంనా బుధానామ్... అనీ పేర్కొన్నారు.
ఆధునికులలో ప్రాచీనుడు కవిసమ్రాట్ ‘‘మరల నిదేల రామాయణంబన్న తినుచున్నయన్నమే తినుచున్న దిన్నాళ్ళు.... కొలిచిన రామునే కొలిచెద నేను’’ అని, ‘‘నాభక్తి రచనలు నావిగాన’’ అని తన కల్పవృక్షరచనోద్దేశాన్ని ప్రకటించినారు. యమ్.యస్. రామారావుగారు గేయరూపంగా సంతరించినారు. కల్లూరివారి తాత్పర్యమూ అదే అనుపిస్తుంది. క్రొత్తపుంతగా ప్రశ్నోత్తర రూపంలో వెలువరించినారు. విశేషసందర్భాలను, మూలముతో సహా ప్రకటించినారు. మచ్చుకు సుందరకాండము నందలి చంద్రోదయ వర్ణనము. యుద్ధకాండములోని ఆదిత్య హృదయము. విశేషముగా ఆదిత్య హృదయములోని సూర్యనామములను పట్టికగా యిచ్చినారు. ప్రశ్నకు ఒకపంక్తిగా నొకచోట ఒకపుటగా మరొకచోట అవసరాన్నిబట్టి ఉత్తరంగా వివరించినారు. ఒక సందర్భమునకు తగినట్లుగా ప్రశ్నను సంధించినారు. ఏది యేమయినా ఈ గ్రంథము వారి రామభక్తికి విశేషకృషికి తార్కాణంగా నిలుస్తుంది. ఇది పాఠకాదరణ పొందగల్గునట్లు రామచంద్ర ప్రభువు అనుగ్రహించవలెనని నా అభిలాష.
కల్లూరి వెంకటేశ్వరుని కామిత వాంఛల నాదరంబునన్,
జల్లని చూపులన్ దనిపి జన్మము సార్థక మొందునట్లుగా,
గల్లగనున్న లోకమును గాంచగ జేయుచు తన్ను బోలుచున్,
దల్లడమందు చిత్తమును దారిని బోవగ జేయు రాముడే!
- రామాయణ కల్పవృక్షం - రచనాకాలం నాటి సిద్ధాంతాల, ఉద్యమాల ప్రతిఫలనం
కావ్యేతి వృత్తం ఎంతో సుదూర కాలానికి చెందినదైనపటికినీ, కవి గ్రథన కౌశలం కల ఎంతో విజ్ఞానఖని ఐనప్పటికినీ, అతదు తనకాలంలోని తనచుట్టూ ఉన్న అంశాలను విడిచిపెట్టి రచన సాగించలేడు.
సహృదయుడైన పఠితకు ఆ రచనలో కవి సమకాలీనాంశాలు తప్పక కన్పిస్తాయి. భారతదేశం బహుప్రాచీన సంస్కృతి కలది. ఎన్నెన్నో సముదాచారాలు. సద్భావనలు ప్రాచీనకాలం నుండి పయనిస్తునే ఉన్నాయి. అవి ఈ కాలానికి చెందినవారైనప్పటికీ ఆ కాలంనుండి వచ్చినవే. కాని కొందరి వాదనలో ప్రాచీనేతి వృత్తంగల కావ్యంలో కవి సమకాలీనాంశాలు భాసించడం గుణంకాదు. కాని కవి తన కాలానికి చెందిన సంగతులను ఇట్టి కావ్యంలో నిబద్ధించినపుడు, నాగరికత స్పురించే కావ్యేతివృత్త సమకాలీనతకు అసంగతం కాకుండా ఉన్నంతవరకూ ఆయా సన్నివేశాలను, పాత్రలకు మెరుగుతెస్తున్నంత వరకు అవి సుగుణాలుగానే చెప్పుకోవాల్సి ఉంటుంది.
20వ శతాబ్ది మొదటి అర్ధభాగంలో మన దేశం, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో ఎంతో సంక్షోభానికి లోనైంది. మొత్తం వ్యవస్థనే మారిపోయింది. కొంతవరకు అభ్యుదయ వాదులకిది అభివృద్ధిగా కన్పించినప్పటికి, సంప్రదాయ వాదులు మాత్రం దీన్ని పతనంగానే భావించి, ఆందోళన చెందినారు. ఆయా మార్పుల ఫలితంగా సాహిత్యంలో గుడా ఎన్నెన్నో మార్పులు, ఆయా సిద్ధాంతాల ప్రభావం చోటు చేసుకుంది. తెలుగు సాహిత్యంలో గుడా పాశ్చాత్య సంస్కృతీ ప్రభావం గణనీయమైంది. సాహిత్యగతినే మార్చివేసింది. ఎందరో కవులు ఆ ప్రభావానికిలోనై, ఆ వెల్లువలో కొట్టుకుపోయినారు. కాని పాశ్చాత్య సంస్కృతీ ప్రభావంవల్ల భారత జాతి సంస్కృతి విచ్ఛిన్నమైందని, భారతీయ అంతస్సునే కలచివేసిందని క్షోభ చెందిన కవులు దాన్ని ఎదురొడ్డి పోరాడడానికి కలం ఆయుధంగా మలచుకొన్నారు. అట్టివారిలో విశ్వనాథ ప్రథమ గణ్యుడు. ఆయన రచనాకాశంలో ధృవతారలైన ‘వేయి పగడలు’ ‘రామాయణ కల్పవృక్షం’ రెండు ఈ ధ్యేయంతోనే రచించబడినాయి. మిగిలిన రచనలన్నీంటిలో కూడా కొద్దో, గొప్పో, ఈ ధ్యేయం ఉంది. పై రెండు రచనలు దాదాపు ఒకేసారి ప్రారంభించ బడినాయి. వేయిపడగలు 1933లో 1 నెల కాలంలోనే వ్రాయబడిన నవలారాజం. కాని కల్పవృక్షరచన 1932లోనే ప్రారంభం అయ్యింది. దాదాపు 30 సంవత్సరాల కాలం వరకూ దాని రచన కొనసాగింది. 1962లో యుద్ధకాండ ముగిసింది. ప్రారంభకాలంలోని ఆంగ్లేయ పాలనా దొష్ట్య ఫలితంగా భారతజాతి పొందుతున్న నష్టాన్ని, కష్టాన్ని సాంస్కృతికమైన పతనాన్ని విశ్వనాథ భరించలేకపోయినాడు. దేశకాలాపరిచ్ఛినమైన భారతీయ సంస్కృతి క్షీణిస్తుందే అని తన వాఙ్మయం నిండా కన్నీరు కార్చినాడు. ఆ తపస్వి కన్నీటి నుండి ఘనీభవించిన మహోజ్వల రత్నమే ‘రామాయణ కల్పవృక్షం’. విశ్వనాథకు ధర్మం మీద ఉండే విశ్వాసం, ఆర్ష సంస్కృతీ పక్షపాతం, దాని ఔన్నత్యంపై ఉండే ప్రగాఢాభిమానం, వంటి అంశాలతోపాటు పాశ్చాత్య సంస్కృతి దాడులవల్ల కలిగిన కలతలు వ్యధలు, సంఘంలో వీచే ప్రతికొత్త గాలికి స్పందిస్తూ, దాని ప్రభావం నాటి సామాజిక వ్యవస్థ మీద ఎట్లా ప్రసరిస్తుందో అని గాఢ పరిశోధన వంటి గుణాలన్నీ మనకు విశ్వనాథ రామాయణంలో దర్శించవచ్చు.
అంతేగాక, ఒక ప్రణాళిక ప్రకారం కుత్సిత విధానంతో భారతీయతపై, భౌతిక విలాస జీవన ప్రాధాన్యంగల పాశ్చాత్య సంస్కృతి చేసిన దాడిని, దాని అంతర్బహిస్స్వరూపాలను లోతుగా అధ్యయనం చేసి, అవగతం చేసుకొని, ధృడంగా ఎదుర్కొని పోరాడేందుకే తన కాలాన్ని ఆయుధంగా మలచినాడు. దేశభక్తి రగుల్కొని స్వాతంత్య్రోధ్యమం విజృంభిస్తున్నకాలం అది. వందేమాతర హరిజనోద్యమం. బ్రహ్మసమాజ ప్రభావం, స్వదేశీ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం వంటి
ఉద్యమాలతో అట్టుడికి పోతుంది. అంతవరకు బ్రిటిషు పాలనతో కూటనీతిని రంగరించి భారతీయ సాంఘిక, ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేసినారు. ఆనాటి పాలకులు స్వయంపోషక శక్తి గల్గిన గ్రామీణ నాగరికతను పారిశ్రామీకరణ చావుదెబ్బతీసింది. వారు ప్రవేశపెట్టిన భూసంబంధమైన కృత్రిమ చట్టాలవల్ల, శిస్తు విధానల మార్పుల వల్ల, కుటీర పరిశ్రమలను నాశనం చేయడంవల్ల కృతిమ దోపిడీ వ్యవస్థ మొదలైంది. ఆంగ్లేయులు పర్మనెంట్ సెటిల్మింట్ ఆక్టు ద్వారా భూమిపై శాశ్వత హక్కులు కల్పించినారు. దీని కారణంగా దేశంలో భూసమస్య మొదలైంది. వ్యవసాయక వ్యవస్థ భిన్నమైంది. వ్యాపార నాగరికత బలిసింది. దళారీల దోపిడీ పెరిగింది. ఆర్థిక వ్యవస్థలో అస్థిరత ప్రబలింది. దేశంలో శిస్తు వసూళ్ళ ద్వారా లక్షల రూపాయలను తమ దేశానికి తరలించేవారు ఆంగ్లేయులు. ప్రతిదాని మీద పన్ను విధించి, సామాన్యుని జీవితం ఘోరంగా తయారు చేసినారు. దీన్ని నిరసిస్తూ దేశభక్తి కవుల రచనలు సాగించినారు. 1895లో చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు - చింతామణి పత్రికలో వ్రాసిన క్రింది పద్యం ఈ విషయం స్పష్ట పరుస్తుంది.
‘‘నేల దున్నుదమన్నఁ జాలతరము పన్ను
నీరుగా వలెనన్న నీటి పన్ను
వాణిజ్య మొనరింప వచ్చు బడికి పన్ను
సరుకులమ్ముదమన్న సంత పన్ను
కర్రలమ్ముదమన్న కలపకింకొక పన్ను
పట్టణముల మున్సిపాలు పన్ను
పారిపోవుదమన్న బండిహాసేలు పన్ను
కొంపమ్ముకొన్నచో స్టాంపు పన్ను
ఉన్న మట్టుకు తినకుండనుప్పు పన్ను
ననెడు పన్నులెగదీసె జనుల నెల్ల’’ (- కృష్ణా పత్రిక-1906 ఏప్రియల్ పు.18)
పారిశ్రామికీకరణ పేరుతో దేశంలో ఉత్పత్తి చేసే వస్తువులనన్నింటిని తమ దేశానికి తరలించేవారు ఆంగ్లేయులు. ముడిసరకును అతి తక్కువ ధరకు తీసుకువెళ్లి, అక్కడి నుండి ఉత్పత్తి చేసి ఎక్కువ ధరలకు విక్రయించేవారు. ఈ ఎగుమతి దిగుమతి విధానాన్ని నాటి జాతీయ నాయకులు నిరసించి ఎదుర్కొంటూ స్వదేశీ ఉద్యమాలను నడిపినారు. దీన్నే 1906లో చన్నాప్రగడ భానుమూర్తి పంతులు తమ ‘వందేమాతరం’ ఖంఢకృతిలో ఈ విధంగా పేర్కొంటారు.
ప్రొద్దున లేవంగ ప్రోయిరాజవలెనన్న
నగ్నిహోత్రము స్వీడనంపవలసె
నాబాలగోపాల మఖిలంబునకును మాం
చెష్టరు పుట్టముల్ నేయవలెసె
మునుమాపు వ్యాయామమునకుఁ గందుకములు
లండను పంపుచు నుండవలసె
వ్రాతకు లేఖినీ పత్రముల్వలయుచో
నాస్ట్రియా జర్మనులంపవలసె
చిన్నబిడ్డలు ద్రావంగ క్షీరములను
భాగ్యవంతులు పాలకు పంచదార
యూరిపేదల గంజికి నుప్పుగల్లు
నన్యదేశమ్ములంపగనయ్యె నకట! (- కృష్ణా పత్రిక-ఏప్రియల్-1906)
సామాజిక సంక్లిష్టతకూ, సుస్థితికీ ఆధారభూతమైన కుటుంబ వ్యవస్థను వివాహ వ్యవస్థను కూడా విచ్ఛిన్న పరిచేట్లుగా చెలరేగుతున్న, పారిశ్రామిక నాగరికతవల్ల ఎన్నో అనర్థాలు, అర్ధ కామ ప్రాధాన్యాలు, సమన్వయ భావ విచ్ఛేదక లక్షణాలు, ఆర్ద్రమైన మానవీయ బంధాలను తుత్తునియలు చేయగల్గిన పరిస్థితులు ఏర్పడినాయి. ఈ పరిస్థితిలో తన జాతిని జాగృతం చేయడానికై, మనజాతి ఉతృష్ట, ఔన్నత్య గుణాలలోని మేలిమిని వెలికితీసి చూపిస్తూ, వాటిని కోల్పోవడం వల్ల కలిగే నష్టం, తద్వారా జాతిపతనం వివరిస్తూ ఆవిలువలను నిల్పుకోవల్సిన అవసరాన్ని ప్రబోధిస్తూ సాగించిన రచనలే ‘వేయిపడగలు’ ‘రామాయణ కల్పవృక్షం’ ఆంగ్లేయుల పాలనలో సృష్టింపబడిన కృతిమ దారిద్య్ర దోపిడీ - అజ్ఞానంల నుండి బైట పడాలని, సాంస్కృతిక పునాది మీదనే రాజకీయ, సాంఫీుక ఆర్థిక సంస్థలు నిర్మించుకోవాలనే ఆయన ప్రబోధం. తద్వారానే మానవులందరూ తిండికీ బట్టకూ లోపం లేకుండా బ్రతకాలని, ఆకాంక్షించిన మానవతావాది విశ్వనాథ.
పరిశ్రమల విషయంలో కూడా విశ్వనాథ కుటీర పరిశ్రమలనే సమర్థించినాడు. చిన్న చిన్న చేతి పనివారల వృత్తులను నశింపజేస్తే, నిరుద్యోగం ప్రబలుతుందని ఘోషించినాడు. గాంధీజీ సిద్ధాంతం కూడా అదే! అహింసాత్మక పద్ధతిలో ఆధ్యాత్మిక, నైతిక విలువలతో కూడిన కమ్యూనిజాన్ని ఇద్దరూ వాంఛించినారు. తన కాలం నాటి ఈ సమకాలీన సమస్యలను, క్లిష్ట సంధి యుగాన్ని విశ్లేషిస్తూ పరిష్కారం సూచిస్తూ జరిగిన పరిపూర్ణ రచన వేయిపడగలు. కాని రామాయణ కల్పవృక్షంలో సందర్భోచితంగా ఈ విషయాలన్నీ స్పృశిస్తాడు. విశ్వనాథ. ముఖ్యంగా బాల అయోధ్య కాండలలో ఎక్కువగా ఈ వివేచనకానవస్తుంది. విమర్శకుల అభిప్రాయం కూడా అదే.
‘‘చాలా చోట్ల జాగ్రత్తగా చూస్తే తెలుగు దేశపు సామాజిక జీవనానికి - ముఖ్యంగా నలభై, యాభై ఏండ్ల క్రితం నాటి సామాజిక జీవనానికి - బాలకాండ అద్దం పట్టినట్టు కనబడుతుంది’’ (- ఇదీ కల్పవృక్షం-పు.56)
‘‘బాలకాండను వ్రాసింది 1930 - 40 మధ్య అవడంవల్ల అప్పటి మన దేశానికి స్వాతంత్య్రం ఇంకా రాకపోవడంవల్ల, దేశీయమైన ఆచార వ్యవహార పట్ల వల్లమాలిన అభిమానం ఉండడంవల్ల, వానిని కావ్యంలో ప్రతిబింబింప చేయాలనే తహతహ ఒకటి కవికి ఉంది’’ (-ఇది కల్పవృక్షం-పు.57)
బాలకాండలో దశరథునికి సంతానం లేకపోవడానికి కారణం తమ పాలనలోని దోషమేమో అని మంత్రులు సందేహిస్తారు. వారు ప్రాప్తకాల దండులు. శౌచవంతులన్ తలపై పెట్టుకొందురు. నిష్కలుషుని రిపునైన నొవ్వజేయరు. ఈ గుణాల వల్ల మంత్రులెట్లుండాలనో తెలుస్తుంది. దశరథుడు ఆయోధ్యా దర్శనం చేసి, అంతా సుష్టుగా ఉందని అనుకుంటాడు. కాని తనకోసం అవన్నీ ఏర్పాటు చేయబడినాయేమో అని సంశయిస్తాడు. అందుకే సుమంత్రునితో ‘‘జనులెంతగనున్న నంతలో నొఱపులు సేసికొంద్రు తిననున్నదో లేదో, మఱప్పు నప్పులో కఱవులో కష్టమో తెలియగావలె నీపయిచూపులేటికిన్’’ (బాల-ఇష్ట-74) అని అంటాడు.
రాజు దృష్టి ఎట్లా సామాన్య జనుల దుఃఖాలను పట్టుకొనేదిగా ఉండవలెనో ఈ పద్యం తెల్పుతుంది. పైపై మెఱుగులు చూపించే నేటి రాజరిక వ్యవస్థపై విశ్వనాథ ఏవగింపును సూచిస్తుంది. పాలకులను గురించి విశ్వనాథ అభిప్రాయపడుతూ ‘వేయి పడగలు’లో ఈ విధంగా అంటాడు.
‘‘దేశాన్ని పాలించే నియమావళిలో ప్రధానంగా పాటించవలసిన విషయం ఏమిటంటే అందరూ బ్రతకాలి, అందరికీ సుఖ దుఃఖాలున్నవి. కష్టనిష్టు రాలున్నవి. ఇది పీఠికగా దేశపాలనా నియమావళి ఉండాలి’’ (-వేయి పడగలు, పు.235)
పాలనా సూత్రాల కన్నా పాలించే వ్యక్తులు ముఖ్యం, ఆధ్యాత్మిక, నైతిక విలువలు పాటించే వ్యక్తులుగా పాలకులున్నప్పుడే సమసమాజ స్థాపన సాధ్యం. ఆ దృష్టిగల పాలకులు స్వార్థత్యాగులై లోక క్షేమకోసమే పాల్పడుతారు. ప్రఖ్యాత తత్త్వశాస్త్రవేత్త అయిన అరిస్టాటిల్ కూడ ఈ భావాలనే వ్యక్తం చేస్తాడు. ూష్ట్రఱశ్రీశీంజూష్ట్రవతీ- ఖఱఅస్త్రం గా పాలకులను పేర్కొంటూ అప్పుడే ఆదర్శ సామ్రాజ్యం ఏర్పడుతుందని సిద్ధాంతీకరిస్తాడు.
రాజులు దుష్టులైనప్పుడు ప్రజలుతిరగబడడం విప్లవంరావడం సాధారణ పరిణామం. దీనిని పరుశురాముని కథలో సూచిస్తాడు. కార్తవీర్యుడు ఆవునిమ్మని కోరితే జమదగ్ని కాదంటడు. రాజు నీవిచ్చే దేమని సైన్యబలంతో దౌర్జన్యంగా తీసుకుపోతాడు. రాజ్యవ్యవస్థలోని నియంతృత్వానికి లక్ష్యమీ ఘట్టము.
పరశురాముడు దీన్నే ‘‘మదించిన నృపాలకులకు మలినగుణగణాస్పదమేదియైన రాజులుగద రత్నగ్రాహులంచు గబళించుటలోన్’’ అని పేర్కొంటాడు.
‘‘కడుకనలేచి కన్నులను కైవిలు గొడ్డలి పూనివచ్చినీవడిగిన మాత్రని చ్చుటకే యావును దెచ్చితి బొమ్ము ముర్ఖుడా చెడెదవనంగ’’
ప్రజలు రాజుల దోపిడిని, దుర్మార్గాన్ని ఎదుర్కొనేందుకు పరశురాముని వలె హింసా పథం స్వీకరింపక తప్పదని తెలుస్తుంది. కాని అది అంతటితో ఆగదు. కార్తవీర్యార్జుని వధతో కాకుండా లోకంలోని రాజులనందరిని 21సార్లు సంహరించడం నిష్కారణం. నిర్దోషులు ఎందరో బలైనారు. నేటి నక్సలిజం దీనికి ఉదాహరణాన్ని చేయవచ్చు. ఆంగ్లేయుల పాలనలోని దౌష్ట్య పద్ధతులన్నింటినీ పై సందర్భాలలో ఖండిరచినారు. అంతేగాక రావణుని వైభవం, దేవతాశక్తులను వాడు కేవల భౌతిక దృష్టితో వాడుకోవడం, దేవతల సంపదనంతా లంకకు తరలించడం వంటి గుణాలు, లోకాన్నంతా రాక్షసమయం చేయాలనుకోవడం వంటి విపరీత భావాలన్నీ ఆంగ్లేయుల పాలనా, సంస్కార లక్షణాలను ప్రతిబింబించేవిగా ఉన్నాయి. వాటిని నిరసించడమే విశ్వనాథతాత్పర్యం.
‘‘మయశిల్ప భాక్సుధర్మా మహానటశిలా ప్రతిమలు లంకకు బయనమయ్యె’’(-బాల-అవతార, పు.24)
అంతేకాకుండా ఇతర రాజ్యాలను జయించడం కేవలం సంపదకోసం. కీర్తి ప్రతిష్టలకోసం కాదు అని రాక్షస లక్షణాలను వివరిస్తారు దేవతలు. పాశ్చాత్య సామ్రాజ్యవాదం దీనిని పోలి ఉంది గదా! రావణుని కన్న ముందున్న నముచి, వృత్రాసురులు వంటి రాక్షసులు స్వర్గం జయించడం ప్రతిష్ట కోసం. కాని రావణుడు సంపదను దోచుకు పోవడానికే జయించినాడు. అందుకే దేవతా భోగాలన్నీ, లంకకు జేరినాయి.
అగ్ని, వాయు, వరుణ, సూర్యాది దిక్పాలకులంతా రావణుని రాజ్యంలో అథమ సేవకులైనారు. (-బాల-అవతార, పు.30-40-41) వారి దేవతాత్వ మెల్ల బోయి కేవల వస్తుత్త్వంగా మిగిలింది. ఇదంతా నేటికి భౌతిక దృష్టిని విమర్శించడం. నాస్తిక, చార్వాక మతములను గొప్పజేసి ఆదరించడం. స్మృతి, న్యాయములను నిరాదరించి, హేళన చేయడం వంటి రాక్షస కృత్యాలన్నీ నేటి కుహనా హేతువాదులను సూచిస్తున్నాయి.
దశరథ మహారాజు మరణం తర్వాత భరతుడిరకా రానప్పుడు మధ్యలో ఆయోధ్యలోని ఆరాజకత్వస్థితిని చూచి కలి ప్రవేశించేందుకు యత్నించినాడు. వాని లక్షణాలను 5 సీసద్యాలలో వర్ణిస్తూ కలి విజృంభిస్తే కల్గే లక్షణాలను నేటి వికృత ధోరణులకు అన్వయిస్తూ తెల్పినారు.
‘‘తండ్రిని పుత్రునిచే, తరుణిచే భర్తను సిగ్గఱ నెదిరింపజేయువాడు’’
‘‘అయథార్థతకును పట్టాభిషేకము చేసి ఋజుగుణంబు నధఃకరించువాడు’’.
‘‘తాను హింసాకృతియై, నవ్యయజ్ఞ సంస్కృత మేష వధము దూషించువాడు’’
‘‘వృత్తి విద్యలు, నాట్య విద్యలు కుల కర్మలగుట హాస్యంబునెగచువాడు’’
‘‘కామమ్మె దేవతా కారమ్ముగాగొల్వజేయువాడు తపస్సు మాయువాడు’’
‘‘పూలునత్తరులు పూతగంధంబుల నాగరకతయంచు సాగువాడు’’
(-అయోధ్య-మునిశాప-పు.304-310)
ఈ కాలంలోని అనేక రకాల వాదాలు, తత్త్వాలు, సిద్ధాంతాలలో రాజ్య వ్యవస్థలలోని లోపాలను కవి విశదంగాచిత్రించినాడు. సమాజంలో ప్రాథమికమైన కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్న చేయడం. పరస్పర గౌరవాధారాలను మరచి, అవిధేయతే నాగరికతగా మారడం కల లక్షణం. ఇది నేటి కాల ప్రముఖ లక్షణం గదా! ప్రచార యంత్రాంగం ద్వారా అసత్యానికి, కపటానికి ప్రాచుర్యం కల్గించడం. రకరకాల పద్ధతుల ద్వారా ప్రజలను వంచించి, పీడిరచడం నేటి రాజ్యవ్యవస్థ ముఖ్యలక్షణం. అందరికీ తిండిపెట్టే కుల విద్యలను నశింపచేసి, నిరుద్యోగులను తయారుచేసే మెకాలే విద్యా పద్ధతిని కూడా నిరసించినాడు. ప్రజలను తప్పుదోవ పట్టించి, ప్రకృతి సిద్ధమైన నీరు, గాలి, మొదలైన వాటిపై రాజ్యాధికారం స్థాపించి, పేదల కడుపు కొట్టడం, ప్రకృతి సహజములైన భూమిలోని ద్రవ్యాలను త్వరగా హరించి, నేలను నిస్సారంగా చేయడం. ఒకరి మీదకు ఒకరిని ఉసిగొలిపి, వర్గాలుగా విభజించి, వైరుధ్యాలు పెంచి, కల్లోలాన్ని సృష్టించడం నేటి కాలంలో సామాన్యమైన రాజనీతి.
కల్పవృక్షం ప్రధానంగా సమర్థించిన అంశం భారతీయ వివాహ వ్యవస్థ, దాంపత్య జీవితం, నవ్యభావ విప్లవం ప్రేమకు ప్రాధాన్యత నిచ్చి స్త్రీ పురుష సంపర్కానికి ఆధారభూతమైన నియమ వ్యవధిని వివాహ వ్యవస్థను ప్రశ్నించింది. దీనికి పాశ్చాత్యుల స్వేచ్ఛా ప్రణయ సిద్ధాంతమే ఆధారము. స్త్రీ పురుష సంబంధాలలో పారమార్థిక దృష్టి క్రమంగా లుప్తమై పోవడం, ధర్మం అర్థసాధనంగా మారడం, కామం సర్వప్రవృత్తులకూ మూలం కావటం, అంతా పాశ్చాత్య సిద్ధాంత ప్రభావమే. విశ్వనాథకు ఇవన్నీ చాలా క్షోభ కల్గించినాయి. ఎందుకంటే భారతీయ గార్హస్యధర్మం సర్వధర్మాలకు మూలబీజం. భారతీయ జీవిత పరమార్థాన్ని జాగ్రత్స్వప్న సుషుప్తులలో గూడా శాసించే ధర్మమది. దీన్ని నశింపజేయడానికి విశ్వనాథ సమకాలీనులైన చలంవంటి వారు కంకణం ధరించినారు. కేవలం శరీరగత కాముకత, విశృంఖల లైంగిక తృప్తినే సర్వసంగా చిత్రించి సంఘాన్ని భావకలుషితం చేసినారు. విశ్వనాథ దీన్ని ఎదుర్కొనేందుకే కులపాలికా ప్రణయ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినారు. ‘‘చలం ప్రవేశ పెట్టిన దైవమిచ్చిన భార్యలు, దైవమిచ్చిన భర్తల సిద్ధాంత ప్రకారం స్త్రీలందరిని పురుషులు - పురుషులందరిని స్త్రీలు కేవలం కామకత్వ దృష్టితోనే చూసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారికోసమే ‘స్త్రీ’ అనే పుస్తకం వ్రాసినట్లు చెప్పుకున్నాడు. తన సాహిత్యం ద్వారా చలం అబలలను, ఆలోచనారహితలను ఆదర్శంగా చిత్రించినాడు. పతన విలువలను పవిత్రంగా చిత్రించినాడు. మానవుణ్ణి జంతువుస్థాయికి దిగజార్చినాడు. సెక్స్ దురహంకారులైన స్త్రీ పురుషులను సృష్టించి, వారినర్థం చేసుకోలేదని నిందించినాడు. యువతరాన్ని నిర్వీర్యం చేయ ప్రయత్నించినాడు. మానసిక స్థిరత్వాన్ని చెడగొట్టే కామపిచ్చిని ప్రచారం చేసినాడు. సెక్స్ సర్వస్వమన్నాడు. ఈ రకంగా చలం సాహిత్యం సెక్స్ నిరంకుశత్వాన్ని కోరింది.’’ (చలం స్మశాన సాహిత్యం నిమ్మగడ్డ కోటేశ్వరరావు. పు. 81) ఇది సమాజాన్ని భ్రష్టుపట్టించే మార్గం. కొందరు దీన్ని ఆదరించి, ఆరాధించినారు, ఇది భారతీయ దాంపత్య ధర్మానికి గొడ్డలిపెట్టు వంటిదని విశ్వనాథ దాని ఖండిస్తూ, ఆయా భావాలన్నీ రాక్షస నాగరికతగా వివరిస్తాడు. రావణుడు పురుష గత దుష్ట కామానికి, శూర్పణఖ స్త్రీగత దుష్ట కామానికి ప్రతీకలు. వారి ధ్యేయమంతా కామమే. భోగతృప్తే. వారు ‘‘అన్యాంగనాకర్షణ వ్యాసంగోక్తుల వారు నూత్న ఋషులైనారని’ కలి పేర్కొంటాడు. విశ్వనాథ స్వయంగా తన కల్పవృక్ష రహస్యములు’లో ఈ విషయాన్నే స్పష్టపరచినాడు.
‘‘అసలీమహాకావ్యములో ప్రధానమైన రామకథా భాష్యమేమి? జారత్వము చేయరాదని! ఈ ప్రధాన విషయము అరణ్య కాండలో రావణుడు సీతాపహరణం చేసెడు నప్పుడెంతో చెప్పబడిరది. భార్యాభర్తలు-వారి సంబంధము, సృష్టి, సంతానము ధర్మము ఆ మహా విషయములన్నియు నక్కడ దేవతలు నిరూపించి నారు.’’ (-‘కల్పవృక్ష రహస్యములు’, పు.99)
కామం లింగభేదాన్ని ఆశ్రయించింది. దీని అనుభవానికి బాల్య యౌవనాదులు కానీ, ఇతర భేదాలు కానీ ముఖ్యము కాదు. కామ భావాన్ని దివ్యమైనదిగా, దాన్ని మించిన పరమార్థం లేనట్లుగా శూర్పణఖ వ్యాఖ్యానించింది.
కల్కి లక్షణాలను వర్ణిస్తూ ‘కామమ్మె దేవతా కారమైన వాడు’ గా పేర్కొన్నాడు. దీనినే శూర్పణఖ కామదేవతను తృప్తి పొందించడం కూడా ఒక తపస్సు వంటిదేనని వివరిస్తుంది. ‘ఉద్ధతమగు కామతృప్తి యొక్క దారి తపశ్చరణానుకుల్య పద్ధతికి ననుగ్రహించి పరితర్పణ చేయుము కామదేవతన్’ (-అరణ్య పంచవటీ,182) అని చెప్తుంది. అంతేకాకుండా రామునితో వాదిస్తూ ఏకపత్నీ వ్రతము ఐహిక సుఖదాయికాదని, దాని యందు పారలౌకిక సుఖము కూడా చెప్పబడలేదని’ దుర్వాఖ్యానము చేస్తుంది. అని చివరకు తన బ్రతుకంతా కామ పరితృప్తికే వెచ్చించినట్లు చెప్పుకుంది.
‘‘బహు సహస్ర వర్షంబులు బ్రదికినాను, సర్వకామోపభోగభాస్వరత గంటి, నకట!, మీది దివ్యదేహ విన్యాస శోభ, మదికి వెఱ్ఱు లెక్కించిన మఱులు గొంటి’’ (-అరణ-పంచవటి-165).
ఇంక రావణునిది కూడా ఇదే దృష్టే కామమే సృష్టి ప్రథమాహంకారమని వాని నిష్కర్ష (సుందర -పరరాత్రి- 152) తాత్త్వికంగా హేతుబద్ధంగా ప్రేమ సిద్ధాంతాన్ని వల్లె వేస్తాడు. దుఃఖాన్ని పొగొట్టుకొని ఏ పద్దతిలోనైనా సరే సుఖాన్ని పొందడమే సృష్టితత్త్వంగ చెప్తాడు. పాతివ్రత్యమన్నా, వివాహమన్నా, రావణునికి అవహేళన. కంటగింపు. జీవితాన్నంతా ఉత్తమ స్త్రీలు పాతివ్రత్యం పేరుతో వ్యర్థం చేసుకుంటారని ‘ఏసన్నాసియొ పెండ్లియాడ నికవాడే యంచు కూర్చుందురహో సంసారపయోధి భద్రతరుతానంభోజనేత్రల్’’ (-అరణ్య-జటాయవు, 16) అని పాతివ్రత్యభావాన్ని వెక్కిరిస్తున్నాడు. వివాహవ్యవస్థ, పాతివ్రత్యం రెండూ ఆత్మ వంచనలుగా పేర్కొంటున్నాడు.
లోపల దాచి పెట్టెదరు లోకమునందున కోర్కెలెల్ల స్త్రీ
లీపరమంపు గోపనమొకించుక నింద్రయనిగ్రహంబుకా
దీపగిదిన్‌లతాంగులు, మహేశ్వర! యిచ్చటనుంబరత్రహ
స్తాపతితంబు సౌఖ్యమున యందు స్వవంచితలైమెలంగుచున్ (-అరణ్య - జటాయువు, 28)
చివరకు రావణుడు కామతత్త్వాని ఏకైక పరతత్త్వసాధనంగా, ఆ అనుభవాన్ని పరమార్థాను భవంగా స్థాపిస్తాడు. దానికి మించిన ఆనందానుభవం లోకంలోనే లేదు.
‘‘కడకున్ సర్వజను ష్ఫలాభిముఖ రేఖావచ్చిదానంద మొ
క్కడె, యీ తక్కిన లెల్ల గల్పనలహా ! కామంబు తన్మార్గ, మె
వ్వడ నిశ్చాయకమైన స్త్రీ పురుష సంబంధము ధర్మంబుతో
గెడ గూర్వందలపోసె నూరక మృషాకృత్యున్న మద్భుద్ధియై” (-అరణ్య - జటాయువు, 62)
స్త్రీ పురుష సంబంధం వెనుక ఏ నియమమూ లేదు. దీన్ని అనవసరంగా ధర్మంతో బంధించడం కూడదు. ప్రాచీన తాంత్రిక పద్ధతుల్లో వామాచార మార్గం ఇది. విశ్వనాథ సమకాలీన సమాజంలో ఈ భావ వ్యాప్తి ప్రచారం ఉండేది. భావకవుల కొన్ని గ్రంథాలు, చలం రచనలు ఈ భావాలను సమర్థించేవిగా
ఉండేవి. వీటిని ఖండిరచడానికి ఉన్నవ లక్ష్మీనారాయణ, విశ్వనాథ, అడవి బాపిరాజు ముగ్గురు తమ నవలల్లో సుష్టు వ్యవస్థను నిర్దేశించినారు. ‘ఏకవీర, చెలియలికట్ట, నర్తనశాల, వేయిపడగలు ఈ సిద్ధాంతాన్ని స్థాపిస్తాయి. (-శ్రీమద్రామయణ కల్పవృక్షం- సమకాలీనత (వ్యాసం) కోవెల సుప్రసన్నాచార్య. విశ్వనాథ సాహితీ సమాలోచనం యువభారతి - హైద్రాబాద్ - 1995)
రావణునుని వరించమని రాక్షస కాంతలు సీతకు ఉద్బోధిస్తూ స్త్రీ సమానత్వం, స్త్రీ స్వేచ్ఛ వంటి వర్తమానాంశాలను వివరిస్తారు.
‘‘వనితరొ! నీవచూడు మగవాడు యధేచ్ఛముగాగనుండవ
చ్చును మడికట్టు కోవలయు సుందరులందురిదేమి న్యాయమే
వనితలు ధాత్రియందు నినువంటి మృషావ్రతలిట్లు సాగని
చ్చిననిది సాగుచున్నయది స్త్రీలయి స్త్రీలకు సేయుచున్’’ (-సుందర-పరరాత్రి, 278)
మగవారు మగువలకు సృష్ట్యాది నుండి అన్యాయం చేస్తున్నారు. పాతివ్రత్యం స్త్రీలకు మాత్రమే ఎందుకు? మగవానికి కుడా ఏకపత్నీ వ్రతామందు కుండరాదు? బహుస్త్రీలోలత్వం కల పురుషుని ఉపేక్షించునట్లు బహుపురుషగామిని అయిన స్త్రీని ఎందుకు ఉపేక్షించరాదు? ఉపేక్షించకపోవడం మగవారి దురధి కారం వల్ల వస్తుంది. కనుక స్త్రీలు కూడా మగవారి వలె అతిచరిస్తే తప్పుకాదు. అందుకే రావణుని వరించమని రాక్షసస్త్రీలు ప్రభోధించినారు. ఈ వాదం విశ్వనాథ కాలానికే విజృంభించడం ప్రారంభమైంది. ఇప్పుడు పరాకాష్టకు చేరింది.
భావకవిత్వంలోని సిద్ధాంతాలన్నీ రావణుడు చెప్పే ప్రేమసిద్ధాంతాలే.
ప్రేమయే సృష్టికంతకును పెద్ద, సరోజభవాది దేవతల్
ప్రేమకులోకువద్ది ప్రభ విష్ణువు, విష్ణువు ప్రేమనీపయిన్
ప్రేమ యఖండమైనయది’’,
‘‘నను ప్రేమించుట ప్రేమ, భావమున కెన్నన్ శేఖరీ భూతము’’
‘ఒక సేలయేఱు వంటిదీసితోత్పల లోచనయౌవనంబుబో
లుకలుగ వచ్చి పోసికొను రూక్షతరంగ తురంగ పంక్తి ఆ
గకయును సొమ్ము జేసికొనగావలె మన్మధ రాజ్యలక్ష్మి యెం
తకు దెగకుండ నోములు వ్రతంబులు పట్టిన వట్టిపోయెడున్’ (-సుందర పరరాత్రి, పు.179)
యౌవనం ఉన్నప్పుడే కామతృప్తి పొందాలని, నోములు వ్రతాలని యౌవనాన్ని వృధా చేయరాదని రావణభోధ. ఈ దుష్ట సిద్ధాంతాన్ని సీతాదేవి ఎక్కడికక్కడ తిరస్కరిస్తూ ధర్మానుబంధమైన కామతత్త్వాన్ని వ్యాఖ్యనిస్తుంది. భార్యభర్తల బంధం కేవలం లోకానుభవ పరిమితమే కాకుండ, పరమార్థసాధనకు దోహదం చేస్తుందని ఆమె ప్రతిపాదన. ‘ధర్మ మహిమ చేత ఆత్మ నియతిబుద్ధి మహిత స్థితిని’ తెస్తుంది. కాని ఆధునిక వాదులకు ఐహికమే పరమార్థం. పరమార్థ దృష్టి వారికి లేదు. ‘సీత దాంపత్యాన్ని ఒక యోగంగా పేర్కొన్నది. మనస్సులోని మోహ ప్రవాహాన్ని దాంపత్యమన్న రెండు యెడ్లు నడుమ నియతంగా ప్రవహింపజేసే పద్ధతి. అది కేవలం పురుష సంపర్కం మాత్రమే కాదు. నేటి ప్రముఖ దార్శనికుడు డాక్టరు సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు తన నఱఅసబ పఱవష శీట ూఱటవ అనే గ్రంథంలో భారతీయ వైవాహిక బంధాన్ని గురించి ఈ విధంగా చెప్పినాడు.
Marriage is not so much a concession to human weekness as a means of spiritual growth. It is prescribed for the sake of the development of personalty as well as the continuance of the family Ideal.
(విశ్వనాథ సాహిత్య వ్యక్తిత్వం పుట69, తెలుగు ఆకాడెమీ, 1989)
ఇంకా విశ్వనాథను కలవరపరచిన సమకాలీన సమస్యలెన్నో ఉన్నాయి. ఇప్పటికీ అవి మనకు కూడా సమస్యలుగానే ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబంలోని ఆడపిల్లకు వివాహం చేయడం వంటి సమస్యలు అందరికీ అనుభవాని వచ్చేలా జనకునికి కూడా సీతాదేవి వివాహ యోగ్య వయస్సు వచ్చిన వెంటనే ఈ బాధ మొదలైందని అనసూయతో సీతా దేవి చెప్తుంది.
ఆడపిల్లను కన్న తండ్రి ఎంత గొప్పవాడైనా ‘ఇంద్రుడైనా, ఉపేంద్రుడైనా తగ్గి ప్రవర్తించాల్సి ఉంటుంది. వరాన్వేషణలో గల బాధలను సహజ సుందరంగా చెప్పించినాడు. వరులలో ధనమున్న వానికి, చదువుండదు. రెండూ ఉంటే ఈడుజోడైన రూపముండదు. అదీ ఉన్నదనుకో! పట్టశక్యం గానట్లుగా విర్రవీగుతాడు. సాధుశీలుడైన వరుడే దొరకడని జనకుని బాధ. అనురూప వరుని వెదికి తేవడం సాధ్యం కాదని, స్వయం వరం ప్రకటించినాడు జనకుడు. (అయోధ్య- అనసూయ, 174,175,176). స్వయం వరం చాటించడం రాజులకు సర్వసాధారణం. కాని నేటికాలం పరిస్థితులను ఆ కాలానికి చొప్పించి స్వయం వరం ఏర్పాటుకు కారణం వరాన్వేషణ దుర్భరమని చెప్పించినాడు. విశ్వనాథ. ఈ చిత్రణలో సమకాలీన సమాజంలోని సమస్యా ప్రభావం కవిపై కల్గినట్లు తెలుస్తుంది.
కవికాలం నాటి సంస్కర్తలు ఉద్యమించి నిర్మూలించిన సాంఘిక దురాచారం సతీ సహగమనం. కాని దానిని విశ్వనాథ చాలాచోట్లు పేర్కొంటాడు. దాన్ని దురాచారంగా నిరసించలేదు. సాంప్రదాయక బుద్ధి కాబట్టి దాన్ని పాతివ్రత్యాన్నికి పరమస్థితిగా విశ్వనాథ భావించి ఉండవచ్చు. కలికాలంలో అది ప్రచారంగా
ఉండేది. దాని నిర్మూలనకై సంస్కర్తల కృషి కూడా ముమ్మరంగా జరిగింది.
రాముడు వనవాసగతుడగుచు కౌసల్యకు భర్తృపరిసేవ ముఖ్యమైనదని, కుమారుని వెంటరాదగదని చెప్పే సందర్భంలో సతీసహగమనాన్ని పేర్కొంటాడు.
ఆదికాల ధర్మమంగనకును భర్త సకల దైవతముల సంపుటమ్ము
కొడుకు చచ్చేనేని బడి తల్లి చచ్చునా? భర్త చచ్చినేని బడిన జచ్చు. (-అయోధ్య - అభిషేక - 449.)
ఇవే మాటలను సీతాదేవి రామునితో చెప్తుంది. తనవెంట కానలకు వద్దన్న రామునితో పతివ్రతా ధర్మాలను చెప్పే సందర్భంలోనిది. రామునికి ఇది తన మాట తనకే ఒప్పజెప్పినట్లు అయ్యింది. తను తన తల్లికి చేసిన ఉపదేశమే సీతాదేవి తన చేతను సమర్ధించుకుంటు చెప్పింది. (-అయోధ్య ప్రస్థాన, 24)
దశరథుని మరణానంతరం కైకతో ఆక్రోశంగా పలుకుతూ కౌసల్య తాను భర్తతో సహగమనం చేస్తానని, నీవే విధవగా నుండమని చెప్పుతుంది.
ఓయమ్మా! కైకమ్మా నీ యాడిన మాట ఫలము నెక్కొన గంటే!
మాయురె నీతోపాటు ధరాయోషయు గూడ విధవరాలయ్యెగదే? (-అయోధ్య-మునిశాప, 266)
‘నాకేమీ! పతితోడ నగ్గి చితి పైనన్ మ్రగ్గెదన్’(-అయోధ్య-మునిశాప, 268)
రెండు ప్రపంచ యుద్ధాలకు కారణమైన ప్రపంచాధిపత్యాన్ని తత్ఫలితంగా జరిగిన మారణహోమాన్ని చూచిన విశ్వనాథ హృదయం ద్రవించింది. మానవత్వం కోసం ఆక్రోశించింది. సామ్రాజ్యవాదుల జగదధీనవాంఛ రాక్షస గుణంగా వర్ణిస్తాడు. తాము జగత్తులో అన్ని జాతుల కంటే గొప్పవారమని, ప్రపంచాన్నంతా పాలించే అధికారం తమకే ఉందని అనుకుంటారు. నాజీ నియంత హిట్లర్ ఆర్యుల ప్రాధాన్యతా సిద్ధాంతంతోనే ప్రపంచ యుద్ధం జరిగింది గదా! తమ సిద్ధాంతాలే, విశ్వాసాలే గొప్పవని అందరూ వాటినే అంగీకరించి, అనుసరించాలనుకోవడం, దానికై దాన, దండన పద్ధతులను ప్రయోగించడం కూడా రాక్షస నాగరికత - దౌర్జన్యంగానైనా దాన్ని సాధించాలనుకుంటారు. లోకాన్ని క్షోభింపజేసి, మిగిలిన మత విశ్వాసాలను, వ్యవస్థలను నిలువ నీయకపోవటం కూడా ఈ లక్షణమే.
‘‘మరియును త్రిలోక రాక్షసమయము సేయు యత్నమున నీతి జాతిహద్దులేదు’’ ఇంకా క్రౌర్యంతో ప్రజలను పీడిరచే దుర్మార్గం కూడా రాక్షసగుణమే.
‘‘అక్కడ యూళ్ళ పైనబడి అందిన స్త్రీలను దొంగిలించుచున్
చిక్కిన యట్టి మానవుల జిత్రవధం బోనరించుచున్ మరిన్
బెక్కువ పిల్లపాపయను భేదము లేక చరించుచుండు’’.
ఇవన్నీ భారతదేశాన్ని జయించి, పాలించిన విదేశీయులు పాలనలో భారతీయులు పడిన బాధలే. ముసల్మానుల కాలంలో, తర్వాత బ్రిటిష్ హయాంలో కూడా ఇట్టి దుర్ఘటనలు కొకొల్లలు. అట్టిదే మరొక్కటి. కైకేయి కోర్కెలను విన్న దశరథుడు చైతన్యముడిగినాడు. ఆస్థితిని వర్ణిస్తూ విశ్వనాథ శిథిలదేవతా శిల్పము వలె నున్నాడని పేర్కొంటాడు.
ముక్కుంజెవులుంచేతులు చెక్కంబడి యందమెల్లచెడి దేవళపుం
ప్రక్కకు నొరిగి శిలాత్వము దక్కమిగులనట్టి దేవతా ప్రతిమవలెన్’ (-అయోధ్య-అభిషేక-307)
వేంగీక్షేత్రం- కొండవీటి పొగమబ్బులలో అడుగడునకు గుండెలను పిండే శిథిల శిల్పాలను వర్ణించిన అనుభవమే పై వర్ణనకు మూలమని చెప్పవచ్చు. రాముడడవికి వెళ్తుంటే తను కుడా వస్తానంటుంది కౌసల్య. లేదా తిరగబడి రాజ్యం స్వాధీనం చేసుకొమ్మంది. ఈ సందర్భం దేశభక్తిని ప్రబోధించేట్లుగా కౌసల్య మాటలను మలచినాడు కవి.
నీవరిగిన నే బ్రదుకను నీ వరుగుట ననుమ తింపనునేను ధరిత్రీ
సేవా జననీ శుశ్రూషావేశము తెచ్చుకొనుమురా! రఘుకులతిలకా!
తన కాలంనాటి పోటెత్తిన దేశభక్తి భావాలను మారుమ్రోగిస్తున్నాడు. ధరిత్రీ సేవ, జననీ శుశ్రూషావేశము తెచ్చుకోకుంటే నిజమైన మనిషి కాదనే భావం ధ్వనిస్తుంది. ఆంధ్రపౌరుషం, ఆంధ్ర ప్రశస్తి రచనల ప్రభావం, సమకాలీన స్వాతంత్య్రోద్యమాల ప్రభావం కన్పించే రచన ఇది.
ఈ విధంగా విశ్వనాథ తన రామాయణ కావ్యంలో ఎడనెడ తన సమకాలీనాంశాలను, సిద్ధాంతాలను, ఉద్యమాలను, అనుభవాలను సాంఘిక ఆర్థిక, రాజకీయ, పరిస్థితులను తన దృక్కోణంతో విమర్శిస్తూ ఖండన మండనము లోనర్చినాడు.