‘వర్ణనానిపుణః కవిః అని అలంకారికులు చెప్పినారు. వర్ణన నిపుణంగా చేయడం కవి ప్రతిభకు గుర్తు. వర్ణనమంటే ఏమిటి? వర్జ్య వస్తువుమూర్తి సాక్షాత్కారమే వర్ణన సాఫల్యంగా నిర్ణయించవచ్చు. ఇది ప్రతిభా సాధ్యంగా గుర్తించబడిరది. దర్శన ప్రదర్శనల్లో ఎంతో స్పష్టత ఉంటే గాని వర్ణన సార్ధకం కాదు. వర్ణనలను ‘సభూతోనభవిష్యతి’ గా అనితర సాధ్యమైన రీతిలో గావించిన నిపుణుడు విశ్వనాథ. ప్రకృతి వర్ణనలు సన్నివేశ వర్ణనలు, పాత్రల చిత్తవృత్తులు రూపురేఖా విలాసాదుల వర్ణనలు, ఆంగిక చాలన వర్ణనలు, వంటివన్నీ బహుముఖంగా నవ్యరీతులలో కావించినాడు విశ్వనాథ. నవలల్లో, కావ్యాలల్లో, నాటకాల్లో కూడా విశ్వనాథ వర్ణనా వైభవాన్ని చూడవచ్చు. తన ‘సకలోహ వైభవసనాథమైన’ ‘రామాయణ కల్పవృక్షము’లో విశ్వనాధ వర్ణనా చాతురి పారం ముట్టింది. కల్పవృక్షం ‘తెలుగు రామాయణం’ కావడానికి ఈ వర్ణనా నైపుణ్యం ఎంతో దోహదపడిరది. అందులోని పాత్రలన్నీ తెలుగువారిగనే మలచినాడు విశ్వనాథ. ప్రస్తుతపు వ్యాసంలో విశ్వనాథ తన రామాయణంలో పాత్రల స్వరూప వర్ణనలో తెలుగుదనాన్ని ఎలా ప్రదర్శించి నాడో, అనుశీలించబడిరది. ముఖ్యంగా వేషధారణ, ఆభరణాలు వంటి వాని వర్ణనలలో తెలుగువారి ఆచార సంప్రదాయాలను హృద్యంగా చిత్రించినాడు. అవతారికలో ముక్త్యాల యువరాజు శ్రీ వాసిరెడ్డి రాజరావు గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాదుని వర్ణిస్తూ చేసిన వర్ణన మనోజ్ఞంగా ఉంది.
చిరునవ్వు నవ్వెనా? చిన్నారి ముత్యాలు
ప్రోవులు ప్రోవులు ప్రోసినట్లు
కనులెత్తి చూసెనా? కపంపు చిఱుపొడు
లుప్పని తీగగా సూదినట్లు
అని యువరాజు మూర్తిని కన్నులకు కట్టిస్తున్నాడు. దశరధుని నల్గురు కొడుకులను తెలుగు పిల్లల వేషధారణ వేయించినాడు. వారు మన ఇంటిలో పిల్లల వలెనే ఉంటారు. విశ్వనాథ తన కాలంలోని జమీందారుల, సంస్థానపతుల ఇంటిపిల్లల వేషధారణే వేయించినాడు.
‘నలువురకు కాలిగజ్జెలు నలువురకున్ రత్నకంకణమ్ములు మెడలన్
నలువురకు బులిగోరులు నలువురు నానా విభూషణ జ్వలి తాంగుల్ (-బాల-అవతార, పు.324)
రాకుమారులు నలుగురూ కాలిగజ్జెలతో రత్నకంకణాలలో మెడలో పులిగోరుతో ప్రకాశిస్తున్నారు. రాముని ప్రత్యేకంగా వర్ణిస్తూ, కాళ్ళగజ్జెలు, మువ్వల బంగారు మొలతాడు, పులిగోరుతో కూడిన దండ, భుజానికి బొమ్మ విల్లు తగిలించుకొని, తల్లికోసం తప్పటడుగులు వేస్తూ, చేతులు, చాపుకొని వస్తాడు రాముడు.
వస్త్ర వేషధారణలో తెలుగువారి కట్టు బొట్టునే బాలరామునికి అలంకరించినాడు. కుచ్చెళ్ళు మడచి పింజలు తీసిన ధోవతిని అంగీని, జలతారు పాగను ధరించడం బాలరామునికి ఎంతో ఇష్టం. ఈ పంచె కట్టు పద్ధతి తెలుగువారి ప్రత్యేక పద్ధతి. పంచెకట్టుట యందు ప్రపంచాన మొనగాడుగా తెలుగువాడు పేరు పొందినాడు. తమిళ, కన్నడ, మళయాళల లుంగీ వస్త్ర ధారణ, అడ్డపంచెగా కట్టుకోవడం వంటి వాటి కన్నా తెలుగువారి ధోవతిధారణ ఎంతో హుందానిస్తుంది. ఎంతో విలక్షణమైనది కూడా! కుచ్చెళ్ళు పోసి వస్త్రాన్ని ధరించడం. పరమ నాగరికమైన పద్ధతిగా విశ్వనాథ అభిప్రాయం. నన్నయ భారతంలోని ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టాన్ని, అందు నన్నయ రచనను వ్యాఖ్యానిస్తూ నగ్నతను నిర్వచించి శరీరావయవాంచలములను ప్రదర్శించే వస్త్రధారణ ఆటవిక జాతికి చెందినదిగా చెప్పినాడు. రేఖాచిత్రములో కేవలం రేఖలు వస్తువు అంచులను చూపిస్తూ వస్తువును చిత్రిస్తున్నాయి. అట్లే శరీర అవయవాలను రేఖాచిత్రం లోపలే ఆకృతిని ప్రదర్శించే నగ్నతను కప్పిపుచ్చలేదు. పాశ్చాత్య సంస్కృతీ ప్రభావంతో బలసిన నాగరికత ఫలితంగా నేటి వస్త్రధారణను ఖండిరచినాడు విశ్వనాథ. శరీరాంచలములను కన్పింపజేసేట్లుగా ఉండే వస్త్రధారణ అనాగరికమైనది. కుచ్చెళ్ళు పోసికట్టిన వస్త్రధారణలో శరీరాంచల ప్రదర్శనం ఉండదు. అందుకే అది సంస్కార వంతమైనది. పరమనాగరికమైనది. దీనిలో అసభ్యత లేదు. బాలరాముని వస్త్రధారణ ఇట్లే వుంది.
‘‘ప్రీతిగ దోవతిన్ మడచి, పింజలువార ధరింపజేసి యం
గీతొడుగన్ వలెన్ బయి లగింపవలెన్ జలతారు పాగ’’ (-బాల, అవతార, పు.346)
రాణులను బాలెంతలుగా వర్ణిస్తూ చేసిన రచన రమ్యంగా ఉంది. తెలుగు నాట కవి సమకాలీన కాలంలోని అంశాలనే వర్ణించినాడు.
‘స్నానమాడిన బాలెంత చక్కదనము పరిణయమునాటి యందమ్ముపాదరించు’
‘రంజితాధర తాంబూల రక్తిమంబు, చిఱునగవు తెల్లదనములోఁ జిటిలిపోవ
నెఱుపు విరుగుచుఁ దెలినిగ్గు లెక్కు చంద్ర బింబములవోలె సతులు కన్పించినారు’’
(-బాల, అవతార, పు.270-271)
తన వర్ణనలను గూర్చి స్వయంగా విశ్వనాథయే ఈ విధంగా చెప్పుకొన్నాడు.
‘‘ఏ వర్ణనయైనను కథనంతయు సూచించుచుండును. వర్ణన లన్నియు ననుకూలముగా నుండును. తెలుగుదేశములోని లోకోక్తులతో నిండియుండును’’ పై పద్యములో తెలుగు బాలింతరాలి సొగసు చూడవచ్చును’’ (-కల్పవృక్ష రహస్యములు పు- 52)
ధనుర్భంగ సమయంలో సభాభవనం పై అంతస్తులో అంతఃపురస్త్రీల కదలికను గుర్తించిన రామునికి సీతముఖ బింబం కన్పిస్తుంది. ఆ ముఖ వర్ణనంలో తాత్త్విక పావిత్ర భావనలతో పాటు కేవల భౌతికమైన వర్ణనలో తెలుగుదనం గుబాళిస్తుంది. ముఖవర్ణనలోనే వయోరూపాల్వన్న వ్యక్తమవుతున్నాయి.
పునరుద్భవ ద్దంత ముగ్ధమోహన
రుచిప్రకట రేఖా హాసభావపరిధి
బాల్యయౌవనదశా పరిణాహసంధి,
త్రపాముగ్ధ నేత్ర శోభాపయోధి
పుష్కలాభివ్యక్త ముగ్ధ చిక్కణ
కపోల క్షీరకాంతి వేలాసుధాబ్ధి
శతసహస్ర మనోజ చాపల స్తక
మహాభావ పుంజీభూత ఫాలవీధి
యై దృగింద్రయగత పరమార్థమగుచు
హృదయఘ్నమై రక్తరaరీవిలీన
వేగమాధుర్య పరసీమయై గవేషితార్థ
సంప్రాప్తియై దర్శనాధ్వమొదిగె’’, (-బాల-ధనుస్సు, పు.298)
బాల్యంలో మొదటిసారి పళ్ళు ఊడిపోయి మళ్లీ మొలచే వయసు సీతది. అట్టి పలువరుసతో ముగ్ధ మోహనంగా ఉన్న చిరునవ్వుతో గూడిన సీతాదేవి ముఖము ఆమె వయసును ప్రకటిస్తుంది. పళ్ళు ఊడి మళ్ళీ మలిచే వయసు దాదాపు 8/9 సం॥లలో జరుగుతుంది. ఇది ‘అష్టవర్షాభవేత్ కన్యా’ అనే ప్రాచీన సంప్రదాయం ప్రకారం రజస్వలా పూర్వ వివాహాలే విశ్వనాథ కాలంలో జరిగినాయి. రామునికి వివాహ సమయానికి 12 సం॥లు వయస్సు ఉంది. సీతకు 8 లేక 9 సంవత్సరాలే, విశ్వనాథకు కూడా. 8వ సంవత్సరంలో ఉపనయనం, 11వ సంవత్సరం (1906)లో వరలక్ష్మితో వివాహం జరిగింది. బాల్య, యౌవన దశల సంధి వయసు అది. ఆ వయస్సులో ఉత్సాహం, చిలిపితనం, హుషారు పట్టరానంత ఉంటాయి. వాటితో పాటు వరుని చూడడం వల్ల కల్గే సిగ్గుతో కూడిన కన్నులు కల్గిన సీత రాముని దృగింద్రయగత పరమార్థంగా, పవిత్రంగా కన్పించింది. శివధనుర్భంగం చూచేందుకు ‘పూజడ వెన్నుగా’ వంగింది సీత. తల ఎంతగా వంచి చూసిందంటే పూలజడ కన్పించే టంతగా అన్న మాట. రాముడు శివధనుస్సు విరుస్తాడని తెలిసి అంతఃపుర స్త్రీలు సీతకు పూలజడ వేసి అలంకరించుకొని వచ్చినారు. పెళ్ళి చూపులకు ముస్తాబు చేసినట్లుంది ఇది. రాముడు శివధనుర్భంగం చేస్తాడని వారికెందుకో స్ఫురించింది. దీన్నే మనో విజ్ఞాన శాస్త్రం ‘సిక్త్ సెన్స్’గా వ్యవహరిస్తుంది. జరుగబోయే దాన్ని ముందుగానే మనకు స్ఫురింపచేసే చైతన్యశక్తి అది.
సీతారామ వివాహ సమయంలో పెండ్లి విందుకు విచ్చేసిన క్షత్రియ యాజిసమూహం తెలుగువారే. వారి రూపురేఖ వేషాలన్నీ తెలుగు వారినే పోలి ఉంటాయి.
కోణోన్నుతాంసానుగుణ పీన కనదురోధృతి
బొడ్డుదాక జందెములవారు
కర్ణాగ్ర కుండల కాంతిస్రవజ్ఘరీభ్రమ
జెంపదాక నేత్రముల వారు
సీమంత సంస్కార శృంగార రేఖాగ్రమున
బెడదాక గ్రామ్ముళ్ళవారు
గండెపెండెరపు రేఖశౌర్యాదీపనావధి
బిక్కదాక ధోవతుల వారు
బుజము కృష్ణాజినాల్ మహారజత మయములైనట్టి జారీచెంబులందగింప
విజయమున్‌బొనర్చిరి పెండ్లి విందుకై స్వహస్తపాకులై క్షత్రియయాజివితతి.
(-బాల-కళ్యాణ, పు.97)
పెండ్లి కుమారుడై సీతమ్మతో కూడి వీధులలో ఊరేగుతున్న రాముడు ఆయోధ్యా వాసులకు తెలుగు పెండ్లికొడుకు వలెనే కన్పిస్తున్నాడు.
‘‘పసుపు బట్టలతోడి బాలుండు రాముండు
గరుడి పచ్చల బొమ్మ కాడెయంచు
బుగ్గకాటుక తోడి సిగ్గరి రాముండు
జొత్తు కాన్గు చివుళ్ళ జొంపమంచు
ప్రక్కనున్న సీతవంక జూచీ చూడనట్టి
రాముడందమతడె యంచు’’
‘‘కమలాక్షుడైన రాముఁడు తమ వంకనె చూచునంచు దలతురహో! చి
త్రముగా నెల్లరు శశిబింబముఁ బోలిన రాము మొగము వంక గనుచున్’’
(-బాల- కళ్యాణ, పు.138-139)
పసుపు బట్టలతో, బుగ్గన కాటుక బొట్టుతో సిగ్గు ముఖంతో ఊరేగే రాముని, ప్రక్కనున్న సీతను చూచీ చూడకున్నట్లున్న రాముడు తమ వంకే చూస్తున్నట్లుంది. అయోధ్యా పురవాసులకు, ఇదంతా రాముని పట్ల వారికున్న ఆత్మీయత. భక్తి తత్పరతలను వ్యక్తం చేస్తుంది.
రాముడు అరణ్యవాసానికి వెళ్ళే సందర్భంలో తన సంపదలనంతా బ్రాహ్మణులకు, సేవకాతతకి దానం చేస్తుందడం తెలుసుకొని త్రిజటుడనే బీదబాపడొకడు దానార్థియై వచ్చినాడు. వానిది ఉంఛవృత్తి. బడుగు ముసలి. చేతిలో త్రవ్వుగోలతో, భుజాన చినుగుల దుప్పటితో వచ్చిన త్రిజటుని రాముడు ఆలమందను దానం చేసినాడు. వాటిని తోలుక పోయేందుకు ఆ బాపడు పడిన ఆవస్థను వర్ణించడంలో కూడా విశ్వనాథ సహజ సుందరంగా చెప్పినాడు.
‘‘చినిగిన దోవతి సిగ్గెడలింపగా దోకొంచు
జెంగులు దోపికొంచు
తలకు జుట్టిన చీలికల వాలికల గుడ్డ
జారగా జంకలో సర్దుకొంచు
త్రవ్వుగోలయు గఱ్ఱు ధరణి జాఱి పడంగ
నది వంగితీసుకో నాగికొంచు
మెడ క్రిందబోసిన వెడగు చెమ్మటు
డొగిడిన కుచ్చెల తోడ దుడిచి కొంచు’’ (-అయోధ్య - ప్రస్థాన, పు.132)
కొకిబికి త్రిజటుడు సాక్షాత్కారిస్తున్నాడు. కేవలం రూపు కాకుండా వాని ప్రవృత్తి, అసమర్థత, తొట్రుపాటు వంటి వన్నీ వర్ణించబడినాయి. ఎక్కడ వస్త్రధారణ వర్ణించినా దోవతి కట్టినట్లు, పింజె వోసినట్లు కుచ్చెళ్లు జీరాడునట్లుగా వర్ణనలుంటాయి. తెలుగువారి వేషాన్ని తన రామాయణ పాత్రలకు వేయించి వారిని తెలుగువారిని చేసినాడు విశ్వనాథ.
రాక్షస స్త్రీలకు కుడా తెలుగు వారి వేషధారణే చేయించినాడు. సుందరకాండలో రావణుడు ఆశోకవనిలో నున్న సీతను చూడడానికి వచ్చే సమయంలో, వాని వెంట తరలి వస్తున్న పరిచారికలు అంతఃపుర స్త్రీలు అంతా తెలుగు వారి వేషాలేసుకున్నారు. రావణుని అఃతపుర స్త్రీలలో యక్ష, గంధర్వ, కిన్నర, కింపురష, సిద్ధ, మొదలైన దేవతా వర్గ స్త్రీలున్నారు గదా! వారైనా, రాక్షస స్త్రీలైనా వారి వస్త్రధారణ మాత్రం తెలుగువారిదే.
నిడివిగ జుట్టు చుట్టి నడినెత్తిన బిళ్ళలుగాగ జొళ్లెముల్
మడచిన గూడకట్లు కుచ మండల నీత నవాంశు పట్టముల్
కడకనులందు దీర్ఘముగ గజ్జల రేఖలు నిల్వబొట్లుగా
బడతులు వానివెంట నడపంబులు గైకొని వచ్చుచుండగా (-సుందర-పరరాత్రి, పు.109)
కేశాలంకరణ పద్ధతి వర్ణనలో చుట్టు చుట్టుకొని నడినెత్తిన బిళ్ళలను ధరించినారు. విశ్వనాథ సమకాలీన కులీన కాంతల పద్ధతి అది. జడ జార విడచు పద్ధతి ప్రాచీన సంప్రదాయకులలో లేదు. కాటుకను దీర్ఘరేఖలుగా తీర్చిదిద్దినారు. అట్లే వస్త్రధారణను వర్ణిస్తూ -
‘‘కమల సమూహకంబు వెనుకన్ మును బంగరుటంచుతోప బి
ళ్ళమడతగా బిగించి నవలామణి యోర్తుక చీర’’ (-సుందర-పరరాత్రి, పు.111)
చీరను బిళ్లమడతగా బిగించి కట్టుకోవడం ప్రాచీనవేషధారణ ముఖ్యంగా మడి కట్టేవారు. ఈ పద్దతిని ఇప్పటికే పాటిస్తారు. ఆ చీరను వర్ణిస్తున్నాడు. కమలాలు వెనుకవైపున చిత్రించి ఉన్నాయి. బంగరు జరీ అంచు ఉంది. బంగరు, వెండి జరీ అంచులు గల చీరలు ఇప్పటికీ ఆంధ్రులకు ప్రియమైనవి. వస్త్ర తయారీలో, నాణ్యతలో, అంతర్జాతీయ ఖ్యాతి నార్జించినారు, తెలుగువారు. విదేశాలకు సైతము నేత వస్త్రాలను ఎగుమతి చేసేవారు. విక్టోరియా మహారాణికి కూడా కానుకగా పంపి మన్ననలందినట్లు చరిత్ర చెపుతుంది. మిల్లు బట్టల దాడికి తట్టుకోలేక నేత పరిశ్రమ నశించిపోయినప్పటికిని, ఇంకా వాటి వారసత్వంగా పట్టుచీరలను తయారు చేస్తున్నారు. కుప్పాడ, పెద్దాపురం వంటి చోట్ల బంగరు, వెండి జరీ పని ప్రఖ్యాత్యి చెందినదే. ధర్మవరం పట్టు చీరలు ప్రశస్తికెక్కిన్నాయి. అట్టి వేషధారణలో భాగమైన అభరణాలను కూడా లంకలో రాక్షస స్త్రీలు ధరించినారు.
‘‘మట్టెలు గిల్కు గిల్కు మన మానిని యోకర్తుక గచ్చు నేలపై
నట్టిటు పోవగా గనియె నంజనసూనుడు’’
‘‘కాటుక రేక తీర్చి కడ కన్నుల చిన్నది చూపు చెందడా
శాటన మాచరించునటు లారిచి తీరిచి చేరుచుక్క సీ
మాటన మాచరింప తలయందు సగంబు ముసుంగు తీసి సీ
మాటి యొకర్తు మన్మధుడు మాటిడు కాటుక పిట్టనా జనన్’’ (-సుందర-పరరాత్రి, పు.254-256)
పైన వర్ణించిన వేషమంతా తెలుగువారిది కదా! కాలిమట్టెలను ధరించడం వివాహిత స్త్రీలకు తప్పనిసరి. కాటుక తీర్చిన కన్నులు, చేరు చుక్క, తలపై సగం ముసుగు వంటివన్నీ సహజ సుందర వేషం.
‘‘బసపరి పట్టు సేలువ సితోత్పల పత్ర మనోజ్ఞ కాంతిన
క్రసముదయాంచలంబు మెయిఁగప్పి యెకంగన వచ్చె ముక్కునం
బెసగు బులాకితో నొసట నేచిన కస్తురి నిల్వ బొట్టుతో
పసగల వీటితావి తెర బమ్మెరవోవు దృశాంత రోచితో’’ (-సుందర-పరరాత్రి, పు.258)
ఆంధ్రుల అలంకార ప్రియత్వం ప్రసిద్ధమైంది. ప్రాచీన కవులు కూడా తెలుగుల వారి వేష భూషలను తమ కావ్యాలలో వర్ణించినారు. విశ్వనాథ తన కాలంలో తెలుగు వనితలు ధరించే భూషణాలను పేర్కొన్నాడు. ఇప్పటి వారికి వారి పేర్లు కూడా తెలియవు. జడ మధ్యలో, కొప్పు నడుమ ధరించే ‘తిరుగడుపువ్వు’ చామంతి బిళ్ళ’ వంటివి. ముక్కుకు రాళ్ళతో చేసిన ముక్కు పుడక, దోసకాడ, మరికాస్త కిందికి వేలాడుతూ బులాకీ వుండేది. ఇట్లే శరీరంలోని అన్ని భాగాలను భూషణాలతో అలంకరించే గుణం కల్గిన తెల్గువారి అలంకార ప్రియత్వం ప్రసిద్ధి చెందినదే. కస్తూరీ తిలకం కూడ అలంకరణలో భాగమే. పూర్వ కవుల వర్ణన మచ్చుకు.
తలుకు బిర్లాండ్లు బబ్బిలి కాయలును మట్టియలు వీర మద్దియలు సందిమలును
మొలనూళ్ళు నొడ్డాణములు నేవళంబు బుంజాల దండయు బన్నసరము మొగపు
దీగయు సాణి ముత్తపు బేర్లు సంది దండలు సూడిగములు గౌడ సరములును
కడియాలు పెక్కు జోకలు యుంగరములు ముంగరము కోలాంటపు గమ్మజోడు
చెవుల పూవులు బలిరలు చేరుచుక్క కొప్పువలయును సవరించి రొప్పుమీర
భూషణములకు తానొక భూషణమై పడతియపుడొప్పె కన్నుల పండువగుచు’’
(-పింగళిసూరన - కళాపూర్ణోదయం (తెలుగు వెలుగు, పు.18) (వేదవతి విశాలాంద్ర- 1993)
యుద్ధకాండలో ఇంద్ర సారథి మాతలికి కూడా తెలుగువారి వేషం వేయించినాడు విశ్వనాథ.
ఒక యొయ్యూరపు బాగయు నొక ప్రక్కల జూచుచూపునొనరగ మోచే
తికడ బిగియునంగీకల యొకదివ్యుడువచ్చి రాము నొగి దర్శించెన్ (-యుద్ధ - నిస్సంశయ, పు.284)
ఇటువంటి వేషధారణ రాజపురుషులను బోలినదే, తలపాగాలను ధరించడంలో ఎన్నెన్నో పద్ధతులున్నాయి. తలపాగా పూర్వులకు తప్పనిసరి. ఇప్పటికీ పల్లెలో వృద్ధులు తలపాగా ధరిస్తారు. వయ్యారంగా తలపాగా ధరించిన, మాతలి మోచేతి వద్ద బిగిసిన అంగీ ధరించినాడు. తన సమకాలీనకాలంలోనిదో, లేక ఇంకా జమీందారుల వస్త్రధారణో ఇది అయ్యుంటుంది. మోచేతి వద్ద బిగియ గట్టిన అంగీనే సుమంత్రునికి కూడా తొడిగినాడు. రామాయణంలో అతి ముఖ్య పాత్రలలో సుమంత్రుడొకడు. రాఘవులకు తరతరాల మంత్రి. దశరధునికి పుత్ర సంతాన వ్యధ సమయం నుండి, రామ వన గమనం వరకు ముఖ్య పాత్ర వహిస్తాడు. కాని అక్కడెక్కడా సుమంత్రుని స్వరూప, వేష వర్ణన లేదు. రావణ వధానంతరం నందిగ్రామం వచ్చిన రాముని దర్శనానికి వచ్చిన సందర్భంలో సుమంత్రుని వేషాన్ని వర్ణించినాడు. ఇదియొక శిల్పమా? లేక ఆపై సందర్భాలలో మరచి చివరిలో చేర్చడమా? ఏది ఏమైనా సుమంత్రునికి తెలుగు వేషధారణ చేయించినాడు విశ్వనాథ.
‘‘రవి బింబముల యంచు రహిమించు నిరుదెసల్
చెలగ హేమంబరోష్ణీషమొప్ప
నడుమున గూర్పాస మిడియ బిగించి
కట్టినయట్టి పట్టు ధట్టీ సెలంగ
జమిరెడు తెల్ల మీసాల బక్క కపోలమున
వెంట్రుకలు పొడిపొడిగనెగుర
దెల్లని కనుబొమల్ దీధిత వియ్యమం
దినదీప్తనేత్ర కాంతియునెసంగ
కనకవలయంబు తుదిమణికట్టునందు
జారు కూర్పాసమున యందు జరుగుచుండ
నల్ల నల్లన యే తెంచు నట్టి మంత్రి
శేఖరున్ గాంచుచున్ రఘుశేఖరుండు’’ (-యుద్ధ - ఉపసంహరణ, పు.366)
ఉష్ణీషము, కూర్పాసము, పట్టు ధట్టీ, కనక కంకణము లను ధరించి, తెల్లని మీసాలు, కనుబొమ్మలతో నున్ను వృద్ధ మంత్రిని, కవి తనకాలంలోని సంస్కారులైన వృద్ధులను చూచి యే వర్ణించి నాడనవచ్చు.
ఈ విధంగా విశ్వనాథ తమ రామాయణంలో సందర్భోచితంగా పాత్రల స్వరూప వర్ణనలలో, తెలుగు వారి వేష, భాషాలను ప్రదర్శిస్తూ తెలుగుదనాన్ని ముప్పిరి గొన్నట్లు రచించినాడు.