స్వభావమంటే స్వీయతా ముద్ర. ‘‘స్వస్యభావః స్వభావః’’ ప్రతివ్యక్తీ ఒక్కొక్క స్వభావాన్ని కల్గి ఉంటాడు. ఆ వ్యక్తి యొక్క గుణముల కూడికయే స్వభావము, అనంత వైవిధ్యములైన స్వభావాలను మనం నిజ జీవితంలో చూస్తుంటాం. కావ్యం లోక వృత్తానుకరణమే కదా! సజీవ పాత్రచిత్రణమే కావ్యశాశ్వతత్వమునకు మూల హేతువు. ప్రతిపాత్రను జీవంతో తొణికిసలాడునట్లుగా చిత్రించినప్పుడే రసవంతంగా ఉంటుంది. దీనికి పాత్రల బాహిర స్వరూపవర్ణనము, మనస్తత్వవర్ణన, చలద్భంగిమల వర్ణన, చిత్తవృత్తులైన ఆవేశ, శోక, భయ, హాస్యాది రసవర్ణన, ఇతర పాత్రలతో కల్గెడి సంఘర్షణములు, వంటి ఎన్నెన్నో విషయములు అవసరం. మీదు మిక్కిలి ఆయా పాత్రల సంభాషణాశైలి స్వభావ చిత్రణలో అతిముఖ్యమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది. మన భావాలను తెల్పే వాహిక భాషే గదా! అంతే కాక సన్నివేశ చిత్రణ కూడా పాత్రల స్వభావాన్ని ప్రదర్శింపజేస్తుంది. ఇవ్వన్నీ రసోన్ముఖంగా ప్రవర్తించినప్పుడు కావ్యం రసానందం ఇవ్వగల్గుతుంది.
ప్రాచీనకవులు, అలంకారికులు ఈ విషయాలన్నీ ఎంతెంతగానో పరిశోధించి, నిగ్గు తేల్చినారు. కవులు తమ కావ్యాలలో పాత్ర స్వభావ చిత్రణలో ప్రత్యేకశ్రద్ధ వహించినప్పుడే కావ్యం శాశ్వతకీర్తిని పొందుతుంది. కవి అమరుడౌతాడు. పాత్ర పోషణకే ప్రాధాన్యత నివ్వడం పాశ్చాత్య విధానం. భారతీయులకు కేంద్రం వస్తువు. పాశ్చాత్యులకు కేంద్రం పాత్ర. కాని కావ్య సిద్ధాంతాలను ఏర్పరచిన అరిస్టాటిల్ మాత్రం ఇతివృత్తమే ముఖ్యమని దాన్ని గురించి జాగ్రత్తపడమన్నాడు. కాని మహాకవులు దాన్ని ఖాతరు చేయలేదు. ప్రపంచ ప్రఖ్యాత నాటక కర్త Shakespeareఅట్టివాడే. ఆయనకు ఇతివృత్తం అవసరం. అంతేగాక పాత్రలను సజీవంగా, సహజంగా, మానవీయ గుణాలను పుణికి పుచ్చుకొన్నట్లు ఆయా సందర్భాలలో నిజజీవితంతో మనం ఎలా ప్రవర్తిస్తామో తన పాత్రలను కూడా అలాగే మలచినాడు. షేక్స్ పియర్ సాహిత్య విమర్శకులలో మూర్ధన్యుడైన Johnsonతన Preface to Shakespeareఅనే విమర్శనా గ్రంథంలో ఇదే అభిప్రాయన్ని వ్యక్త పరుస్తాడు.
Shakespeare had no heroes, His scenes are occupied only by men who act and speak as the readers think that he shall himself have spoken or acted on the same occassion
ఈ పాత్రలు మనుష్యులు కావచ్చు. జంతువులు కావచ్చ. నిర్జీవములైన వస్తువులైనా ఆఖరుకు భావాలైనా కావచ్చు. ఏమయినా అవి మానవజీవితాన్ని చూపడానికి జీవితం మీద వ్యాఖ్యానించడానికి ఉపయోగపడేట్లుగా ఉండాలి. ఈ పాత్రలను కేవలం వర్ణించినంతమాత్రాన వానికి జీవిత్వమబ్బదు. పాత్రల ప్రవర్తనా విధానం పరిత విశ్వసించగల్గేట్లుగా ఉండాలి. అందులో మానవత రూపుకట్టినప్పుడే అవి సజీవంగా ఉంటాయి. శాశ్వతంగా ఉంటూ సార్వకాలీన, సార్వజనీన, విశ్వజనీన స్థాయిని అందుకోగల్గుతాయి.
కాని కవి ఈ పాత్రలను చిత్రించడంలో వాటికి తన స్వస్థాన, భాష, వేషాలను పట్టిస్తాడు. ఆత్మీయతా ముద్రను వేస్తాడు. ఏ భాషలో వ్రాసే కవి ఆభాషా పద్ధతిలోనే, తన జాతీయతను, సంప్రదాయాలను సంస్కృతిని ప్రతిబింబించేట్లుగా పాత్ర పోషణలో జాగ్రత్త వహిస్తాడు. అప్పుడే ఆ కావ్యం ఆ జాతికి దగ్గరై, వారి జీవితంలోనికి చొచ్చుకొనిపోతుంది. తెలుగులో భారత, భాగవతాలు ఈ స్థాయినందుకున్నాయి. మహాభారతంలో ముఖ్యంగా తిక్కన సోమయాజి ప్రత్యేకంగా ఈ దృష్టిలోనే పాత్రలను తీర్చిదిద్దినాడు. పోతనామాత్యుడు తన పాత్రలనందరినీ మహాభక్తులుగానే కాకుండా తెలుగు వారిగా కూడా చిత్రించడం వల్లనే నేటికీ. ఆంధ్రులకు మహాభాగవతం పారాయణ గ్రంథమైంది. అదే విధంగా విశ్వనాథ సత్యనారాయణ తన ‘రామాయణం’లో పాత్రల స్వభావ వర్ణనలతో తెలుగుదనాన్ని చూపించినారు. పాత్రల స్వభావ, ప్రవర్తనలు తెలుగువారివి లాగే అన్పిస్తాయి. వాల్మీకి రామాయణంలోని అప్రధాన పాత్రలను ప్రత్యేక ప్రాధాన్యతతో తీర్చిదిద్ది తెలుగుదనాన్ని విరియింపజేసినాడు. విశ్వనాథ. అట్టివాటిలో ముఖ్యమైనది శాంత. దశరథుని కుమార్తె. రోమపాదునకు పెంపకమునకిచ్చినారు. అక్కడే పెరిగి పెద్దయినది శాంత. రోమపాదుడు శాంతను ఋష్యశృంగునకు నిచ్చి పెండ్లి చేసినాడు. మునిరాజైన ఋష్యశృంగుడు ఆశ్వమేధక్రతువును చేయించినచో, దశరథునకు పుత్రోదయమవుతుందని అది దేవరహస్యమని సుమంత్రుడు చెప్పినాడు. యాగానికి మునిని పిల్చుకొని రావడానికి సకుటుంబంగా రోమపాదుని రాజ్యానికి వెళ్ళినాడు దశరధుడు. ఎన్నో యేళ్ళ తర్వాత చూచిన కూతురిపట్ల రాణులు చూపే ప్రేమ, గోము, ముచ్చటలు అన్ని తెలుగు వారిలాగా కన్పిస్తాయి. శాంత తెలుగింటి ఆడపడచుగా తీర్చిదిద్దబడిరది. ఆమె మాటలు, స్వభావం అంతా అట్లే ఉంటుంది. ఆమెను చూచిన దశరథుడు ‘‘తల్లీ! నినుగడుపున గాంచినాడ నేననుకోన నా మనసున’’ అంటాడు. దానికి కారణం దత్తాపహరణ దోషం కల్గుతుందేమోయని భయం, కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు ముద్దు బిడ్డ శాంత. వారితోనే తన అలంకారాలు చేయించుకుంటుంది. తనకుమారుని వారికే అందిస్తుంది. ఈ సందర్భంలోన పద్య అత్యంత హృదయహ్లాదంగా ఉంది.
కౌసల్య యొడిలోనే గాని కూర్చుండదు జడసుమిత్రయే కానిముడువరాదు
కైకేయితోగాని కైలాగు బూనదు వారితో గాని నవ్వంగరాదు
తనసుతున్ గౌసల్య గనుక ముద్దాడనిచ్చుసుమిత్ర గనుక గ్రుచ్చుకొననిచ్చు
కైకేయి గనుక చిక్కని ముంగురులు పాయగా దీయగానిచ్చు గఱుదువాడి
శాంత కీరీతి వారితో జగము వారితో సకలము
అంటున్న పౌరవనితల మాటలువిని శాంత సంతోషంతో ఉబ్బిపోయింది. భర్త వంకచూస్తూ, తల వంచుతూ, చిరునవ్వులతో సిగ్గులొలికిస్తుంది. సౌధము చేరిన వెంటనే రాచకాంతలందరూ ఆమె సేమ మడిగి, సపర్యలు చేసినారు. వారి ఆదరంలో శాంత పుట్టింట రెట్టింపు సుఖంతో భర్తతో ఆనందించింది. యజ్ఞానంతరం కొన్నాళ్ళకు శాంత పుట్టింటికి పోయే సమయంలో కౌసల్య దశరథులు పడే బాధను, విడిచి పోయేందుకు శాంత పడే వ్యధ సహజంగా వర్ణించినారు. మళ్ళీ రామజననకాలానికి శాంత వచ్చింది. కౌసల్య ఆమెను చూస్తునే ఇన్నాళ్ళుకు నీకు తీరిందా నన్ను చూచేందుకని మురిపెంగా అనింది. శాంత రాణి గర్భముపై చేతితో తడిమి, శ్రీమహావిష్ణువే నీదుగర్భాన ఉన్నాడని ఋశ్యశృంగుడు చెప్పినట్లుగా చెప్తుంది. ఆయనను చూసేందుకు వచ్చినాను అనింది. కౌసల్య యజ్ఞపురుష దత్తపాయస ప్రాశన సమయంలో కూడా శాంతి మృదు పరిహాసాన్ని చేసి, తల్లి తొందరను చూసి రాజుతో కలసి నవ్వుతుంది. ఇది మన కుటుంబాలలోని ఒక్కోసారి జరిగే సన్నివేశమే.
కాని రామాదుల ఉపనయన సమయంలో శాంత పాత్ర లేదు. మళ్ళీ సీతా రాముల వివాహ ఘట్టానికి ముందుగా తెలుగువారి పెండ్లిలో ఆడపడుచు నిర్వహించే ముఖ్య పాత్రను పోషిస్తుంది. జనకుని దూత వార్తను విని తరలి వెళ్తున్న దశరథునికి శాంత ఋశ్యశృంగుల రథాలు ఎదురైనాయి. తమ్ముని పెండ్లికి వచ్చినావు బరువుదించినావని కౌసల్య శాంతను ముద్దాడిరది. జనకరాజు పానక బిందెలతో స్వాగతం చెప్పినప్పుడు. పానకం బిందెలను ఆడపడచు హోదాలో పైట విసరుచు, తీసుకొని పోతుంది. అంతటితో ఈ పాత్ర ముగిసింది. మళ్ళీ కన్పించదు. ఉండే కొంచెం సేపు తళుక్కుమని మెరుస్తుంది. తెలుగుంటి ఆడపడుచు శాంతాదేవి.
అట్లే కొడుకు కూడా అచ్చంగా పల్లెలో కన్నడే తెలుగుబిడ్డడే. రాముడు పుట్టినప్పుడు చిటపట జల్లులు పడనాయి. ఆ వానలో ఆడుకుంటాడు వాడు.
చినుకలను దిస్సమొలతో జనిచేతులు చాచుకొంచు జగ్గుల నవ్వుల్
తనరంగ శాంతాదేవి వనితామణి కొదుకు వానవల్లప్పాడెన్ (-బాల-అవతార, పు.230)
అలా వానలో తిరుగుతాడు. ఇలా వచ్చి పుట్టింటిలోనికి వచ్చి రాముని చూస్తాడు. మళ్ళీ వానలో తిరుగుతాడు. మళ్ళీ పురుటింటిలోనికి పోతాడు.
తన చేతికిమ్మనునుస్వా మిని నవ్వుచు మంత్రసాని మెటికల్ చిటికల్
చనవి ఱిచి యతని కణతలు ననగా రాదయ్య దేవుడని బెదరించున్ (-బాల - అవతార, పు.302)
భగీరథుడు గంగను భూమికి తెచ్చే ప్రయత్నంలో మహావేగంగా వస్తున్న గంగను చూచి, శివపార్వతులు ఇద్దరూ అనుకున్న మాటలు అచ్చంగా తెలుగు వారివే. వారి స్వభావాన్ని కూడా పట్టిస్తున్నాయి. శివుడు గంగను తన జటాజూటంతో బంధిస్తానన్నాడు. కాని గంగ వేగం చూసి పార్వతి గణగణ వచ్చుచున్న సురగంగను గాంచి భవాని ‘‘స్వామికిన్ బెణుకులు పుట్టునో మెడను వేగవశంబున స్వామి యంగముల్ వణకి యిలాస్థలిన్ జదికిలంబడునో’’ యని యప్పగారి యా తొణికిసలేవగించుకొనే దూకుడు మానదటంచు నెప్పుడున్ అక్కా చెల్లెళ్ళ మధ్యనున్న స్వభావాల భేదాన్ని స్పష్టంగా తీర్చిదిద్దినాడు. గంగ పెద్దది. ఆమె దురుసు స్వభావం, లెక్కలేనితనం. ఎదుటి వారిని చులకనగా చూడడం, దుడుకుతనం మొదలైన లక్షణాలున్న పార్వతి నాల్గు మాటల్లోనే వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా తన భర్తకే మవుతోందనని, మెడ బెణకుతుందనో, చతికిలపడి దెబ్బతగుల్తుందోనని ఆదుర్దాపడిరది. ఒక్క పద్యంలో పార్వతిని తెలుగువనితగా బ్రతికించినాడు. అట్లే పెళ్ళి వద్దని మంకు పట్టిన గంగను తన వద్దనే బిగిస్తానని శివుడనుకోవడం కూడా లోకంలోని పురుష ప్రవృత్తిని ప్రస్ఫుట పరుస్తుంది.
‘‘పెద్దది యట్లెయుండ నిట చిన్న కుమారిత పెండ్లియాడె, నా పెద్దది గిద్దరై యసలె పెండిలి వద్దని కురుచుండె, నా యొద్దనె దీని నుంతునని యుగ్రుడు, సింహసటాచ్ఛటాజటల్ ప్రొద్దు నవోదయాంశువులు పోసినయట్లుగ విచ్చి నిల్చినన్’’
జహ్ను మహర్షి గంగను గ్రోలినాడు. మునుల హాహాకారాలు విని భగీరథుడు వెనుదిరిగి చూచినాడు. గంగ రథం వెంట రావడంలేదు. బ్రహ్మ, శివుడు తనను మోసగించినారనుకుంటాడు. గంగానదిని భువికి తెచ్చే ఘనకార్యానికి నీవు తగవని చెప్పకుండా ఇంతపని చేసినారని బాధపడడంలో తెలుగుదనం, అట్లే బ్రహ్మవరాలిచ్చే సందర్భంలో కూడా తెలుగుతనం చూడవచ్చు. ...... యిదియేమి పాపమో
‘‘వెనుకొని వచ్చునేఱు కనిపించదు, తండ్రులు దాతలుంగడిర
పనిమడుగేఁగడిరతునె? త్రపారహితుండను వెఱిబుద్ధినై.
మృడుడును బ్రహ్మనన్ను గికురించుట యేటికొ యల్పమానవున్?
గడువడి బొమ్ము బొమ్ము సురగంగను నీకిడరాదు నాఁదలం
దిడుకొని చేతులన్ మగుడనే యది యేటికి యింతదూరమై
మడుగును నింకజేయుటలు, మామక భాగ్యము లేమి చెప్పుడున్’’
అట్లే బ్రహ్మ దేవుడు భగీరథుని తపస్సునకు మెచ్చుకొనే సందర్భంలో
‘‘అవునవునెంత కోరితివి యైనను నీతపమేనలంతియా?
యమనవు నైన అని సకలావని చిల్లెపడున్ రసాతలం
బవు దొలి కొట్టి నట్టులగు నాసురగంగ రaరీ జ్వలజ్జ్వల
ద్వివృత మహార్బటీ ప్రళయవీచిక లుమ్మడి గ్రుమ్మరించినన్
ఒకశివ దేవుడైన జడలూచి గ్రహించుగాని యా ప్రకటిత మే పరులుబట్టరు’’
అని మాయమైనాడు. తన వరాన్ని ఔనన్నాడో, కాదన్నాడో భగీరథునికి అర్థం కాలేదు. కానీలెమ్మని శివుని గురించి తపస్సు చేయడానికి ప్రారంభించినాడు. శివుడు ప్రసన్నడై గంగను భరించేందుకు సమ్మతించినాడు. ఇట్టి అప్రధాన పాత్రలను కూడా సజీవంగా ఆత్మీయంగా తీర్చిదిద్దినాడు విశ్వనాథ. కౌసల్య పాత్ర ఉంది. ఆమెను ముక్తి కాంతసమానకారంగా, విష్ణువును కడువున పండిరచుకొన్న పుణ్యముర్తిగా తీర్చిదిద్దినాడు. కాని పిచ్చితల్లి అమాయకమైన పామరమైన సాధుశీల విలాసవయ్యారములతో కైకేయి భర్తను కొంగున ముడివేసికొన్నది. పట్టమహిషి పేరుకేగాని కౌసల్యను ఎంతో నిరాదరించేవాడు దశరథుడు. రాముని కన్న తర్వాతనే ఆమేకు ప్రాధాన్యత పెరిగింది తన ఈర్ష్యనంతా దీనంగా రామునితో చెప్పుకుంది. రామకళ్యాణం ముగిసి అయోధ్యకు తరలిపోతున్నపుడు అహల్యదర్శనానికి పోవలెనని తండ్రితో చెప్పలేక రథాల మళ్ళింపునకై కౌసల్యను ప్రార్థిస్తాడు రాముడు అచ్చం తెనుగు తల్లివలెనే తన ప్రేమనంతా కురిపించి బాధనంతా వెళ్ళగక్కుతుంది సుమంత్రుడు దశరథుని రథం నుండి తీసుకొని వచ్చిన రాముని కౌసల్య గ్రుచ్చి కొడుకును పైకి అందుకొని, ఎన్నెన్నో ముద్దులు పెట్టుకొంది. ఎవ్వరూ చూడకుండా. కళ్యాణరాముడైనా, మహావీరుడైనా, శివధనుర్భంగ కుశలుడైనా రాముడామెకు చిట్టిపొట్టి కొడుకే గదా! నాయన! నీవు కడుపునం బడినప్పటి దాఁక కైకతో నేయఖిలంబుగా మనియె నీజనకుడిఁక నిన్ను జూచి యేదో యొకరీతిగా నన్నుఁగనునోయి కుమారక! నీకు సైతమున్ నాయెడ నా బ్రదుకే మనవచ్చురా? శిశూ!
ఆహల్యా దర్శనానికి పోదామని, రథాలను మళ్ళింపమని, సీతనునన్ను ఆమె చూడాలని చెప్పిందని కౌసల్యతో చెప్పినాడు రాముడు ఆమాట వింటూనే కౌసల్య మురిసిపోయింది. తన ప్రాణములును నీవేయను తండ్రిని నడుగ భయమురా! యని నవ్వింది. రథాలు మళ్ళినాయి. అది చూసి దశరథుడు ముందు నివ్వెర పోయి మళ్ళీ నవ్వుకొని, తల్లీ కొడుకు లేకమైనారనుకున్నాడు. కైకకూడా ముసిముసినవ్వులు నవ్వుకుంది.
రామ పట్టాభిషేకం జరుగుతుందని వార్త తెలియగానే కౌసల్య ఆనందానికి మేరలేదు. మనోహరదరహాసంతో, ఆనందంగా జానకి రాముడు, కౌసల్య ఒకరినొకరు చూసుకున్నారు. సీత అత్తగారి చీర యంచును పట్టుకొని ఉంది. ఇది ఆమెకు కాపురానికి వచ్చినప్పటి నుండి మాములే గదా? రామ కళ్యాణం జరిగిన తర్వాత దాదాపు 6 సంవత్సరాల తర్వాతనే సీతారాముల సంగమం జరిగింది అప్పటికింకా చిన్న పిల్లగదా! అందుకే పెండ్లి అయినప్పటినుండి సీత కౌసల్యకు సర్వస్వం అయ్యింది. ‘సీత యన్నము స్నానమ్ము సీత, జపము సీత, శ్రీరామచంద్రుడు సీత యయ్యె పట్టమహిషికి’ (బాల-కళ్యాణ-156) అందుకే శాంత ఇంక కోడలు వచ్చింది. మేమంతా ఏం పని అని హేలగా దెప్పపొడిచింది కూడా!
పట్టాభిషేక వార్త తెలియగానే 24 సంవత్సరాలుగా ఇదెప్పడిదెప్పుడని ఎదురుచూసే సమయం వచ్చిందని సంతోషించింది కౌసల్య, కాని పట్ట భంగ వార్త విన్న వెంటనే మూర్ఛల్లింది. రాముడు సేదతీర్చినాడు. కొడుకు శరీరాన్ని నిమురుతూ తన వ్యధనంతా ప్రకటిస్తుంది. తన ఆశలన్నీ కుప్పకూలినాయి. తట్టుకోలేకపోతుంది. ఆ మనస్తత్వాన్ని, తీవ్రవేదనను వెళ్ళగక్కింది. ఎదురుతిరిగి రాజ్యాన్ని పొందమని రెచ్చగొడ్తుంది.
‘‘బుడుతడా! నీవు కడుపున బడకయున్న నే సుఖపడి యుందునోయీ కుమార!’’
‘‘కంతుని వంటివాడును జగ్రత్తయ పాలన పొంటి వేయనున్ మంతిరి కాగలట్టిడు కుమారుడు కల్గిన వేయి దుఃఖముల్’’ ‘నాది యేకాకి బ్రదుకయ్యె నాయనా!’
విరిగిన పాలకన్న సులువే యయిపోతి మున్ను నీవుగా
దొరవగుదన్న క్రొంబెరిమతో నొకతూకము వచ్చె, దానికిన్
విరుగుడు పుట్టి, నీ కిటుల వెళ్ళిన రేపట ద్రోట కూరలో
బురుగును దుల్పినట్లు దులుపుల్ పడనా! మతిభావనాయతీ!
‘నీవున్నప్పుడె దిక్కులేదు గద తండ్రీ! నాకు అన్ని పరిపరివిధాల దీనకపోతంవలె ఆక్రోశించింది చివరకు రెచ్చగొట్టేందుకు యత్నించింది.
నీవరిగిన నే బ్రదుకను నీ వరుగుట యనుమతింపను నేను, ధరిత్రీ
సేవా జననీశుశ్రూషావేశము తెచ్చుకొనుమురా! రఘు తిలకా!
అన్నప్పటికి రాముడు మారలేదు. ధర్మ బద్ధుడనని, రాజు సేవ చేయమని పతివ్రతా ధర్మంగా బోధించినాడు. కాని నన్ను నీతో అడవికి తీసుకొనిపో అంటుంది. చివరికి రాముడు అరణ్యవాసానికి పోవడం తప్పదని తెల్సినా ఇంకా ఆమె దుఃఖం నివారించుకోలేకపోయింది.
‘‘ఓయి! కూనా! కౌసలేయా! యీయగ్ని యేలా కుములుచుండెనురా కుమార!
ఓయి! రామచంద్ర! నీవా యటవికినిట్లు చను యమపురికి నేనిట్లు చనుదు’’
అంటూ భయపెట్టాలని చూసింది. రాముడామెను ఓదార్చినాడు. ‘‘నీవు నిలువవలయు నీవు శుశ్రూషింపవలయు, భర్త కంటె బరము లేదు. ఇది సనాతనమ్ము, నింతికి ధర్మమ్ము, సడల రాదు నాదు. శాసనమ్ము’’ అని ఆదేశించినాడు. అప్పటికి విధిలేక అంగీకరించింది.
కొడుక! నీ తండ్రికిన్ భయపడితి మున్ను నీకు భయపడుచుంటిని నేడుగాని
మదికినిష్టమ్ము లేని యొప్పుదల నీకు నొసంగుచుంటిని బోయిరావోయితండ్రీ!
దేవతలంతా రక్షిస్తారని దీవించింది. సీతతో జాగ్రత్తలు చెప్పింది. దశరథ విలాపంలో తనూపాలు పంచుకుంది. జీవితంలో అంతవరకూ రాజునేమీ అనలేదు. అప్పుడు ఆవేశం కట్టలు తెంచుకుంది. వెనుకా ముందు చూడలేదు. రాజు చేసినవాటినన్నింటినీ తీక్షణంగా విమర్శించింది. దూషించింది. ఈ మనస్సంఘర్షణంతా అంత సహజంగా, హృదయ విదారకంగా ఉంది. కవి ప్రతిభా సముజ్వలంగా ఉంది. ఉపాలంభనంగా ప్రారంభిస్తుంది. నీ బిడ్డలడవిలో నభృత గంనీ గమన్ముందుశయ్య లందునిద్రింతురేమె కనకవిపంచీనికాయస్వన త్యాధు గీతికావి తతి ఁ జూక్కెద రేమొ ముసరికొని వచ్చు నిద్దుర ముందు చేత నడవిలోన భవద్దయాహతులు రాజ!
‘‘ప్రభు! నీవు చేసిన యీ మహాపకృతిచే బ్రహ్లన్నులై బిడ్డలక్షుభితుల్ రొమ్ముల మీద జేతులిడి కూర్కుంగాంతురు’’ రాముడు వనవాసం నుండి వచ్చి మళ్ళీ రాజయ్యేనా? అప్పుడు తమ్ముడు రాజ్యం ఇస్తాడా? కక్కిన కూటికి ఆసపడువాడు గాడు రాముడు. నీ విచ్చిన వరము వల్ల రామునికి జీవితాంతం వనవాసమే అని దుయ్యబట్టింది. నా మనస్సును కాల్చివేసినావు అంది. చివరగా నిన్నేమైనా నేను అనే తప్పు చేసినావు. కాని భార్య భర్తను దూషించరాదు కదా! అంటూ దుఃఖించింది. దశరథ మరణం తెల్సి విలాపంతో ఈ మాటలన్నాని విడిచిపోయినావా? అని దురపిల్లుతుంది.
నిన్నిన్నేండ్లకు నంటిని నిన్న నొకటి పొల్లుమాట, నీవదిమదిలో
నన్నెఱపి యింతచేసెదవన్నది, నేనేరనైతి నయ్యా! స్వామీ!
ఆ కొడుకు తండ్రి వాడవు నా కొంచెపు మాటకింత నాయమె చేయన్!
నీ కౌసల్య యటన్నన్ నీకుంగల గౌరవమ్ము నిండెనె? స్వామీ!
ధరణీ నాయక! పెద్ద భార్య యిదిగో! తాదుఃఖముంబొందెశ
ర్కరిల క్షీరముగాని నోర్తెఱచి వేకైకోవె! యౌరౌర శ
ర్కరిల క్షీరపుగిన్నయే పగిలెనా? కౌసల్యముంజేసె నే
దురితంబు దురితంబు సర్వమును తో నిండెనా? భూమిపా!
అంటూ విలపిస్తున్నంతలో కైకప్రవేశిస్తుంది. ఆవేశం, క్రోధం కట్టలు తెంచుకున్నాయి.
ఓయమ్మా! కైకమ్మా నీ యాడినమాట ఫలము నెక్కొనగంటే!
మూయురే! నీతోపాటు ధరాయోషయుగూడ విధవరాలయ్యెగదే!
నీ కోర్కినిండినది, మరి నీ కన్నులు చల్లబడియె, నిఖిల ధరిత్రీ
శ్రీ కంఠమందు వ్రేలగైకొని యూరేగవమ్మ! యోకైకమ్మ
‘‘అతివ! నీవు జేసినట్టి జోగులమైతి మిందఱమును మరియు నిందఱమును నిటనయోధ్యలోన నటమిధిలాపురి దెఱవ! నీదు కరుణ దీర్ఘగామి’’ - అంటూ వంగ్యోక్తులతో కైకేయిని దూషించింది. చివరకు నిన్ను సవతిగా కాకుండా చెల్లెలిగా చూచుకున్నందుకు మంచి పాఠము నేర్చినావు అంటుంది. నా బిడ్డలను చూచి కన్నుల్లో నిప్పులు పోసికొని ఇంతపని చేసినావని తీవ్రంగా పరుషంగా మాటాడిరది. అప్పుడు కైకేయి కౌసల్య పాదాలను పట్టుకొని మొగం వంక చూస్తూ అక్కా! అని బావ్వురుమంది. కౌసల్య దిగ్భ్రాంతి పొంది, వెంటనే తేరుకొని కైకను కౌగలించుకొని దుఃఖించింది. అందుకే కౌసల్య పిచ్చితల్లి. అంత కోపాన్ని, అసహనాన్ని నిమిషంలో దిగమంగి కైకనో దార్చింది. దీనితో ఆమె స్వచ్ఛమైన మనస్తత్వం వ్యక్తమౌతుంది. ఆమె శుద్ధసత్త్వమూర్తి తాత్కాలిక ఉద్రేక, భయ, శోకాదులను పొందినా మూలతత్త్వం సత్త్వమే. అందుకే రామునికి జన్మనివ్వగల్గింది. ఇదీ కౌసల్యను తీర్చిదిద్దడంలో విశ్వనాథ తాత్పర్యం. దీన్నంతా చకచ్చకితంగా మూర్తి కట్టించి, కౌసల్యను జాజ్వల్యమానంగా తీర్చిదిద్దినాడు.
అట్లే నీచపాత్రలను కూడా సజీవంగా, తెలుగువారిగా తీర్చిదిద్దడం రామాయణ కల్పవృక్షంలో కనబడుతుంది. గుహుని ఆజ్ఞతో సీతారామలక్ష్మణులను నది దాటించడానికి వచ్చిన పడవవాడు గూడా తెలుగువాడే. వానిలోని చమత్కారం, హాస్య ప్రియత్వం, అమాయకత్వం ఎంతో నిపుణంగా చిత్రించబడినాయి. గుహునిఆజ్ఞ రాత్రి చేరింది. ఉదయమే తెప్పతీసుకొని రామలక్ష్మణుల వద్దకు వచ్చినాడు. తెప్పలోని సీతకోసం ప్రత్యేకంగా పీటగా చేసినాడట. అదీ వాని ప్రత్యేకత. సీతను బంగారపు బొమ్మ అంటాడు. ఆమె సౌందర్యాన్నంతా దీనిలో ధ్వనింపచేసినాడు. అంతేకాకుండా సీతాదేవి వాని మాటలకు నవ్వినప్పుడు ఆమెను దేవీస్వరూపంగా భావించి పురములోని పసుపుముద్ద నవ్విందని అంటాడు. పురము - పసుపు ముద్ద అనె రెండూ ప్రత్యేకార్థంలో వాడబడినాయి. జాలరుల భాషలోని, గ్రామీణ వ్యవహారంలోని ప్రత్యేక పదాలు. వారి దేవతా మందిరాన్ని ‘పురము’గా వ్యవహరిస్తారు. నాలుగు గుంజలు పాతి, పైన తాటి ఆకులతో వేసిన పై కప్పు ఉంటుంది. అందులో దైవీ స్వరూపంగా పసుపు ముద్దను నిల్పి పూజిస్తారు. వైదిక కర్మలలో గుడా పసుపు ముద్దను గణపతిగా భావించి పూజించడం నేటికీ ఉంది. విశ్వనాథ పుట్టి పెరిగిన వాతావరణం కృష్ణా గోదావరీ నదుల తీర ప్రాంతం. నావికులు, జాలరులు వారి వేషభాషలన్నీ సుపరిచితాలు, అందుకే ఈ సరంగును ఇంత హృదయా వర్జకంగా తీర్చిదిద్దినాడు. ఈ పాత్ర ఇంతటితో ముగియలేదు. రావణ వధానంతరం నందిగ్రామంలో గుహునితో పాటు రామదర్శనం కోసం వీడు కూడా వస్తాడు. రాముడు గుహుని వీడెవడని ప్రశ్నిస్తాడు. సీత అప్పుడు కల్పించుకొని నన్ను పసుపు ముద్దగా పిల్చినవాడని చెప్పింది. రాముడు చమత్కారంగా నా కన్నా వీడే తెలివైనవాడు అంటాడు. వెంటనే భరతుని కనుసైగతో అర్థ మంత్రి ఆ సేవకునికి బంగారు ముద్దనిచ్చినాడు. వాడు సిగ్గుపడుతుంటే భయంలేదు. రాజానుగ్రహం తీసుకోమంటే తీసుకుంటాడు. ఈవిధంగా అల్పమైన పాత్రలను గూడా తెలుగుదనంతో తీర్చిదిద్దినాడు విశ్వనాథ.
అట్టిదే సంపాతి పాత్ర కూడా! సంపాతి ఎప్పటివాడో ఎవ్వరెరుగరు. ఇందిరతోడి విష్ణుదేవుని కళ్యాణాన్ని చూసిన సనాతనుడు. విశ్వనాథ ఈయనను బహిరంగంగా మన ఇండ్లలోనే ఉన్న వృద్ధుని వలెనే చిత్రించినాడు. ముదిమి తెచ్చే సహజ మనో, శారీరక లక్షణాలన్నీ రూపుగొన్నాయి. జరాభారం కన్నా దయనీయమైన స్థితి ఉండదు. కాని ఈయన జరను జయించి మళ్ళీ యవ్వనం పొందినాడు. మళ్ళీ రెక్కలు పుట్టుకొచ్చినాయి. ఎంతో ఉత్సాహవంతుడైనాడు. కాని వృద్ధాప్య లక్షణాలను వర్ణించే సందర్భంలోని తెలుగుదనాన్ని పరిశీలిస్తాం. సంపాతి తిండికి ఒక్క క్షణం ఆలస్యమైతే ఇంటిల్లిపాదినీ తిట్టిపోస్తూ, యములు ధూములు చేస్తాడు.
ముసలితనంబు క్రూరమిది భోజనవేళ యతిక్రమించుచో
నసువులు నిష్క్రమించు నను నట్టులయుండును గోపమింతవె
క్కసమయిపోవు నల్పమగు గారణమైనను నిల్వలేమియున్
గసకసలాడు చుండుటు గల్గును పోషణ చేయువారిపై
(-కిష్కింధ అన్వేషణ, పు.278)
తన కొడుకు సుపార్శ్వుడు ప్రతిరోజూ వేళాతీతం కాకుండానే భోజనం తెచ్చిపెట్టేవాడు. కాని ఆరోజు సీతాపహరణ కారణంగా ఆలస్యమైంది. అది వినకుండానే ఆలస్యమైందని కొడుకు తన చావుకోరుతున్నాడని త్వరలో తన పీడ వదుల్తుంది లెమ్మని ఎగిరెగిరి పడినాడు. సుపార్శ్వుడు చెప్పిన సీతాపహరణం వింటూనే రావణుని ఎందుకు ఎదిరించలేదని కొడుకును లక్ష తిట్టినాడు.
‘‘అన్నము పూఁట లేకున్న జత్తున మేమి? దైతేయు వెంబడిఁదఱిమియేల
గుండె నెత్తురు చూడకుండ వచ్చితివి నీవు? తెచ్చితివిన ప్రతిష్ఠనాకు
నా గర్భమున బుట్టినావా? నిజంబుగ వైనతేయుని దైనవంశమెల్ల
నీ మూలమున నపనింద పాలైనది! యనిలక్షతిట్టితినయ్య కొడుకు’’
అని చెప్పినాడు వానరులతో. అంతే కాకుండా జటాయువునకే కాక దశరథుడు తనకు కూడా స్నేహితుడని, అతని కుమారుడు ఇట్టి దుస్థితి పొందినాడని, తనేమి చేయలేక నిస్సహాయుణ్ణైనానని మనోవ్యధను పొందినాడు. విశ్వనాథ మానవున కుండాల్సిన ఆదర్శగుణాలను సంపాతికున్నట్లుగా ఆపాదిస్తాడు. ‘‘గాంభీర్యంబు, గాంభీర్యంబంత పౌరుషంబు, పౌరుషంబంత విజ్ఞానంబు, విజ్ఞానంబంత, మెత్తని గుండియ’’ కావలెనని, అవి సంపాతి కున్నాయని చెప్పినాడు. మళ్ళీ రెక్కలు మొలచి యవ్వనము వచ్చినందున వానరులనందరినీ లంక చేరుస్తానన్నాడు. కాని అంగదుడు నిరాకరించి, మేమే సముద్ర లంఘనం చేయగలమన్నాడు. మీ ఇష్టం అంటూ రామదర్శనం కోసం ప్రస్రవణగిరికి తరలివెళ్ళినాడు సంపాతి. ఇంత సజీవంగా ఉన్నత లక్షణయుక్తునిగా, మన్వంతర జీవునిగా, విశ్వనాథ సంపాతిని చిత్రించినాడు.
విశ్వనాథ తీర్చిదిద్దిన పాత్రలతో ఆయన తాదాత్మ్మం పొందుతాడు. కొందరు ఆయన రావణ పాత్రతో దాతాత్మ్యం పొందినారన్నారు. మరికొందరు, ఆంజనేయునితో అని, విశ్వామిత్రునితో అని పరిపరివిధాలుగా చెప్పుకున్నారు. కాని ఆయన అన్ని పాత్రలతో తాదాత్మ్యం పొందినాడు. తాదాత్మ్యం పొందలేక ఆయన వ్రాయలేదు. వ్రాయలేడు. రాక్షస పాత్రలు-స్త్రీ పాత్రలు, గుహ, విభీషణాది భక్తుల పాత్రలలో అన్నింటిలో ఆయన తాదాత్మకం స్పష్టంగా ఉంటుంది.
ఈ తాదాత్మకన్నే పాశ్చాత్యులు Imaginative Identityఅంటారు. 1. ఈ విషయాన్నే ఆంజనేయుని మాటల్లో స్పష్ట పరుస్తారు విశ్వనాథ.
ఎంతటివాడు కావలయు నెప్పుడు, యత్ప్రతిభావిశిష్టుడై
యంతటివాడ నేనగుదు, నప్పుడు తత్ప్రతిభావిశిష్టుడై
యంతక ప్రాంగణస్థిత మహాధ్వజవద్భుజదండ తీవ్రుడన్
జింతిత కార్యముల్ దనర జేయగ గల్పతరూప మానుడన్.
ఇది పోతన్నగారి మార్గము. భాగవతంలోని పాత్రలన్నింటితో, గజేంద్ర, ప్రహ్లాద, అంబరీష, బలి, ద్రౌపది వంటి అన్ని పాత్రలతో పోతన తాదాత్మ్యత
ఉంది. అట్లే విశ్వనాథ కూడా అంత ఆత్మీయంగా పాత్రలనన్నింటినీ తీర్చిదిద్దినాడు. తెలుగువారిగా సృష్టించినాడు. వారి స్వభావంలో, ప్రవర్తనలో తెలుగుదనాన్ని పరశ్శతంగా ప్రదర్శింపజేసి, తన రామాయణాన్ని ‘తెలుగు రామాయణం’ చేసినాడు.
24. రామాయణ కల్పవృక్షం - పాత్రల ప్రవర్తనారీతులు (మేనరిజ__మ్స్)__
మానవప్రవర్తన అనంతమైన వైవిధ్యం కలది. ఒక్కొక్క వ్యక్తి, వాని జీవ సంస్కారాన్ని బట్టి, పుట్టి పెరిగిన కౌటుంబిక వాతావరణాన్ని బట్టి, వంశపరంపరాగత లక్షణ సముదాయన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఎన్నెన్నో విధాలైన ప్రవర్తనా విధానాలను కల్గి ఉంటాడు. మాటలు మాట్లాడంలో, లేయడంలో, కూర్చోడంలో, చూపులో, నవ్వులో, హస్తచాలనంలో, అంగవిన్యాసంలో అది, ఇది అనడం ఎందుకు ప్రత్యణువులో తనదైన వ్యక్తిత్వాన్ని కల్గిఉంటాడు. ఈ లక్షణాలు మనిషి, మనిషికి విభేదిస్తూనే, మళ్ళీ జాతీయ, ప్రాంతీయ సామూహిక లక్షణాలుగా కొన్ని భాసిస్తుంటాయి. ఒక జాతి వారి మాట్లాడే పద్దతి, రూపురేఖావిలాసాలు వంటివి కొంత కొంత వర్గీకరణకు లొంగుతాయి. అవి ఆ జాతి లక్షణాలుగా పేర్కొనవచ్చు గూడ! పాశ్చాత్యుల పద్ధతికి, భారతీయుల పద్ధతికి తేడాలున్నాయి. భారతీయులలో మళ్ళీ ఔత్తరాహులు, దాక్షిణాత్యులు తేడాలున్నాయి. మళ్ళీ భాషా, ప్రాంతీయ భేదాలుంటాయి. ఎన్నెన్నో వైవిధ్యాలకు తావున్న ఈ ప్రవర్తనావిషయం నిగ్గుతేల్చడం అసాధ్యం. కాని స్థూలంగా కొన్ని కొన్ని లక్షణాలను బట్టి కొంత విశ్లేషణ సాధ్యమే అవుతుంది.
విశ్వనాథ తన రామాయణంలో తను సృష్టించిన పాత్రల ఈ ప్రవర్తనా వైవిధ్యాన్ని అనితర సాధ్యంగా, అమేయశేముషీ వైభవంతో, అనుపమాన లోకజ్ఞతతో ప్రదర్శించినాడు. తనపాత్రలన్నీ తెలుగు వారి వలె నటిస్తారని చెప్పుకున్నాడు. తెలుగు వారి జీవితం, తెలుగు వారి ఆచారములుంటాయని స్వయంగా చెప్పుకున్నాడు. కల్పవృక్షంలోని కొన్ని పాత్రలను వాటి ప్రవర్తనా పద్ధతులను (మేనరిజమ్స్) ను అనుశీలిస్తే స్పష్టంగా ప్రవర్తనా వైవిధ్యాన్ని అవగతం చేసుకోవచ్చు, రామాయణంలో ప్రధాన పాత్ర రాముడు. ఈ విష్ణ్వంశ సంభూతుడు వాల్మీకంలో కూడ ‘ఆత్మానం మానుషంమన్యే’ గా చెప్పుకున్నాడు. ‘మర్యాదా పురుషోత్తముడు’గా విశ్వనాథ తీర్చిదిద్దినాడు. మానవలక్షణాలన్నీ రామునిలో ప్రతిఫలిస్తాయి. శోక, హాస్య, భయ, శృగారభావాలన్ని తత్తదుచితంగా వ్యక్తమవుతాయి. ముఖ్యంగా రామునిలో హాస్యాన్ని నిపుణంగా చిత్రించినాడు. పరిహాస్యాద్భుతశీలి మై మంధరను బాల్యంలో తన చాపవిద్యతో తైతక్కలాడిరచినాడు. ఆపగతోనే పట్టభంగం చేయించిది మంధర. రాముని హాస్య ప్రవృత్తే పట్టభంగకారణమైంది.
తాహాస్యాద్భుతశీలి రాముడు పృషత్కంబుల్ ప్రయోగించునో
హాహాకారములేచు మంధరను రామున్ చాయగా నేయు, ద
ద్ధాహాకారము లెంతగా బలియునో హాస్యంబు తానంతగా
బాహాస్ఫాలన మూర్తి చేయు రఘురాడ్బాలుండు గగ్గోలుగాన్. (-బాల- అవతార, పు.420)
మంధర కోపగించుకొని కైకతో పిర్యాదు చేస్తుంది. కాని కైకనవ్వి యొక్క నీయందె పరిహాస సముజ్జ్వలించు రామభద్రుడెంతటి రాశివించు నవ్వుకానట్లు మరియును నవ్వినట్లు చంచలిస్తుంది. ఈ పరిహాసం మళ్ళీ అయోధ్యకాండలో త్రిజటుని సంధర్భంలో కన్పిస్తుంది. మిగిలినచోట్లెల్ల మనోహర దరహాసాంక్పురమే ప్రసన్న మృదు మధుర చిరునగవే స్వామిముఖంలో ఉంటుంది. భార్గవరాముడు కూడా ఆమృదుకర సుహాసవదనం చూస్తూనే తన ఔద్ధత్యం, వికటచంక్రమణాన్ని విడిచిపెట్టినాడు. అంత ప్రభావం ఉంది ఆదరహసంలో వివాహం జరిగి అయోధ్యలో భార్యతో కూడి ఉన్నప్పుడు ఆయాశృంగార భావాలు కల్గినప్పుడు.
ఒక కారణమ్ములేకయే చికిలి మెఱుగు దంతకాంతి చిందిన క్రొవ్వా
లికసన్నని నవ్వుల చాలిక పెరలెవ్వరు జూడలేదని తలచున్
అట్లే లక్ష్మణుడు కూడా తనవలెనే వధూతాత్పర్యలీలా వినూతన రేఖా మధురాక్షుడ అని అనుకుంటాడు. ఒక ఏడాది సంసారం చేసిన తర్వాత హఠాత్తుగా వివాహం కల్గింది. వశిష్ఠుని బోధనతో సీత సాహచర్యంతో వైరాగ్య సంసారభావాలు సమప్రసార మానాలైనాయి.
వనగమన సమయంలో త్రజటుని చూచిన వెంటనే రామునకు నవ్వువచ్చింది. ఆవులమందను దానంగా ఇచ్చి తోలుకుపోమ్మన్న. కొకటికి బాపడు పడే బాధ చూసి సేవకులతో తోలించిపెట్టినాడు. ఇదంతా హాస్యశీలతే కాని అపహాస్యంకాదు త్రిజటునితో ఇదేమాటలు చెప్పాడు.
కోపమాయిట్లు చేసె కుఱ్ఱరాచవాడటంచు బరాచిక మాడినాడనంతియే క్షమింపుమయ్యా!
వరుస మనుమలుఁ దాతలు పడుచు వాండ్రు ముసలులను నవ్వులాటలు మసలవెట్లు! కోపపడకుము!
అది చూసిన జానకి ఆశ్చర్యంపొంది, ఆనందించింది. రాజ్యాభిషేకం భంగమై అరణ్యవాసం సంభవించినా ఇంత తమాషాగా ప్రవర్తిస్తున్నాడా అనుకుంది. రామునకు రాజ్యముపై కించత్తూ లోభం లేదని దీనివల్ల తెలుస్తుంది. తనమిత్రమైన వశిష్ఠపుత్రుడు సుయజ్ఞడు బాధపడుతూ వస్తునాడు. తనమందహాసంతో అతని దుఃఖాన్ని నివారించినాడు. ‘‘అతని మొగమున నూత్నశోకాంబుపూర్ణమైత్రి భాండమ్ము పగిలెడు మాద్రిగాగనున్న, రాముడు మందహసోర్మికలను ఒరుపు వారించి భాండమ్ము భద్రపరిచె’’.
అంతేకాకుండా సేవకులకు, స్నేహితులకు వేరెవ్వరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన సంపదనంతా దానం చేస్తాడు. వారినంతా తన మర్యాదతో ఆకట్టుకొని నిరుత్తరులను చేస్తాడు. తన సంపదకంతా సుయజ్ఞుడే అధికారిగా నియమిస్తాడు. ఈ సంధర్భంలోని సెవకుల ప్రవర్తన, రాముని ఓదార్పు సహజంగా వర్ణితమైనాయి.
తనవంకగాంచి యెత్తిన కన్నుదోయి వంచుచుద్రప్పు చేసిన చోప్పుగాగ
కన్నీరు తుడుచుకోగా సిగ్గుపొందుచు నమిత దోషము చేసినట్లుగాగ
వెలికివచ్చెడు నేర్పుబిగ్గబట్టుచు సమాజమున నాగరికులచాడ్పుగాగ
నిలువజాలక నట్లే నేల గూలంబదు చఖిల సంధులు ప్రస్సినట్లుగాగ
నెంతో బలవంత పెట్టి గ్రహింపజేసి నట్టికాన్కలు గొని సేవకాళి యేడ్వ
రాఘవుడు వారితోడ దైర్యంపుమాటలాడి యిట్లనెశాసించునట్లుగాగ (-అయోధ్య-ప్రస్తాన, పు.120)
ఈ నాయిల్లు నేను వనవాసం నుండి తిరిగివచ్చే వరకు ఇట్లే ఉండాలని, ఏమార్పులు జరుగరాదని శాసించినాడు. అట్లే సీతగూడా పట్టాభిషేకం నిల్చిపోయిందని తెల్చినప్పుడు రాముని చూసి ఫకాలున నవ్వుతుంది.
రాముడు గుమ్మంలో నిలుచున్నాడు. రాజలాంఛనాలేవి లేవు. ఉరకపై పొరగ దైర్యం ఆముఖంలో ఉంది. ఆ రాముడిని చూచి చూచి; దిగ్రమచెంది. కొంచెం సేపటికి తెలివి తెచ్చుకొని ఫకాలున నవ్వి తనకుమొదటి నుండి పట్టాభిషేకం జరుగుతుందా? అనే అనుమానం ఉండినదని, అట్లే జరిగిందని చెప్పుతుంది. ఆమాటవిని రాముని దైన్యపుపొర దానంతకదేపోయి, నువ్వుగింజంత నవ్వు నవ్వినాడు రాముడు. మరంతలోనినే మొగము బిగిసింది. ఆ అనుమానమేమొ తనకు చెప్పలేదని, వివరిచమని, బలవంతపెట్టినాడు. సీత మీతో అన్నీ ప్రమాదాలే! అంటూ చాలా సేపు చెప్పాడు చెప్తేమీకుకోపం వస్తుంది అంటుంది కోపం రాదులే చెప్పుమని రాముడు ధశరథుడు చేసిన ఈ అన్యాయాన్ని ఎవ్వరూ ఎదుర్కోలేరా! నీవే ధాత్రినిస్వాదీన పరుచుకొలేవా! అంటుంది. వెంటనే రామునికి కోపం వచ్చింది. నేనే కైకతో వరాలుకోరమని చెప్పించానా? అన్నాడు. వెంటనే సీత ఇట్టివన్నీ నాపైన మోపవద్దు కోపంరాదంటే చెప్పినాను. మళ్ళీ కోపగిస్తే ఎలా? అంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకొంటూ కొంచెంసేపటికి ఇద్దరూ నవ్వుకున్నారు. నీతో చెప్పిపోదమని వచ్చినాను. అన్న రామునితో సీతగడుసుగా నాతో చెప్పడం ఎందుకు?
నేనెవరితో చెప్పాలని అంటుంది. ఇది సీతారాముల స్వభావాన్ని, అలౌకిక నిరీహత్వాన్ని పట్టిస్తుంది. రాజ్యం పోయిందన్న బాధ ఇద్దరికీ లేదు. అంతనిరీహులు. అట్టి స్థితిలో కూడా హాస్యవంతంగా ప్రవర్తించినారు. ఈ రాముని పరిహాసశీలత గుహుని సేవకునితో కూడా మాట్లాడే సందర్భంలో కన్పిస్తుంది. సీతను అమ్మవారుగా, పురములోని పసుపుముద్దగా వారు భావిస్తారు. ఆమె అమ్మవారు కాదు నాభార్య అంటాడు. అట్లే చివరిలో నందిగ్రామంలో ఆ నావికుడు రామదర్శనార్థం వచ్చినప్పుడు నాకన్నా తెలివైన వాడని చమత్కారిస్తాడు.
అరణ్యకాండలో నడవలేక చెఱువునొడ్డున విశ్రమిస్తానన్న సీతతో అయోధ్యవదలి విశ్రాంతి కోసం వచ్చినావా? అన్నాడు రాముడు. అయోధ్యలో ఎంతోతెరపి ఉందికదా మరి! అని సీత ప్రత్యుత్తరం దురుసుగా ఉంది. అందుకే రాముడు చాలాసేపు మాట్లాడాడు. కోపం వచ్చిందనుకున్నది సీత. అందుకే తానే మాట్లాడవలెననుకొని మనము మరులుతీగతొక్కినాము దారితప్పినాము అంటుంది. వెంటనే రాముడు భర్తనుమరులుగొనే అడవికివచ్చినావన్నాడు. భర్త పై ప్రేమతో కాదు ధర్మబుద్ధితో అంది సీత. వెంటనే రాముడు కనుబొమ్మలు ముడివేసి అభిమానం దెబ్బతినగా కొపంతో త్వరగా నడుస్తుంటే సీత కించిద్దుః ఖాభిమాన హృదయాబ్జ మయ్యింది.
సుతీక్షుని ఆశ్రమానికి మళ్ళీ రెండవసారి వెళ్ళిన సీతారామలక్ష్మణులను ఋషులంతా ఎంతో ఆదరిస్తారు. ఈ సంధర్భంలో ఒకముని తన ఇంటికి లక్ష్మణుని పట్టుకొని వెళ్ళి అగ్ని గృహంలో మేకునకు దగిలించిన పులితోలును ఇస్తూ, ఇది నీవుచంపిన పులిదే అని చనువుగా చెప్తాడు. అగస్త్యుని కథను సీత చెప్తుంది. ఆమెకు సుతీక్షుని ఆశ్రమంలోని వృద్ధగార్గేయి చెప్పింది. ఆమె చెప్పినట్లే చెప్తాను వినమంది. రాముడు నేను విననంటాడు. మీరు వినకుంటే లక్ష్మణుడు వింటాడులే! అని ప్రారంభిస్తుంది కథను. వృద్ధగార్గేయి దీక్షాకపర్ది నామె చెప్పెను చెప్పుదునా యటన్న చప్పుదునా మాటున్న మణి చెప్పెడునది యెట్టోమేఱుంగగా నొప్పదటన్న స్వామి, సతి ఊ! యటుతానె ప్రసగసాధులై యొప్పు నగస్త్యమౌని కథ యొక్కడటంచును... స్వామి యిప్పుడు నేవినజాలనన్న జానకి కథాభిమాన కృష్ణాత్మయగుచు మీరు వినకున్న వినును సౌమిత్రియంచు కథసమారంభముచే సెకాతరాక్షి’’.
కథచెప్పిన తర్వాత సీత కథబాగాలేదా అని ప్రశ్నించింది. రాముడు నాకాభాగమే తెలియదుగాని తెలిసినవి రెండు సంగతులు మొదటిది నీవు రాముని భార్యవని రెండవది జనకుడుగన్న కుమారి వనియన, సీతకాదుకాదు. రఘోత్తముని భార్యారత్నమని యనింది. ఇవన్నీ కథలో సీత సంబోధనలు, అట్లే అగస్త్యభ్రిత పద్ధతి విశిష్టమైనది. ఆయనకు తొందర, తొట్రపాటు ఎక్కువ మాటా మాట్లాడుతూనే హఠాత్తుగా బయటకు వెళ్ళి వస్తాడు. సీతారామా లక్ష్మణుల తన వద్దకు వచ్చినమస్కరిస్తూనే తన అన్న వీరికోసం ఎదురుచూస్తున్నాడని, తను కూడా వీరు ఏపూట పడితే ఆపూటనే వస్తారని అనుకొంటున్నాని, బ్రహ్మచారిని గదా సీతాదేవి వస్తే ఎట్లాగా అనుకుంటుటే పొరుగున ఉన్న గాలవమహర్షి భార్య తోడుగా వచ్చిందని చెప్తూనే వెళ్ళిపోతాడు. మళ్ళీ సీతారామలక్ష్మణులు వనభోజనాలు నెఱుపుతుండగా వస్తాడు. తన అన్న అగస్త్యుని ఘనచరిత్రను, ఆత్మీయంగా గొప్పగచెప్తాడు. వింధ్యపర్వతం చాపచట్టుగా బడి నమస్కారమాచరించె. మనవానికంత యద్రియునునిట్లే అని అగస్త్యుని మనవాడని గొప్పగా చెప్పుకుంటాడు. చెప్తూ నవ్వుతుంటే జానకీదేవి ఆనవ్వాపి చెప్పు స్వామీ అంటుంది.
అగస్త్యుని కథ చెప్పి హఠాత్తుగా వెడలిపోతాడు. అతని ఆత్మదర్మాల విస్పష్టవైవిధ్యానికి రాముడాశ్చర్య పడినాడు. ఇంకసుయజ్ఞడున్నాడు. రామునికి పరమప్రీతి పాత్రుడైన స్నేహితుడు సహపాఠి వశిష్టుని కుమారుడు. రామవనగమన వార్తను విని తట్టుకొలేకపోయినాడు. తన సంపదనంతా సుయజ్ఞనికే ఇచ్చినాడు రాముడు. అతని దుఃఖాన్ని తన దరహాసవదనంతోనే అదుపు చేసినాడు మారుమాట్లడనీయడు. భరతుడు రాముని తిరిగి అయోధ్యకు తెచ్చేందుకై చిత్రకూట పర్వతానికి పోమ్మన్నాడు భరధ్వాజ మహర్షి చెప్పిన గుర్తులన్నీ సరిపోయి రాముని ఆశ్రమం కన్పిస్తుంది.
అప్పుడు భరతుడు సుయజ్ఞని ముందుగా పోయి చూచిరమ్మని పంపిస్తాడు. ఆ సంధర్భంలో
అన్నకు నీకు ప్రాణముగదయ్య! నిజంబుగానాకు భ్రాణమౌ
నన్న ననున్ సమానముగ నాదృతి భాజను జేయగావలెన్
సన్నమెకండు పుట్టినది జానకిదేవి మహనసంపుధూ
మోన్నతి జూచి వచ్చెనోకడూర్జిత భూమిజ్జషండచూడమున్
నేముందుగానె పోయిన నేమగునో! నీవుపోయియాసన్నానిజం
చో! మనవాండ్రందుండిరేమొ! కనిరమ్ము రాముడెరుగక యుండన్
అంటూ రామునికి తెలియకుండా వారి వివరాలు తెల్సుకొనిరా! రామునికి నీవు ప్రియమిత్రునివిగదా! అని తెల్పినాడు శ్రీభరద్వాజులు చెప్పినారు రాముడిక్కడ ఇల్లుకట్టినాడని పోయిచూచిరా! అన్నాడు సుయజ్ఞదుఁ నవ్వి యీచిత్రకూటంలో లేకున్నా మీ అన్నను చూపిస్తే నాకేమిస్తావు అంటాడు. ఎంతోపరిహాస యుక్తమైన సహజచమత్కారం పాత్రలన్నీ తెలుగువారిగా ప్రవర్తించడం అంటే ఇదే! భరతుడు నీవు అన్నతో నెరిపేచనవు నాకిస్తున్నావు నేను నీకేమి ఇవ్వగలను అంటాడు. రాముని సీతను చూచినావా అని తిరిగివచ్చిన సుయజ్ఞని ప్రశ్నిస్తాడు. కాని సుయజ్ఞడు తనకు రాముని పై కోపంగా ఉందని, తన మాట వినకుండా వనవాసానికి వచ్చినాడని, తను మాట్లాడనని బెట్టు చేస్తాడు. నీవు ముందు పోయిచూడు కోపం తగ్గితేనే నేనుచూస్తాను అంటాడు. ఎంతో సహజంగా ఉంది. మైత్రిలో ఈ నిష్టురం సహజంగదా! అక్కడ రాముడున్నట్లు నిర్ధారణకు గుర్తులు హృద్యంగా వివరించినాడు.
అపుడు జానకి తాల్చినట్టియా చీరయే చెట్టు కొమ్మకునారఁగట్టియుండె
కోటిసింహసన క్రూరచాపంబు సౌమిత్రి దింకొక చెట్టు మీదవ్రేలు
పాణి గ్రహవేళ వైదేహదత్త పాదూ మణిచ్చవితో చేదూరమునకు
నవ్వుదుర్లభ విదేహాత్మజారచిత్ సంగత రంగవల్లులు కానవచ్చె
మట్టిమిద్దెను నిర్మించి మాసమైన గడవలేదను గోడలకిడిన మట్టి
యుండలండలుగా బచ్చియారలేద కనగ నింకేమి, గుర్తులు గావలయును?
ఆ మాట విన్న భరతుని మేనుపులకలెత్తినాయి. సుయజ్ఞనితో
తల్లిమ్రుగ్గు కఱ్ఱ దగ్గర నుండి నీకేవిగుర్తుచెలిమి యెంతలోతో!
యందుకనిమె యన్న కంతటినేస్తమ్ము నీవనంగ శ్రీమనీషశరధి!
రాముని చూసివస్తే ఏమిస్తానంటివి! జాముజామునకు అమృతమువంటి పాలను చేపగల కపిలధేనువిస్తాను అయెధ్యపోతూనే తోలిపెతానన్నాడు. దానికి సుయజ్ఞడు ఏమేమి? కపిలనిస్తావా? సాక్షాత్తు శ్రీరామునే ఇచ్చినావుగదా! అన్నాడు. ఇద్దరూ కౌగిలించుకొన్నారు. రాముడు రథంలో శృంగిబేరపురం వచ్చినాడు. గుహుడు ఆ ప్రాంతానికి రాజు, రామునికి స్నేహితుడు. భక్తుడు, రాముడాతని చూచి కౌగిలించుకో బోయినాడు. కాని గుహుడు ప్రాంజలించి ప్రదక్షిణము సల్పినాడు. ఓరామా! నీ రాకతో దేవతలంతా నా ఇంటి ముంగిటకు వచ్చినట్టైంది. నీకు ఎన్నాళ్ళకు నాపై ప్రేమ కల్గింది. జానకితో వచ్చినావు. ఈ రాజ్యమంతా నీదే? నా శరీరాన్ని కూడా కావాలంటే కోసి యిస్తాను. నీకేమేమీ కావలెనో ఆవెల్లా వాడుకో! అని ప్రార్థించినాడు. కాని రాముడు నేనిప్పుడు తాపసిని నాకు చేసే సేవలన్నీ రథ గుఱ్ఱాలకు చేయమని రాజలాంఛనాలున్నవి వాటియందె అన్నాడు.! నీవు సేమమా! మంత్రులు భృత్యులు విధేయులుగా నుందురా? అని ప్రశ్నించినాడు. రాత్రివేళలో సుమంత్రుడు, లక్ష్మణుడు గుహునికి జరిగిన కథ విన్పించగా ‘మది తల్లడమంది హుంకృతి స్పృహకూడా లేకుండా, మ్రాన్పడి, రాతి బొమ్మవలె చాలాసేపు నిల్చుండిపోయినాడు. రాముని అరణ్యవాస వృత్తాంతాన్ని విని తట్టుకోలేని సహృదయమిత్రుడు గుహుడు. తనరాజ్యాన్ని రామునికిచ్చి ఇక్కడే ఉంచుకుంటూ నన్నాడు లక్ష్మణునితో. దీనికి సౌమిత్రి నీ స్నేహం చెడగొట్టుకోకు. ఆయన మనస్సును మనం తెలుసుకోలేము. ఎంతో మంది చెప్పినా వినకుండా అడవులకు వచ్చినాడు అన్నాడు. రాముడు పడవనెక్కి నది దాటబోవుచున్నపుడు గుహుడు కంటనీరెట్టుకొని, రుద్ద కంఠంతో ప్రభువా! అని మారుమాట్లాడలేక నావను చేతితో చూసినాడు. మళ్లీ ఈ గుహుడే భరతుని సైన్యాన్ని చూచి అనుమానించి రామునిపైకి దండెత్తి వచ్చినాడనుకున్నాడు. అదే నిజమైతే భరతును సైన్యాన్ని నశింపజేస్తాననుకుంటాడు. భరతునికి నమస్కరించి అనుమానంగా నేటిరాత్రి ఇక్కడే ఉండి రేపు పోవచ్చు లెమ్మంటాడు.
వెంటనే భరతుడు గ్రహించినాడు. నీ మాటల్లో స్నేహం అర్ద్రత లేవే అన్నాడు. సుమంత్రుడు గుహుని అనుమానం వివరించినాడు. భరతుడు వ్యధ పొంది ‘అమ్మ మొదలు గుహుని యందాక భరతుని నెఱిగి కూడ నేలొ యెఱుగలేరు’ అనుకున్నాడు. గుహునితో ‘నన్నును వేఱుగా దలంచినను మదినించుకలేదు, కోపమున్ నిన్ను గుఱించి’ అన్నాడు. ఆ యేలిక తెచ్చేందుకే పోతున్నాను. నీవు కూడా రమ్మన్నాడు. నాభక్తి భావం నామొగంలో కన్పించదా? అని వాపోతాడు. నిజం తెల్సి పశ్చాతపుడై ‘ నాయేలిక! యేడువకే నీ యెడ పొరపాటు బడితి’ అని క్షమాపణ కోరినాడు. సీతారామలక్ష్మణులు తన ఆతిథ్యం తీసుకోవడం, ఆరాత్రి గడపడం, మఱ్ఱిపాలు తలకు పోసుకోవడం వంటివి లక్ష్మణుని శుశ్రూషా పరమత్వాన్ని వివరిస్తూ గుహుడు ‘‘ఈనా చేతులు నఱుకుము నేనే దాటించితి’’ రాముని గంగను అని విలపిస్తాడు. భరతుడు లక్ష్మణ, గుహులకు రామకథలలో సమానస్థానం ఉందని మెచ్చుకుంటాడు. ఇది గుహునికి విశ్వనాథ ఇచ్చిన స్థానం గుహుని ప్రవర్తనతో రామునిపట్ల ఆయనకున్న భక్తి ఈ విధంగా వ్యక్తమవుతుంది.
భరద్వాజ మహర్షి భరతని సేనకు విందు చేసినాడు. మరురోజు చిత్రకూటానికి సిద్ధమైనాడు భరతుడు. ‘ఈ రేయి కూడా నుండి పోరాదా!’ అన్నాడు ముని. భరతుడు దవ్వుపోవలె స్వామీ! శ్రీరాముడెమనునో తీరికలేదెడద; నేమి తెల్పుదు? నన్నాడు ముని’ సరిసరి పొమ్ము పొమ్మని ప్రసాదమిచ్చినాడు. ‘‘ఇది ఒకరకమైన వర్తనా పద్ధతి. అంతేగాక తల్లిని అవమానించవద్దని భరతునికి హితం చెప్పినాడు. నఖిలము ప్రయాణ సన్నద్ధమయ్యెఁ బోలు! పోయిరండు రాముని దయపుట్టుగాక.’ అని దీవించినాడు. కైకను ఓదార్చినాడు. దేవ కార్యం కోసం, లోక కళ్యాణం కోసం అపకీర్తి పొందిన ఘనత నీదని ప్రశంసించినాడు. కైక హృదయం తెల్సుకున్న అమృత హృదయమది.
సీతాదేవి హనుమతో రాముని గురించి చెప్తూ ఆయన వనవాసానికి, ఆయోధ్య వాసానికి తేడా వుందని వర్ణిస్తుంది. ఇది కూడా రాముని మేనరిజమ్ను పట్టిస్తుంది. అయోధ్యలో రామునిగా రాజకుమారునిగా స్వేచ్ఛగా ప్రవర్తించే వీలుండదు. అందుకే అడవుల్లో స్వేచ్ఛగా తిరిగేవాడని చెప్పింది. హనుమంతుడు చూచేటప్పటికే రాక్షసులతో యుద్ధం, సీతా పరిత్యాగ దుఃఖం మూలంగా మనిషితో పెద్దరికం వచ్చి యుండవచ్చు గాని, వనవాసానికి వచ్చిన కొత్తలో ఎంతో హాయిగా స్వేచ్చగా గడిపేవాడు.
‘‘రాజకుమారుడై తిరుగురాదు యద్దేచ్ఛముగా నయోధ్యలో
నేజనునా మాహాటవుల నిట్టులనుండె నటించునేమియుం
గజడు నన్ను వెంటగొని కొమ్మలనెక్కు గుహాళిజొచ్చును
ర్వీజము లెక్కుజెర్వులు మణిన్ మఱజొచ్చు మహాస్వతంత్రుడై.’’
ఇప్పుడు పెద్దవాడయి మఱి యటవీ వసనంబు ప్రాతయై
నప్పిన పెద్ద మనిసి తనంబలవాటయి మౌని పల్లెలన్
బొప్పెలు కట్టి దానవ సమూహము తోడి మహాహవంబులం
గప్పుగనన్ని కన్పడునుగాని మ అప్పుడు కేళిబుద్ధియై.
పాతికయేండ్లవాడపుడు స్వామియుబంధురకేళి లోలుడై
నాతుకనేను వెంటనే చనన్వలె రాననవీలులేదు నే
నైతన వెంట వచ్చితిగదా! యటనీల్ తకిక దూకెడుం
గోతుల, బ్రాకెడందరులకన్, బహుక్రూరమాగాళి నూకెడున్.
ఇదీ రాముని స్వేచ్ఛాప్రవర్తన, రాజ్యభారం తీరిందని, ప్రకృతిలో కలిసి మెలసిజీవించే భాగ్యం కల్గిందని రాముని సంతోషం ఆయన ప్రకృతి ప్రియత్వాన్ని తెల్పేదే. సీతారామలక్ష్మణులు వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళి, ఆమౌని దర్శనంచేసివారు తమ పేర్లు చెప్పుకొని నమస్కరించినారు. ధాన్య నిమగ్నుడైన వాల్మీకి కనులతెరచి చూచినాడు. కాని కూర్చుడుడంచు స్వాగతచర్చన్ మణి పలుకడాయెను.
‘‘గండూషించెను తేజముల్ పలుకు బంగారమ్ముగా మాటలే
కుండెన్ మౌనియు, నేలవచ్చిరనడిరదుందుండనండంచు రా,
ముండున్ దమ్ముడు వెనుకుదిరిగి స రూదృష్టి వీక్షింప శ్రీ
నిండారన్ మునిలోక మౌళి కనుచుండెన్ వారినే వారినే.’’
వాల్మీకిని మౌనిగానే ప్రతిచోటా, అవతారికలో గూడా పేర్కొన్నాడు విశ్వనాథ. మౌన వాఖ్యతో శిష్యులు ఛిన్న సంశయులు కావడం దక్షిణామూర్తి స్వరూపం, అవతారంలో చూస్తాము. ఇప్పట్టున వాల్మీకి రామలక్ష్మణులతో ఏమీ మాట్లాడడు. అన్నింటికీ మౌనమే. చాలా ఆశ్చర్య కరమైన ప్రవర్తన. రాముడు చిత్ర కూటంలో ఇల్లు కట్టాలనుకున్నానని యోగ్యస్థలం చూపమన్నాడు. దాని మునినవ్వి, లేచి వచ్చి వారికి ఇల్లుకట్టాల్సిన స్థలాన్ని గృహ వాస్తును రేఖలుగీసి చూపించి, ఏమీ మాట్లాడకుండగనే పోతుంటే, సీతాదేవి పాదాలకు నమస్కరించింది. అప్పుడు బిడ్డా! లెమ్మని పల్కినాడు, సీతగడ్డం ఎత్తి చూచి, ఏదో తోచి కన్నుల నిండా నీరు నింపుకున్నాడు సీతకు మహర్షి చూపిన వాత్సల్యం, ఆర్ద్రతలు తన తండ్రిని గుర్తుచేసినాయి. నూతన గృహ ప్రవేశ సమయంలో మళ్ళీ వాల్మీకి వచ్చి, వాస్తు హోమం- శాంతులు, బలిదానాదుల క్రియలను రామునితో చేయించినాడు. రామాయణంలో వాల్మీకి పాత్ర ఇంతే. ఈయనను మౌనిగా తీర్చిదిద్దినాడు. సీతకు రాబోయో కష్టాలను తెలిసిన వాడై కరుణార్ద్ర చిత్తంలో కన్నుల నీర్వెట్టినాడు మహర్షి.
ఈ విధంగా విశ్వనాథ తన రామాయణ కల్పవృక్షంలో ప్రతి పాత్రను వాటి వై విధ్యభరితమైన మానరిజమ్స్ తో తీర్చిదిద్దినాడు. సన్నివేశంలో, సంభాషణలో స్వరూప స్వభావాలతో రామాయణం లోని పాత్రలన్నీ తెలుగువారిగనే భాసిస్తాయి. అందుకే తెలుగు రామాయణమైంది. అవిచ్ఛన్న సాంప్రదాయార్థిగా ధర్మమే మానవకళ్యాణానికి మూలం కావాలని కోరినా, అర్థకామాలు రెండూ ధర్మవంతమైతేనే ఐహిక, ఆముష్మిక సుఖ శాంతులు లభ్యమని ప్రబోధించినా, జ్ఞానపథవిహారిగా మానవుడు ఉండాలని చెప్పినా, ఇదే భారతీయ ఆర్షధర్మమని, ప్రపంచానికిచ్చే సందేశమనీ ఘోషించినా, సాంస్కృతిక దాస్యాన్ని ఖండిరచినా, సాహిత్య విలువలకు నూతన నిర్వచనాలు చెప్పినా, ఎన్నెన్నో కొత్తపుంతలు తోక్కినా, విశ్వనాథ తనరామాయణ రచనలో తెలుగుదనం కోసం ప్రత్యేక దృష్టిసారించినాడను మాట నిర్వివాదాంశము. ఈ దృష్ట కల్గినందు వలననే తెలుగులో భారత-భాగవతాలస్థాయిలో రామాయణం లేని లోటును కల్పవృక్షం తీర్చిగలిగిందని సహృదయులందరూ అంగీకరించే విషయమే. పాత్రల స్వయం ప్రవృత్తులన్నిటినీ, తెలుగు వారి దృష్టినుంచే తీర్చిదిద్దినాడు. కాబట్టే రామాయణ కల్పవృక్షాన్ని కవి తెలుగురామాయణం అని సగర్వంగా చెప్పుకొగల్గినాడు. నేటికీ సాహిత్య వేత్తలంతా ఈ అంశాన్ని అంగీకరిస్తూనే ఉన్నారు. ఆదృష్టితో వివేచన చేస్తూనే ఉన్నారు. ఇది అవిచ్ఛన్నంగా సాగవలసిన వరిశీలనాంశము.