ప్రవృత్తి-నివృత్తి: మానవుడు తాను తక్కిన ప్రాణుల కన్న అన్నింటా గొప్ప అనుకుంటున్నాడు. నిజంగా ఆలోచిస్తే ఏమీ కాదు అని తేలుతుంది. ఇది వినేందుకు చివుక్కు మంటుంది. కానీ నిష్టుర సత్యం. కొంచెంసేపు లోతుగా ఆలోచిస్తే నిజమేమిటో తెలుస్తుంది. నిజంగా మిగిలిన జీవులకన్న శ్రేష్టి ఎలా కగలడో తేలుతుంది.

ప్రతి ప్రాణి వ్యవహారంలో రెండు దశలు ఉంటాయి. ఇష్టమైన విషయంలో ఆసక్తి, శ్రద్ధ. కష్టమైన విషయంలో అయిష్టం, అనాసక్తి. వీటి కారణంగా ఆ పని చేయడం లేదా మానడం జరుగుతాయి. వీటినే ప్రవృత్తి, నివృత్తి అని శాస్త్రం వివరిస్తుంది.

దీన్ని ఇంకా వివరించుకుంటే మన జ్ఞానేంద్రియాలు 5 ఒక్కొక్కటీ ఈ ప్రవృత్తి, నివృత్తులను ఎలా అనుసరిస్తాయో తెలుస్తుంది. కన్ను ఇష్టమైన దృశ్యాన్ని శ్రద్ధగా, ఆసక్తిగా చూడడం ప్రవృత్తి. కష్టమైన దాన్ని చూడకపోవడం నివృత్తి. అట్లే చెవి, ముక్కు, చర్మం, నాలుకలు కూడా.

వీటన్నిటికీ అధిష్ఠానమైన మనస్సు కూడా అంతే. అసలు ఇష్టం, కష్టం అని నిర్ణయం చేసేది మనస్సే కదా! ఇది సర్వ ప్రాణులకు సమానమే. మరి మానవుని గొప్ప ఎక్కడ? ఎలా? అని ఆలోచించడం అవసరం. మానవుడు స్వతంత్రంగా వ్యవహరించే వాణ్ణి అనుకుంటున్నాడు. సర్వప్రాణుల తన వశంలో ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది చాలా వరకు నిజం కాదు. అయా సందర్భాలలో ఎలా అవి తన వశంలో ఉండడంలేదో తెలుస్తూనే ఉంది. అసలు తాను నిజంగా స్వతంత్రుడు కాడా. మరి స్వాతంత్య్రమ్‌ ఎలా పొందాలో, నిజమైన స్వేచ్ఛ ఏమిటో తెలుసుకోవడం అవసరం.

ప్రవృత్తి: మానవుని స్వాతంత్య్రం, ఇతర ప్రాణులపై వాని ఆధిపత్యం వాస్తవానికి పరిమతమవు తున్నాయి. కేవలం భౌతిక విషయంలోనే స్వాతంత్య్రం లేనప్పుడు మరి ఆధ్యాత్మ రంగంలో ఎంత వరకు పురోగతిని పొందినామో అని సమీక్షించు కోవాలి.అప్పుడే ‘‘జంతూనాం నరజన్మ దుర్లభం’’ అనే మాట నిజమే అని తేలుతుంది. మరి దీనికి పరష్కారం ఏమి? ‘‘అభ్యాస వైరాగ్యాలను అలవర్చు కోవడమే’’ అని తేలుతుంది. గీతలో అర్జునుడు ‘‘చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవత్‌ దృఢం, తస్యహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం’’ అని వాపోయాడు. ఈ మనస్సు అతి చంచలమైనది. జయించుటకు శక్యంకానిది. ఎంతో క్షోభకు కారణం. దీనిని నిగ్రహించు కోవడమెలా? గాలిని బంధించడం వంటిది. అందుకే కృష్ణుడు ‘‘అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం’’ అన్నాడు. యోగవసిష్ఠంలో రామచంద్రుడు కూడా సంద్రంలోని నీటినంత త్రాగడంకన్న, మేరు పర్వతమును పెకిలించడంకన్నా మనస్సును నిగ్రహించుకోవడం కష్టసాధ్యమైన పని అని వాపోయాడు.

నివృత్తి: స్వయం తీర్ణః పరాన్‌ తారయంతి అన్నట్లు తాను స్వయంగా శాస్త్ర, ధర్మబద్ధంగా ప్రవర్తిస్తూ, నిష్కామ కర్మలను ఆచరిస్తూ, క్రమంగా ఇంద్రియాలను, మనస్సును ప్రవృత్తి నుండి నివృత్తి వైపు మరలించినప్పుడే నిజమైన నరజన్మ పొందినట్లు. అప్పుడే ఇతరులకు మార్గదర్శనం చేసే యోగ్యత పొందగలం. ఈ చర్చ సారాంశం ఏమిటంటే మన ప్రవృత్తి నివృతులను ధర్మబద్ధంగా నియమించి, క్రమంగా చేసే ఆధ్యాత్మ సాధనలు ఆధారంగా క్రమ ముక్తిని పొంది, జన్మ సార్థకం చేసుకోవడమే దుర్లభమైన నరజన్మ ప్రయోజనం.


  1. కర్మ సిద్ధాంతం

‘‘నహికశ్చిత్‌ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్‌

కార్యతేహ్యవశః కర్మ సర్వప్రకృతిజైర్గుణైః ’’ (- గీత 3 అ. 5 శ్లో.)

భావం: సృష్టిలోని ప్రతిప్రాణీ ఒక్క క్షణం కూడా కర్మలను చేయకుండా ఉండలేదు. మనకు తెలియకుండానే కర్మలను చేస్తున్నాం. ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన గుణం.

త్రికరణములు: 3 పనిముట్లు 1) మనస్సు, 2) వాక్కు, 3) శరీరం. వీటితోనే మనం అనుక్షణం ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాం. ఇవన్నీ కర్మలే. ఇవి 2 రకాలు. 1. బైటికి కనిపించేవి. 2. కనిపించనివి. వాక్కాయాలతో చేసే పనులు కనిపిస్తాయి. మనస్సుతో చేసే పనులు కనిపించవు. ఇవి మళ్లీ 2 రకాలు. పుణ్యకర్మలు. పాప కర్మలు. పుణ్యకర్మలవల్ల సుఖం పాపకర్మల వల్ల దుఃఖం కల్గుతాయి. కర్మ(పనులు) ముగిసిన తరువాత వాటిప్రభావం సూక్ష్మ శరీరంగా (మనోబుద్ధిచిత్యహంకారములు) ఏర్పడుతుంది. వీటిని కర్మవాసనలు అంటారు. బాల్యంలోజరిగిన వాటిని ముసలితనంలో చెప్పడం కొన్నిసార్లు గత జన్మ విషయాలు చెప్పడం వంటివన్నీ ఈ వాసనలే. కర్మలను గురించి స్పష్టంగా తెలుసుకోవడం మేధావులకు కూడా సాధ్యంకాదు అని గీతలో కర్మలను గురించి వివరిస్తూ భగవంతుడు

‘‘కింకర్మకిమకర్మేతి కవయో-ప్యత్ర మోహితాః

తత్తే కర్మ ప్రవక్షామి యత్‌ జ్ఞాత్వా మోక్షసే-శుభాత్‌.’’ (-గీత. అ4. శ్లో.)

కర్మలను (పనులు) గురించి చక్కగా తెలుసుకున్నప్పుడే అశుభమైన సంసార వ్యామోహం నుండి బైటపడగలం. కర్మను గురించి మాత్రమే కాకుండా అకర్మ, వికర్మలను గురించి కూడా తెలుసుకోవాలని హెచ్చరించారు.

‘‘కర్మణోహ్యపి బోద్దవ్యం బోధ్దవ్యం చ వికర్మణః

అకర్మణశ్చ బోధ్దవ్యం గహనాకర్మణో గతిః’’ (-గీత.అ4.శ్లో17)

అకర్మ వికర్మలను గురించి కూడా తెలుసు కోవాలని అర్థం అయింది. స్థూలంగా కర్మ అకర్మ వికర్మలను గురించి తెలుసుకుందాం. 1) కర్మ: శాస్త్ర విహితమైనవే అంటే శాస్త్రము బోధించే కర్మలు. 2) అకర్మ: ఫలితం కోరకుండా అంటే అహంకార మమకారాలను వదలి చేసే పని. కర్తగా భోక్తగా ఏవిధమైన సంబంధం లేకుండా చేసేకర్మ. దీని వల్ల కర్మవాసనలు అంటవు. 3) వికర్మ: శాస్త్రము నిషేధించిన కర్మలు. పాపకర్మలు. అంతేకాకుండా ఒకరికి కర్మ వేరొకరికి వికర్మ కావచ్చు. (వర్ణాశ్రమ ధర్మాలనుబట్టి) అందరికీ వర్తించే వికర్మలూ ఉన్నాయి. అందుకే గీతలో కర్మసిధ్ధాంతం అంత లోతుగా అధ్యయనం చేయబడినది. మరొకవిధంగా కర్మ 3 రకాలు. 1) సంచిత, 2) ప్రారబ్ధ, 3) ఆగామి.

సంచితకర్మ: ప్రతి జన్మలో కర్మ ఫలాన్ని నిల్వ చేసుకోవడం. ప్రారబ్ధం: సంచితకర్మలో కొంతభాగాన్ని అనుభవించడం. ఆగామి: ఇప్పుడు చేస్తున్న కర్మఫలితం రాబోయే జన్మలో అనుభవించడానికి సంపాదించుకోడం. మన ధ్యేయమంతా దీనిపై నే ఉండాలి. దీనిని బట్టి రాబోయే జన్మలో మన కష్టసుఖాలు నిర్ణయం చేయబడతాయి. మనం చేసే కర్మలలో గొప్పది అభ్యాసయోగమే. అందుకే అభ్యాసయోగి కిమాత్రమే పునర్జన్మ లో ఉత్తమ మానవ జన్మ సిధ్ధిస్తుంది. కర్మ ఫలితం తప్పక అనుభవిచాల్సిందే. మరొక రకంగా కర్మ ఫలం నశించదు. అందుకే జ్ఞాని కూడా కర్మలను మానకూడదు. అట్లే కర్మ ఫలం అనుభవించక తప్పదు.

కింద శ్లోకంలో దీన్నే వివరించారు.

‘‘అవశ్యం అనుభోక్తవ్యంకృతంకర్మ శుభాశుభం

నా-భుక్తం క్షీయతేకర్మ కల్పకోటిశతైరపి’’

దీనికి వివరణగా ఆదిశంకరులు ‘‘యుగసహస్ర కోట్యంతరితాపి జంతోర్యా పురాభావిత వాసనాసా న వినశ్యతి’’ అని తెలిపారు.

కర్మను గురించిన ఎన్నో వాదాలు ఖండనలు వ్యాప్తిలో ఉన్నాయి. క్రియ ప్రతిక్రియ అనే శాస్త్రీయ విధానమే కర్మసిద్ధాంతానికి మూలం దీన్ని ఒప్పుకోని వారు హేతువాదవిరోధులు. కారణం ఇప్పుడు అనుభవించే వాటికి మూలం వెనుకటి కర్మలే అనడం తప్పు అన్నప్పుడు మరి అవెక్కడినుండి వచ్చినాయి ఊరకే శూన్యంనుండి ఊడిపడవుకదా. దీన్ని తర్కశాస్త్రము ‘అకృతాభ్యాగమం’ అనే దోషంగా పేర్కొంటుంది అంటే చేయకుండానే ఫలితం పొందడం అన్నమాట విత్తుకు కారణం చెట్టు అట్లే చెట్టు కు కారణం విత్తు అట్లే తండ్రి కారణం కొడుకుకార్యం మళ్ళీ ఆ కోడుకు తన కొడుకుకు కారణం అన్నమాట.

అందుకే జీవులు చేసే కర్మలు అంతటితోనే నశించవు మరొక రూపంగా మార్పు చెందాల్సిందే దీన్ని కాదనడాన్ని‘‘కృతవిప్రనాశము’’ అనే దోషముగా శాస్త్రం ఖండిస్తుంది. అంటే చేయబడిన కర్మ నశించడం అన్నమాట. పుణ్యకర్మలు ఎంత గొప్పవైతే అంత గొప్ప ఫలితాన్నిస్తాయి. అందుకే గీతలో వేదాధ్యయనము యజ్ఞదానతపస్సులు చేసేవారికన్నా అభ్యాసయోగి పొందేఫలం గొప్పదని పేర్కొన్నారు ఎందుకంటే అభ్యాసయోగి చేసే ఏకాగ్రతారూపాభ్యాసయోగము సూక్షమైనది మరియు ప్రభావవంతమైనది. కేవలం మనస్సుతో మాత్రమే చేసే అభ్యాసయోగం లోకానికి ఎంతో అభ్యుదయాన్ని కల్గిస్తుందిఅందుకే అభ్యాసయోగికి మాత్రమే పునర్జన్మలో ఉత్తమ మానవజన్మ తప్ప్పక కల్గుతుందని భగవంతుడు నొక్కి చెప్పినాడు అతనినే కల్యాణకృత్‌ అని పేర్కొన్నాడు .అదే అభ్యాసయోగి ప్రభావం.