లోకంలో ఎన్నో మతాలున్నాయి. ఆయా మతాలకు మూలపురుషులున్నారు. ప్రతిమతస్తుడూ తమతమ మతగురువే జగద్గురువని భావిస్తాడు. అది సహజం. కానీ జగద్గురువు శంకరులు మాత్రమే అని నిరూపించే ప్రయత్నమే ఈ వ్యాసంలో జరిగింది. సావధానులై ముందుకు పోండి. ‘‘శ్రోతవ్యం అనసూయయా’’ అని వాల్మీకి వాక్కు. అంటే ఎదుటివారు చెపుతున్న విషయాన్ని ‘‘ఇదంతా మాకు తెలిసిందే కదా! నీవు చెప్పేదంతా నిజమేట్లవుతుంది?’’ వంటి భావాలు మనసులో ఉంచుకుని వినడం లేదా చదవడం ప్రారంభించరాదు. దానివల్ల మనకు ప్రయోజనం కలుగాకపోగా మీదు మిక్కిలి హాని కలుగుతుంది .ఎందుకంటె మనకు హితం ఏదీ అంత రుచించదు. అందుకే ‘‘హితం మనోహారి చ దుర్లభం వచః’’ అన్నారు .మనకు మేలుచేసేది ఇష్టాంగా ఉండదు .ఇక ప్రస్తుతానికి వస్తాము.

సృష్టిలోని ప్రతి ప్రాణి కోరేది ఏమిటి? సుఖం. ఇది ఎప్పటికీ ఉండాలనే ప్రతి ప్రాణీ కోరుతుంటుంది. కానీ చాలావరకు దుఃఖం లోనే ఉంటుంది. మనకు కావాలన్న సుఖం పూర్తిగా, శాశ్వతంగా ఉండడంలేదు. ఏదో తాత్కాలికంగా భౌతిక వస్తువులనుండి పొందుతున్న సౌకర్యాలనే సుఖమనే భ్రాంతిలో ఉన్నాము. కానీ నిజమైన సుఖము ఎలా ఉంటుందో దాన్ని ఎలాపొందగలమో శృతి, స్మృతి, పురాణాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు వంటి శాస్త్ర గ్రంథములు బోధిస్తున్నాయి. దీన్నే నిత్యానందంగా పేర్కొన్నాయి. తైత్తరీయోపనిషత్తులో వివరించిన మానుషానందాన్నే మనం పొందలేము. మరి దానికి ఎన్నో రేట్లు గొప్పదైన బ్రహ్మనందాన్ని పొందేసాధనా క్రమ విధానాలను ఒక్కొక వాదం ఒక్కో రకంగా వ్యాఖ్యానించింది. కపిల, కణాద, పతంజలి, జైమిని, గౌతమ, వ్యాస, బృహస్పతి వంటి దర్శనకారులు ద్వైతాద్వైత విశిష్టాద్వైత సిదంతాలను సమర్థిస్తూ వ్యాఖ్యానించినారు .స్థూల దృష్టికి ఇవన్నీ ఒకదానికొకటి విరుద్ధంగా కనిపిస్తూ ఉన్నాయి. వాటి సమన్వయము అంటే ఒకదానికి మరొకటి ఎలా ఆధారమైతుందో అన్నిటిని పట్ల మనం కల్గి ఉండవలసిన దృక్పథం ఎలా ఉండవలెనో విసరిస్తున్నదే నిజమైన మతం. అదే సర్వజనసమ్మతం. నిజంగా శాస్త్రమెన్నడు ఇది నీమతం దీన్నే నీవు పాటించు లేదా వదిలిపెట్టు అని చెప్పదు.

‘‘న పరీప్సమ్‌ జహాంసాం వా పుంసఃశాస్త్రం కరోతిహి

ఉపాయాన్‌ ప్రాప్తి హానార్ధాన్‌ శాస్త్రం భాసయతే-ర్కవత్‌’’ (-నైష్కర్మ్యసిద్ధి)

జనులకు ఇష్టమైనదాన్ని శాస్త్రమెన్నడూ బోధించదు. నీకిష్టమైనదాన్ని సంపాదించే ఉపాయాలను బోధిస్తుంది. సూర్యుడు తన ప్రకాశంతో లోకాన్ని కనిపింప జేస్తాడు. ఆ వెలుతురును ఎలా ఉపయోగించాలో వారి వారి ఆలోచనలను, శక్తి సామర్థ్యాలను బట్టి ఉంటుంది. శాస్త్రం కూడా అటువంటిదే. మరి లేశమైనా దుఃఖంలేని నిత్యానందం కలిగించేదే నిజమైన మతం. అంతేకాకుండా గమ్యమే (పొందవలసినదే) మతం కానీ గమకము (సాధనా విధానము) మతం కాదు. నిత్యానందాన్ని పొందడానికి వివిద మార్గాలను శాస్త్రం బోధిస్తున్నప్పుడు వాటికి గల పరస్పర క్రమ విధసంభంధం తెలియడం ముఖ్యం. ఎన్ని మార్గాలున్నప్పటికీ అవన్నీ నిత్యానంద స్థితి నెలా కలిగిస్తాయో వివరిస్తూ పామరులనుండి పండితులవరకు భక్తి, కర్మ, ఉపాసన, యోగ, జ్ఞానమార్గాలను తమ రచనలద్వారా, వ్యాఖ్యానాలద్వారా, భాష్యముల ద్వారా ఏకశ్లోకినుండి శతశ్లోకీ వరకు ఎవరికి కావలసినదాన్ని వారికి బోధిస్తూ, జీవన్ముక్త స్థితి ప్రబోధించి ఇహముననే తన్నాశ్రయించిన వారికి నిత్యానందాన్ని ప్రసాదించిన ఆదిశంకరులు ఒక్కరు మాత్రమే జగద్గురువులు. వారిముందు కానీ తరువాత కానీ ఆస్థానాన్ని పొందగలవారు మరెవ్వరూ లేరు.

శంకర: శంకరస్సాక్షాత్‌. జ్ఞాన స్వరూపమైన దక్షిణామూర్తి అవతారమే ఆదిశంకరాచార్యులు.