- శ్రీగురువులు
‘‘నేను’’ ఇది ఒక అద్భుతం. ప్రతి ప్రాణి ఈ భావనతోనే బతుకుంది. దీన్ని గురించి వేదాంతశాస్త్రం అనంతంగా చర్చించింది. అసలు ‘‘నేను’’ ఏమిటి అనేది తెల్పడమే తత్త్వశాస్త్ర ప్రయోజనం. సాధారణంగా ‘‘నేను ఎవరు?’’ అని చర్చించాలని చెప్తుంటారు విజ్ఞులు. కాని ‘‘ఎవరు’’ అనే పదం ద్వారా ఒక వ్యక్తిని సూచించినట్లవుతుంది. ఇది కూడా ‘‘నేను’’ భావనను సంకోచపరుస్తుంది. ఎందుకంటే భారతీయ ఆర్షధర్మం వేదాంతశాస్త్రం ‘‘నేను’’ ఆత్మ, అహం, స్వయం, స్వ. అనే పదములో సంస్కృతంలో వ్యవహరిస్తుంది. ఈ అన్నిటిలో ‘ఆత్మ’ పదం ఎక్కువగా వాడబడిరది. మాండూక్యోపనిషత్తు.
‘‘ఆత్మాసవిజ్ఞేయః’’
అని తెలియదగిన పదార్థమే ‘ఆత్మ’ అని తీర్మానించింది. దీనిని బట్టి పరమాత్మను తెలియజేసే ‘బ్రహ్మం’ వంటి పదములున్నప్పటికినీ ‘ఆత్మ’ పదమునకే ప్రశస్తి ఎక్కువ. ఆత్మ శబ్దం భగవద్గీతాది ప్రకరణ గ్రంథములలో అనేకమైన అర్థాలతో వాడబడిరది. తెలుగులో ‘‘నేను’’ శబ్దార్థంలో ‘ఆత్మ’ శబ్దమును గూర్చిన విచారం జరుపవలసియున్నది. ఇది తెలియకున్న ‘బ్రహ్మ’ పదార్థ విచారమునకు అర్హులముకానేరము.
ఛాంద్యోగ్యంలో ‘‘అహంబ్రహ్మా-స్మి’’ అని ‘నేను’ (‘అహం’) నకు ప్రశస్తి కలదు. ఉపనిషత్తులు, స్మృతి, శృతి పురాణములన్నీ ‘నన్ను’ను పెట్టుకొనియే ప్రవృత్తించినవి. ఎందుకిది ఇంత ప్రాధాన్యత నొందినది? ప్రతి ప్రాణి అనుభవంలో నిత్యం ఉన్నది ఇదే కాబట్టి.
ప్రమాణములు 3. 1) అనుభవం (ప్రత్యక్షం) 2) అనుమానం, 3. శాస్త్రం.
ఉదా॥ 1) ఒక మిఠాయి తిని దాని మాధుర్యాన్ని గ్రోలడం ప్రత్యక్షం.
2) చాలానాళ్ళ తర్వాత మళ్ళీ దాన్ని చూడడంతోనే అదే ఇది అని నిర్ధారించుకోవడం అనుమానం.
3) ఇది రెండూ లేనప్పుడు శాస్త్రవచనం ప్రమాణం. దాన్నే గురువు బోధిస్తాడు.
ప్రత్యక్ష ప్రమాణం ‘నేను’. ప్రతిక్షణం మన వ్యవహారమంతా ఈ ‘‘నేను’’పై ఆధారపడి జరుగుతుంటుంది. దీని సంబంధమంతా ‘నాది’ గా నుంటుంది. వీటినే అహంకార, మమకారాలుగా పేర్కొన్నారు. ఈ ‘‘నేను’’ నిత్య జపం చేయని ప్రాణి ఉండదు సృష్టిలో. అందుకే ఈ ‘నేను’ పదము యొక్క అర్థాన్ని సరిగ్గా గ్రహించుట అవసరం. ఏ పదమైనా శబ్దరూపంగా కన్నా దాని అర్థమే ప్రశస్తి నొందును. శబ్దార్థములు అవిభాజ్యములు. అక్షర సంయోజనతో ఏర్పడిన శబ్దము. వాక్యములే సృష్టిలోనున్న వాఙ్మయమంతా. వాని అర్థమే విజ్ఞానంగా పరిణ మించింది. శబ్దార్థ విచారమే సమ్యగవగాహనను కల్గించగలది. దీనినే విమర్శ విశ్లేషణ చింతన వంటిమాటలతో తెల్పెదము. మిగిలిన పదమును అర్థము ద్వారా గ్రహించుటలో కొంత కృతకృత్యులమైనను ‘‘నేను’’ పదార్థమును గ్రహించలేకున్నాము. కాని ప్రతిక్షణం అది అనుభవంలో ఉంటుంది. ఉదా॥ రామ, శబ్దము రాముని గూర్చి తెల్పుతుంది. రాముడు పరమాత్మ, దశరథ తనయుడు, రావణాంతకుడు. సీతాజాని, వంటివన్నీ స్ఫురిస్తాయి. మరి ‘నేను’ పదం వల్ల స్ఫురించునదేమి? శరీర పరిమితి గల్గిన ఒక రూపమేగదా! శరీరము అని దేని నందుము. కాళ్ళా, చేతులా, కన్నులా, ముక్కునా, నడుమా, ఉదరమా, చెవులా, తలా, మొలా? ఇవన్నీ విడివిడిగా వేరు వేరు పదములతో పేర్లతో వ్యవహరింపబడుచున్నవి. ఇవేకాక అంతర్గతావయములున్నాయి. వీటిలో ఏది ‘‘నేను’’ అన్ని కలిసిన ఒక మూర్తిమత్వము ‘నేను’గా మన ప్రాథమిక భావన. స్థూలముగా భిన్నములైన వాటినన్నింటినీ కలిపి అభిన్నముగా (ఒకేదానిగా) చూస్తున్నామన్నమాట. కాని ఈ స్థూల శరీరము నందలి అవయములను నా కన్ను, నా ముక్కు, నా తల అని వ్యవహరించడంవల్ల అఖండానుభవం కల్గడంలేదా. అట్టే ఇంద్రియదశకం (జ్ఞానేంద్రియములు-5, కర్మేంద్రియములు-5) భిన్నములుగనే చెప్పబడుతున్నవి. ఇకపోతే పంచప్రాణములు ‘‘ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమాన’’ములనే పేరుతోనున్నవి. ఇవి భిన్న భిన్న ఆకృతి స్థాన కార్యక్రియానిష్ఠములు. ఇవినేనైతాయా? కావచ్చుగాని అది అనుభవమునకు రావడంలేదు.
ఇకపోతే బాల్య, కౌమార, యౌవన, వృద్ధ దశలు కూడా అనుభవంలో లేవు. కాలాకృతిచేష్టాదులచే పరస్పరభిన్నములు కదా! మనోబుద్ధి చిత్తాహంకారములనే అంతః కరణము నాలుగు వృత్తులుగా నుండి, భిన్నాకృతి స్థాన చేష్టాదులతో నుండును. ఇది కూడా అనుభవంలో లేనిదే. నా బుద్ధి, నా చిత్తము, నా మనస్సుగనే పిల్చుచున్నాము.
చివరకు ‘జ్ఞానము’ను నేను అనుకోవచ్చునా అంటే ఖండజ్ఞానమే గదా! ఇదీ ప్రతిక్షణం మారుతుంటుంది. అప్పుడు ఏ జ్ఞానాన్ని ‘నేను’గా చెప్పగలము. సృష్టి అంతా అజ్ఞాన జన్యమే అని తీర్మానించబడినది గదా! ఈ విధముగా స్థూలదేహమునుండి అజ్ఞానాంతం వరకు భిన్నమైన ఆకృతులతో, వ్యవహారంతో, ఖండములుగా, స్థితి కార్యాదులు కల్గిన జాగ్రత్ - స్వప్న, సుషుప్త్యవస్థలు ‘‘నేను’’ గాదు. తెలియడం వరకే కాని అనుభవమునకు రావడంలేదు.
మరొక విచారణ. ఒక వ్యక్తి పలికే ‘‘నేను’’ ఇతరులు పలికే ‘‘నేను’’ ఒకటేనా. అర్థభేదమేమైనా ఉన్నదా! దేవ తిర్యక్, మానవులంతా ఖండశః సర్వకాల సర్వావస్థలయందు ఈ నేను శబ్దాన్ని ప్రవృత్తి -నివృత్తి యందు వాడుతూనే ఉన్నారు. రత్నములను కలిపి పట్టుకొన్న దారమువలె ఇది అఖండముగా ఉన్నది కాని అనుభవమునకు రాదు.
ఈ విధంగా ఈ ‘‘నేను’’ తనలో ఇతరులలో అఖండమైనను భిన్న భిన్నములుగా దాని అర్థము తెలియుచున్నది అనుభవమే లేకపోవుట ఆశ్చర్యమే. దానిని గీత అఖండమని బోధిస్తున్నది.
‘‘సర్వ భూతస్థమాత్మానం, సర్వభూతాని చాత్మని
ఈక్షతే యోగయుక్తాత్మా, సర్వత్ర సమదర్శన’’ (శ్లో. 6-29)
సమాహిత మనస్కుడగు యోగి సర్వదా భేదించకుండా, అభేద వస్తు జ్ఞానముతో భిన్నాకృతి చేష్టా ప్రయోజనాదులచే కన్పించే సర్వభూతములందు ‘‘నేను’’ను దర్శిస్తున్నాడు. తనలో కూడా చూచుచున్నాడు.
దీన్ని బట్టి ‘‘అఖండం, సర్వవ్యాపి, సర్వాధారము’’ అని ‘ఆత్మ’ (నేను)ను గూర్చి గీతాబోధను అర్థం చేసుకోవచ్చు.
సర్వభూతేషు యేనైకం, భావమవ్యయవీక్షతే
అవిభక్తం విభర్తేషు తజ్ఞానం విద్ధి సాత్త్వికం’’ (శ్లో. 18-20)
ఆకారము, గుణం, చేష్ట, స్థితి వంటివానిచేత భిన్నంగా కన్పించే బ్రహ్మాది స్థావర పర్యంతం ఉన్న సమస్త పదార్థములలో ఏరకంగా తేడా లేకుండా సత్యమైన, ఏకమైన, నాశరహితమైన, అమాయకమైన వస్తువుగానేది ఉన్నదో దాన్ని తెలుసుకొనే సాత్త్విక జ్ఞానమే ‘‘నేను’’ అనెడి ఆత్మ. అంటే సర్వ వ్యాపకమైనదేదో అది అని పండితార్థం.
మరి ఈ ‘‘నేను’’ ఎవ్వరికీ అనుభవమునకు రావటం లేదు కదా. దానికి కారణమేమి? అని విచారించగా సర్వప్రాణులు ఇంద్రియజ్ఞానముతో ఇంద్రియ రూపసాధనలతో నిత్యం భోగిస్తున్నవి. ఈ అనుభవంలోనే ‘‘నేను’’ పదార్థమును గ్రహించవలెనను కోవడమే ఈ అనర్థమునకు కారణము. ఇంద్రియములు, మనస్సు, తమను గురించే తమను తెలుసుకోలేవు. మరి ‘‘నేను’’ను గురించి ఎలా తెలుసుకోగలవు?
శ్రుతి వాక్యానుసారంగా ‘‘నేను’’ -
‘‘అవాఙ్మానసగోచరం-తన్నామరూపవివర్జితం’’ నామరూపములు లేనిది. వాక్కుకు, మనస్సుకు గోచరింపనిది. కావున ఇంద్రియములతో గ్రహించాలను కొనుట మొదటి తప్పు. ఈ తప్పునే జీవితమంతా నిశ్చయించుకోవడం రెండవ తప్పు.
వీటినే అధ్యాస, భ్రాంతిగా శాస్త్రం బోధిస్తున్నది. ఈ భ్రాంతి 6 రకాలుగా ఉంటుంది (షద్భావ వికారం).
1) ఉన్నది, 2) పుట్టినది, 3) పెరుగుతున్నది, 4) మార్పు చెందుతున్నది, 5) క్షీణించుచున్నది,
6) నశించుచున్నది.
ఈ ఆరు మార్పులు దేహాదులందు కన్పిస్తున్నవి. ఈ భావములే ‘‘నేను’’గా పొరబడుతున్నాము. కావున ఈ 6 మార్పులు చెందు దేహాదులను ‘నేను’గా నిశ్చయించుకొని సంసార సాగర మగ్నుడు కావడమే జీవత్వము.
ఏకో వ్యాపీ సమశ్శుద్ధః నిర్గుణః ప్రత్యేకః పరః
జన్మవృద్ధాది రహితః - ఆత్మాసర్వగతో-వ్యయః (- విష్ణు పురాణం)
అని ‘‘ఆత్మ’’ను గురించి వివరించబడిరది. ఈ ‘‘నేను’’ పదార్థము
1) అనేక రూపములు కానిది.
2) భేదము లేనిది.
3) నిత్య శుద్ధమైనది.
4) గుణములు లేనిది.
5) మాయాతీతమైనది.
6) జన్మ మొదలు మరణము వరకుగల షడ్భావ వికారములు లేనిది.
7) బహిరంతర్యాపకమైనది అని తెల్పబడినది.
సోహం నగంతా నాగంతా నైకదేశ నికేతనః
త్వం చాన్యే చ నచ త్వంచ త్వం నాన్యే నాహ మప్యహం (- విష్ణుపురాణం)
భావం: ఆ ‘‘నేను’’ ఎక్కడికీ పోయేది కాదు. వచ్చేది కాదు. ఒక్కచోటే
ఉండేది కాదు. నీకు నాకు ఇతరులకు తేడాగా ఉండేది గాదు. దీనినెలా అర్థం చేసుకోవడం
లౌకిక భేదముతో, భ్రాంతితో తెలియబడే నీవు ఆ ‘‘నీవు’’ కాదు. నీకంటే వేరైనవిగా కనిపించునవేవీ నిజానికి వేరుగాదు. నేను కూడా నీకు కన్పించునట్టి వాడను కాను. చివరికి తేలునదేమనగా ‘‘నేను’’ ‘‘నేను’’ అనేది వ్యవహార విషయ పరమాత్మయే.
ఏక మేవ మిదం విద్ధి నభేది సకలం జగత్
వాసుదేవాభిధేయస్య స్వరూపం పరమాత్మనః
జడ చైతన్యాత్మకమగు జగత్తునంతటిని ఏకవస్తువైన వాసుదేవతత్త్వంగా తెలియవలెను. వాసుదేవుడు అంటే వసుదేవుని పుత్రుడు కృష్ణుడు కాదు. ఇది బహుళ ప్రచారంలో ఉన్నది. అందరూ పొరబడేది. దాశరథి వంటిదానిగా భ్రమింతురు. ‘‘వసతి, దీవ్యతి ఇతి వాసుదేవం అంటే నిత్యముగా ఉండి ప్రకాశించేది. అని అర్థం. అదే సత్తు చిత్తు. ఆ రెండిటి సమ్మేళన తత్త్వమే ఆనందం. ఇది దాని అసలు స్వరూపం. మనకు కనిపించే జగత్తు దాని విభూతి. అంటే వివర్తరూపం. పరిణామవాదం, సృష్టివాదములను అద్వైతం అంగీకరించదు పరమాత్మ జగత్తును సృష్టించినాడని, లేదా జగత్తుగా పరిణమించినాడనే మాటలు సత్యదూరములు. వీటిలో పరమాత్మ సాక్షిమాత్ర చైతన్య స్థితినుండి దిగజారి కర్తృత్వ భోక్తృత్వములను వహించవలసివచ్చును. కర్తృత్వ భోక్తృత్వములు జీవుని లక్షణాలు. అవి పరమాత్మకు వర్తించవు. కావున సృష్టి పరిణామ వాదములు ఖండిరచి, అద్వైతం వివర్తవాదాన్ని స్థాపించింది. వివర్తమనగా కనిపించడమే. మన దృష్టికి జగత్తుగా పంచ భూతాత్మకంగా సగుణంగా నామరూపాత్మకంగా కనిపిస్తుంది. అది పరమాత్మ ‘విభూతి’. అంతేగాని స్వరూపం కాదని దీని తాత్పర్యం. ఎందు జగద్రూపంగా కనిపిస్తుంది? అన్న దానికి జవాబుగా -
అవిద్యా మోహితాత్మనః పురుషా భిన్నదర్శినః
వదన్తి భేదం పశ్యన్తి చావయో రంతరం హర
అజ్ఞానం చేత భ్రాంతులై వ్యక్తులు భేద దృష్టితో మన ఉభయులనే భేదమును సత్యంగా దర్శిస్తున్నారు. చెప్తున్నారు.
‘‘న స్త్రీ, నషండో, న పుమాన్, నజంతుః’’
ఆత్మా-యం కేవలః స్వచ్ఛః శాంతః సూక్ష్మః సనాతనః
అస్తి సర్వాంతర స్సాక్షీ చిన్మాత్ర సుఖ విగ్రహః
‘‘ఆత్మ (నేను) స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, జంతువు కాదు. అది కేవలం, శుద్ధం, శాంతం, సనాతనం, సర్వాంతరం, సర్వసాక్షి, చిదానంద స్వరూపం. ఈ ‘‘నేను’’ శబ్దార్థమే భగవంతుడు ఈశ్వరుడు. స్వయం జ్యోతి స్వరూపుడు.
వ్యోమవత్ సర్వదా వ్యాప్తః - సర్వ సంబంధ వర్జితః
ఏకరూపో మహాదేవః స్థితః సోహం పరామృతః
ఆకాశము వలె వ్యాపించి దేనితో సంబంధం లేక సజాతీయ విజాతీయ భేదములేక, ఉన్న మహాదేవుడే ‘‘నేను’’ శబ్దార్థము. అదే పరామృత స్వరూపం.
నదేహో నేంద్రియ ప్రాణో నమనో బుద్ధ్యహంకృతిః
నచిత్తం నైవ మాయాచ నచవ్యోమాదికం జగత్
నకర్తా నైవ భోక్తా చ - నైవభోజయితా తథా
కేవలం సచ్చిదానంద - బ్రహ్మైవాత్మా యథార్థతః.
‘‘నేను’’ శబ్దార్థము:
1) దేహము కాదు, 2) ఇంద్రియములుకావు, 3) ప్రాణములు కావు, 4) మనస్సు కాదు, 5) చిత్తము కాదు, 6) బుద్ధికాదు, 7) అహంకారము కాదు, 8) మాయకాదు, 9) ఆకాశాది పంచభూతాత్మక జగత్తుకాదు, 10) కర్తకాదు, 11) భోక్తకాదు, 12) భుజింపచేయువాడు కాదు.
మరేమనిన కేవలం సచ్చిదానంద బ్రహ్మమే. అది యే సత్యమగు ఆత్మ (నేను).
‘జ్ఞానాదేవతు కైవల్యం’
నేను శబ్దార్థమగు ఆత్మ స్వరూప సాక్షాత్కారము చే కైవల్యాన్ని ప్రాణి పొందగలదు. అంటే ధన్యతను, విముక్తిని అన్నమాట. ‘నేను’ శబ్దార్థము తెలియకపోవుటయే అజ్ఞానము. ఇదే ఆత్మ హత్యా దోషము. అన్ని పాపములకు ప్రాయశ్చిత్తములను చెప్పిన శృతి ఆత్మహత్యకు అంటే అజ్ఞానమునకు చెప్పలేదు.
ఈశావాస్యోపనిషత్తులో -
‘‘అంధ తమః ప్రవిశంతి యేకేచాత్మషనో జనాః’’
ఈ ఆత్మ హత్యా దోషమునకు అంధతమోలోకములైన నరకమె శిక్ష. అందే అంధకారరూపమైన అజ్ఞానములో పడి అల్లాడిపోవడం. కాబట్టి ఆత్మజ్ఞానమే అన్ని జ్ఞానములకన్నా మొదట పొందవలసియున్నది అని ఉపనిషత్తులు బోధించుచున్నవి. ఇది లేని అనుష్ఠాములన్నీ వ్యర్థమే.
బృహదారణ్యకం దీనినే -
‘‘యో వాపి తదక్షర మవిదిత్వా-స్మిన్ లోకే
జుహుతి - యజతే, తపః తప్యతే బహూని వర్ష సహస్రాణి
అన్తవదేవాస్య తద్భవతి’’ అని శపించింది.
ఆత్మ విజ్ఞాన రహిత వైదిక విద్యలన్నీ వ్యర్థములే. అవన్నీ అవిద్యలే. ‘‘విద్యాంచ అవిద్యాంచ’’ అన్నచోట అవిద్యకు భాష్యకారు లిదే వివరించినారు.
‘యయా తదక్షర మధి గమ్యతే సా పరా’
యే విద్య నాశరహితమైన సత్యాన్ని తెల్పుతుందో అదే శ్రేష్ఠ విద్య. అనాత్మ బోధకములన్నీ అవిద్యలు. వేదాది బోధనలన్నీ ఇట్టివే. గీతలో కూడా
త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యోభవార్జున!
నిర్ద్వన్ద్వో, నిత్య సత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ (-2-45)
వేదములన్నీ అనాత్మరూప సంసారాన్ని బోధిస్తున్నాయి. అందుకే ఆ విద్యలు నీశోక మోహములను తొలగించకున్నాయి. ఓ అర్జునా! అందుకే ఆత్మ విద్యా పరుడవుకమ్ము. అని గీతాచార్యుడు ప్రబోధిస్తున్నాడు. ‘‘నేను’’ శబ్దార్థము పరబ్రహ్మమునే బోధిస్తున్నది.
‘ఓం తత్సత్’