వివిధ సందర్భాలలో ఎడనెడ తోచిన భావాలకు అక్షరరూపమే ఈ వ్యాస సంకలనం. కొన్ని స్వకీయాలు మరికొన్ని మా గురువుల రచనలకు స్వేచ్ఛాను వాదాలు. ఇంకొన్ని వారి స్తోత్రములకు నా వ్యాఖ్యలు. ఈ విధంగా రకరకాల మణులు, రత్నాలు గుదిగుచ్చిన అనర్ఘహారమిది. ఆత్మీయ కవి మిత్రుల కావ్యాలకు సంతరించిన అభిప్రాయాలు కొన్ని. ప్రాసంగికంగా చర్చించిన విషయాలకు విస్తృతరూపమొందినవి కొన్ని. గీత, ఉపనిషత్తుల వంటి ప్రకరణ గ్రంథాల సారంగా నా బుద్ధికి తోచిన అంశాలకు వివరణలు కొన్ని. నా సిద్ధాంత గ్రంథములోనుండి, ముద్రణకు నోచుకోని ప్రకరణములు కొన్ని. వెరశి 30 వ్యాసాలుగా ఈ గ్రంథము రూపుదిద్దుకున్నది. దాదాపు 10, 15 సంవత్సరాలుగా సాగిన వ్యాసంగానికిదొక పుస్తక రూపం. 10, 15 సం॥లుగా చేసినది ఇంతేనా అనిపించవచ్చు. కాని రాశికన్నా వాసికెక్కువ ప్రాధాన్యమిచ్చే స్వభావం నాది. ‘‘యత్సారభూతం తదుపాసి తవ్యమ్‌’’ అన్న శ్రుతి వాక్య ప్రమాణంగా చేసిన ప్రయత్నమిది. పండిత జనైక వేద్యమై, జిజ్ఞాసువులకు ‘‘సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ’’ అన్నట్లు అజ్ఞాన తిమిరంలో దారి చూపగల్గినదిగా పరిగణించబడగలదని నా విశ్వాసము. ‘‘ప్రమాణమంతః కరణ ప్రవృత్తి’’ కదా! మన ప్రతిభా సామర్థ్యములపైన మొదట మనకు విశ్వాసముండవలె. అప్పుడే దేన్నైనా ఘంటాపథంగా చెప్పగలము. ఈ మాటలు అహంకార ద్యోతకములుగా భావించబడవచ్చు. ‘‘ధిషణాహంకారం’’ కూడా శోభచేకూర్చునుగదా!

ఎన్ని మాటలు చెప్పినప్పటికీ చివరికి దైవ సంకల్పమే సర్వాధారము అన్న సత్యమును మరచిన వాడను గాను. ‘‘ధియోయోనః ప్రచోదయాత్‌’’ కదా! సర్వం బ్రహ్మ స్వరూపంగా భావించినప్పుడు ఈ ద్వంద్వాలకు అవకాశముండదు. ‘సదసచ్చాహమర్జున’ అన్న భగవద్వచనం సత్తు, అసత్తు నేనే అన్న అర్థాన్ని వివరిస్తుంది. ‘సర్వంఖల్విదం బ్రహ్మ’ అన్న మహావాక్య శ్రవణమనన నిధి ధ్యాసనలు ఆ భావాన్ని స్థిరపరుస్తాయి. ‘‘సదసద్రూపధారిణీ’’ అన్న లలితా సహస్రనామంలోని మాటలు గూడా దానినే నిరూపిస్తున్నాయి. బ్రహ్మకారవృత్తిని క్షణకాలం అనుభవించినా అది మహాఫలాన్నిస్తున్నది. ఆ ఫలమేమిటో కాదు అజ్ఞాన ధ్వంసమే.

స్వస్తి

__డా॥ పాణ్యం శ్రీనివాస. __