శ్రీలక్ష్మీనరసరామణీయకం
(పాణ్యం కవుల రచనలు)
పాణ్యంవారి ప్రచురణలు
కర్నూలు-518 002
2022
ఆముఖం
కులం పవిత్రం జననీ కృతార్థా
వసుంధరా తేన సార్ధవతీ బభూవ!
రసభావుకులకు, ఆర్షధర్మ ప్రియంభావుకులకు, పరతత్త్వసంభావుకులకు నమశ్శత పురస్సర హార్దికాహ్వానం. పుస్తక ప్రచురణ, ప్రకటనలలో లక్ష్మీనరస రామణీయకం(పాణ్యం కవుల రచనలు) నూత్న వైఖరి. కారణం వివరిస్తాం. ఒకే కవి లేదా రచయితకు సంబంధించిన వివిధ ప్రక్రియలన్నీ ప్రకటించడం తెలుసు. లేదా వివిధ కవులు, రచయితల ఒకే ప్రక్రియ (చిన్నకథ, ఖండకావ్యం, గేయం వంటివి) ప్రకటించడం చూశాం. ఒకే కవి, రచయిత యొక్క వివిధ ప్రక్రియలు పుస్తకరూపంలో చూసి, చదివి ఆనందించాం. కాని వివిధకవుల వివిధప్రక్రియలను అదీ ఒకే కుటుంబానికి చెందిన వారిని ఒకే పుస్తకంగా చూస్తున్నాము. వారి వారసులంగా మేమంతా ఈ ప్రచురణకు తగిన సంకల్పాన్ని ప్రచోదనంచేసిన ఆ పరాత్పరునకు అంజలి ఘటిస్తున్నాం. అంతకు మించి మరేమి చేయలేము కూడా. పాణ్యంకవులు ముగ్గురు. బ్రహ్మశ్రీ పాణ్యం లక్ష్మీనరసయ్య, వారి కుమారులు పాణ్యం నరసరామయ్య. లక్ష్మీనరసయ్యగారి అన్న (పాణ్యం సుబ్బరామయ్యగారి) కుమారుడు పాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి, వీరి ముగ్గురు వ్రాసిన వివిధ ప్రక్రియలకు చెందిన రచనలను ఈతరం వారికి అందించాలనే సత్సంకల్పంతో ఈ ప్రయత్నం చేసినాము. ప్రతి రచనకు ముందు పరిచయంగా లఘు వ్యాఖ్య సంతరింప జేసినాము. అది పఠితలను ఆయా రచనలు చదువుటకై కొంత ఉన్ముఖులను జేయునని నమ్ముతున్నాము. అక్షరదోష నివారణకు శాయశక్తులా యత్నించినాము. కాని సంపూర్ణంగా సఫలం కాలేదని అంగీకరించక తప్పలేదు. ఆయా రచనల గురించిన నాటి ప్రసిద్ధ కవిపండితుల అభిప్రాయాలను యథాతథంగా ప్రచురించడంవల్ల కొత్తగా అభిప్రాయములు లేవు. మేము కేవలం ఆయా రచనలను యథాతథంగా ప్రచురించినాము. వాటిలోని అభిప్రాయాలు, సిద్ధాంతాలు అన్నీ ఆయాకవులవే అని మనవి చేస్తున్నాము. పుస్తకం అందించడం మావంతు. దానిలో రసించి, రమించడం మీవంతు. మా ఈ యత్నాన్ని సఫలీకృతం చేస్తారని ఆశిస్తూ........
-పాణ్యం కవుల వారసులు
విహంగావలోకనం (రచనల పరిచయం)
తాత్త్వికం
విశ్వేశ్వర నక్షత్రమాల పాణ్యం లక్ష్మీ నరసయ్య
అశ్విని నుండి రేవతి వరకు 27 నక్షత్రాలు. జ్యోతిశ్శాస్త్రమంతా దీనిపైనే ఆధారపడి ఉంది. దీనినే తారావళి అని కూడా అంటారు. అంటే తరింపచేసేది. జపసంఖ్యలో 108, 54, 27, 10 ముఖ్యంగా చెప్పేవి. ఈ రచనలో 27 శార్దూల విక్రీడిత పద్యాలున్నాయి. మానవ జీవితానికి ఇదొక తాత్త్విక వ్యాఖ్యానము. పుట్టుక నుండి జరిగిన జీవితంలోని అన్ని దశలలో స్వార్థమే పరమార్థంగా మారి, జీవిత లక్ష్యాన్ని ఎలా విస్మరించామో కవి అత్మాశ్రయంగా వివరిస్తాడు. 1974 లో ప్రథమ ముద్రణ. 1-17
హంసతత్త్వప్రకాశిక పాణ్యం లక్ష్మీ నరసయ్య
ఇది 30 తేటగీతి పద్యాలలో నున్న చిన్న గ్రంథం. నిత్యమ్ మనం అసంకల్పితంగా చేస్తున్న శ్వాస ప్రక్రియకు తాత్త్విక వ్యాఖ్య. ఇక్కడ ప్రాణస్పందన మనకు తెలుస్తుంది. శ్వాసనే హంసలుగా పేర్కొంటారు. యోగశాస్త్రం, మాండూక్యోపనిషత్ వంటి వానిలోని మహత్తర అంశాలు సులభంగా వివరించినారు. 1974లో ప్రథమ ముద్రణ. 18-28
శ్రీ రామతత్త్వ రహస్యం పాణ్యం లక్ష్మీ నరసయ్య
ఆధ్యాత్మ రామాయణంలోని తాత్త్వికాంశాలను సరళ సుందరంగా సంఖ్యాశాస్త్ర పద్ధతిలో వివరించిన రచన ఇది. ‘‘వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా’’ - ‘‘వేదమే రామయణంగా వాల్మీకి చేత వ్రాయబడిరది’’ అన్న దానికి, ‘‘వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే’’ - ‘‘వేదము మాత్రమే తెలుసుకొన్న పరమపురుషుడే దాశరథిగా’’ అవతరించినాడు అన్నదానికి వివరణే ఈ రచన. 1963 లో ప్రథమ ముద్రణ. 29-56
ధార్మికం
ధర్మ జ్యోతి పాణ్యం లక్ష్మీ నరసయ్య
ఈ రచన నేటి కొన్ని సిద్ధాంతాలను ఖండిస్తుంది. ధర్మ మీమాంస, ధర్మతత్పరత, ధర్మాచరణమే ధ్యేయంగా, శృతిస్మృతిపురాణలనే ప్రగాఢంగా విశ్వసిస్తూ, అవే మానవులందరికీ తప్పక పాటించవలసినవని బోధించే గ్రంథం. కలి ప్రభావం వల్ల ఏర్పడిన నేటి పతనావస్థను నిరసిస్తూ, వేదోక్త సాంఘిక వ్యవస్థను బలంగా సమర్థిస్తూ సాగిన రచన. ఆర్ష ధర్మాన్ని గురించిన ప్రామాణిక గ్రంథం. 1952 ప్రథమ ముద్రణ. 57-184
సంధ్యావందన తత్త్వప్రదీపిక పాణ్యం లక్ష్మీ నరసయ్య
దీన్ని తాత్త్విక విభాగంలో చేర్చవచ్చు. కానీ రచయితే ధర్మజ్యోతికి రెండవ భాగంగా పేర్కొన్నారు. రాత్రి పగళ్ళను కలిపే కొన్ని నిమిషాల కాలం సంధ్య. ఇది చాలా ప్రభావవంతమైనది. ఈ సమయములో జరపాల్సిన దైవకార్యమే సంధ్యావందనం. ఇది ప్రతి ఒక్కరు వారివారికి శాస్త్రం విధించిన పద్ధతిలో తప్పక ఆచరించవలసినదే. దీనిలోని కర్మ, ఉపాసన, జ్ఞాన పద్ధతులను వివరిస్తుందిది. 1966 లో ప్రథమ ముద్రణ. 185-252
చారిత్రకం
వీరకంకణం పాణ్యం నరసరామయ్య
శ్రీ కృష్ణదేవరాయల కాలం నాటి ఇతివృత్తంతో ధర్మవీరం అంగిరసంగా కొనసాగిన చారిత్రకకావ్యం. దీనిలో కవి రచనావైదుష్యం, పాండితీప్రకర్షలు విజృంభించినాయి. రాయల సేనాపతి నాగమనాయకుడు. రాజాజ్ఞగా చోళుని జయించి, పాండ్యునికి రాజ్యం మళ్ళీ అప్పగించవలసింది పోయి, రాజధిక్కారం చేసి, తనకు తానే చోళ పాండ్యరాజ్యాలకు రాజుగా ప్రకటించుకున్నాడు. రాజు ఆగ్రహించి వానికుమారుడైన విశ్వనాథ నాయకుణ్ణి తన తండ్రినే ఓడిరచి బంధించి తెమ్మని ఆదేశిస్తాడు. తదనుగుణంగా విశ్వనాథనాయకుడు తండ్రిని బంధించి తెచ్చి రాయల కప్పగించడం ఇందలి కథ. ధర్మం గమ్యంగా విశ్వనాథ నాయకుని; దురాశాపరునిగా, రాజ ద్రోహిగా వాని తండ్రిని మలచినతీరు అద్భుతం. రస విజృంభణం హృద్యంగా పరిపోషించబడిరది. ప్రథమ ముద్రణ 1958. 253-302
స్వాతంత్య్రం వీరుడు పాణ్యం నరసరామయ్య
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఇది. అంతవరకు జానపదుల నోట పాటగా ఉన్న కథను పద్యకావ్యంగా తొలిసారిగా గ్రంథస్థం చేసినారు పాణ్యం నరసరామయ్య. అనుసరణలు, అనుకరణలు వెలువడినాయి క్రమంగా నవలా, నాటక రూపాలల్లో. ఇటీవల చలనచిత్రంగా కూడా వెలువడిరది. పాశ్చాత్య చరిత్రకారులనే ప్రమాణంగా గైకొని చరిత్రను వ్రాసినవారు చేసిన ద్రోహాలల్లో ముఖ్యమైనది చాలామంది స్వాతంత్య్రం పోరాట యోధులను మరుగున పర్చడం. వారిలో ఈ నరసింహారెడ్డి ప్రముఖుడు. దక్షిణాపథంలో ముఖ్యంగా ఆంధ్రప్రాంతంలో బ్రిటిష్‌వారి దురాగతాలనెదిర్చి, ప్రాణాలొడ్డి పోరాడిన పాళెగాడు. సిపాయిల తిరుగుబాటుకు (1857) 10 సంవత్సరాలు ముందే రాయలసీమ ప్రాంతంలో స్వాతంత్య్ర పోరాటానికి అంకురార్పణ చేసినాడు ఆ సాహసి. చారిత్రక వీరకావ్యంగా సంతరించిన పాణ్యం నరసరామయ్యది, కావ్య నాయకునిది ఒకే గ్రామం
ఉయ్యాలవాడ. 1976 ప్రథమ ముద్రణ.
కలికి తురాయి గీల్కొలుపు పట్టురుమాలు
గట్టిన యుత్తమాంగంబు తోడ
వైష్ణవ భక్తి భావము చాటు నూర్థ్వపుం
డ్రము నీటుగొలుపు ఫాలంబుతోడఁ
గ్రీవలఁ గెంజాయి రేకలింపారు నా
తతదీర్ఘ ధవళ నేత్రములతోడఁ
జిఱునిమ్మకాయల నిరువైపు నిల్పుకో
జాలినగుబురు మీసములతోడ
వైరిహంవీరవిదళన ప్రళయకాల
దండనిభ ఖడ్గ కలిత హస్తంబుతోడ
ప్రజకు భయభక్తి సంభ్రమభావములను
గొలుపు వర్చస్సుతోడ నబ్బలియుఁడలరు. 303-390
శతకం
కోదండరామ శతకం పాణ్యం లక్ష్మీ నరసయ్య
శతకం 100 కానీ, ఎక్కువ కానీ పద్యాలున్న కావ్యం. ఈ శతకంలో ఏ పద్యానికి ఆ పద్యమే. ఎక్కడైనా తరువాతి పద్యంతో సంబంధం ఉన్నా దానికి ప్రాధాన్యం లేదు. మానవ జీవితంలోని మంచి చెడ్డలను నీతుల రూపంలో వానికొక ఉదాహరణతో వివరించడం నీతి శతకాలలో చూస్తాం. దాశరథి, నారసింహ, కాళహస్తీశ్వర వంటి శతకాలలో భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు బోధించబడినాయి. కోదండరామ శతకంలో సమకాలీన సంఘంలోని పతనావస్థను కవి తన దృష్టితో విమర్శిస్తాడు. తన ఉపాస్యదైవమైన రామచంద్రుని ‘‘ధరణినుయ్యలవాడ కోదండరామ’’ అని సంబోధిస్తూ సీసపద్యాల్లో సాగిన రచన ఇది. ఆహ్లాదాన్నే కాక, ఆలోచనను కూడా రేకెత్తించేట్టు రచన సాగింది. 1938లో ప్రథమ ముద్రణ. 391-462
చాటుశతశ్లోకి పాణ్యం నరసరామయ్య
దీనిలో కొన్ని కవి స్వీయరచన. కొన్ని పూర్వకవి కృతం. అన్నీ 100 శ్లోకాలు. కానీ ఏవి స్వీయమో ఏవి పూర్వకవి కృతమో కవి విభజించలేదు. లోతైన లోకపరిశీలనంలో భాగంగా, మంచిచెడ్డలు, పాపపుణ్యాలు వంటి విషయాలను చమత్కారంగా చెప్పేదే చాటువు. ఈ లక్షణం దీనిలో పుష్కలంగా వుంది. సంస్కృతం తెలిసిన వారిని రంజింప చేస్తుంది. ఇదే ప్రథమ ముద్రణ. రచన, సేకరణ పాణ్యం నరసరామయ్య. 463-488
ఖండకావ్యం
ప్రభాత రేఖలు పాణ్యం సోదరులు
ఖండకావ్యాలు ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించే కాలంలో వెలువడిన రచన. అశ్వత్థామ, కాపుపడతి, ఎవ్వాడవోయి, ఆంధ్రోద్యమం వంటి విభిన్న అంశాలతో రసవత్తరంగా సాగిన రచన. సరస్వతీపుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు సంతరించిన కమనీయ పీఠిక ఈ కవుల రచనావైదుష్యాన్ని వెల్లడిస్తుంది. 1945 ప్రథమ ముద్రణ. 489-530
నాటకం
భీష్మ పరశురామ యుద్ధం (అంబకథ) పాణ్యం లక్ష్మీనరసింహ శాస్త్రి
మహాభారతంలోని కథను ఇతివృత్తంగా గైకొని సంవాద(సంభాషణ) రూపంలో సాగిన రసవత్తర రచన. నాటి ప్రఖ్యాత రంగస్థల నటుడు వెల్దుర్తి వెంకట నర్సునాయుడు కోరిక మేరకు తిరుపతి వెంకటకవుల ‘‘గయోపాఖ్యానం’’ ఛాయలో సాగింది. కవి, నటుడు ఒకే ఊరికి (వెల్దుర్తి, కర్నూలు జిల్లా) చెందిన వాళ్ళు కావడం, వారిరువురి మధ్య గురుశిష్య సంబంధం ఉండడం ఈ రచనకు ప్రేరణ. ఇదే ప్రథమ ముద్రణ. 531-558
శ్రీనివాసం శ్రీనికేతం శ్రీఘ్రసిద్ధిదమాశ్రయే।
స్వయంజ్యోతిస్సుధాసింధో సాధుసద్గురుశేఖరం॥
శ్రీ గురువులు శివసచ్చిదానంద సరస్వతీ స్వామి యోగవిద్యా ప్రచారం కోసం ఆత్మవిజ్ఞాన కళాశాలను COLLEGE OF SELF SCIENCE 1950వ సంవత్సరం నవంబర్ నెలలో స్థాపించినారు. దీని స్థాపనోద్దేశ్యం జిజ్ఞాసువులకు ఆత్మవిజ్ఞానము గురించిన స్పష్టమైన, సరళమైన అవగాహన కల్గించడం. దాని ద్వారా అభ్యాసయోగాన్ని సాధన చేయడం. ఫలితంగా సూక్ష్మ శరీరాన్ని VITALBODY స్పష్టంగా చూడగల్గడం. సాధన తీవ్రమయ్యే కొద్దీ క్రమంగా సూక్ష్మ శరీరంతో యెన్నో అను భవాలను పొందడం. దీనితో పొందే లాభమేమి? అని అడిగితే జవాబుగా ‘‘నేనుస్థూల శరీరం కాను. దాని కన్నా ప్రభావవంతమైన సూక్ష్మ శరీరాన్ని అనే నిశ్చయానుభూతిని పొందడం. దీనివల్ల భౌతికమైన దుఃఖాలు, బాధలు మొదలైన వాటినుండి ఉపశమనం పొంది, చేసే ప్రతిపనిలో ఏకాగ్రత పెరిగి నైపుణ్యం సాధించగలం. ఆత్మవిశ్వాసం పొందడం ద్వారా ఆందోళనలు, చికాకులు, భయాలు వంటివి చాలావరకు తగ్గుతాయి. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలం. ఇవన్నీ మన నిత్యజీవితములో పొందే ఉపయోగాలు. ఇవే కాకుండా ఇంకా సాధన చేసే వారికి దివ్యలోకసంచారశక్తి, దివ్యదర్శనాలు కల్గుతాయి. ఇవన్నీ నమ్మొచ్చా అనే సంశయం కల్గడం సహజం. చెప్పిన వెంటనే దేన్నీ నమ్మకూడదు. మనకు మనం దాన్ని పరీక్షించుకోవడం అవసరం. అది నిజమని మన అనుభవానికి వస్తే నమ్ముదాం. ‘‘సాధనాత్ సాధ్యతే’’ అన్నారు. కొంతకాలం చెప్పిన విధానం ప్రకారం అభ్యాసం చేసి చూస్తే నిజం నిగ్గుతేలుతుంది. శ్రద్ధ గల్గినవారికి వివరించే పద్ధతే ‘‘అధ్యాత్మ దర్శన అభ్యాస యోగం’’. అభ్యాసయోగం ఇది. యోగాభ్యాసం కాదు. ఇది ముందుగా గుర్తించవలసిన అంశం. భగవద్గీతలో, శాండిల్యం వంటి ఉపనిషత్తులలో, పతంజలి యోగసూత్రాలలో చెప్పిన యోగ విద్యావిధానాలు ఎలా ప్రారంభించాలనో క్రమంగా యే విద్య తరువాత యే విద్యను అభ్యాసం చేయాలనో, ఆ అభ్యాస విధానం యేదో, దాని ప్రభావ ఫలితములు యేవో వివరించే గ్రంథం రెండు భాగాలుగా పాణ్యం కవులలో ఒకరైన పాణ్యం లక్ష్మీనరసింహ శాస్త్రి గారు గురువుల సేవగా సులభశైలిలో వివరించినారు. గురువుల వద్ద చాలాకాలం శుశ్రూష చేసి వారీ విధానాలను అభ్యాసం చేసి స్వానుభవంతో వ్రాసిన గ్రంథం. ఈ గ్రంథం ఇంతకు ముందే ప్రచురించబడిరది. దీనిని ప్రస్తుత ప్రచురణలో జతపరచలేదు.
ఈ విద్యలను క్లుప్తంగా పరిచయం చేసుకుందాం:
__1. త్రాటకం:__ మొదటి విద్య అయిన త్రాటకంలో రెండవ స్థాయి పొందిన సాధకుడు తన నిత్య జీవితంలోని జప పూజా అనుష్ఠానాలలో, మరియు వ్యాపార విద్యా ఉద్యోగాది వ్యవహారాలలో మనస్సు స్థిరపడి ఆందోళన వ్యాకులత వత్తిడి వంటి వాటిపై అదుపు సాధిస్తాడు. స్థిరాసనంలో కూర్చొని సాధకుడు తన కంటి చూపునకు సమాంతరంగా యెదురుగా ఒక ఎర్రని చుక్కను గోడపైన పెట్టుకొని దానివైపే వీలైనంత సేపు చూస్తూ ఉండడమే ఈ త్రాటకం. ఆచుక్క కనిపించే వెలుగు మాత్రమే ఆ గదిలో ఉండాలి. రాత్రిపూట జీరోబల్బు వెలుతురు సరిపోతుంది. యెర్రని చుక్కను స్కెచ్ పెన్‌తో ఒకసారి తాకితే ఏర్పడే గుండ్రని ఆకార పరిమాణములో ఉండాలి. నీవు చేయవలసింది కేవలం చూస్తూ ఉండడమే. దానితో క్రమంగా మన మనస్సు దానివైపే నిలుస్తుంది. ‘‘దృగ్యుగ్మం లీయతే యత్ర మనస్తత్రైవ లీయతే’’ అనే పతంజలి యోగసూత్రం ఆధారంగా ఈసాధన జరుగుతుంది. నేరుగా మనస్సు పైనే, మనస్సు తోనే చేసే సాధన కళ్ళు తెరుచుకునే చూస్తూ చేయడమే దీని ప్రత్యేకత. ఈవిద్యలన్నీ ఇంతే! కళ్ళు తెరుచుకునే చేయడమే అభ్యాసయోగం. ప్రాణాయామమ్ వంటివన్నీ అలవాటున్న వారు చేసుకోవచ్చు. తప్పులేదు. ఈ విధానంలో వాటికి ప్రాధాన్యత లేదు. కళ్ళు మూసుకుని చేసే ధ్యానం కేవలం భావనే. ఇది పత్యక్షంగా కళ్ళు తెరిచి చూస్తూ అనుభూతి పొందడం. ఇది నిశ్చలమైనది. దృఢమైనది. దీని ప్రభావం మనపై చాలా ఉంటుంది. కొంతకాలం సాధన చేస్తే అర్థమైతుంది. ఇంతకూ త్రాటకం అభ్యస్తూ పొతే జరిగేది యేమి? గోడపైన ఉన్న ఎర్ర చుక్క క్రమంగా తెల్లని వెలుగు గా మారుతుంది. సూక్ష్మస్థితిలో అన్నీ తేజస్సుగనే కనిపిస్తాయి. సాధన చేసేకొద్దీ త్రాటకం రెండో దశలో జ్యోతిస్సు స్థిరంగా నిలుస్తుంది. ఇది మొట్టమొదటి తరగతి అభ్యాసయోగంలో..
2. దక్షిణామూర్తి విద్య: ఇది రెండవది. జ్యోతిస్సు స్థిరపడిన అభ్యాసి ముక్కు కొనపై (నాసాగ్రం) ఏకాగ్రం చేస్తే జ్యోతిస్సు దర్శనమైతుంది. ‘సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం’ అని భగవద్గీతలో చెప్పినట్లు రెండుకన్నుల దృష్టిని ఒకేచోట చేర్చడానికి అనువైనది నాసికాగ్రమే. ఈవిద్యా ఫలితంగా మనస్సు ప్రశాంతతను, శరీరం చల్లనిహాయైన అనుభూతిని పొందుతాయి. సాధనలో పరిణితి గురించి యోగశాస్త్రం ఒక విధానాన్ని నియమించింది. జ్యోతిస్సు చెదరకుండా రెండు గంటల సేపు నిలుస్తే అది ఒక ధారణ. ఇటువంటి ధారణలు 40 కి తగ్గకుండా 60 వరకు చేస్తే ఆ విద్యలో ఉత్తీర్ణుడైనట్లు లెక్క.
3. దత్తాత్రేయ విద్య: ముక్కుదిమ్మెపై ఏకాగ్రంచేస్తే మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దృష్టిని ఏకాగ్రం చేసే సమర్థత పొందుతాడు అభ్యాసి. ప్రశాంతత ఇంకా అధికమైతుంది.
4. మండల విద్య: మన స్థూలశరీరం చుట్టూ 12 అంగుళాల వ్యాసం వరకు తేజోశరీరం వ్యాపించి ఉంది. దీన్నే ఆరా (aబతీa) అంటాం. దీనిలోని పంచతన్మాత్రలను సాధకుడు దర్శించగలడు. అంతరిక్షంలో కావలసినచోట కావలసిదాన్ని చూడగలడు. (టెలిస్కోప్ ద్వారా శాస్త్రజ్ఞులు చేసే పని)
- నాసాగ్రం నుండి 4 అంగుళాలు దూరము. ఆకాశమండలం. నీలవర్ణం, ప్రశాంతత, భావవ్యాప్తి,
- 6 అంగుళాల దూరము. వాయుమండలం. ఊదారంగు, తీవ్రముగా శరీరము ఊగిన అనుభూతి.
- 8 అంగుళాల దూరం. అగ్ని మండలం. ఎర్రని రంగు, శరీరం వేడెక్కిన అనుభూతి.
- 10 అంగుళాల దూరం. జలమండలం. తెల్లని రంగు. చల్లని హాయైన వానలో తడిసిన అనుభూతి.
- 12 అంగుళాల దూరం. పృథ్వీ మండలం. పచ్చని రంగు. శరీరం దృఢమైన అనుభూతి.
5. భూచరీ విద్య: సాధకుడు నాసాగ్రమార్గం నుండి తనపాదం చివరి భాగం పైన ఏకారం చేస్తే ఒక జ్యోతిస్సు జ్వాలగా దర్శనమిస్తుంది. అది సాధకుని స్థూలశరీరాన్ని చుట్టి ఉండి పిశాచ రాక్షసాది దుష్టశక్తులనుండి కాపాడుతుంటుంది. ‘‘అభయా’’ అనే దైవీగుణాన్ని సాధకుడు పొందుతాడు ఈ విద్యతో.
6. స్థూలభూతవిద్య: పంచభూతాలు మనస్థూల శరీరానికి మూలకాలు. మొత్తం సృష్టికి కూడా. పాదాలనుండి మోకాళ్ల వరకు పృథ్వీభూతం. బీజం లం. దీర్ఘచతురస్రాకారం. పసుపురంగు. మోకాళ్ళనుండి నాభివరకు జలభూతం. వం బీజం. అర్ధ చంద్రాకారం. శ్వేతవర్ణం. నాభినుండి హృదయంవరకు అగ్ని(తేజో) భూతం. రం బీజం. త్రికోణాకారం. ఎరుపు రంగు. హృదయం నుండి భ్రూమధ్యం వరకు వాయుభూతం. యం బీజం. షట్కోణాకారం, ధూమ్ర వర్ణం. భ్రూమధ్యం నుండి బ్రహ్మరంధ్రం వరకు ఆకాశ భూతం. హం బీజం. వర్తులాకారం. స్వచ్ఛనీలవర్ణం, సాధకుడు ఆయా భూతలక్షణాలైన గంధాదులు అనుభూతి చెందుతాడు.
__7. మూర్ధ్ని జ్యోతిర్విద్య: __నడినెత్తిపైన 12 అంగుళాల కొలతతో ఒకజ్యోతిస్సు సాధకునికి కనిపిస్తుంది. శరీరంలోని వాయువులన్నీ పైకి ప్రసరించే అనుభూతి కల్గుతుంది. నాడీస్పందన ఆగిపోతుంది.
ఇదే విధంగా 8. సప్తధాతువిద్య, 9. మహాభూతవిద్య, 10. శ్రీచక్రదర్శన విద్య, 11. లోకవిద్య, 12. ఇంద్రియవిద్య, 13. ప్రాణవిద్య, 14. దహరవిద్యలను కూడా సాధకుడు అభ్యసిస్తూ వాటిలోపరిపూర్ణుడవుచూ చివరిదైన బృహజ్జ్యోతిర్విద్యను సాధించడంతో ఈ విద్యా ప్రణాళిక ముగుస్తుంది. దీని ఫలితంగా సాధకుడు ఉపాసనా జ్ఞాన మార్గాలలో సులభంగా ఉన్నత స్థితిని పొందగలడు.
15. బృహజ్జ్యోతిర్విద్య: స్థూలానికి మూలమైన సూక్ష్మతత్త్వాన్ని దర్శించే విద్య ఇది. అనేకంలో ఏకాన్ని, భేదంలో అభేదం దర్శిస్తాడు సాధకుడు. యోగదర్శన విద్యలు దీనితో ముగుస్తున్నాయి. సాధకుడు పరిపూర్ణుడై, తాను స్థూలదేహం కాదని, సూక్ష్మ దేహమనే నిశ్చయజ్ఞానం పొందుతాడు.
ఈ విద్యాపద్దతులు తెలుసుకోవాలనే వారు, ‘‘అధ్యాత్మ దర్శన అభ్యాసయోగం’’ గ్రంథం రెండు భాగాలను ఉచితంగా పొందాలనుకునేవారు మమ్ములను సంప్రదించ గలరు (8885321295) మరియు College of Self Science WhatsAppగ్రూపులో చేరవచ్చు. WhatsAppగ్రూపులో చేరడానికి ఈ లింకుని వాడండి https://bit.ly/s=inivasam.