శ్రీలక్ష్మీనరసరామణీయకం › శ్రీ విశ్వేశ్వర నక్షత్రమాల
శ్రీ విశ్వేశ్వర నక్షత్రమాల
శ్రీలక్ష్మీనరసరామణీయకం · భాగము 2 / 37
&
హంసతత్త్వ ప్రకాశిక
రచయిత:
పాణ్యం లక్ష్మీ నరసయ్య
ముద్రణ
పాణ్యంవారి ప్రచురణలు, కర్నూలు
2022
విశ్వేశ్వర నక్షత్రమాల
బ్రహ్మశ్రీ పాణ్యం లక్ష్మీనరసయ్యగారి ‘‘శ్రీ విశ్వేశ్వర నక్షత్రమాల’’ను గూర్చి సంక్షిప్త పరిచయం. నక్షత్ర సంఖ్య-27. 27 పద్యాలు విశ్వేశ్వరుణ్ణి సంభోధిస్తూ వ్రాసిన రచన ఇది. అందుకే నక్షత్రమాల. శతకం అంటే 100 లేదా ఎక్కువ పద్యాలున్న కావ్యం. ఇది వారి ఆత్మనివేదన. అంతర్ముఖీనమైన పారమార్థిక జిజ్ఞాసతో సాధనచేసేవారికి మార్గదర్శనం చేస్తుంది. వారి రచనలన్నింటిలో తాత్త్విక చింతన సరస్వతి నది వలె అంతర్వాహిని. ప్రతి మనిషిలో ఎప్పుడో ఒకసారి ఈ చింతన రాక మానదు. మానవజీవిత పరమార్థం గురించిన వ్యధ, వ్యాకులత తీవ్రమయ్యే కొద్దీ దానికోసం అన్వేషణ, ఆర్తి మొదలైతుంది. ఇదే జీవునివేదన. జీవాత్మ పరమాత్మను చేరేందుకు పొందే ప్రయత్నానికి సద్గురువు తోడ్పడతాడు. మార్గం చూపిస్తాడు. తీవ్రసాధన ద్వారా గమ్యం చేరవలసింది నీవే. ఇన్ని భావాలు, సాధనలో ఎదురయ్యే ఆటంకాలు, ఇంద్రియాది మనోవికారాల ప్రభావం, బాహ్యజగత్తులోని ఆకర్షణలు, వ్యామోహాలు వాటిని అధిగమించే సాధనామార్గాలు వంటివన్ని ఈ రచనలో ముప్పిరిగొన్నాయి. ఇది ఈ కవి స్వానుభవంగా చేసిన రచనయా అనిపిస్తుంది.
కర్మాసక్తియె కారణంబుఁ బ్రసూగర్భంబునన్ జేరిత
ద్దుర్మాలిన్యపురీష మూత్రముల యందున్ జిక్కి దుఃఖించుచున్
కూర్మాకారత నందునుండి కడు నాక్రోశించుచుంబుట్టి నీ
ధర్మంబించుక యేని నేరను శిశుత్వంబందు విశ్వేశ్వరా
లాలస్వేదపురీషమూత్రముల దుర్గంధంబునన్ మక్షికా
జాలంబెంతయు జుట్టుముట్టగ జననీ స్తన్యంబు నే గ్రోలుచున్
బాలవ్యాధులు మెండుగా దవిలినన్ బాల్యంపు జీకాకునన్
మేలుంగీడు నెరుంగలేనయితి జుమ్మీ దేవ విశ్వేశ్వరా
తారుణ్యంబున భోగలాలసుడనై దర్పంబునన్ గామినీ
స్మేరాలోకన మోహపాశముల గాసిన్ చెంది నే నిక్కుచున్
ధీరోదాత్తగుణుండ వీరుడను నేనేయంచు గర్వించుచున్
మార క్రీడల మున్గి నిన్ మఱచితిన్ మన్నింపు విశ్వేశ్వరా
వార్ధక్యంబు గ్రసించ నింద్రయ పటుత్వంబంతరించన్ మన
స్పర్థల్ చింతలనంత దుఃఖములబెంపన్ రోగముల్ ముంపనం
తర్ధీశక్తి నశింప పుత్రులొగి స్వాతంత్య్రంబు మాయింప వీ
తార్ధాయుష్కుడనై మనంబున నినున్ ధ్యానింప విశ్వేశ్వరా
దేహంబెల్లన్ జాఱె గేశవితతిన్ దెల్పంతటన్ మారె దు
ర్మోహంబెంతయు మీఱె ,సారెకు; రుజల్ మున్ముందు బైవాఱెకై
నాహా!దండముజేఱె దంతరహితాస్వమ్ బట్టె సేకూఱె నా
యూహల్ మారవు తీరదాశ జరయు నాయున్కిట్లె విశ్వేశ్వరా
ఈ రీతిగా పుట్టుక నుండి చావు దాకా వ్యర్థంగా జీవితం గడచి పోతుంది. దైవచింతనకు వీలివ్వకుండా ఆయా దశలలో వ్యామోహాలు, ఆకర్షణలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అహంకారంతో కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తున్నాం. ఆస్తికతలో కూడా వ్యాపారమే. కేవలం కోరికలు, ఆశలు తీర్చు కోవడానికే పూజలు, జపాలు, వ్రతాలు, యాగాలు అన్నట్లు చేస్తున్నాం. దాని పరమార్థం మర్చిపొతున్నాం. కర్మకాండ మూలసూత్రం ‘కర్మాణి చిత్త శుధ్యర్థం, ఐకాగ్య్రర్థం ఉపాసనా, జ్ఞానాదేవతు కైవల్యం’.
మనం చేసే దైవకార్యాలన్నీ చిత్తశుద్ది కోసమే ఉద్దేశింపబడినాయి. దాన్ని మనం పూర్తిగా మర్చిపోయాం. సంకల్పంలోనే మన కోర్కెల జాబితా ఏకరువు పెడ్తాం. అవి తీరుతాయో లేదో తెలియదు. తీరకుంటే బాధ. అందుకే నిష్కామకర్మను గీతాచార్యుడు కర్మయోగంగా నిర్దేశించినాడు. అసలు సిద్ధాంతం పూర్వజన్మకర్మ ఫలంగా నీకేది ఎంత రావాలని కేటాయించబడిరదో అంతే వస్తుంది. ఏమీ కోరకుండా చేసినా అది సిద్ధించడం తథ్యం. కోరకుండానే సిద్ధిస్తే సంతోషంగా ఉంటుంది. కోరినా తీరకుంటె బాధ. దేవుడు అన్యాయం చేసినాడు. నా మొర వినలేదు. ఇన్నాళ్ళు పూజించి వ్యర్థం. అసలు దేవుడే లేడు. ఇటువంటి అజ్ఞానపు మాటలు భావాలు తయారైతాయి. నిజమైన భక్తి స్వార్థరహితమే. సర్వాత్మనా భగవంతుని నమ్మి శ్రద్ధాభక్తులతో సేవించడమే కర్తవ్యం.
చుట్టాలన్నలుఁ దమ్ములున్ సుదతియున్ సూనుల్ సుహృత్కోటి నా
పట్టై యుందురటంచు నెంచియు వృథాభ్రాంతిన్ తదాసక్తి చే
గట్టా! పాపములాచరించితిని నా కష్టంబు లీడేర్ప నా
తట్టె వ్వారిక నుందు రంతకుండు నన్ దండిరప విశ్వేశ్వరా!
బంధువులు, సోదరులు, భార్య, సంతానం, స్నేహితులు, వీరంతా నాతోనే ఉంటారని తలచి, వ్యర్థంగా వారి కొసం ఎన్నో పాపాలను చేసాను కదా! అయ్యో వీటి ఫలితాలను నరకంలో యమదండనగా అనుభవించేటప్పుడు వీరెవ్వరూ నన్ను కాపాడేందుకు వెంట రారు కదా.
ఆయుష్యంబు నశించె నెంతయు వృథావ్యాపార లీలాదులన్
గాయంబస్థిర మింద్రజాలముగ దా గన్పట్టు సంసారమ
య్యో! యిట్లౌట నెఱుంగ లేక కలుషోద్యోగంబులే చేయుచున్
మాయా మోహ వశుండనైతి కరుణన్ మన్నింపు విశ్వేశ్వరా!
ఆయువు ముగుస్తూ ఉంది. దేనికీ పనికి రాని, దుర్మార్గమైన పనులే చేస్తూ జీవితమంతా మాయకు వశమై ప్రవర్తించినాను. ఇప్పుడు ఈ శరీరం నశించేదని తెలుస్తూ ఉంది. కానీ ఏం లాభం? అసలు ఈ జీవితమే ఒక గారడీగా ఉందే! నా తప్పులను క్షమించు స్వామీ!
అజ్ఞానంబునఁ జేయు పాపములు ప్రాయశ్చిత్త కార్యంబులన్
బ్రాజ్ఞుల్ దీరునటందురే నెఱుకతో బాపంబులన్ సల్పి నీ
యాజ్ఞోల్లంఘన మాచరించితిని బ్రాయశ్చిత్తముల్ లేవు స
ర్వజ్ఞా!నాకిక దిక్కు నీవ సుమీ నన్ రక్షింప విశేశ్వరా!
పాపాలు తెలియక చేస్తే దానికి పరిహారాలుంటాయని శాస్త్రం, పండితులు చెప్తున్నారు. కానీ నేను వాటికి విరుద్ధంగా తెలిసి తెలిసి పాపాలు చేసినాను. కాబట్టి వాటికి పరిహారాలేవీ ఉండవు కదా! ఘోరపాపినైన నన్ను నీవే కాపాడవలె శివా. నీవు అన్నీ తెలిసిన వాడవు కదా ప్రభూ!
దేవా! నీకృప సుంతయేని గొని శుద్ధిన్ బొందు పుణ్యుండు నీ
సేవా భాగ్యమునందగల్గిన మహాసిద్ధుండు సంసార పా
రావారంబు దరించుటెంతపని భారంబెల్ల నీపైనిడన్
కైవల్యం బఱచేత నుండుటొక లెక్కాపక్క విశ్వేశ్వరా!
శివా! నీదయ ఏకొంచెం పొందినవాడైనా చిత్తశుద్ధి పొంది పుణ్యాత్ముడైతాడు కదా! నిన్నుపాసించిన వాడు సిద్ధి పొంది ‘‘ఈ జగత్తు మాయ’’ అనెడి సాగరాన్ని సులభంగా దాటగలడు. కర్తృత్వ భోక్తృత్వాలను వదలి త్వమేవశరణం మమ అని సర్వాత్మనా భావాన్ని నిత్యం అనుసంధానించే వానికి ముక్తి కరతలామలకం కదా!
ఈ నాలుగు పద్యాలే కాకుండా అన్నీ ప్రతి మానవుని జీవితాన్ని, ఆర్తిని, చరమదశలోని పశ్చాత్తాపాన్ని ప్రతిబింబిస్తునాయి కదా. కొంచెం స్థిమితంగా ఆలోచిస్తే ఇదంతా మన నిత్యానుభవంగా అర్థం కావడం లేదా? వృద్ద్ధ్యాప్యం ఇహపర జీవిత సాగరాల మధ్య ఒక వారధి.
ఒక అర్థం కాని వెలితి, భయం, బాధ మనస్సును ఆవరించి జీవితంలో సాధించింది ఏమి? అనే ప్రశ్న తలెత్తుతుంది. తలెత్తకుంటె గమ్యం తెలియదు. కేవలం భౌతిక జీవితం, భార్య, పిల్లలు, వారి భాధ్యతలు, వారి పిల్లలు, ఒడిదుడుకులు లేని జీవితం, పుష్కలంగా ధనం, భోగాలు ఇవన్నీ నేనే సాధించినాను అనే అహంకారం. ఇదేనా బతుకు? ఇంకా ఏమైనా ఉందా? ఇట్లే చస్తే చాలా? అనే ఆలోచనే లేని, రానివాణ్ణి ‘‘శిశ్నోదరమాత్ర తృప్తజీవనుడు’’ అని శాస్త్రం పేర్కొంటుంది. అంటే కేవలం కామవాంఛ తీరడం, కడుపునిండా తిండి ఉంటే చాలని అనుకునేవాడు. మఱి నిజమైన జిజ్ఞాసువునకు వాని ప్రాప్తాన్ని బట్టి సద్గురువు లభిస్తే ధన్యుడవుతాడు. అందుకే మానవజన్మ, ముముక్షుత్వం, మహాపురుషుని ఆశ్రయం, ఈ మూడు ఒకే చోట సమకూరవు. అన్నారు. మానవజన్మ లభించడమే మహద్భాగ్యం. ఎప్పుడు? వాడు పురుషార్థాలలో చివరిదైన మోక్షం కావాలనుకున్నప్పుడు. అర్థకామాలను మాత్రమే కోరేవానికి, వాటికోసమే బతికే వానికి ఇది వర్తించదు. పరమపురుషార్థం కోరినంత మాత్రాన సరిపోదు కదా! దానికై ఏమి చేయాలనో బోధించే సద్గురువు లబించాలి. ఇదే మహాపురషసంశ్రయం అంటే. ఇవన్నీ కూడినా నీకు తీవ్రమైన తపన, కఠోర సాధన ఉన్నప్పుడే ధన్యత పొందగలవు.
ఈ భావాలన్నీ ఈ స్తోత్రంలో నిగూఢంగా ఉన్నాయి. ఇవన్నీ అనాదిగా ప్రవచింపబడుతున్న బోధలే. మనకు పరమ ప్రమాణమైన జగద్గురువులు శ్రీ ఆది శంకరులు వ్రాసిన భజగోవిందంలో వివరించినవే. అంతకు మించిన జ్ఞానబోధ మరేముంది? మచ్చుకు ఒకటి రెండు.....
యావద్విత్తోపార్జనసక్తః తావన్నిజపరివారోరక్తః
పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాంకో-పిన పృచ్చతి గేహే!
మా కురు ధనజనయవ్వనగర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం
మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా
స్వస్తి
అభిప్రాయములు
బ్ర.వే. శ్రీ పాణ్యం లక్ష్మీనరసయ్యగారు రచించిన శ్రీ విశ్వేశ్వర నక్షత్రమాలను పఠించి పరమానంద భరితాంతరంగుడనైతిని వారిదివరకే బహుగ్రంథములు రచించి ప్రసిద్ధికెక్కిన విద్వత్కవులు. మరియు వారి రచనలు ప్రాయికముగా తత్త్వవిచార వాసనాశోభితములై యుండుట యొక విశేషము. ప్రతిమానవునకును జరమవయస్సునం దాను గడపిన జీవితమును గూర్చియు వివిధములైన యాలోచనలు గలుగుచుండుట సహజము. జిజ్ఞాసువులైనవారి కట్టి యాలోచనలు మిక్కిలి కలప పెట్టకమానవు శ్రీ లక్ష్మీనరసయ్య గారు మానవుని పూర్వజీవితమును జగత్ప్రవృత్తిని ఈ పద్యములలో జక్కగా వర్ణించి తమ్మొకదరిం జేర్చుమని విశ్వేశ్వరుని భక్తి యుక్తులె ప్రార్థించియున్నారు. ఈ శార్దూల పద్యము లన్నియు భావ గంభీరములను, ధారాశుద్ధిశోభితములును, వైరాగ్యభావప్రేరకములును, నిర్దుష్టములునై యెల్లరు కంఠస్థము. నిత్యము పఠింపదగినట్లున్నవి.
__డాక్టర్ దివాకర్ల వెంకటావధాని, __
హైదరాబాద్, 1-11-72.
హంసతత్త్వ ప్రకాశిక యనునది ముప్పది గీతములలోనే యున్నను ముప్పది మూడుకోట్ల దేవతలకు నాధారమును వివరించునది యనవలయును. ప్రణవ స్వరూపము, తద్వివరణము హంససంచారము, తదాధారము, తతత్త్వమెరుంగుట వలన గలుగు ఫలము, హంస అను పదము, తదుత్పత్తి, దానగనబడు మహిమలు విస్తృతరీతిని దెలుపబడినవి. గురుముఖమున దెనియదగు నీవిషయముల నింతసులభముగ సరళమగు పదజాలముతో దెలుపబూనిన వీరిప్రజ్ఞ యసదృశము. విషయమును విశదీకరించుటలో శ్రీ లక్ష్మీసరసయ్యగారి పరమార్థ జ్ఞానము కొలతకు మీరినదని నుతించుచున్నాను. ఇది నుతియనుకొనకుడు నాభావమునందుగల్గిన యానందముచే నీ వాక్యములు నా కలము వ్రాయించినది. ‘‘హంసస్సోహం హంసః’’ అను తత్త్వవిమర్శనము నిందుగమనింపదగినది. అనుభవమున నవలంబింపదగినది. అనుష్ఠింపదగినది, మననము చేయదగినది.
ఇక విశ్వేశ్వర తారావళియమ స్తోత్రరూపక శార్దూల విక్రీడిత వృత్తము లిరువదియేడును వ్యత్యయముగా ఇరువది యేడునెంచిన డెబ్బది రెండగును. శ్రీరామ సైన్యమువలె డెబ్బది రెండు వెల్లువలవలె నసంఖ్యేయమగు దివ్యజ్ఞానమును దెల్పుచున్న రచన. ఇందు జన్మము మొదలు నింతదనుక మనుష్య జన్మమెత్తిన వ్యక్తి యనుభవించిన యనుభవము సంపూర్ణముగ వివరింపబడినది. గ్రంథకర్త తన యనుభవమును సైతమిందుదెల్పినట్లుగ లోక చరిత్రమును వర్ణించుటను వలె గోచరించును.
ఈ పద్యములన్నియు గేపలపఠనము మాత్రముచేగాదు. కంఠపాఠము చేసి యనుక్షణము మననము చేయదగినవని ముమ్మాటికిని నిరాఘాటముగ దెల్పుచున్నాడను.
__కడప విద్వాన్ కావ్యపురాణతీర్థ __
ప్లవమార్గశీర్ష శుక్ల ప్రతిపత్తు జనమంచి వేంకటసుబ్రహ్మణ్యశర్మ
పూజ్యులు బ్రహ్మశ్రీ పాణ్యము లక్ష్మీనరసయ్యగారికి నమస్కృతులు. తమ విశ్వేశ్వర నక్షత్ప్రమాల హంసతత్త్వ ప్రకాశిక నన్నానందమున ముంచి తేలిచినవి.
ఆ॥వె॥ తెస్సపండినది వయస్సుతోడి మనస్సు
ఒదవినది పిడికిట నూతకఱ్ఱ
పాకమునబడినది లోకానుభవముతో
కొసరి కొసరి మరులుగొలుపుకయిత,
సోహంహంస ప్రణవ
వ్యాహారోత్పత్తి నిర్ణయమ్ముల పూర్వ
మ్మోహో! మీయూహకు దా
సోహమ్మనవలయు విద్వద గ్రేసరులున్.
రచనాన్యపదేశముతో
నుచితము నపురూపమైన యుపదేశముతో
రుచిరార్థ నిర్వచనమున్
ప్రచురించితి వందనము భవత్కృషికి ఋషీ!
__జోస్యము జనార్దనశాస్త్రి __
తాడిపత్రి, 12-4-74.
బ్రహ్మశ్రీ పాణ్యం లక్ష్మీనరసయ్య గారి శ్రీ విశ్వేశ్వర నక్షత్రమాల ఆంధ్ర వ్మాయాకాశమండలమున వినూత్న శాంతితో విలసిల్లు నొకానొక దివ్యనక్షత్రమాల. ఆంధ్ర సరస్వతీ విహార విలసనముల వెలుగొంద జేయు జ్యోతిర్మాల. అంత స్సంశోధనాపరులకు, సాధనాపరులకు మార్గదర్శకమగు దీపకళికమాల, బహిరాకాశ మండల మందలి యా నక్షత్రమాల గడచిన కాలమును తెలుపు చున్నట్లుగనే యీ నక్షత్ర మాలయు అంతర్ముఖులైన ఆత్మవిచారపరులకు హృదయా కాశమున వెలుగొందుచు జీవితరంగమున గడచిన కాలమును తెల్పుచు ప్రబోధ మొనర్చుపట్టిది.
పురుషార్థ తత్పరులు, విచారపరులునగు వారికి పరిణత వయస్సున సహజముగకల్గు జిజ్ఞాస, అనుతాపము ఈశ్వరప్రతిపత్తితోడి శరణాగతిని యీరచన వ్యక్త పరచుచున్నది. నాడును నేడును రాబోవు నాడు కూడ వివేకశాలురు నడిచెడి నడిపించెడి మార్గమిది.
వీరి హంస తత్త్వప్రకాశిక నిరంతర హంసతత్త్వవిచార నిర్మంథ నావిర్భూతమగు నద్వైతామృత విన్యాసకల శమనదగినదై యొప్పు చున్నది. ఇట్లు వీరిరచనా వ్యాసంగము మహాకవి శ్రీ గడియారము వెంకటశేష శాస్త్రులవారు చెప్పియున్నట్లు పరహితమును ఆత్మనిర్వృతిని సాధించునదై యిహమును పరమును వెలయించి చరితార్థతను ప్రసాదించినది.
హృద్యానవద్య పద్యార్థాశివ నక్షత్రమాలికా
ముహుర్ము హుశ్చింత్య మానాదై వానుగ్రహకారిణీ
హంసార్థకుండలిన్యాది మహావాక్యార్థబోధినీ
సంశోధనీయాసతతం హంసత త్త్వప్రకాశికా॥
__విద్వాన్ గొల్లాపిన్ని రామచంద్రశాస్త్రి, __
తాడిపత్రి, 7-4-74.
పూజనీయులు బ్ర.వే. శ్రీపాణ్యం లక్ష్మీనరసయ్య గారి శ్రీవిశ్వేశ్వర నక్షత్రమాల మానవజీవిత సారము అన నొప్పుచున్నది. బాల్యం అమాయకంగా ఆటపాటలతో గడచి పోతుంది. కౌమారం అధ్యయనం తోను, తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్ళు అన్న భ్రమతోనుసాగిపోతుంది. యవ్వనం అరిషడ్వర్గాలకు ఆలవాలమై ఉఱ్ఱూతలూపగా, కామకాంచన లోలత్వంలో మునిగితేలుతూ ఆనంద విషాద అశ్రువులు రాల్పుతూ లోకానుభవం చేకూర్చుకొంటూ సత్య ఛాయలు సుదూరంలో తళుక్కుమని మెరుస్తుండగా జీవితం ముందుకు ప్రాకి వార్ధక్యంలో ప్రవేశిస్తుంది. మానసికంగా కొంతవరకు ఎదిగిన కాలం అది. కాని అందరూ ఎదగరు. ఎదగ లేరు కూడ ఆ ఎదుగుటయు జన్మసంస్కార ఫలమే. అందుకే జర్మన్ తత్త్వవేత్త గటే (Gothe)అంటారు “All men would live long, but no man would g=ow old” (మనుషులు వయోవృద్ధులవుతారే కాని జ్ఞానవృద్ధులు మాత్రం కాలేరు) అని అది మనస్వానుభవసత్యమేకదా!
కాని ప్రాక్తనజన్మసంస్కార ఫలితంగాను, యీ జన్మ లోని అనుభవజ్ఞానంవల్లను, మానసికంగా ఎదిగిన వారికి వృద్ధాప్యంలో పశ్చాత్తాపం తప్పదు. వార్ధక్యం ఇహపరజీవిత సాగరాలమధ్య ఒక వారధి. గతజీవితాన్ని గూర్చిన పశ్చాత్తాపం భావిజీవితాన్ని గూర్చిన విచారం మనస్సునుకలవర పరుస్తాయి.
ఈవిశ్వేశ్వర నక్షత్రమాల చదువుతుంటే రసజ్ఞులకు హృదయం ద్రవించి కన్నులు చెమ్మగిలక తప్పవు. చదివిన తర్వాతకూడ మన జీవితాన్ని గూర్చిన అర్థంకాని వెలితి, భయం, బాధ మనస్సు నావరిస్తాయి. జీవితం అంటే యేమిటో సూటిగా హృదయానికి గోచరిస్తుంది. తమజీవితానుభవం అన్న సాకుతో మొత్తం మానవ జీవితానుభవసారాన్నే మన కన్నుల యెదుట ధన్యులు. సాక్షాత్కరింప జేసిన యీ కవివరేణ్యులు వీరి ఆశయం నెరవేర్చవలెనని భగవానుని మన సార ప్రార్థింతును.
విద్వాన్ బి. నరసింహయ్య, B. A., B. Ed.,
బుక్కరాయసముద్రం, 6-2-74.
విజ్ఞప్తి
భగవన్ని వేదితములై యున్న నాకృతులలో శ్రీ విశ్వేశ్వర నక్షత్రమాల, హంసతత్త్వ ప్రకాశిక అను నీ రెండు కృతులును ఇంతవరకు బహిర్గతములు కాలేక నిలిచిపోయినవి. ఈ రెండును ఆకృతులయందు చాలచిన్నవియే అయియున్నను వీనియందు సారస్వత సౌందర్యములు అంతగా పొడగట్టక పోయినను, వీనియందు అదేలనో నాకు మక్కువ ఎక్కువగా నిల్చియున్నది. వీటిని బహిర్గతములు చేయవలెనని కోరు చుంటిని. పరమేశ్వరకృపతో నేటికి నా ఆశయము నెరవేరినది.
ఈగ్రంథమును చదివి ఆదరముతో తమ అమూల్యాభి ప్రాయముల నొసంగిన పండితవరేణ్యులకు నాశతసహస్ర నమోవాకములు.
పాణ్యం లక్ష్మీ నరసయ్య
శ్రీ విశ్వేశ్వర నక్షత్రమాల
శా॥ శ్రీమద్భాను సహస్రధామ విలసచ్ఛృంగార గంగా జటా
స్తోమా, భద్ర గుణాభిరామ నిగమస్తోత్రాళి సమ్మోద హృ
త్సీమా పావననామ భక్తహృదయక్షేత్ర స్థిరావాస కృ
త్కామా నామదిఁ బాయకుండ నినునేఁ గాంక్షింతు విశ్వేశ్వరా!
శా॥ లీలాకల్పిత లోకజాల విబుధాళి ప్రార్పితానంద హృ
ల్లోలా భక్త జనానుకూల వినమల్లోకేశ్వరాదిత్య ది
క్పాలా భవ్యగుణాలవాల ధృతభాస్వద్రమణ శీతాద్రి స
ద్బాలా పావనశీల నన్ను కరుణన్ బాలింపు విశ్వేశ్వరా.
శా॥ కర్మాసక్తియె కారణంబుగఁ బ్రసూగర్భంబున్ జేరి త
ద్దుర్మాలిన్య పురీష మూత్రముల యందున్ జిక్కి దుఃఖించుచున్
కూర్మా కారతనందునుండి కడు నా క్రోశించుచున్ బుట్టి నీ
ధర్మం బించుక యేని నేరను శిశుత్వంబందు విశ్వేశ్వరా.
శా॥ లాలా స్వేద పురీష మూత్రముల దుర్గంధంబునన్ మక్షికా
జాలంబెంతయు జుట్టుమూఁగ జననీస్తన్యంబు నేగ్రోలుచున్
బాల వ్యాధులు మెండుగాఁ దవిలినన్ బాల్యంపు చీకాకునన్
మేలుం గీడునెఱుంగ లేనయితిఁ జుమ్మీ దేవ విశ్వేశ్వరా.
శా॥ తారుణ్యంబున భోగలాలసుడనై దర్పంబునన్ గామినీ
స్మేరాలోకన మోహపాశముల గాసిన్ జెంది నేనిక్కుచున్
ధీరోదాత్తగుణుండ వీరుఁడను నేనేయంచు గర్వించుచున్
మారక్రీడల మున్గి నిన్‌మఱచితిన్ మన్నింపు విశ్వేశ్వరా.
శా॥ వార్ధక్యంబుగ్రసింప నింద్రియ పటుత్వంబంతరింపన్ మన
స్పర్థల్ చింతలనంత దుఃఖములఁబెంపన్ రోగముల్ ముంపనం
తర్ధీశక్తి నశింప పుత్రులొగి స్వాతంత్య్రంబు మా యింప వీ
తార్ధాయుష్కుఁ డనై మనంబున నినున్ ధ్యానింప విశ్వేశ్వరా.
శా॥ దేహంబెల్లను జాఱె గేశవితతిన్ దెల్పంతటన్ మాఱె దు
ర్మోహంబెంతయుమీఱె, సారెకు; రుజల్ మున్ముందుఁబై వాఱెకై
నాహా! దండము జేరె, దంతరహితాస్వంబట్టే సేకూఱె నా
యూహల్ మాఱవు తీఱదాశ జరనాయున్కి ట్లె విశ్వేశ్వరా.
శా॥ నీమేలుంగనలేక నీవొసఁగు పానీయాన్న భోగంబులే
యామోదంబుగ మత్సతీసుతులతో నశ్రాంతమున్ జొక్కుచున్
నీమంత్రంబుల నీజపంబుల భవన్నిర్ధిష్ట కార్యంబులన్
స్వామీ సుంతయుఁ జేయనైతి కరుణన్ సైరింపు విశ్వేశ్వరా.
శా॥ భావావేశము నాపఁజాలక మహాపాపంబు లెన్నేనియున్
దేవా! చేసితి వానినెల్లఁ దలపన్ దేహంబు కంపించు నా
కీవే దిక్కిఁక నీట ముంచినను స్వామి పాలలో ముంచినన్
నీ వాత్సల్యము లేక నిల్వగలనా నేనింక విశ్వేశ్వరా.
శా॥ సర్వారిష్ట విషాద హేతుకము సంసారం బటంచెంచకే
గర్వోన్మత్తుఁడనై సతీసుత ధనాగారాదులన్ బొత్తినూల్
వుర్వన్ బోలియు ముందుజేటెఱుఁగకే పూర్ణానుర క్తుండనై
శర్వా! నేను బరిభ్రమించితి ననున్ సైరింపు విశ్వేశ్వరా.
శా॥ భార్యాపుత్ర కుటుంబ మోహమున నేబంధంబునన్ జిక్కి స
త్కార్యాకార్య వివేక వర్ణితుఁడ నై గావించితిన్ బాపముల్
సౌర్యుద్ధండ ప్రచండ దండనలకున్ స్వాంతంబు భీతిల్లె నో
యార్యావల్లభ! యెట్లు ప్రోచెదవో నిన్నర్థింతు విశ్వేశ్వరా.
శా॥ కన్నుల్ నాలుక మేనుముక్కు చెవులున్ కామోపభోగంబు లె
న్నెన్నో గోరుచు నేమొసంగిన క్షణంబింతైన శాంతింపకన్
నన్నున్ గాల్పఁదొడంగె నగ్నివలె సంతాపంబు హెచ్చయ్యె నా
పన్నున్ బ్రోవఁగ నీకృపారసము పర్వన్ జేయు విశ్వేశ్వరా.
శా॥ స్నానంబే నొనరింపనైతి నెపుడున్ గంగా ప్రవాహంబునన్
దానంబే నొనరింపనైతిని భవత్సంప్రీతిగా సుంతయున్
ధ్యానంచే నొనరింపనైతి నిను లోకారాధ్యు నేకాగ్రతన్
నే నిన్నెప్పుడు గొల్వనైతిఁ జెడితిన్ నిక్కంబు విశ్వేశ్వరా.
శా॥ అన్యాయంబు లొనర్చితిన్ బరులకే నశ్రాంత మెన్నేని సౌ
జన్యంబున్ విడనాడి కల్లలను లక్షల్ పల్కితిన్ దెంపుమై
నన్యస్త్రీధనముల్ హరింప మదిలో నాసించితిన్ దేవ మూ
ర్ధన్యా! పాపుఁడ దుష్టుడన్ ఖలుఁడ నన్ రక్షింపు విశ్వేశ్వరా.
శా॥ చిత్తంబెప్పుడు ద్రవ్యకాంక్షఁ బరులన్ సేవింప నెంతేని ప
ర్వెత్తున్ నిత్యము పూర్వకర్మమునఁబ్రాప్తించున్ నిజంబెంచగా
విత్తోన్మాదము మాన్పి చిత్తమును సద్విజ్ఞాన శాంతి క్షమా
యత్తం బౌనటు చేసి కూర్పుమిఁక నిత్యస్థాయి విశ్వేశ్వరా.
శా॥ నీమంత్రంబుల నీ జపంబుల భవన్నిర్దిష్ట కార్యంబులన్
నీ మాహాత్మ్య కథాప్రసంగముల నీనిర్మాల్య సంసేవనల్
నీ మూర్త్యర్చల నీ ప్రదక్షిణముల్ నీధ్యానయోగంబులన్
స్వామీ! సుంతయు సల్పనైతిఁ జెడితిన్ సైరింపు విశ్వేశ్వరా
శా॥ చుట్టాలన్నలుఁదమ్ములు సుదతియున్ సూనుల్ సుహృత్కోటినా
పట్టైయుందురటంచు నెంచియు వృధాభ్రాంతిన్ తదాసక్తి చే
గట్టా! పాపములాచరించితిని నాకష్టంబు లీడేర్ప నా
తట్టెవ్వారిఁక నుందురంతకుఁడు నన్ దండిరప విశ్వేశ్వరా.
శా॥ మున్నీ దేహముచే రతిక్రియల సమ్మోదంబులన్ బొంది యె
న్నెన్నోరీతుల గంధ పుష్పములచే నింపారఁ బూజించుచున్
జెన్నారంగఁ బెనంగు కాంతయె దృటిన్ జీవంబు మేన్ వీడఁగాఁ
గన్నుల్ విచ్చియుఁజూఁడజేర మదిలోఁ గంపించు విశ్వేశ్వరా.
శా॥ లేవా వృక్షతతుల్ ధరిత్రి మనుజుల్ జీవింప నాహారముల్
గావా కాయలు పండ్లు నాకులలముల్ స్వాద్వాపగా తోయముల్
దేవా జేనెడు పొట్టకై పరులకెంతేహాని గావించి నీ
సేవా ధ్యానములందు నిల్పనయితిన్ జిత్తంబు విశ్వేశ్వరా.
శా॥ ఆయుష్యంబు నశించె నెంతయు వృధా వ్యాపార లీలాదులన్
గాయంబస్థిర మింద్రజాలముగఁ దా గన్పట్టు సంసార మ
య్యో! యిట్లౌట నెఱుంగలేక కలుషోద్యోగంబులే చేయుచున్
మాయా మోహవశుండనైతి కరుణన్ మన్నింపు విశ్వేశ్వరా.
శా॥ అజ్ఞానంబునఁ జేయు పాపములు ప్రాయశ్చిత్త కార్యంబులన్
బ్రాజ్ఞుల్ దీఱునటందురే నెఱుకతో భావంబులన్ సల్పి నీ
యా జ్ఞోల్లంఘన మాచరించితిని బ్రాయశ్చిత్తము ల్లేవు స
ర్వజ్ఞా! నాకిఁక దిక్కు నీవసుమి నన్ రక్షింప విశ్వేశ్వరా.
శా॥ లేదా నీహృదయాంతరంబున దయాలేశంబు నేభక్తుడన్
గాదా యేరికినై న జాలిగలుగంగాఁ జేయు నాప్రార్థనల్
చేదా నీకు వినంగ శంకర దయాసింధుండవన్ బేరిఁక
బోదా నన్నిటు సేయ నింక నయినన్ బోషింపు విశ్వేశ్వరా.
శా॥ సంపాదించెడు వేళ నందఱు ధనాశన్ జేరిసేవింతురే
పంపైనన్ దలదాల్చి సేయుదురు తెల్పన్ భార్యయు బుత్రులున్
సంపాదింపఁగలేని ముప్పునను మంచంబందు వాపోవ నా
లింపన్ రారొకరైన నెవ్వరికిలన్ లేరైరి విశ్వేశ్వరా.
శా॥ దేవా! నీకృప సుంతయేని గొని శుద్ధిన్ బొందు పుణ్యుండు నీ
సేవా భాగ్యమునందగల్గిన మహాసిద్ధుండు సంసార పా
రావారంబు దరించు టెంతపని భారంబెల్ల నీపై నిడన్
గై వల్యం బఱచేతనుండు టొకలెక్కాపక్క, విశ్వేశ్వరా.
శా॥ కాలంబెంతయొ మీఱె చేఱె జర; యింకన్ మీనమేషంబులన్
నే లెక్కించుచు నున్న నంతకుఁడు నన్ వెంటాడకన్ వీడునే
నాలోలత్వ మడంగ కున్న మదిలోనన్ దెల్వి లేకున్నచో
ఏలీలన్ గడతేరువాడ విక స్వామీ దేవ విశ్వేశ్వరా.
శా॥ మున్ గోదండ పదోక్తరామ శతకంబున్ గూర్చితిన్ దానిఁజూ
డన్ గాల వ్యధలందు వర్ణితములౌటన్ జేసి సంపూర్ణ భ
క్తిన్ గీర్తింపఁ దలంపు పుట్టె మది నిన్ గేల్మోడ్చి సేవింతు బే
ర్మిన్ గైవల్య పదంబొసంగి నను గూర్మిన్ బ్రోవు విశ్వేశ్వరా.
శా॥ శ్రీలన్ మించియు భక్తి సౌరభముచేఁ జెన్నొందియున్ నవ్యశా
ర్దూలక్రీడిత పద్యపుష్పములచేఁ దోరంబుగా నొప్పుచున్
సాలంకార సువర్ణ శోభితమునై యామోదమౌ తారకా
మాలన్ గైకొని కూర్మిమోక్షమిడినన్ మన్నింపు విశ్వేశ్వరా.
శ్రీ పరమేశ్వరార్పణమస్తు.
హంసస్సోహం
ఇది 30 తేటగీతి పద్యాలుగా కూర్చిబడిరది. పరిమాణమున చాలా చిన్నదే. కాని ఇందలి విషయం చాలా గంభీరమైనది, లోతైనది. ఆనాటి ఉద్దండపండితులు దీని గురించి ఎంతో ప్రశంసించినారు. దివాకర్ల వెంకటావధాని, జోస్యం జనార్దన శాస్త్రి, జనమంచి వెంకటసుబ్రమణ్య శర్మ, గొల్లాపిన్ని రామచంద్ర శాస్త్రి, బి.నరసింహయ్య వంటి వారున్నారు. వారి ఉటంకింపులు కొన్ని...... all men would live long, but no man would g=ow oldgothe (మనుషులు వయోవృద్ధులైతారేగాని జ్ఞానవృద్ధులు మాత్రం కాలేరు) దీన్ని బి. నరసింహయ్య గారు పేర్కొంటూ ఆధ్యాత్మికోన్నతి చివరి దశలో కూడా మానవులు పొందలేరు. దానికి తగ్గ జిజ్ఞాస, శ్రద్ధ, శాస్త్ర గురువాక్య ప్రమాణ బుద్ధి, చింతన, అభ్యాసం వంటివన్నీ సమకూరినప్పుడే అది సాధ్యం. మన మొదటి శత్రువు ‘‘ఇవన్నీ నాకు తెల్సినవే కదా’’ ‘‘వాళ్ళు, వీళ్ళు చెప్పేది వినడమేమిటి’’ అన్న స్థిరభావనే. అందుకే తులసీదాస్ ‘‘శ్రోతవ్యం అనసూయయా’’ అసూయ పడకుండా వినండి అని పేర్కొన్నడు. అసలు ఎదుటివాడు; వాడు ఎంతటి వాడైనా సరే చెప్తున్నప్పుడు పూర్తిగా వినం. లేదా మన వాదనను వినిపిస్తూ అడ్డుతగుల్తాం. వాని మాటల్లో తప్పులు బట్టడం, ఖండిరచడం మన ధ్యేయంగా మిగులుతుంది. ఇదే మన అభివృద్ధిని అడ్డుకునేది. పతంజలి మహర్షి అష్టాంగ యోగంలో చివరిగా శ్రవణం, మననం, నిధిధ్యాసలను చెప్పినాడు. దానిలోని శ్రవణం అంటే శ్రద్ధాసక్తులతో వినడం. దీన్నే భగవద్గీత ‘‘పరిప్రశ్నేన, సేవయా’’ అనింది. సుమతి శతకంలో కూడా ‘‘వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరింప దగున్’’ అన్నారు.
‘‘హంసార్థ కుండలిన్యాది మహావాక్యార్థ బోధినీ
సంశోధనీయా సతతం హంసతత్త్వ ప్రకాశికా’’ అని గొల్లాపిన్ని రామచంద్రశాస్త్రి పేర్కొన్నారు.
‘‘సోహంహంస ప్రణవ, వ్యాహారోత్పత్తి నిర్ణయమ్ములపూర్వ
మ్మహో!మీ యూహకు దాసోహమ్మనవలయు విద్వదగ్రేసరులున్’’
‘‘రచనావ్యపదేశముతో నుచితము నపురూపమైన యుపదేశము తో,
రుచిరార్థ నిర్వచనమున్ ప్రచురించితి వందనమ్ము భవత్కృషికి ఋషీ’’ అని శ్లాఘించారు జోస్యం జనార్దన శాస్త్రి.
‘‘ప్రణవస్వరూపము, తద్వివరణము, హంససంచారము, తదాధారము, తత్వమెరుంగుటవలన కలుగు ఫలము, హంస: అను పదము, తదుత్పత్తి, దానగనబడు మహిమలు విస్తృతరీతిని దెలుపబడినవి’’ అన్నారు జనమంచి వారు. దివాకర్ల ‘‘పాణ్యం లక్ష్మినరసయ్య గారి రచనలు ప్రాయికముగా తత్త్వవిచార వాసనాశోభితములై యుండుట ఒక విశేషము’’ అని పేర్కొన్నారు. ఈ విధంగా సన్నుతికెక్కిన రచనను గురించి తెలుసుకుందాం!
ప్రాణికోటికి హృదయాంతరాళ సీమ
నప్రయత్నంబుగా సాగు హంసగతులు
అనుదినము నిర్వదొకవేయి యారునూర్లు
హంసగాయత్రిగా బుధులండ్రు దాని
హంస గాయత్రి గణపతి కాఱు నూర్లు
నాఱువేలాఱువేలజ హరి హరులకు
ఆత్మపరమాత్మ గురువులకనుదినంబు
విధిగ జరుగును నొక్కొక్క వేయి జపము.
అని ప్రారంభమౌతుంది ఈ రచన. శ్వాస ప్రక్రియ ప్రతి ప్రాణిలో అసంకల్పితంగా జరుగుతూ ఉంటుంది. ‘‘నేను గాలి పీలుస్తున్నాను, నేను గాలి విడుస్తున్నాను’’ అని ఎవరూ ప్రతి క్షణం అనుకోరు కదా! రోజుకు 21,600 సార్లుగా ఇది లెక్కింపబడిరది. మూలాధార చక్రాధిదేవత గణపతికి 600, త్రిమూర్తులకు ఒక్కొక్కరికి 6000 3 =18000 ఆత్మ, పరమాత్మ, గురువులకు ఒక్కొక్కరికి 1000 3 = 3000 మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. దీన్నే అజపాగాయత్రి, హంసగాయత్రి అంటూ పిలుస్తారు. మహన్యాసం ‘‘హంసోనామ సదాశివః’’ అంటూ వర్ణించింది. సదాశివ తత్త్వం శుద్ధ జ్ఞాన స్వరూపం. ఆదిగురువు. అదే దక్షిణామూర్తి. ‘‘సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం’’ అని గురుపరంపర దీనితో మొదలవుతుంది. లలితోపాసనలో ఆదిహంస ద్వంద్వంగా కామేశ్వరీకామేశ్వరులుగా శివశక్తులు భావింపబడుతారు. తాత్త్విక స్థాయిలో ఇదీ వివేచన. సకల ప్రాణులలో సహజంగా జరుగుతూ ఉండే శ్వాస క్రియను యోగ శాస్త్రం ప్రాణం అని పేర్కొంది. శ్వాస స్థూలం. ప్రాణం సూక్ష్మం. మనస్సు ప్రాణశక్తి సహాయము లేనిదే ఏ పని చేయలేదు. ప్రాణమును గురించి తెలిసినవాడే వేదములు తెలిసిన వాడు. శ్వాసే బ్రహ్మము. వంటి సూక్తులు దీని ప్రభావాన్ని తెల్పుతున్నవి. వాక్కునకు ఉన్న 4 దశలు పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ. చివరి దశలో వ్యక్త మయ్యే మాటలు వైఖరి. దీనికి మూలం పరా. దీన్నే పరాశక్తిగా పేర్కొంటారు. మన అంతశ్చేతనలో కదలిన ఇచ్ఛాశక్తి. జంతువులకు, మూగవారికి కూడా మొదటి 3 దశలుంటాయి. వైఖరి ఉండదు. యోగశాస్త్ర రీత్యా ఆయుర్దాయం శ్వాసలుగా లెక్కింప బడుతుంది. ప్రాణయామ సాధనలో శ్వాసను స్వాధీన పర్చుకొని, యోగి తన జీవితకాలాన్ని పొడిగించుకుంటాడు. వందల సంవత్సరాలు జీవిస్తాడు. ‘‘ఒక యోగి ఆత్మ కథ’’ వంటి గ్రంథాలలో హిమాలయ యోగుల మహిమలెన్నో వివరించినారు. శ్వాసను నియమించడం ద్వారా హృదయస్పందన కూడా నిలిపి వేయగలరు. ఈ స్థితిలో వారాలపాటు, నెలల పాటు ఉండగలరు. ఇది ఎన్నోసార్లు నిరూపించబడిరది కూడా. జీవసమాధి అంటే ఇదే.
‘‘హంసలందురు శ్వాసల హంసనామ
మెట్లు గలిగెనో తెలియంగ నెంతురేని;
నోరు దెరిచియు శ్వాసల తీరులన్ని
సూక్ష్మబుద్ధిని జూడ నాచొప్పు దెలియు’’
‘‘అంతరాత్మనుండి యాద్యమౌ నచ్చుతో,
వెడలి వర్ణమాల వెలికి జేరి;
అది హకార వర్ణమై యొప్పుచుండును
ఊర్ధ్వగతి జెలంగు యుచ్చ స్వనము’’
‘‘అగు హకార వర్ణమాకాశతత్త్వంబు దాని నుండి గాలిలోనికరిగి
అందకార వర్ణమై యాత్మ జేరును నిత్యమిట్టులొప్పు నిశ్వసనము’’
‘‘అక్షరముల నకారంబె యాదియగుట అక్షరాణామకారోస్మి అనియె గీత’’
సృష్టి క్రమాన్ని తెల్పే సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయి. ఆరంభ వాదం, పరిణామ వాదము వంటివి. నిశ్చలమైన పరమాత్మ చైతన్యం తనను తానే జగత్తుగా పరిణమింప జేసుకుంది. ఆ క్రమంలో పంచతన్మాత్రలు, వాటి నుండి పంచభూతాలు ఏర్పడినాయి. ‘‘ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః ఆపద్పృథివీ’’ అని క్రమం. నిర్గుణం నుండి సగుణంగా, దాని నుండి పంచభూతాత్మకంగా సృష్టి రచన జరిగింది. సత్త్వ, రజ, తమో గుణాలు సర్వాన్ని నిండి ఉన్నాయి. వాటి వాటి శాతముల తేడాలతో ప్రకృతిలో, ప్రవృత్తిలో అనంత భేదాలు ఏర్పడినాయి. పంచభూతాలలో మొదిటిది ఆకాశం. దాని తత్త్వం శబ్దం. తొలి శబ్దం ప్రణవం. అంటే ఓమ్. ‘‘తస్య వాచకః ప్రణవః’’ అని పతంజలి మహర్షి సూత్రీకరణ. పరమాత్మను పేర్కొన గల్గినది ప్రణవమే. దీనినే బైబిల్ కూడా కాపీ కొట్టి, ‘‘xష్ట్రవతీవ షa+ +శీబఅస ax టఱతీర్’’ అని చెప్పింది. ప్రణవాన్ని, దాని తత్త్వాన్ని అద్భుతంగా వివరించింది మాండూక్యోపనిషత్. అందుకే భగవత్పాదులు ‘‘మాండూక్య మేకమేవ అలం’’ అన్నారు. అంటే తత్త్వము నెరుగుటకు మాండుక్యము ఒక్కటె చాలు అని అర్థం. దీనికే ఆది శంకరుల పరమ గురువులు గౌడపాదులు కారికలు వ్రాసినారు. శంకరుని అద్వైత సిద్ధతానికి ఇవే మూలం.
కొంత శాఖాచంక్రమణం జరిగింది కదా! వివరణ కోసం తప్పదు. సరే! ‘‘హ’’ ఆకాశ తత్త్వం. ‘అ’ తొలి అచ్చు. అ నుండి హ వరకు వర్ణ సమామ్నాయము. సర్వ శబ్ద ప్రపంచము దీనిలోనే ఒదిగి ఉంది. అదే అహం. దీనినే వివరిస్తూ
‘‘ప్రాణవాయువిట్లు బహిరభ్రమందు హ
కారముగను దహర గగన మంద
కారముగను నాత్మ గలిసియు మరల హ
కారముగను బయల గ్రాలుచుండు’’
‘‘అంతరంగమందు నాత్మ సంపూర్ణమై
పరగు శూన్యరూపవలయమట్లు
బాహ్య వస్తు పూర్ణ భావము పూర్ణమే
శూన్య పూర్ణములకు సున్నగుర్తు’’
తాత్త్విక భావాలను తెలుగు ఛందస్సులో ఇమిడిరచడం చాలా కష్టం. ఈ కవి చాలా సమర్థవంతంగా దాన్ని నిర్వహించినారు. శూన్యాన్ని, పూర్ణత్వాన్ని రెండిటిని బిందువు (సున్న) తెల్పుతుంది. గణిత శాస్త్రంలో కూడా సున్నను తొలిసారిగా భారతీయ శాస్త్రవేత్తలే ప్రపంచానికి తెల్పినారు. వీరంతా యోగులూ, ఋషులే. ఆర్యభట్ట, కణాద, చరక, వరాహమిహిర వంటి వారంతా ఋషి కల్పులే. సున్న సిద్ధాంతం ‘‘పూర్ణత్వ పూర్ణమాదాయ పూర్ణమే వాభిగచ్చతి’’ నుండి పుట్టినదే. మన బుద్ధులు ఎంతగా కలుషితమైనాయంటే శాస్త్రీయం అంటే పాశ్చాత్యమే. మనది కానే కాదు. అన్నంతగా వ్యామోహితులమైనాం. ఆర్ష సిద్ధాంతాలన్నీ కేవలం భౌతికం కాకుండా తాత్త్విక మూలమై ఉంటాయి. పారమార్థికమే భారతీయుల ధ్యేయం. అందుకే పురుషార్థాలలో చివరిది మోక్షం. ఈ జనన మరణ చక్ర రూపమైన సంసార బంధం నుండి విముక్తులం కావడమే. ‘‘జ్ఞానాదేవతు కైవల్యం’’ స్వస్వరూపానుసంధానం వల్లనే ముక్తి సాధ్యం. దానికి క్రమసాధనే మార్గం. సిద్ధాంతం, సాధన, సిద్ధి (అనుభవం) ఇదీ క్రమం. భక్తి కర్మ ఉపాసన యోగాలన్నీ జ్ఞానానికి పోషకమైనప్పుడే సార్థకం. అసలు జ్ఞానమంటే? దీన్ని గురించి అనాదిగా వివిధరూపాలలో శృతి, స్మృతి, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత రూపాలలో బోధిస్తున్నా గహనంగానే ఉంటుంది. అర్థమైనట్లే ఉండి, అర్థం కాదు. ఏదో అర్థమైనా దాని నిశ్చయ జ్ఞానం కల్గదు. ఈ బాధంతా ఎందుకులే అని దాని జోలికే పోము. ‘‘నేను ఏమిటి’’ అనే అన్వేషణే దీనికి మూలం. మన నిత్యానుభవంలో నేను అంటే మన శరీరమే. దానికి పెట్టుకున్న ఒక పేరు. మన వ్యవహారమంతా ఈ రెండిరటిపైనే ఆధారపడి సాగిస్తున్నాం. అట్లే ప్రతి దానికి ఒక రూపం. ఒక నామం. అంటే పేరు. అసలు నామం అంటే ఆలోచన. మనం స్వయంగా చూడని దాన్ని కూడా, ఎవరో చెప్పిన దాన్ని కూడా మనం భావించ గల్గుతున్నాం. లేదా ఎప్పుడో చూసిన వాటిని మన మనోనేత్రంతో దర్శించగలం. దీన్నిబట్టి నీ జ్ఞానమే నీవు అని తెలుస్తుంది. దీనికి మన నిత్యానుభవంలోనే ఎన్నో ఉదాహరణాలు. పుట్టుక నుండి ఎన్నెన్నో దశలుగా పరిణమిస్తున్నాం. భౌతికంగా, బౌద్ధికంగా, సాంఘికంగా ఆర్థికంగా ఇంకెన్నో రకాలుగా. ఈ మార్పులన్నీ ఎవరికి? మూడు కాలాలను (భూతభవిష్యద్వర్తమానాలు) మూడు స్థితులను (జాగ్రత్, స్వప్న, సుషుప్తులు) అనుభవిస్తున్నది ఎవరు? స్వప్నంలోని అనుభవాలన్నీ ఎవరివి? సుషుప్తి(నిద్ర)ని తెలుసుకుంటున్నది ఎవరు? నీ చైతన్యమే! నీ జ్ఞానమే! అదే నీవు. ఈ విధంగా నీ నామ రూపాలు నీవు కాదు అనే భావం స్థిర పడడం జ్ఞానసాధనలో మొదటి మెట్టు. ఈ భావాన్ని క్రమంగా విస్తరిస్తూ పోతే, చివరకు వివిధ నామరూపాలుగా ఉన్న దేవతా స్వరూపాలన్ని ఆత్మ స్వరూపంగా భాసిస్తాయి. కర్మ భక్తి మార్గాలకు పరాకాష్ట ఇది. ఇంకా పరిణితి చెందుతూ పోతే సమస్తము ఆ భావంగానే స్థిరపడుతుంది. దీనికి మనకు భాగవతంలోని ప్రహ్లాదుడు తార్కాణం. ‘‘ఇందుగలడు...........యెందెందు వెదకి చూసిన అందందే గలడు’’ అని సర్వాత్మ భావాన్ని ప్రకటించిన జీవన్ముక్తుడు. ఇట్టి మహత్తరమైన భావాలవైపు మన బుద్ధిని మరల్చే గ్రంథమే హంసతత్త్వ ప్రకాశిక.