శ్రీ పాణ్యం వాఙ్మయ నిధి పాణ్యం వంశ రచయితల సాహిత్యము

మాండూక్యోపనిషత్తు › అలాతశాంతి ప్రకరణము — 5

అలాతశాంతి ప్రకరణము — 5

మాండూక్యోపనిషత్తు · భాగము 14 / 14

శ్రీ శంకరుల మతం ప్రకారం ఇవే క్రింది విధంగా తెల్పబడినాయి.

ప్రాప్యములు: వివేకము, అమాయకత్వము మౌనము. (ఆధ్యాత్మిక జ్ఞానానికి ఇవి చాలా ముఖ్యము)

వివేకము: యుక్తాయుక్త జ్ఞానము. ఇది భక్తిచేతనే సాధ్యం. గురుశుశ్రూష తద్వాక్య శ్రవణం. దీని ద్వారా శాశ్వతమైన, అద్వైతమైన తత్త్వమనే శాస్త్రములు బోధిస్తున్నట్టు తెలియడం.

అమాయకత: బాలునివలె ప్రవర్తించడం - అహంకారం, ఆడంబరం, రాగద్వేషాదులు అప్రదానముగా ఉండునది.

మౌనం: అరుదైన ధ్యానక్షణములలో మనస్సు ప్రశాంతి నొందుట అం ఆంతరిక మౌనమే ఇది.

కారిక-91: ప్రకృత్యా ఆకాశవత్‌ జ్ఞేయాః సర్వేధర్మా అనాదయః ।

    విద్యత్యేన హి నానాత్వం తేషాం క్వచన కించన ॥

భావం: సహజ ప్రకృతి చేతనే సమస్త జీవులు ఆకాశమువలె అనాదియై అస్పృష్టములు అగుచున్నాయి. ఈ జీవులందు నానాత్వము ఎప్పుడూ ఏకొంచెం కూడా లేదు.

వివరణ: ఇంద్రియ విషయములు, మనోభావములు బుద్ధిలోని ఉద్దేశ్యములు కలిగిన విషయ ప్రపంచంలో జీవభావముతో చూచేవానికే గోచరిస్తున్నది. మనో బుద్ధుల ద్వారా పరమాత్మ ప్రసరించునప్పుడే ఈ జీవత్వం ప్రసరిస్తుంది. భౌతిక ఆవరణల పై ఈ తత్త్వాన్ని అనుసంధానించినప్పుడే అది మూఢ మానవునివలె క్రీడిస్తుంది. వీటితో ఆవృతమైన ఆత్మకే బాధాకరమైన సత్యత్వముగల నానారూప ప్రపంచం కన్పిస్తుంది.

మనోబుద్ధులు అంతరించినప్పుడే జీవుడు అంతరిస్తున్నాడు. వానితోపాటు దృశ్య ప్రపంచం కూడా అంతరిస్తుంది. దీన్ని బట్టి జీవుల సహజ ప్రకృతి అమృతత్వమే అని తెలుస్తుంది. ఘటాకాశం వలె అది పరిమితులకు కట్టుబడదు.

కారిక-92: ఆది బుద్ధాః ప్రకృత్యైవ సర్వేధర్మాః సునిశ్చితాః ।

    యస్యైవం భవతి క్షాంతిః సో-మృతత్వాయ కల్పతే॥

భావం: సహజంగానే సమస్త జీవులు అచలమైనవి. ప్రబుద్ధమైనవి. ఎవడు ఇట్టి జ్ఞానముకలిగిన పిమ్మట శాంతిని పొందుతునానడో అట్టి వాడే ఆత్మ తత్త్వమును తెలుసుకుంటాడు.

వివరణ: ఆధ్యాత్మిక తృష్ణ యందుండవలసిన త్రివిధములైన అంతరువులను ఈ శ్లోకంలో వివరించడం జరిగింది.

  1. ఆత్మజ్ఞానం, శాస్త్రజ్ఞానం రెండూ కల్గిన గురువువద్ద శాస్త్రములను విని, వాటి అర్థాన్ని మననం చేస్తూ దాన్ని ధ్యానించడం మొదటిస్థాయి.
  2. మనోబుద్ధుల నధిగమించి తురీయావస్థలో ప్రతిష్టితుడగుటకుగాను, అధికధికముగాతీవ్ర ధ్యానములో ప్రవేశించడం ద్వితీయస్థాయి.
  3. సాధకుడు సాధ్యమును (ధ్యేయాన్ని) చేరడం మూడవస్థాయి. దీనిలోనే ‘‘కృతకృత్యస్థితిని (తెలిసికొనవలసిన దాన్ని తెలుసుకున్నాను, పొందవలసిన దాన్ని పొందినాను, సాధించవలసిన దాన్ని సాధించినాను) పొందడం వల్ల సంతృప్తుడు కావడమే ఇది.

ఇటువంటి వాడే అమృతత్త్వాన్ని పొందడానికి సమర్థుడు. ఆత్మ విన్యాసంలో నిల్చి, ఆత్మలో ఐక్యం పొంది ఆత్మయందు, ఆత్మవలె జీవించువాడే అమృతసిద్ధి పొందినవాడు.

కారిక-93: ఆదిశాన్తా హ్యనుత్పన్నాః ప్రకృత్యైవ సునిర్విృతః।

    సర్వేధర్మాః సమాభిన్నా అజంసామ్యం విశారదం॥

భావం: సమస్త జీవులు ఆదినుండి నిత్యముక్తి పొందినవై, స్వభావము చేతనే సమమై అజమై ఉన్నాయి. మరియు ఆ జీవాత్మలు సమమై అభిన్నములై ఉన్నాయి. కావున ఈ విభిన్న రూప జీవులన్నియు ఆత్మ తప్ప మరేదియు కాదు. అవి సమమై ప్రతిష్ఠితమునై, అజమైన శుద్ధ ఆత్మయే అగుచున్నవి.

వివరణ: సాధనలో ప్రశాంత సంతృప్తిని సంపూర్ణంగా పొందడమే ఆత్మ తత్త్వమును పొందడంగా పరిణమిస్తుంది. తన అన్వేషణ అంతటితో ముగుస్తుంది. వెంటనే ఆత్మ తత్త్వానుభవం పొందుతున్నాడు. వెనుకటి శ్లోకములోని భావానికి పరిపుష్టి నందిస్తున్నది ఈ శ్లోకం.

వెనుకటి శ్లోకంలో సాధకుడు తన సహజమైన పరిపూర్ణ స్థితిని పొందడం కొత్తగాకాదు. తనలోనున్న ఆత్మను తెలిసికొనే అవకాశమే అది. ఈ స్థితిని పొందిన జ్ఞాని తాను చూస్తున్న, అనుభవిస్తున్న వన్నీ ఆత్మ తత్త్వమే అని తెలుసుకొనుచున్నాడు.

కారిక-94: వైశారద్యంతు వైనాస్తి భేదే విచరతాం సదా ।

    భేదనిమ్నాః పృథగ్వాదాన్త స్మాత్తే కృపణాః స్మతాః ॥

అర్థాలు: కృపణాః = కుత్సితులు.

__భావం: __ఎవరైతే ప్రపంచం యొక్క విభన్నత్వము నందే సదావిశ్వాసము కలవారగు చున్నారో వారు ఆంతరికమైన సహజమైన ఆత్మ పారిశుద్ధ్యాన్ని తెల్సుకోలేరు. భేద భావములో మునిగి, వస్తువులలో పృథగ్భావమును చూచేవారిని కృపణులని పేర్కొన్నారు.

వివరణ: భేదనిమ్నాః బేదమునందు నిమగ్నులు అని ద్వైతులను సూచిస్తున్నారు. సంకుచిత మనస్కులకు రాగాదులను, మనోబుద్ధులను జయించడం సాధ్యంకాదు. విశాల హృదయము, విస్తరించుమానసిక వైజ్ఞానిక దృష్టి అనేవి తత్త్వమున న్వేషించు వానికి కనీస అర్హతలు. ఇవి లేకుండా ఆత్మ తత్త్వం పొందలేడు.

బృహదారణ్యకంలో యాజ్ఞవల్క్యుడు గార్గితో చెప్పే వాక్యం కూడా ఇట్టిదే. ‘‘ఓ గార్గి! ఎవడైతే అక్షరమైన ఆత్మను తెలిసికొనకుండా ఈ ప్రపంచాన్ని వీడుచున్నాడో వాడు కృపణుడు అగుచున్నాడు.’’

కారిక-95: అజే సామ్యేతు యే కేచిద్భ విష్యన్తి సునిశ్చితాః ।

    తేహి లోకే మహాజ్ఞానాస్త చ్చలోకో న గాహతే ॥

భావం: సామ్యమై అజమైన ఆత్మయందు స్థిరమైన విశ్వాసము ఎవరికైతే గలదో వారు మహాజ్ఞానులు అనబడుచున్నారు. అట్టి వారిని సాధరణ మానవుడు తెల్సికోలేడు.

వివరణ: మానవ జన్మ పొంది ప్రతివాడూ దివ్యత్వాన్ని పొందేందుకు హక్కు గల్గి ఉన్నాడు. మిథ్యయగు జీవభావాన్ని పూర్తిగా త్యజించి, ఆత్మయొక్క ఔన్నత్య స్థితిని అందుకోవలసి ఉంది. దీనికి ప్రారంభం వర్ణాశ్రమ ధర్మాలు చక్కగా నిర్వహించడం వల్ల స్థిరంగా, మితంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందే అర్హత సాధించడం దీనికి స్త్రీ పురుష భేదం లేదు. పరమాత్మ తత్త్వాన్ని పొందేందుకు జన్మ, సాంగత్యం, వయస్సు, జాతి, లింగ భేదములు ఉపనిషత్సాహిత్యంలో సూచింపబడలేదు. ఇదే ఇక్కడ ‘‘ఎవరైనా సరే ఆత్మానుభవం పొందినవారు లక్ష్యాన్ని చేరుతున్నారు’’ అనే వాక్యం సూచిస్తుంది. ఇట్టి వానిని జనం గ్రహించలేరు. కారణం అతడు యోగసిద్ధులను గాని, అమానుష శక్తులనుగాని, కనబర్చడు.

కారిక-96: అజేష్యజమసంక్రాంతం ధర్మేషు జ్ఞానమిష్యతే ।

    యతోనక్రమతే జ్ఞానమసంగం తేన కీర్తితం ॥

భావం: జీవులలో సారభూతమైన శుద్ధ చైతన్యమైన ఆత్మ అజము, ఇది బాహ్య వస్తువులందు సంక్రమించదు. అందుకే అసంగం.

వివరణ: వ్యవహార జగత్తులో పొందే జ్ఞానమంతా పరిమితమే. ఇది అంతా మనస్సు యొక్క భ్రాంతిచేత స్పష్టమైనవే. సాధారణ మానవుడు బాహ్య విషయ జగత్తునుండి సంపూర్ణంగా విరక్తుడగుటకు శక్తి లేనివాడై, ఆత్మ తత్త్వాన్ని పొందడానికి అసమర్థుడు, అనర్హుడుగా ఉన్నాడు.

నిర్విషయ జ్ఞానమే ఆత్మ. దాన్ని అనుభవించడంతో లక్ష్యసిద్ధి, సాధనాసంసిద్ధి కల్గుతుంది. ‘‘అదే నానాజీవులను సృష్టించి వారు తమ దివ్యత్వాన్ని మరచి దుఃఖాదుల చేతను, హాసనృత్యాదుల చేతను తమ దివ్యత్వాన్ని పరిహాసాస్పదంగా చేసుకునేటట్లు ఉత్పత్తి చేస్తుంది’’ అనే విధంగా పరిపూర్ణమై, అఖండమైన ఆ బ్రహ్మతత్త్వమే ఈ విధంగా బహుధా విక్షిప్తమై ఉన్నది.

కారిక-97: అణుమాత్రే-పి వైధర్మ్యే జాయమానే-విపశ్చితః ।

    అసంగతా సదా నాస్తి కిమతా-వరణాచ్యుతిః ॥

భావం: నానారూప ప్రపంచ భావం అణుమాత్రమున్నా ఆత్మను చేయనీయదు. ఇదే ఆత్మను ఆవరించి ఉన్నది. అజ్ఞానులు దీనిని దాటలేరు.

వివరణ: జ్ఞాతృజ్ఞేయ సంబంధం ఉండేవరకు (అంటే తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది) ఆత్మజ్ఞానం పరిపూర్ణం కాదు. కాని పరమాత్మ తత్త్వంలో నిశ్చలుడైనవాడు అదే తన సహజ స్థితి అని తెలుసుకుంటాడు. తనకు ఆత్మ తత్త్వానికి మధ్య ఏ రకమైన అడ్డుగోడ లేదని నిశ్చయించుకుంటాడు. తన మధ్య భావాలనుండి, అపోహలనుండి భిన్నంగా ఆత్మ కేవలం కనుగొనబడుతుంది.

కారిక-98: అలబ్ధావరణాస్సర్వే ధర్మాః ప్రకృతి నిర్మవాః ।

    ఆదేబుద్ధాస్తథా ముక్తా బుధ్యంతే ఇతి నాయకాః ॥

భావం: సమస్త జీవులు స్వభావం చేత నిత్యముక్తులు. నిత్య పవిత్రులు. కాని మరుగునబడిన ఈ జ్ఞానాన్ని తెల్సికొనడానికి జీవులు అందరూ సమర్థులుగా ధీమంతులు చెప్తున్నారు.

వివరణ: వెనుకటి శ్లోకంలో ‘‘జీవుల సత్య తత్త్వం కప్పబడి ఉంది’’ అని చెప్పడం ద్వారా వేదాంతి దాన్ని నిజమని ఒప్పుకున్నట్లే గదా? అని ప్రతివాది ప్రశ్న. దానికి ఈ శ్లోకం సమాధానం.

సమస్త జీవులలో ఆత్మ స్వరూపం సదా శుద్ధమైనది అపరిమితమైనది. పరిమితాలన్నీ, మనస్సు కల్పించే మాయవల్లనే తెలుస్తున్నాయి. జీవుల సహజ స్వభావం నిత్యశుద్ధ జ్ఞానముక్తం.

ఆత్మను తెల్సికోవడానికి జీవులు శక్తులగుచున్నారు అని ఎందుకు చెప్పవలసి వచ్చింది? అన్న ప్రశ్నకు శ్రీ శంకరులు ఈ విధంగా వివరిస్తున్నారు. సూర్యుడు ఉదయిస్తున్నాడని, అస్తమిస్తున్నాడని దైనందిన జీవితంలో ఒకదాని దృష్ట్యా మరొక దాన్ని గురించి అనుకుంటున్నాం. కాని శాస్త్రజ్ఞులు సూర్యుడు కదలడం లేదని తెల్సినా మనకది అనుభవానికి రావడం లేదుకదా! సూర్యుడు ఆత్మ దృష్ట్యా అసత్యమే. కాని దైనందిన వ్యవహారముల దృష్ట్యా సత్యంగా కన్పిస్తుంది. ఈ గుణాలన్నీ ఆరోపిస్తున్నాం. అట్లే విభిన్నులైన జీవులు ఆత్మతత్త్వమే. పరమాచార్యులు మనతో అజ్ఞానభాషలో మాట్లాడుతూ (ఎందుకు అంటే అప్పుడైనా మనకు అర్థం కావాలని) ‘‘జీవులు తమ సహజ ఆత్మతత్త్వాన్ని తెలుసుకొనసమర్థులు’’ అనే ఆశా భావాన్ని కల్గిస్తున్నాడు. స్వప్నగతుడు జాగ్రదవస్థను తెలుసుకోగలడు. వంటిదే ఇది.

కారిక-99: క్రమతో నహిబుద్ధస్య జ్ఞానం ధర్మేషు నాపినః ।

    సర్వేధర్మా స్తథా జ్ఞానం నైతత్‌ బుద్ధేన భాషితః ॥

భావం: తన కారికల సారాన్ని సంగ్రహించి ‘‘జ్ఞానులు జీవితానుభవం నిర్విషయమైన శుద్ధ జ్ఞాన స్వరూపం. ఇదే బ్రహ్మజ్ఞానం. ఇది ఆకాశం వలె అస్పృష్టం (స్పర్శింప బడనిది) అక్కడ ఎట్టి పదార్థం ఉండరాదు. ఇది బుద్దుని చేత చెప్పబడలేదు.’’

వివరణ: బౌద్ధమతం వ్యాప్తిలో ఉన్న కాలంలోని వాడు గౌడపాదుడు. అందుకే ప్రత్యేకంగా ఉపనిషత్తులలోని జ్ఞానము దాని సిద్ధాంతాలు బుద్ధుడు చెప్పలేదు. అని ప్రత్యేకంగా వివరిస్తున్నాడు తన భావాలన్ని ఉపనిషత్తులవే గాని బుద్ధునివి కావని నిరాకరిస్తున్నాడు. బుద్ధుని అనుయాయులలోనే ‘‘శూన్యవాదులు ‘తత్త్వవాదులు’ అని రెండు తెగలు ఉన్నారు. బుద్ధుడు శూన్యమును గురించి చెప్పేవాడన్నారు. మరికొందరు బుద్ధుడు శూన్యమును గురించి చెప్పినాడన్నారు. మరికొందరు బుద్ధుడు ఏదీ చెప్పలేదు. ‘‘అంతః ప్రేరితమై గ్రహించవలసిన దాన్ని విశదంగా వివరించలేము’’ అన్నారు. బౌద్ధ, జ్ఞాన మార్గముల మధ్య భేదాన్ని ఈ విధంగా నిర్ణయించినారు.

జ్ఞానమార్గము: ఉత్తములను సాటిలేని వారినిగా మారుస్తుంది.

బౌద్ధమార్గము: బ్రహ్మమే పరతత్త్వమని బోధించదు.

కారిక-100: దుర్దర్శమతి గంభీరమజం సామ్యం విశారదం

    బుద్ధ్వాపదమనానాత్వం నమస్కుర్మో యథాబలం॥

భావం: అజము, సమము, జ్ఞానరూపము, నానాత్వ రహితము తత్త్వములో గ్రహించడానికి కష్టతరమైన పరమాత్మకు తెల్సికొన్న తర్వాత మా యథాశక్తి మేము దానికి నమస్కరిస్తాము.

వివరణ: సర్వవ్యాపి జగదతీతమైన ఆ పరమాత్మను తెల్సుకొన్న తర్వాత పూజా పురస్కారములకుగాని భక్తి ప్రేమలకుగాని అక్కడ చోటులేదు. శ్రీ గౌడపాదుడు ఆత్మ జ్ఞానాన్ని అతిశయపరుస్తూ ఆ పరమాత్మకే నమస్కరిస్తున్నాడు. వేదోక్త ప్రకారం పరమాత్మకు నమస్కరించడం ద్వారా దేహబుద్ధీంద్రియాదులపై విరక్తి కల్గించే ప్రయత్నం తద్ద్వారా సచ్చిదానంద రూపమైన ఆత్మ తత్త్వం కంటె మన సహజ తత్త్వం భిన్నముకాదు అని మనం తెలుసుకుంటాం.

అసంగోహం అసంగోహం అసంగోహం అసంగోహం

సచ్చిదానంద రూపోహం అహమేవాహమవ్యయః

ఓం తత్సత్‌