కారక-74: అజః కల్పిత సంవృత్యా పరమార్థేన నాప్యజః ।
ఏవతంత్రాభినిష్పత్యా సంవృత్యా జాయతే తు సః ॥
భావం: మాయాకల్పితమైన దైనందిన అనుభవాల దృష్ట్యా ఆత్మ అజమగుచున్నది. పరమార్థంలో ఆత్మ అజం కాదు. ఈ సిద్ధాంతాల దృష్ట్యా అజమైన ఆత్మ కూడా జాతమైనట్లు కన్పిస్తుంది.
వివరణ: పూర్వపక్షీయుల ఆక్షేపణ:- ‘‘శాస్త్ర పాఠములు మొదలైనవి అసత్యమైనప్పుడు ఆ శాస్త్రములు బోధించే ఆత్మకూడా వేదాంతి యొక్క భ్రాంతమైన ఊహే కదా?’’
శ్రీ శంకరులు ఇట్టి ప్రశ్నతో భాష్యం ప్రారంభించి, ఇది ద్వైతుల ప్రశ్నగా పేర్కొన్నారు. గౌడపాదుడు కూడా ఈ వాదాన్ని కాదనలేదు. దీన్నే వివరిస్తూ ఆత్మ అజమని శాస్త్రములలో చెప్పబడిరది. అజత్వము కూడా ఆత్మయందారోపితమైనదే. అజత్వ లక్షణం తద్వతిరేకమైన జాతి గుణము దృష్ట్యానే అస్తిత్వం కల్గి ఉన్నది. ఎక్కువ పరమితమైనది. బ్రహ్మం వాగతీతమైనది. శాస్త్రములు కూడా వ్యవహారానికి తగినట్లు దిగివచ్చి మన భాషలో చెప్తున్నాయి. పరమాత్మ నిర్వచనాలన్నీ ఇటువంటివే. ‘‘సర్వం ఖల్విదం బ్రహ్మ’’, ‘‘అయమాత్మా బ్రహ్మ’’, ‘‘సచ్చిదానందరూపం’’ ఇవన్నీ ఆత్మను సూచించేవే కాని పరిపూర్ణ వాస్తవ ప్రతిపాదనలు కావు. పరిమిత భాషలో పరమాత్మను నిర్వచించలేము. భ్రాంత ప్రపంచంలో భాష అనుభవాలను వ్యక్తం చేయగల్గుతుంది. అట్లే అజాతవాదం కూడా మనకు పరిచయమైన మాయా భాషలోనే అవాఙ్మానసగోచరమైన పరతత్త్వాన్ని వివరించేందుకు ప్రయత్నిస్తోంది.
సాంఖ్యులు హేతుఫలవాదులు. వారికి ఆత్మ జాతమే. (పుట్టినదే) దీనికి వ్యతిరేకంగా వేదాంతులు ‘అజాతము ఆత్మ’ అని నిర్ణయించినారు. మిథ్యను నిషేధించడానికి మరొక మిథ్యను ఉపయోగించడమే ఇది. భాష, తదితర జ్ఞానసాధనలు కూడా సంబంధ దృష్ట్యానే ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి ఆత్మ తత్త్వము యొక్క నైజతత్త్వము నిజానికి అనిశ్చితమే. కాని వేదాంతము గంభీరభావములను ప్రతిధ్వనిస్తూ అజమైన, పరిపూర్ణమైన ఆత్మ తత్త్వాన్ని సూచిస్తుంది.
కారిక-75: అభూతాభి ని వేశో-స్తి ద్వయం తత్ర న విద్యతే ।
ద్వయాభావం సబుద్ధ్వైవ నిర్నిమిత్తో న జాయతే ॥
భావం: ఈ మిథ్యా జగత్తు సత్యమని మానవునకొక అభినివేశం ఉంది. కాని అది సత్యం కాదు. ద్వైతం. ద్వైతాభావాన్ని చూచేవానికి అంటే అద్వైత స్వభావంపొందిన వానికి జన్మించేందుకే కారణం లేదు. వానికి పునర్జన్మలేదు.
వివరణ: మనసును అధిగమించడం అంటే జీవత్వాన్ని నశింపజేయడమే. అనుభవం కోసం మనస్సుకు ఇచ్చిన అవకాశమే జన్మ. అది అజ్ఞానంలో పూర్వకర్మలవల్ల జన్మను కోరుతుంది. ఆత్మ కల్గిన తర్వాత ఆ మనస్సే ఉండదు. మనస్సు లేనప్పుడు కొత్త అనుబవములు, కోరికలు, కాంక్షలు, భావనలు ఉండవు. వాని సాధనకై తగిన ప్రణాళికలూ ఉండవు. తగినట్లు ప్రవర్తనా ఉండదు.
అజ్ఞాన జీవుడు జయాపజయాలు, జననమరణాలు వంటి ద్వందాలను అనుభవిస్తాడు. కాని జీవుని యాత్ర సాఫల్యం, లక్ష్యం ఆత్మను కనుగొనడమే. అది తెలిసిన మరుక్షణమే జనన మరణ రూప కర్మఫలం నశిస్తుంది.
అభినివేశము: అసత్యమైన అజ్ఞానమునందుగల దృఢతర విశ్వాసముగల అంతః ప్రేరక మనోభావము.
కారిక-76: యథా న లభతే హేతూనుత్త మాధమమధ్యమాన్ ।
తదా న జాయతే చిత్తం హేత్వభావే ఫలం కుతః ॥
భావం: ఉత్తమ మధ్యమ అధమ కారణాలేవీ లేకుంటే ఈ మనస్సు జన్మలేనిదే. అంటే పుట్టనే లేదు. కారణమే లేకుంటే కార్యమెక్కడిది?
వివరణ: మీమాంసకుల మత ప్రకారము పూర్వకర్మ ఫలమే జన్మకు కారణం. కార్యము లేక కర్మ అనేది దాని ఫలముతోనే పూర్తి అవుతుంది. అంటే కర్మ ఫలమీ కర్మకంటె వేరుకాదు. కాని ఈ రెంటిమధ్య కాలం ఎంతైనా విస్తరించి ఉండవచ్చు.
కర్మలకు వెనుకనుండే సంకల్పములు, కర్మ చేస్తున్నప్పుడు కల్గే భావాలు ఇవన్నీ కలిసి మనస్సుగా మారుతుంది. వెనుకటి జన్మలలోని వాసనా సమూహమే ఈ జన్మలో మనస్సుగా ఏర్పడుతుంది.
త్రిగుణాల చేత సంపాదించబడిన ఈ మనో వాసనలు భవిష్యత్తులోని అనుభవాలకోసం కర్మక్షేత్రాన్ని నిర్ణయిస్తాయి. శాస్త్రము ఈ కర్మలనే 3 విధములుగా విభజించింది. అవి - 1) ఉత్తమ, 2) మధ్య, 3) అధమ.
- ఉత్తమ కర్మలు: స్వార్థరహితమైన భక్తి ప్రేమలతో భగవదర్పితంగా చేసే కర్మలు.
- మధ్యమ కర్మలు: స్వార్థపరుడై లాభాపేక్షతో శాస్త్రోక్తమైన కర్మ కాండననుసరించి చేసే వైదిక కర్మలు.
- అధమ కర్మలు: మనలోని పాశవిక, రాక్షస, పైశాచిక ప్రవృత్తులను పెంచి పోషించే కర్మలు.
ఈ కర్మసిద్ధాంతం నిజానికి మహత్తరమైనది. కాని దీన్ని దుర్వాఖ్యానాల ద్వారా వ్యతిరేకంగా ప్రచారం చేసినారు. మనలోని అశక్తతను, అలసత్వాన్ని, బాధ్యత నుండి తప్పించుకొనే స్వభావాన్ని మరుగున పర్చేందుకు దైవలీల, కర్మ ప్రభావం, వంటి కుతర్కంగా మార్చినారు. ఇది లోకాన్ని తప్పుదోవ పట్టించింది. కాని విచార తత్పరులైన జ్ఞానులు పురుషకారమును నిరూపించి, నీ విధిని నీవు నిర్వర్తించినప్పుడే దైవ సహాయం అందుతుందని తీర్మానించినారు. గీతాసారాంశం అదే కదా!
తన మనో దేహములతో తాదాత్మ్యం పొందనంత వరకు జీవుడు మనస్సులో వాసనలు పుట్టిస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే మనస్సును అధిగమించి, శుద్ధ చైతన్యమైన ఆత్మ తత్త్వాన్ని దానిలో తన ఐక్యాన్ని తెలుసుకుంటాడో తక్షణమే ఈ వాసనలన్నీ నశిస్తున్నాయి. దీనికి కావలసిన సాధన అభ్యాస వైరాగ్యములే.
కారిక-77: అనిమత్తస్య చిత్తస్య యానుత్పత్తిః సమా-ద్వయా ।
అజాతస్యైవ సర్వస్య చిత్తదృశ్యం హి తద్యతః ॥
భావం: అజమై, సంబంధ రహితమై, మనస్సుగా పరిణమించనిదై ఉండే జ్ఞాన స్థితియే స్థిరమైనది పరిపూర్ణమైనది. లోకమంతా మనస్సు చేత విషయీకృతమైనది. కాబట్టి ఉండే దంతా అజమే. మరొకటిలేదు.
వివరణ: వివేకంచే వైరాగ్యం పొందినవానికి మనస్సు అంతరిస్తుంది. కారణం భ్రాంతమనస్సుకు ఆధారం ఆత్మ తత్త్వమే. నిజమైన తాడును గురించి తెలుసుకున్నంతనే భ్రాంతమైన పాము మాయమైనట్లుగా సత్యమైన ఆత్మ తత్త్వము తెల్సిన వెంటనే భ్రాంతమైన, విభక్తం చేసే వర్ణ విశ్లేషణ యంత్రమువంటి మనస్సు ద్వారా చూస్తున్న ఈ నానారూప ప్రపంచం తనకు తానే మాయమైతుంది. ఆ మనస్సు స్థానంలో సచ్చిదానంద మయమైన ఆత్మ తత్త్వం భాసిస్తుంది.
కారిక-78: బుద్ధ్వా-నిమిత్తతాం సత్యాం హేతు పృథగనాప్నువన్ ।
వీతశోకం తథా కామమభయం పదమశ్నుతే ॥
భావం: ఈ విధంగా హేత్వభావమే ఆత్మయని తెల్సికొన్న వానికి ఇతర నిమిత్త కారణములుండవు. అట్టివానికి రాగము, శోకము, భయము లేని మోక్షము సిద్ధించుచున్నది.
__వివరణ: __హేతు ఫలభావము కేవలం మనస్సు యొక్క మాయ మాత్రమే. ఇది తెలియవలెనంటే దానిలోని దోషములు తెలియవలెను. ఇది మనస్సు యొక్క అనేక కర్మక్షేత్రములలో ఒకటి మాత్రమే. దీన్ని దేశకాలములందు మాత్రమే నిల్పగలం. మనస్సును అధిగమించుట ద్వారా జననమరణ రూపబ్రాంత సంఘటనల నడుమ అర్థరహితమైన, అంతవంతమైన, బాధాకరమైన, విసుగెత్తించే జీవయాత్రనుండి విముక్తి నందించు స్థితియే ‘చైతన్యజ్ఞానస్థితి’గా పేర్కొనబడుతుంది.
ఈ విధంగా మనో బుద్ధులను దాటినవానికి ముక్తి కరతలామలకం. అక్కడ వానికి ఏ మాత్రం భయం, శోకం, కాంక్ష ఉండవు. ఇదియే మోక్షస్థితి. ఇది కావలెనన్న శరీర మనో బుద్దులతోడి తాదాత్మ్యం వదిలించుకోవలెను. వీటినే త్రివిధములైన మాయలుగా శాస్త్రం పేర్కొంటుంది. అవి-
- దేహంతో తాదాత్మ్యం కల్గి ఉన్నంతవరకు భయముంటుంది.
- మనస్సుతో తాదాత్మ్యం కల్గి ఉన్నంతవరకు కాంక్షలుంటాయి.
- బుద్ధితో తాదాత్మ్యం కల్గి ఉన్నంతవరకు దుఃఖం ఉంటుంది.
పై మూడిరటిని వదలినప్పుడే జ్ఞానం పొందగలము.
కారిక-79: అభూతాభినివేశాద్ధి సదృశే తత్ప్రవర్తతే ।
వస్త్వభావం సబుద్ధ్యైవ నిస్సంగం వినివర్తతే ॥
భావం: అసత్యవస్తువులందు అభినివేశం కల్గి యుండుటచే మనస్సు ఇంద్రియ విషయముల వెంట పరుగెత్తుతుంది. వస్తువుల మిథ్యాత్వమును తెల్సికొని వైరాగ్యముచే ఆత్మజ్ఞానాన్ని పొందిన పిమ్మట అది నిస్సంగమై వెనుకకు మరలి నిజతత్త్వాన్ని చేరుతుంది.
__వివరణ: __మనస్సు అనంతమైన జన్మ పరంపరల వాసనలచేత కలుషితమైంది. తాను భ్రాంతమై కల్పిత విషయ ప్రపంచాన్ని సత్యమైనదనే విశ్వాసాన్ని తనలో గాఢపరచుకుంటుంది. ఈ గాఢతాక్రమణం వల్ల మనస్సు ఇంద్రియములద్వారా విషయ ప్రపంచం వెంట పరుగుతీస్తుంది.
ఈ పరిధిలో ఉన్నంతవరకు ఈ సమస్య ఇట్లే ఉంటుంది. మనస్సును అధిగమించిన వెంటనే ఈ సమస్య మాయమైతున్నది. దానికి మార్గం ఇంద్రియ విషయములయొక్క నిస్సారతను మిథ్యత్వాన్ని వివేకముతో విచారించి తెల్సికొని దృఢపరచుకోవడమే. ఇది తెల్సిన వెంటనే మనస్సు వాటి నుండి మరలిపోతుంది. జ్ఞానసాధనకై విశ్రాంతి నొందుతుంది. దీని బట్టి వివేకమే మనోరోగానికి మందుగా తెలుస్తుంది.
కారిక-80: నివృత్తస్యా ప్రవృత్తస్యా నిశ్చలాహి తదా స్థితిః ।
విషయః సహిబుద్ధానాం దత్సామ్యమ జమద్వయం ॥
భావం: విషయములనుండి నివృత్తిచెంది, సంకల్పాదుల నుండి విడివడిన మనస్సు పవిత్రమైన అచల స్థితిని పొందుతుంది. దీన్నే జ్ఞానులు సమము, అజము, అద్వైతము అని పేర్కొన్నారు.
వివరణ: మనస్సు తనకలవాటైన ఇంద్రియ విషయములవెంట పరుగెత్తుతుంది. ఇది త్రికాలములందు (భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో) సంచరిస్తుంటుంది. దీన్ని బట్టి ఎక్కువగా వర్తమానమందే ఉన్నప్పటికి భూత భవిష్యత్తుల్లో కూడా సంచరించడం దాని నైజం. కాలమే కాకుండా దేశముకూడా దాని వర్తనాపరిధి. అన్ని కాలాలనుండి అన్ని దేశాలనుండి మనస్సును విరమణ పొందించవలెను. దీన్నే ప్రవృత్తి నుండి నివృత్తి పొందడం అంటారు. అప్పుడే మనస్సు ఏకాగ్రం చెందగలదు. సంకల్పాదులు లేని నిర్విషయమైన స్థితే (‘‘నిర్విషయంధ్యానం’’) అతీత మనస్కుడు. అదే ఆత్మానంద స్థితి. అనంత కాలంనుండి ఎందరో మహానుభావులు యోగులు ఋషులు దీన్ని అనుభవిస్తూనే ఉన్నారు. తమ అనుభవాలను గ్రంథస్థం చేయగా అవి శాస్త్రరూపాన్ని సంతరించుకొన్నాయి. మనోతీతమైన అనుభవాన్ని పొందడమే అద్వైతము అదే అజము అదే సమస్థితి (సమత్వ యోగముచ్యతే).
కారిక-81: అజమ నిద్ర మస్వప్నం ప్రభాతం భవతి స్వయం ।
సకృద్విభాతో హ్యేవైష ధర్మోధాతు స్వభావతః ॥
భావం: జన్మ, నిద్ర, స్వప్నం వంటి అవస్థలు లేనిది తన్నుతానే స్వయంగా ప్రకాశింప జేసుకొనేది ఆత్మ. అది సహృది ప్రకాశస్వరూపం!
వివరణ: రెండవ అధ్యాయంలో సుషుప్తిని గురించి, మూడవ అధ్యాయములో స్వప్నమును గురించి వివరించబడిరది. సూక్ష్మ శరీరమైన మనోబుద్ధులతో తాదాత్మ్యం పొందినప్పుడు జీవుడు అనుభవించేదే స్వప్నం.
అవిద్యావరణమగు కారణశరీరంతో తాదాత్మ్యం పొందినప్పుడు జీవుడు అనుభవించేదే నిద్ర.
పై రెండు సూక్ష్మ కారణములను దాటినవాడే ఆత్మజ్ఞాని. ఆవగించంత అవిద్యకూడా అతనిలో ఉండదు. ఇక్కడొక సంశయం ప్రతి పక్షికి కల్గుతుంది. అది ఇది మనో బుద్ధులు అధిగమించిన పిమ్మట తెలిసికొనడానికి బుద్ధి, అనుభవించడానికి మనస్సు లేకపోయినప్పుడు ఆత్మానందాన్ని అనుభవించడం ఎలా సాధ్యం? దానికి ఈ శ్లోకమే సమాధానము. జ్ఞానం స్వయం ప్రకాశం. దాన్ని తెలుసుకోవడానికి మరియొక జ్ఞానం పనిలేదు. సూర్యుని చూచేందుకు మరొక దీపకాంతి అవసరంలేదు. ఆత్మను ఆవరించియున్న అవిద్య అనే ఆవరణను తొలగించడమే సమస్త వేదాంత సాధనల లక్ష్యం ఆత్మానుభవానికి ఆత్మకన్నా ఇతరమైన సాధనం అవసరం లేదు.
కారిక-82: సుఖ మావ్రియతే నిత్యం దుఃఖం వివ్రియతే సదా ।
యస్య కస్య చ ధర్మస్య గ్రహేణ భగవానసౌ ॥
భావం: మనస్సు ఆత్మకు సహజమైన సుఖాన్ని అనుభవానికి రాకుండా అడ్డగించుచున్నది. తత్ఫలితంగా దుఃఖం బయల్వెడలుచున్నది. అందుకే ఆ భగవంతుని (ఆత్మను) గ్రహించడం అసాధ్యంగా ఉంది.
వివరణ: మళ్ళీ మళ్ళీ బోధిస్తున్నప్పటికీ మానవులా పరమాత్మ తత్త్వాన్ని ఎందుకు గ్రహింపలేకున్నారు? అనే ప్రశ్నకు జవాబే ఈ శ్లోకం. మనస్సులోని వాసనారూపంగా ఉండే అనేక ప్రవృత్తులే ఇందుకు కారణం అని జవాబు.
మేలుకొని ఉన్నంతవరకూ ఒక్క క్షణం కూడా విడువకుండా మనస్సు విషయ గ్రహణం చేస్తూనే ఉంది.
సుషుప్తిలో కూడా ఒక విధమైన సాత్త్విక జ్ఞానం ఉంది. బాహ్య విషయాలను గ్రహించకున్నా అజ్ఞానాన్ని ప్రకటించు మనోవృత్తి సదా ఉంది.
జాగ్రత్‌తో పోలిస్తే సుషుప్తిలో అలజడి తక్కువ. దీన్నిబట్టి ఎచట గ్రహణ వ్యాపారం ఉండదో అక్కడ శాంతి ఉంటుంది. శాంతి సమత్వాలు, ఆనంద పరిపూర్ణతలు ఆత్మకు నైజతత్త్వాలు. మనోవృత్తుల కారణంగా ఈ సహజతత్త్వం మరుగున పడిరది. దుఃఖం బాధ శోకం వంటివి విజృంభిస్తున్నాయి. అందుకే ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా, ఎన్నో ఏళ్ళు తపశ్చర్యలు చేసినా మనస్సు పూర్తిగా అంతరించడం లేదు. తత్ఫలితంగా ఆత్మ తత్త్వం అనుభవించడంలేదు. అహో! మనస్సు ఎంత ప్రభావవంతమైనదో గదా?
కారిక-83: అస్తినాస్త్యస్తి నాస్తీతి నాస్తి నాస్తీతి నా పునః ।
చలస్థిరో భయా భావై రావృణో త్యేవ బాలిశః ॥
అర్థాలు: బాలిశ = మూఢులు/ అజ్ఞానులు.
భావం: అస్తి అనీ, నాస్తి అనీ, అస్తినాస్తి అనీ, నాస్తి నాస్తి అనీ చలమని స్థిరమనీ ఉభయమనీ రకరకాలుగా ఊహిస్తూ బాలిశులైనవారు ఆత్మ తత్త్వాన్ని కప్పివేస్తున్నారు (కనుగొనలేకున్నారు)
వివరణ: చతుష్కోటి రూపమైన వాదన ఇది. అంటే ఒక సమస్యను బుద్ధితో విశ్లేషించి చర్చనీయాంశాన్ని అర్థం చేసుకోవడానికి సాధ్యమైన 4 మార్గములనే చతుష్కోటి రూప వాదన అంటాం. పరమాత్మపై గుణములనారోపించుటలో దృఢమనస్కులైన భారతీయుల (వివిధ మతస్థుల) ముఖ్య భావాలను ఒక్కచోట ఈ శ్లోకంలో చూపడం జరిగింది.
- అస్తి: ఆత్మ ఉందని వైశేషికులు నమ్ముతారు. వారి మతం ప్రకారం దేహమనో బుద్ధి ప్రాణాలకు అతీతమైన ఆత్మయొకటి ఉందని, అదే ఈ సుఖదుఃఖాలను తెల్సుకునేటప్పుడు జ్ఞాతగా, అనుభవించేటప్పుడు భోక్తగా ఉంటుంది. వారికి అందుకే ఆత్మ అస్తి.
- నాస్తి: ఆత్మ లేదని క్షణిక విజ్ఞానవాదులు నమ్ముతారు. వారికి ఆత్మనాస్తి. ఆత్మ దేహము కంటె భిన్నమైనప్పటికి బుద్ధితో తాదాత్మ్యం చెందుతుంటుంది. మనస్సులోని ప్రతి భావ తరంగం ఆత్మచే ప్రకాశింపబడుతుంది. రెండు భావముల మధ్య తెలిసికోవడానికి ఆత్మకేదీ ఉండదు. అచట జ్ఞానమే ఉండదు. వారి మతం ప్రకారం ఆత్మ ప్రతి భావంతో జన్మించి, ప్రతి ఇతర భావంతో నశిస్తుంది. శాశ్వతము, స్థిరమైన ఆత్మను వారు నమ్మరు. అది క్షణికమే వారి దృష్టిలో. అది నిరంతరం చలిస్తున్నందువల్ల అస్తిత్వం కల్గి ఉన్నట్లు తోస్తుంది. ఇదీ క్షణికవాదం. వారికి ఆత్మనాస్తి.
- అస్తి-నాస్తి: జైనమతానుయాయులకు ఆత్మ అస్తి-నాస్తి. (ఉన్నది-లేదు) వారి మతము ప్రకారము. ఆత్మ దేహము కన్నా భిన్నమే. కాని అది దేహమంత పరిమాణంలోనే ఉంది. దేహమున్నంతవరకు ఆత్మ ఉంటుంది. దేహం నశించిన పిమ్మట ఆత్మ నశిస్తుంది. ఈ విధంగా జైనులకు ఆత్మ అస్తి-నాస్తి.
- నాస్తి - నాస్తి: బౌద్దులలో శూన్యవాదులు అనే తెగ ఉంది. వారికి ఆత్మ నాస్తి-నాస్తి. వారి వాదం ప్రకారం సమస్త జీవులు, సమస్త పదార్థాలు తుదకు నశించేవే. కావున ఆత్మ లేనేలేదు. నశించనిదే ఆత్మ అనే వాదాన్ని వారు అంగీకరించరు. వారికి నాస్తి-నాస్తిగా ఆత్మ ఉంటుంది.
పైన చెప్పిన భావాలన్నీ ఆత్మయందు ఆరోపించబడిన విశిష్టగుణములేకాని అవే ఆత్మకావు. వారి వారి బుద్ధులకు తోచినట్లు ఆత్మను నిర్ధారించినారు. అందుకే గౌడపాదుడు వారిని బాలిశులుగా పేర్కొన్నాడు. ఇవన్నీ అపరిణత బుద్ధి జన్యములే.
కారిక-84: కోటయశ్చ తస్ర ఏతాస్తు గ్రహైర్యాసాం సదా-వృతః ।
భగవనాభిరస్పృష్టో యేన దృష్టః స సర్వదృక్ ॥
భావం: పైన పేర్కొన్న 4 రకాలైన సిద్ధాంతాలు కూడా ఎవ్వానికి కూడి ఉంటాయో వానికి ఆత్మ సదా ఆవృతమై (నిజతత్త్వం కప్పివేయబడి) ఉంటుంది. ఆత్మను తెల్సికొన్న వానికి ఇవన్నీ అంటవు. వాడు ఆత్మజ్ఞానిగా నుంటాడు.
వివరణ: తీవ్ర సాధన ద్వారా పొందే ఆత్మజ్ఞానం వల్ల పైన చెప్పిన అప్రధాన లక్షణాలనుండి విడివడి, ఇంద్రియమనో బుద్ధులకు కూడా ఆధారమైన ఆత్మ తత్త్వాన్ని సహజ పవిత్ర స్వరూపంగా తెలుసుకుంటాడు. గాఢమైన మౌనమందు మనస్సు స్వకీయమైన సహజ శక్తిపై స్థాపితమై పరిపూర్ణమైన ప్రభావంతో ఆత్మ స్థిరపడును. దాన్ని తెల్సుకోవడమే నిన్ను నీవు తెల్సుకోవడం.
కారిక-85: ప్రాప్య సర్వజ్ఞతాం కృత్స్నాం బ్రాహ్మణ్యం పదమద్వయం ।
అనాపన్నాది మధ్యాన్తం కిమతః పరమీహతే ॥
భావం: ఆది మధ్యాన్త రహితమైన, అద్వైతమైన బ్రహ్మతత్త్వ స్థితిని పొందిన వాడిరక కోరదగినది ఏదీ లేదు.
వివరణ: ఆత్మజ్ఞానం పొందిన వానికి కోరదగినది ఏదీ లేదు. కారణం అట్టి వాడు సదాశాంతుడు. ఆంతరికానందంలో తేలియాడుచుండును. వాడు దేన్నీ కోరడు. దేన్ని ఆకాంక్షించడు. వాడే సర్వం ఆవరించి ఉంటాడు. సాధన కాలంలో అభ్యసించిన ఆత్మ సంయమనం, త్యాగం, ధ్యానం వంటి జీవిత ధర్మాలుగాని, జీవిత న్యాయములు గాని వాని కుండవు. ఈ శ్లోకంలో పేర్కొన్న బ్రాహ్మణుడు వాడే. కేవలం జాతి మాత్రోపశిష్టుడు బ్రాహ్మణుడు కాడు. శరీర స్పృహ లేక, జీవ భావావేశాలు లేక ఆత్మ సామ్రాజ్యం నందే విహరించుచూ ఆత్మచే ఆత్మానుభవ ప్రసారము చేయుటకు శబ్ద ప్రసార యంత్రం మగును.
కారిక-86: విప్రాణం వినయోహ్యేషు శమః ప్రాకృత ఉచ్యతే ।
దమః ప్రకృతి దాంతత్వాదేవం విద్వాన్ శమం వ్రజేత్ ॥
భావం: ఆత్మజ్ఞానమే బ్రాహ్మణులకు సహజమైన వినయము. వారికి మనశ్శాంతి సహజము. వారికి ఇంద్రియనిగ్రహం సహజం. అందుకే అది పరిపూర్ణమగు చున్నది. శాంతమైన బ్రహ్మాన్ని ఈ విధంగా తెలిసికున్నవాడు స్వయంగా సుఖియై అచలమైన శాంతుడుగా అగుచున్నాడు.
వివరణ: శుద్ధ చైతన్యమగు పరమాత్మనే తానని తెలియడం చిట్టచివరిది. అది తెలిసినవానికి పొందతగినదిగాని, తెలియదగినది గాని ఏదీ ఉండదు. ఇట్టి వానికి వైదిక కర్మల ననుసరించడం వంటివి అవసరంలేదు. వానికివన్నీ, తనయందు ఆత్మకంటె పరమైన సహజ గుణములుగా ఉంటున్నాయి. ఇట్టివాని చూచియే ధర్మశాస్త్రములు ధర్మముయొక్క నిర్వచనాన్ని, నీతి నియమాలను సూత్రీకరించినాయి.
పరమాత్మ తోడి ఐక్యమైనవాడు సదా వినయంగా ఉంటాడు. ఇతర జీవులతో సామూహిక ఐక్యము కల్గించుకొని శారీరకంగా, మానసికంగా, వైజ్ఞానికంగా అణకువ కల్గి ఉండడం వినయం. ఇది నింద్యమైన శరణాగతి కాదు ఆత్మయొక్క శక్తి పవిత్రతల దృష్ట్యా దేహమనోబుద్ధులు, ఆ పరమాత్మయందు కేవలం ఆరోపితములే. ఆత్మజ్ఞానియగు యోగి, ద్వేషం, ఆత్మాభిమానం, పోట్లాడుస్వభావం, గర్వం ఇవన్నీ అహంకార లక్షణాలు కావున వీటికి అతీతంగా నిత్యం శాంతి స్వతస్సిద్ధమై సద్యఃస్ఫూర్తి కల్గి ఉంటాడు. దీనికి ఉదాహరణం ‘‘మిథిలా యాం దహ్య మానాయాం నమే కించిత్, ప్రదహ్యతి’’ అన్న జనకుని మాటలు (‘‘మిథిలా నగరం కాలుతున్నా నన్నేదీ కాల్చదు’’) ఆత్మ పరిపూర్ణతను తెల్పుతున్నాయి. అతడు పరితుష్టి పొందినవాడై, పరిపూర్ణమైన తృప్తితో దేన్నీ కోరడు. ఇంద్రియ మనస్సులతని వశవర్తులు.
జ్ఞానయోగానికి హఠయోగానికి గల తారతమ్యం తెల్పేందుకు ‘‘ఇంద్రియములను వశపర్చుకొనుట జ్ఞానికి సహజం’’ అని చెప్పడం జరిగింది.
జ్ఞానయోగంలో వివేకం చేత, అనుభవం చేత ఇంద్రియ నిగ్రహం జరుగుతుంది.
హఠయోగంలో ప్రాణాయామం చేత ప్రాణాలను ఇంద్రియ కేంద్రాలనుండి ఉపసంహరించుకోవడం ద్వారా ఇంద్రియ నిగ్రహం జరుగుతుంది.
పై రెంటిలో ఆత్మజ్ఞానంతో కల్గిన ఇంద్రియ నిగ్రహం సహజం, సమగ్రం, యోగంతో కల్గినఇంద్రియ నిగ్రహం కష్టతరం అసంపూర్ణం స్వల్పకాలికం, కల్పితం.
కారిక-87: సవస్తు సోపలంభం చ ద్వయం లౌకిక మిష్యతే।
అవస్తు సోపలంభంచ శుద్ధం లౌకిక మిష్యతే॥
భావం: వస్తుభావములతో సంబంధం కల్గి అనుభవ మాత్రంతోనే తెలుసుకుంటున్న జాగ్రదవస్థను వేదాంతం అంగీకరిస్తుంది. అంతేకాకుండా అవాస్తవమైన వస్తువులతో సంబంధం కల్గిన భావ ప్రపంచాన్ని కూడా ఆ వేదాంతము ఒప్పుకొంటున్నది.
వివరణ: బౌద్ధ తత్త్వ గ్రంథాలలో జాగ్రదవస్థను లౌకికము అని, స్వప్నావస్థను శుద్ధ లౌకికమని పేర్కొంటారు. వారికన్నా ముందున్న సిద్ధాంతాలనుండి, జ్ఞానుల నుండి ప్రతిజ్ఞాని వర్గం ఎంతో కొంత సంగ్రహించక తప్పదు. బౌద్ధుల వారికి ముందున్న వాఙ్మయం నుండి ఎన్నో పదములను భావాలను అరువు తెచ్చుకున్నారు. అట్లే గౌడపాదుడు కూడా. కాని కొందరు విమర్శకులు ‘గౌడపాదుడు బౌద్ధమత విశ్వాసి’ అన్నారు. ఇది ఖండిరచ తగినది. శ్రీ శంకరులు తన వ్యాఖ్యానంలో అదే పని చేసినారు. లౌకిక స్థితిలో, శుద్ధ లౌకిక స్థితిలో గూడా జ్ఞాతకు జ్ఞేయానికి సంబంధం కల్గియే ఉంది. విశ్వునకు స్థూలము వాస్తవము తైజసునికి స్వప్నం మనోభాల సముదాయమే.
కారిక-88: అవస్త్వనులంభం చ లోకోత్తరమితిస్మృతం ।
జ్ఞానం జ్ఞేయం చ విజ్ఞేయం సదా బుద్ధైః ప్రకీర్తితం ॥
భావం: వస్తుభావములకు అతీతమైన అవస్థ ‘‘లోకోత్తరమని’’ చెప్పబడునది మరొకటి ఉంది. అది శాస్త్రీయానుభవాలకు అతీతమైనది. ప్రబుద్ధులు జ్ఞానం, జ్ఞేయం, విజ్ఞానం అనే ఆ మూడిరటినే పరమాత్మ అని వర్ణించారు.
వివరణ: బౌద్ధులలో యోగాచార్యులనబడేవారు సుషుప్తినే లోకోత్తరమన్నారు. ప్రాజ్ఞునకు జాగ్రత్స్వప్నాల అనుభవాలు లేవు. అతడు వీటన్నింటినీ అధిగమించి, ఎట్టి వస్తువుతో చైతన్య సంబంధం కల్గిఉండడు. ఈ మూడవస్థల సమాహారమే జీవితం. వీటన్నింటినీ ప్రకాశింపజేసేది పరమాత్మే అని తెల్సుకోవడం వేదాంత సాధన. వీటిని అధిగమించడమే వేదాంత రాజ్యంలో ప్రవేశించడం. ఈ తురీయావస్థ యొక్క పరిపూర్ణ జ్ఞానమే అజమై, అద్వైతమై, నిశ్చలమై ఉంది. స్థూలమైన అజ్ఞాన ప్రపంచం నుండి జ్ఞేయమైన పరమాత్మవరకు గల లక్షణ క్రమాన్ని ఆత్మ జ్ఞానులు వివరించిరి. వారియొక్క ఇట్టి వివరణే ఆత్మజ్ఞానం ఈ రెండూ కలిసి బ్రహ్మవిద్యా వాఙ్మయంగా స్థిరపడిరది.
కారిక-89: జ్ఞానేన త్రివిధ జ్ఞాయే క్రమేణ విదితే స్వయం ।
సర్వజ్ఞతా హి సర్వత్ర భవతీహ మహాధియః ॥
భావం: జ్ఞానాన్ని, త్రివిధ జ్ఞేయాన్ని వరుసగా వాని క్రమములో తెలుసుకొన్నవాడు సర్వత్ర, సర్వ విషయములందు స్వయంగా సర్వజ్ఞత్వాన్ని పొందుతున్నాడు.
వివరణ: శుద్ధమైన నిర్గుణ బ్రహ్మోపాసన విధానం ప్రణవో పాసన. అకారం మీద విశ్వుని, ఉకారం మీద తైజసుని మకారము మీద ప్రాజ్ఞుని ఆరోపించి ధ్యానించవలెను. నిరంతరం వివేకం కల్గి సాధన చేసేవాడు ఈ మూడవస్థలలో వివిధంగా క్రీడిరచే తనలోని జీవుని బాగుగా తెలుసుకుంటాడు. సాధన పండినప్పుడు శుద్ధమైన తురీయాన్ని తెలుసుకుంటాడు. ఈ మూడవస్థలను పూర్తిగా తెల్సుకోవడమే జ్ఞానిగా, సంపూర్ణ పరిణితి చెందినవానిగా, మారుస్తుంది. దీని ప్రభావంతో పరమ శాంతుడుగాను, కుశాగ్రబుద్ధిగా మారుతున్నాడు. అతడు ఈ లోకంలోనే ఇప్పుడే దివ్యత్వాన్ని పొందుతున్నాడు. ఇదే మోక్షం దీనికోసం మరణం తర్వాత ఊర్ధ్వ లోకాలకు పోనక్కరలేదు. ఇది ప్రతి మానవుని జన్మహక్కు సాధకుడు చేసే 1) నిష్కపటమైన ప్రయత్నం, 2) చక్కని సమాచరణ, 3) సరియైన అర్థజ్ఞానము అనే ఈ మూడే సిద్ధిని పొందడం కోసం పునాదిరాళ్ళు.
ఈ తురీయావస్థను పొందిన వెంటనే జ్ఞాని సమస్తదేశకాలములందూ, సమస్త జీవులలో జ్ఞాతయగు ఆత్మయే తాను అగుచున్నాడు.
కారిక-90: హేయజ్ఞే యాప్యా వాక్యాని విజ్ఞేయాన్యగ్ర యాణతః।
తేషామన్యత్ర విజ్ఞేయాదుపలం భస్త్రిషు స్మృతః ॥
__భావం: __ఏ వస్తువులు హేయములు, ఏవి జ్ఞేయములు, ఏవి ప్రాప్యములు (పొందదగినవి) ఏవి అవాక్యములు (వ్యర్థప్రయోజనముగలవి) అనే నాల్గు విషయాలు ప్రారంభదశలోనే తెల్సుకోవలెను. ఈ నాల్గింటిలో జ్ఞేయము తప్ప మిగిలిన మూడూ కేవలం భావనామాత్రంగానే ఉంటున్నాయి.
__వివరణ: __శాస్త్రము నిర్దేశించినట్లు జీవిత లక్ష్యము తురీయావస్థ లేదా దివ్యచైతన్యమే దాన్ని పొందడానికి కేవలం దాని నిర్వచనాలను తెల్సుకుంటే సరిపోదు. దానికి అపాయకరమైన నిషిద్ధ భావాలను తొలగించుకొని, దానికై శ్రద్ధతో కూడిన సాధనను, దానిపై స్థిరమైన భక్తిని అలవర్చుకొని, కారణమును నిషేధించి సత్యమును తెలుపు సమీకరణ యోగమును అనుసరించవలెను. మనలనభివృద్ధిపరచే జీవిత విలువలను తెల్సికోవలెను. శ్రద్ధగా సమాచరించడం ద్వారా మనస్సులోని వాసనాబంధాలను వదిలించుకోవడం ఎలాగో కూడా తెలుసుకోవలెను.
- హేయములు: వదిలివేయదగినవి - మనలో జీవ భావములను కల్గించు జాగ్రత్స్వప్న సుషుప్తులననుభవించు విశ్వ తైజస ప్రాజ్ఞులతోడి తాదాత్మ్యమును వదలిపెట్టడం అత్యవసరం.
- జ్ఞేయము: తెలిసికొనదగినది. వివేకంతో, శ్రద్ధతో ఈ మూడు అవస్థలను అధిగమించడం వల్ల కల్గే తురీయావస్థయే జ్ఞేయము.
- ప్రాప్యము: పొందదగినది. వివేకము, మాయా రాహిత్యము, మౌనము.
- అవాక్యములు: నిష్ప్రయోజనములైన భావములు మనలోని పైశాచికమైన పశుత్వభావములగు రాగద్వేషాదులు నిష్ప్రయోజనములుగా భావించతగినవి.