గ్రహణగ్రాహకాభాసం విజ్ఞాన స్పందితం తథా ॥
భావం: ఆ లాతము (దివిటి) తిరిగేటప్పుడు ఎన్నో ఆకారాలు ఏర్పడుతున్నాయి. అట్లే ఆత్మతో స్పందనము కల్గినప్పుడు జ్ఞాత, జ్ఞేయము వంటి భేదము లుద్భవిస్తున్నాయి.
వివరణ: ఈ ఆలాత చక్రమును ఉదహరించడం మైత్రాయణి ఉపనిషత్తులో ఉంది. దీన్ని గౌడపాదుడు, బౌద్ధులు గూడా గ్రహించారు. సాధనలకు నిత్య పరిచితమైనవాటితోనే జ్ఞానాన్ని వివరించడం సద్గురువు లక్షణం. దివిటీ లేదా కొరవి మండుతున్నప్పుడు దాన్ని రకరకాలుగా తిప్పడం ద్వారా చిత్రచిత్రములైన ఆకృతులు ఏర్పడుతాయి. వీటన్నింటికీ మూల కారణం ఆలాతం యొక్క మండుతున్న అగ్రభాగామే. అది తెల్సినవారికి ఆశ్చర్యం కల్గదు. కాని చూస్తున్న అజ్ఞానులకు, బాలురకు మాత్రం అది విచిత్రంగా, నిజంగా భాసిస్తుంది. స్వస్వరూపం తెల్సినవానికి దృశ్యజగత్తుమాయగా తెలుసుంది. మిగిలిన వారందరికీ ఇది వాస్తవంగా భాసిస్తుంది.
కారిక-48: అస్పందమాన మాలాతం అనాభాసమజం యథా ।
అస్పందమానం విజ్ఞానం అనాభాసమజం తథా ॥
భావం: ఆలాతం చలించనప్పుడు దానియందునానా రూపాలు లేవు. అట్లే ఆ చైతన్యం తన భావనలతో చలించనప్పుడు దాని యందు ఏ వికారాలు ఉండవు అది స్థిరంగా ఉంటుంది.
వివరణ: శుద్ధ చైతన్యం అవికారం స్థిరమైనదైనప్పటికీ చలనం కల్గినట్టు కన్పిస్తుంది. కారణం బాహ్య క్రియలందువ్యక్తం కావడమే. అచలమైనదానియందు ఆభాసగా చలనం, స్థిరమైనదానియందు ఆభాసమగు వికారము వివరించడానికి ఆలాతమును ఉదాహరణంగా గ్రహించాడు. ఆలాత చలనం ఆగిపోయినవెంటనే చూచేవారి దృష్టి దాని అగ్రభాగం నందే నిలుస్తుంది. అట్లే జ్ఞాని అతీత స్థితిలో తన్ను తనయందే చూచుకుంటున్నాడు. అతనికి నానాత్వ విశిష్ట ప్రపంచం లేనిదే.
కారిక-49: ఆలాతే స్పందమానే వైనా--భాస అన్యతో భువః ।
నతతో-న్యత్ర నిస్పందాన్నాలాతం ప్రవిశన్తి తేః ॥
భావం: ఆలాత చంక్రమణంలో ఏర్పడే ఆకృతులన్నీ మరొక చోట నుండి రాలేదు. ఆలాతం నిల్చినపుడు అవన్నీ మరొక చోటికి పోలేదు. లేదా కనీసం ఆలాతం మొదలతో (అగ్రం) వెలిగే అగ్నియందు కూడా ప్రవేశించలేదు.
వివరణ: ఆలాతం స్పందించేటప్పుడు ఏర్పడే చిత్రాకృతులు భ్రాంతి దృశ్యాలే. అవి ఒకచోటనుండి రాలేదు. మరొకచోటకి పోవడం లేదు. కనీసం ఆలాతాగ్రం లోనికి కూడా పోవడంలేదు. కారణం అవి అక ్కడ నుండి పుట్టలేదుకదా. ఈ ఉపమానంతో ఆత్మయందు సమన్వయాన్ని తర్వాతి శ్లోకంలో వివరిస్తాడు.
కారిక-50: ననిర్గతా ఆలాతా త్తే ద్రవ్యత్వాభావ యోగతః ।
విజ్ఞానే-పి తథైవస్యురాభాసస్యా విశేషతః ॥
భావం: ఆభాసమైన ఈ దృశ్యములకు ద్రవ్యగుణము లేకపోవడంవల్ల అవి ఆలాతాగ్రమునుండి బయలువెడలుటలేదు. అట్లే ప్రపంచం కూడా సత్తా లేనిది కావడంవల్ల ఆభాసమానమే. కావున అది సత్యతత్త్వం నుండి బయలు వెడలలేదు
వివరణ: ‘‘ఒకఇంటనుండి ఏదైన బయటపడినట్లు ఆ దృశ్యములు ఆలాతము నుండి బయటపడలేదు’’ అని శంకరులు ఇంకా స్పష్ట పరచినారు. ఒక పదార్థం నుండి మరియొక పదార్థం విభిన్నమైనదే బయలు పడగలదు. కాని తననుండి తానే బయల్పడదు. ఒక స్త్రీనుండి ప్రత్యేక వ్యక్తిత్వం కల్గిన శిశువు బయల్వెడగలడు గాని తనను తానే సృష్టించుకోలేదుకదా!
అదేవిధంగా ఆలాతాగ్రం నుండి వెలువడిన చంక్రమణాలు అసత్యాలు. అవి ఆలాతాగ్రం నుండి వెలువడ జాలవు. అట్లా ఆలాతాగ్రంలోనికి ప్రవేశించలేవు. ఇంద్ర ధనుస్సు అలాంటిదే. ఎక్కనుండో రాలేదు. ఎక్కడికో పోలేదు. అది కేవలం ఆకాశంలో కన్పించే మాయా దృశ్యమే. అట్లా శుద్ధ చైతన్యం మనసుతో సంబంధం కల్గినప్పుడు అది కూడా చలిస్తున్నట్లు కన్పిస్తుంది. ఈ బంధమే నానావిధ నామరూపాత్మకంగా మారింది. ఇవి మిథ్య కాబట్టి దీని నుండి ప్రపంచం పుట్టలేదు. అసల పుట్టిన ప్రపంచం మళ్ళీ ఆ శుద్ధచైతన్యంలో చేరే ప్రసక్తే ఉండదు.
కారిక-51: విజ్ఞానే స్పందమానే వై నా--భాసా అన్యతోభువః ।
నతతో-న్యత్ర నిష్పందాన్న విజ్ఞానం విశన్తితే ॥
కారిక-52: ననిర్గతాస్తే విజ్ఞానాత్ ద్రవ్యతౌభావ యోగతః ।
కార్యకారణ తా భావాద్యతో-చిన్త్యః సదైవ తే ॥
భావం: విజ్ఞానమగు ఆ చైతన్యం స్పందనతో కూడినప్పుడు ఆభాసమానమగు ఆ చిత్ర దృశ్యములు మరియొక స్థలం నుండి వచ్చిచేరినవని చెప్పలేము. ఆ చైతన్యం నిష్పందమైనప్పుడు ఆ దృశ్యములు అచట నుండి మరియొక స్థలమునకు పోలేదు. ఆ దృశ్యములు ఆ చైతన్యంలోనికే ప్రవేశించలేదు. అవి అసత్యం కావడం వల్ల సత్యమైన పరమాత్మ నుండి వెలువడలేవు.
ఆలాతము - ఆధ్యాత్మిక చైతన్యం ఈ రెంటికి గల సమాన ధర్మము ఈ రెండు శ్లోకాలలో వివరించబడిరది.
వివరణ: జగత్తు మిథ్య. కావున అది పరమాత్మనుండి వెలువడలేదు. కాని జగత్తునందలి సుఖదుఃఖాలు మనలను బంధించడం వల్ల అది అత్యంత సత్యంవలె భాసిస్తుంది. కాని అది ఎట్లో వివరించడం ప్రతి వేదాంతికి అసాధ్యమే. సత్యతత్త్వం నుండి ఈ మిథ్యా ప్రపంచం రాలేదు. సత్యంనుండి అసత్యం రాలేదు. కాని మనకు సత్యంవలె భాసిస్తుంది. మనమా బ్రాంతిలో ఉన్నప్పుడు దీని నుండి బయట పడలేము. దీనికి మార్గం ఒక్కటి. ‘‘స్వయం సృష్ట మోహాన్ని ఛేదించుకొని మనం ఆ భ్రాంతి నుండి బయటపడడమే’’ (భ్రాంతివదలిన బ్రహ్మమ్ము బట్టబయలు) వేదాంతశాస్త్ర లక్ష్యమిదిమే.
ఆ పరమాత్మ నుండి ఈ ప్రపంచం ఎలా వచ్చింది అని వివరించడం అసాధ్యం. అత్యంత వివేకశాలియైన గౌడపాదుడే ఈ విషయం నిరూపించడం అసాధ్యం అంటున్నాడు. కారణం తర్కశాస్త్రం పరిమితియే దీనికి కారణం. కార్యకారణ న్యాయమే తర్కశాస్త్రానికి మూలం. ఆ న్యాయం మిథ్య కాబట్టి ఇక్కడ అది పనిచేయదు. మనోబుద్ధుల హేతువాదం అనే తీవ్ర ఉష్ణంలో ఆవిరియైనప్పుడు మాత్రమే కార్యకారణతను అధిగమించ గలం. శుద్ధచైతన్యంలో ఎట్టి కార్య కారణములు ఉండవు. అద్వైత తత్త్వంలో మరియొకటి పుట్టదు.
క్రియావంతమైన చైతన్యం: జాగ్రత్స్వప్నాలలోని విశ్వ తైజసులు.
నిష్క్రియమైన చైతన్యం: సుషుప్తిలోని ప్రాజ్ఞుని సృష్టిలయములు రెండూ మిథ్యే. ఈ జాగ్రత్స్వప్న సుషుప్తులు అనే వ్యవస్థ అజ్ఞానమై బాల్యదశలో ఉంటే మనస్సుకు వివేకం చెప్పే కట్టు కథే.
కారిక-53: ద్రవ్యం ద్రవ్యస్య హేతుః స్యాదన్యదన్యదన్యస్య చైవ హి ।
ద్రవ్యత్వ మన్వభావో వాధర్మాణాం నోప పద్యతే ॥
భావం: ఒక ద్రవ్యము మరొక ద్రవ్యమ నుండి పుట్టదు. ద్రవ్యము కాని దానికి అట్టి ద్రవ్యం కానిదే ఆ ద్రవ్యమే కారణమగుచున్నది. ఈ జీవులు ద్రవ్యము కాదు. అద్రవ్యము కాదు.
వివరణ: ఇక్కడ అద్రవ్యము అనే పదము వస్తుధర్మాన్ని వస్తుగుణాన్ని సూచిస్తుంది. పరస్పర సంబంధము కల్గినట్టి, మనస్తత్త్వ శాస్త్రమునకు సంబంధించిన భావ ప్రపంచంతో అద్రవ్యము అద్రవ్యమునే సృష్టించగలదని తెలుస్తుంది. ప్రేమ, దయ ఇత్యాది అద్రవ్యములు ఇతరులయందు అట్టి గుణములనే అనగా ప్రేమ ప్రేమనే, ద్వేషం ద్వేషాన్నే ఉత్పన్నం చేస్తున్నాయి. జీవుడు ద్రవ్యంకాదు అద్రవ్యం కాదు. అందుకే మరొకటి దీనిని ఉత్పత్తి చేయలేదు.
కారిక-54: ఏవం న చిత్తజా ధర్మాశ్చిత్తం వాపిన ధర్మజం ।
ఏవం హేతు ఫలాజాతిం ప్రతిశన్తి మనీషిణః ॥
భావం: బాహ్యమందలి ఇంద్రియ గోచర వస్తువులు మనస్సుచే సృష్టించబడినవి కావు. మనస్సుకూడా ఆ వస్తువులచే సృష్టించబడినదికాదు. కావున జ్ఞానులు (ధీమంతులు) ‘‘అజాత సిద్ధాంతాన్ని’’ (హేతు ఫలాజాతిని) గ్రహించినారు.
వివరణ: వేదాంతము మానవుని పరిస్థితులనుండి విముక్తుణ్ణి చేసి, ఆరోగ్యకరమైన ఆకాంక్షలతోను, దృఢమైన విశ్వాసంతోను జీవితాన్ని ఎదుర్కొనే వాస్తవమైన ఒకతత్త్వమునే మనకిచ్చుకున్నది. మానవుడు ప్రకృతికి బానిసకాడు. అతనికి అనుకూలంగా, వినోదంగా ప్రకృతిని తోలుబొమ్మవలె ఆటలాండిరచవలసి యుండగా ఆత్మనాశనకరమైన శ్రమతో మరచిపోయినాడు.
పైన వివేకంతో చేయబడిన నిరూపణం చేత వస్తుప్రపంచము అసత్యమగుట వలన స్వయముగా మనకది ఒక మనస్సును ఉత్పత్తిచేయుజాలదని తెలుస్తుంది. మనలను ప్రపంచం ఉత్పత్తిచేయలేదు. మనంకూడా ప్రపంచ స్వప్నాన్ని సృష్టించలేదు. ప్రపంచ పరిస్థితులవల్ల మనం ఉత్పత్తి/నాశనం పొందడం లేదు. అందుకే ధీమంతులు అజాతవాదాన్ని గ్రహించినారు.
కారిక-55: యావద్ధేతు ఫలా వేశః తావద్ధేతు ఫలోద్భవః ।
క్షీణే హేతు ఫలావేశే నాస్తి హేతు ఫలోద్భవః ॥
భావం: హేతు ఫలములు (హేతువాదాన్ని) నమ్మేవానికి హేతు ఫలాలున్నాయి. కాని హేతుఫలావేశం క్షీణించిన వెంటనే హేతుఫలములు కూడా అదృశ్యమైతున్నాయి.
వివరణ: హేతువులు ఉన్నాయని విశ్వసించేవారికి ఆ హేతుఫలాలు క్రమబద్ధంగా వర్తిస్తాయి అని చెప్పడం ‘యద్భావం తద్భవతి’ అనే సిద్ధాంతాన్ని సూచిస్తుంది. పాప పుణ్యకర్మలుచేస్తూ తత్ఫలంగా పునర్జన్మ పొంది తత్ఫలితములను అనుభవిస్తాను అనే విశ్వాసంకలవానికి అదే కల్గుతుంది. కాని ఇదంతా భ్రమ, మాయా కల్పితం అనే ‘అజాతి’ నిర్ణయాన్ని దృఢంగా భావిస్తూ స్థిరపర్చకున్నవానికి హేతుఫలాలు వర్తించవు. పుణ్య పాపములు తత్తదనుభవములు అతనిని బాధించవు. శకునముల వంటి వాటిని నమ్మని వారికి వాటి ఫలితములు అంటనట్లే ఇదికూడా.
కారిక-56: యావద్ధేతు ఫలావేశః సంసారస్తావదాయతః ।
క్షీణే హేతు ఫలావేశే సంసారం న ప్రపద్యతే ॥
భావం: ఈ హేతు ఫలములందు విశ్వాసమున్నంత వరకు జనన మరణ రూప సంసారచక్రమున పరిభ్రమిస్తూనే ఉంటాం. ఆ విశ్వాసం నశించగానే సంసార చక్రం కూడ ఉండదు.
వివరణ: హేతు ఫలావేశ విశ్వాసం ఉన్నంతవరకు దాని వికారం, విచారం, నాశం, మరణం ఇత్యాది రూప సంసారానికి మనం లోనైపోతున్నాం. భౌతిక ప్రపంచం పైన మనో బుద్ధుల పరిధిలోను తమకు సంపూర్ణ అధికారమున్నప్పటికీ ఆధ్యాత్మిక సాధకులు ఇటువంటి అభ్యంతకర అశాంతి నుండి విముక్తులు కావడానికి కృషి చేయవలసినదే.
దేశకాల కారణక్షేత్రములోనే మనస్సు పనిచేయగలదు. దృఢమైన ఈ తత్త్వములు అధిగమించుటకు శాస్త్రజ్ఞానము, యుక్తి హేతువుల చేత కల్గిన వివేకము మాత్రమే ఉపయోగిస్తాయి. శాస్త్రపాఠముద్వారా, మనన నిధిధ్యాసలద్వారా హేతువాదం, కేవలం మిథ్యగా తెల్సినప్పుడు మనః పరిధిని తేలికగా దాటగలడు. ఈ విధంగా మనసును అధిగమించిన మాత్రముననే ఆత్మ తనను తాను తెల్సుకోవడానికి జాగృతమైతుంది. మనస్సు లయమైనప్పుడు జీవుడు కూడా అంతరిస్తాడు. జీవుడు అంతరించిన వెంటనే పరమాత్మ అభివ్యక్తమగును.
కావున మిథ్యాభావమైన హేతఫలం సిద్ధాంత జ్ఞానాన్ని దేశ కాలములకు అతీతంగా ధ్వంసం చేసినప్పుడే (ఎందుకంటే ఈ హేతుఫల సిద్ధాంతం కేవలం దేశకాల క్షేత్రమందు తప్ప ఇతరత్రానిలువజాలదు) మనస్సు అతీత స్థితిని చేరుతుంది. దేశకాలములు మార్పుచెందేవి, అనిత్యములు. పరస్పర సంబంధం కల్గినవి. కార్యకారణములు దేశకాలములనుసరించి ఉంటాయి.
ఈ వివేకం కల్గినవానికి పునర్జన్మ భావన ఉండదు. సుఖదఃఖ స్పర్శ ఉండదు. మృత్యువేదన ఉండదు.
కారిక-57: సంవృత్యా జాయతే సర్వం శాశ్వతం నాస్తి తేనవై ।
సద్భావేన హ్యజం సర్వముచ్ఛేదస్తేన నాస్తివై ॥
భావం: అజ్ఞానం వల్లనే జన్మజ్ఞానం కల్గుతుంది. వాస్తవానికి శాశ్వతమైనదేదీ లేదు. అన్నియు ఆ పరమాత్మలో ఐక్యం పొంది ఉన్నవి. కాబట్టి ఏదీ జన్మించలేదు. ఏదీ నశించజాలదు.
వివరణ: అజ్ఞానముచే సత్యంవలె భాసించే మిథ్యా ప్రపంచంలోని మిథ్యాను భవాలను ‘‘సంవృతి’’ అనేపదం తెలుపుతుంది. అజ్ఞాన ప్రపంచంలోని మాయా దృశ్యాలన్నీ అసత్యమే. ఉన్నదంతా అజమైన బ్రహ్మతత్త్వమే. జన్మమే లేనప్పుడు తన్నాశనమే ఉండదు. ఈ జనన మరణరూప సంసారచక్రం ఉండదు. ఈ శ్లోకం క్రిందపేర్కొన్న పూర్వపక్షి ఆక్షేపణకు సమాధానం.
ఆక్షేపణ: ‘‘వాస్తవములు ఇతరమైనదేదియు ఉండనే ఉండలేదనిన కార్యకారణముల యొక్క ఉత్పత్తి నాశనములను గూర్చి, సంసార రూపమైన జనన మరణములను గూర్చి మీరెట్లు చెప్పగల్గుతున్నారు?’’ జనన మరణములు సంబంధాపేక్షయా సంభవిస్తున్నాయి. జ్ఞాని సమస్త ప్రపంచాన్ని అద్వైతమైన ఆ పరమాత్మగానే అనుభవిస్తున్నాడు. కావున దేనియందు కూడా నాశనాన్ని చూడడు.
కారిక-58: ధర్మా స ఇతి జాయన్తే జాయన్తే తే న తత్త్వతః ।
జన్మ మాయోపమం తేషాం సాచ మాయా న విద్యతే ॥
భావం: ప్రత్యేక వ్యక్తిత్వముగల ఈ జీవులు జన్మించారని చెప్తున్నారు. ఆ పరమాత్మ దృష్ట్యా వాస్తవముగా జన్మయే అసంభవమైనది. కావున జన్మ అనునది. మిథ్యా పదార్థము వలె ఉంది. అట్లే మాయకూడా వాస్తవానికి లేదు.
వివరణ: ఈ ప్రపంచ భావనకు అజ్ఞానమే కారణమని వాస్తవానికి ప్రపంచం ఉద్భవించలేదు. కాని ఉద్భవించినట్లు కన్పిస్తుంది. ఈ మాటతో సాధకుని మదిలో ‘‘జ్ఞానముకంటె భిన్నంగా అజ్ఞానం ఒకటి ఉందేమో’’ అనే సందేహం కల్గుతుంది, దీన్ని పోగొట్టడానికే మాయ అనేదికూడా అసలులేదు అని దృఢంగా చెప్తున్నాడు. మాయా సృష్టమైన మాయ అభావ స్పష్టమైన అభావము. కాబట్టి ఈ జగత్తు వ్యంధ్యా పుత్రుని యొక్క ప్రథమ పుత్రిక వంటిది. ఆమె వివాహ మహోత్సవం అత్యంత అసంభవం. ఆమె తండ్రీ అజాత మిథ్యామూర్తి కదా!
కారిక-59: యాథామాయా మాయాద్బీజాజ్జాయతే తన్మయోంకురః ।
నాసౌ నిత్యో న చో చ్ఛేదీ తద్వద్ధ ర్మేష యోజనా ॥
భావం: ఐంద్రజాలకుడు మాయచేత సృష్టించిన విత్తునుండి అట్టి మాయాంకురమే మొలకెత్తుచున్నది. అట్టి మొక్క శాశ్వతం కాదు. జీవులు కూడా అట్టివారే.
వివరణ: మాయకు ఏదైనా సంభవమే అని చెప్పేందుకు ఈ ఉదాహరణ చెప్పబడిరది. స్వప్నంలోని మిథ్యా వివాహం అట్టి పుత్రుననే పుట్టించగలదు. ఒక మాయ మరొక మాయను సృష్టించగలదు. ఈ మాయ అజ్ఞాన స్వరూపమే అది అట్టి ప్రపంచాన్ని సృష్టించగలదు. ఉదాహరణణకు వీధిలో గారడీవాడు తన మాయచే ఒక విత్తును ముందు సృష్టించి, దాన్ని భూమిలో పాతి, నీరుపోసి కొన్ని క్షణములలోనే మొక్కగా చూపిస్తున్నారు. మరి కొన్ని క్షణములలోనే మొక్క పెరిగి పెద్దై దానినిండా కొమ్మలకు పండ్లు కాస్తున్నాయి. వాటిని కోసి ముక్కలను ప్రేక్షకులకు ఇస్తున్నాడు. అందరూ దాన్ని నిజమైన పండు వలెనే తింటున్నారు. కొన్నిక్షణముల తర్వాత ఆ చెట్టు మాయమైంది
అట్లే జీవులు, జగత్తు కూడా. అంతా మాయా ప్రభావమే. చివరకు ఋజువైనది అజాతవాదమే.
కారిక-60: నాజేషు సర్వ ధర్మేషు శాశ్వతా శాశ్వతాభిధా ।
యత్ర వర్ణ న వర్తన్తే వివేక తత్ర నోద్యతే ॥
భావం: శాశ్వతమైనది, అశాశ్వతమైనది అను విశేషణములు అజమైన జీవులలో అనువర్తించజాలవు. ఏదైతే పదములచే వర్తింప శక్యముకాదో దానిని సత్యమైనదని గాని, అసత్యమైనదని గాని బుద్ధి వివేకించి చెప్పజాలదు.
వివరణ: ప్రపంచం మిథ్యయని అనుభవముచే తెలిసికొనిన పిమ్మట వివేకము అంతమొందుచున్నది. ఒకవ్యక్తికి ఈ ప్రపంచం సత్యమని తోచుచున్నంతవరకు అసత్యంనుండి సత్యాన్ని, మిథ్యనుండి తత్త్వమును పరిశోధించుటకై వాని వివేకం పరిశ్రమించవలసి ఉంటుంది. తాడు యొక్క జ్ఞానం కల్గిన తర్వాత అది త్రాడా? పామా? అని వివేకించవలసిన పని లేదు కదా! వాస్తవమైన తాడు చూచేవానికి మాయ పాము భయాన్ని కల్గించలేదుకదా!
మిథ్యాతత్త్వము స్పష్టంగా తెలిసిన పిమ్మట కల్గిన వివేకంవల్ల సత్యమా, అసత్యమా, శాశ్వతమా, అశాశ్వతమా అనే సందేహము కల్గదు.
కారిక-61: యథాస్వప్నే ద్వయా భాసం చిత్తంచలతి మాయా ।
తథా జాగ్రద్వయా భాసం చిత్తం చలతి మాయా ॥
భావం: స్వప్నంలో మనసు ద్విధావిభక్తమై తాను పనిచేయుచున్నట్లు, తానే వివిధ దృశ్యాలను చూస్తున్నట్లు భ్రాంతి చెందుతుంది. అట్లే జాగ్రదవస్థ కూడా మనస్సు ద్వారా పనిచేస్తూ నానారూపాలను చూస్తున్నది.
కారిక-62: అద్వయం చ ద్వయాభాసం చిత్తం స్వప్నేన సంశయ ।
అద్వయంచ ద్వయాభాసం తథా జాగ్రన్నసంశయ ॥
భావం: ఒక్కటే మనస్సు స్వప్నంలో వివిధంగా విభక్తమైతుంది. ఇది మనకు నిస్సంశయంగా తెలుస్తూనే ఉంది. అట్లే జాగ్రత్తలో కూడా మనస్సు వివిధంగా విభక్తమైన నిశ్చయంగా తెలుస్తుంది.
కారిక-63: స్వప్నదృక్ ప్రచరన్ స్వప్నే దిక్షువై దశసు స్థితాన్ ।
అండ జాన్ స్వేదజాన్ వాపి జీవాన్ పశ్యతి యాన్ సదా॥
భావం: స్వప్నంలో చూసే అండజ, స్వేదజ వంటి వన్నీ చరించే దిక్కులన్న మనో భావాలే గాని వేరు కావు. వాటికి వాని మన కన్నా భిన్నమైన అస్తిత్వం లేదు. అట్లే స్వప్నంలో చూసే దారాపుత్రాదులు కూడా మనో భావములే. అట్లే జాగ్రదవస్థలు కూడా ప్రతి అనుభవం మనఃకల్పితమే అగుచున్నది.
కారిక-64: స్వప్నే దృక్చిత్త దృశ్యాన్తే న విద్యన్తే తతః పృథక్ ।
తథాతద్దృశ్యమే వేదం స్వస్నదృక్చిత్త మిష్యతే ॥
భావం: స్వప్నంలో కన్పించేవన్నీ మనస్సు కంటె భిన్నమైనవి కావు. వాటికి స్వతంత్రమైన అస్తిత్వం లేదు. స్వప్నస్థుడు (తెజసుడు) గ్రహించు విషయాలన్నీ వాని మనస్సు కన్నా భిన్నములు కావు.
వివరణ: నానా రూపులుగానున్న దృష్టి వస్తు జగత్తంతా భ్రాంతిలోనున్న మనస్సు చేత కల్పించబడినదే. స్వాప్నికమైన భావనలే స్వప్నద్రష్ట యొక్క మనస్సు, కలలో వివరించేటప్పుడు చూసేదృశ్యాలన్నీ, పదార్థాలన్నీ జీవులన్నీ మనస్సుచేత సృష్టించబడినవే. ఆ స్వస్నంలో సంచరించే ‘‘నేను’’ కూడా నా మనస్సు కన్నా వేరు కాదు. అదే నాకు శ్రమగా తెలుస్తుంది. స్వప్న సంబంధమైన మనస్సు స్వయం కల్పితం కాబట్టి అదే కల్పిత వస్తుప్రపంచాన్ని కూడా సృష్టించగలదు. అందుకే స్వప్నాన్ని మనోగతంగా నిర్ణయించగలం. అటువంటిదే జాగ్రదవస్థకూడా!
కారిక-65: చరన్ జాగరితే జాగ్రద్ధక్షు వైదశసు స్థితాన్ ।
అండజాన్ స్వేదజాన్ వాపి జీవాన్పశ్యతి యాన్పదా ॥
కారిక-66: జాగ్రచ్చిత్తే క్షణీయాస్తే న విద్యన్తే తతః పృథక్ ।
తథా తద్దృశ్యమే వేదం జాగ్రతశ్చిత్త మిష్యతే ॥
భావం: అండజ స్వేదజాది జీవులు, దశదిశలలో చరించుట వంటి సమస్త దృశ్యాలు జాగ్రదావస్థలోని విశ్వుని మనోవిషయములే. మనస్సు కూడా విశ్వుని గోచరించు విషయం మాత్రమే. గ్రహించువానికన్నా వాని మనస్సు వేరుకాదు.
వివరణ: తైజసుని అనుభవాలకన్నా విశ్వుని అనుభవాలు ఏ విధంగా కూడా వేరైనవి కాదు. వైతథ్య ప్రకరణంలో వివరించిన వాటినే మళ్ళీ వక్కాణిస్తున్నారు.
కారిక-67: ఉభౌ హ్య న్యోన్య దృశ్యేతే కింతదస్తీతి నోచ్యతే ।
లక్షణాశూన్య ముభయం తన్మతే నైవ గృహ్యతే ॥
భావం: మనస్సు, ఈ జీవులు రెండును పరస్పర గ్రాహ్య విషయములై ఉన్నాయి. ఒకటి లేక మరొకటి తెలుసుకోలేము. కాబట్టి ఈ రెండిరటికి ఇతరము నుండి వేరు చేయ ప్రత్యేక లక్షణాలు ఏవీలేవు.
వివరణ: శబ్ద స్పర్శ రూప రసాది ఇంద్రియ విషయములద్వారా మనస్సు సదా ప్రేరింపబడుతున్నది అందుకే విషయములను గ్రహించేది మనస్సుగా మారింది. దీన్నే మనం సత్యంగా భావిస్తున్నాం. విషయములు లేనపుడు మనస్సు లేదు. కావున ఈ రెండిటికే పరస్పర సంబంధం. ఇవి రెండూ సత్వంకాదు. జ్ఞాతకు, జ్ఞేయానికి, జ్ఞానానికి ఈ మూడిరటిలో దేనికికూడా స్వతంత్రత లేదు. ఇంద్రియ విషయము తెలియు మనస్సు కంటె వేరుకాదు. శబ్ద స్పర్శాది విషయములు, వానిని గ్రహించే శ్రోత్రాది ఇంద్రియములకంటె భిన్నములు కావు. కావున మనస్సు కేవలం ఇంద్రియములకు కేంద్రంగా ఉంది. ఒక పుష్పమును చూచినప్పుడు దాని ఆకారం మనస్సులోని దృశ్యం కన్నా వేరుకాదు. మనో దృశ్యం మనస్సు కంటె వేరుకాదు. మనస్సుచేత మాత్రమే విషయములు గ్రహింపబడుతున్నాయి. ఆ విషయాలు మనపై ప్రభావం చూపినప్పుడే మనస్సుకు అస్తిత్వము. కల్గుతుంది.
కారిక-68: యథాస్వన్నమయోజీవో జాయతే మ్రియతే-పిచ ।
తథా జీవా అమీ సర్వే భవన్తి న భవన్తి చ ॥
కారిక-69: యథామాయా మయో జీవో జాయతే మ్రియతే-పి చ ।
తథా జీవా అమీ సర్వే భవన్తి న భవన్తి చ ॥
కారిక-70: యథా నిర్మితకో జీవో జాయతే మ్రియతే-పి వా ।
తథా జీవా అమీ సర్వే భవన్తి న భవన్తి చ ॥
భావం: 68: స్వప్నంలో జీవులు కనబడి మాయమైనట్లే జాగ్రదవస్థలో కన్పించే జీవులు కుడా కనబడి మాయమైతున్నారు.
భావం: 69: మాయచేసృష్టింప బడిన జీవులు బయల్వెడలి మాయమగుచున్నట్లు జాగ్రదవస్థలోని జీవులు కనబడి మాయమైతున్నారు.
__భావం: __70: చేతితో నిర్మించబడిన నకిలీజీవులు కనబడి అంతర్ధానము చెందినట్లే జాగ్రదవస్థలోని జీవులు కూడా కనబడి మాయమైతున్నారు.
వివరణ: స్వప్నము, జాగ్రదవస్థ, ఇంద్రజాలము అనే మూడు పరిస్థితులలో మనం పొందుతున్న అనుభవాలను సమానమని, ఇవన్నీ భ్రాంతి రూపకమైన మాయయే అని సిద్ధాంతరీకరిస్తున్నాడు. స్వప్నమును ఎవ్వరూ, పామరుడుకూడా, సత్యమని నమ్మడు. అట్లే ఇంద్రజాలంలో మాయా ఏనుగును ఎవరూ నిజమనుకోరు. అది మాయమైతే బాధపడరు. కాని కేవలం జాగ్రదవస్థలోని వాటినే సత్యంగా భావిస్తున్నాం. కాని అది కూడా స్వప్న, మాయా స్థితి వంటిదే. జనన మరణాదులన్నీ నామరూపములను మనోవిషయములుగానే ఉన్నాయి. వాటికి ప్రత్యేక సత్తాలేదు. అవి పరిపూర్ణ తత్త్వాన్ని కల్గిలేవు
కారిక-71: న కశ్చిత్ జాయతే జీవః సంభవోస్య న విద్యతే ।
ఏతత్త దుత్తమం సత్యం యత్రకించిన్నజాయతే ॥
భావం: ఏ జీవుడూ ఎప్పుడూ పుట్టలేదు. అట్టి జన్మకు ఎట్టి కారణం లేదు. ‘‘ఎప్పుడు ఏదీ జన్మించలేదు’’ అన్నదే ఉత్తర సత్యం.
వివరణ: 3వ అధ్యాయంలోనే చెప్పబడినది. ఇదే శ్లోకం (48) గౌడపాదుని మతానికి సారభూతమైన సంపూర్ణ అజాతవాదం ఇదే. వశిష్ఠ గౌడపాదులు సనాతన అజాతవాదాన్ని బోధించినారు. శంకరులు దాన్ని కొంచెం మార్చి నవీన శకంగా ‘‘సంబంధరూపేణ జగత్సత్యం’’ అని చెప్పడం కొంతచ్యుతము కావడమే. కాని వశిష్ఠ గౌడపాదులు విశ్రాంతి కోసంకూడా మారరు. తమ స్థానంలోనే స్థిరులై
ఉంటారు. జాతము వట్టిభ్రమ. అజాతమే పరమసత్యవర్ణనము. ద్వైత ప్రపంచాన్ని చూసి కరణం వెతికేవాడు ఆకాశంలో ఎగిరే పక్షుల పాదముల గుర్తులను వెతికే మూర్ఖుని వంటివాడే. ఏదీ జన్మించలేదు కాబట్టి జగద్కారణం ఏదీలేదు. ఉత్తమ తత్త్వం కన్నా ఏదీ లేదు.
కారిక-72: చిత్తస్పందితమే వేదం గ్రాహ్య గ్రాహక వద్ద్వయం ।
చిత్తం నిర్విషయం నిత్యమసంగం తేన కీర్తితం॥
భావం : జ్ఞాతృ, జ్ఞేయ సంబంధంతో గ్రాహ్యగ్రాహక సంబంధంతో లక్షితమైన ఈ ద్వైత ప్రపంచం కేవలం చిత్తం యొక్క స్పందన వల్ల కల్గినదే. వాస్తవానికి మనస్సు ఎట్టి వస్తువుతో సంబంధం కల్గి ఉండదు. కాబట్టి అది నిత్యమైనదే.
వివరణ: మనస్సు నిర్విషయం. నిత్యం అసంగతం. ఎందుకంటే ఈ ప్రపంచం కేవలం మనః కల్పితమే. మనసుకు విషయములకు గల సంబంధం వల్లనే ఈ ప్రపంచం గ్రహింపబడుతుంది. స్వయంగా మనస్సుకు అస్తిత్త్వం లేదు. మనస్సు ఆత్మయందు ఆరోపితమైనదే. పరమాత్మ దృష్ట్యా మనస్సు మిథ్యే. స్వయంగా అస్తిత్త్వం లేని మనస్సు ఆత్మ కన్నా భిన్నం కాదు. కాబట్టి మనస్సుతో విషయాలకు గాని, విషయాలతో మనస్సుకుగాని ఎట్టి సంబంధం లేదు. ఉదాహరణకు తాడు దృష్ట్యా పాముకు విషంగాని, చూపరులను భయపెట్టే సామర్థ్యం ఉండదు గదా!
కారక-73: యోస్తి కల్పిత సంవృత్యా పరమార్థేన నాస్త్య సౌ ।
పరతంత్రాభి సంవృత్యా స్యాన్నాస్తి ఏకమార్థతః ॥
భావం: కల్పితమైన మాయదృష్ట్వా ఉండేది. నిజానికి లేనిదే. ఇతర సిద్ధాంతాల దన్నుతో ఏదైతే ‘ఉంది’ అని చెప్పబడుతుందో అది కూడా పరమార్థంలో లేనే లేదు.
వివరణ: ప్రతివాది ప్రశ్న:- మనస్సుకు బాహ్యవస్తువుతో ఎట్టి సంబంధం లేనప్పుడు ప్రపంచమంతా లేనిదే అనిచెప్పినప్పుడు గురువు, శిష్యుడు శాస్త్రగ్రంథం వంటివి ఏవికూడా లేనివే కదా?
గౌడపాదునిజవాబు :- పరమాత్మ దృష్ట్యా ఆత్మానందాన్ని అనుభవించే క్షణంలో గురువు, శిష్యుడు, శాస్త్ర గ్రంథము కూడా మనో భ్రాంతిగా మిగులుతున్నాయి. కాని ఇది ఆత్మరక్షణకు అంటే కోట్ల కొలది అపవిత్ర భావనల నుండి పవిత్రభావనలను కాపాడుటకు మాత్రమే ఏర్పరచబడినాయి. స్వప్నం కూడా మనస్సును అధికతరమైన చైతన్యానికి తీసుకుపోయేది భయంకర దృశ్యమేకదా! అట్లే మనోవ్యాపారాలల్లో తీవ్రమైన ధ్యానం మనస్సు నందలి అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని దర్శింప చేయగలదు. దీనికంతా శాస్త్రాధ్యయనం, గురుబోధ అవసరం. బ్రహ్మతత్త్వానికి వ్యతిరేకంగా ఎవరెన్ని సిద్ధాంతాలను బోధించినా అవన్నీ సత్యం కావు. అవేవీనిల్చవు. ఎక్కువమంది ఉన్నాయి అనుకున్న మాత్రాన అవి ఉండవు. అట్లే ఎక్కువమంది వ్యతిరేకించినా బ్రహ్మతత్త్వమే మనలను నిత్యం పాలిస్తున్నది.