అనాదియైన కారణము తప్పక జన్మరహితమైన అజమై ఉండవలెను. అనాది అనంతముగా కూడా ఉండవలెను. శాశ్వతముగా మార్పులేనిది అని అర్థం. కార్యముగా మారడం మార్పేగదా! అనాదియైన కారణంనుండి జగత్తు ఉద్భవించిందని చెప్పడం అగ్ని మంచుగడ్డనుండి పుట్టిందనడం వంటిది. సృష్టి కారణాన్ని వివేకంతో భేదిస్తూ మనకు దేశ కాలములపై ఉండే విశ్వాసాన్ని పోగొడ్తున్నాడు గౌడపాదుడు. కారణం మనో బుద్ధులకు అవధులు దేశ కాలములే. ఈ మూడూ నశిస్తే మిథ్యా జగద్భావన అంతరిస్తుంది అదే ఆత్మానుభవం.
మనోబుద్ధులను అధిగమించి తద్వారా ఆ క్షణమునందలి అనుభవము నొందుటే మన లక్ష్యం. దేశ, కాల, కారణములనే మూడిరటి లోననే మనస్సు పరిమితమైతుంది. ఈ మూడూ ఒక్కటిగా మారి సాధనగా మారుతుంది. కాల, కారణములు లేకుండా ప్రదేశం ఉండదు. కారణం, దేశములు లేకండా కాల ముండదు. కాల, దేశములు లేకుండా కారణముండదు. దీన్ని వివేకులు భావిస్తే నిత్యంగా, సత్యంగా కన్పించే జగత్తు మిధ్య అని తెలుస్తుంది.
కారిక-24: ప్రజ్ఞప్తేః సనిమిత్తత్వ మన్యథా ద్వయనాశతః ।
సంక్లేశస్యోపల బ్దేశ్చ పరతం త్రాస్తి తా యతః ॥
భావం: వస్తుజ్ఞానమునకు తద్విషయ భూత వస్తువులే కారణము కావలెను, లేకున్న ఈ రెండూ నశించవలసినదే. ఈ కారణము చేత దుఃఖాదుల అనుభవమును పొందుట చేతను ద్వైతులంగీకరించిన బాహ్యవిషయములయొక్క అస్తిత్వమును స్వీకరించవలెను.
వివరణ: ప్రజ్ఞప్తి అంటే వస్తుజ్ఞానము. అంటే శబ్దస్పర్శరసాదుల ఇంద్రియజ్ఞానము. దీనికి బాహ్యవిషయములే కారణము. పూర్వపక్షులు ‘‘వన్తవులుండుటచేతేనే తద్విషయక జ్ఞానము పొందుతాము’’ అంటారు . దీన్ని ఖండిస్తూ గౌడపాదుడు బుద్ధి దర్శన సిద్ధాంతముతో దృశ్యవస్తు ప్రపంచమును మాయగా కొట్టి పారవేస్తాడు.
బాహ్యార్థవాదులు: వీరు బౌద్ధులలో ఒకతెగ. వీరికి బాహ్యవస్తు ప్రపంచం సత్యం. మనకీప్రపంచంలోని వస్తుజ్ఞానం కల్గుతుంది కాబట్టి, ప్రపంచంలోని దుఃఖాదులను భవిస్తున్నాం కాబట్టి వస్తు ప్రపంచం సత్యమేనని వీరి వాదం. (సాంఖ్యులు, వైశేషికులు కూడా జగత్సత్యవాదులే)
విజ్ఞానవాదులు: వీరుకూడా బౌద్ధులలోని తెగ. వీరి ప్రకారం ‘‘ఆత్మీయంగా వాసనరూపంలో అన్ని వస్తువులు అస్తిత్త్వం కల్గి ఉన్నాయి’’. హేతువాదం ప్రకారం పదార్థ భావనను అంగీకరించవచ్చు కాని పరమసత్యం దృష్ట్యా చూస్తే, వస్తుస్వభావాన్ని గమనిస్తే ఈ కారణము కారణమే కాదు.
కారిక-25: ప్రక్షిస్తేః సనిమిత్తత్వం ఇష్వతే యుక్తి దర్శనాత్ ।
నిమిత్త స్వాని మిత్తత్వం ఇష్వతే భూత దర్శనాత్ ॥
భావం: యుక్తితో చూచినంతవరకు జగత్తు సత్యమే అని అంగీకరించవచ్చు. కాని బుద్ధ దర్శన సిద్ధాంతం ప్రకారం నానాత్వ విశిష్ట ప్రపంచమంతా మాయయే.
వివరణ: విజ్ఞాన వాదుల యొక్క ఈ వాదం బాహ్యర్థ వాదుల యొక్క మతాన్ని నిరసించుట గైకొన్నారు. వేదాంత అంటేకేవలం విజ్ఞానవాదం మాత్రమే కాదు. పరతత్త్వస్థాపనే దాని గమ్యం.
కారిక-26: చిత్తం న సంస్పృశత్యర్థం నార్థాభాసం తథైవ చ ।
అభూతో హి యతశ్చార్థో నార్థా భాసస్తతః పృథక్ ॥
భావం: చిత్తము బాహ్య విషయములను స్పృశించదు. బాహ్య విషయములవలె తోచు భావములు కూడా చిత్తములో భ్రాంతిని కల్గించవు. బాహ్యవిషయములవలె భాసించు భావములు చిత్తము కంటె భిన్నములు కావు.
వివరణ: కానివిజ్ఞానవాదము, జగత్సత్య భావము రెండు, విరుద్ధమైనవి. జగత్సత్య వాదాన్ని ఖండిరచడానికి విజ్ఞానవాదాన్ని వాడుకుంటాడు గౌడపాదుడు.
‘‘ప్రపంచంలోని వస్తువుల జ్ఞానం మనకు కల్గడంవల్ల, అందలి దుఃఖాదులను అనుభవించడంవల్ల జగత్తుసత్యం’’ దీన్ని విజ్ఞానవాదులు ఖండిస్తూ దుఃఖాదులు మానసిక భావనలు. ఇవిమనసు కంటే వేరుకాదు. బాహ్యవిషయ జగత్తే అసత్యము. అది మనస్సును ఎలా సృష్టించగలదు. ఎండమావులలోని నీరే అసత్యమైనప్పుడు దానిని దాటుటకు నావను వాడడం వంటిదే ఇది. భావరహితమైనది మనస్సే కాదు. క్రూర భావాలుంటే క్రూరమనస్సు. మృదు భావాలుంటే మృదు మనస్సు. బాహ్యవిషయ ప్రపంచాన్ని ఒప్పుకోవాలన్నా మనస్సే సాధనము. విజ్ఞానవాదులు మనస్సు కంటె భిన్నమైన బాహ్యప్రపంచం లేదు అని నిర్ణయించారు.
కారిక-27: నిమిత్తం న సదా చిత్తం సంస్పృశత్యధ్వసు త్రిషు ।
అనిమిత్తో విపర్యాసః కథం తస్య భవిష్యతి ॥
భావం: త్రికాలములలో నిమిత్తం చిత్తాన్ని స్పృశించుటలేదు. మనస్సు భ్రాంతి పొందేందుకు తగినంత కారణం లేక పోవడంతో ఇట్టి భ్రమ (విపర్యాసం) మనస్సుకు ఎట్లు కల్గుతుంది?
వివరణ: నైయాయికులు ఈ విధంగా వాదిస్తారు. ఇదివరకే మనసు సర్పజ్ఞానం ఉన్నప్పుడే రజ్జువును సర్పంగా భావించగలం. సత్యజ్ఞానం ఉన్నప్పుడే మిథ్యాజ్ఞానం కల్గుతుంది. ఘటాదులతో కూడిన సత్యప్రపంచం జ్ఞానం ఒకటి మనస్సులో ఉండినప్పుడు దానికి సంబంధించిన మిథ్యాజ్ఞానం కల్గుతుంది. ఇది సంస్కార రూపంలో ఉంటుంది అని వారి వాదన.
దీన్ని శంకరులు ఒకప్రతి వాదంగా పేర్కొంటూ మనస్సులో సత్‌జ్ఞానముకన్నా భిన్నమైనదిగాని, సత్‌జ్ఞానంకాని మనస్సులో ఉండి తీరవలెను. అనే నైయాయికుల ఖండనగా చెప్పినారు. గౌడపాదులు ‘‘త్రికాలముల్లో ఈ మనస్సు ఎట్టి నిమిత్త కారణా విషయ సంబంధం కల్గి ఉండదు. ఎక్కడనో ఒక సత్య ప్రపంచం ఉందనే భావాన్ని ఖండిస్తూ, మనస్సు దాన్ని గ్రహించి సంస్కార రూపంలో ధరించలేదు’’ అన్నాడు.
కారిక-28: తస్మాన్న జాయతే చిత్తం చిత్తదృశ్యం న జాయతే ।
తస్య పశ్యంతి యే జాతిం ఖేవై పశ్యంతి తే పదం ॥
భావం: చిత్తమేనాడు పుట్టలేదు. చిత్త దృశ్యమైన ప్రపంచం అంతకంటే వాస్తవంలో లేనేలేదు. ఐనప్పటికీ చిత్తాన్ని, చిత్తదృశ్యాలను చూడవలెననేవారు ఆకాశంలో పక్షుల పాద చిహ్నాలను చూచునట్టి వారిగానే నిల్చిపోతారు.
వివరణ: విషయ ప్రపంచంవలెనే భావనా ప్రపంచం గూడా అసత్యమే అని నిరూపించే చర్చలు కల్గిన శ్లోకం ఇది రెండవది.
గౌడపాదుడు ద్వైతమతంలోని అసందర్భాన్ని ఖండిస్తూ తీవ్రంగా విద్యార్థులను (వేదాంత) హెచ్చరిస్తున్నాడు. ద్వైత భావన వాసన కూడా ఉండరాదని ఆతని నిష్కర్ష బాహ్యవిషయ ప్రపంచమే కాకుండా, ఆంతరికమైన భావనా ప్రపంచం కూడా మిథ్యే అని ఋజువు చేయడానికి ఉదాహరణగా ఆకాశంలో చరించే పక్షుల పాద గుర్తులను వెతికేవారిగా వ్యర్థమైన ప్రయత్నం చేస్తున్నారని ద్వైతులు అసంభవాన్ని అన్వేషించే అసందర్భాన్ని స్థాపిస్తున్నారని ఆగ్రహిస్తున్నాడు గౌడపాదుడు.
కారిక-29: అజాతం జాయతే యస్మాత్ అజాతిః ప్రకృతి స్తతః ।
ప్రకృతే రన్యథా భావో న కథంచిద్భ విష్యతి ॥
భావం: అజాతమైనది జాయమానం కాదు కాలేదు. దాని స్వభావము అజాతికదా. సహజ స్వభావమునకు విరుద్ధంగా ఏదీ ఉండజాలదు.
వివరణ: ఇంతవరకు స్థాపించబడిన దాన్ని బట్టి బ్రహ్మ ‘అధ్వయం, అజం’ అని తేలుతుంది. అప్పుడు సృష్టి కారణ ధర్మము అజ్ఞానపూరిత మనసులో పదార్థాలన్నీ నశించాల్సిందే. దీన్ని బట్టి ‘‘ప్రపంచము కేవలము మనోమాయా స్పష్టమే. మానసిక అవధులు దాటిన వ్యక్తి తనలో సదా సహజమైన ఆత్మను తిరిగి చూడడమే ఆత్మ దర్శనం ఆత్మానుభవం’’ అని నిరూపించబడుతుంది.
దీన్నింకా వివరిస్తే ఒక ధనవంతుడు స్వప్నంలో తాను దరిద్రుడైనట్లుగా అనుభవం పొందాడు. మెళుకువ వచ్చిన వెంటనే నిజస్థితిలో ఉన్నాడు. స్వప్నానికి ముందు, స్వప్నమునకు పిదప ధనవంతునిగా ఉన్న అనుభవం స్వప్నంలో మాత్రం దరిద్రునిగా మారింది. ఏది నిజం? అది నిజంకాదని నవ్వుకున్నాడు. ఇదే విధంగా ఈ ప్రపంచము, తద్గత అనుభవాలు మిథ్యాజ్ఞానము, మర్త్యత్వము, ఇవన్నీ తన్ను తాను మరచిన మనస్సుతాను, తన్నావరించిన స్థూల కోశముతోను తాదాత్మ్యము పొందెనా అన్నట్లున్న ఆత్మయొక్క స్వప్నానుభవములే.
జ్ఞానము కల్గి ప్రయత్నంతో ఈ మనో బుద్ధులను ఉపసంహరించుకొన్నప్పుడు వెంటనే ఈ జీవాత్మ పరమాత్మగా తన్ను తాను తెల్సుకుంటుంది. ఇది నిజమైన మోక్షము. తన బంధములోని అనుభవాలను ఈ ప్రపంచాన్ని మిథ్యగా తెల్సుకోవడమే మోక్షము.
కారిక-31: ఆదావన్తే చ యన్నాస్తి వర్తమానే-పి తత్తథా ।
వితథైః సదృశాః సన్తో-వితథా ఇవలక్షితాః ॥
కారిక-32: సప్రయోజనతా తేషాం స్వప్నే విప్రతిపద్యతే ।
తస్మా దాద్యన్త వత్త్వేన మిథ్వైవ ఖలుతే స్మృతాః ॥
భావం: ఆద్యంతములలో లేనిది మధ్యనకుడా లేదు. మనం చూచేదంతా మిథ్యయే కాని సత్యం వలె గోచరిస్తుంది. మనం చూచేవి జాగ్రత్తలో ప్రయోజనకారులుగా ఉండి స్వప్నంలో మిథ్యగామారుతున్నాయి. ఆద్యతములున్నవి కావున అవి మిథ్యయే అని జ్ఞానులు హెచ్చరిస్తున్నారు.
వివరణ: వైతథ్య ప్రకరణంలో (అధ్యాయ 2 శ్లో 6,7) ఈ రెండు శ్లోకాలు వివరించబడినాయి. ప్రపంచ మిథ్యాత్వాన్ని నిరూపించేందుకు వాటిని మళ్ళీ పేర్కొన్నాడు గౌడపాదుడు.
ఒక వేదాంతి ఆవేశాన్నిగాని, అనుకంపను గాని ఎరుగరు. అతడు నిర్దాక్షణ్యంగా సత్యము నన్వేషింప ప్రయత్నంచును. శ్రద్ధతో కూడినట్టి ప్రయత్నంలో ఒక వస్తువును ప్రత్యక్షంగా చూచినప్పటికి అంతటితో ఆగక దానివైచిత్రిని గూర్చి ప్రశ్నింప పయత్నిస్తాడు.
స్వప్నంలో పొందే సుఖదుఃఖాలు వైభవం, భోగం, మేలుకొన్నప్పుడు ఉండవు. తర్వాత ఉండవు. ఆదియందును లేక, అంతమునందును లేక మధ్య మాత్రమే
ఉన్న పదార్థము లేనట్లే దాన్నే మిథ్యగా వివేకులు పరిగణించిరి. మనోబుద్ధులను అధిగమించినప్పుడే ఇది అనుభవానికి వస్తుంది.
కారిక-33: సర్వేధర్మా మృషాస్వప్నే కాయస్యాన్తర్ని దర్శనాత్ ।
సంవృతే-స్మిన్ ప్రదేశే వైభూతానాం దర్శనం కుతః ॥
భావం: ఈ దేహాంతర్భాగమునందే చూస్తున్నాం కావున స్వప్నంలోని పదార్థాలన్నీ లేనివే. ఎందుకంటే దేహాంతర్భాగంలోనివి సత్యం ఎలా కాగలవు?
__వివరణ: __స్వప్నానుభవాలు ఎందుకు సత్యంగావో తెల్పేందుకు గౌడపాదుడు మరికొన్ని ఉపపత్తులను చూపుతున్నాడు.
‘‘స్వప్నంలో ఉన్నతవరకు అది నిజమే కదా కాబట్టి స్వప్నంకూడా సత్యమే’’ అనే ఒక వాదం కూడా ఉంది. దీన్ని ఖండిరచడమే ఇక్కడ లక్ష్యం.
కారిక-39: నయుక్తం దర్శనం గత్వా కాలస్యానియమాద్గతే ।
ప్రతి బుద్ధశ్చ వై సర్వస్తస్మిన్ దేశే న విద్యతే ॥
భావం: స్వప్నంలో దూరదేశములలో ప్రవర్తించినట్లు అనుభవానికి వస్తుంది. నిజంగా అక్కడకు పోవడంలేదు. మెళకువ వచ్చినాక పడకమీదే ఉన్నాడు. కాలం పరిమితం కాబట్టి అక్కడికి పోలేడు.
వివరణ: స్వప్నం నిజంకాదని చెప్పే ఉపపత్తులలో ఇదొకటి. ఒక జీవి స్వప్నంలో తాను చూచేప్రదేశాలకు వెళ్తూ, అక్కడివన్నీ అనుభవిస్తున్నాడు కాబట్టి అదినిజమే అని ప్రతివాది చెప్తాడు. కాని అది సత్యం కాదని ఎందుకంటే పడకమీదే ఆ వ్యక్తి ఉన్నాడని గౌడపాదుని ఖండన. స్వప్నసమయం అల్పం. జరిగిన ప్రయాణం చాలా దూరం. ఇది సాధ్యం కానిది. అంతేకాక అసందర్భము కూడా. వేల మైళ్ళ దూరంలో వ్యక్తులవద్దకు వెళ్ళిన వాడు పడక మీదనో ప్రక్కన ఉన్నవారు మేల్కొల్పడం వల్ల తిరిగి జాగ్రత్తలోనికి వస్తాడు కదా! అతి కొద్ది సమయంలో శారీరకముగా ఎట్టి ప్రయాణం చేయడం లేదు. నిద్రించిన చోటనే మేల్కాంచుతాడు కావున స్వన్నం సత్యంకాదు.
కారిక-35: మిత్రాద్యైః సహసంమంత్య్ర సంబుద్ధో న ప్రపద్యతే ।
గృహీతం చాపి యత్కంచిత్ ప్రతిబుద్ధో నపశ్యతి ॥
భావం: స్వప్నంలో మాట్లాడే మిత్రులను జాగ్రత్తులో చూడలేడు. స్వప్నంలో చూచినవన్నీ మేల్కాంచిన వెంటనే మాయమైతున్నాయి.
వివరణ: స్వప్నం ఒకని వాసనా ఫలితంగా కల్గిన మానసిక భ్రమ మాత్రమే. స్వప్నంలో మాట్లాడిన స్నేహితుని నిద్రలో నుండి మేల్కొన్న వెంటనే చూడలేము. అది భ్రమ అని తెలుస్తుంది. కారణం స్వప్నంలో జరిగే వ్యవహారమంతా మన మనస్సుచే సృష్టించబడినదే. కావున అది వాస్తవం కాదు. అట్టిదే జాగ్రత్ కూడా. స్వప్నం వంటిదే జాగ్రత్ కూడా. అది కూడా మనో స్పష్టమే.
కారిక-36: స్వప్నే చా వస్తుకః కాయః పృథగన్యస్య దర్శనాత్ ।
యథాకాయస్తథా సర్వం చిత్తదృశ్య మవస్తుకం ॥
భావం: స్వప్నంలో చూచేవాని భౌతిక శరీరం పడక మీదే ఉండడంవల్ల స్వప్నంలో వ్యవహరించే దేహం వేరుగా ఉంటుంది. ఆ మరొక దేహం ఎంత సత్యమో స్వప్నదృశ్యాలు కూడా అంతే సత్యం.
వివరణ: నదిలో మునిగిపోయినట్లు స్వప్నంలో పొందిన అనుభవం మెళుకువ వస్తూనే లేదు. దేహంపైన ఒక్క నీటిబొట్టు కూడా లేదు. మరి మునిగి పోయిన శరీరం ఏది? అది అసత్యం స్వప్న శరీరం వలెనే స్వప్నంలోని వస్తువులు, సంఘటనలన్నీ అసత్యాలే. అటువంటివే జాగ్రదావస్థలోని అనుభవములు కూడా!
కారిక - 37: గ్రహణా జ్జాగరిత వత్తద్ధేతుః స్వప్న ఇష్వతే ।
తద్ధేతుత్వాత్తు తస్యైవ సంజాగరిత మిష్యతే ॥
భావం: స్వప్నంలోని అనుభవాలు జాగ్రత్తులోని అనుభవాలు సమానంగా ఉన్నాయి. దీన్నిబట్టి జాగ్రదవస్థలోని అనుభవాన్నే స్వప్నానికి కారణం అని నిర్ధరిస్తున్నాడు. స్వప్నం చూచేవానికి దానికి కారణమైన జాగ్రత్తు కూడా సత్యం వలె తోస్తున్నాయి. కాని అది కూడా సత్యం కాదు.
వివరణ: స్వప్నంలో కాని, జాగ్రదవస్థలో కాని ఆయావస్తువులతో సంబంధం కల్గినప్పుడే తత్తదనుభవాలను పొందుతున్నారు. దీన్ని బట్టి ఒక అనుభూతికి 1) అనుభవించువాడు, 2) అనుభవించబడేది, 3) అనుభూతి - అనే మూడు అంశాలు ఉంటాయి. స్వప్నంలోకాని, జాగ్రత్‌లో గాని ఇది సమానమే.
స్వప్నావస్థను తైజసుడు స్వప్నంకంటే జాగ్రత్ సత్యమనగలడు. వాస్తవానికి జాగ్రత్ కూడా మిథ్యే. అది తనకన్నా భిన్నంగా దేనినే కలగజేయలేదు. ఎండ మావులలోని నీరు ఎడారిలోని ఇసుకను తడపలేదుగదా! ఇంకో ఉదాహరణగా వ్యంధాపుత్రుడు ఇంద్ర ధనుస్సును చేపట్టి యుద్ధానికి సిద్ధంకాలేడు కదా! ఆ ధనుస్సునుండి ఒక్క బాణం కూడా వెలువడదు.
దీన్నిబట్టి జాగ్రదవస్థయే ఒక అసత్ జ్ఞానం. కాబట్టి అది మరికొంత భ్రమనే కల్గిస్తుంది. వేరేదాన్ని కల్గించలేదు.
కారిక-38: ఉత్పాదస్యా ప్రసిద్ధత్వాదజం సర్వముదాహృతం
నచ భూతా దభూతస్య సంభవోస్తి కథంచన
భావం: ఈ సృష్టిగాని, ఈ పరిణామంగాని వాస్తవమని స్థిరపరచరాదు. అది అజాతము. అది పుట్టనే లేదు. సత్యం నుండి అసత్యం పుట్టడం అసంభవం కదా!
వివరణ: స్వప్నం కంటే జాగ్రదవస్థ సత్యమనే ప్రతివానికి జవాబుగా ఈ శ్లోకం చెప్పబడిరది. వివేకం లేనివారికి ఈ వాదనే సత్యము అన్పిస్తుందని శంకరుల వివరణ. స్వస్నంలో స్వప్నం మేల్కాంచడం విశ్వుడు అనుభవించే జాగ్రత్స్వప్నం. దాన్నించి మేల్కాంచడం జాగ్రదవస్థననుభవించడానికే స్వప్నానుభవాలను జాగ్రదవస్థానుభవాలతో పోల్చేందుకు సరియైన తర్కంగాని ఉపపత్తిగాని అవసరం.
అసత్యమైన ప్రపంచం సత్యమైన ఆత్మనుండి పుట్టినదనుట తర్క విరోధము. నానుండి నేను పుట్టినానన్నట్లున్నది. ఇది వాదమునకు నిలుచునదిగాదు. ఈ విధముగా అజాతవాదము స్థిరపర్చబడుచున్నది.
కారిక-39: అసజ్జాగరితే దృష్ట్వా స్వప్నే పశ్వతి తన్మయః ।
అసత్స్వప్నే-పి దృష్ట్వా చ ప్రతిబుద్ధో న పశ్యతి ॥
భావం: జాగ్రదవస్థలోని అసత్యమైన వాటిని స్వప్నంలో మళ్ళీ చూస్తున్నారు. కాని స్వప్నంలో చూచిన అసత్య వస్తువులను మాత్రం జాగ్రదవస్థలో చూడడం లేదు.
వివరణ: ప్రతివాదులు కార్యకారణ వాదమును స్థిరపర్చెదురు. ‘‘స్వప్నం జాగ్రదవస్థాకృతమే అని చెప్పిన వేదాంతులు కార్యకారణ వాదాన్ని మిథ్యగా పేర్కొనడం తప్పు’’ అని వాదిస్తున్నారు. దానికి సమాధానంగా మాయా కార్యమును సృష్టించడానికి ఒక కారణము సత్యం కావలసిన పనిలేదు. అసత్యమైన మిథ్యా కారణమే మిథ్యా కార్యాన్ని తయారు చేయ గలదు. ఉదా॥ ఎండమావులలో నీరే ఉందదు. కాని పరిశ్రాంతుడైన బాటసారికి దూరం నుండి నీరు, ప్రవాహం దానిలోని చిరుతరగలు, నురుగు కూడా కన్పిస్తాయి.
కారిక-40: నాస్త్యసద్ధేతుక మసత్ సదసద్ధేతుకం తథా ।
సచ్చ సద్ధేతుకం నాస్తి సద్ధేతుక మసత్కుతః ॥
__భావం: __అసత్యమైన దానికి అసత్యం కారణం కాజాలదు. అట్టి అసత్యము నుండి సత్యము కూడా ఉద్భవించదు. అంతేకాక సత్యంకూడా సత్యానికి కారణం కాజాలదు. అటువంటప్పుడు అసత్యమునకు సత్యం కారణం ఎలా కాగలదు.
వివరణ: కార్యకారణ వాదాన్ని స్థాపించడానికి బౌద్ధాచార్యుడు, నాగార్జునుడు నాలుగరకాలైన వాదాలను చూపిస్తారు. వాటినన్నిటిని గౌడపాదుడు నిర్ధూతం చేస్తున్నాడు. ఆనాలుగు ఇవి -
1) అసత్యానికి అసత్యం కారణం కాజాలదు. ఉదా॥ కుందేలు కొమ్మ ఆకాశంలోని గంధర్వనగరానికి కారణం కాలేదు.
2) సత్యానికి అసత్యం కారణం కాలేదు. ఉదా॥ వంధ్యా పుత్రుని వివాహం చూచే అవకాశం కల్గదు.
3) సత్యానికి సత్యం కారణం కాలేదు. ఉదా॥ ఒకమేజా బల్ల మరొక మేజా బల్లకు కారణం కాదు.
4) సత్యమునకు అసత్యం కార్యం కాలేడు. దాన్ని తల్చడమే అవివేకం, అసందర్భం.
కారిక-41: విపర్యా నాద్యథా జాగ్రదచిన్త్యాన్భూతవత్ సృశేత్ ।
తథాస్వప్నే విపర్యాసాత్ ధర్మాంస్తత్రైవ పశ్యత్ ॥
భావం: అచింత్యమైన తత్త్వముగల వస్తువును జాగ్రదవస్థలో సత్యమని విపరీత జ్ఞానంతో ఎలా భావిస్తాడో, అట్లే ఆ స్వప్నమునందు మాత్రము అస్తిత్వము కల్గి ఉన్న వస్తువులను కూడా అదే విపరీత జ్ఞానంతో సత్యంగా చూస్తున్నాడు.
వివరణ: మహర్షుల అభిప్రాయానుసారం మానవుడు తన మనోబుద్ధుల శక్తులను మహత్తర కార్య సాధనకై, అధికాధిక ఔన్నత్యాన్ని వినియోగించవలెను దానికి ఆధ్యాత్మికత ఒక్కటే సరియైన మార్గము. ప్రక్రియ. దీన్ని మనం వివరించుకుంటే జాగ్రత్స్వప్నముల మధ్య రవ్వంత కూడా కార్య కారణ సంబంధంలేదు. అవి రెండు అసత్యములే. వివేకము (విభజ్య దర్శనం వివేకః) లేకపోవుట వల్ల బుద్ధి భ్రాంతమైన నానాత్వ విశిష్ట ప్రపంచాన్ని సృష్టించుకొనుటవల్ల జాగ్రదావస్థలో సత్యం వలె తోస్తుంది. స్వప్నంలో మనస్సు మోహితమై సగం జ్ఞానం మాత్రమే కల్గి బుద్ధితో సంబధం నశించి విశృంఖలంగా విహరించి జాగ్రత్తుతో పోలిస్తే అసంబద్ధంగా తోస్తుంది. కాని స్వప్నంలో చాలా వస్తువులు జాగ్రత్తులోని వాటిని పోలి ఉండడం వల్ల వాటికి కార్య కారణ సంబంధాన్ని కల్పించు కుంటున్నాం. కానీ ఇది సత్యంకాదు. కాలదృష్ట్యా కూడా జాగ్రత్స్వప్నములకు గౌడపాదుడు సంబంధం లేదని నిరూపిస్తున్నాడు. ఈ రెంటికి భేదము ఉండవలసిన సంపూర్ణ వివేకం లేకపోవడం ఒక్కటే! సహజంగా వ్యక్తీకరించే బుద్ధి కన్నా మనకు ఎంతో బుద్ధి శక్తి ఉంది. వివేకపుటంచులను అందుకునేందుకు మనం ప్రయత్నం చేయడంలేదు. ఇష్ట పడడం లేడు.
కారక-42: ఉపాలంభాత్ సమాచారాత్ అస్తి వస్తుత్వ వాది నాం ।
జాతిస్తు దేశితా బుద్ధైః అజాతేస్త్ర సతాం సదా ॥
భావం: అజాతమైన ఆ పరమాత్మవలన భయంతో, ప్రత్యక్షంగా వస్తు ప్రపంచానుభవం పొందడంతో, కర్మ కాండ యందలి గాఢ విశ్వాసంతో, జగత్సత్యత్వ భావననే అంటిపెట్టుకొని ఉండు వారికోసం జ్ఞానియైనవాడు జగత్సృష్టినే సమర్థిస్తున్నాడు.
వివరణ: ఉషనిదృషులు వేదాంత విద్యను క్రమసాధనగా శిష్యులకు బోధించుచున్నారు. ఏ విద్యాబోధనయైనను ఇట్లే ఉంటుంది కదా! చిన్నతరగతులలో పాఠ్యాంశాలు వారి వారి వయస్సు, గ్రహణశక్తి, మనస్థైర్యములను బట్టి బోధించ బడతాయి. అట్లే వేదాంత విద్యార్థులు కూడా ఒక్కసారిగా అజాతవాదాన్ని తెల్పినప్పుడు దిగ్భ్రమ చెందుతారు. దీన్ని గ్రహించలేరు. ఒక నియమిత బోధనా ప్రక్రియా భాగంగా గురువు కారణత్వకల్పనను ఉపయోగిస్తున్నాడు. విద్యార్థి క్రమంగా నిశ్చలమనస్కుడు, నిశిత బుద్ధి పొందినప్పుడు అజాతవాదం బోధింపబడుతుంది. అందులో భాగంగా మొదటి సృష్టి కారణత్వమును గూడా సమర్థించారు. దీన్ని బట్టి వారు ఆ వాదాన్ని నమ్ముతున్నారని కాదు. దాన్ని కేవలం ఆభాసగా మాత్రమే అంగీకరిస్తున్నారు. అంతుపట్టని, బుద్ధి గ్రహించలేని అద్భుత విషయాలలో ఆశ్చర్య చకితులను చేయడం విద్యార్థుల అభివృద్ధికి ఏ రకంగా కూడా దోహదం చేయదు. అభివృద్ధికి ఆటంకం కూడా.
కారిక-43: అజాతే స్త్రసతాం తేషాముపలంభా ద్వియన్తి యే ।
జాతిదోషా న సేత్స్వన్తి దోషా-ప్యల్పో భవిష్యతి ॥
భావం: అవ్యక్తమైన పరబ్రహ్మ నుండి భయపడినవారు ప్రత్యక్షంగా ఈ ప్రపంచాన్ని జూచుచున్నవారూ, అజాతవాదాన్ని ఒప్పుకోరు. కారణత్వాన్ని నమ్మడం వల్ల కల్గే అనర్థాలను వారు పట్టించుకోరు. అనర్థమైనను అది వారికి ముఖ్యం కాదు.
వివరణ: పరమాత్మ కార్యకారణములకతీతమైనది దాని నుండి ఎట్టి కార్యమూ ఉద్భవించదు. ఎట్టి కార్యానికి అది కారణం కాదు. ఈ నానారూప జగత్తు కేవలం మిథ్య. మనోబుద్ధులు కేవలం ఆత్మయందు ఆరోపితమైనవే. జ్ఞాత ఉన్నంత కాలం జ్ఞేయం ఉంటుంది. మనోబుద్ధులను అధిగమించినపుడు తనసహజ భావనమైన అఖండ ఏకజాతీయ సత్యతత్త్వాన్ని తెలుసుకుంటుంది. కాని ఇదంతా ప్రారంభ సాధకునికి అగమ్యగోచరంగా ఉంటుంది. అందుకే గురువు నుండి శిష్యుడు శాస్త్రగ్రంథం, ఓంకారం వంటి ప్రతీకలను (నానాత్యములను) గ్రహించుట అవసరం. ఆత్మ దృష్ట్యా గురువు స్వప్నస్థ సింహంవలె వాస్తవానికి లేనివాడే. కాని తన గర్జనతో శిష్యని మిథ్యనుండి మేల్కొల్పి అఖండ ఆత్మ విజ్ఞానానుభవం వైపు నడిపిస్తున్నాను.
కారిక-44: ఉపాలంభాత్ సమాచారాత్ మాయా హస్తేయథోచ్యతే ।
ఉపాలంభాత్ సమాచారా దస్తి వస్తు తథో చ్యతే ॥
భావం: మాయచేత (ఇంద్రజాలంలో) కల్పించబడిన ఏనుగులో ఏనుగు లక్షణా లుండడంవల్లనే ‘అది ఉన్నట్లు’ చెప్తున్నాం. అట్లే ప్రపంచంలోని పదార్థాలు కూడా మన మనస్సు వ్యవహరించడానికి అంటే గ్రహించడానికి యోగ్యంగా ఉండడం వల్లనే అవికూడా అస్తిత్వం కల్గి ఉన్నాయి అని చెప్పగల్గుతున్నాం. వాస్తవానికి ఈ వస్తుజగత్తు, ఐంద్రజాల ఏనుగు రెండూ మాయా కల్పితాలే.
వివరణ: వేదాంతంలో తరచూ పేర్కొనబడే ఐంద్రజాలికవిద్యలో మణి మంత్రౌషధముల ద్వారా ప్రేక్షకుల ఎదురుగా పెద్ద ఏనుగున్నట్లు, దానితో రకరకాల విన్యాసాలను చేయిస్తున్నట్లు భ్రమ కల్పింతురు. అది వాస్తవ ఏనుగువలెనే ఉంటుంది. జగత్తులోని ఏనుగు చూసిన వారికి అదికుడా సత్యం వలెనే కన్పిస్తుంది. ఈ రెండు కారణాలను బట్టి ద్వైతులు ప్రపంచం కూడా సత్యమే అంటున్నారు. కానీ జాగ్రదావస్థలో కూడా మనంచూసిందంతా సత్యమని నిర్ధారించలేము. ద్వైతుల వాదము జగత్సత్యత్వాన్ని స్థిరపర్చలేవు. ఈ సృష్టి అంతా పరమాత్మపై ఆరోపితమైనదే. కావున దానికిప్రత్యేకంగా అస్తిత్వముండదు
కారక-45: జాత్యాభాసం చలాభాసం వస్త్వాభాసం తదైవ చ ।
అజా చలమస్తుత్వం విజ్ఞానం శాంతమద్వయం ॥
భావం: ఆ పరమాత్మ జన్మ, చలనం, వస్తురూపం ఇత్యాదులు కల్గియున్నట్లు కన్పిస్తున్నా, వాస్తవానికి అది అజం, అచలం, అవస్తువుగా నుంది. అంతేకాక అద్వైతం శాంతంగానున్న విజ్ఞాన రూపమే.
వివరణ: మనకు నిత్యానుభవంలో దేశకాలాపేక్షతో నానారూపమును ధరించి కర్మలను చేస్తున్నట్లు కన్పిస్తుంది. కాని నిజానికి ఆత్మకు చలనం లేదు. కాని మనస్సుతో తాదాత్మ్యనం పొంది ఇంద్రియవిషయ ప్రపంచాన్ని చూడడంవల్ల, మనకు అచలమైన ఆత్మ కూడా దేశకాలములను బట్టి ఆత్మ ఒకచోటునుండి మరియొక చోటుకు మారుతున్నట్లు తోస్తుంది. వాహనంలో ప్రయాణించేటప్పుడు ప్రక్కనున్న వృక్షములు కదలి పోతున్నట్లు కన్పించుట వంటిదే ఇదికూడా. మనం కదుల్తూ వానిని కదుల్తున్నట్లు భ్రమిస్తున్నాం దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే చలనం కల్గిన వస్తువులను బట్టి అచలమైన దాన్ని కూడా చలిస్తున్నట్లు చూస్తున్నాం. ఇంద్రియమనోబుద్ధులు నిత్యం చలిస్తూనే ఉంటాయి. వాటికి శకలమైన ఆత్మతత్త్వం కూడా చలిస్తూ క్రియా వంతమైనట్లు కల్పిస్తుంది. ఇది కేవలం మాయ. భౌతికావరణల ద్వారా ఈ నానాత్వ భ్రాంతి కల్గుతుంది. కావున జాతి - ఆభాస. చలనం - ఆభాస. వస్తువు - ఆభాస మాత్రమే ఆత్మకు జనన, చలన వస్తు లక్షణాలు కేవలం ఆభాసనే. అది అద్వైతం. సదానందం. అజం - అచలం.
కారిక - 46: ఏవం న జాయతే చిత్తమేవం ధర్మా అజాఃస్మృత ।
ఏవమేవ విజావన్తో నపతన్తి విపర్యయే ॥
భావం: ఈవిధంగా చిత్తం(ఆత్మ) అజం, అవికారంగా ఉంది. సమస్త జీవులు జన్మ లేనివారే. అట్టి సత్యం తెల్సినవారికి పరమాత్మను గురించి విపరీత భావన కల్గదు.
వివరణ: జ్ఞానికి పరిమితమైనది నశ్వరమైనది ఏదీలేదు. మనోబుద్ధులు గ్రహించు వస్తు ప్రపంచం అతనికి లేనిదానిగనే కన్పిస్తుంది. కారణం అతడు మనో బుద్ధులనధిగమించుటయే. శుద్ధ చైతన్యరూపమైన తత్త్వమే తానని తెల్సికొని దాన్ని పొందడానికే సాధనాపరుడై ఉన్నాడు. మనోబుద్ధులను అధిగమించిన వానికి జీవత్వం ఉండదు. అనుభవ కాంక్ష కూడా ఉండదు. అతనిలో అనుభవములు లీనమైపోవడంతో మిగిలినది అద్వైత ఆత్మానుభవమే. దీనివల్ల మానసికమైన రాగ భయాదులుండవు. ఆ కాంక్షలు అశాంతి ఉండవు.
కారిక-47: ఋజు వక్రాదికాభాస మాలాతస్పందితం యథా ।