శ్రీ పాణ్యం వాఙ్మయ నిధి పాణ్యం వంశ రచయితల సాహిత్యము

మాండూక్యోపనిషత్తు › అలాతశాంతి ప్రకరణము

అలాతశాంతి ప్రకరణము

మాండూక్యోపనిషత్తు · భాగము 10 / 14

__పరిచయం : __

కారికా గ్రంథంలో ఈ అధ్యాయం చివరిది. మిక్కిలి ప్రశస్తమైనది. ప్రార్థనతో ప్రారంభమైంది. దీనిపై కొంత విమర్శలూ లేకపోలేదు. అసలు కారికలను గౌడపాదుడొకడే వ్రాయలేదని నలుగురు నాల్గు అధ్యాయాలు వ్రాసి, గుదిగ్రుచ్చి ఒక్క గ్రంథంగా పేర్కొన్నారట. ప్రార్థనాశ్లోకంలో ప్రారంభమైన ఈ ప్రకరణం ప్రత్యేక గ్రంథమట. మొదటి మూడధ్యాయాలలోని కొన్ని శ్లోకాలు పునరుక్త మైనాయట ఇవన్నీ గ్రంథ గంభీర్యాన్ని, ప్రకృష్టతను తక్కువ పరచలేవు. వీటన్నిటినీ శ్రీ శంకరభగవత్పాదులు తన వాదముచే పటాపంచలు చేసినారు.

ఇది ఉపదేశ గ్రంథం. కావున దీనికి పునరుక్తి దోషం ఉండదు. గురువు శిష్యులకు అవసరమైన చోట్ల నొక్కి వక్కాణించడాన్ని కొన్ని సందర్భాలను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సివస్తుంది. లేకున్నచో శిష్యులు అపార్థం చేసుకోవడమో లేదా ముఖ్యాంశాలను దాటి పోవడమో వంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.

ఈ అధ్యాయంలో సారాంశాన్ని క్రింది విధంగా విభజించవచ్చు.

  1. జగత్కారణత్వ కల్పనము చాలా మూర్ఖత్వంతో కూడినది.
  2. ఆ లాతము (కొరివి)ను తిప్పడం ద్వారా ఏర్పడే వివిధమైన ఆకృతులతో ఈ ప్రపంచాన్ని పోల్చడం జగన్మిథ్యత్వమును వివరించడమే.
  3. పరమసత్యము శాశ్వతము అజము అద్వైతము అని స్థిరపరచుటకుగాను హేతువాదము చేయుటలో బౌద్ధమతాన్ని అనుసరించుట.

ఆలాతం వంటి పోలిక మైత్రేయణి ఉపనిషత్తులో ఉంది. అట్లే వేదాంత గ్రంథములలో ఆ కాలంలో పరిచయమైన వాడుకలోనున్న వైజ్ఞానిక పదములను ధారాళంగా వాడినారు.

వేదాంతమతాన్ని క్రమబద్దంగా వివరించుటలో గౌడపాదుడే ప్రథముడు.

శ్లో॥ నారాయణం పద్మభవం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరం చ

 వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగ్రీంద మథాస్యశిష్యం।

శ్రీ శంకరాచార్య మథాస్య పద్మపాదంచ హస్తామలకం చ శిష్యం

తం తోటకం వార్తికకార మన్యాన్‌ అస్మద్గురూన్‌ సంతతమానతోస్మి ॥

గురుసంప్రదాయంలో గౌడపాదుడు, అతని శిష్యుడు గోవిందపాదుడు అతని శిష్యుడు శంకరభగవత్పాదుడు. ఇదీ క్రమం. (వేదాంత పితామహుడు గౌడపాదుడు)

కారిక-1: జ్ఞానేనాకాశ కల్పేన ధర్మాన్యో గగనోపమాన్‌ ।

    జ్ఞేయాభిన్నేన సంబుద్ధస్తం వందే ద్విపదాంవరం ॥

భావం: జ్ఞేయాభిన్నమై, ఆకాశ సదృశమైన అనంత జ్ఞానం ద్వారా ఆకాశంతో సమానమైన వివిధ మానవ తత్త్వములను ఎవడైతే తెలుసుకుంటున్నాడో అట్టి నరశ్రేష్ఠునకు నమస్కరిస్తున్నాను.

వివరణ: ఇది బదరీ నారాయణుని స్తోత్రం. చాలాకాలం గౌడపాదుడు బదరీ గుహలలో సమాధి స్థితిలో ఉండి తాను పొందిన అనుభవాన్నే సిద్ధాంత రూపంగా బోధిస్తున్నాడు. అంతఃప్రేరణకు కారణమైనవాడు బదరీనారాయణుడే ద్విపాదాంవరః మానవశ్రేష్ఠుడు. శంకరునితో పాటు తక్కిన వేదాంతాచార్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని తెల్పినారు. నారాయణుడే తన గురువు. అతడే జీవాత్మ పరమాత్మల ఐక్యతా జ్ఞానము కల్గి తనకు ఉపదేశించాడు అని గౌడపాదుని ప్రార్థన. పిండితార్థమేమనగా ప్రత్యేక వ్యక్తిలోని ప్రత్యగాత్మయే సర్వవ్యాపి యగు పరమాత్మ అనే వేదాంత సత్యాన్ని ఆ శ్లోకం స్థిరపరుస్తుంది.

కారిక-2: అస్పర్శ యోగో వై నామ సర్వసత్త్వ సుఖోహితః ।

    అవివాదో అవిరుద్ధశ్చ దే శితస్తం నమామ్యహం ॥

భావం: వివాదము విరోధము లేకుండా సర్వభూతహితమై, శాస్త్రములచే బోధింపబడిన ఈ అస్పర్శ యోగమునకు నేను నమస్కరిస్తున్నాను.

వివరణ: భారతీయ వేదాంతశాస్త్రంలో లక్ష్యము నకెంత ప్రాధాన్యమో దాన్ని చేర్చు మార్గమున క్కూడా అంతే ప్రాధాన్యముంది. ఈ శ్లోకములో గౌడ పాదాచార్యుడు ఆత్మతత్త్వమును చేరుటకు తనకు సహాయపడిన అస్పర్శయోగానికి నమస్కరిస్తున్నాను అన్నాడు.

అస్పర్శయోగం క్రమంగా నెమ్మదిగా సావధానంగా హృదయ వికాసముతో మొదలైతుంది. వ్యతిరేక భావాలను ఛేదించుకుంటూ వాటిస్థానంలో ఉదాత్త భావాలను నిలుపుతూ పోవడమే ఈ సాధన. ప్రయోగశుద్ధిగల వారు విడుచు బాణం వలె అస్పర్శ యోగం నేరుగా లక్ష్యాన్ని తాకుతుంది. వివేక బుద్ధి, నిష్కాపట్యం, ఆత్మార్పణం అన్నవి ఇక్కడ పాటించే పద్ధతులు. అందుకే ఇతర మార్గాలలో అంటే కర్మ, భక్తి వంటివి వాద ప్రతివాదములతో సంశయ గ్రస్తుని చేస్తాయి. వాటిలో రాగద్వేషాలు, సుఖదుఃఖాలు ఉండక తప్పదు.

కాని ఈ అస్పర్శ యోగం హృదయ కుహరాంతర్గతమైన ఆంతరికాభివృద్ధిచే ఎవరికీ బాధకల్గించదు. అందుకే దాన్ని అవివాదః, అవిరుద్ధః, సర్వసత్వసుఖః, హితః, అనే విశేషణాలతో వివరిస్తున్నాడు.

(ఆత్మజ్ఞానం పొందిన వాడు తానే ఆత్మ అగుచున్నాడు) బ్రహ్మవిత్‌ బ్రహ్మైవ భవతి అనేదే సిద్ధాంతము.

కారిక-3: భూతస్య జాతి మిచ్ఛంతి వాదినః కేచిదేవ హి ।

    అభూతస్యాపరే ధీరావివదన్తః పరస్పరం ॥

భావం: కొందరు ఇంతకు ముందునుండే ఉన్న దాని నుండి జగత్తు ఉద్భవించినదని భావిస్తున్నారు. మరికొందరు ఇదివరకు లేనిదాని నుండి జగదుత్పత్తి జరిగిందని భావిస్తున్నారు.

వివరణ: పై రెండు వాదములు ద్వైతులవే 1) సాంఖ్యము 2) న్యాయ వైశేషికము

  1. సాంఖ్యము: సత్కార్య వాదము. అదే పరిణామవాదము. వీరి వాదము ప్రకారం ఒక కార్యముద్భవించుటకు ముందే అది తన కారణము నందు ఇమిడి ఉంది. ఉదా॥ ఘటము మట్టి యందిది వరకే ఉన్నది. ఏదియు హఠాత్సంభవము కాదు. కారణము నందు లేకుండా కార్యము ఏర్పడదు. ఇదే కార్యకారణ వాదము. కారణ గుణాలు అన్నీ కార్యగుణాలను ఆవరిస్తున్నాయి. కేవలం బహిర్గతం కావడమే కార్యము. మట్టినుండి ఘటము తయారు కావడం కూడా ఇంతే.
  2. వైశేషికులు : పై మతాన్ని ఖండిస్తారు వీరు. ఇదే అసత్కార్యవాదము. (ఆరంభవాదము) పదార్థాలు హఠాత్తుగా సంభవించినాయని వీరి సిద్ధాంతం. కారణంలో కార్యమిమిడియున్నదని చెప్పడాన్ని ఖండిస్తూ భేదములో అభేదమును చెప్పడాన్ని వైషమ్యాన్ని మింగి వేయడం అంటారు.

వీరి సిద్ధాంతం ప్రకారం ‘కారణం కుంటె కార్యం భిన్నమైనది. తాను ఉద్భవించునప్పుడే కార్యం ప్రారంభమైనది’ కానీ అప్పటికప్పుడు కార్యముద్భ వించినప్పటికీ కారణములో దానికి సమవాయి సంబంధం ఉంది. అని కూడా విశ్వసిస్తున్నారు.

పరస్పర మతాలను ఖండిస్తున్న ఈ వాదములను విడిచి వేదాంతమునే తప్పక ఒప్పుకోవలెనని గౌడపాదుని ప్రతిపాదన.

కారిక-4: భూతం జాయతే కించిదభూతం నైవ జాయతే ।

    వివిదన్తో-ద్వయా హ్యేవమజాతిం వ్యాపయన్తితే ॥

భావం: ఇదివరకే ఉన్నది మళ్ళీ పుట్టలేదు. ఇదివరకు లేనిది మరల పుట్టడం అసందర్భం. ఇట్లు పరస్పరం వాదిస్తూ చివరకు వీరు అద్వైతమతమైన అజాతవాదాన్నే స్థిరపరుస్తున్నారు.

వివరణ: మొదటిది ‘నిన్ననే నాతండ్రి పుట్టినాడు’ అని చెప్పినట్లు. రెండవది ‘‘నేనొక ఇంద్రధనస్సును కొంటిని’’ అనిచెప్పినట్లు గగనకుసుమాన్ని ఒకరికొకరు ఇచ్చుకున్నట్లు అన్నీ వ్యర్థమైన ఆశలు. వాస్తవంలో లేనిది అసలు పుట్టలేదు ఈ విధంగా సాంఖ్య, వైశేషికులు జగదుత్పత్తిని నిరూపించలేకున్నారు. వారి పరస్పర ఖండనలతో అజాత వాదాన్ని (ఎప్పుడు ఏదీ ఉద్భవించలేదు. జగదుత్పత్తి కారణాన్వేషమే మూర్ఖత్వం) స్థిరపరుస్తున్నారు.

కారిక-5 : ఖ్యాప్యమానమ జాతిం తైరను మోదామహే వయం ।

    వివదామో న తైః సార్థమ వివాదం నిబోధత ॥

భావం: ద్వైతులు చెప్పే అజాత వాదాన్ని మేము కూడా అంగీకరించం. వారితో మాకు విరోధంలేదు. ఇప్పుడు నిర్వివాదమైన విషయం చెప్తున్నాం వినండి.

వివరణ: గొప్పగా తర్కవాదాలను చేసే ద్వైతుల తీవ్ర విశ్వాసాలను విమర్శిస్తూ గౌడపాదుడు వారి వారి సిద్ధాంతాల ద్వారానే అజాతవాదాన్ని ప్రకటిస్తున్నారని వారితో విరోధం లేదని వారి సరియైన బుద్ధిని గ్రహణశక్తిని మేము స్వీకరిస్తున్నామని సున్నితంగా పరిహాసం చేస్తున్నాడు. సృష్టికారణత్వకల్పన కేవల మిథ్య, మూఢవిశ్వాసం, సారహీనం.

కారిక-6 : అజాత స్వైవ ధర్మస్య జాతి మిచ్ఛన్తి వాదినః ।

    అజాతో హ్యమృతో ధర్మో మర్త్యతాం కథమేష్యతి ॥

భావం: ద్వైతులు ఆత్మ జన్మిస్తుందని పరస్పరం వివదించుచున్నారు. అజాతమై, అమృతమైన ఒక తత్త్వము మర్త్యత్వం ఎలా పొందగలదు?

వివరణ: వెనుకటి శ్లోకభావనకే ఇది కొనసాగింపు, అవికారమైన ఆత్మ వికారమును పొందినదన్న ద్వైతులు భావమే విరుద్ధంగా ఉంది. ఈ భావమే అమృతం మృతం ఎట్లా అవుతుంది అని ప్రశ్నింపబడుతున్నది. దీనికి కొందరు ప్రతివాదులు ఏల కాకూడదు? అని అడుగవచ్చు. దాని జవాబు క్రింది శ్లోకంలో ఉంది.

కారిక-7 : నభవత్యమృతం మర్త్యం నమర్త్యమమృతం తథా ।

    ప్రకృతే రన్యధా భావో నకథంచి ద్భ విష్యతి ॥

భావం: అమృతం మర్త్యత్వం పొందలేదు. అట్లే మర్త్యత్వం అమృతత్వం పొందలేదు. తన సహజ ప్రకృతిని మార్చుకోనేందుకు దేనికీసాధ్యం కాదు. (భావమే వివరంగా ఉంది)

కారిక-8 : స్వభావేనామృతో యస్య ధర్మోగచ్ఛతి మర్త్యతాం ।

    హృతకేనామృత స్తస్య కథంస్థాస్వతి నిశ్చలః ॥

__భావం: __సహజ ప్రకృతి చేత అమృతమైనది. మర్త్యత్వాన్ని పొందుతుందని నమ్మేవారు. మర్త్యత్వాన్ని పొంది కుడా ఆ అమృతత్త్వాన్నే పోషించుకుంటున్నది అని ఎలా చెప్పగలరు?

వివరణ: ఒక వస్తువు తనస్వభావాన్ని మార్చుకోవడం ఎందుకు? ఎలా? సాధ్యం కాదు అని వివరణ తరువాతి శ్లోకంలో వస్తున్నది.

కారిక-9 : సాంసిద్ధికీ స్వభావకీ సహజా అకృతాచయా ।

    ప్రకృతిస్సేతి విజ్ఞేయా స్వభావం న జహాతి యా ॥

భావం: ఒక దాని యొక్క ప్రకృతి అంటే దానిలో ఐక్యం పొందిన స్వభావము. అది 4 రకాలు 1) సాంసిద్ధికి, 2) స్వభావకి, 3) సహజ, 4) అకృత. ఏదీ తన సహజ స్వభావాన్ని విడిచిపెట్టదు.

వివరణ: పైన పేర్కొన్న 4 లక్షణాలలో ఏదో ఒక దానిలో ప్రతిపదార్థం తప్పకచేరి ఉంటుంది. ఈ నాల్గూ కానిది ఉండడం అసంభవం.

1) సాంసిద్ధికీ: పరిశ్రమ- (సాధన, కృషి) చే సిద్ధించేవి. ఉదా॥ యోగశక్తులు పాండిత్యము అక్షరజ్ఞానమూ బాగా అలవాటైన వాటిని ఎవ్వరూ మార్చుకోరు, వదులుకోరు.

2) స్వాభావకీ: ఒక ద్రవ్యంలో సహజంగానే ఉండే ప్రకృతి. ఉదా॥ అగ్నిలో ఉష్ణం, తేజస్సు. ఇవి రెండూ అగ్నికి సహజ గుణాలు. అత్యావశ్యకాలు. వీటిని కోల్పోయిన వెంటనే అగ్ని ఉండదు.

3) అకృతా: అకృత్రిమము. ఉదా॥ నీరు పల్లానికే పారడం. అది దాని సహజ స్వభావం.

4) సహజా: జన్మతో కూడ వచ్చిన గుణాలు - చేపలు నీటి లోనే జీవించడం. పక్షులు ఆకాశంలో ఎగరడం.

5) స్వరూప ప్రకృతి: ‘చ’ అనడంతో దీన్ని సూచిస్తున్నారు. పటంలో పటత్యం, ఘటంలో ఘటత్వం వంటివి పత్తి మూటను, దారపు ఉండలను వస్త్రం (పటం)గా చెప్పలేము. సహజ ప్రకృతి విడిచి సృష్టిలో ఉండదు ఏదీ. చల్లని అగ్ని, నల్లని సూర్యుడు ఉండరుగదా!

పై వాదం ప్రకారం ఏదీ తన సహజ ప్రకృతిని మార్చుకోలేదు. కాబట్టి అమృతత్త్వం మర్త్యత్వాన్ని పొందదు. మర్త్యత్వ అమ్మతత్వాన్ని పొందదు. మర్త్యుడు అమృతుడు కాలేడు. పరమాత్మ అసత్య జగత్తుగా మారడు. వేదాంతం అంధవిశ్వాసాలను అంగీకరించదు.

కారిక-10: జరామరణ నిర్ముక్తాః సర్వేధర్మా స్వభావతః ।

    జరామరణ మిశ్చన్త శ్చ్యవన్తే తన్మనీషయా ॥

భావం: ఈ జీవులందరూ స్వభావంలోనే జరామరణాలు లేనివారు. కాని జరా మరణాలు తమకున్నట్లు భావిస్తున్నారు.

వివరణ: ఈ భౌతిక శరీరము 5 విధాలుగా పరిణమిస్తుంది. 1) పుట్టడం, 2) పెరగడం, 3) రోగం, 4) ముసలితనం, 5) మరణం.

జరామరణముతో కలిసి దుఃఖారూపమైన సంసారంగా మారుతుంది. ఈ మార్పు చెందే దేహంతో మనం తాదాత్మ్యం పొందుతున్నాం. అదే మనంగా భావిస్తున్నాం.

రోగం - శరీరానికి సంబంధించింది.

బాధ - మనస్సుకు సంబంధించింది.

క్షీణత - ఇంద్రియాలకు సూక్ష దేహశక్తులకు సంబంధించింది.

మరణం - స్థూల, సూక్ష్మదేహాలు విడివడడం.

మరి ఆత్మకు పై మార్పు లేమీ లేవుగదా! మన సహజ స్వభావమైన దానిని మర్చిపోయి భౌతికావరణాలతో తాదాత్మ్యం పొందుతున్నాం. ఇవి ఆత్మకు కల్గే మార్పులుగా భ్రమిస్తున్నాం. స్వస్వరూపం కనుగొనలేకున్నాం. సచ్చిదానంద రూపమైన ఆత్మ తత్త్వాన్ని తెలియకున్నాం. ఆత్మ మొక్క సహజ ప్రకృతిని మనం కనుగొనలేకున్నాం. అది ఎప్పుడూ మారునది కాదు.

కారిక-11: కారణం యస్య వై కార్యం కారణం తస్య జాయతే ।

    జయ మానం కథమజం భిన్నం నిత్యం కథంచతత్‌ ॥

భావం: కారణమే కార్యమని భావించేవారు చెప్పేప్రకారం జగదుత్పత్తి జరిగినప్పుడు ‘కారణం’ అజం ఎలా కాగలదు? కారణమునకు ఇన్ని మార్పులు కల్గినప్పుడు అది మార్పు లేనిది, నిత్యమైనది ఎట్లు కాగలదు.

వివరణ: సాంఖమతాన్ని ఖండిస్తూ గౌడపాదుడు మార్పు అనిత్యత్వాన్ని కల్గిస్తుంది. కారణం కార్యంగా మారినప్పటికి నిత్యం, సంపూర్ణం అని సాంఖ్యలు చెప్పడం తప్పు. తార్కికంగా ఇది నిల్వదు. ‘‘సృష్టికి పరమాత్మయే కారణం. పరమాత్మనుండి సృష్టి ఉద్భవించింది’’ అన్నప్పుడు పరమాత్మ కూడా అనిత్యమైన మర్త్యుడుగా మారుతాడు. కార్యకారణ సంబంధం నంగీకరించిన తక్షణమే కారణం నశించి పోతుంది. అప్పుడు పరమాత్మ లక్షణాలేవీ దానికి పట్టవు.

కారిక-12: కారణాద్య నన్యత్వమతః కార్యమజం యది ।

    జాయ మానాద్ధివై కార్యాత్కారణం తే కథం ధృవం ॥

భావం: కారణం కార్యంతో ఐక్యమైనప్పుడు అది కారణం వలెనే అజము నిత్యము కావలెను. కారణం కార్యం కంటే భిన్నం కానిచో ఆ కారణం శాశ్వతం స్థిరం కాలేదు కదా!

వివరణ: ‘‘ద్వైత సిద్ధాంతం’’:- ఆ భగవంతుడు తననుండి ఈ అజాత జగత్తును సృష్టించి కూడా, తను శాశ్వత ప్రభావముతోనే విరాజిల్లుతున్నాడు’’ అని దీనిని వ్యంగ్యంగా గౌడపాదుడు పరిహసిస్తున్నాడు. చిత్‌ నుండి జడము, నిత్యమునుండి అనిత్యము, అపరిమితం నుండి పరిమితం పుట్టజాలదు. నిత్యకారణమైన ఆ పరమాత్మనుండి అనిత్య వస్తువులు. ఉద్భవించినప్పుడు వాటికి కారణమైన పరమాత్మ కూడా క్షీణించి నశించవలసినదే కదా అని గౌడపాదుని వాదము. దీనినే శంకరలు ఖండిస్తూ ఒక కోడిని రెండుగా కోస్తూ ఒక భాగాన్ని వండుకొనేందుకు, మరొక భాగాన్ని గ్రుడ్లుపెట్టేందుకు జాగ్రత్త పరచడానికి సిద్ధం చేసినట్లున్నదని పరిహసిస్తారు.

కారిక-13: అజ్యాద్వై జాయతే యస్య దృష్టాన్త స్తస్య నాస్తివై ।

    జాతాచ్చ జాయమానస్య న వ్యతస్థా ప్రసజ్యతే ॥

భావం: అజాతమైన కారణము నుండి కార్యము పుట్టినదని చెప్పి వివరించేందుకు నిత్యజీవితంలో మనమెట్టి ఉదాహరణ చూపలేము. జాతమైన కార్యము నుండి యే కార్యముద్భవించినదనిన దానికీ ఒక కారణం ఉండాలి. ఈ విధంగా కారణాన్ని అన్వేషిస్తూ పోతే అని అననస్థా దోషంగా పరిణమిస్తుంది.

వివరణ: నేను నా తండ్రికి, నా తండ్రి అతని తండ్రికి, అకని తండ్రి తన తండ్రికి పుట్టినారని చెప్పడంతో కార్య కారణాలు రెండూ జాతమైనవే. ఇట్లా ఊహిస్తూ పోతే మన మనస్సు స్థాయి వరకే వెళ్ళగలం. ఇది ముగిసేది కాదు. దీనిలో తార్కికమైన అనవస్థా దోషం ఏర్పడుతుంది. శాశ్వతమైన తత్త్వమొక్కటే సత్యమని నమ్మి అంగీకరించినప్పుడు ఈ ప్రపంచం ఆ పరమాత్మనుండి పుట్టినదని చెప్పలేము. కావున జగత్తుకు పరమాత్మ కారణం కాజాలదు.

కారిక-14: హేతో రాధిః ఫలం ఏషామాదిర్హేతుః ఫలస్య చ ।

    హేతోః ఫలస్య చానాదిః కథం త్తెరుప వర్ణ్యతే ॥

భావం: ‘‘కార్యమే కారణానికి కారణం, కారణమే కార్యానికి కారణం’’ అనే వారు మీమాసంకులు. దీన్ని అనాది అని నిరూపించలేరు.

వివరణ: ‘‘ఈ ప్రపంచం పూర్వకర్మఫలంగా పుట్టింది ఇప్పుడు మనం చేసే కర్మ భవిష్యత్‌ ప్రపంచానికి కారణం’’ అని మీమాంస మతం. వైయక్తికంగా చేస్తే నేను పూర్వజన్మలో కర్మలే ఈ జన్మకు కారణం. ఈ జన్మలోని కర్మలు భవిష్యజ్జన్మకు కారణం అనడంవల్ల కార్యమే కారణానికి కారణంగా మిగుల్తుంది. ఇది పెద్ద దోషం.

కారిక-15: హేతో రాది ఫలం యేషామాది ర్హేతుః ఫలస్య చ ।

    తథాజన్మ భవేత్తేషాం పుత్రాజ్జన్మ పితుర్యథా ॥

భావం: కార్యం కారణానికి కారణం, కారణం కార్యానికి కారణం అని చెప్పేవారి వాదన ప్రకారం పుత్రుడు తండ్రియొక్క జన్మకు కారణంగా పర్యవసానంలో తేలుతుంది.

వివరణ: మీమాంకులను పరిహసిస్తూ గౌడపాదులు కార్యమే కారణమునకు కారణమైన ఎడల పుత్రుడు తన తండ్రికి తండ్రి కావలసి ఉంటుంది. ఇది సాధ్యం కాదు కదా! ఇట్టిది సంభవిస్తే మీమాంస మతం కూడా సమగ్రం పరిపూర్ణం కాగలదు. కాని కాలేదు అని తాత్పర్యం.

కారిక - 16: సంభవే హేతు ఫలయో రేషితవ్యః క్రమస్త్వయ ।

    యుగ పత్సంభవే యస్మాద సంబంధో విషాణవత్‌ ॥

భావం: కార్యకారణములలో ఏది ముందో ఏది వెనుకో తెలియదు. లేదా ఇవి రెండూ ఒకేసారి ఉద్భవిస్తాయనుకుంటే, పశువుల కొమ్ములవలె ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి.

వివరణ: కార్య కారణములలో ఏది ముందు ఉద్భవించింది? అని ప్రశ్నిస్తే ఈ వాదులు ముందు కారణం తర్వాతిది కార్యంగా చెప్తారు. ఇవి రెండు క్రమంగా గాక ఒక్కసారే ఉద్భవించినదైతే వీటి రెండిరటి మధ్యా ఎట్టి సంబంధం స్థిరపడదు. పశువులకు ఒకేసారి పుట్టి పెరిగే కొమ్ములకు ఏవిధంగా సంబంధం ఉండదో అట్లే. ఈ కారికలో కాలం దృష్ట్యా కూడా కార్య కారణ సంబంధం సరిపడదు. కావున అది దోషము అని నిరూపిస్తుంది.

కారిక-17: ఫలాదు త్పద్యమానాస్సన్నతే హేతుః ప్రసిధ్వతి ।

    అప్రసిద్ధః కథంహేతుః ఫలముత్పాదయిష్యతి ॥

భావం: కార్యం నుండి కారణం పుట్టిందంటే అట్టి కారణం లేనట్టే. అస్థిరమైన కారణం నుండి కార్యం ఎలా ఉద్భవించగలదు?

వివరణ: కార్యమే పుట్టలేదు. అజాతమైన కార్యం నుండి కారణం పుట్టింది అని చెప్పితే మరు మరీచకవలె ఆ కారణము అస్తిత్వమే లేకుండా పోతుంది. సృష్టికారణ భావమే హేత్వాభాసన కలిగిస్తున్నది.

ఈ వాదము సలుపు వారు కార్యకారణాలు రెండూ తమ ఉత్పత్తికి తామే పరస్పరం ఆధారమై ఉన్నాయి అంటారు. కాని కారణం కార్యం కంటే ముందు ఉంటుందని కార్యం కారణం తరువాత ఉంటుందని చెప్తున్నారు ఇవి ఏమీ హేతువుకు నిల్చవు.

కారిక-18: యదిహేతోః ఫలా త్సిద్ధిః ఫలసిద్ధిశ్చ హేతుతః ।

    కతరత్పూర్వ నిష్పన్నం యస్య సిద్ధి రపేక్షయా ॥

భావం: కార్యకారణములకు కారణమైనది ఏది ముందుగా ఉత్పన్నమైనది?

వివరణ: ఏవిధంగా చూచినా కార్యకారణ సంబంధం అసంభవం వాటికి అస్తిత్వమే లేదు. కాని ప్రతివాదులు వాటి అస్తిత్వం కొరకు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి అంటున్నారు. ఇప్పటికీ గౌడపాదుడు వదలకుండా వాటిలో ఏది ముందు తేల్చుకోవాలని ఇది తేలితేగాని వాటిపరస్పరాధారముకూడా తేలదని ఖండిస్తున్నాడు.

కారిక-19 : అశక్తి రపరిజ్ఞానం క్రమకోపో-ధనా పునః ।

    ఏవం హి సర్వధా బుద్ధేః అజాతిః పరి దీపితా ॥

భావం: ప్రత్యుత్తరం ఇవ్వడంలో అశక్తత - విషయ పరిజ్ఞానం లేకపోవడం - కార్యకారణముల స్థాపనలో అసంభవత ఇవన్నీకూడా జ్ఞానులను అజాతివాదాన్నే నమ్మునట్లు చేస్తున్నాయి.

వివరణ: పైన చెప్పిన కారణాలతో వివేకి అయిన వేదాంత విద్యార్థి గాని, జ్ఞానియైన ఋషిగాని అజాతవాదమే పరమమైనదని స్థిరపర్చగల్గిరి. శ్రీశంకరులు ‘‘ఈవాదాలలోని అసందర్భం తెలిసికొన్న జ్ఞానులకు అజాతివాదము నభివ్యక్తపర్చడానికే దారితీస్తున్నది’’ అని సూటిగా చెప్పినారు.

కారిక-20: బీజాంకురాఖ్యో దృష్టాన్తః సదాసాధ్య సమో హి సః ।

    నహి సాధ్య సమో హేతుః సిద్ధౌ సాధ్యస్య యుజ్యతే ॥

భావం: బీజాంకురన్యాయమే ఇంక సాధించవలసింది. అట్లు స్వయంగా సాధితముగాని విషయము సాధ్యమైన మరియొక విషయమను సిద్ధింపజేయలేదు గదా!

వివరణ: బీజాంకురము వంటిదే కార్య కారణము కూడా అని వాదించే ప్రతి పక్షులకు ఇది సమాధానం. ఇంతవరకు బీజాంకుర న్యాయం తేలలేదు. విత్తు ముందా? చెట్టుముందా? అంటే మొక్క పుట్టకముందు విత్తు కార్యము. మొలక పుట్టిన తర్వాత విత్తు మొక్కకు కారణము. ఒకే విత్తనంలోని విభిన్నకాలంలోని అవస్థలీ కార్యకరణము లగుచున్నాయి. విభిన్న కాలాలలో, విభిన్న దేశాలలో ఒకే కారణము కార్యముగను, అదే కార్యము కారణముగ నగుచున్నవి. చివరకు బీజాంకుర న్యాయంలో ఏది దేనికి కారణమో చెప్పలేము. దీని ఆధారంగా చెప్పిన కార్యకారణ వాదము జగత్సుృష్టికి ఉదాహరించ రాదు అని గౌడపాదుని తీర్మానం.

కారిక-21: పూర్వాపరా పరిజ్ఞానం అజాతేః పరిదీపకం ।

    జాయమానాద్ధి వై ధర్మాత్‌ కధం పూర్వం నగృహ్యతే ॥

భావం: కార్యకారణముల యొక్క పూర్వాపర అపరిజ్ఞానమే అజాతివాదాన్ని బలపరుస్తున్నది. కార్యమగు జీవాత్మ వాస్తవములో ఒక కారణము నుండి పుట్టినదే యైన ఆ పూర్వ కారణమును చెప్పడానికి సమర్థత చాలడం లేదు ఈ వాదమునకు.

వివరణ: ద్వైతులు తమ కార్యకారణములకు పూర్వ పరస్థితిని నిర్ణయించలేకపోవడంతో ఏది, ఎప్పుడూ ఏ కారణం నుండి కార్యరూపంలో సృష్టింపబడలేదు. ఈ విధంగా వారు (ద్వైతులు) అజాతి వాదాన్నే తెల్పుతున్నారు. ఈ ప్రపంచం కార్యమే అయినప్పుడు దానికి నిశ్చయకారణాన్ని చూపలేమన్నారు. దీన్ని బట్టి అజాతవాదమే నిశ్చయము.

కారిక-22: స్వతో వా పరతో వాపి న కించిద్వస్తుజాయతే ।

    సదసత్సద సద్వాపి నకించిద్వస్తు జాయతే. ॥

భావం: స్వతః గాని పరతః గాని ఈ రెండిరటివలనగాని ఏ వస్తువు ఉద్భవించ లేదు. సత్తుగాని అసత్తుగాని సదసత్తుగాని ఏ వస్తువును ఉద్భవింపజేయలేదు.

వివరణ: సాంఖ్యులు, న్యాయవైశేషికుల యొక్క మతములను సంగ్రహించి గౌడపాదుడిచట వేదాంత నిర్ణయమగు అజాతవాదాన్ని స్థాపిస్తున్నాడు. సృష్టి ఉద్భవించుటకు సంభావ్యమగు ఆరు మతాలను చెప్పి ఇవన్నీ నిలచవని తీర్మానిస్తున్నాడు.

1) తననుండి (స్వతః) తాను ఏదీ పుట్టలేదు. ఉదా॥ ఒకఘటము ఆ ఘటమునుండియే పుట్టలేదు.

2) ఒక వస్తువు తనకంటె భిన్నమైన (పరతః) యితర వస్తువునుండి పుట్టదు. పటమునుండి పటము (వస్త్రం) ఉత్పత్తి చేయలేము.

3) ఒకవస్తువు తననుండి యితర వస్తువునుండి (స్వతః పరతః) రెండు విధాల ఒకేసారి ఉద్భవించ జాలదు. ఒక ఘటము ఒకపటము కలిసి మరొక ఘటాన్నిగాని, పటాన్నిగాని తయారుచేయలేవు

4) సత్తు నుండి అనగా ఎల్లప్పుడు ఉండేదాన్ని నుండి ఏదీ తనను తానే

ఉత్పత్తి చేసుకోలేదు. నన్ను నేనే పుట్టించుకోలేను. నేనిదివరకే ఉన్నాను. నన్ను మరల ఉత్పత్తి చేయలేను.

5) అసత్తు నుండి అనగా లేనిదానినుండి జగదుత్పత్తి కల్గినదన్నచో అది అత్యంత విరుద్ధం. ఉదా॥ ఎండమావుల నుండి నీటిని పుట్టించలేము. మానవునకు కొమ్ములుగాని, తోకనుగాని ఉత్పత్తి చేయలేము. అసలు లేని దాన్ని నుండి ఏదీ ఎప్పుడూ పుట్టదు.

6) సదసత్తులనుండి అనగా ఉండీ లేనిదాని నుండి జగత్తు ఉద్భవించదు. ఇది అసంభవం. వ్యతిరేక వస్తువులు ఒక దానితో ఒకటి కలిసి ఉండవు. ఒక వస్తువు ఒకే కాలంలో సత్తుగా మరియు అసత్తుగా ఉండలేదు. దీనికి బౌద్ధల క్షణిక విజ్ఞానం ఆధారం. వారి ప్రకారం భౌతిక వస్తువులన్నీ మనోభావాల వంటివే. భావములు క్షణక్షణం మారుతుంటాయి. ప్రతీభావం వెలికి వచ్చిన వెంటనే నశిస్తుంది. అట్టి భావాన్ని సదసత్‌ అంటే ఉన్నదీ లేదు అని చెప్పవచ్చు. కానీ ఇది అత్యంత అసమంజసం. వివేక హీనం. ఒక వస్తువును చూపి ఇది ఇదీ అని చెప్పేలోపలనే అది నశిస్తే దానిని చూపించడమే సాధ్యం కాదు. ఇదే నిజమైతే స్మృతి అస్సలు లేదన్న మాట.

ఈ విధంగా గౌడపాదుడు ఆ సిద్ధాంతాలను పరాభూతం చేసి అజాతవాదాన్ని స్థిరపరుస్తున్నాడు.

కారిక-23: హేతుర్నజాయతే నాదేః ఫలంచాపి స్వభావతః ।

    ఆదిర్నవిద్యతే యస్య తస్య హ్యాదిర్న విద్యతే ॥

భావం: అనాదియైన ఫలములనుండి హేతువు ఉత్పన్నం కాజాలదు. ఫలమగు కార్యం కూడా స్వతః జన్మించినది కాదు. ఏది అనాదియో అది తప్పక జన్మలేనిది అజమై ఉంటుంది.

వివరణ: మరొక వాదనను ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ‘‘అనాదికారణము నుండి కార్యం ఉద్భవిస్తుంది. లేదా కార్యము స్వతఃగానే ఉత్పన్నం కావచ్చు. ఈ రెండూ తప్పని గౌడపాదుని ఖండన.