శ్రీ పాణ్యం వాఙ్మయ నిధి పాణ్యం వంశ రచయితల సాహిత్యము

మాండూక్యోపనిషత్తు › అద్వైత ప్రకరణము — 3

అద్వైత ప్రకరణము — 3

మాండూక్యోపనిషత్తు · భాగము 9 / 14

వివరణ: మనో నిగ్రహం పొందేందుకు వివిధ మతస్థులు క్రింది విధమైన సాధనలను అనుసరిస్తారు.

యోగులు: ఇంద్రియ సంచారాన్ని తగ్గించి మనస్సును స్వాధీనం చేసుకునేందుకు ప్రాణాయామం, హఠయోగం వంటి వాటిని సాధన చేస్తాడు.

భక్తులు: భక్త్యుద్రేకం పై ఆధారపడతారు.

వేదాంతి: వివేకమనే సూక్ష్మ సాధనతో మనస్సును స్వాధీన పరచుకొని పవిత్రీకరించుకుంటాడు.

పైన పేర్కొన్న అభయం, దుఃఖక్షయం, ప్రబోధం, అక్షయ శాంతి అనే లక్షణాలు శుద్ధచైతన్య తత్త్వాన్నే తెల్పుతున్నాయి.

కారిక-41: ఉత్సేక ఉదధే ర్యద్వత్కు శాగ్రేణైక బిందునా ।

    మనసో నిగ్ర హన్త ద్వద్భవే దపరిఖేదతః ॥

భావం: తిత్తిరి పక్షి కుశాగ్రముతో నీటి బిందువులను గ్రహించి సముద్రాన్ని ఇంకించేందుకు ప్రయత్నించినట్లు విసుగుచెందని దీక్షతో కొంచెం కొంచెంగా మన మనస్సును వశం చేసుకోవలెను

వివరణ: హితోపదేశంలో తిత్తిరి పక్షి కథ ఉంది. దర్భపోచ నోట పట్టుకొని సముద్రంలో అద్ది ఒక్కొక్క నీటి బొట్టును ప్రక్కన విదిలిస్తూ సముద్రాన్నే ఎండిరచేందుకు విసుగు లేకుండా తిత్తిరి పక్షి ప్రయత్నిస్తుంది. అట్లే మనస్సును నిగ్రహించడానికి యోగి చిత్తవృత్తులను ఒక్క టొక్కటిగా నిరోధించి మనస్సును పవిత్రీకరించుకుంటున్నాడు. కాని ఇది చాలా కఠినము. అసాధ్యం. అని గౌడపాదుని నిష్కర్ష. ఈ పద్ధతి ద్వారా కూడా అమనస్క స్థితి పొందే అవకాశం లేకపోలేదు. కాని జ్ఞానిచే అవలంబింపబడే ఆత్మజ్ఞాన మార్గములో వివేకము చే మనస్సు లయింప చేయబడుతుంది.

విశేషం: తిత్తిరి పక్షి ప్రయత్నాన్ని తెలుసుకొన్న పక్షిరాజు గరుత్మంతుడు ముచ్చటపడి. సముద్రాన్ని బెదిరించి దాని గుడ్లు తెచ్చి ఇప్పించినాడు. ప్రయత్న పరునికి దైవము సాయం చేస్తాడు.

కారిక-42: ఉపాయేన నిగృహ్ణీయా ద్విక్షిప్తం కామభోగయోః ।

    సుప్రసన్నం లయే చైవ యథాకామో లయ స్తథా ॥

భావం: కామ భోగములయందు విక్షిప్తమైన మనస్సును లయమందు సుఖించు మనస్సును కూడా సక్రమమార్గంలో సంపూర్ణ శిక్షణనిచ్చి నిగ్రహించవలెను. కామభోగాదులు ఎంత ప్రమాదకారులో లయం కూడా అంత ప్రమాదకారి అని హెచ్చరిస్తున్నాడు.

వివరణ: ఇక్కడినుండి 7 శ్లోకాలు శ్రద్ధగల సాధకునికి కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. సత్యమార్గాన్ని అనుసరించే నిజమైన సాధనకు ఇవి చాలా ఉపయుక్తం. ధ్యానంలో సంభవించే విఘ్నాలు, వాటి కపటోపాయాలు గౌడపాదుడు సూచిస్తున్నాడు. లయం అంటే మనస్సు హఠాత్తుగా అప్రయత్నంగా మునిగి పోవడం ఇది చాలా ప్రమాదకరమైన విఘ్నం. దీన్నే నిద్ర లేదా కునికిపాటుగా తెలుసుకోవచ్చు. విషయములనుండి మరల్చి నప్పుడు ఏకాగ్రత కల్గినప్పుడు నిద్ర వంటి స్థితి ఏర్పడుతుంది. ఇది చాలా ప్రమాదకారి. ఇట్టి స్థితిలో వెంటనే మనస్సును మేలుకొల్పి మళ్ళీ ఉత్తేజితం చేయవలెను. సహజంగానే మనస్సు భూత భవిష్యత్‌ వర్తమాన కాలాలల్లో విహరిస్తుంటుంది. దానిని వెంటనే నియమించడం అవసరం అట్టి సాధనలో లయం కూడా లేకుండా సాధన కొనసాగించే వాడే మనస్సును జయించగలడు.

కారిక-43: దుఃఖం సర్వమను స్మృత్య కామభోగాన్ని వర్తయేత్‌ ।

    అజం సర్వమను స్మృత్య జాతం నైవతు పశ్యతి ॥

భావం: ఇంద్రియాగ్రాహ్యములైన విషయభోగములు దుఃఖ భూయిష్టములని స్మరించి వాని నుండి మనస్సును మరల్చవలెను. అట్లే అజమైన బ్రహ్మనే సదా స్మరించుచుండిన యీ ద్వైత ప్రపంచాన్ని మనం చూడము.

వివరణ: వేలకొలది కోరికలలో అలజడి చెందే మనస్సును స్వాధీన పరచుకొనే మార్గాన్ని ఉపదేశిస్తున్నాడు. సహజంగా మనస్సు సుఖానుభవ కాంక్షతో ఇంద్రియ విషయ జాలమందు చిక్కుకొని ఉంటుంది. దీన్నే సమీచీనత్వ భావన అంటాం. అంటే విషయ వాంఛలే మనకు నిత్యానందాన్నివ్వగలవు అనే గాఢమైన భావన. దీని ప్రభావంతో నిత్యత్వ భావన మరుగున పడుతుంది. దీన్ని అద్వైతంలో వివేకం మాత్రమే ఈ భేదాన్ని చూపగలదు. మనస్సులో స్వయంగా ఆరోపితమైన ఆవరణలనుండి తనను విముక్తునిగా చేసుకోవడం సాధకుని కర్తవ్యం. వీటన్నింటినీ నడిపించేది శుద్ధ చైతన్య తత్త్వమే. వివేకముతో దీన్ని గ్రహించిన వాడే ఇంద్రియా కర్షణలకు లోబడదు.

కారిక-44: లయే సంబోధయేచ్చిత్తం విక్షిప్తం శమయే త్పునః ।

    సకషాయం విజానీయాత్సమప్రాప్తం న చాలయేత్‌ ॥

__భావం: __లయమందు చిత్తాన్ని ప్రబోధించవలె. విక్షిప్తమైనప్పుడు దాన్ని శమింపజేయాలి. ఈ రెండిరటి మధ్య శక్తి వంతమైన కోరికలు అనభివ్యక్తమైన ఉన్నవని తెలుసుకొనవలెను. ఆ చిత్తము సమస్థితిని పొంది దీన్ని సంచలింప జేయవద్దు.

వివరణ: ఏ కాగ్రం చేయబడిన మనస్సు స్థిరంగా ఉండలేదు. మళ్ళీ సంకల్పాలను చేరుతుంది. అంటే పూర్వమనుభవించిన సుఖ స్మృతులందుగాని, వర్తమానంలోని సుఖానుభవంలోగాని, భవిష్యత్తులోని సుఖాకాంక్షల యందుకాని సంచరిస్తుంది. ఇది గుర్తెరిగి సాధకుడు వెంటనే ధ్యానం ద్వారా (వివేకం) అ సత్యపు విలువలనుండి దాన్ని విడదీసి స్థిరపరచుకోవలె. ఇట్టి స్థితిలోకూడా మనస్సులోనుండే శక్తి వంతమైన వ్యతిరేక ప్రభావాలు ప్రవృత్తులు వీటినే కషాయం అని గౌడపాదుడు పేర్కొంటున్నాడు. వీటిని మళ్ళీ సమస్థితికి తెచ్చుకోవడం సాధకుని కర్తవ్యం. ఇవన్నీ సాధనలోనే మనం పొందే ప్రభావవంతమైన విఘ్నాలుగా గౌడపాదుడు హెచ్చరిస్తున్నాడు.

కారిక-45: నా-స్వాదయే త్సుఖం తత్ర నిస్సంగః ప్రజ్ఞయా భవేత్‌ ।

    నిశ్చలం నిశ్చరచ్చిత్త మే హి కుర్యాత్ప్రయత్నతః ॥

భావం: సమాధియందు సుఖమును అనుభవించేందుకు మనస్సును వదలరాదు. సుఖాసక్తి నుండి మనస్సును వివేకముతో మరలించవలెను. నిశ్చలమై కూడా మనస్సు బాహ్య విషయములందు పరుగెత్తనారంభించిన స్వప్రయత్నంతో ఆ మనస్సును మళ్ళీ ఆత్మతో ఐక్యం చేయవలెను.

వివరణ: వెనుక శ్లోకంలో చెప్పిన కషాయం లను దాటిన తర్వాత సాధకుడు సమాధి స్థితిని పొందుతున్నాడు. అది మిక్కిలి ఆనందదాయకమైన అనుభవం. వాస్తవానికి అది బ్రహ్మానంద వాసనలు కల్గునది. కాని దాన్నే బ్రహ్మానందం అనే ఆత్మ వంచనకు బలికాకూడదని గౌడపాదుని హెచ్చరిక. ప్రపంచానుభవంతో పోల్చినప్పుడు సమాధి గొప్పదే. ఎందుకంటే జగదనుభవం దుఃఖంతో అంతమైపోతుంది. కాని సమాధ్యవస్థ అట్టిది కాదు. అందుకని శాంత్యానందాలు గొప్పవే. కాని అవే పరమార్థంకాదనే స్పృహతో జ్ఞాన ప్రకాశమును వెతకవలెను. ద్వైత పరిధిలోని సమస్త అనుభవాలు త్యాజ్యాలే. నిర్విషయమైన మనస్సును స్వేచ్ఛగా వదలరాదు. శుద్ధచైతన్యమందు కేంద్రీకరించవలెను. ఈశ్వరానుగ్రహం, గురుకృపలతో మాత్రమే ఇది సాధ్యం.

కారిక-46: యదానలీయతే చిత్తం న చ విక్షిప్యతే పునః ।

    అనింగనమనాభాసం నిష్పన్నం బ్రహ్మ తత్తథా ॥

భావం: ఎప్పుడైతే ఈ మనస్సు లయస్థితియందు లగ్నం కాదో, సంకల్పాదులచే విక్షిప్తంకాదో ఎప్పుడైతే నిర్వికల్పమైన ప్రశాంతిని పొందుతుందో అదే బ్రహ్మానుభవ స్థితిగా చెప్పబడిరది.

వివరణ: శ్రీ శంకరభగవత్పాదుల సిద్ధాంతం జీవ బ్రహ్మైక్యం అదే జ్ఞానం. దాన్నే సంక్షేపిస్తే మానవుడు తనలోని మనస్సును తీసివేస్తే దేవుడగుచున్నాడు. మనస్సు అశాంతికి మూలం అది లేనప్పుడు మిగిలేది పరమశాంతి అదే దేవుడు. దివ్యత్వం. అదే ఆత్మ తత్త్వం.

తత్‌, తథా అనే రెండు సర్వనామాలు జ్ఞానతత్త్వాన్ని సూచిస్తున్నాయి. ఇది ఉపనిషత్తల ద్వారా నిర్వచింపబడినదే.

ఆత్మతత్త్వముగా తెల్సినప్పుడు జ్ఞానస్థితిగా తెల్పి ఆత్మీయానుభవంగా అందుబాటులోకి రావడం ఈ శ్లోకం సూచిస్తుంది.

కారిక-47: స్వస్థం శాంతం సనిర్వాణమకథ్యం సుఖముత్తమం ।

    అజమజేన జ్ఞేయేన సర్వజ్ఞం పరిచక్షతే ॥

__భావం: __అతీతానందము ఆత్మజ్ఞానం పొందడం వల్లనే కల్గుతుంది. అది అజమైన ముక్తి రూపశాంతి ఆత్మతో ఐక్యం పొందినది కాబట్టి సర్వజ్ఞం బ్రహ్మగానుంది.

వివరణ: మనస్సు స్థిరమై ప్రశాంతమైనప్పుడు అనుభవించదగిన ఈ ఆనందమే ఉత్కృష్టానందం. ఇదే ముక్తి నిచ్చేది ఇది అనిర్వచనీయం. దీన్ని పరిమిత భాషలో వర్ణించలేము. జ్ఞాన, జ్ఞేయం రెండూ ఈ శ్లోకంలో చెప్పబడినాయి. వెనుక చాలా చోట్ల వివరించబడినవీ లక్షణాలు.

కారిక-48: నకశ్చిజ్జాయతే జీవః సంభవో-స్య న విద్యతే ।

    ఏతత్తదుత్తమం సత్యం యత్రకించిన్న జాయతే ॥

భావం: ఈ ప్రత్యగాత్మ రూపాలైన జీవులు అసలెప్పుడూ జన్మించలేదు. వాని జన్మకు కారణమే లేదు. ఎచట ఏదీ జన్మించలేదో అదే ఉత్తమమైన సత్యము.

వివరణ: అజాతవాదం పునఃస్థాపించబడుతున్నది. జాతము (పుట్టుక) వట్టి భ్రమ అజాతమే ఆ సత్యతత్త్వము. ద్వైత ప్రపంచాన్ని చూసి దాని పుట్టుకకు కారణాన్ని అన్వేషించేవాడు ఆకాశంలో పక్షుల పాద చిహ్నాలను వెతికే మూర్ఖుని వంటివాడే. వశిష్ఠ, గౌడపాదులు అజాత వాద మూలపురుషులు. శంకురుల దీన్ని కొంచెం సులభతరం చేసి ‘సంబంధరూపేణ జగత్సత్యం’ అన్నాడు. కాని గౌడపాదులు, వశిష్ఠులిద్దరూ అజాతవాదాన్నే స్థిరపరచారు.

త్రాడు గుణం తెల్సినవాడు భ్రాంతసర్పాన్ని చూచి భయపడే మూర్ఖుని నిందిస్తాడు. పరిహసిస్తాడు. గౌడపాదుడుకూడా ఇట్టివాడే. అతని దృష్టిలో తనకు భిన్నమైన వస్తుప్రపంచమే లేదు. ఆత్మయే సత్యమగుట వలన అది అజాత వాదమై ఉన్నది.

అధ్యాయం-4