శ్రీ పాణ్యం వాఙ్మయ నిధి పాణ్యం వంశ రచయితల సాహిత్యము

మాండూక్యోపనిషత్తు › అద్వైత ప్రకరణము — 2

అద్వైత ప్రకరణము — 2

మాండూక్యోపనిషత్తు · భాగము 8 / 14

కారిక-20: అజాతస్వైవ భావస్య జాత మిచ్ఛంతి వాదినః

    అజాతో హ్యమృత్‌ భావో మర్త్యతాం కథమేష్యతి॥

__భావం: __అజాతమైన ఆత్మ తత్త్వం జన్మపొందినదని ద్వైతుల సిద్ధాంతం. అజాతమైన అమృతమైన తత్త్వం మర్త్యత్వం ఎట్లా పొందుతుంది?

వివరణ: వెనుకటి శ్లోకభావనకే ఇది కొనసాగింపు, అవికారమైన ఆత్మ వికారమును పొందినదన్న ద్వైతులు భావమే విరుద్ధంగా ఉంది. ఈ భావమే అమృతం మృతం ఎట్లా అవుతుంది అని ప్రశ్నింపబడుతున్నది. దీనికి కొందరు ప్రతివాదులు ఏల కాకూడదు? అని అడుగవచ్చు. దాని జవాబు క్రింది శ్లోకంలో ఉంది.

కారిక-21: నభవత్యమృతం మర్త్యం నమర్త్యమమృతం తథా ।

    ప్రకృతే రన్యధాభావో నకథంచద్భవిష్యతి ॥

భావం: అమృతత్త్వం మర్త్యత్వం పొందజాలదు. మర్త్యత్వం అమృతంగా మారలేదు. ప్రకృతి సిద్ధమైన తత్త్వాన్ని మార్చుకొని కూడా అది ప్రకృతి తత్త్వంగానే ఎట్లుంటుంది?

వివరణ: ప్రకృతిలో ఒక పదార్థం తన సహజ రూపాన్ని మార్చుకోకుండా మరియొక పదార్థంగా మారదు. ఇది అసాధ్యం మారినప్పుడు తన మొదటి స్వరూపం పోగొట్టుకోవలసిందే. ఎగిరే కొండలు, మంచువంటి అగ్ని, అగ్నివంటి మంచు ఇత్యాదులు పిచ్చివాని ఆలోచనలు. కాని ప్రకృతిలో అసాధ్యం. ద్వైతుల సిద్ధాంతం అమృతత్త్వం మర్త్యత్వం పొందుతుందనడం ఇట్టిదే.

కారిక-22: స్వభావేనామృతో యస్యభావో గచ్ఛతి మర్త్యతాం ।

    కృతకేనామృత స్తస్య కథంస్థాస్యతి నిశ్చలః ॥

భావం: స్వభావంతో అమృతమైన తత్త్వాన్ని మర్తత్వము పొందిన దానిగా విశ్వసించి, అదే స్థిరమై నిశ్చలమై మన సహజ తత్త్వమును పోషించు కొనుచున్నదని ఎట్లా భావించగలడు?

వివరణ: అమృతరూపమైన ఆత్మ ఈ ప్రపంచంలోని నా నారూపములుగా పరిణమించి కూడా అట్లే అమృత తత్త్వంగా నిల్చి ఉంది. అని చెప్పే ద్వైతసిద్ధాంతాన్ని గౌడపాదుడు ఖండిస్తున్నాడు. చక్కని వివేకంతో యోచించేవానికి ఇది అయుక్తంగా అసంగతంగా కన్పిస్తుంది.

కారిక-23: భూతతో-అభుతతోవా-పి సృజనమానే సమాశృతిః ।

    నిశ్చితం యుక్తియుక్తం చ యత్తద్భవతి నేతరం ॥

భావం: సృష్టి సత్యమని, అసత్యమని రెండిరటికి సమంగానే ప్రాధాన్యత ఇస్తుంది శృతి. దాన్ని యుక్తి వాద సహజమైన తత్త్వమని నమ్మవచ్చు. అట్లుగాకున్న దాన్ని తత్త్వంగా ఒప్పుకోలేము.

వివరణ: ‘‘వాదమునకు యుక్తియుక్తంగా, వివేచనతో పరిశీలించువారికి సరియైన స్థిరసూక్తులుగా ఉన్న శ్రుతి సిద్ధాంతాన్ని వేదాంతి అంగీకరిస్తున్నాడు. అగ్నిచల్లగా ఉంటుంది. అని ప్రకటించబడితే దాన్ని వేదాంతి అంగీకరించడు. మహర్షులు తమ తపోనిష్ఠతో ధ్యాన స్థితిలో కనుగొన్న అంతఃప్రేరిత విజ్ఞానాన్ని వేదాంతి గౌరవిస్తాడు. శాస్త్ర గ్రంథాలలో పూర్వభాగములోదానికి / పరభాగములోని దానికి వ్యతిరేక భావనలున్నాయి. వాటిని వాచ్యార్థంలో కాకుండా అందు ధ్వనించే నిరూపకార్థంలో గ్రహిస్తాడు వేదాంతి.

పూర్వభాగములో పరమాత్మనుండి ప్రపంచం సృష్టించబడిరది అన్నప్పటికినీ పరభాగంలో ఈ దృశ్యమాన ప్రపంచం ఆత్మయందు ఆరోపించబడిరది. ఇది మనస్సు యొక్క ఇంద్రజాలం అని తీర్మానిస్తుంది. మొదటిది గౌణార్థం (అముఖ్యం) రెండవది ప్రధానార్థంగా గ్రహించినాడు అద్వైతి.

కారిక-24: నేహ నానేతి చామ్నయాదిన్ద్రో మాయాభి రిత్యపి ।

    అజాయమానో బహుథా మాయయా జాయ తే తుసః ॥

భావం: ‘నేహనానాస్తి’ ‘ఇంద్రోమాయాభిః’ వంటి శృతి వాక్యములు ఆత్మ అజము అని స్థాపిస్తున్నాయి. కాని మాయ చేతనే ఆత్మనానారూపము పొందినట్లు తెలుస్తుంది.

వివరణ: గౌడపాదుడు తరచుగా ఉల్లేఖించు బృహదారణ్యకం ‘పూర్వార్థం’ రెండు వాక్యాలు. యాజ్ఞవల్కునితో చెప్పబడినాయి. 1) నానాత్వవిశిష్ట ప్రపంచ సృష్టి వాస్తవానికి తానే లేదు. 2) ఈ ప్రపంచమంతా ఇంద్రుని మాయచే సృష్టించబడిరది.

కేనోపనిషత్తు ఇంద్రుని మనస్సుకు అధిదేవతగా పేర్కొంటుంది. అందుకే ఇంద్రుని మాయ అంటే మనస్సు అనే అర్థం. మనస్సు ద్వారా చూచినప్పుడు (మనస్కమైనప్పుడు) ఈ ప్రపంచం నామరూప సహితం. అమనస్కమైన ఆత్మ దృష్ట్యా ఈ ప్రపంచం లేనేలేదు. రెండు వాక్యాలను బట్టి ‘ఆత్మ అజమైనప్పటికీ బహుధా భిన్నమై భాసిస్తుంది.’ అనే సారాంశం ఏర్పడుతుంది.

కారిక-25: సంభూతే రసవాదాచ్చ సంభవః ప్రతిషిధ్యతే ।

    కోన్వేనం జనయే దితి కారణం ప్రతిషిధ్యతే ॥

భావం: సృష్టిని నిషేధించడం ద్వారా కార్యం నిషేధింపబడిరది. ఆత్మను ఎవరు సంభవింపచేయగలరు? అనే ప్రశ్నద్వారా కారణం నిషేధించబడిరది.

వివరణ: వేదాంతవిజ్ఞాన శాస్త్రంలో ప్రతిపాదనలన్నీ సృష్టిని నిరాకరించును. పరమాత్మ అచలము. తనకంటె వేరొక వస్తువుగా మారుటకుగాను ఆత్మ పరిణామం చెందునదికాదు. బృహదారణ్యకం ఆత్మ నుండి సృష్టి ఉత్పత్తిని నిషేధిస్తుంది. ఆ పరమాత్మ పరిణామం పొందదు. ఎందుకంటె దానికన్నా ఇతరమైనదేమీ లేదు. ఇతర మైనదేదీ ఆత్మను సృష్టింప జాలదు అని వాదిస్తుంది. జగత్సృష్టికి ఆత్మ ప్రత్యక్షంగాగాని, అప్రత్యక్షంగాగాని కారణం కాజాలదు. కార్యకారణ భావం మనస్సు పరిధిలోనిదే.

కారిక-26: స ఏష నేతి నేతీతి వ్యాఖ్యాతం నిహ్నుతే యతః ।

    సర్వమగ్రాహ్య భావేన హేతు నాజం ప్రకాశతే ॥

__భావం: __పరమాత్మ అగ్రాహ్యం - ద్వైతులు దేనిని ఆత్మయని చెప్పుచున్నారో అది ఆత్మకాదు - అది ఆత్మకాదు అని ఉపనిషత్తులు నిషేధిస్తున్నాయి. కావున అజమైన పరమాత్మ ఒక్కటే. ద్వైతం లేదు.

వివరణ: బృహదారణ్యోపనిషత్‌లో ‘నేతి-నేతి’ అని ఆత్మ సూచింపబడిరది. మాండూక్యంలో కూడా నిషేధ పద్ధతిద్వారానే ఆత్మకో లక్షణం చెప్తుంది. మన పరిమిత బుద్ధిచే గ్రహింపలేము. నిషేధ పద్ధతిలోనే భ్రమ నివారించబడుతుంది. స్థూల, సూక్ష్మ శరీరాలను నిషేధించిన తర్వాత చివరికి మిగులునది అద్వైత సత్య తత్త్వమే.

కారిక-27: సతో హి మాయయా జన్మ యుజ్యతే నతు తత్త్వతః ।

    తత్త్వతో జాయతే యస్య జాతం తస్యహి జాయతే ॥

__భావం: __సత్‌ నుండి జగత్తు తయారైందని చెప్పిన అది మాయాజాతమే కాని వాస్తవం కాదు. ఇట్లు ఆ పరమాత్మ జగద్రూపంలో జన్మించడం సత్యమని నమ్మేవారికి ఒకసారి జన్మించింది మళ్ళీ మళ్ళీ జన్మించడంవల్ల అనవస్థ ఏర్పడుతుంది.

వివరణ: కార్యకారణవాదం ప్రకారం పరమాత్మ నుండి ప్రపంచం పుట్టింది. దానికి కారణం ఏమి? ఒక్కసారి పరమాత్మకు కారణం పుట్టినప్పుడు దాని స్వయంభూ తత్త్వం లుప్తమైతుంది. అది మూలచ్ఛేదము. పరమాత్మకు కారణం ఏమి? అనే వరకు పోతుంది. ఒక్కోదానికి ఈ విధంగా కార్యకారణత్వం అన్వేషిస్తూ పోతుంటే దాని అంతుండదు. దీన్నే అనవస్థాదోషం గా శాస్త్రం పేర్కొంటుంది. పరమాత్మ అజం. అవికారం అని సిద్ధాంతరీకరిస్తుంది వేదాంతశాస్త్రం. కాబట్టి పరమాత్మ ప్రపంచానికి కారణం కాదు. అట్లు చెప్పడం తర్క విరోధంగా ఖండిస్తున్నాడు. గౌడపాదుడు.

కారిక-28: అసతో మాయయా జన్మ తత్త్వతో నైవ యుజ్యతే ।

    వంధ్యాపుత్రో న తత్త్వేన మాయయా వాపి జాయతే ॥

__భావం: __అసత్తునుండి నిజంగాగాని, మాయచేగాని ఏదీ పుట్టదు వంధ్యాపుత్రుడు (గొడ్రాలికి కుమారుడు) వాస్తవంలో జన్మించడు. మాయచేత గూడా జన్మించడు.

వివరణ: ‘అసత్తునుండి ప్రపంచం పుట్టిందని’ వాదించేవారికి ఈ శ్లోకంలో సమాధానం చెప్తున్నాడు. అసత్తు అంటే మిథ్య (లేనిది). దీనినుండి వాస్తవానికి కాని, భ్రాంతిలోకాని ఎట్టి కార్యము కల్గదు. వంధ్యకు పుత్రుడు నిజానికి కాని, మాయలో కాని జన్మించడు.

దీన్ని బట్టి జగత్తు సత్తునుండికాని అసత్తునుండికాని పుట్టలేదు. జగద్రూపకార్యమునకు కారణమే లేదు. జగత్తు సంభవించనేలేదు. మనో నిష్ట మాయా సృష్టియే ఈ నానాత్వ విశిష్ట ప్రపంచం అని నిరూపించబడిరది.

కారిక-29: యథా స్వ ప్నేద్వయాభాసం స్పన్దతే మాయయామనః ।

    తథా జాగ్రత్‌ ద్వయాభాసం స్పన్దతే మాయయా మనః ॥

భావం: మాయవల్లనే స్వప్నంలో జగత్తునానా రూపంగా భాసిస్తుంది. అట్లే జాగ్రత్తులో కూడా జగత్తు మాయ కారణంగానే నానారూపంగా భాసిస్తుంది.

వివరణ: స్వప్నంలో కలత చెందిన మనస్సు మాయయైన స్వప్న ప్రపంచాన్ని సృష్టిస్తుంది. స్వప్నాభిమానియైన తైజసుడు మనస్సులో ఐక్యం పొంది స్వప్న ప్రపంచం సత్యమని నమ్మి అందుండే సుఖదుఃఖాలను అనుభవిస్తున్నాడు. అట్లే జాగ్రత్తలో కూడా తద్ధశాభిమాని విశ్వుడు మనస్సులో ఐక్యంపొంది జగత్తును సత్యంగా భావించి, సుఖదుఃఖాలను అనుభవిస్తున్నాడు.

కారిక-30: అద్వయంచ ద్వయాభాసం మనః స్వప్నే నసంశయః ।

    అద్వయంచ ద్వయాభాసం తథా జాగ్రన్న సంశయః ॥

__భావం: __అద్వయమైన మనస్సే స్వప్నంలో నానారూపాలుగా చెదిరి పటా పంచలైతుంది. అట్లే జాగ్రత్తులో కూడా అద్వయమైన ఈ మనస్సే నానారూపాలుగా చెదిరి జాగ్రత్ప్రపంచరూపంలో భాసిస్తుంది.

వివరణ: సత్యం వలనే భాసించే బాహ్య ప్రపంచాకృతి అంతా కేవలం మనో కల్పితం. స్వప్నం ప్రపంచంలో ప్రత్యక్షమయ్యే ప్రతివస్తువు తైజసుని మనోవృత్తి తప్ప వేరు కాదు. అట్లే జాగ్రత్ప్రపంచంలో కూడా బాహ్య వస్తువులన్నీ విశ్వుని మనస్సుకంటే వేరుకావు. స్వప్నంలోని జింక- వేటకాడు వంటి విచిత్రమైన అనుభవాలన్నీ తైజసుని మనస్సు కంటే భిన్నంకాదు. అదే జాగ్రదవస్థలో కూడా విశ్వుని మనస్సుకంటె భిన్నంకాదు. కాని మనం అది తెలుసుకోలేం. చెప్పినా నమ్మలేం. గురుకరుణతో, సాధనతో శుద్ధ, బుద్ధ, నిత్య, పరమాత్మ జ్ఞానం కల్గినప్పుడే బాహ్య జగత్తుకూడా మాయ అని తెలుసుకుంటాం.

కారిక-31: మనో దృశ్యమిదం ద్వైతం యత్కించిత్సచరాచరం ।

    మనసోహ్యమనీ భావే ద్వైతం నై వోపలభ్యతే ॥

భావం: చరాచరమైన జగత్తు అంతా కేవలం మనో దృశ్యమే మనస్సునధిగమించి అమనీభావం (అమనస్కం) పొందిన వెంటనే ఈ ప్రపంచమే ఉండదు.

వివరణ: ఈ దృశ్య ప్రపంచం కేవలం ఆభాసమాత్రమే. చరాచరములు (స్థావర జంగములు) మనో దృశ్యమే మనస్సులేనిచోట ప్రపంచంలేదు. అమనస్కంలో ఇదే అనుభవిస్తున్నాం. వేరే ఆలోచనలో (పరధ్యానం) ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వారిని, వాటిని గుర్తించం. ఇదే మనకు అనుభవ సిద్ధమైన తార్కాణం. అమనీభావం, అమనస్కస్థితి వంటి పదాలు కేవలం సంస్కృత భాషకే సొంతం. అమనస్‌ అంటే మనస్సు లేకుండా పోవడం. మనస్సు అంతమైనప్పుడే దివ్యత్వం అంకురిస్తుంది. ఆత్మయే సర్వం అనే బుద్ధితో చూచినప్పుడు ప్రపంచం ఉండదు.

కారిక-32: ఆత్మ సత్యానుబోధేన న సంకల్పయతే యదా ॥

    అమనస్తాంతదాయాతి గ్రహ్యాభావే తదగ్రహం ॥

__భావం: __సత్యతత్త్వము తెలుసుకున్నచో మనస్సు ఉండదు. సంకల్పాలు ఉండవు. సంకల్ప రహితమైనప్పుడే అమనస్కంగా దానికి గ్రహణ శక్తి లేకుండటచే అగ్రహంగా ఉంటుంది. గ్రహణం నుండి ముక్తిపొందుతుంది.

వివరణ: మనో బుద్ధుల ద్వారా దృశ్యమాన ప్రపంచంలో తాదాత్మ్యం విడిచి పెట్టినప్పుడే ఆత్మ తత్త్వం తెలుస్తుంది. ప్రపంచాన్ని చూస్తున్నా కూడా ఆత్మ కంటె భిన్నంగా ఏదీ కన్పించదు. దీనినే అమనీభావం పొందడం లేదా దివ్యత్వం పొందడం అంటాం.

అమనీభావం లేకుండా ఆత్మజ్ఞానం సిద్ధించదు. గ్రహించు వస్తువులున్నప్పుడే మనస్సు స్వరూపం నిలుస్తుంది. ఇదే ఇంద్రియాలకు కేంద్రం. ఇది ఖాళీ ఐతే అమనస్సు. అప్పుడే శుద్ధ చైతన్య స్థితిలో జ్ఞానం పొందగలరు. జ్ఞానం తప్ప మరేదీ లేనప్పుడు గ్రహించడానికి మనస్సుకూడా ఉండదు.

కారిక-33: అకల్పకమజం జ్ఞానం జ్ఞేయా భిన్నం ప్రచక్షతే ।

    బ్రహ్మజ్ఞేయమజం నిత్యమజేనాజం విబుధ్యతే ॥

భావం: అజమైన నిర్విషయమైన జ్ఞానం జ్ఞేయం కంటే అభిన్నం. అజమైన, నిత్యమైన బ్రహ్మమే జ్ఞానమునకు జ్ఞేయము. అందుకే అజము చేతనే అజము తెలుసుకొన బడుచున్నది.

వివరణ: ఇందలి పదప్రయోగమే ఒక అద్భుతం. అసంభవమైనదాన్ని సిద్ధింపజేసే ప్రయత్నంలో సఫలం కావడం అనుభవైక వేద్యమే బ్రహ్మానుభవం వాగతీతమైనది. ఆ శుద్ధ చైతన్యమే బ్రహ్మజ్ఞానమని నిర్వచించినాడు.

పరమాత్మ సర్వవ్యాపియగు చైతన్యము. గుణాతీతము. దృశ్యప్రపంచము వలె దాన్ని గ్రహించలేము. శృతి కూడా నిర్వచించలేదు. వేదాతీతం అది.

మార్పులేనిదై సంకల్ప వికల్పరహితమైన జ్ఞానమే శుద్ధ చైతన్యం. సమస్త జీవులలో జీవ కేంద్రం అదే మనోవృత్తుల క్షణక్షణం మారిపోతూ ఉండడంవల్ల దానికి సంబంధించిన జ్ఞానానికే (గుణీకృతజ్ఞానం) అంటే రూప, నామాదులచే కల్గే జ్ఞానానికే పరిమితమైతున్నాం. కాని మనస్సు సంకల్ప వికల్ప రహితంగా మారిన వెంటనే జ్ఞానము తన్నుతాను తెలుసుకొనే శాశ్వత బ్రహ్మజ్ఞానంగా మారుతుంది. బ్రహ్మజ్ఞానానికి విషయం బ్రహ్మజ్ఞానమే. ఆత్మకంటే వేరే వస్తువులేదు దానికి. ‘అజమును అజమే’ తెల్సుకొనుట అంటే అదే. దాని గురించి బుద్ధి యోచించలేదు. మనసు భావించలేదు. పాము యొక్క వాస్తవ జ్ఞానం తెలిసినంతనే పాము త్రాడులో లీనమైపోతుంది. అట్లే అనాత్మపై ఆత్మ విజయం సాధించినప్పుడే ఆత్మజ్ఞానం పొందగలం.

కారిక-34: నిగృహీతస్య మనసో నిర్వికల్పస్య ధీమతః ।

    ప్రచారః సతువిజ్ఞేయః సుషుప్తే-న్యో న తత్సమః ॥

భావం: నిర్వికల్పమై, నిగృహీతమైన వివేకవంతుని మనస్సు యొక్క ప్రచారాన్ని తెలియవలెను. సుషుప్తిలోని మనస్సు భిన్నమైనది. అది ప్రశాంతంగా అణచబడిన మనస్సుతో సమానము కాదు.

వివరణ: అమనీభావ స్థితి నిద్రవంటిదేనా అనే సందేహానికి సమాధానం ఇది. మనస్సు బాహ్య విషయజ్ఞానము లేని స్థితి మనకు సుషుప్తిలో అనుభవమునకు వస్తుంది. ఇది భ్రాంతజీవుల విషయంలోనే సుమా! దీన్నే శుద్ధ చైతన్య స్థితిగా అపోహపడరాదని హెచ్చరిస్తున్నాడు గౌడపాదుడు. అమనస్క స్థితి నిద్ర కన్నా భిన్నమైనది.

మనస్సును అణచివేయడం రెండు విధాలు యోగ పద్ధతిలో తీవ్ర ప్రయత్నం ద్వారా ఆలోచనలు అరికట్టడం. ఇది దాదాపు అసాధ్యం.

జ్ఞాన పద్ధతిలో ‘చిత్తం బాలం లాలయ’ అని బాలుడైన మనస్సును బుజ్జగించి ఒప్పించి వివేకం ద్వారా మనో వృత్తులను శాంతింపజేయవలెనని బోధించబడిరది. అంటే మనస్సులో పుట్టే ఏహ్య వృత్తులను వివేకం ద్వారా తొలగించవలెను.

శుద్ధ వివేకము ద్వారా మాత్రమే మనస్సును స్వాధీనం చేసుకోగలము అప్పుడే ఆధ్యాత్మిక పరిపూర్ణత నొందగలం.

దీనికి ప్రతీక గీతోపదేశ సందర్భంలో ఐదు గుర్రాలు పూన్చిన రథాన్ని కృష్ణుడు నియమిస్తూ అంటే శుద్ధ బుద్ధి (వివేకం) శ్రీకృష్ణుడు. మనస్సు స్థానీయుడు అర్జునుడు. ఈ వివేకం కల్గినప్పుడే జీవుడు పరమాత్మను పొందగలడు. కఠోపనిషత్తులో ఈ వివరం ఉన్నది. వివేకం లేని సాధన వల్ల ఎన్నో జీవితాలు వ్యర్థం చేసుకోవడమే యోగంవల్ల మనస్సు నశింపవచ్చునేమో కాని పరిశుద్ధం కావడం వేరు. అందుకే ఎన్నో ఏండ్లు తపస్సు చేసినా కామక్రోధాదులు జయించలేక పోవడం. బలవంతంగా అణచివేసినప్పుడు మనస్సు సమయం చూచి వికృతంగా విజృంభిస్తుంది. అందుకే ‘‘మనస్సును వివేకంతో స్వాధీన పర్చకొని నెమ్మదిగా అందుండి సంకల్ప వికల్పాలను తొలగించుకోవాలని’’ ఉపదేశిస్తున్నాడు. అప్పుడే జ్ఞానముయొక్క జ్ఞానమే మిగులుతుంది. ఇది అనుకూలమైన ఆనందానుభవంగా మారుతుంది.

కారిక-35: లీయతే హి సుషుప్తే తన్నిగృహీతం న లీయతే ।

    తదేవ నిర్భయం బ్రహ్మజ్ఞానాలోకం సమంతతః ॥

__భావం: __నిద్రలో మనస్సు విశ్రాంతి పొందుతుంది. మరొక రకంగా చెప్తే అజ్ఞానంలో మునిగి ఉంది. కాని వేదాంత శిక్షణ పొందిన మనస్సు అట్లుండదు. అనుభవంలో నిద్రలోని మనస్సు, ఆత్మానుభవం పొందిన మనస్సు వేరు వేరు. జ్ఞాని మనస్సు భయరహితమైన బ్రహ్మలో లీనమగును. ఆత్మచేతనే ఆత్మ వ్యాప్తమై సర్వం జ్ఞాన ప్రకాశంగా ఉంటుంది.

వివరణ: రంగస్థల నటుడు తన పాత్ర వచ్చు వరకు తెరవెనుక నుండి, రంగస్థలంపైకి వచ్చునట్లు నిద్రలో మనస్సు తాత్కాలికంగా అజ్ఞానంలో ఉండి, మెళుకువవస్తూనే ప్రపంచమనే రంగంపైకి వచ్చి తన కామక్రోధాదులతో గూడిన నటనను మొదలు పెట్టుతుంది. కాని వివేకముతో శుద్ధమైన మనస్సు బ్రహ్మలో ఐక్యం పొందుతుంది. అట్టివానికి దేహ, మనో బుద్ధులు బ్రహ్మకన్నా అన్యంగా భాసించవు. త్రాడు యందు పాము ఆరోపితమైనంతవరకు పాము జ్ఞానమే ఉన్నట్లు, అది తొలగిన వెంటనే త్రాడు నిజ జ్ఞానం పొందినట్లు అప్పుడు వాస్తవానికి పాములేనట్లుగా మనస్సు బ్రహ్మలో ఐక్యం పొందినప్పుడు ఈ ప్రపంచమేదీ ఉండదు. ప్రధానంగా సాధనలో వివేకము ఉండవలెనని అప్పుడే మనస్సు పరిశుద్ధంగా మారుతుందని ఉపదేశిస్తున్నాడు గౌడపాదుడు.

కారిక-36: అజమనిద్ర మస్వప్న మనామక మరూపకం ।

    సకృద్విభాతం సర్వజ్ఞం నోపచారః కథంచన ॥

భావం: ఆ బ్రహ్మ అజం. అనిద్రం. అస్వప్నం. అనామకం. అరూపకం. సకృద్వి భావం. సర్వజ్ఞం. అట్టి బ్రహ్మకు ఎటువంటి పూజలు అవసరం లేదు.

వివరణ: పరమాత్మ సహజస్థితి వాగతీతం. వాక్కులతో చెప్పలేము. కానీ పరిమిత భాషలోనే ప్రత్యేక పదాలతో నిర్వచిస్తున్నాడు.

  1. అజం - జన్మలేనిది. మార్పులేనిది అని భావం. సదా సమమైనది. ఎట్టి పరిణామం పొందదు.
  2. అనిద్రం - నిద్రలేనిది. ఇక్కడ సుషుప్తి అనే అర్థంకాదు. ప్రాజ్ఞుడనుభవించే కారణ శరీరం లేనిది అని అర్థం. ఆనందం కోశంలో పొందే అనుభవాన్ని కూడా అధిగమించినప్పుడే ఆత్మను పొందగలం. నిద్ర అంటే అజ్ఞానమని కూడా ఆత్మ శుద్ధ జ్ఞానము కదా! దాన్ని పొందిన వెంటనే అజ్ఞానం దాని ఫలితమైన మాయ స్పష్ట ప్రపంచం కూడా మాయమైతాయి.
  3. అస్వప్నం: స్వప్నం లేనిది. ఇది జాగ్రత్తును, స్వప్నాన్ని రెండు అవస్థలనూ తెల్పుతుంది. ఇవి రెండూ మాయా జగత్తులే కదా. వేదాంతికి జాగ్రత్‌ కూడా స్వప్న తుల్యమే.
  4. అనామకం, 5) అరూపకం: నామరూపములులేనిది. నామరూపాత్మకమైన జగత్తు తత్త్వంలో లేదు.
  5. సకృత్‌ విభాతం: సదా ప్రకాశించేది. శుద్ధ చైతన్యం. అంతేకాని సూర్యప్రకాశం కాదు. అగ్ని ప్రకాశం కాదు. స్వయం ప్రకాశం కాబట్టి దాన్ని గ్రహించడానికి మరొక జ్ఞాత ఉండదు.
  6. సర్వజ్ఞం: సమస్త జ్ఞానం కలది. అన్ని జ్ఞానములకు జ్ఞానము ఈ ఆత్మ. భూత భవిష్యత్‌ వర్తమానాల జ్ఞానాలన్నింటినీ అఖండంగా ఏక జాతీయంగా ప్రకాశింపజేస్తుంది.

ఈ విధంగా నేతి, నేతి అనే నిషేధ భాషలో 5 లక్షణాలు చివరి రెండు. విధి భాషలో పరమాత్మను సంపూర్ణంగా నిర్వచించినారు. ఇటువంటి ఆత్మను యజ్ఞయాగము, ధ్యానము వంటి ప్రక్రియల ద్వారా పొందలేం. ఇవన్నీ కారణం కాజాలవు. ఆత్మజ్ఞానము కార్యంకాదు. దానికి కారణాలు లేవు. మేఘములు తొలగితే సూర్యుడు కనిపిస్తాడు. వివేకం ద్వారా అజ్ఞానం తొలగించుకోవడమే మన కర్తవ్యం. మనస్సు అజ్ఞానం యొక్క అభివ్యక్త రూపమే. అది నశించిన వెంటనే అజ్ఞానం అంతమై జ్ఞానం తెలుస్తుంది.

కారిక-37: సర్వాభిలాపవిగతః సర్వచింతా సముద్ధితః ।

    సుప్రశాంతః సకృజ్జ్యోతిః సమాధిరచలో-భయః ॥

భావం: ఈ ఆత్మ వాక్కుకు అతీతము. చింతించుటకు అలవికాదు. సుప్రశాంతం - సకృజ్జ్యోతీ రూపము. భయరహితము. అచలము. సమాధి ద్వారా పొందదగినది.

వివరణ: ఇంతవరకు ఆత్మను ఎందుకు సూటిగా నిర్వచించలేకపోయినారో ఎందుకు నిశ్చయ పరచలేకపోయినారో అది ఎంత అశక్యమో వివరిస్తున్నాడు.

సర్వాభిలాపవిగతః - మాటలు లేనిది. అంటే ఆ భావాన్ని వ్యక్తపర్చేందుకు భాషలో పదాలు లేనిది. భాష అంటే ఏమి? మనస్సు ఇంద్రియాల ద్వారా గ్రహించి, బుద్ధి ద్వారా నిర్ణయించుటచే కల్గే మనో భావాలను వ్యక్తపరచేదే భాష. ఆత్మ ఆ విధంగా గ్రహించబడే పదార్థం కాదు. కాబట్టి మాటల్లో అభివ్యక్తం చేయలేము.

సర్వచింతా సముత్థితః - సమస్త చింతల నధిగమించినది. ఆత్మ ఇంద్రియాతీతమైనచో మన మనస్సులో భావించవచ్చు కదా అనే ప్రతివాది సందేహ నివారణ కోసం సమస్త మానసిక చింతలు లేనిది అని చెప్పబడిరది. ఉదాహరణకు ప్రేమను ఇంద్రియాల ద్వారా గ్రహించలేము. మనస్సుచేత అనుభవిస్తాం. ఆత్మ చిత్త సారరూపమే కనుక చిత్తము చింతించ డానికి ఆత్మ విషయం కాలేదు.

సుప్రచింతః - బుద్ధి ఆలోచించి నిర్ణయించలేనిది. బుద్ధి కతీతమైనది ఆత్మ సామ్రాజ్యం. అది బుద్ధికి మనస్సుకు అందనిది. ఆలోచనలు, అభిప్రాయాలు నడవకనే బుద్ధికి అశాంతి కల్గుతుంది. బుద్ధితో అలజడులు యోచనా స్పందనములు కల్గి ఉన్నంతవరకు శుద్ధ జ్ఞానమే భాసించదు. అవన్నీ అణగినప్పుడే ఆత్మ ప్రకాశించగలదు. అందుకే సుప్రశాంతమైనది. అంతేకాకుండా నిర్విషయకమైన శుద్ధ జ్ఞానాన్ని నిర్వచించడానికి ప్రయత్నిస్తున్నారు. విషయవిశిష్టమైన బుద్ధి కన్నా ఆత్మ అతీతమైనది. మనోబుద్ధీంద్రియములకు ఆత్మ అందరానిదని చెప్పబడినది.

సకృజ్జ్యోతి ఆత్మ: ఆత్మ స్వయం ప్రకాశము. అదియే జ్ఞానరాశి జ్ఞానమును తెలిసికోవడానికి మరో జ్ఞానం అవసరంలేదు. సూర్యుణ్ణి చూచేందుకు దీపం అవసరం లేదు కదా! మనోబుద్ధీంద్రియాలు అణిగిన వెంటనే ఆత్మ స్వయం ప్రకాశంగా భాసిస్తుంది.

సమాధి: ఆత్మ సాక్షాత్కారానికై చేయవలసిన సాధన ఇక్కడ చెప్పబడిరది.

ధీ = బుద్ధి సమా + ధీ - నిర్వికారమైన బుద్ధి జీవితంలో కలిగే సుఖదుఃఖాలను పట్టించుకోకుండా దాని ప్రభావానికి లోనుగాక కలతచెందని సమానస్థితిలోనున్న బుద్ధి కల్గినప్పుడే ఆత్మ తత్త్వాన్ని అనుభవించగలం. ‘సమత్వం యోగ ఉచ్యతే’ అన్న యోగ సూత్రాన్ని ఇక్కడ స్మరించవచ్చు. అట్టివానికే జీవితంలో పరిపూర్ణమైన ఆనందం కల్గుతుంది.

కారిక-38: గ్రహోన తత్ర నోత్సర్గశ్చింతా యత్ర న విద్యతే ।

    ఆత్మ సంస్థం తదాజ్ఞానం అజాతి సమతా గతం ॥

__భావం: __నిశ్చింతయైన ఆత్మ తత్త్వమునందు గ్రహణం కాని ఉత్సర్గం కాని

ఉండదు. ఆత్మయందే స్థాపితమై ఆత్మయందే రమించు ఆ జ్ఞానము అఖండంగా, సమత్వంతో కూడి ఉంటుంది.

వివరణ: మనో బుద్ధులనధిగమించిన ఆ పరమాత్మ తత్త్వము మన ఆత్మయందనుభవంలోనికి వచ్చుచున్నదని పూర్వ శ్లోకంలో చెప్పబడిరది. మనోవృత్తులు లేని స్థితిలోనే దివ్యానుభూతి కల్గుచున్నది. ఈ స్థితిలో వస్తుగ్రహణం కాని, ఆలోచనలు కాని, అభిప్రాయాలు కాని కల్గవు. సృష్టి స్థితి లయలు అక్కడ లేవు. ఇట్టి స్థితిలో పరిమిత జీవి అపరిమిత ఆత్మలో లీనమై నిర్వికారస్థితిని పొందుతున్నాడు. అద్వితీయము, సర్వవ్యాపియునైన సత్యజ్ఞానవంతమైన పరబ్రహ్మం అఖండమైనదికూడా మనోబుద్ధులతోడి జీవుని తాదాత్మ్యం తొలిగిన వెంటనే జ్ఞానమయమైన ఆత్మ తత్త్వం పొందుతున్నాడు.

కారిక-39: అస్పర్శ యోగో వైనామ దుర్దర్శః సర్వయోగిభిః ।

    యోగి నో బిభ్యతి హ్యాస్మాదభయే భయదర్శినః ॥

భావం: ఈ అస్పర్శ యోగం సులభంగా యోగులందరికీ సాధ్యం కాదు. అభయమైన ఆత్మచేత భయపడి యోగులు ఈ మార్గం అనుసరించ భయపడుతున్నారు.

వివరణ: స్పర్శ = బాహ్యవిషయాలను ఇంద్రియాల ద్వారా మనస్సు గ్రహించడం (తాకడం) అదే అర్థంలో గీత వివరించింది. (అధ్యా-5, 21,22,27) అది లేనిది అస్పర్శ. విషయాలు తమకు తాము సుఖదుఃఖాలను కల్గించలేవు. ఇంద్రియాల ద్వారా మనస్సు విషయాలనే వలలో తగుల్కొన్నప్పుడు మన మిథ్యా భావాలను, అసత్యమైన విలువలను ఆ విషయాలకు అంటగడ్తున్నాం. ఈ విధంగా మనమే ఇంద్రియ విషయాలకు మనస్సును పీడిరచే, బాధించే శక్తినిస్తున్నాం. గీత 5వ అధ్యాయంలో ఇది చక్కగా వివరించబడిరది. అస్పర్శ యోగం అనే పదం ఉపయోగించి గౌడ పాదుడు మనస్సుకు బాగా హత్తుకొనేట్లు విషయములను వివేకంతో విశ్లేషించి అర్థం చేసుకోవడం తద్వారా మనస్సులో విషయములే లేకుండా ఉండే స్థితి (నిర్విషయకం) ఆధ్యాత్మిక పరిణితి నొందే సాధనగా తీర్మానించినాడు. ఇక్కడొక లోతైన చర్చ అవసరం.

నిషేధం - విధి అనే రెండు వ్యతిరేక అంశాలతో సాధనం చేయమని బోధ. అనాత్మను నిషేధించడము, దానిని అధిగమించి ఆత్మ తత్త్వాన్ని పొందడం విధి. మనలోనున్న అసత్య విలువలను త్యజించి మాయామోహమునుండి విరక్తుడు కావడం అస్పర్శ. దీని ఆధారంతో నిత్య సత్య తత్త్వాన్ని కనుగొని అందు స్థిరపడడం యోగం.

ఉదాహరణగా రజ్జుసర్పభ్రాంతిని వివరించుకుందాం. సర్పభ్రాంతిని తొలగించుకోవడం మొదటిసాధన. తర్వాత త్రాడు యొక్క నిజస్వభావాన్ని కూడా తెలుసుకోవడం. కాని ఈ రెండూ ఒకేసారి జరగడం వల్లనే మనోమోహం వెనుక నుండే సత్వతత్త్వం అనుభవానికి వస్తుంది. కాని యోగుల ద్వైతులు ఆత్మ - పరమాత్మ రెండూ అనాది అంటారు. జీవాత్మను పరమాత్మతో ఐక్యం చేయడానికి భయపడతారు. నిజానికి పరమాత్మ భయరహితమైనది. సంపూర్ణంగా పరమాత్మకు తమపై అధికారాన్నిచ్చేందుకు యోగులు సమ్మతించరు. అందుకే వారికి దివ్యానుభూతి తత్ఫలమైన ఆధ్యాత్మిక పరిపూర్ణత కల్గదు.

కారిక-40: మనసో నిగ్రహా యత్తమభయం సర్వయోగినాం ।

    ధుఃఖ క్షయః ప్రబోధశ్చా ప్యక్షయా శాన్తిరేవచ ॥

భావం: జ్ఞానమార్గాన్ని అనుసరించని యోగులు అభయము, దుఃఖక్షయము, ఆత్మ బోధ, శాంతి కల్గుటకు తమ మనో నిగ్రహం పై ఆధారపడి ఉంటాడు.