__పరిచయం : __
1, 2 అధ్యాయాలలో అద్వైత తత్త్వము, జగన్మిథ్యాత్వములను నిరూపించుటకు తగినన్ని వాద ప్రతివాదాలు జరిగినాయి. 3వ దానిలో అద్వైత బ్రహ్మతత్త్వము మిథ్యకాదని నిరూపించబడిరది. దీనిలో విశేషంగా ‘అస్పర్శయోగం’ అనే ఒక కొత్త సాధనా విధానం వివరించబడిరది. ఇది ఇంతవరకు ఎవ్వరూ పేర్కొన్నది కాదు. ‘జగన్మిథ్యావాదము’ స్థాపిస్తూ జీవుడు అసలు పుట్టనే లేదు. ‘‘దేనినుండి ఏదీ పుట్టలేదో అదే సత్య తత్త్వం అదియే పరమాత్మ’’ అని నిష్కర్షిస్తున్నాడు గౌడపాదుడు.
కారిక-1: ఉపాసనాశ్రితో ధర్మో జాతే బ్రహ్మణి వర్తతే ।
ప్రాగుత్పత్తే రజం సర్వం తేనాసౌ కృపణః స్మృతః ॥
__భావం: __ఉపాసనా మార్గాన్ని బట్టి ఉపాసకుడు స్వయంభువైన బ్రహ్మతో తనకు సంబంధం ఉందని భావిస్తున్నాడు. జగదుత్పత్తికి పూర్వము ఉన్నదంతా అజమగు బ్రహ్మతత్త్వమే అని నిర్ణయిస్తున్నాడు. అందుకే ఉపాసకుణ్ణి కృపణుడు అని పేర్కొంటున్నాడు.
వివరణ: వేదమలందు ‘భక్తి’ అనే పదం లేదు ఆ అర్థంలో ఉపాసన అనే పదం ప్రయోగించబడిరది. భక్తి సిద్ధాంతంలో భక్తునికన్నా భిన్నంగా భగవంతుడున్నాడని, ఆతనిని భక్తుడు హృదయంలో ఆరాధించు చున్నాడనుట ముఖ్యమైన అంశము. భక్తి మార్గమున ఉన్నత స్థాయినందకుండా వేదాంతి కాలేడు. మనోబుద్ధులకు సంబంధించినంతవరకు పరిణితిని పొందిన సాధకునకు జ్ఞానసాధనవైపు మరల్చుట గురువు బాధ్యత. అదే ఈ శ్లోకంలో ప్రతిపాదించబడిరది. ఇది కేవలం గౌడపాదుని స్వీయ సిద్ధాంతం కాదు. అనేక ఉపనిషత్తులలో ప్రతిపాదించబడినదే. ‘‘మీరా రాధించేది సత్యతత్త్వం గాదు’’ అని రూఢగాి ఉపనిషత్తులు నిరూపించాయి.
భక్తి సిద్ధాంతాన్ని అనుసరించి ‘‘భగవంతుడు సంపూర్ణంగా, అంశతః కూడా భక్తునితో సంబంధం కల్గి ఉన్నాడని తన భక్తుని కోసం ఆ భగవంతుడే నానాత్వ విషయ రూపమైన ప్రపంచ రూపంగా అవతరించాడని తెలుస్తుంది. కాని ఇందులో ఒక వైరుధ్యముంది. పరమాత్మయే జగత్తుగా అవతరించినప్పుడు భక్తుడు గూడా పరమాత్మలో భాగమే కదా! తనకంటె భిన్నుడైన భగవంతుని కొల్చు భక్తివాదము స్వవచోఘాతంగా లేదూ!
జ్ఞానమార్గసాధకులకు ‘‘మిథ్యావాదాలు మిమ్ములను అజ్ఞానాంధకారంలో పడవేస్తాయి. కాబట్టి సద్వాదాలను చేసి సరియైన మార్గంలో స్థిరంగా భావించండి’’ అని గురువులు బోధిస్తారు.
భక్తులను (ఉపాసకులను) గౌడపాదుడు కృపణాః అన్నాడు. అంటే సంకుచిత బుద్ధిగలవాడు లేదా లోభులు అనే అర్థం.
దీన్ని ఈ విధంగా అన్వయించవచ్చు.
‘‘స్వేచ్ఛగా సమస్తాన్ని తనలో ఇముడ్చుకోడానికి వీలుగా మనస్సును వైశాల్యం పరచుకోవడానికి అంగీకరించనివాడు’’ అని కృపణశబ్దాన్ని భావించవచ్చు. ఇంకా
‘‘తన జీవభావంలోని పృథక్త్వాన్ని విడిచి, అనంతమైన పరమాత్మలో లీనమైయ్యేందుకు సిద్ధపడడం లేదు’’ అన్న భావంలో లోభి కూడా సమన్వయించ బడగలడు. ఉపాసనా విధానాన్ని బట్టి పరమాత్మ అజము, నిత్య, శుద్ధ, బుద్ధమైనది. అన్నప్పుడు అతని నుండి నానాత్వ విశిష్ట రూపంలో జగత్తుగా ఉద్భవించడంతో పాటు సత్త్వతత్త్వంలో అజుడై ఉండడం అసంభవం గదా! అంతే గాకుండా ‘‘భగవంతుడు ఆరాధింపదగినవాడు. నేనాతని అంశను. అతడు పరిపూర్ణుడు. అతని అనుగ్రహం కోసం నేను ఉపాసించవలెను’’ అనే సిద్ధాంతం అపాయకరం అని గౌడపాదుని ప్రతిపాదన.
భక్తి పదం వేదాలలో లేదు. వ్యాసుని పురాణాలలో విపులంగా వ్యాప్తి చెందింది. ఉపాసన అంటే ఒక సాధకుడు తన పరిమిత స్థితిని విశ్వమంతా వ్యాపింప చేసి విశాల పరచటమే అని వేదాంత శాస్త్రనిర్ణయం. ఇతనికి మనోబుద్ధులు సమత్వం పొందవలెను (నిశ్చలత్వం అని అర్థం).
ఈ స్థితి శాంతమైన జీవితంలో, తన కోరికలు చాలా పరిమితమైనప్పుడే సాధ్యం. సుఖ శాంతి రహిత నిర్బంధ జీవితంలో ఆధ్యాత్మిక సాధకులకు ఉపాసన అసాధ్యం. ఇట్టి సందర్భాలలోనే వ్యాసుడు పురాణాల ద్వారా భక్తిమార్గాన్ని సుగమమని ప్రబోధించి లోకాన్ని రక్షించినాడు. భక్త్యారాధననే ఉపాసనగా శ్రీగౌడపాదులు పేర్కొన్నారు.
కారిక-2 : అతో వక్ష్యామకార్పణ్య మజాతి సమతాం గతం ।
యథానజాయతే కించిత్ జాయమానం సమన్తతః ॥
__భావం: __కాబట్టి నేనిప్పుడు అజమైన, అఖండమైన, అనంతమైన బ్రహ్మతత్త్వాన్ని వివరిస్తాను. దానినుండి నానాత్వ విశిష్ట ప్రపంచం జన్మించినట్లు కన్పించినా, నిజానికి దానినుండి ఏదీ ఉద్భవించలేదు. అటువంటి బ్రహ్మతత్త్వాన్నే నేను వివరిస్తున్నాను.
వివరణ: ‘మనస్సు, బుద్ధి’ వీటి ద్వారానే స్థూలశరీరాభిమానంతో మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం. అంటే దానితో వ్యవహరిస్తున్నాం. అట్లే స్వప్నంలో నానాత్వ విశిష్ట స్వప్న ప్రపంచాన్ని చూస్తున్నాం దాన్నే ‘తైజసునిగా’ చెప్తున్నాం. (చూచేవాడు) కాని శుద్ధచైతన్యజ్ఞానం కల్గినవెంటనే బాహ్యంలో గాని, అంతరంలోగాని (బైటా, లోపలా) ఎక్కడ చూచినా అజమైన (పుట్టుకేలేని) అఖండమైన (సర్వ వ్యాపితమైన) సమత్వాన్ని అనుభవిస్తాం.
సమత్వం అంటే పరమాత్మ యొక్క సర్వవ్యాపకమైన అఖండ తత్త్వమే. (సజాతీయ, విజాతీయ, స్వ, పర భేదముల లేనిది) భేదముంటే అది నశిస్తుంది. ‘సమత్వం’ అనే పదంవల్ల ఆత్మయొక్క సర్వ వ్యాపకత్వం, నిత్యత్వం నిరూపించబడిరది.
మనస్సు యొక్క భ్రాంతి చేతనే నామరూపాత్మకమైన జగత్తు కల్పితమైన స్వప్నం వంటిదే అగుచున్నది. అందుకే అది మిథ్య. ఈ భావాన్నే ‘‘జాయమానం సమంతతః’’ అనే వాక్యం ద్వారా పేర్కొన్నారు. అంటే (సర్వత్ర సృష్టించబడి నట్లున్నప్పటికీ) అని అర్థం.
‘‘ఆత్మ తత్త్వం తప్ప నిజానికి మరొకటి ఏదీ లేదు’’ అని అజాత వాద నిష్కర్ష.
__కారిక-3 : __ ఆత్మా హ్యాకాశ వజ్జీవైర్ఘటాకాశైరి వోదితః ।
ఘటాది వచ్ఛ సంఘాతై ర్జాతావే తన్నిదర్శనం ॥
భావం: ఆకాశంవంటి సర్వవ్యాపి ఆత్మ నానారూపములను ధరించినప్పుడు వానిని ఘటాకాశంతో పోల్చవచ్చు. ఘటాకాశం మహాకాశం నుండి ఆవిర్భవించిందని అట్లే వివిధములై స్థూల రూపములు ఆత్మనుండే ఉద్భవించినాయని చెప్తారు. ఈ వ్యక్త ప్రపంచానికి ఇదే నిదర్శనం.
వివరణ: ఆత్మ-జీవుడు ఈ రెండి సంబంధాన్ని తెల్పేందుకు మహాకాశం, ఘటాకాశం ఉపమానాన్ని ప్రసిద్ధంగా పేర్కొంటారు వేదాంత పరిభాషలో. దీనికి కారణం ఏమి. పరమాత్మకు - మహాకాశానికి ఉన్న సామ్యాలు - 3. అవి -
1) రెండూ సూక్ష్మమైనవే
2) రెండూ అఖండమైనవి
3) రెండూ అస్పర్శములు.
ద్వైతానుభవాన్ని నిత్యం జీవుడు పొందుతున్నాడు. దానికి ఉపపత్తిగా పై గుణాలున్న పరమాత్మ, నామ రూపాత్మకంగా మారింది అని సమాధానం చెప్పినా నిజానికి ఇది సత్యంకాదు. అనుభవంలో వివిధ ఘటాలలో ఉన్న ఆకాశాన్ని మనం భేద దృష్టితో చూస్తున్నాం. ఘటం భిన్నమైనప్పుడు (పగిలినప్పుడు) ఘటాకాశం మహాకాశంలో ఐక్యమైతుంది. ఘటాకాశం వంటి ప్రత్యేకమైన జీవుడు ‘అహం’లో పరిమితులను, దుఃఖాన్ని పొందుతున్నాడు.
నాలో ఉన్న నేను అనేదానికి వెనుకనున్నది సర్వవ్యాపియైన ఆత్మ ఒక్కటే । అజ్ఞానంతో దేహమనో బుద్ధులతో ఐక్యమైన నేను జీవుడై, జాగ్రత్స్వప్న సుషుప్త్య వస్థలలో విశ్వతైజన ప్రాజ్ఞరూపుడై దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. సాధనతో, భౌతికావరణలతోనున్న తాదాత్మ్యాన్ని విడనాడి, తనలోని ఆత్మతత్త్వాన్ని తెలుసుకోవడమే మానవుని పారమ్యం.
కారిక-4 : ఘటాదిషు ప్రలీనేషు ఘటాకాశాదయో యథా ।
ఆకాశే సంప్రలీయన్తే తద్వజ్జీవా ఇహా--త్మని ॥
__భావం: __ఘటం నశిస్తూనే ఘటాకాశం మహాకాశంలో లీనమైనట్లు, ప్రత్యేక జీవభావం నశిస్తూనే ఆత్మలో లీనమైతున్నారు.
వివరణ: మాయామోహంలో పడి జీవత్వాభిమానాన్ని పొందిన పిమ్మట మనకు మళ్ళీ పరమాత్మను పొందే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు సమాధానం ఇది. తప్పక ఉంది. జీవుడు నశించగానే ఆత్మ అక్కడే ప్రకాశిస్తుంది. దేహమనో బుద్ధులను అతిక్రమించిన వెంటనే అంటే వాటిని అణిచిన వెంటనే శుద్ధచైతన్యాన్ని అనుభవించగల్గే తురీయావస్థను చేరుతాం. జీవభావం అంతరించేందుకు చేసే సాధనలు ముగిసిన వెంటనే జీవభావం అంతరిస్తుంది. దీనినే ఘటాకాశం మహాకాశంతో పోలుస్తూ ఘటం భిన్నం కాగానే మహాకాశంలో కలుస్తుంది అన్నాడు.
కారిక-5 : యథైకస్మిన్ ఘటాకాశౌ రజోధూమాది భిర్యుతే ।
నసర్వే సంప్రయ జ్వన్తే తద్వజ్జీవాః సుఖాదిభిః ॥
__భావం: __ఒక ఘటములోని ఘటికాశాన్ని ధూళి ధూమముల చేత మలిన పరిచినంత మాత్రాన సమస్త ఘటాకాశాలను మలిన పరచడం లేదు కదా! అట్లే ఒక వ్యక్తి యొక్క సుఖదుఃఖములు సర్వ మానవుల యొక్క సుఖ దుఃఖములు కాజాలవు ఒకరి మానసికానుభవాలు అందరి మానసిక అనుభవాలు కాజాలవు.
వివరణ: ఏకజీవవాదము ప్రకారం ప్రత్యేక జాతి జీవులన్నీ కలిసి ఒక మహాజీవుడుగా ఉన్నాడు. ఆ మహాజీవుడే బ్రహ్మ. జీవులన్నీ వేరుగా కనబడుతున్నా ఒక్కటే.
ఖండన: ఒక చైతన్యము సర్వవ్యాపి యై ఉన్నది అనడం వేదాంతులు ఏకాత్మ వాదము. మహాజీవుడు సర్వవ్యాపియై ఉన్నాడనడం ఆక్షేపణీయం.
ప్రతిపక్షి: ఆత్మ ఒక్కటే ఐనప్పుడు ఒక మహర్షి గాని యోగిగాని ఆత్మను కనుగొన్నప్పుడు మిగిలిన అందరికీ ఆత్మజ్ఞానము కల్గి తీరవలెను కదా! అన్ని ఆత్మలు ఒక్కటే అన్నప్పుడు ఒక ఆత్మను కనుగొన్నంతనే అన్ని ఆత్మలు వాటంతట అవి అప్రయత్నంగా కనుగొనబడవలయును.
ఖండన: ఒకని మనస్సులో రాగద్వేషములన్నప్పుడు ఆ మనస్సుతో గ్రహించే ప్రపంచమంతా రాగ ద్వేషములతో నిండి ఉంటుంది. అంతేకాని అందరి మనస్సులలో అదే అనుభవము ఉండదు.
నిష్కర్ష: ఆత్మ స్వభావతః సచ్చిదానంద స్వరూపం. దేహ మనోబుద్ధులు మధ్య జొరబడడం చేత, వాని యందు మనం తాదాత్మ్యం చెందుట చేత, ఆత్మ తననుండి ఆవృతమై పోయినది. ఘటాకాశం సదా నిర్మలమైనదే. దుమ్ము ధూళి చేరినందువల్ల అది కూడా ఘటమునకు చెందినది కావడంవల్ల ఆకాశమునకు అంటదు.
వివేకం, జ్ఞానం, త్యాగం వంటి సాధనల ద్వారా పాశవిక ప్రవృత్తిగల ఈ మనస్సును అంతమొందించి, అతీతావస్థను చేరినప్పుడు, అక్కడ మనము మనకు సహజమైన ఆత్మ తత్త్వాన్ని అనుభవిస్తాము. తనకు తాను శ్రద్ధాళువుగా, సాధనల ద్వారా గుర్వనుగ్రహంతో ఉద్ధరించుకొనడమే తప్ప వేరు మార్గంలేదు.
కారిక-6 : రూపకార్య సమాఖ్యాశ్చ భిద్యన్తే తత్ర తత్రవై ।
ఆకాశస్య నభేదోస్తి తద్వజ్జీవేషు నిర్ణయః ॥
__భావం: __అక్కడక్కడ నామరూప కార్యములందు భేదమున్నప్పటికీ అద్వయమైన ఆ మహాకాశంలో ఏరకమైన భేదము లేదు. అదే విధంగా విభిన్న నామరూపాలు కలిగినట్లు కన్పిస్తున్నప్పటికీ అద్వైతమైన పరమాత్మ ఒక్కటే.
వివరణ: పూర్వపక్షం - విభిన్న జీవుల అనుభవాలు విభిన్నంగా ఉన్నాయి గదా! ప్రతిదేహంలో విభిన్నమైన ఆత్మలు ఉండాలి. జీవుల అనుభవాలు భిన్నమైనప్పుడు ఆత్మ ఒకటే ఉండరాదు.
ఖండన: ఒకే మట్టిలోనుండి నామరూపాదులతో విభిన్నమైన ఘటాలు కనిపిస్తున్నా వాటి కాధారమైన సహజ తత్త్వము మట్టియే. మట్టిలో పుట్టి, పెరిగి, నశించిన తర్వాత మట్టిలోనే కలుస్తున్నాయి. భిన్నమైన ఘటాలల్లో ఉండే ఆకాశం కూడా భేదం లేనిదే. అక్కడ నానాత్వం లేదు.
అదేవిధంగా అసంఖ్యాకమైన జీవుల వెనుక అద్వైతమైన శాశ్వతమైన ఆత్మ ఒక్కటే ఉంది. అన్ని రూపాలలో అన్ని అవస్థలలో ఆత్మతత్త్వం ఏకరూపమై ఉంది. మరి కనిపించే భేదము ఎక్కడిది? దానికిది సమాధానము. ‘‘ఈ నానాత్వ విశిష్ట ప్రపంచాన్ని చూచేవాడు జీవుడు కాని ఆత్మకాదు. ఆత్మ మనస్సనే పొగమంచు ద్వారా ప్రసరించినప్పుడు దానినుండి పుట్టిన భూతమే జీవుడు. ఆయా వ్యక్తులలో వారి వారి మనోబుద్ధులలో కలుగునట్టి భేదమే మనకు నానాత్వ విశిష్ట ప్రపంచంగా ద్యోతకమైతుంది.
మనో బుద్ధులను అధిగమించినప్పుడే తురీయావస్థ సమమై ఏకంగా భాసిస్తుంది.
మహర్షులు వేదాంతశాస్త్రాన్ని అభ్యసించి, అభ్యసించిన దానిని క్రమపద్ధతిలో ఆచరించి ఆచరించిన దానిని ఆంతరికముగా అనుభవించి ‘‘తమ సహజ తత్త్వము ఆ శుద్ధ చైతన్యమైన ఆత్మ తత్త్వము కంటె భిన్నము కాదు’’ అని నిర్ణయించి నిష్కర్షగా చెప్పినారు. అందుకే గౌడపాదుడు ‘‘నిర్ణయః’’ అని ప్రయోగించినాడు.
కారిక-7 : నాకాశస్య ఘటాకాశో వికారావయవౌయథా ।
సైవాత్మనః సదా జీవో వికారవయవౌ తథా ॥
భావం: ఘటాకాశము, మహాకాశము యొక్క వికారము కాదు. మహాకాశము యొక్క అవయముకాదు. అట్లే ఈ జీవుడు ఆత్మయొక్క వికారరూపము కాదు. ఆత్మయొక్క అంగము కాదు.
వివరణ: ఆత్మ అఖండమై, అనంతమై, సర్వవ్యాప్తమై ఉండుటచేత అందు జీవాత్మ విభిన్నముగా ఉండజాలదు. మరియు ఆ పరమాత్మ యందు ఒక పరిణామము లేదా ఒక వికారము జరగడంవల్ల ఈ జీవ ప్రపంచం బయల్వెడలిందని చెప్పరాదు. ఒక వస్తువు మరొక రూపం పొందినప్పుడు దాని ప్రథమ రూపం నశిస్తుంది. పాలు పెరుగుగా మారినప్పుడు తిరిగి పాలుగా మారలేదు. అట్లే పెరుగు నెయ్యిగా మారిన తర్వాత నెయ్యి పెరుగు కాలేదు.
అట్లే నిత్యసత్యమైన పరమాత్మ మర్త్యజీవులుగా పరిణమించినప్పుడు తిరిగి స్వస్వరూపము పొందలేదు. అమృత తత్త్వం నుండి ఈ నశ్వరమైన ప్రపంచం సృష్టించినపుడు ఆతడే లేకుండా పోలేడు. అట్లే మహాకాశం ఘటాకాశంగా విభక్తం కాదు. కాలేదు. అట్లే నాలోని జీవుడు పరమాత్మ కంటె భిన్నడుకాడు. ఇది అర్థం చేసుకోవడమే జ్ఞానం.
‘‘నిన్ను నీవు తెలుసుకో! నిన్ను నీవు ఉద్ధరించుకో! అజ్ఞానము మరణమే. జీవుడు ఆత్మయొక్క పరిణామము కాదు. తదంశ కూడా కాదు’’ అనుటచే అద్వైత సిద్ధాంతము స్థాపించబడుతుంది.
కారిక-8 : యథా భవతి బాలానాం గగనం మలినం మలైౖః ।
తథా భవత్య బుద్ధానాం ఆత్మా-పి మలినో మలైః ॥
__భావం: __ఆకాశం మలినమైనదని బాలురు భావించునట్లుగా, ఆత్మ కూడా అపవిత్రం చేయబడినదని అజ్ఞానలు భావిస్తారు.
వివరణ: ప్రకాశింపజేసే ఆత్మ తన జ్ఞానముతో మనోవృత్తులను ప్రకాశింపజేస్తుంది. మిథ్యాజీవ దృష్టితో అజ్ఞానము ఆవరించుటచే ఈ జీవలక్షణములు ఆత్మకు సంబంధించివే అని భావిస్తున్నాం. ద్వైతభావనలకు మూల కారణము మనస్సు యొక్క దోషమే కాని ఆత్మవి కాదు.
కారిక-9 : మరణే సంభవే చైవ గత్యాగమన యోరపి ।
స్తితౌ సర్వశరీరేషు ఆకాశేనా విలక్షణః ॥
__భావం: __సమస్త దేహాంతర్వర్తి యగు ఆత్మ జన్మిస్తుంది. మరణిస్తుంది దేహాంతరం పొందుతున్నది. అనే భావనలన్నీ ఘటాకాశము కంటె భిన్నము కాదు.
వివరణ: జీవులు దేహాంతర ప్రాప్తి అద్వైత సిద్ధాంతానికి విరుద్ధం. అద్వైతంలో గమనాగమనములు కేవలం ఆభాస అవి ఆత్మ తత్త్వానికి బాధకరములుకావు. ఘటాన్ని జగత్తులో ఎక్కడికి తీసుకువెళ్ళినా దానిలో ఆకాశంలో మార్పు రాదు. అట్లే సర్వవ్యాపియైన ఆత్మకు సంచారం లేదు. జీవుని దేహాంతర ప్రాప్తి వంటివన్నీ మనోబుద్ధులవే ఆత్మ మాత్రం అజం. శాశ్వతం. మరణం, జననము వంటివన్నీ చైతన్యం ద్వారానే గ్రహించబడుతున్నాయి.
కారిక-10: సంఘాతాః స్వప్న వత్సర్వే ఆత్మ మాయా విసర్జితాః ।
ఆధిక్యే సర్వ సామ్యే వానోపపత్తిర్వి విద్యతే ॥
__భావం: __దేహమనో బుద్ధులయొక్క సంఘాతములన్నీ ఆత్మను ఆవరించి ఉండే అజ్ఞానం వల్లనే కల్గుతున్నాయి. అవి పరస్పరం సమానమైనవా లేక అధికమైనవా అనేందుకు తగిన ఉపపత్తులు లేవు.
వివరణ: దేహమునకు యజమాని ఆత్మ. జ్ఞానేంద్రియములకు మనస్సు, మనస్సుకు బుద్ధి, బుద్ధికి చైతన్యం యజమానులు. వాని నిర్దేశానుసారమే ఇవన్నీ ప్రవర్తిస్తాయి.
పరమాత్మ ఒక్కటే సత్యం. మనో బుద్ధులకు ప్రత్యేక అస్తిత్వంలేదు. మనో బుద్ధులతో తాదాత్మ్యం పొందినప్పుడే వారికి అస్తిత్వం వస్తుంది. మనోబుద్ధులు నిజానికి లేవు. అని చెప్పడం కూడా వ్యర్థమే. ఆత్మ గురించి మనకు గల్గిన అజ్ఞానం వల్లనే మనో బుద్ధులను ప్రత్యేకంగా గ్రహిస్తున్నాం.
కారిక-11: రసాదయో హి యో కోశా వ్యాఖ్యాతా స్తైత్తరీయకే ।
తేషామాత్మా పదో జీవః ఖం యథా సంప్రకాశితః ॥
__భావం: __పంచకోశములకు అతీతమైనదిగా ఆత్మ ఉంది. ఈ పంచకోశాలను తైత్తరీయ ఉపనిషత్ విపులంగా వివరించింది. అంతేకాక ఆత్మ మహాకాశంవలె ఉందని ఇదివరకే వివరించబడిరది.
వివరణ: ఆత్మ భౌతిక పదార్థాలచేత ఆవరించబడిరది. వేదాంత పరంగా విభజన చేస్తే మానవుని వ్యక్తిత్వం పంచకోశాలుగా విభజింపబడిరది. అవి
1) అన్నమయ - స్థూల
2) ప్రాణామయ - సూక్ష్మ
3) మనోమయ - మనో
4) విజ్ఞానమయ - బుద్ధి
5) ఆనందమయ- (దీనిపైన) సుషుప్తిలోని స్థితివలె తాదాత్మ్యం. ఇవన్నీ మనోగతమాయా కల్పితములే.
ప్రతినిత్యం మనమీ పంచకోశాలతో కూడిన జీవునితో తాదాత్మ్యం పొందినట్లు అనుభవం పొందుతున్నాం. కాబట్టి అసత్యమనే భ్రమలో ఉన్నాం. కాని అది పరమాత్మయందు కేవలం ఆరోపించబడినదే కాని నిజం కాదు మిథ్య.
ఉదా॥ స్థూల శరీరాన్ని బందించినా, సూక్ష్మమైన మనోబుద్ధుల సంచారాన్ని నియమించలేవు. అట్లే సూక్ష్మాతి సూక్ష్మమైనట్టి ఆత్మకు దేహ మనో బుద్ధులు నియమితపరచలేవు. అందుకే పరమాత్మ ఆకాశం వంటిది అనడం.
కారిక-12: ద్వయోర్థ్వయో ర్మధుజ్ఞానే పరబ్రహ్మ ప్రకాశితం ।
పృథివ్యాముద రే చైవ యథాకాశః ప్రకాశితః ॥
__భావం: __ఆకాశం ఒక్కటే అయినప్పటికీ పృథివిలో వేరుగా, కడుపులో వేరుగా
ఉన్నట్లు తోస్తుంది. అట్లే బ్రహ్మకూడా ఒకటే ఐనప్పటికి ఆధ్యాత్మకమని, ఆధిదైవికమని రెండు విధాలుగా భాసిస్తుంది. ఇట్టి ద్వయములు (రెండుగా) మధుబ్రాహ్మణంలో చక్కగా వివరించబడ్డాయి.
వివరణ: బృహదారణ్యకోపనిషత్ లోని మధుబ్రాహ్మణాధ్యాయములో ఆత్మీయమైనది ఆధ్యాత్మికమని, విషయసంబంధి ఆధిదైవికమని చెప్పబడిరది. అంతేకాకుండా వ్యష్టి, సమష్టి ప్రపంచములను గురించి, విశ్వ, తైజస, ప్రాజ్ఞులు, విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వరులకు ఏకత్వం కలదని నిరూపించబడిరది. ప్రత్యగాత్మ పరమాత్మకంటె భిన్నంగాదని పిండితార్థం.
కారిక-13: జీవాత్మనో రనన్య త్వ మభేదేన ప్రశస్యతే ।
నానాత్వం నిన్ద్యతే యచ్చ తదేవం హి సమంజసం ॥
భావం: జీవాత్మలకుండే అభేదంతో కూడిన అనన్యత్వమే ప్రశంసింపబడుతుంది. ద్వైతులు చూచే నానాత్వము శాస్త్రములలో నిందించబడుతుంది. అద్వైతమొక్కటే సరియైనది మరియు న్యాయమైనదిను.
వివరణ: ‘నేహనానాస్తి కించన’ - బృహదారణ్యకం అంటే ఇచట ఎట్టి నానాత్వం లేదు అని చెప్పబడిరది. పరమాత్మను బ్రహ్మగా పేర్కొంది. ఈ ఉపనిషత్తు. నానాత్వమే లేదని నిషేధించడమే కాక, ‘‘ఇది అవును’’ అనే నిర్మాణాత్మక సిద్ధాంతం స్థాపిస్తూ అద్వైత బ్రహ్మ స్థాపనే ‘ఏకమేవాద్వితీయంబ్రహ్మా’ అద్వైతమైన ఆత్మ తత్త్వము ఏకము అద్వయము. ఇదియే యుక్తం న్యాయం అని నిష్కర్షగా సిద్ధాంత పరుస్తున్నాడు. గౌడపాదుడు.
కారిక-14: జీవాత్మనో పృథక్త్వం యత్ ప్రాగు త్పత్తేః ప్రకీర్తితం ।
భవిష్యదవృత్యా గౌణం తన్ముఖ్యత్వం హి న యుజ్యతే ॥
భావం: జగత్సృష్టిని గురించి వేదాలలో పేర్కొన్న జీవాత్మ పరమాత్మల పృథగ్భావము కేవలం గౌణం (అప్రదానం) ద్వైత ప్రపంచాన్ని గురించి చేసిన ప్రతిపాదనలన్నీ వాస్తవం కాదు.
వివరణ: వేదాంతంలోనే కాకుండా మిగిలిన శాస్త్రీయ సిద్ధాంతాలలో కూడా విస్పష్టమైన రెండు అర్థాలున్నాయి. 1) ముఖ్యార్థము 2) గౌణార్థము.
వేదాలలో ద్వైత ప్రపంచం వివరించబడినందుకు కారణంగా ఈ చర్చ పేర్కొనవచ్చు. సాధకులను ప్రోత్సాహపరచి ఆధ్యాత్మిక శిక్షణ ననుసరించునట్లు, ఆరాధించునట్లు చేయుటకు తద్ద్వారా మనోబుద్ధులను ఐక్యం చేసి మననం చేయడానికి తగినట్లు సాధనలలో దింపేందుకు, ధ్యానించి తదర్థాన్ని సరిగా అర్థం చేసుకోవడానికే. భారతీయ ఋషులకు వేదాంతం కేవలం ఉహాగానమే కాకుండా నిత్య జీవితంలో అనుభవయోగ్యమే. అందుకే శిష్యులకు ముందు వ్యవహారజగత్తును తెలిపి, తర్వాత వారికి అక్కడి నుండి ఆత్మ తత్త్వము యొక్క ఔన్నత్యమునకు తీసుకు పోతున్నారు.
కారిక-15: మృల్లోహ విస్ఫులింగాద్వైః సృష్టి ర్వా చోదితా-న్యథా ।
ఉపాయః సో-వతారాయ నాస్తి భేదః కథంచన ॥
భావం: సృష్టిని గురించి వివరించడానికి మట్టి, లోహ, నిప్పుకణాలు వంటి
ఉపమానాలతో ప్రత్యగాత్మకు పరమాత్మకు గల సామ్యాన్ని ఐక్యతను బోధించాలి. ఉన్నది అభేదమే.
వివరణ: ఈ దృశ్య జగత్తు పరమాత్మనుండి ఉద్భవించిందని ఉపనిషత్తులలో ఎన్నో ఉదాహరణలున్నాయి. మట్టి నుండి కుండలు, బంగారంనుండి ఆభరణాలు, అగ్నినుండి నిప్పురవ్వలు, వంటి వన్నీ అదే. (బృహదారణ్యకం) ‘నీవు చూచే దంతా భ్రమ’ అనే భావం సాధకునిలో స్థిర పర్చడానికే ఇదంతా బోధిస్తున్నారు. ‘‘స ప్రపంచత్వం నుండి నిష్ప్రపంచత్వం చేరు’’ అన్నదే వేదాంత మతం బోధించేది. ఈ ప్రపంచ వర్ణనమంతా మాయామోహితులైన మనోబుద్ధులుగల వారికోసమే. ఇదొక ఉపాయంగా చెప్పబడిరది. క్రమంగా సాధకునిలోని మోహ భ్రాంతిని తొలగించడమే దీని ఉద్దేశ్యము.
కారిక-16: ఆశ్రమాస్త్రివిధా హీనమధ్య మోత్కృష్ట దృష్టయః ।
ఉపాసనో-పదిష్టేయం తదర్థమను కంపయా ॥
భావం: ఆశ్రమములు సామాన్యర్థంలో నాలుగుగా (బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్న్యాస) చెప్పబడినప్పటికి ఇక్కడ జ్ఞానమార్గంలో ఉత్తమ, మధ్యమ, హీన, జ్ఞానసామర్థ్యాలు 3 ఆశ్రమాలుగా ఇక్కడ చెప్పబడినాయి. ఆదరంతో, జాలితో, శాస్త్రములు అజ్ఞానులకోసం ఉపాసన విధానాన్ని ఉపదేశించాయి.
వివరణ: వేదాంతమతం మానసిక స్థితిని బట్టి వ్యక్తుల స్థాయి తారతమ్యాలను నిర్ణయిస్తుంది. సంకల్ప వికల్పములు, ఊహపోహలు ఎక్కువైనకొద్దీ వాని బుద్ధిశక్తి తక్కువస్థాయిలో ఉన్నట్లు నిర్ధారించినారు. మందబుద్ధులుకూడా మనస్సు నేకాగ్రం చేయడం ద్వారా మహత్తరమైన పరిపూర్ణతను పొందవచ్చు. అదే ఉపాసన (ఐకాగ్య్రర్థముపాసనా) ఎక్కువకాలం ఏకాగ్రతను ఉపాసించినవారు తమ ఆంతరిక సాధనాలైన మనోబుద్ధులను పూర్తిగా ఐక్యపరచగలరు. ఆ సమత్వమే ఆత్మజ్ఞానార్జనకు తగిన సాధన పిల్లలకు తగినట్లు విషయాన్ని ఆహ్లాదకరంగా ఆకర్షణీయంగా కథాంశంగా వర్ణనలతో పరిచయంచేసినట్లే ప్రపంచ వర్ణన ప్రథమ దశలో సాధకులకు తెలియజేయబడిరది. ఉత్తమస్థాయి నొందిన పిదప శాస్త్రీయాంశాలను సోదాహరణంగా లోతుగా చర్చించి బోధించబడతాయి. (వయసు పెరిగిన వారికి తగినట్లుగా లోతైన అంశాలను బోధించినట్లు.) శాస్త్రము కూడా ప్రథమ దశలో సాధకుడు తృప్తి పొందునట్లు దయతో సృష్టి కథలను ప్రపంచవర్ణనలను బోధిస్తుంది. అర్హత పొందిన తర్వాత ఆత్మతత్త్వాన్ని బోధిస్తుంది. శృతిమాత తన బిడ్డల స్థాయి, అర్హతలను బట్టి తగినట్లుగా బోధనా విధానాన్ని, ఏర్పరచింది. ఒక తల్లి తన బిడ్డల వయసు, శక్తి సామర్థ్యాలను బట్టి తగిన ఆహారాన్నిచ్చినట్లు. అందుకే ‘అనుకంపయా’ అన్నారు.
కారిక-17: స్వసిద్ధాంత వ్యవస్థాసు ద్వైతినో నిశ్చితా దృఢం ।
పరస్పరం విరుధ్యన్తే తైదయం న విరుధ్యతే ॥
భావం: ద్వైతులు తాము పరిశీలించిన సిద్ధాంతాన్నే తత్త్వమని దృఢనిశ్చయులై వారిలో వారు తగవులాడుచున్నారు. అద్వైతులకు వారితో ఎట్టి విరోధం లేదు.
వివరణ: కపిల, కణాద, జైన వంటి సిద్ధాంతాలు పరస్పరం విరుద్ధంగా సృష్టి సిద్ధాంతాన్ని ఏర్పరచుకొని పరస్పరం విరోధిస్తాయి. కాని వేదాంత మతం ఈ సృష్టియే మాయ అన్నందువల్ల సృష్టి లేనట్లే చివరకు ద్వైతులు కూడా దీన్నే ప్రశంసిస్తారు.
కారిక-18: అద్వైత పరమార్థోహి ద్వైతం తద్భేద ఉచ్యతే ।
తేషాముభయథా ద్వైతం త్యేయం న విరుధ్యతే ॥
భావం: అద్వైతమే పరమార్థం. ద్వైతం దాని యొక భేదమే. పరమాత్మలో, దృశ్య ప్రపంచంలో కూడా ద్వైతులు భేదాన్నే చూస్తున్నారు. కాబట్టి అద్వైతులకు ద్వైతులలో విరోధంలేదు.
వివరణ: ద్వైతులు ప్రపంచమునకు కారణం ద్వైతమే అంటారు. అద్వైతులు పరబ్రహ్మ అద్వితీయం కావున దానినుండి మరియొకటి సృష్టించబడదు. నానాత్వముగల తత్త్వము నిత్యము, సత్యం కాలేదు. పరిమితమైనది నిత్యముకాలేదు. వేదాంతులు ద్వైతులను ఖండిపరు అంతేకాక వారి వాదములకు అసలు ప్రాధాన్యతనే ఇవ్వరు. అని శంకరుల అభిభాషణము. అద్వైతి ఆత్మజ్ఞాన ప్రభావమిట్లే ఉంటుంది.
కారిక-19: మాయయాభిద్యతే హ్యేతన్నాన్యధా--జం కథంచన ।
తత్త్వతో భిద్యమానే హి మర్త్య తామమృతం వ్రజేత్ ॥
భావం: అద్వైతమైన బ్రహ్మ వాస్తవంలో అజమే. అనగా పుట్టుకే లేనిది. కాని ఈ మాయ చేత అది భేదములను మార్పులను పొందినట్లు తోస్తుంది. ఈ విభేదాలే తత్త్వమైన అమృతత్వం మృతంగా చేస్తున్నాయి.
__వివరణ : __అద్వైతమే సత్యమైనప్పుడు మనమీ నామరూపాత్మకమైన జగత్తునెలా చూస్తున్నాము? అనే ప్రశ్నకు వేదాంతి మాయయే కారణం అని సమాధానం చెప్తాడు. పరమాత్మ ఏకము, అఖండము కావున నానారూప ప్రపంచంగా మార్పు చెందదు.
అజము అంటే జన్మలేనిది. జన్మ అంటే వికారమే కదా! వికారమే లేని తత్త్వానికి వికారం సంభవించదు. వికారం అంటే మార్పే. తాడు పాము కాజాలదు. మనో భ్రాంతివల్ల మనకు అట్లా భాసిస్తుంది. భ్రాంతి తొలగినప్పుడు తాడు తన నిజస్వరూపంగానే కన్పిస్తుంది.
పరమాత్మ నానావిధంగా విభక్తమై జగత్తుగా పరిణమించిందని చెప్పినప్పుడు అమృతమైన తత్త్వం మృతంగా మారింది. పాలు పెరుగుగా మారిన తర్వాత మళ్ళీ పాలుగా మారదు. అట్లే అమృత రూపమైన బ్రహ్మ మర్తునిగా మారిన తర్వాత తిరిగి అమృత తత్త్వాన్ని పొందలేడు. అజాత వేదాన్ని దృఢపర్చడానికి గౌడపాదుని రెండవ వివరణ ఇది. మొదటి వివరణ వైతథ్య ప్రకరణంలో కారిక-12లో తెల్పుతున్నారు. ‘‘కల్పయత్యాత్నో నాత్మాన మాత్మా దేవః స్వమాయయా । సఏవ బుధ్యతే భేదానితి వేదాంత నిశ్చయః’’ ‘‘స్వయంప్రకాశమైన ఆత్మ స్వకీయ మాయా శక్తి ద్వారా తనచే కల్గి తనయందే ఈ ప్రపంచం ఉన్నట్లు భావిస్తుంది. మనకీ తత్త్వం తెలియక మనస్సుచేత ఈ జగత్తు తయారైందని తెలుసుకుంటున్నాం. వాస్తవనానికి ఈ దృశ్య ప్రపంచం సత్యం కాదు. ఆభాసమాత్రమే.