శ్రీ పాణ్యం వాఙ్మయ నిధి పాణ్యం వంశ రచయితల సాహిత్యము

మాండూక్యోపనిషత్తు › వైతథ్య ప్రకరణము — 3

వైతథ్య ప్రకరణము — 3

మాండూక్యోపనిషత్తు · భాగము 6 / 14

‘‘ఈ విధమైన మహత్తర భావాలను మనన, నిధి ధ్యాసల ద్వారా బాగా జీర్ణించుకొన్న ధ్యానికి, మనస్సు రాగ ద్వేషాదుల నుండి విముక్తి పొందుతుంది. అట్టి క్షణాన్ని ఆత్మానందం పొందుతున్నాడు’’ అని ఇక్కడ వివరణ.

జ్ఞానమార్గంలో పయనించే వానికి శాస్త్రజ్ఞానం చాలా అవసరం. అది లేనివాడు జ్ఞానమార్గాన్ని విశ్వాసంతో అనుసరించలేడు. శ్రీ శంకర భగవత్పాదులు ఇతర మహర్షులు దీని ప్రాధాన్యాన్ని దృఢపరచి చెప్పినారు.

‘జడునివలె ఆచరింపుము’ అనే మాటకు ఈ విధంగా తెల్పుతున్నాడు. అద్వైత జ్ఞానము నందిన మహాత్ముడు సుఖదుఃఖములందు సముడై వాని కారణములను వివేకముతో వివేచించి విరక్తుడై శాంత్యానందములు కల్గు సమాధి స్థితిని పొందుచున్నాడు. జ్ఞానియైన దివ్యమానవుడు కూడా ఉదాసీనుడై జడునివలె మౌనముగా ఉండవలెనే కాని మన ఆశయములను బలవంతంగా ప్రజలపై రుద్దరాదు. నిరుపయోగమైన తాత్కాలిక సంవాదములలో అతడు తన పవిత్ర శక్తిని వెచ్చించి వ్యర్థపరచరాదు.

దివ్యతత్త్వమును పొంది ఆధ్యాత్మిక పరిపూర్ణులైన మహాత్ములు పరతత్త్వాన్ని ప్రకటించి తన తరము వారికి ఆధ్యాత్మికాభివృద్ధిని కల్గిస్తారు.

కారిక-37: నిస్తుతిర్నిర్నమస్కారో నిస్స్వధాకార ఏవచ ।

    చలాచల నికేతశ్చయతి ర్యాదృచ్ఛికో భవేత్‌ ॥

భావం: యతియైన వాడు స్తుతులకు, నమస్కారాలకు, వశుడు కారాదు. వైదికమైన అవైదికమైన కర్మకాండలో తగుల్కోరాదు. తన దేహానికి కేవలం ఆత్మయే ఆధారంగా ఉండవలె. ఆకలిదప్పులను యథాలాభంగా పొందిన వానితో తీర్చుకుంటూ దేహ రక్షణ చేసుకోవలెను.

వివరణ: పరిపూర్ణ జ్ఞాని సంపూర్ణ వైరాగ్యంతో జీవిస్తాడు. స్తుతి, నమస్కారం త్యజించి, మనస్సును అధిగమించినప్పుడు నిత్యనైమిత్తిక కర్మలు లేక, ఆత్మయే దేహరక్షణగా కల్గి, యదృచ్ఛాలాభమైన ఆహార వసనాదులను స్వీకరిస్తూ అంటే తానుగా కోరకుండా దొరికిన దానితో శరీరాన్ని నిల్పుకొనేవాడు అని అర్థం. కోరికలు, ఆకాంక్షలు లేకుండా ఆధ్యాత్మిక సాధనలను చేసేవాడే యతి. ఈ విషయం ఉపనిషత్తులలో చాలాచోట్ల బోధించబడిరది.

కారిక-38: తత్త్వమాధ్యాత్మికం దృష్ట్వా తత్త్వందృష్ట్వాతు బాహ్యతః ।

    తత్త్వీభూత స్తదారామః తత్త్వాదప్రచ్యుతో భవేత్‌. ॥

__భావం: __ఆ తత్త్వాన్ని ఆంతరికంగా దేహాభ్యంతరంలో కూడా, బాహ్య విషయ ప్రపంచంలో కూడా చూడగల్గినవాడు ఆ తత్త్వంతో ఐక్యం పొందుతున్నాడు. అంత తత్త్వంలోనే రమిస్తున్నాడు. అట్టి తత్త్వం నుండి ఎప్పటికీ జారిపోకూడదు.

వివరణ: సాధకునకు తన ప్రయాణంలోని తుది మజిలీని సూచించి, ఆత్మజ్ఞానియొక్క అనంతానందానుభవానికి కారణమైన ఒక కీలక సూత్రాన్ని కూడా ఈ శ్లోకంలో సూచిస్తున్నాడు.

ఆత్మజ్ఞానం కల్గిన వెంటనే ఈ వస్తు ప్రపంచమంతా మాయా సృష్టి అని, బాహ్యాంభ్యంతరాలలో సర్వత్ర ఆత్మతత్త్వం ఒక్కటే గోచరిస్తుందని తెలుస్తుంది. దేహాభ్యంతరంలో ఉన్న ఆత్మయే సర్వవ్యాపియైన పరమాత్మ. అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం.

ఆత్మజ్ఞానికి ఇంద్రియ విషయ ప్రపంచమంతా స్వప్న తుల్యము. కావున అవి ఏవీ ఆనందానికి కారణం కాలేవు. జ్ఞాని దృష్ట్యా గ్రహించడానికి వస్తువులు లేవు. వస్తువులు దృష్ట్యా గ్రహించు సాధనములైన మనోబుద్ధులు లేవు. మరి జ్ఞానిలో అనుభవించబడునది ఏది? ‘భోక్త’ ఎవడు? అనేదానికి జవాబు ఇది.

జ్ఞానియే ఆనంద స్వరూపుడు. ఆనందం ఆ పరమాత్మ నుండి కలుగుతుంది. జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయ సంబంధం లేదు. అట్లే భోక్త, భోజ్య, భోగ విభేదము లుండవు. అదే ఆత్మానందం. ఆత్మ ఆనంద స్వరూపం.

ఇది సహజమైన స్థితి జ్ఞాని, దీనినుండి ఎప్పటికీ దిగజారడు. జీవాత్మ భావనలేనే లేకపోవడంవల్ల పరమాత్మ నుండి వేరు పడడం ఉండదు. ఒక్కసారి అత్యంత ఆత్మ తత్త్వాన్ని పొందిన తర్వాత అతనికి పతనం లేదు.

జ్ఞాని పరిపూర్ణత పొందినచో సర్వవ్యాపియైన ఆత్మ తత్త్వంగానే ఉంటున్నాడు.

అధ్యాయం-3