తన కాలంలో ప్రచారంలోని 35 రకాల సృష్టి సిద్ధాంతాలను గౌడపాదుడు పేర్కొంటున్నాడు. వాటియందు తనకున్న ఉదాసీనతను తన రచనలో ప్రస్ఫుట పరచినది నిజమే. (రజ్జువునందు చూచిన భ్రాంతి సర్పమును గురించి చరిత్ర వ్రాయవలెననెడి శ్రద్ధ ఎవనికుంటుంది?)
శంకర భగవత్పాదులు కూడా వీటికి వ్యాఖ్య వ్రాయలేదు. అనవసర భాగములకు వ్యాఖ్య శంకరులు వ్రాయరు కదా!
జీవిత సమస్యలను గురించి బాగా ఆలోచించి, ఆలోచించిన వారిని బాగా విశ్లేషించి, విశ్లేషించిన వానిని పరిశీలించడం ధీశాలి లక్షణం. అప్పుడే జీవితం గురించి, దాని పరమ ప్రయోజనం గురించి నిశ్చిత నిర్ణయాలను చేయగలరు. అట్టి ధీశాలి గౌడపాదుడు.
కారిక-20: ప్రాణ ఇత ప్రాణ విదో భూతానీతి చ తద్విదః ।
గుణ ఇత గుణ విద స్తత్త్వానీతి చ తద్విదః ॥
భావం: ప్రాణవిదులు ఆత్మను ప్రాణమని, పంచభూతజ్ఞానం కలవారు వాటినే ఆత్మయని, గుణములే ఆత్మగా గుణవిదులు, తత్త్వవిదులు తత్త్వమునే ఆత్మగా తలుస్తారు.
__వివరణ: __
- వైశేషికులు: ప్రాణాన్ని ఆత్మగా పేర్కొంటారు. ఇక్కడ ప్రాణం శ్వాసకాదు. సమష్టి సూక్ష్మ శరీరం హిరణ్య గర్భుడని అర్థం. ఇతడే సూత్రాత్మగా చెప్పబడుతున్నాడు. ఈ మతంవారిని హిరణ్యగర్భకులు అంటారు.
- చార్వాకులు: పంచభూతాలనుండి సృష్టి జరిగినదని నమ్ముతారు.
- లోకాయతులు: కేవలం స్థూల జగత్తునే ఆత్మగా గ్రహిస్తారు. వీరికి ఆకాశం కూడా భూతంగా ఉండదు.
- సాంఖ్యులు: త్రిగుణములనుండి సృష్టి జరిగింది అంటారు. సత్త్వరజస్తమో గుణాలు త్రిగుణాలు. ఈ మూడు గుణాలలోని హెచ్చుతగ్గులు నామరూపాత్మకమైన జగత్తుగా మారును. సమపాళ్ళలో ఉన్నప్పుడు అవ్యక్తమై మహద్రూపములో ఉండడమే ప్రళయం.
- శైవులు : ఆత్మ-అవిద్య-శివుడు అనే 3 తత్త్వములతో కూడుకొన్నది పరమాత్మ అని భావిస్తారు.
కారిక-21: పాదా ఇతి పాదవిదో విషయా ఇతి తద్విదః ।
లోకా ఇతి లోకవిదో దేవా ఇతి చ తద్విదః ॥
భావం: ఆత్మ యొక్క పాదములు తెలిసినవారు ఆ పాదములు సృష్టి మూలము అంటారు. ఇంద్రియ జ్ఞానులు అవే ఆత్మ అంటారు. లోకములనెరిగినవారు వాటినే ఆత్మగా భావిస్తారు. దేవతలను తెలిసిన వారు దేవతలనే ఆత్మగా తలుస్తారు.
వివరణ:
5) ప్రణవోపాసనలోని మూడు పాదముల కలయికను ఆత్మగా భావిస్తారు. (విశ్వతైజస ప్రాజ్ఞులతో కూడినది)
6) విషయ సుఖానందమే (శబ్ద స్పర్శాదులు) ఆత్మయని వాత్స్యాయనాదులు.
7) పౌరాణికులు భూః, భువః, సువః, మూడు లోకముల కలయికయే ఆత్మ తత్త్వము అంటారు.
8) మీ మాంసకులు కర్మకాండనే పరమార్థంగా ఇంద్రాగ్ని దేవతలనే శాశ్వత సత్త్వతత్త్వముగా భావిస్తారు.
__కారిక-22: __వేదా ఇతి వేదవిదో యజ్ఞా ఇతి తద్విదః ।
భోక్తేతి చ భోక్తృవిదో భోజ్య మితి చ తద్విదః ॥
భావం: వేదవిదులు వేదమునే పరమాత్మగా, యజ్ఞవిదులు యజ్ఞాన్నే పరమాత్మగా, భోక్తృవిదులు భోక్తనే పరమాత్మగా భోజవిదులు భోజ్యమే పరమాత్మగా విశ్వసిస్తున్నారు.
వివరణ : 9) వేదములే సర్వాధారములనేవారు వేద విదులు.
10) బోధాయనులు యజ్ఞములనే భూత ప్రపంచకారకములని నమ్ముతారు. కాని యజ్ఞములో ఉద్దిష్టదైవము, ఆహుతి, హోత అనే 3 భాగములు కల్గిన పరిమితమైన విషయములున్నాయి. కాని అపరిమిత అనంత తత్త్వమునకు అది కారణం కాజాలదు అని గౌడపాదుని ఖండన.
11) సాంఖ్యులు ఆత్మను భోక్తగా పరిగణిస్తారు. ఆత్మ భోక్త యగుచున్నాడని వారి మతము.
12) సూపకారులు - అనెడి వాదులు భోజ్యము (అనుభవించబడునది) ఆత్మగా విశ్వసిస్తారు.
కారిక-23: సూక్ష్మ ఇతి సూక్ష్మ విదః స్థూల ఇతి తద్విదః ।
మూర్త ఇతి మూర్తవిదో-మూర్త ఇతి చ తద్విదః ॥
భావం: సూక్ష్మ విదులు సూక్ష్మమే ఆత్మ అని వాదిస్తారు. స్థూల విదులకు స్థూలమే ఆత్మ. మూర్తవిదులు మూర్తిని, అమూర్తవిదులు అమూర్తియే ఆత్మగా నమ్ముతారు.
__వివరణ: __13) నైయాయికులు: జగద్రూపములో పరమాత్మ పరిణమించినదని వాదిస్తారు. ఈ పరిణామము మళ్ళీ 3 రకాలు 1) అను, 2) మధ్యమ, 3) విభు. అణు పరిణామమే సూక్ష్మమని గౌడపాదుని నిష్కర్ష.
14) లోకాయతులు: స్థూల శరీరాన్ని ఆత్మగా నమ్ముతారు. దేహాత్మ, ఇంద్రియాత్మ, మన ఆత్మ వాదులు. వీరు 3 రకాలు. దేహమే ఆత్మగా, ఇంద్రియామే ఆత్మగా, మనస్సే ఆత్మగా భావిస్తారు వీరు.
15) ఆగమికులు: పరమాత్మకొక నిర్ణీత రూపాన్ని కల్పిస్తారు. శివ, విష్ణు, దేవీ రూపాలన్నీ వీరి సిద్ధాంతాలే.
16) శూన్యవాదులు: బౌద్ధులు, శూన్యమే పరమాత్మ అని శూన్యం నుండే నామరూపాత్మక జగత్తు ఉద్భవించినదని వీరి వాదన.
కారిక-24: కాల ఇతి కాలవిదో దిశ ఇతి తద్విదః ।
వాదా ఇది తద్విదో భువనానీతి తద్విదః ॥
భావం: కాలమే పరమాత్మగా కాలవిదులు, దిగ్వాదులు దిక్కులే పరమాత్మగా, వాదవిదులు వాదమే పరమాత్మగా, భూవనవిదులు భువనాలనే పరమాత్మగా భావిస్తారు.
__వివరణ: __17)జ్యోతిష్కులు, ఖగోళశాస్త్రజ్ఞులు కాలమే పరమాత్మగా భావిస్తారు. కాలమునుండి జగత్తు ఉద్భవించినదని వీరి తాత్పర్యము. కాని మన నిత్యానుభవములో కాలము నిత్యం మారుతుంటుంది. నత్యి సత్యమైన పరబ్రహ్మ కాలం కాజాలదు కదా.
18) స్వరోదయవాదులు పక్షుల, బల్లుల స్వరములను బట్టి భవిష్యత్తును చెప్పే శకున శాస్త్రజ్ఞులు ధ్వని, అది వచ్చిన దిక్కును బట్టి విశేషాలను గ్రహిస్తారు. దిక్కులే జగదాధారమని విశ్వసిస్తారు.
19) వాదవిదులు వాదమే ఆత్మగా భావిస్తారు. ఇక్కడ వాదము అంటే వాదన కాదు. ధాతువాదులు - మంత్రవాదులు అని అర్థం - ఆనందగిరి ఇంద్రజాల విద్యను ముఖ్యంగా వాదమని వ్యవహరిస్తారు.
20) భువనకోశవాదులు - వీరికి చతుర్దశ భువనాలనే సత్యతత్త్వంగా భావిస్తారు.
కారిక-25 : మన ఇతి మనో విదో బుద్ధిరితి చ తద్విదః ।
చిత్తమితి చిత్తవిదో ధర్మాధర్మౌ చ తద్విదః ॥
__భావం: __మనస్సే ఆత్మగా భావించేరు మనోవిదులు, బుద్ధిని ఆత్మగా బుద్ధివిదులు, చిత్తమే ఆత్మగా చిత్తవిదులు ధర్మాధర్మములే ఆత్మగా ధర్మవిదులు తలుస్తారు.
__వివరణ: __21) మనోవిదులు మనస్సే పరమాత్మయని, మనస్సు లేకుండా ప్రపంచమే లేదని నమ్ముతారు.
22) బౌద్ధులు బుద్ధినే అంటే విజ్ఞానాన్నే బ్రహ్మగా భ్రమ పడతారు. కాని సుషుప్తిలో మనబుద్ధులు లుప్తమైతాయి.
23) యోగాచార్యులు చిత్తును బ్రహ్మంగా భావిస్తారు. వారి వాదన ప్రకారం చిత్ లేకుండా మనో బుద్ధులు ప్రవర్తించలేవు. కాబట్టి చిత్ బ్రహ్మమే.
24) మీమాంసకులు ధర్మా ధర్మములనే ఆత్మగా వాదిస్తారు. ధర్మమే జగదాధారమైనదిగా వీరి విశ్వాసం సృష్టి, స్థితి, లయలకు పూర్వకర్మలు, వర్తమాన కర్మలు భవిష్యత్తును నిర్ణయిస్తాయని వీరి మతము.
ఖండన: అంతఃకరణ భాగములను మనో, బుద్ధి, చిత్తులను ఆత్మగా తలచుట అవివేకం. చైతన్యతత్త్వం మనస్సు నుండి వెడలినప్పుడు మనస్సు జడమైతుంది. కాబట్టి ఇది అసంబద్ధము.
ధర్మాధర్మములు పరస్పర సంబంధముచే అస్తిత్వము కల్గియున్నవి. పరస్పర సాపేక్షములు ఎన్నడూ ఆత్మ తత్త్వము కాజాలవు. ఒకే రాజ్యాన్ని ఇద్దరు రాజులు పాలించలేరు. ఒకడు మరొకని అధికారాన్ని పరిమిత పరుస్తాడు.
కారిక-26: పంచవింశక ఇత్యేతే షడ్వింశః ఇతి చాపరే
ఏకత్రింశక ఇత్యాహు రనన్త ఇతి చాపరే
భావం: ఒకరు పంశవించతి తత్త్వములు గలది ఆత్మ అని, షడ్వింశతత్త్వముల గలదే ఆత్మ అని, ఏకత్రింశక తత్త్వాత్మకమైనది ఆత్మగా వేరొకరు అనంతత్త్వాత్మ కమైనదని కొందరు భావిస్తారు.
వివరణ: 25) సాంఖ్యులు 25 రకాలుగా వికారము పొందినదని భావిస్తారు.
మూల ప్రకృతి = 01
మహత్తు-1 + అహంకారము-2 + పంచతన్మాత్రలు-3 = 07
జ్ఞానేంద్రియాలు-5 + కర్మేంద్రియాలు-5 + పంచభూతాలు-5 = 15
ఇవన్నీ కలిసి మనస్సు + పురుషుడు = 02
పంచవింశతి తత్త్వములు = 25
26) పతంజలి యోగ శాస్త్రంలో పైన చెప్పిన 25 తత్త్వాలకు ఈశ్వరతత్త్వము కలిసి 26 తత్త్వాలుగా చెప్పారు.
27) పాశుపతులు 31 తత్త్వాలుగా సృష్టి కారణాన్ని పేర్కొన్నారు. అవి - 1) శివ, 2) సుఖ, 3) సదాశివ, 4) ఈశ్వర, 5) విద్య, 6) పురుష, 7) మాయ, 8) కాలము, 9) నియతి, 10) కలా, 11) అవిద్య, 12) రాగము, 13) అవ్యక్తము, 14) మహత్తు, 15) అహంకారము, 16) మనస్సు. జ్ఞానేంద్రియాలు (21) కర్మేంద్రియాలు - (26) పంచతన్మాత్రలు (31) పంచభూతములు (36)
పై వాటిలో కాల, నియతి, కలా, అవిద్య, రాగము అనెడి 5 తొలగిస్తే (31) తత్త్వములే అగును.
28) మరొకవాదంలో అనంత తత్త్వములే సత్యతత్వము.
కారిక-27: లోకాన్ లోక విదః ప్రాహురాశ్రమా ఇతి తద్విదః ।
స్త్రీ పుం నపుంసకం తైజ్ఞః పరాపర మథాపరౌ ॥
భావం: తాత్త్వికులు సంతోషక విద్యనే ఆత్మగా, ఆశ్రమ విదులు ఆక్రమములే ఆత్మగా, వైయాకరణులు స్త్రీ పుం నపుంసక భేదముగల లింగమే ఆత్మగా, పర-అపరలే ఆత్మగా మరికొందరు చెప్తారు.
__వివరణ: __29) సంఘ సేవకులు మానవసేవనే ఆత్మగా భావిస్తారు.
30) ఆశ్రమవాదులు దక్షుడు మున్నగువారు ఆశ్రమధర్మములను పాటించడమే ఆత్మగా భావిస్తారు.
31) వైయాకరణులకు లింగమే ఆత్మ. స్త్రీ పుం, నపుంసక -
32) పరాబ్రహ్మ అపర బ్రహ్మగా ఆత్మ తత్త్వాన్ని విభజించినారు కొందరు. అపరా బ్రహ్మ - జగత్తు. పరాబ్రహ్మ - దానికి కారణము
కారిక-28: సృష్టి రితి సృష్టి విదో లయ ఇతి చ తద్విదః ।
స్థితి రితి స్థితి విదః సర్వే చేహ తు సర్వదా ॥
భావం: సృష్టి విదులు సృష్టిగా, లయ విదులు లయగా స్థితివాదులు స్థితిగా, ఆత్మను పేర్కొంటారు. నిజానికి ఇవన్నీ ఆత్మలో కల్గిన భావనా కల్పితములే.
__వివరణ: __33) సృష్టి వాదులు క్షణక్షణం ప్రపంచం నిరంతరంగా సృష్టించ బడుతుందని నమ్ముతారు.
34) లయ విదులు క్షణక్షణం నిరంతరంగా జగత్తు లయమునొందుతున్నది.
35) క్షణక్షణం ఈ ప్రపంచం స్థితిపొందుతున్నది.
ఈ విధంగా సృష్టి, స్థితిలయలకు ఆత్మయే ఆధారంగా పేర్కొను వాదములివి. ఈ శ్లోకములతో గౌడపాదుడు తన కాలములోని వివిధ మతములను పేర్కొనుటను ముగించినాడు.
కారిక-29: యంభావం దర్శయేద్యస్య తంభావం సతుపశ్యతి ।
తం చా వతి సభూత్వా-సౌ తద్గ్రహః సము పైతితం ॥
భావం: ఆయా సిద్ధాంతముల ప్రకారము సాధన చేసినచో ఆయా భావానుగుణంగా అనుభవము సిద్ధించును. దానినే ఆత్మగా భ్రమ పడతారు సాధకులు.
వివరణ: ఆత్మకు గుణ, క్రియాదులను అంటగట్టడంపైన 35 మతాలు చేసినదంతా అవివేకం. అదంతా అజ్ఞాన జన్యమే. ‘యద్భావం తద్భవతి’ అన్నట్లు ఒక దాన్ని భావించిన వాడు దాన్నే అనుభవంగా పొందుతాడు. నిజ తత్త్వమెరుగలేడు. ప్రతివానికి సృష్టికి, లయకు సామర్థ్యం ఉంది. శక్తివంతమైన ఉన్నత భావములను భావిస్తే శాంతిని, ఆనందాన్ని పొందగలం. మిథ్యాభావములనుభవిస్తే దుఃఖమే ఫలితము అన్నిటికీ సత్యతత్త్వమే ఆధారము. పరిపరి విధముల పరిగెత్తే మనస్సును అణిచి, అచేతనస్థితి యందు ఆత్మను దర్శించినప్పుడే దాని సహజ ధర్మము అభివ్యక్తము కాగలదు. వస్తు భావనలనుండి విడివడినప్పుడే నిజ తత్త్వము గోచరిస్తుంది. మనస్సు ద్వారా ఇది సాధ్యం కాదు. ఇదియే వేదాంత పద్ధతి. అద్వైతమతము. విచారములన్నింటికీ అతీతము. రజ్జువును రజ్జువుగానే చూడవలెను. దానికున్న సర్పగుణములను భ్రాంతిని (మాయను) తొలగించుకోవలెను. భ్రాంతిమూలమైన మనోబుద్ధులు అంతరించినప్పుడే ఆత్మతత్త్వము భాసిల్లగలదు. జ్ఞానులు వేదాంత సిద్ధమైన ఆత్మానుభవాన్ని అనుభవించి దాని ప్రకారం ‘ఆత్మయందు ఈ జగత్తు లేనేలేదు’ అని నిరూపించిరి. పరమాత్మ జ్ఞానమొక్కటే సర్వసమస్యలకు పరిష్కారము.
కారిక-30: ఏతై రేషా పృథగ్భావైః పృథగే వేతి లక్షితః ।
ఏవం యో వేద తత్త్వేన కల్పయే త్సో-విశంకితః ॥
__భావం: __ఈ వస్తు ప్రపంచమునుండి ఆత్మ వేరైనట్లు కనబడుతుంది కాని వాస్తవానికి అది వేరు కాదు. ఈ విషయమును బాగా తెలుసుకున్న వాడు వేదముల యొక్క యథార్థ భావాన్ని సందేహం లేకుండా గ్రహిస్తున్నాడు.
వివరణ: ఉన్నదంతా ఆత్మ ఒక్కటే అని తెలిసికొన్నవాడే జ్ఞాని అట్టివాడే ఉపనిషత్సిద్ధాంతములకు సరియైన అర్థాన్ని వేదాంత మతానుసారం వ్యాఖ్యానించ గలడు. కేవలం బుద్ధి సామర్థ్యంతో తెలుసుకునే వారికి శాస్త్రజ్ఞానము మాత్రమే కల్గుతుంది. అనుభవం పొందిన జ్ఞానుల వలె, కేవలం శాస్త్రజ్ఞానం కల్గినవారు అధికారికంగా బోధించలేరు. కారణం వారికి అనుభవ జ్ఞానం లేకపోవడమే ద్వైతులు సిద్ధాంతరీకరించిన ప్రాణాదులన్నీ ఆత్మకంటే వేరు కావు. సర్పము రజ్జువు కంటె భిన్నం కాదు. భ్రమతో మనం భిన్నంగా సర్పాన్ని చూస్తున్నాం. రజ్జువును వేరుగా చూడడం లేదు. భ్రమ తొలగినంతనే రజ్జువు నిజరూపాన్ని, గుణాన్ని తత్త్వాన్ని అనుభవానికి వస్తుంది. కాబట్టి ఆత్మ తత్త్వం బహుతత్త్వ మూలకమని తమలో తాము వాదించుకొన్న ద్వైతుల వాదనకు కారణం కేవలం భ్రమయే అని గౌడపాదుని తీర్మానం.
కారిక-31: స్వప్న మాయా యథా దృష్టే గంధర్వ నగరం యథా ।
__ తథా విశ్వమిదం దృష్టం వేదాంతేషు విచక్షణైః ॥__
భావం: వేదాంతులు ఈ జగత్తును స్వప్నం వలె, గంధర్వనగరం వలె మిథ్యగా చూస్తున్నారు.
వివరణ: గంధర్వనగరం - అంటే ఆకాశమునందలి మేఘాలు కదులుతూ రకరకాలైన ఆకృతులను దాలుస్తాయి. మేడలు మిద్దెలు గ్రామములు వస్తువులు జంతువులు వంటి వన్నీ కన్పిస్తున్నట్లు భావిస్తాం. దీనినే గంధర్వనగరమని పేర్కొంటాం. ఇవన్నీ కేవలం ఊహలోనే. కాని తాత్కాలికంగా అవి సత్యమే అనిపిస్తాయి. అట్లే స్వప్నములో సత్యాధారము లేని అనేక అనుభూతులను పొందుతున్నాం. స్వప్నంలో ఉన్నంత వరకు అవి సత్యమే అనుకుంటాం. గారడీవాడు గారడీ చేసి అసంభవ దృశ్యాలను కల్పించినప్పుడు తాత్కాలికంగా ఆ క్షణంలో సత్యమే అని నమ్ముతాం. వెంటనే అది మంత్రగాని మాయగా తెలుసుకుంటాం. అంతెందుకు మనకు మనమే ప్రశాంతంగా కూర్చొని ఒక విషయాన్ని గూర్చి విస్పష్టంగా ఆలోచిస్తే మానసిక భ్రమలో చూచే పదార్థాలు నిత్యం కాదని గ్రహిస్తాం.
పై ఉపపత్తులను బట్టి తేలేదేమంటే ఈ దృశ్య ప్రపంచమంతా మన మనోమాయా కల్పితమే. కాబట్టి కనిపించేదంతా సత్యం కాదు. శ్రద్ధావివేకములతో చూచు సాధకునకు మనోబుద్ధులంతరించినంతనే ఈ ప్రపంచం కూడా లేనిదే అగును.
కారిక-32: ననిరోధో నచోత్పత్తి ర్నబద్ధో న చ సాధకః ।
నముముక్షుర్నవై ముక్తః ఇత్యేషా పరమార్థతా ॥
భావం: ఉత్పత్తి, లయము, బంధము, సాధకుడు, ముముక్షువు, ముక్తుడు వంటి వేమియు లేవు. ఇదే పరమసత్యము.
వివరణ: ఇటువంటి శ్లోకాలను పుస్తకాలలో చదివి మనం చాలా పొరపాట్లు చేస్తున్నాం. తాను పొందవలసిన లక్ష్యంగాని, చేయవలసిన సాధన గాని లేదు అని భ్రమిస్తాం. ఇది మనకు పతనహేతువైతుంది. మరి ఈ ప్రమాదం నుండి మనలను రక్షించేది ఎవరు గురువు. ఇటువంటి శ్లోకాల యధార్థ భావాన్ని వివరించి బోధించేందుకే గురువు అవసరం. కేవలం మన హేతువాదం, బుద్ధి కుశలత ఇక్కడ పనిచేయవు.
మనమింకా అసంపూర్ణులము చేయవలసిన సాధన ఎంతో ఉంది. కావున ఎలా సాధన చేయాలో ఉపదేశిస్తాడు గురువు.
ఇటువంటి శ్లోకాలు పరమ గురువులు ఆత్మ తత్త్వంలో ప్రజ్వరిల్లే సమయంలో వారి ముఖం నుండి వెలువడినట్టివి. సామాన్యులందరూ వాటిని యథాతథంగా గ్రహించరాదు. బ్రహ్మవేత్తయైన గురువుద్వారా సాధకుడు విషయమునెరిగిన సాధన చేయవలసి ఉంటుంది. అట్టివారిని వినయ విధేయతలతో ఆశ్రయించి సేవించి వారి కరుణకు పాత్రులగునప్పుడే ఈ శ్లోక రహస్యములు అనుభవములకు వస్తాయి. తస్మాత్ జాగ్రత్త. పరమాత్మ తత్త్వమును చేరినవానికి ఉత్పత్తి లయబంధం, వంటివేవీ ఉండవు. మాయా పరిధులను దాటినవాడే సర్వవ్యాపి, దివ్యతత్త్వమగు ఆత్మయే తానమగుచున్నాడు.
బద్ధుడు, ముక్తుడు అనే జ్ఞానము అహంకారియైన జీవునిదే. మనో బుద్ధులంతరించనంతవరకు ఇదే మాయలో తగుల్కొని ఉండను. ఉదాహరణ విద్యుచ్ఛక్తి ప్రసరించనిచో బల్బు తనకు తానే ప్రకాశించదు. మనోబుద్ధుల సాధన ద్వారానే జీవ తత్త్వము ప్రసరిస్తుంది.
జీవునికే బుద్ధుడు గాని ముక్తుడుగాని అనే భావన. ఆత్మకు ఏ బంధకమూ లేదు. పర తత్త్వము సదా ముక్తమే. భౌతికావరణలోనున్న ఆత్మకే ప్రత్యేక జీవ భావన ఉంటుంది. దానివల్లనే బద్ధుడనని పరిమితుడనని జీవ భావనకు ముక్తియనెడి ఓదార్పు అవసరం.
నామరూపాత్మకమైన జత్తు అంతా పరమాత్మ యందు ఆరోపించబడినది. రజ్జువు నందు సర్పము ఆరోపించబడినట్లు అన్నిటికీ ఆధారభూతమైనదే సత్యమా? అనే సందేహాన్ని ఖండిరచడానికే గౌడపాదుడు ఇదియే బ్రహ్మ ఇదియే సత్యము అని నిష్కర్షిస్తున్నాడు. మనో బుద్ధుల కారణంగా చెలరేగిన ఊహలు యోచనలు సాధనతో అంతమైనంతనే ఆత్మతత్త్వము ప్రస్ఫుటంగా ప్రత్యక్షమగును.
కారిక-33: భావైరసిద్ధి రేవా-యమద్వయేన చ కల్పితః ।
భావా అప్యద్వయే నైవ తస్మా దద్వయతా శివా ॥
భావం: ఈ ఆత్మను అసత్యమైన వస్తు ప్రపంచంగా మరియు అద్వైతమైనదిగా రెండు విధాలా భావిస్తున్నాం. ఈ వస్తువులన్నీ ఆ అద్వైతమైన ఆత్మలోనే భావింపబడుచున్నవి. కాబట్టి అద్వైతమే అత్యంతము మరియు శివము.
వివరణ: ఎండమావులను చూచి నీటి ప్రవాహంగా భ్రమిస్తాము. ప్రవాహ లక్షణాలైన చిరుతరగలు, బుడగలు, అలలు కూడా కనిపిస్తాయి. ఇదంతా సత్యం కాదు. దానికి ఆధారమైన అడుగునున్న ఎడారి మాత్రమే సత్యము. ఈ విధంగానే మాయా ప్రపంచాన్ని గూర్చిన మనభావాలన్నీ, ‘బ్రహ్మ అద్వయం’ వంటి వేదాంత నిర్ణయాలన్నీ కేవలం భావనా కల్పితాలే అని గౌడపాదులు నిర్ణయం. పరమాత్మకు నిజానికి ఎట్టి గుణము లేదు. ఉండరాదు. గుణములను అంటగట్టి పరమాత్మను పదార్థపు స్థాయికి దించినవారమే అగుదుము. అశాశ్వత, నశ్వర, పరిమిత, చలతత్త్వముగా చేయుటయే ఈ ప్రయత్నము.
ప్రపంచంతో పోల్చినప్పుడు మాత్రమే పరమాత్మ అద్వైతంగా ఉంటుంది. పరమాత్మ జ్ఞానం కల్గిన వెంటనే ద్వైతభావన అంతరిస్తుంది. కాబట్టి ద్వైతము అసత్యము. దాని అపేక్షతో కల్గే, అద్వైతమునకు అస్తిత్వమే లేదు. ద్వైత, అద్వైత జ్ఞానములు రెండిరటికీ పరమాత్మయే కారణము. శుద్ధచైతన్య రూపమైన మనలోని పరమాత్మను తెలుసుకోడానికి ప్రపంచం వైపు ప్రసరించే మనస్సును ఉపసంహరించి అంతర్ముఖం చేయడం ఒక్కటే మార్గము. ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటున్న మనోబుద్ధుల వెనుక ఏకమైన, అద్వైతమైన బ్రహ్మ తత్త్వమున్నదని తెలిసిన వెంటనే మనస్సు అదృశ్యమై పోతుంది. తత్ఫలితంగా ఆత్మానందానుభవం మాత్రమే మిగులుతుంది.
కారిక-34: నాత్మ భావేన నానేదం నస్వేనాపి కథంచన ।
నాపృథఙ్నా పృథక్కించిత్ ఇతి తత్త్వవిదో విదుః ॥
భావం: ఈ నానాత్వ విశిష్ట ప్రపంచము పరమాత్మతో తాదాత్మ్యము పొందలేదు అని కాని, పొందింది అని కాని, పరమాత్మకన్నా భిన్నము అని కాని, స్వతంత్రము అని కాని చెప్పలేం. లేదా పరమాత్మలో ఐక్యంపొందినది ఏక రూపమే అని కూడా చెప్పలేమని తత్త్వ విదులు బోధిస్తున్నారు.
వివరణ: ‘ఇదం’ అనే పదం ఇది అనే అర్థంలో విషయ ప్రపంచమునకు సంబంధించినదాన్ని సూచిస్తుంది. నానాత్వ విషయ ప్రపంచాన్ని తెలియుటకు ఇదం చక్కని ఉపకరణం.
భావములు, శరీరము, బుద్ధి వంటివన్నీ ఆత్మీయ ప్రపంచం. బైటి వియములన్నీ విషయ ప్రపంచం. ఒక్కొక్క సారి విషయ ప్రపంచం కన్నా ఆత్మీయ ప్రపంచం సత్యమని అనుకుంటాం. కాని అది కూడా తప్పే. మనోబుద్ధులతో చూచే మనము ఆత్మను కనుగొనలేము. ఇది దాదాపు అసాధ్యము. కారణం ద్వైత భావన అనంత జన్మ పరంపరగా మనలో గాఢంగా నాటుకుపోయింది దానిని పెకిలించి వేయుటకు శ్రద్ధగా సాధన చేయవలెను.
‘‘ఆత్మ యందు జగత్తు లేదు. పరిపూర్ణ జ్ఞానస్థితి పొందడానికి మానవునికి అవకాశం ఉందని ఆత్మ జ్ఞానానుభవం పొందిన మహర్షులు నొక్కి చెప్తున్నారు’’ అని గౌడపాదుని వివరణ. తాను కూడా ఆత్మానుభవం పొందినప్పటికీ అది తన స్వీయానుభవంగా కాకుండా గురుపరంపరా ప్రాప్తంగా వచ్చినదని తెల్పుచున్నాడు. కారణం భారతీయ వేదాంత శాస్త్రము ఒక వ్యక్తి యొక్క ప్రత్యేక స్వానుభవం అని ఏ సిద్ధాంతాన్ని కూడా పేర్కొనదు. అట్లు పేర్కొన్న చో అది సర్వులకు అంగీకారం కాదు.
కారిక-35: వీతరాగ భయ క్రోధైః మునిభిర్వే దపారగైః ।
నిర్వికల్పోహ్యయం దృష్టః ప్రపంచోపశమో-ద్వయః ॥
భావం: రాగభయక్రోధాదులను విడిచి, వేదపారగులైన మహామునులచేత ఈ ఆత్మ నిర్వికల్పమని, అద్వయమని, ప్రపంచ రహితమని స్థిరపరచబడిరది.
వివరణ: ప్రకరణ గ్రంథం సాధకునకు కావలసిన సాధనా విధానాలను వివరిస్తుంది. శాస్త్రగ్రంథం ఆదర్శాలను, సిద్ధాంతాలను సంపూర్ణంగా విపులంగా వివరిస్తుంది. మండూక్యోపనిషత్తు నకు గౌడపాదుడు వ్రాసిన కారికలు ప్రకరణ గ్రంథం. వేదాంత విద్యార్థులకోసం ప్రతి అద్యాయము విస్పష్టమైన విపులమైన ఉపదేశంతోనే ముగుస్తుంది. ఈ శ్లోకంనుండి 4 శ్లోకాలలో అద్వైత బ్రహ్మతత్త్వాన్ని తెలుసుకోడానికి కావలసిన సాధనా విధానాన్ని నిశ్చయాత్మకంగా బోధిస్తున్నాడు.
పరతత్త్వస్థితికి చేరేందుకు అనువైన మనోబుద్ధులు ఎలా అభివృద్ధి చెందాలనో ఆ లక్షణాలను వివరిస్తున్నాడు. రాగం, భయం, క్రోధం వంటివన్నీ పోగొట్టుకున్న వారు సనాతనులైన ఆత్మజ్ఞానులు. వ్యతిరేక భావనా రూపంలో ఉన్న మనలోని అజ్ఞానము, మన మానసిక వైజ్ఞానిక వ్యక్తిత్వము ద్వారా రాగద్వేషాది రూపంలో వెలువడుతుంది. మన అనురాగమే పాశవిక ప్రవృత్తులకు బీజమై ఉన్నది. బాహ్యేంద్రియ విషయ ప్రపంచమే సత్యము అనే విశ్వాసము ఆ విషయములందు అనురాగాన్ని కల్గిస్తుంది.
ఉదాహరణకు మనకు మననీడపైన ఇష్టం ఉండదు. దాన్ని గురించి కనీసం గమనించం. ఎందుకు? అది సత్యం కాదని తెలుసుకాబట్టి. అట్లే బాహ్య విషయ ప్రపంచం సత్యంకాదని తెలిసినప్పుడు వాంఛ కల్గదు. అనురాగంలోనే ద్వేషం వృద్ధిపొందుతుంది. ద్వేషం వల్లనే క్రోధం, అట్లే భయము. అందుకే ఉపనిషత్తులు పరమాత్మయొక్కటే నిర్భయమైనదని సత్యమని చెప్తున్నాయి. మరొకటిలేదు. భయం పుట్టేది రెండున్నచోటే. దీనికి మనకు చక్కని అనుభవం. నిద్ర. దానిలో భయం ఉండదు. భయం ఉంటే నిద్రరాదు. రాగం, భయం, క్రోధం, ద్వేషం వంటివాటిని జయించడమే తొలి సాధన. ఇది ఉపవాసం, తపస్సు, సేవ, పూజ, భక్తి వంటివానితో సాధ్యం కాదు.
ఉపనిషత్తు యొక్క సమ్యగ్భావాన్ని తెలుసుకొన్నప్పుడే ఇది సాధ్యం. వీరినే వేదపారగులు అంటున్నారు.
జ్ఞానమార్గాన్ని అనుసరించడంలో తొలిమెట్టు ఉపనిషత్తులను చక్కగా అధ్యయనం చేసి, సంపూర్ణంగా వాటి అర్థాన్ని గ్రహించడం. ఇదే ఈ శ్లోకంలో సూచించబడిరది.
ఆత్మ అనే పదానికి సమానంగా అయం పదాన్ని గౌడపాదుడు ఉపయోగించాడు. మనకు ఆత్మీయమైనది ఆత్మయే. అయం అనే పదం చాలా దగ్గరిది అనే అర్థంలో ఇది అని వాడుతున్నాడు. అతి సన్నిహితమైనది అని అర్థం. దేహమనో బుద్ధులను జయించిన వానికే ఆత్మను గురించిన విజ్ఞానం సాధ్యం.
ఆత్మకు ప్రపంచోపశమం అనే విశేషణం వాడడంవల్ల నానాత్వ విశిష్ట ప్రపంచం ఆత్మకాదు అని చెప్పడం జరిగింది. ఇది తెలిసినవెంటనే పరిమితమైన మర్త్యత్వాన్ని విడిపించుకొని, నిత్యముక్త బ్రహ్మతత్త్వాన్ని చేరుతున్నాడు. అందుకే ‘ఏక మేవాద్వయం బ్రహ్మా’ అంటున్నారు. అందు నానాత్వ విశిష్ట ప్రపంచం ఉండదు.
కారిక-36: తస్మాదేవం విది త్వైనం అద్వైతే యోజయోత్ స్మృతిం ।
అద్వైతం సమనుప్రాప్య జడరివలోక మా చరేత్ ॥
భావం: కావున ఇట్టి బ్రహ్మను తెలిసికొని అద్వైత బ్రహ్మ తత్త్వమందే మనస్సును లగ్నం చేయాలి. అట్లు చేస్తే ఈ లోకంలో జడునివలె సంచరిస్తాడు.
వివరణ: ‘తస్మాత్ - కావున’. అనే పదం ద్వారా పూర్వశ్లోకానికి ఈ శ్లోకానికి ఉన్న సంబంధాన్ని వివరిస్తున్నాడు. ‘వేద పారగులైన మహర్షులు ఆ విధంగా మనోబుద్ధులనధిగమించి ఆ పరతత్త్వంలో నిల్చిరి. కాబట్టి సాధకులు కూడా అట్లే వారి ఉపనిషత్తులను శాస్త్రోక్తకంగా చదివి, వివేకంతో పరిశీలించి, మనోబుద్ధులను పవిత్రం చేసుకొని, తద్ద్వారా ఆ అతీతస్థితిని పొందవలసి ఉంది.