__పరిచయం : __
ఈ ప్రకరణంలో గౌడపాదుడు దృశ్య ప్రపంచము యొక్క మిథ్యాత్వమును గూర్చి చర్చించుచున్నాడు.
‘‘ప్రథమాధ్యాయములో ద్వైతములేదని ప్రకటించినప్పటికీ అది ఆగమము లేదా శాస్త్రము ద్వారానే చెప్పబడిరది’’ - శ్రీ శంకారాచార్యులు
ప్రథమాధ్యాయములో మిథ్యాత్వము తర్కవాదముల ద్వారా బలపర్చపడిరది. ద్వితీయాధ్యాయములో వాదప్రతివాదముల ద్వారా జగన్మిథ్యాత్వము స్థాపించుటకు ప్రయత్నిస్తారు.
జాగ్రత్స్వప్నములకు అనుభవంలో భేదం లేదని ప్రత్యక్షంగా, తార్కికంగా నిరూపించినారు ఈ ప్రకరణంలో. జాగ్రత్తు నిజమైతే స్వప్నం కూడా నిజమైతుంది. స్వప్నప్రపంచం మాయా స్పష్టంగా భావిస్తే జాగ్రత్ప్రపంచంకూడా మిథ్యా మాత్రంగా మిగుల్తుంది.
ఈ సిద్ధాంతాన్ని ఋజువు పరచడానికే గౌడపాదులు ఈ రెండు అవస్థలలోని మన అనుభవాలను సూక్ష్మంగా పరిశీలించిన విషయాలను అనంతమైన తర్కవాదములను ప్రతిపాదిస్తున్నారు.
__సిద్ధాంతం: __
జాగ్రత్స్వప్న సుషుప్త్యావస్థలు మూడూ మనం నిత్యం పొందుతున్నాం. కాని జాగ్రత్తును మాత్రమే నిజమని నమ్మి, మిగిలిన రెంటినీ విస్మరిస్తున్నాం. నిర్లక్ష్యం చేస్తున్నాం. వాటిని అంగీకరిస్తే మన సుఖజీవనానికి అడ్డంకిగా మారుతాయనే భయం కూడా ఉంది. తాను కనుగొన్న అనుభవించిన సత్యమునే అద్వైతి లోకమునకు వెల్లడి చేస్తాడు.
జీవితమును ఇంత విపులముగా, సంపూర్ణముగా చర్చించి వివరించిన గ్రంథం మాండూక్యోపనిషత్తు కంటె మరొకటిలేదు. ప్రపంచ తత్త్వవేత్తలందరూ ఎప్పుడో ఒకసారి ఈ భావానికి వచ్చిన వారే. రాకతప్పదు కూడా. కాకపోతే దానిని అనిశ్చయమైన సందేహంగా విడిచి పెట్టినారు.
జనకుడు ఒకసారి తానొక బీద బ్రాహ్మణుడైనట్లు కలగన్నాడు. మేల్కొన్న తర్వాత తాను నిజంగా చక్రవర్తినా, బీద బ్రాహ్మణుడినా తెలుసుకోవలెనని యత్నించినాడు.
దీన్నిబట్టి ‘‘జాగ్రత్త స్వప్నం కంటె ఎక్కువ సత్యమనుట చాలా అల్పవిషయము.’’ అదే ఈ అధ్యాయం చర్చిస్తుంది.
కారిక-1 : వైతథ్యం సర్వ భావానాం స్వప్న ఆహుర్మనీషిణః ।
అన్తః స్థానాత్తు భావానాం సంవృత త్వేన హేతునా ॥
__భావం: __దేహాంతర్భాగమున ఉండుటచేతను, పరిమితస్థానమునందుండుటచేతను స్వప్న జగత్తులోని సమస్త పదార్థములు మిథ్య అని ధీమంతులు చెప్తున్నారు.
వివరణ: స్వంత అనుభవములమీద వేదాంత సిద్ధాంతములను తమ పేరుతో ప్రకటించడం ఆర్షధర్మ విరుద్ధము. ‘‘నా గురువునకు వారి గురువు చెప్పినట్లు నా గురువు నాకు బోధించెను’’ అని గురవు శిష్యులకు బోధించుటే ఆర్ష సంస్కృతి. గురు శిష్య పరంపరాయుతమైన సిద్ధాంతములనే ఆగమములుగా అంగీకరించడమే ఈ ‘మనీషిణః, ఆహుః’’ తెల్పుతున్నాయి. ధీశాలురు చెప్పుచున్నారు. స్వప్న జగత్తు మిథ్య యని ప్రథమ శ్లోకములోనే ప్రతిపాదించబడిరది.
అంతస్థానాత్ (లోపల ఉండుటవలన): స్వప్నములో వస్తువులన్నీ దేహంలో ఉన్నాయి. కన్నులు మూసుకుని ఉన్నాయి. బాహ్య ప్రపంచజ్ఞానం లేదు. శరీరవిషయ జ్ఞానం లేవు. ఈ తైజసునికి స్వప్నమనే మహాభూతం తన వస్తు ప్రపంచముతో ఎదురైంది. స్వప్నంలో చూచే నదీ వన పర్వతాలు, రథ తురగాదుల మన శరీరంలో లేవుగదా!
సంవృతత్త్వేన హేతునా (పరిమిత ప్రదేశమునందుండుట వలన): స్వప్న జగత్తు మిథ్యయనుటకిది మరొక కారణం. స్వప్నంలో ఉన్నంతసేపు చూచి అనుభవించేవన్నీ నిజమే అనిపిస్తాయి. ఈ దేహము పరిమితమైనది. పరిమితమైనదానిలో అపరిమితమైనవన్నీ ఎలా ఉంటాయి. అది అసంభము. అందువల్ల స్వప్నం మిథ్య.
కారిక-2 : అదీర్ఘ త్వాచ్ఛ కాలస్య గత్వాదేశీన్నపశ్యతి ।
ప్రతిబుద్ధశ్చ వై సర్వ స్తస్మిన్ దేశేన విద్యతే ॥
భావం: స్వప్నకాలము అతి స్వల్పమగుటచే స్వప్నము చూచు వ్యక్తి స్వయంగా ఆయా ప్రదేశాలకు పోయి చూడలేడు. నిద్రలేచిన పిమ్మట స్వప్నంలో చూచిన ప్రవేశంలో ఉండలేడు.
వివరణ: పూర్వపక్షమును తామే శంకించుకొని వాటిని ఖండిస్తూ సిద్ధాంతమును స్థాపించేదే తర్కశాస్త్రం. ఇక్కడ గౌడపాదులు పూర్వపక్షీయుని శంకను ఈ విధంగా ఊహించుకున్నాడు. ‘‘స్వప్న ద్రష్టయగు తైజసుడు ఆ వస్తువులను దూరదేశములలో చూచుచున్నాడు. ఆ దూర ప్రదేశాలలో ఆయా వస్తువులుండడం సంభవమే కదా! కావున ఆయా వస్తువులు దేహమందే యిమిడి ఉండలేవు అనువాదన సరియైనది కాదు. ‘‘దానికి సమాధానంగా ‘‘స్వప్నానుభవంతో స్థూల శరీరానికి పాత్రలేదు. అదంతా సూక్ష్మ శరీరానిదే. స్థూల కదలదు, మెదలదు. ఎంతదూరములో ఎన్ని అనుభవములు పొందినను మేలుకున్నంతనే పడక గదిలో పడకపైనే ఉంటాడు. స్వప్నానుభవాలన్నీ మనస్సులోనే అనుభవించబడుతున్నాయి. కాబట్టి స్వప్నం మిథ్య ఈ విధంగా ప్రదేశం దృష్ట్యా స్వప్నం మిథ్య. అట్లే కాలం దృష్ట్యా కూడా. స్వప్న/జాగ్రత్తలకు మధ్య నడిమి కాలం క్షణమే. అత్యల్పం. అంతసేపటిలోనే అంత దూరం పోయి ఆయా అనుభవాలను పొందడం అసాధ్యం. అందుకే కాలం దృష్ట్యా కూడా స్వప్నం మిథ్యయే. దేశకాలములు సత్యం అన్నప్పుడు స్వప్నం మిథ్యయని నమ్మక తప్పదు.
కారిక-3 : అభావశ్చ రథా దీనాం శ్రూయతే న్యాయపూర్వకం ।
వైతథ్యం తేన వై ప్రాప్తం స్వప్న ఆహుః ప్రకాశితం ॥
భావం: హేతువాదము చేత, తర్కవాదము చేత కూడా స్వప్నంలో చూచే రథాదులకు మిథ్యాత్వమును శృతి ప్రకటిస్తున్నది. కావున శృతియే స్వయంగా స్వప్న జగత్తు మిథ్యయని స్థాపించుచున్నది అని మహర్షులు చెప్పుచున్నారు.
వివరణ: బృహదారణ్యకంలో కూడా స్వప్నంలో చూచేవన్నీ సత్యం కాదు. మిథ్య అని చెప్పబడిరది. ఇది పై వాదానికి మరొక తార్కాణం. పరిపుష్టము. ప్రత్యక్షంగా ఉండేవన్నీ మిథ్యయే. ‘‘బ్రహ్మజ్ఞానావళి’’ లో శ్రీ శంకరాచార్యులు 1) జ్ఞాన ప్రపంచము, 2) జ్ఞేయ ప్రపంచము అని వస్తు ప్రపంచాన్ని రెండుగా విభజించారు.
జ్ఞాత: తెలుసుకొనేవాడు సత్త్వతత్త్వము.
జ్ఞేయము: దానియందారోపించబడినది.
దీన్నిబట్టి స్వప్నం మాత్రమే మిథ్యకాదు జాగ్రత్తునందు కూడా ఆరోపించబడిన సమస్త విషయములు మిథ్యయే. దేహమనోబుద్ధులు కూడా జ్ఞేయములే. అందుకే అవన్నీ మిథ్యే. అన్నదే ఈ సిద్ధాంతం. అవన్నీ పరమాత్మయందు ఆరోపితమైనవే.
కారిక-4 : అంతః స్థానాత్తు భేదానాం తస్మాజ్జాగరితే స్మృతం ।
యథాతత్ర తథా స్వప్నే సంవృతత్వేన భిద్యతే ॥
భావం: జాగ్రదవస్థలోని పదార్థాలు, స్వప్నంలోని పదార్థాలు ఒకటే స్వభావం కల్గియున్నాయి. ఒక్కటే భేదము. స్వప్నములోనివి దేహాంతర్గతములైనందువల్ల పరిమిత ప్రదేశమునందున్నవి.
శాంకర భాష్యము:
ప్రతిజ్ఞ: (స్థిర పరచవలసిన ప్రతిపాదన)జాగ్రదవస్థలో చూడబడే పదార్థములు మిథ్య. కారణం దృశ్యమానములుకావడం.
హేతువు: కారణము. స్వప్నమునందలి వలెనే.
దృష్టాన్త: ఉదాహరణ- స్వప్నములోనివి మిథ్యాత్వము కల్గినవి. అట్లే జాగ్రత్ప్రపంచములోనివి కూడా చూడబడడంవలన అవి కూడా మిథ్యే.
ఉపనయ: (ప్రతిపాదనకు దృష్టాంతమునకు మధ్యగల సంబంధం) జాగ్రదవస్థ యందు కూడా పదార్థముల మిథ్యాత్వము తెలియుచున్నది.
నిగమన: మళ్ళీ చెప్పడం
సారాంశం: జాగ్రత్స్వప్నములు రెండిరటియందు కూడా దృశ్యమానం కావడం. తత్ఫలితముగా మిథ్యాత్వం కూడా సమానమే.
__కారిక-5 : __ స్వప్న జాగరితస్థానే హ్యేకమాహుర్మనీషిణః ।
భేదానాం హి సమత్వేన ప్రసిద్ధేనైవ హేతునా ॥
భావం: జాగ్రత్స్వప్నము లందు గ్రహింపబడు వస్తువులకు గల సామ్యము చేతను జాగ్రత్స్వప్నములు రెండును సమమే యని ధీమంతులు చెప్పుచున్నారు.
వివరణ: జాగ్రత్స్వప్నముల రెండిరటియందును విషయాను భావం జ్ఞాతృజ్ఞేయ సంబంధముపై ఆధారపడి ఉంది. ఈ విషయజగత్తు పరమాత్మయందారోపితమైన దనియు ఆ పరమాత్మ కంటె భిన్నమైన అస్తిత్వము ఈ జగత్తునకు వేరే లేదనియు వేదాంత సిద్ధాంతము. కావున దృశ్యమాన పదార్థములన్నీ మనస్సుయొక్క మాయా కల్పితములే. ఆత్మ ఒక్కటే నిత్య సత్యము.
కారిక-6 : ఆదావన్తేచ యన్నాస్తి వర్తమానే-పి తత్తథా ।
వితథైః సదృశాః సన్తో-వితథా ఇవలక్షితాః ॥
__భావం: __ఆదిలో, అంతంలో కూడా లేనిది మధ్యలోకూడా ఉండకూడదు. (లేనిదే) చూసే పదార్థాలన్నీ మాయా సదృశములే. కాని అవి మనకు యదార్థములవలె భాసించుచున్నవి.
వివరణ: జాగ్రదవస్థలో గ్రహింపబడే పదార్థాలు కూడా మిథ్యే అనడానికి మరొక కారణం ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు గౌడపాదుడు. ఆ ద్యంతములందు లేనిది మధ్యలో కూడా లేనిదే. ఉదాహరణగా రజ్జువునందు సర్పము ఆదియందు లేదు రజ్జ జ్ఞానము కల్గిన తర్వాత లేదు. కావున మధ్య కూడా లేనట్లే కదా! ఆదిలో లేక, సత్యజ్ఞానానంతరము లేక మధ్యలో మాత్రమే ఉన్నట్లు తోస్తే అది భ్రమ మాత్రమే.
జాగ్రదవస్థయందలి పదార్థములు కూడా అట్టిదే. పరమాత్మ సత్య జ్ఞానానుభవాన్ని పొందిన వానికి ఈ సిద్ధాంత దృష్ట్యా జాగ్రత్ప్రపంచము లేనిదే అగుచున్నది. కావున గౌడపాదుడు జాగ్రత్ప్రపంచములోని వస్తువులు కూడా మిథ్య అని దీర్ఘ స్వప్నదృశ్యములని ప్రకటించుచున్నాడు.
కారిక-7 : సప్రయోజనతా తేషాం స్వప్నే విప్రతిపద్యతే
తస్మాదాద్యన్తవత్త్వేన మిథ్యైవ ఖలుతేస్మతాః ॥
భావం: జాగ్రత్ప్రపంచంలోని పదార్థములు స్వప్నంలో ఏ విధంగా కూడా మనకు ఉపయోగపడడంలేదు. కావున ఈ రెండు జాగ్రత్స్వప్నములకు ఆద్యంతములు ఉండుటవల్ల అవి రెండు కేవలం మిథ్యామాత్రములే.
వివరణ: ‘జగత్తు సత్యం’ అదే పూర్వపక్షి ఆక్షేపణకు గౌడపాదుని సమాధానం ఇది. పూర్వ పక్షి వాదన ఇది. ‘‘జాగ్రత్తులోని వ్యవహారము అంతా ప్రయోజనకరంగా ఉంది. అన్నంతింటే ఆకలి తీరుతుంది. పానీయం దప్పిక తీరుస్తుంది. వాహనములు ప్రయాణ గమ్యం చేరుస్తుంది. స్వప్నములోని అట్టివి కాదు. కావున స్వప్నముతో పోల్చినప్పుడు జాగ్రదవస్థ సత్యమే’’ దానికి సమాధానంగా గౌడపాదుడు స్వప్నము నందలి ఆహారము జాగ్రత్తులో నిరుపయోగం కదా అట్లే జాగ్రత్త యందలి ఆహారములు స్వప్నంలో నిష్ప్రయోజనాలు. సుష్ఠుగా తిని నిద్రించువానికి కలలో ఆకలి వేస్తుంది కదా! జాగ్రత్తలో సంతృప్తి నిచ్చిన ఆహారం స్వప్నంలో పనికి రావడం లేదు. దీనివల్ల ‘‘ఆద్యంతములు కల్గిన జ్ఞేయవస్తువులన్నీ మిథ్యయే’’ అని తేలుతుంది. స్వప్నములోనివి జాగ్రత్తలో జాగ్రత్తలోనివి స్వప్నంలో మిథ్యగా మారుతున్నాయి. ఈ విధంగా జాగ్రత్స్వప్నములు రెండూ మిథ్యే అని నిరూపితమైంది. ‘‘స్వప్నము కున్నంత సత్యత్వమే జాగ్రత్తకు కూడా ఉంది’’ అని పిండితార్థము.
కారిక-8 : అపూర్వం స్థాని ధర్మోహి యథాస్వర్గ నివాసినాం ।
తానయం ప్రేక్షతే గత్వా యథై వేహ సుశిక్షితః ॥
భావం: జాగ్రదవస్థలో చూడని స్వర్గవాసుల రూపముల వంటి అపూర్వ పదార్థములను స్వప్నమందు చూస్తే అవి ఆయా స్థాన ధర్మములని తెలియవలెను. ఇంతకు పూర్వమే వాటిని గురించి బాగా తెలిసి వానివలె ఆయా ప్రదేశాలకు వెళ్ళి ఆయా విషయాలను సుపరిచతములవలె చూస్తున్నాడు స్వప్న ద్రష్ట.
వివరణ: ప్రతివాది. వేదాంతులు చెప్పిన ఉదాహరణ సరికాదు. కారణం వేదాంతం స్వప్నం వలె జాగ్రదవస్థకూడా మిథ్యయని సమర్థించుచున్నది. స్వప్నాన్ని సంపూర్ణంగా జాగ్రత్తతో పోల్చుట సరిగాదు. ఆకాశంలో ఎగరడం, నాలుగు తొండములు గల ఏనుగును చూడటం వంటి అసంభవమైన దృశ్యాలను స్వప్నంలో చూసినట్లు ఇతురలవల్ల వింటున్నాం. ఇవి జాగ్రత్తలో అసాధ్యం కావడం జాగ్రత్త క్రమమై, ప్రకృతిబద్ధమై ఉన్నది. కావున జాగ్రదవస్థను స్వప్నముతో పోల్చరాదు.
గౌడపాదుని ఖండన: స్వప్నంలోని విచిత్ర దృశ్యములు ఆ స్వప్నాన్ని చూస్తున్న తైజసుని మనస్సులోని విలక్షణ భావములవలన కల్గుచున్నవి. స్థూల శరీరాభిమానాన్ని విడిచి సూక్ష్మ శరీరాభిమానియై మనోమయ విజ్ఞాన మయ కోశములలో నైక్యము పొందువాడు తైజసుడు. ఈ స్థితిలో వాని బుద్ధి 3/4 వంతు అచేతనావస్థలో ఉండి నిద్రలో జడంగా ఉంటుంది. అత్యల్పమైన వివేక శక్తి కల్గి మనస్సు కట్టు తెగిన కుక్కవలె స్వైరవిహారం చేస్తుంది. మనోభావాలు తమను క్రమపద్ధతిలో ఉంచే బుద్ధిగాని, వివేకముగాని లేకుండా ఉండడంవల్లనే జాగ్రత్తలో అసాధ్యమైన విలక్షణమైన దృశ్యములు స్వప్నంలో సాక్షాత్కారమిస్తున్నాయి. ఈ విలక్షణత స్వర్గవాసులకు ఉదాహరణ. ఇంద్రుని వేయి కన్నులు, బ్రహ్మ నాల్గుముఖములు, విష్ణువు నాల్గు చేతులు శివుని మూడు కన్నులు వంటివి వర్ణింపబడినాయి. విశ్వుడు తైజసునితో తాదాత్మ్యము నొందినప్పుడు (స్థూలము అణగి సూక్ష్మములో కలిసినప్పుడే) ఈ విలక్షణ స్వప్నానుభవములు సాధ్యము.
‘‘దూర దేశమునకు పోయి అచటి వింతగొలుపు విలక్షణాచార వ్యవహారాలను అనుభవించువాని వలెనే జీవుడు జాగ్రత్స్వప్న సుషుప్తులలో సంచరిస్తూ తత్తద్విషయానుభవాలను పొందుతున్నాడు’’ అని పిండితార్థము. దీనితో పూర్వ పక్షీయుని వాదము పరాభూతమైనది.
కారిక-9 : స్వప్న వృత్తావపి త్వన్తశ్చేతసా కల్పితం త్వసత్ ।
బహిశ్చేతో గృహీతం సద్ దృష్టం వైతథ్య మే తయో ॥
కారిక-10: జాగద్వృత్తావపిత్వన్తశ్చేత సా కల్పితం త్వసత్ ।
బహిశ్చేతో గృహీతం సద్యుక్తం వైతథ్యే మే తయోః ॥
భావం: స్వప్నంలో కూడా స్వప్నమును చూచేవాడు తాను మనస్సులో భావించిన దాన్ని అసత్యంగా, స్వప్నజగత్తునే సత్యంగా తలచును. నిజానికి ఈ రెండూ స్వప్న జగత్తునకు సంబంధించినవే కావడం వల్ల మిథ్యగా మారుతున్నాయి.
అట్లే జాగ్రదవస్థ యందు కూడా తాను భావించినదాన్ని అసత్యంగా, ఎదురుగా చూచేదానినే సత్యంగా భావిస్తున్నాడు. ఈ రెండూ కూడా వివేచిస్తే మిథ్యే అని తేలుతుంది.
వివరణ: జీవితంలో రెండు విభాగాలైన 1) భావప్రపంచం 2) వస్తు ప్రపంచం గురించి ఈ రెండు శ్లోకాలలో కారికాకారుడు వివరిస్తున్నాడు. స్వప్నంలో తైజసుడు భావ ప్రపంచంలో మునిగి పోతున్నాడు. స్వప్నంలో కన్పించే దాన్ని సత్యమని, భావించిన దాన్ని మిథ్యయని అనుకుంటున్నాడు. ‘‘అసత్ అంటే మిథ్యయని భావం’’ లడ్డూలను గురించిన భావనే నిజంగా వాస్తవ ప్రపంచంలో కనిపిస్తుంది. దీన్ని బట్టి స్వప్నంలో చూచే వస్తు భావ ప్రపంచాలు రెండూ మిథ్యే అని తేలుతుంది. అట్లే జాగ్రదవస్థలో కూడా ఇంద్రియ గ్రాహ్యమైన వస్తు ప్రపంచం, దానికి విలువనిచ్చే మనోబుద్ధి గ్రాహ్యమైన భావ ప్రపంచం రెండూ ఉన్నాయి. మన ఊహలన్నీ మనోవాసనలే. అందుకే వాటితో పోల్చినప్పుడు ఇంద్రియగ్రాహ్యమైన బాహ్య ప్రపంచం అధిక సత్యమైనదిగా కన్పిస్తుంది.
‘‘స్వప్నంలోని వస్తు భావ ప్రపంచములు మిథ్యయైనపుడు జాగ్రత్తలోని వస్తు భావ ప్రపంచములు రెండూ కూడా మిథ్యే.’’
కారిక-11: ఉభయో రపి వైతథ్యం భేదానాం స్థానయోర్యది ।
క ఏతాన్ బుధ్యతే భేదాన్ కోవైతేషాం వికల్పకః ॥
భావం: జాగ్రత్స్వప్నముల రెండిరటిలో ఉన్న విషయ ప్రపంచమంతా మిథ్యే ఐతే దాన్ని తెలుసుకునేవాడు అట్టిదాన్ని ఊహించి వికల్పం చేసే వాడు ఎవరు?
వివరణ: సర్వము మిథ్యే అయినప్పుడు అది మిథ్యయని తెలిసినవాడు ఒకడుండాలి. వాడెవడు? ఇది పై కారికకు ప్రతివాది ప్రశ్న. వేదాంతులు ఒక సత్యతత్త్వాన్ని వివరించనిచో ఆత్మేలేదని చెప్పినట్లవుతుంది. జ్ఞానమునకు జ్ఞాత, స్మృతికి స్మర్త ఉండవలెను. కావున జగన్మిథ్యాత్వమును తెలుసుకునే జ్ఞాత ఎవ్వడు అనునదే ప్రతివాది ఆక్షేపణ.
సారాంశం: సామాన్య వస్తుతత్త్వాన్ని యథార్థంగా గ్రహించే బుద్ధిసామర్థ్యాన్ని సత్యమని అంగీకరించే జగత్సత్యవాదులచే వేదాంతుల మతం ఆక్షేపించబడుతున్నది.
కారిక-12: కల్పయ త్యాత్మో నాత్మా న మాత్మా దేవః స్వమాయయా।
సఏయ బుధ్యతే భేదాని తి వేదాంత నిశ్చయః ॥
భావం: ఆత్మీయ మాయా ప్రభావం చేతనే ఆత్మ ఈ వస్తు ప్రపంచాన్ని కల్పించుతుంది. బాహ్య అభ్యంతర జగత్తులను జీవుడు అనుభవిస్తున్నాడు. మరియు ఆ ఆత్మయే తన్ను తాను తెలుసుకుంటున్నది. ఇది వేదాంతుల నిశ్చయం.
వివరణ: పై ప్రతివాది ఆక్షేపణకు ఈ కారిక సమాధానం. వేదాంతమతం ‘‘శుద్ధ చైతన్యమగు పరమాత్మ తనమాయచే మోహితుడై తనకంటె భిన్నంకాని ప్రపంచాన్ని స్వయంగా కల్పించుకున్నాడు. అంతే కాక తాను సర్వ వ్యాపి అగుటవల్ల జ్ఞాత కూడా తానే అయి ఉన్నాడు’’ అని బోధిస్తుంది. మన స్వప్నానుభావాలను పరిశీలిస్తే ‘తన మాయచే తానే నానారూపాలుగా బయలువెడడం’ అనేది అర్థమైతుంది. ఎందుకంటే తనను తాను మరచిన వెంటనే స్వప్నం ప్రారంభం అవుతుంది. అంటే తైజసుడు తన స్వప్న జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. ఈ విస్మృతి, స్వప్నంలోని వస్తుగ్రహణ శక్తి, తనను తాను భ్రమింపచేసుకొని శక్తి తన నైజములోనివే. ఎక్కడినుండో తెచ్చుకున్నావో, వచ్చినవో కావు. శుద్ధ చైతన్యమగు పరమాత్మయే జ్ఞాత. బాహ్యాభ్యంతరములందెక్కడైనా సరే భ్రమింపచేసే వారు కూడా ఆ పరమాత్మయే. సూర్య చంద్రులు కూడా ఆ పరమాత్మచేతనే ప్రకాశింప చేయబడుతున్నారు. (తస్యభాసాసర్వమిదం విభాతి) ఉదా॥ మనలోని జీవ చైతన్యం వెడలిపోయినపుడు సూర్యచంద్రులు కూడా జడమే అగుచున్నారు. మనలో జీవ తత్త్వము లేనిచో ఆ సూర్యచంద్రాదులు కూడా శూన్యత్వము పొందుచున్నారు.
సారాంశం: ఇంద్రియ గ్రాహ్యమైన బాహ్య వస్తుజగత్తు, మనోబుద్ధి గ్రాహ్యమైన భావాదులను కూడా ఆ చైతన్యమే ప్రకాశింపజేస్తుంది. మనో స్వప్న జగత్తును, మన జాగ్రత్ప్రపంచాన్ని కూడా తత్తదమానములను గ్రహింపజేయునది కూడా మనలోని పరమాత్మ చైతన్యమే.
కారిక-13: వికరోత్య పరాన్ భావానన్తశ్చిత్తే వ్యవస్థితాన్ ।
నియతాంశ్చ బహిశ్చిత్త ఏవం కల్పయతే ప్రభుః ॥
భావం: ప్రభువైన ఆత్మ బాహ్య దృష్టి కల్గినప్పుడు ఇది వరకు తన మనస్సులో వాసనారూపములు లేదా సంస్కార రూపములు లేదా వాంఛా రూపములో ఉన్న బాహ్యాభ్యంతర వస్తు ప్రపంచాన్ని తన మనస్సులో కల్పించుకుంటున్నాడు. మరియు ఆ మనస్సును అంతర్ముఖం చేసినప్పుడు భావ ప్రపంచాన్ని కల్పించుకొనుచున్నాడు.
వివరణ: మాయా సృష్ట ప్రపంచానికి పరమాత్మయే జ్ఞాత ద్రష్ట. కాని ఈ శ్లోకంలో ‘‘పరమాత్మ తన మనస్సును బహిర్ముఖము చేసి’’ అన్న చోట అపార్థమునకు ఆస్కారము కారాదు ఆత్మకు మనస్సేలేదు. మనస్సు ఆత్మయందు ఆరోపించబడినది. మనస్సు బహిర్ముఖమైతే బాహ్య విషయ ప్రపంచాన్ని మనోబుద్ధి నియమితమైనప్పుడు జీవాత్మగానుంటుంది. ఆ జీవాత్మ వాసనలనెడి రంధ్రములనుండి వాటికనుగణంగా రాగద్వేషాదుల నారోపించి ఆయా అనుభవాలను పొందుతుంది. ఇదే జాగ్రదవస్థ. బహిర్ముఖత్వమే ప్రపంచానికి కారణం. కఠోపనిషత్తు ‘‘బహిర్ముఖత్వమే భ్రాంతికి మూలం. అంతర్ముఖత్వమే తన్నివారణా మార్గం’’ అని బోధిస్తుంది. చైతన్యము దేహమనో బుద్ధులతో తాదాత్మ్యమును విడనాడినప్పుడే ఆత్మజ్ఞానము పొందుతుంది అన్నదే సారాంశము.
కారిక-14: చిత్త కాలాహియే-న్తస్తు ద్వయాకాలాశ్చయే బహిః ।
కల్పితా ఏవతే సర్వే విశేషోనాన్య హేతుకః ॥
భావం: భావ ప్రపంచంలో మనం గ్రహించే వస్తువులు రెండు కాలాలకు సంబంధించినవిగా ఉన్నాయి. భావవస్తు ప్రపంచాలకు ఇంతకంటె స్పష్టమైన భేదం లేదు. కాని ఈ రెండు కూడా నిజానికి కల్పనా మాత్రములే.
వివరణ: ప్రతివాది ‘‘స్వప్నంకన్నా జాగ్రత్త సత్యతరమని వాదిస్తున్నాడు. మనస్సులో ఒక భావమున్నంతవరకే స్వప్నం సంభవిస్తుంది. కావున ఇది ఏకకాలగతము. కాని జాగ్రత్ నందలి విషయములు భావమున్నను లేకున్నను వస్తువు అక్కడ ఉండడం వల్ల జాగ్రదవస్థ ద్వికాలగతమని’’ వాదిస్తున్నాడు. దానికీ కారిక ఖండనము. జాగ్రదవస్థలో రెండు కాలాలున్నా కేవలం మనోభావనలు మాత్రమే. వేరు కాదు. కావున స్వప్నం వలెనే జాగ్రత్ కూడా భావనా కల్పితమే. కావున జాగ్రత్స్వప్నములకు భేదమున్నదని చెప్పరాదని నిష్కర్ష.
కారిక-15: అవ్యక్తా ఏవ యే-న్తస్తు స్ఫుటా ఏవ చ యే బహిః ।
కల్పితా ఏవతే సర్వే విశేష స్త్విన్ద్రియాన్తరే ॥
భావం: మనోభావాలు అవ్యక్తమైన మనస్సునందే ఉంటాయి. అవి వ్యక్తమై స్ఫుటముగా ప్రత్యక్ష విషయాలుగా తోస్తాయి. కాని ఈ రెండూమనోభావాలే కాని బాహ్యమునందలి వస్తువులు ఇంద్రియములచే ప్రత్యేకముగా గ్రహింపబడినట్లు తోస్తుంది. ఈ ఇంద్రియములే ఈ భావవస్తు ప్రపంచములమధ్య నుండే భేదము. ఈ రెండూ ప్రపంచాలూ భావనా కల్పితాలే.
వివరణ: స్వప్నంలో వస్తువులు అస్ఫుటంగా, మసక మసకగా తోస్తాయి. కారణం అక్కడ బుద్ధిలోపించడంవల్ల వివేకం ఉండదు. కాని జాగ్రదవస్థలో ఇంద్రియముల ద్వారా చూడడం వల్ల స్పష్టత ఉంది. జాగ్రత్తలో ఇంద్రియములు బుద్ధిద్వారా నడుపబడుతున్నాయి. కాని సత్యానికి అవిరెండూ కల్పితములే. అంటే మిథ్యే.
కారిక-16: జీవం కల్పయతే పూర్వం తతో భావాన్ పృథగ్విధాన్ ।
బాహ్యానాధ్యాత్మికాంశ్చైవ యధావిద్యస్తథాస్మృతిః ॥
భావం: మొట్టమొదట జీవుడు ఉద్భవిస్తున్నాడు. దాని తర్వాత అనేక భావాలు కల్పించబడినాయి. ఆ భావాలు 1) బాహ్యము 2) ఆధ్యాత్మికము. అని రెండు విధాలు. జ్ఞానమునుబట్టి స్మృతికల్గుతుంది (యద్భావం తద్భవతి)
వివరణ: పరమాత్మ మనో ప్రతిబింబితమైనప్పుడు జీవుడగుచున్నాడు. ఇతడే కర్తా మరియు భోక్త. ఇతడే బుద్ధుడు, ముక్తుడు, సాధకుడు, సిద్ధుడు కూడా. ఈ జీవాత్మ భావన ఆత్మయందారోపించబడిరది. ఈ భ్రమ అనేక భ్రమలకు కారణము. ఈ భ్రాంత జీవుడు స్వయం సృష్ట ప్రపంచాన్ని క్రమబద్ధముగా, విభిన్నమైనదిగా, నామరూపాత్మకమైనదిగా ఇంద్రియ, మనస్సులద్వారా తెలిసికొని, దాన్నట్లే చూస్తున్నాడు.
‘యథావిద్యః తథా స్మృతిః’- జ్ఞానమెట్లున్నదో స్మృతియు అట్లే ఉన్నది. అంతవరకు తెలియని దాన్ని గురించి తెలుసుకున్నప్పుడు, దాని తర్వాత అదియే స్మృతిగా మారుతుంది. ఈ విధంగా మనస్మృతులు పూర్వజ్ఞానముచే నియమింప బడుతున్నాయి.
కారిక-17: అనిశ్చితా యథా రజ్జు రన్ధకారా వికల్పితా ।
సర్పధారాదిభిర్భావైః స్తద్వదాత్మా వికల్పితః ॥
భావం: మసక చీకటిలో అజ్ఞానముచే రజ్జువును చూచి సర్పమని గాని, నీటి చార అనిగాని ఎలా భ్రమిస్తాయో అట్లే ఆత్మకూడా అజ్ఞానముచే అనేక విధములుగా వికల్పితమగుచున్నది.
వివరణ: రజ్జువులో సర్ప ఆకారగుణాలు మనస్సులోని భ్రమ కల్పితములే. అవి సత్యమైన రజ్జువునందు ఆరోపించబడినవి. రజ్జువు యొక్క సత్యజ్ఞానము లేకపోవుటచేతనే ఈ భ్రాంతి. అదే విధంగా ఆత్మను ప్రాణముగా, బుద్ధి మనస్సుగ, ఇంద్రియములుగా, స్థూలదేహంగా ఎన్నో విధాలుగా భావిస్తున్నాం. అట్టి దట్టమైన అజ్ఞానాంధకారములో ఆత్మపై మన సుఖదుఃఖాలు, జ్ఞానాజ్ఞానాలు, జయాప జయాలు, ఆశానిరాశలు మొదలగువానిని ఆరోపిస్తున్నాము. వాస్తవానికి ఆత్మకీగుణాలు లేవు. అన్నీ ఆరోపితాలే. జననమరణాలను ఆరోపితమైన మనస్సువే. ఆత్మవికావు. రజ్జువును చూచి సర్పమని భ్రాంతి చెందినప్పుడు ఆరోపిత గుణాకారాలన్నీ సర్ప సంబంధులే కాని రజ్జువునందు అవి లేవు. రజ్జువులోని ఏ భాగముగూడా అట్టి వికారము పొందలేదు.
కారిక-18: నిశ్చితాయాం యథా రజ్జ్వాం వికల్పోవినివర్తతే ।
రజ్జురేవేతి చాద్వైతం తద్వదాత్మ వినిశ్చయః ॥
భావం: సత్యమైన రజ్జువు యొక్క నిశ్చయజ్ఞానము కల్గగానే మిగిలిన భ్రమలన్నీ తొలగిపోయి, స్థిరమైనది, అద్వయ మైనదైన రజ్జు జ్ఞానము మాత్రమే మిగులు చున్నది. అట్లే ఆత్మ జ్ఞానము కలిగినప్పుడు ఈ మాయా కల్పిత జగత్తు అంతా నశించి శుద్ధ జ్ఞానరూపమైన ఆత్మయే మిగులుతుంది.
వివరణ: రజ్జువునందు సర్పభ్రాంతి సత్యమైన రజ్జు జ్ఞానము లేనంత వరకే ఉంటుంది. మనలోని అజ్ఞానానికి కారణము వివరించి ఆలోచించి, దాని వెనుకనున్న సత్యమైన రజ్జువును మనం కనుక్కొన్న వెంటనే అందలి ఆరోపణ గుణాలన్నీ ఒక్కసారిగా మాయమైతున్నాయి.
అదే విధంగా ఆ ఆత్మజ్ఞానము కల్గినంతనే మంత్రదండము స్పృశించినదో అన్నట్లు అందలి ఆరోపములన్నీ అంతరించి మాయమైతున్నాయి. వివేకముతో విశ్లేషించి, విషయములనుండి దృష్టిని మరల్చి దేహమనోబుద్ధులను దాటి అంతర్ముఖుడైనప్పుడు జ్ఞానము స్వయంప్రకాశమగుచున్నది. జీవజ్యోతియగు ఆత్మ తత్త్వము సమస్త జీవాత్మ భావములకు ఆధారమై మనయందే ఉందని తెలియగానే భ్రమజనిత జగత్తు మాయ మగును.
కారిక-19: ప్రాణాది భిరనన్తైశ్చ భావైరేతైద్వికల్పితః ।
మాయైషా తస్య దేవస్య మాయా సంమోహితః స్వయం ॥
భావం: తన మాయచేత తానే సమ్మోహితమైనదో యనునట్లు స్వయం ప్రకాశమైన ఆత్మ అజ్ఞానముచేత ఆవృతము కాగానే మనకు ప్రాణాదులే ఆత్మయని తోచుచున్నది.
వివరణ: అద్వైతులు తప్ప మిగిలిన అన్ని వేదాంతమతముల వారు జగత్తును సత్యమనే భావిస్తారు. దానికి కారణం వారు సృష్టి ఎట్లు జరిగింది? ఎందుకు జరిగింది? ఎక్కడినుండి జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానాలుగా తమ సిద్ధాంతములను వివరించుకున్నారు. వేదాంత గ్రంథములన్నీ సృష్టి సిద్ధాంతాలు, తద్దర్శనాలు ఆత్మజ్ఞానము పెంపొందించు పద్ధతులలో నిండి ఉన్నాయి. గౌడపాదుడు వాటన్నిటినీ ప్రస్తావించి, వాటిని ఖండిరచి నిరాకరిస్తున్నాడు.
ద్వైతము: 1) పరబ్రహ్మ ప్రాణము పురుషుడు ఇత్యాది నానారూపములను ధరించింది.
2) ఆత్మలోని చైతన్యశక్తిగా చెప్పబడే ప్రాణము ఈ ప్రపంచాన్ని సృష్టించింది.
ఉపనిషత్తులలోని సృష్టి సిద్ధాంతాలు:
- పంచభూతాలు సృష్టికి మూలం
- మూడు భూతములే సృష్టికి మూలం
- బ్రహ్మయందొక స్పందన కల్గింది. అదే సృష్టిగా పరిణమించింది.
- సృష్టి హఠాత్సంభవము
- ప్రారంభ దశలో సాధకునకు ఇవన్నీ అవసరమే.
వానికి జగత్తు సర్వదా సత్యమే. ఈ విధంగా సృష్టి కారణాలను తెల్పి చివరికి పరబ్రహ్మ తత్త్వానికి ఉపనిషత్తులు చేరుస్తాయి. ఆ దృష్టితో చూచినప్పుడు నానత్వ విశిష్ట ప్రపంచమంతా మాయా మాత్రమే.