కారిక-14: స్వప్న నిద్రాయుతావాదౌ ప్రాజ్ఞస్త్య స్వప్న నిద్రయా ।
ననిద్రాంనైవ చ స్వప్నం తుర్యే పశ్యంతి నిశ్చితాః ॥
భావం: విశ్వతైజసులు నిద్రా స్వప్నంతో కూడినవారు. ప్రాజ్ఞుడు స్వప్న రహిత నిద్రతో కూడినవాడు. బ్రహ్మానుభవం పొందిన జ్ఞానులు తురీయంలో నిద్రనుగాని స్వప్నాన్ని గాని అనుభవించరు.
వివరణ: తురీయావస్థ మనం నిత్య జీవితములో అనుభవించే జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలకు అతీతమైనది. అందుకే అది మన అనుభవానికి అందనిది. ఇది కేవలం బుద్ధి బలంచేత ఊహింపబడినది కాదు. పలువురు ఋషులు, జ్ఞానులు, అనుభవించి తెలుసుకున్న తత్త్వము.
కారిక-15: అన్యథా గృహ్ణతః స్వప్నో నిద్రా తత్త్వమజానతః ।
విపర్యాసే తయోః క్షీణే తురీయం పదమశ్నుతే ॥
భావం: స్వప్నము తత్త్వమును (మరొక రకంగా) గ్రహిస్తుంది సుషుప్తి తత్త్వమును తెలుసుకోలేదు. పై రెండు (అన్యథా గ్రహణ, అగ్రహణ) నశించినప్పుడే తురీయం తెలుసుకోబడుతుంది.
వివరణ: ఇక్కడ జాగ్రదవస్థను పేర్కొనలేదు. తాత్త్వికంగా జాగ్రత్త, స్వప్నం రెండూ ఒకటే. ఈ రెంటిలో మిథ్యాజ్ఞానం సమానమే. తాడును పాముగా లేదా కట్టెపుల్లగా భావించడం అన్యథా గ్రహణమే.
తురీయం ఈ మూడిరటికి అతీతం. నిద్ర అంటే తత్త్వము యొక్క అజ్ఞానమే. ఇదే అన్యథా గ్రహణానికి కారణము. అజ్ఞానం వలన కార్యరూపంగా జాగ్రత్స్వప్నాలు కల్గుతున్నాయి. అవిద్య నశించిన వెంటనే దాని కార్య రూపమైన దృశ్య ప్రపంచమంతా లేకుండా పోతుంది.
కారిక-16: అనాది మాయయా సుప్తో యదా జీవః ప్రబుధ్యతే ।
అజమనిద్ర మస్వప్న మద్వైతం బుధ్వతే తథా ॥
భావం: అనాదియైన మాయ చేత సుప్తమైన జీవుడు జాగృతుడు కాగానే యాతడు తనను అజునిగా, నిద్రాస్వప్నములు లేనివానిగా అద్వైతునిగా తెలిసికొనుచున్నాడు.
వివరణ: వేదాంత సాధన, ధ్యానాదులచేత దివ్య చైతన్యానుభవం పొందినప్పుడు తాను అజునిగా, (పుట్టుకలేనివానిగా) అంటే శాశ్వతముగా, అనిద్రమ్ అంటే అజ్ఞానము పోగొట్టుకొని తత్త్వానుభవం పొందినవానిగా, అస్వప్నం అంటే అన్యథా జ్ఞానం లేనివానిగా, అద్వైతం ఏకవస్తువుగా ‘సర్వంఖల్విదం బ్రహ్మా’ వాక్యాన్ని అనుభవించేవానిగా తన్నుతాను తెలుసుకుంటున్నాడు.
అహంకారరూపజీవుడు సంపూర్ణంగా శాశ్వతంగా నశించినప్పుడు సంసారం, దానివలన కలిగే భ్రమాత్మకమైన భిన్న భావం నశిస్తుంది.
కారిక-17: ప్రపంచోయది వర్తేత నివర్తేత నసంశయః ।
మాయామాత్రమిదం ద్వైతమద్వైతం పరమార్థతః ॥
భావం: ప్రపంచమే నిజమైతే అది నశించే ఉంటుంది. ఈ ద్వైతబుద్ధి మయా ప్రభావమే అద్వైతమే పరమార్థం.
__వివరణ: __నానాత్వవిశిష్ట ప్రపంచము అదృశ్యమైన వెంటనే మిగిలేది అద్వైతమే. సాధకునికి గల్గే సందేహం ఈ శ్లోకంలో నివర్తించబడుతుంది. రజ్జుసర్పభ్రాంతి ఉదాహరణ ఇదే బోధిస్తుంది. రజ్జువని తెలిసి నంతనే సర్ప భ్రాంతి తొలగినట్లే, భ్రాంతమైన ప్రపంచంలో వ్యవహరిస్తున్నా, ఆత్మ తత్త్వం తెల్సినంతనే ఇది భ్రమగా తెలుస్తుంది. పై శ్లోక మొదటిసగంలో ‘‘ప్రపంచంలేదు. ఉంటే నశించేది. నశించలేదు. కాబట్టి అది లేనిదే అగుచున్నది’’ అనే తర్కం వివరించబడిరది.
__కారిక-18: __వికల్పో వినివర్తేత కల్పితో యది కేనచిత్ ।
ఉపదేశాదయం వాదో జ్ఞాతే ద్వైతం న విద్యతే ॥
భావం: ఎవరైనా ఇటువంటి భావాలను తలచినప్పుడు ఈ వికల్పములు కూడా నివృత్తి అగును. కాని ఈ వాదము కేవలము ఉపదేశము కొరకు మాత్రమే. తత్త్వం తెలిసిన వెంటనే ఈ ద్వైతబుద్ధి ఉండదు.
వివరణ: పూర్వ పక్షీయుడు ప్రశ్నించే ‘‘గురువు, శిష్యుడు శాస్త్రములబోధ వంటివన్నీ మిథ్యగా లేదా భ్రమగా తీర్మానించవలెను’’ అనే దానికి సమాధానమే ఈ శ్లోకం ఆత్మ బోధ కలిగిన వెంటనే పై వన్నీ భ్రమే. మిథ్యే. గురువులేడు. శాస్త్రంలేదు. శిష్యుడు లేడు. పూర్ణ తత్త్వానుభవం వరకే ఇవన్నీ ఉపయోగపడును. ఆత్మయందు ఇవన్నీ ఉండవు. అవి నిర్విషయము పిండితార్థమేమనగా ‘‘పరమాత్మను తెలిసికొను నప్పుడే ప్రపంచం లయమగుచున్నది.
__మంత్రం- 8: __సోయమాత్మా-ధ్యక్షర మోం కారో-ధి మాత్రం పాదా మాత్రా మాత్రాశ్చ పాదా అకార ఉకారో మకార ఇతి.
భావం: ఆత్మయే అక్షరముల దృష్ట్యా ఓంకారంగా మారును. ఆ ఓంకారము దాని మాత్రల ద్వారా ధ్వనుల ద్వారా పాదాలుగా విభజింపబడిరది. ఆ పాదాలే మాత్రలు. ఆ మాత్రలే పాదాలు. అందలి అక్షరములు - అ-ఉ-మ.
వివరణ: ఈ మంత్రంలో ఓం లోని అక్షరములు - వాటి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాత్రలే పాదాలు పాదాలే మాత్రలు అని దృఢపరుస్తున్నది. ఓంలోని మూడక్షరములు చైతన్యముయొక్క మూడవస్థలైన జాగ్రత్స్వప్న సుషుప్తులు.
మంత్రం- 9: జాగరిత స్థానో వైశ్వానరో-కారః ప్రథమా మాత్రా--ప్తేరాది మత్వాద్వా-- ప్నోతి హవై సర్వాన్ కామానాదిశ్చ భవతి య ఏవం వేద.
భావం: విశ్వుడు ఓంకారంలోని - ‘అ’ ప్రథమాక్షరం. ఈ రెండూ ఆద్యములు. సర్వ వ్యాపకములు. ఈ రెంటిని తెలుసుకున్న వాడు సర్వ కామాలను పొందు తున్నాడు. వాడే అందరిలో ఫ్రథముడైనాడు.
వివరణ: జాగ్రదవస్థాభిమానియైన వైశ్వానరుడే ‘అ’ ధ్వనిపై ఆరోపించబడుతున్నది. ఇది ధ్యానసౌలభ్యం కోసమే. విగ్రహారాధనామూల సిద్ధాంతమైన ‘ఒక విషయం పై ఒక భావాన్ని ఆరోపించడం’ దీనితో మొదలైంది. ఒక రాతిని శివునిగా భావించినప్పుడు దానిని చూసినవారికి దివ్యత్వ భావన కల్గుతుంది.
నిర్గుణ బ్రహ్మ సాధకునకు కూడా ఆరంభంలో ధ్యానానికి ఒక ఆధారం అవసరము. అందుకే ఓంకారాన్ని ధ్యానించే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. ఓంకారం ధ్వని. దాని మూర్తిమత్వం లేదూ దానిని ధ్యానించడం చాలాకష్టం. దానికోసమే ఈ మంత్రం వివరిస్తుంది. ‘అ’కారం విశ్వుడు. ఇవి రెండూ సర్వ వ్యాపితాలు. అన్నిటకీ ఆద్యాలు. ఈ రెండిరటిలో సమాన ధర్మాలు ఇవి. ఎందుకంటే సర్వ ధ్వనులకు మూలము ‘అ’. నోరు విప్పి కొంత గాలిని పైకి వదిలినంతనే ‘అ’ ధ్వనింపబడుతుంది. అది సర్వ జీవులలో సాధ్యము. అందుకే జాగ్రదవస్థ అన్ని అవస్థలలో ఆద్యమగుటచే ‘అ’తో ఆరోపించబడిరది. ‘అ’ లో సర్వధ్వనులు వ్యాప్తమై ఉన్నాయి. అందుకే అది సర్వవ్యాపి. అట్లే జాగ్రదవస్థ కూడా. ఈ రెంటికీ ఐక్యం తెలిసి, అనుభవం పొందినవాడు అగ్రగణ్యుడు. ప్రణవోపాసకుడు ఇతరులకన్నా నిత్య జీవితంలో అన్ని రంగాలలో ఉత్తమునిగా గణుతికెక్కునను మాటలో సందేహం లేదు.
మంత్రం-10: స్వప్నస్థాన స్తైజస ఉకారో ద్వితీయ మాత్రోత్కర్షా దుభయత్వాదోత్కర్ష తిహవై జ్ఞాన సంతతిం సమానశ్చ భవతి నాస్యా బ్రహ్మ విత్కులే భవతి య ఏవం వేద॥
భావం: స్వప్నావస్థాభిమాని యగు తైజసుడు ఓంకారంలోని రెండవ అక్షరమైన ‘ఉ’ కారము ఉత్కర్ష , రెండిరటిమధ్యనుండుట అనునవి సామ్యము. దీనిని తెలిసినవాడే ఉత్తమ జ్ఞాని. అతడు గౌరవించబడుతున్నాడు. అతనికులములో బ్రహ్మజ్ఞానులే జన్మిస్తారు.
వివరణ: తైజసుని ‘ఉ’కారము పై ఆరోపించి ధ్యానించవలెను. ‘ఉ’-తైజసుని సమానధర్మములు ఇవి. అకారం తరువాత ‘ఉ’కారం రావడంవల్ల ఇది ఉత్కృష్టం. అట్లే, తైజసుడు సూక్ష్మ శరీరాభిమాని కావడంవల్ల ఉత్తముడు.
జాగ్రదవస్థ కంటె స్వప్నావస్థ సూక్ష్మమైనది. అందుకే అది ఉత్కృష్టమైనది కూడా జాగ్రదవస్థలోని అనుభవములను మనసులో భద్రపరుస్తాడు విశ్వడు. అవే స్వప్నావస్థలో సూక్ష్మరూపంగా దర్శనమిస్తాయి.
రెండవ ధర్మం- ‘ఉ’కారం అ-మ ల మధ్య నుంది. స్వప్నావస్థకూడా జాగ్రత్ సుషుప్తుల మధ్యనుంది. ఇట్టి ‘ఉ’కారంపై తైజసుని ఆరోపించి ధ్యానించే వాని మనోబుద్ధులు పుష్టిచెంది, సమ్యక్ జ్ఞానిగా మార్పు చెందుతాడు.
ఆర్ష సంస్కృతిలో ఇది సామాన్యాంశంగా ఉండేది. ఓంకారోపాసన చేసిన వాని వంశంలో ఆధ్యాత్మిక జ్ఞానశూన్యుడు, సంస్కారహీనుడు పుట్టడని శాస్త్రవచనం. అదీ ఓంకార మహిమ.
మంత్రం-11: సుషుప్తస్థానః ప్రాజ్ఞోమకార స్తృతీయా మాత్రామితే రపీ తేర్వా
మినోతిహవా ఇదం సర్వమపీతిశ్చ భవతి య ఏవం వేదా! ।
భావం: మకార ప్రాజ్ఞుల మధ్య నున్న సమాన ధర్మములైన మితి (అంటే కొలత) నానాత్వ జ్ఞాన నాశములను, తెలుసుకొని ఉపాసించే వానికి నమ్యక్ వివేకం కల్గును. అతనికి దురవగాహనమైన విద్యయే ఉండదు.
__వివరణ: __అకార ఉకారములను ఉచ్చరించునపుడు మకారంలో లీనమగుచున్నవి. ఓంకార ఉచ్చారణలో అకార ఉకారములు మకారంనుండి బయల్వెడుతున్నాయి. సుషుప్తిలో జాగ్రత్స్వప్నావస్థలు లీనమై అద్వితీయ జ్ఞానాన్ని కల్గి ఉంటుంది. అట్టి ఏకాంతావస్థనుండి మళ్ళీ జాగ్రత్స్వప్నాలు పైకుబికి వచ్చి నట్లయి మళ్ళీ నానాత్వ జ్ఞానం పొందుతున్నాం. దీన్ని గ్రహించి ఉపాసించే వానికి లోకంలో అర్థం కానిది ఏదీ ఉండదు. ఎట్టి విషమ పరిస్థితినైనా అతనికి సులభ సాధనంగా పరిణమిస్తుంది.
కారిక-19: విశ్వస్యాత్వ వివక్షాయా మాది సామాన్యముత్కటం।
మాత్రా సంప్రతి పత్తా స్యాదాప్తి సామాన్యమేవ చ ॥
భావం: విశ్వునకు ఓంకారంలోని ‘అ’ కారముతో సామ్యము చెప్పేటప్పుడు అవి రెండూ సర్వవ్యాపి, ఆది అనే సామాన్య గుణాలు కల్గి ఉన్నాయి.
వివరణ: పై ఉపనిష్మన్మంత్రములకు ఈ కారిక సంగ్రహ వివరణ. మంత్రంలో విశ్వఓంకారాలకు సర్వవ్యాపిత్వము లేదా ఆద్యత్వము సామాన్యం అని చెప్పినారు. కాని కారిక కారుడు సర్వవ్యాపిత్వం మరియు ఆద్యత్వం రెండూ సమాన ధర్మాలుగా వివరించినాడు. ఉపనిషత్తులో ‘చ’ అంటే మరియు అనే అర్థం. గౌడపాదుడు ఈ అర్థాన్నే ప్రతిపాదిస్తూ, మంత్ర భావాన్ని దృఢపరుస్తున్నాడు. ఇది కారికాకారుని బాధ్యత. ఉపనిష్మంత్రంలోని ఉదాత్త భావాలను, గంభీర సూచనలను పాఠకులకు స్పష్టపరచటమే కారికకారుని లక్ష్యము.
కారిక-20: తైజసస్యోత్వ విజ్ఞాన ఉత్కర్షో దృశ్యతే స్ఫుటం ।
మాత్రాసంప్రతి పత్తౌ స్యాదుభయత్వం తథా విధం ॥
భావం: తైజసునకు, ఓంకారంలోని ఉకారానికి, 1) ఉత్కర్ష, 2) రెండిరటికి మధ్యనుండుట అనే రెండు సమాన ధర్మాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి.
__వివరణ: __లేదు
కారిక-21: మకార భావే ప్రాజ్ఞస్య మానసామాన్య ముత్కటం ।
మాత్రా సంప్రతి పత్తౌ తుల యసామాన్య మేవ చ ॥
భావం: ప్రాజ్ఞుననకు మకారమునకును సమానధర్మములు ఉన్నాయి. అవి ‘మానము’ (కొలత) మరియు ‘లయమగుట’.
కారిక-22: త్రిషుధామసు యత్తుల్యం సామాన్యంతేతి నిశ్చితః ।
సపూజ్యః సర్వభూతానాం వంద్యశ్చైవ మహామునిః ॥
భావం: జాగ్రత్స్వప్న సుషుప్తులకు, ఓంకారంలోని అకార, ఉకార, మకారములకు మధ్యగల సామ్యమును ఎవడు నిస్సంశయముగా తెలుసుకొనుచున్నాడో వాడే పూజ్యుడు. సర్వ ప్రాణులకు వందనీయుడు.
కారిక-23: అకారో నయతే విశ్వముకారశ్చాపి తైజసం ।
మకారశ్చ పునః ప్రాజ్ఞం నా మాత్రే విద్యతే గతిః ॥
భావం: అకారాన్ని ధ్యానించేవాడు విశ్వుని, ఉకారాన్ని ధ్యానించేవాడు తైజసుని, మకారాన్ని ధ్యానించేవాడు ప్రాజ్ఞుని పొందుచున్నారు. మాత్రారహితమైన నిశ్శబ్దాన్ని ధ్యానించేవాడు దేనినీ పొందడంలేదు.
వివరణ: మూడు మాత్రలు పై (అ, ఉ, మ) ధ్యానించే వాడు పొందు ఫలాన్ని చెప్తున్నాడు. కాని ఓంకారం ఓంకారంల మధ్యనున్న మాత్రా రహితమైన మౌనం (నిశ్శబ్దం)పై ధ్యానం చేసివానికి ప్రాపంచిక ప్రయోజనం ఏదీ కల్గదు. కాని మిక్కుటమైన ఆధ్యాత్మిక ప్రయోజనం కల్గుతుంది. అదియే పరమాత్మ అనుగ్రహము.
మంత్రం-12: అమాత్రశ్చతుర్థో-వ్యవహార్యః ప్రపంచోపశమః శివోద్వైత ఏవమోంకార ఆత్మైవ సంవిశత్వాత్మనాత్మానం యఏవం వేద.
భావం: మాత్రా రహితమై, అవ్యవహార్యమై, ప్రపంచోపశమం కల్గి శివమై అద్వైతమైన ఓంకారమే చతుర్థం. అదియే ఆత్మ. దీనిని తెలిసికొన్నవాడు పరమాత్మలో లీనమగుచున్నాడు. అద్వైత సిద్ధి అదే.
వివరణ: రెండు ఓంకారముల మధ్య నున్న మౌనము తురీయం ‘నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే’ అనేది దీనినే కాని దీనిని గమనించడమే దుర్లభం దుష్కరం. దానిపై ధ్యానం చేసేవానికే అద్వైత సిద్ధి. మనం తెలియకున్నా ఆ నిశ్శబ్దం అక్కడే ఉంటుంది. ఇంతవరకు వివరించబడిన ధ్యానమార్గము ఓంకారంలోని త్రిమాత్రలు వాటిపై ఆరోపించబడిన విశ్వ తైజస ప్రాజ్ఞులు యొక్క ధ్యానము. రాబోయే మంత్రం మాత్రాతీతమైన తురీయమైన ఓంకారాన్ని ఆత్మ ప్రతీకగా తెలుపుతూ - అదే నిజమైన ధ్యేయంగా వివరిస్తుంది.
‘తస్యవాచకః ప్రణవః’ అన్న యోగ సూత్ర సారమిదే.
మాత్రా రహితమైన ఓంకారం అంటే రెండు ఓంకారాల మధ్యనుండే నిశ్శబ్దం అది అగ్రాహ్యము. మనస్సు, ఇంద్రియాలు నిశ్శబ్దమునుండి దేన్నీ గ్రహించలేవు. అందుకే అది అగ్రాహ్యం. అందుకే అది అవ్యవహార్యము. మనో ఇంద్రియ వ్యాపారాలు లేనప్పుడు అది తప్పక ఆనందమయ అద్వైతావస్థయే. ఎందుకంటే నానాత్వ విషయములతో కూడిన అశాశ్వత విషయముల ద్వారా ఆనందం పొందాలనే ప్రయత్నం దుఃఖకారణంగా పరిణమిస్తుంది. భయము ఆందోళన, హృదయకంపము, అసంతృప్తి వంటి వాటికి కారణము ద్వైతమే.
కాబట్టి నిశ్శబ్దమైన తురీయావస్థే పొందదగినది. ఇచ్చటనే ప్రపంచం అణిగిపోతున్నది. ఇదియే మంగళకరము. నిశ్శబ్దమైన తురీయాన్ని గ్రహించేందుకు ప్రయత్నించేటప్పుడు మనోబుద్ధులు ఏకాగ్రమై నిశితమై స్థిరమగుచున్నవి. కాలము స్తంభించి, మనసు క్రమంగా పైకి తేలిపోతున్నట్లనుభూతి కల్గును. మన మర్త్యత్వమును, పరిమితత్త్వాన్ని దుఃఖాన్ని, నిస్పృహను అంతమొందించుకొనవలెనన్న ఈ ధ్యాన సాధనే మార్గము. అప్పుడే సర్వజ్ఞత్వము, సర్వ శక్తివంతము, సర్వ సంపూర్ణమైన స్థితి పొందగలము.
ఓం తత్సత్
సూచన: ఇంతటితో మాండూక్యోపనిషత్తు ముగిసింది. ఈ 12 మంత్రాలతో సమస్త శాస్త్ర సారాంశాన్ని నిబిడీకృతం చేసి తత్వోపదేశం చేశాడు ఉపనిషదృషి. ‘‘మాండూక్య మేక మేవ అలం’’ అన్నది అందుకే.
కారిక-24: ఓంకారం పాదశో విద్యాత్ పాదమాత్రా న సంశయః ।
ఓంకారం పాదశోజ్ఞాత్వా న కించిదపి చింతయేత్ ॥
భావం: ఓంకారంలోని ప్రతి పాదాన్ని ప్రత్యేకంగా తెలుసుకోవలెను. అవినిస్సంశయముగా మాత్రలే. ఓంకారాన్ని గురించి ఈ విధంగా తెలిసికొన్న తర్వాత దేన్ని గురించి కూడా ఆలోచించరాదు.
వివరణ: ఓంకారాన్ని నిరంతరాయంగా ఉచ్చరిస్తూ ఉంటే అందులోని మాత్రా ధ్వని తారాస్థాయి నుండి మంత్రస్థాయికి వచ్చి క్రమంగా అంతరించిపోతుంది. అకారం, ఉకారం, మకారం లలో క్రమంగా విశ్వతైజసప్రాజ్ఞులను ఆరోపిస్తూ అవి క్రమంగా ఒకదానిలో ఒకటి లీనమైపోవడాన్ని గమనిస్తూ మాత్రా రహితమైన నిశ్శబ్ద స్థితిలో తాను ఐక్యము కావలెను. ఇది చాలా కఠిన సాధన, నిరంతర ధ్యానంతో కాని సాధ్యంకాదు. ఈ నిశ్శబ్ద స్థితిని చేరిన వానికి ఎట్టి భావతరంగాలు ఉండవు. ఉండరాదు. అంటే ఇతరములైన వాటిని వేటినీ చింతించకుండా చైతన్యంతో కూడిన మనస్సును స్థిరంగా నిశ్చలంగా ఉంచవలెను.
కారిక-25: యుంజీత ప్రణవేచేతః ప్రణవం బ్రహ్మ నిర్భయం ।
ప్రణవేనిత్యయుక్తస్య న భయం విద్యతే క్వచిత్ ॥
భావం: ఆ ప్రణవనాదంలో నీ మనస్సును ముంచివేయవలెను. ఆ ప్రణవ ధ్వనితో నా మనస్సునైక్యం చేయవలెను. నిర్భయమైన ఆ బ్రహ్మయే ఓంకారము. ఓంకారంలో ఐక్యము చెందిన వానికి ఎట్టి భయము ఉండదు.
వివరణ: ఆయా ఆలోచనల పరంపరలు మనస్సును చేరే నిరంతరతను బట్టి మన అనుభవాలు ఏర్పడుతాయి. ఒక ఆలోచన ఒక సెకనులో 20 వేలసార్లు వచ్చి మరియొకటి ఒక సెకనులో 10 వేలసార్లే వస్తే మొదటిదే విస్పష్టంగా ఉంటుంది. మొత్తం జ్ఞానములలో (ప్రాపంచిక) మనలను గురించిన (జీవాత్మ జ్ఞానము) జ్ఞానమంత సంపూర్ణమైనది మరియొకటి లేదు. ఇదే అహంకార రూప జీవజ్ఞానం. ఇది ఎంత తీవ్రంగా ఎంత వేగంగా నిత్యం మనం భావిస్తామో అంతే తీవ్రంగా వేగంగా ఓంకారాన్ని ధ్యానిస్తే ఆ అంగం మాయమై ఓం కారాన్ని పూర్ణముగా అనుభవించి అర్థం చేసుకుంటాం. ‘ఓంకారం మనస్సులో సంధించవలెను’ భావం ఇదే. ఓంకారంలో మనస్సు ఐక్యమైనప్పుడు ఆ ఓం కారమే బ్రహ్మం కనుక మనకు ఆ బ్రహ్మానుభవం కల్గుతుంది.
సూచన: భయము అనే పదాన్ని ఇక్కడ కేవలం భీతి అని మాత్రమే కాకుండా రాగద్వేషములు, ఆశలు, ఆందోళనలు మున్నగు మానసిక అలజడులుగా అర్థం చేసుకోవలెను.
కారిక-26: ప్రణవోహ్య పరం బ్రహ్మ ప్రణవశ్చ పరః స్మృతః ।
అపూర్వోనన్తరోబాహ్యోనపరః ప్రణవో-వ్యయః ॥
భావం: ఓంకారమే పరబ్రహ్మము. మరియు అపర బ్రహ్మము. ప్రణవమే అపూర్వమ అనంతరము అబాహ్యము. అనపరము. అవ్యయము కూడా అగుచున్నది.
వివరణ: 1) అపరబ్రహ్మం: ‘పరబ్రహ్మమే నామరూపాది గుణ (సగుణ బ్రహ్మ) యుక్తుడై ఈ ప్రపంచ రూపములో భాసించు నట్లుండును’’ అనెడి మతము వారు ఈ దృశ్యలోకాన్ని అపరబ్రహ్మముగా వ్యవహరిస్తారు. సంబంధాపేక్ష ద్వారా ఈ జగత్తు సత్వమని చెప్పడం. పరబ్రహ్మమే నామరూపాది గుణయుక్తుడై ఈ ప్రపంచరూపములో భాసిస్తున్నాడని వారి మతము. దీని ప్రకారం ఉపాసకునికి అపరబ్రహ్మమే ఆరాధ్యం. దీనినే సగుణ బ్రహ్మగా తర్వాతి వారు వ్యవహరించినారు.
సనాతన వేదాంతులు: వశిష్ఠగౌడపాదులు దీనిని (సగుణ బ్రహ్మను) అంగీకరించరు. ఈ సృష్టి జరుగలేదని వారి సిద్ధాంతం. (అజాతవాదము) రజ్జుసర్పముల మధ్య ఏరకమైన సంబంధం కూడా వారంగీకరించరు. మిథ్యా సర్పము రజ్జును యొక్క అపరావతారం కాదుకదా!
నవీన వేదాంతులు: శంకరభగవత్పాదుల తదనుచరులు ‘వ్యావహారిక సత్యాన్ని’ అంగీకరించి కొంత సరళీకరించినారు. దృశ్య ప్రపంచముద్వారా సాధకుని సత్త్వతత్త్వములోనికి చేర్చుటయే శంకరాచార్యుల ప్రయత్నం. పై రెండూ పరస్పర పోషకాలే కాని, విరుద్ధాలు కావు. ‘‘గౌడపాదులు ఓంకారాన్ని దృశ్యప్రపంచానికి కూడా ప్రతీకమని వక్కాణిస్తున్నారు.
2) అపూర్వము: ముందు లేనిది అంటే పరబ్రహ్మ నిష్కారణుడు. జాతము లేదా స్పష్టము అయినదానికి కారణం ఉండవలెను కదా! కాని బ్రహ్మము నిష్కారణము, అజము, అమృతము, అవికారము. అందుకే స్పష్ఠ ప్రపంచానికి కారణం కూడా కాదు.
__3) అనపరము: __బ్రహ్మ కారణముగా ఎట్టి కారణం జన్మించలేదని ఈ పదం ప్రతిపాదిస్తుంది. ఈ ప్రపంచమనేదే బ్రహ్మయందు లేదు.
__4) అనంతరం: __దానికంటె మరొకటి వేరుగా లేనిది. పరబ్రహ్మ సర్వవ్యాపి యగుటచే తద్భిన్నమైనది ఏదీ లేదు. అంటే పరబ్రహ్మము యొక్క అద్వైత శాశ్వత తత్త్వము నియమించునది. విజాతీయమైనది మరొకటి లేదు. ఇది ఏకజాతీయమైన అఖండము.
అవ్యయము: పై లక్షణాలన్నీ (నిష్కారణ, నిష్క్రియ, సజాతీయ., విజాతీయ స్వగత భేద రహితమైన ఆత్మ) తప్పక ప్రణవము అవ్యయమనే స్థిరపరచుచున్నవి.
కారిక-27: సర్వస్య ప్రణవో హ్యాదిర్మధ్యమన్త స్తథైవ చ ।
ఏవం హి ప్రణవం జ్ఞాత్వా వ్యశ్నుతే తదనన్తరం ॥
భావం: ఓంకారమే ఆది మధ్య అంతములు అగుచున్నది. అట్లే ఓంకారమును తెలిసికొన్నవాడు వెంటనే ఆ పరమాత్మ తత్త్వమును పొందుచున్నాడు.
వివరణ: రజ్జువును సర్పంగా భ్రమించినప్పుడు దాని సర్వావయవాలు రజ్జువుకంటే భిన్నం కాదు. సర్పము తప్ప ఇతరమైనది కాదు రజ్జువు. సర్పము రజ్జువునుండి కాక వేరొక చోటి నుండి బయలుదేరలేదు. మనం భ్రాంతిలో నున్నంత కాలము మనకా రజ్జువునందే సర్పభ్రాంతి కల్గుచున్నది. రజ్జువు అని తెలియగానే సర్పభ్రాంతి నశిస్తుంది. భ్రాంతమైన సర్పము రజ్జువునందే లీనమై మాయమగుచున్నది. అట్లే బ్రహ్మకు ప్రతీకమైన ఆ ప్రణవమే ఆదిమధ్యాన్తాతీతమైన ఆ పరమాత్మగా ఉంది. అదే ఈ జీవన లీలకు ఆధారం. అదే ఓంకారం. ఇది తెలిసిన వాడు స్వయంగా బ్రహ్మమే అవుతున్నాడు. ‘బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి’
‘‘జ్ఞానమనగా వేదాంతములో ఆత్మ జ్ఞానము’’ అని మాత్రమే వ్యవహరిస్తాము. దీనిని శాస్త్రములద్వారా మాత్రమే, బుద్ధిద్వారా మాత్రమే పొందలేము. నెమ్మదిగా, స్థిరముగా ధ్యానము చేత పవిత్రములైన మనో బుద్ధులను సర్వవ్యాపక శుద్ధ చైతన్యస్థానమునకు లేవనెత్తగల్గి, ఆ జీవితపు విలువలకు అనుగుణంగా జీవించినప్పుడే పరిపూర్ణత పొందగలడు.
కారిక-28: ప్రణవం హీశ్వరం విద్యాత్ సర్వస్య హృదిసంస్థితం ।
సర్వవ్యాపినమోంకారం మత్వా ధరో నశోచతి ॥
భావం: సమస్త ప్రాణులయొక్క హృదయకుహరమందున నివసించే ఈశ్వరునిగా ఓంకారాన్ని తెలుసుకో! అట్లే ఓంకారాన్ని సర్వవ్యాపిగా తెలుసుకున్న వాడు ధీరుడు. వాడు ఎప్పుడూ శోకించడు.
వివరణ: ఓంకారమే సర్వ హృదయాంత ర్వర్తియై సమస్త ప్రపంచాన్ని పాలించే ప్రభువైన ఈశ్వరుడు. దీన్ని సమస్త రూపాలలో చూడడమే ఆత్మ పరిపూర్ణత లేక ఆత్మజ్ఞానము. దీన్ని పొందినవానికి జీవితములో దుఃఖమే లేదు. బుద్ధిలో వివేచనా శక్తి అభివృద్ధి పొందినప్పుడే ఆత్మ వివేచన బాహ్యాభ్యంతరము లందు కల్గుతుంది. తర్క వాదాలనే శిలా పర్వతాలను ఛేదించి తత్వాన్ననే గమ్యాన్ని చేర్చే మార్గమే వేదాంతము.
కారిక-29: అమాత్రో-నన్త మాత్రశ్చ ద్వైతస్యోపశమః శివః ।
ఓంకారో విదితో యేన సమునిర్నేతరో జనః ॥
భావం: అమాత్ర మరియు అనంతమాత్రలను కల్గిన ఓంకారము ద్వైతము ఉపశమించుటచే శివము శాంతమునై ఉన్నది. ఈ విధముగా ఓంకారమును తెలుసుకున్న వాడే ముని. ఇతరుడు కాడు.
__వివరణ: __అమాత్ర: తురీయాన్ని సూచించే నిశ్శబ్ద ఓంకారము.
మాత్ర: పరిమాణము. అనంతమైన పరిమాణము కలది అనంతమాత్ర.
అనంతమాత్ర: ‘‘ఒక కొలబద్దతో కొలిచి చెప్పునట్టి పరిమితి లేనిది’’ - శంకరులు
శివం: నానాత్వవిశిష్టమైన, భ్రాంతిమూలకమైన ఈ దృశ్య జగత్తు దేనియందు లయమైతుందో ఆ ప్రణవము సర్వమంగళకరమైనది.
పై దాన్ని గ్రహించి, అనుభవించిన సాధకుడు ప్రాపంచిక సుఖదుఃఖాలు లేని వాడైనాడు కేవలం శబ్దంగా కాకుండా ఓంకారాన్ని ఈ విధంగా అర్థం చేసుకున్నవాడే నిజమైన ఆత్మజ్ఞాని.
సూచన: ఇతరులు కారు. అనడంలో కేవలం మేధాశక్తితో ప్రతిభతో, శాస్త్ర జ్ఞానముతో వేదాంత సిద్ధాంతములను తెలుసుకోవడంతో బోధించడంతో మాత్రము చేతనే దివ్యత్వము పొందలేరని గౌడపాదుల నిష్కర్క.
సూచన: ఇక్కడినుండి గౌడపాద కారికలు ప్రారంభమగుచున్నవి.
అధ్యాయం-2