మంత్రం-1: హరిః ఓం! ఓ మిత్యేక మక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవద్భవిష్యదితి సర్వ మోంకార ఏవ. యచ్చాన్యత్రికాలాతీతం తదప్యోంకార ఏవ.
__భావం: __ఈ ఓం అనే అక్షరమే సర్వమునైయున్నది.దీని వివరణ ముందు చెప్పబడు చున్నది. భూత భవిష్యద్వర్తమానములు ‘ఓం’ యనునదే యగుచున్నవి. త్రికాలాతీత మైనదేది కలదో యదియును ఓం కారమే యగుచున్నది.
శ్రీ శంకర భగవత్పాదులు:
నామము, దానికి విషయమైన నామి (పేరుగలది) రెండును ఒకటే అగుటవల్ల ఇక్కడ ‘ఓం’ అభిదానమునకే (పేరుకే) ప్రాధాన్యమియ్యబడిరది. ప్రారంభంలో (ఓం) ప్రణవోచ్చారణకు (అ-ఉ-మ-) పాటించవలసిన విధానమును వివరించి, ఆయా అక్షరములు వివరించే భావాన్ని తెలియజేస్తున్నారు. ‘తస్యేదం ఉప వ్యాఖ్యానం’ దాని వివరణ అనుసరించుచున్నది. గురువు శిష్యునకు ‘ఓం’కారాన్ని సులభశైలిలో ఉచ్చరించడాన్ని తెల్పి, తర్వాత ‘అదియే ఈ సర్వము’ అని ఒక్క పదముతో నాతని సమస్యను తీర్చుటకై ప్రయత్నించుచున్నాడు.
భూతభవిష్యద్వర్తమానములుగ నుండినది ఓంకారమే. దానికతీతమైనదేది కలదేదో అది కూడా ఓంకారమే. కాలజ్ఞానము మనస్సు యొక్క ఇంద్రజాలము. మనస్సు లేనిచోట కాలము కూడా ఉండజాలదు. అట్టి మనస్సు జడము, అచేతనము, భౌతికము. ఇది జీవమునందినప్పుడే చేతనము చలనక్రియావంత మగుచున్నది. కావున త్రికాలాతీతమైనది ఆ దివ్య చైతన్యమే. దానివలననే ఈ దేహమనో బుద్ధులనెడి యంత్రము చేతనమై చలనశక్తి కలదై పనిచేయుచున్నది.
ఓంకారము, అందలి మాత్రలు, వాటి ప్రతీకాత్మకత స్పష్టప్రపంచమునే కాక దాని కాధారమైన అద్వైత బ్రహ్మతత్త్వమును కూడా పేర్కొనుచున్నది. 12 మంత్రములలో ఈ వివరణ కలదు.
మంత్రం-2: ‘సర్వం హ్యేతద్బ్రహ్మయమాత్మా బ్రహ్మ సో-యమాత్మా చతుష్పాత్’
భావం : ఇది యంతయు బ్రహ్మమే. ఈ ప్రత్యగాత్మ కూడా బ్రహ్మమే. అట్టి ఈ ఆత్మ చతుష్పాదములుగలది యగుచున్నది.
శంకరులు: ప్రతి వ్యక్తిలోని ‘నేను’ సర్వవ్యాపియైన ‘నేను’లో భాగమే. శాశ్వతము, అనంతము, అవ్యయమైన సత్యతత్త్వము మాయాచోదితమై దేహమనోబుద్ధులు తోడి తాదాత్మ్యమును పొంది, తత్ఫలితముగా కల్గిన భ్రమచే తననొక ప్రత్యేక వ్యక్తిగా భావించుకొనుచున్నది. ఈ భౌతికావరణములతో తాదాత్మ్యము పొంది తాను జీవుడని స్థిరపర్చుకొని, తత్ఫలితంగా మర్త్యత్వము, అహంకారము, దంభము వంటి వికారములను పొందుచున్నది.
‘ఇది’ సర్వనామానికి అనేకార్థములున్నాయి. ‘అయమాత్మాబ్రహ్మ’ ఈ ఆత్మయే బ్రహ్మము అనే మహావాక్యాన్ని ఈ ఉపనిషత్తు బోధిస్తుంది. ఈ ఆత్మ అంటే మనలోని ఆత్మ అని అర్థం. అదే బ్రహ్మ. సర్వవ్యాపియైన ఆత్మ. ఈ మహావాక్యాన్ని ధ్యానిస్తూ పోతే చిట్ట చివరికి ధ్యానించడానికి వీలులేని నిర్వకల్పదశకు చేరగలము. అన్ని ఆలోచనలు అడుగంటిపోయే ఆత్మజ్ఞానానందము అది. ‘నిర్విషయం ధ్యానం’.
ఆత్మ చతుష్పాత్ అని చెప్పబడిరది. పశువులకు వలె నాల్గు కాళ్ళున్నాయని కాదు. ‘అవయవముగా’ పాదాన్ని గ్రహించరాదు. ఇతి అపార్థానికి దారితీస్తుంది. నాల్గు పాదములు అనగా నాల్గు విధములైన కర్మ క్షేత్రములు. మొదటి మూడు నాలుగవ దానిలో లీనమై పోతాయి. దృశ్యమాన ప్రపంచములో వ్యవహరించు అంశములే ఆపాదములు
1) జాగ్రదవస్థ, 2) స్వప్నావస్థ, 3) సుషుప్త్యవస్థ, 4) తురీయావస్థ.
1,2,3 అవస్థలను అధిగమించి తురీయములో చేరినంతనే ఆ మూడూ లీనమై ఏకమైన పూర్ణత్వమును పొందుచున్నది. ఈ పూర్ణత్వములో ఈ మూడు లేవు. అందుకే ‘పాదములు’ భాగములనే అర్థములో పేర్కొన్నారు. ఒక రూపాయిలో నాలుగు పావులాలున్నట్లు. వివరిస్తే రూపాయి నాణెంలో పావులాలు నాలుగు ఇమిడి ఉన్నాయిగదా! విడివిడిగా కనిపించవుగదా! ఇదీ అంతే!
మంత్రం-3: జాగరితస్థానో బహిష్ప్రజ్ఞః సప్తాంగ ఏకోన వింశతి ముఖః స్థూల భుగ్వైశ్వానరః ప్రథమ పాదః
భావం : ప్రథమ పాదము వైశ్వానరుడు అతని కర్మక్షేత్రము జాగ్రదవస్థ. అతడు బాహ్యప్రజ్ఞను కల్గిఉన్నాడు. అతనికి సప్తాంగములు. 19 ముఖములున్నాయి. అతడు స్థూల విషయములనే అనుభవిస్తాడు.
వివరణ: జీవితం మూడు ముఖ్య తత్త్వములతో కూడి ఉంది. అవి-1) అనుభవించు వాడు, 2) అనుభవించబడునది, 3) అనుభవము. ప్రథమ పాదములు విశ్వుడు (వైశ్వానరుడు) పంచేంద్రియగోచర విషయ ప్రపంచమునందు మాత్రమే అనుభవము పొందగలడు. ఇతనికి 19 ముఖములు - 7 అంగములున్నాయి అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు + 5 కర్మేంద్రియాలు + 5 ప్రాణాలు + 1 మనస్సు + 1 బుద్ధి + 1 చిత్తం + 1 అహంకారం = మొత్తం-19.
7 అంగములు: విశ్వుని విశ్వరూపమే విరాట్పురుషుడు. అతనికి 1) శిరస్సు- సత్యలోకము 2) కన్నులు - సూర్యుడు, 3) శ్వాస - వాయువు, 4) మధుభాగము - ఆకాశము, 5) యోని - జలము, 6) పాదము - భూమి, 7) ముఖము - ఆహవనీయాగ్ని.
సూచన:- ఛాంద్యోగములోని 5వ అధ్యాయం 18వ శ్లోకంలో విశ్వుని విరాట్ రూపంలోని సప్తంగాలు వివరించబడినాయి. గీతలో విశ్వరూప సందర్శన యోగం దీనికి విస్తృతరూపమే. ఈ వర్ణన ‘అయమాత్మాబ్రహ్మ’ అన్న మంత్రభావాన్ని స్థిరపరచుచున్నది.
మంత్రం-4: స్వప్నస్థానో-న్తః ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతి ముఖః ప్రవివిక్త భుక్తైజసో ద్వితీయః పాదః
భావం: ద్వితీయ పాదము తైజసుడు. అతని అనుభవస్థానము స్వప్నావస్థ. ఇతడు అంతఃప్రజ్ఞ కలిగినవాడు. అతనికి 7 అంగములు 19 ముఖములున్నాయి. మానసిక ప్రపంచమునందలి సూక్ష్మ విషయాలను మాత్రమే అనుభవిస్తున్నాడు.
వివరణ: జీవి బాహ్య ప్రపంచమునుండి విరమించుకొని సూక్ష్మ శరీరాభిమాని యైనప్పుడు తైజసునిగా వ్యవహరిస్తున్నాడు. ఇతని ప్రపంచం స్వప్నావస్థ. స్వప్నములో నున్నప్పుడు దానిని నిజమనే భావిస్తాము. అనుభవిస్తాము. అది వాస్తవము కాదని జాగ్రత్‌లో తెలుసు కుంటాం. విశ్వుని భౌతికానుభవములు మనసునందు ముద్రించు కొని పోయి స్వప్నంలో సాక్షాత్కరిస్తున్నాయి. సూక్ష్మ విషయ ప్రపంచ గ్రాహిగా తైజసుడు వ్యవహరిస్తున్నాడు. విశ్వతైజసులిద్దరూ మనలోని ఆత్మ తత్త్వము యొక్క అంశలే. మనలోని శుద్ధ చైతన్యము బాహ్య ప్రపంచాభిమానియైనప్పుడు విశ్వునిగా, సూక్ష్మ ప్రపంచాభి మానిగా నున్నప్పుడు తైౖజసునిగా పేర్కొనబడుతున్నాడు.
__మంత్రం-5: __యత్ర సుప్తో నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి తత్సుషుప్తం ।
తత్సుషుప్తస్థాన ఏకీభూతః ప్రజ్ఞానఘన ఏవానందమయో హ్యానంద భుక్ చేతో ముఖః ప్రాజ్ఞస్తృతీయః పాదః
భావం : మూడవ పాదము ప్రాజ్ఞుడు. ఎచట ఏ కోరికలు కోరకుండా, ఎచట ఏ స్వప్నమూ చూడకుండా ఉంటాడో అదే సుషుప్తి. అన్ని అనుభవములు భేదరహితమై ఏకీభవించే స్థితి ఇది. సంపూర్ణ చైతన్యము యొక్క ప్రజ్ఞాన ఘనరూపమే ప్రాజ్ఞుడు.
వివరణ : సర్వేంద్రియాలు మనో బుద్ధులతో సహా నిష్క్రియములు కావడమే సుషుప్తి. ఇది జాగ్రత్స్వప్నములందు చైతన్యమును ప్రసరింపజేసే ముఖద్వారమే. మనకు తెలిసిన దేదీ అక్కడ తెలియదు అదే సుషుప్తి. సంపూర్ణమైన అజ్ఞానమే సుషుప్తి పై మంత్రంలో సుషుప్తిని నిషేధ వాక్యముల ద్వారానే నిర్వచించినారు. ‘‘ఎచట విషయ వాంఛలేదో, ఎచట స్వప్నమును దర్శించడో’’ వంటివి సుషుప్తిలో ప్రజ్ఞానము ఘనీభవించుచున్నది. ఏక రూపమైన ప్రజ్ఞానఘనము ఆనంద రూపము. జాగ్రత్స్వప్నములను పోల్చినప్పుడు పరిపూర్ణ సుఖం (ఆనందం) ఉన్నది సుషుప్తి లోనే. ఇది నిజంగా ఆనందశబ్దార్హ స్థితి కాదు. ఇంద్రియ మనో బాధలు కల్గించు కారణములు సుషుప్తిలో ఉండవు. మిగిలినది సుఖమే. అలజడి., అశాంతి విషయ ప్రపంచమునుండియే కలుగుతుంది. అది సుషుప్తిలో లుప్తమైనప్పుడు ఆ ఆవరణను ఆనందమయకోశంగా శాస్త్రం పేర్కొంది. ఆ పరమాత్మ సుషుప్త్యవస్థాభిమాని ఐనపుడు ‘ప్రాజ్ఞుడు’గా వ్యవహరించబడుతున్నాడు. ఈ సుషుప్తి ‘చిత్’ అనే జ్ఞానమునకు సింహద్వారముగా పేర్కొనబడినది.
మంత్రం-6: ‘ఏషసర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషో-న్తర్యామ్వేషయోనిః సర్వస్య ప్రభవావ్యయౌ హి భూతానాం’
భావం : ఈతడే సర్వేశ్వరుడు. ఈతడే సర్వజ్ఞుడు ఈతడే సర్వాంతర్యామి. ఈతడే సమస్తమునకు మూలకారణము. ఇందుండియే సమస్తము ఉద్భవించి, యిందే సమస్తము లీనమగుచున్నది.
వివరణ : సుషుప్త్యవస్థాభిమాని ప్రాజ్ఞుని వివరించడం ఈ మంత్రంలో కూడా కొనసాగుతుంది. మన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడం సుషుప్తిలో అసాధ్యము. ఎందుకంటే అది అవిద్య. ఏమీ తెలియని స్థితి. మరి ఇట్టి స్థితికి అధిష్ఠానమైన ప్రాజ్ఞుని సర్వేశ్వరుడని మొదలైన విశేషములతో పేర్కొనడం ఎందుకు? ప్రకాశింపజేసే జ్ఞానం పరంజ్యోతి నిత్యచైతన్యం లేనప్పుడు జాగ్రత్తను, సుషుప్తిని కూడా తెలుసుకోలేము. ఈ చైతన్యమునందే సృష్టి స్థితి లయములున్నాయి. దీనిని పరమాత్మవైపు మరలించినప్పుడు అచ్చట లీనమైతుంది. లేనప్పుడు దేహమునుండి వెడలిపోయి దేహము నిశ్చైతన్యము (శవం)గా మారుతుంది. ఈ చైతన్యము మనోబుద్ధుల ద్వారా ప్రసరింపబడి నానారూప జగత్తును బయల్పరచుచున్నది. దీన్నే వేదాంత శాస్త్రం బోధిస్తున్నది. ఆధ్యాత్మిక సాధన ద్వారా మనమే మనోబుద్ధులను అధిగమించి జగత్తునంతా అద్వైతమైన ఆత్మ తత్త్వముగా చూడగలము. ఈ భావమే ఈ మంత్రంలో చెప్పబడినది.
గౌడ పాద కారికలు
__కారిక-1: __బహిష్ప్రజ్ఞో విభుర్విశ్వో హ్యన్తః ప్రజ్ఞస్తు తైజసః ఘన ప్రజ్ఞ స్తధా ప్రాజ్ఞ ఏక ఏవ త్రిధాస్మృతః
భావం: విశ్వుడు బహిష్ప్రజ్ఞ కలవాడు. సర్వవ్యాపి తైజసుడు అంతఃప్రజ్ఞ కలవాడు ప్రాజ్ఞుడు. ఘన ప్రజ్ఞుడు. ఈ విధంగా ఏకమైన ఆత్మయే మూడవ స్థలయందు మూడు విధాలుగా పరిగణింపబడుతుంది.
__వివరణ: __ఉపనిషత్తులు చాలాసంగ్రహంగా గంభీరంగా ఉంటాయి. వాటికి వివరణ చాల అవసరం. కారికాకారుడు వాటిని వివరిస్తున్నాడు. కారిక భాష్యముకన్నా భిన్నము.
భాష్యము: ప్రతి పదానికి, ప్రతి సూత్రానికి సంపూర్ణ వివరణ, సమగ్ర వర్ణన భాష్యము యొక్క లక్ష్యము.
కారిక: తనకు ముఖ్యమని తోచిన పట్ల మాత్రమే వివరణ నిచ్చుట.
బాహ్య ప్రపంచ విషయంతో సంబంధం, తదనుభవంగాని లేని క్షణమొక్కటి యైనా మానవునికి ఉండదు. ఈ అనుభవములు అంతమైనంతనే దేహము మృతమగును. జీవితమును విలువగట్టునప్పుడు వైరాగ్య భావంతో నిండిన వేదాంతి దాన్ని అన్ని కోణాలనుండి పూర్తిగా సంరక్షిస్తాడు. ఇది పాశ్చాత్యులకు తెలియని పద్ధతి. వారు కేవలం బాహ్య జీవితాన్నే సర్వస్వం అనుకున్నారు. మానవుడు తన నిత్య జీవితము ఏ చైతన్యము ద్వారా గడుపుతున్నాడో, ఆ చైతన్యము యొక్క సర్వావస్థలు తదనుభావములు మున్నగు వాటినన్నింటినీ సమగ్రముగా పరిశీలించవలెను.
ఒకే దివ్యతత్త్వము ఈ మూడు అవస్థలను పాలించి, అనుభవిస్తుంది. ఈ మూడవస్థలలో ఉండే సామాన్య తత్త్వమే ‘నేను’. అదే అహంకారము లేదా జీవుడు.
కారిక-2: దక్షిణాక్షి ముఖే విశ్వో మనన్యన్తస్తు తైజసః ।
ఆకాశేచ హృది ప్రాజ్ఞ స్త్రిథా దేహే వ్యవస్థితః ॥
భావం: విశ్వుడు దక్షిణాక్షిముఖమునుండి, తైజసుడు మనస్సు నందుండి, ప్రాజ్ఞుడు హృదయాకాశమునందుండి వ్యవహరిస్తున్నారు. ఇట్లే ఒకే ఆత్మ త్రిథావిభక్తమై త్రివిధ స్థానములనుండి వ్యవహరిస్తున్నది.
వివరణ: విశ్వతైజసప్రాజ్ఞుల సరియైన నివాసాన్ని, దాన్ని గుర్తించే పద్ధతిని వివరిస్తుందీ కారిక. ‘నేత్రేసర్వమ్ ప్రతిష్ఠితమ్’ అన్న యోగసూత్రం ఇక్కడ సంవదించవలసివస్తుంది. దక్షిణ (కుడి) కన్ను విశ్వుని స్థానం. సమస్త బాహ్య విషయానుభవం దృశ్యంగా కంటిద్వారానే సంభవం. అదీ కుడి కన్ను ఎడమకన్ను కన్నా ప్రభావవంతమైనది. కుడికన్ను విశ్వుని స్థానము అనడంలో అంతరార్థమిదే. తైజసుడు స్వప్నావస్థాభిమాని అతని స్థానము అందుకే మనస్సు.
విశ్వతైజసులు సుషుప్తిలో లీనమైనప్పుడు చైతన్యం అఖండమైన ప్రాజ్ఞుడుగా నిలుస్తున్నాడు. కావున ప్రాజ్ఞుని స్థానం హృదయకుహరం. ఇక్కడ నారాయణ సూక్తము అనుసంధానం చేయవలెను. ‘హృదయ కుహర మధ్యే దీపవత్ వేదసారం’ అణూపమం. నీ వారశూక - వత్తన్వీ - పీతాభాస్వత్ వంటి వన్నీ ప్రాజ్ఞునికే చెందుతాయి. ధ్యానముకు సహకారిగా కూడా ఈ కారిక స్థాననిర్ణయం చేసినది.
కారిక-3: విశ్వోహి స్థూల భుఙ్నిత్యం తైజసః ప్రవివిక్త భుక్ ।
ఆనంద భుక్తథా ప్రాజ్ఞః త్రిథా భోగం నిబోధత. ॥
భావం: విశ్వుడు స్థూల విషయమును, తైజసుడు సూక్ష్మ విషయమాలను ప్రాజ్ఞుడు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఇవి వీరి త్రివిధానుభవాలు.
కారిక-4: స్థూలం తర్పయతే విశ్వం ప్రవివిక్తంతు తైజసమ్ ।
ఆనందశ్చ తథా ప్రాజ్ఞం త్రిధా తృప్తి నిబోధత. ॥
భావం: విశ్వడు స్థూల విషయాలలో తృప్తిని, తైజసుడు సూక్ష్మవిషయాలలో తృప్తిని పొందుతున్నాడు ప్రాజ్ఞుడు ఆనందములో తృప్తిని పొందుతున్నాడు. ఈ విధంగా మువ్వురు పొందే తృప్తి మూడు విధాలుగా ఉంది.
కారిక-5: త్రిషుధామాసు యథ్భోజ్యం భోక్తా యశ్చ ప్రకీర్తితః ।
వేదైతదుభయం యస్తు సభుంజానో న లిప్యతే. ॥
భావం: ఈ మూడవస్థల యందుగల అనుభూతిని అనుభవించు వారిని యిందు వర్ణింపబడిన విధంగా ఎవడు తెలుసుకొనుచున్నాడో అట్టి వాడు ఈ మూడవస్థల యందలి యనుభవములను అనుభవిస్తూ కూడా వానికి వశుడు కాడు.
వివరణ: జాగ్రత్స్వప్న సుషుప్తుల వెనుక శుద్ధ చైతన్యమైన ఆత్మ అనేది ఉండినగాని ఇది పని చేయలేదని గ్రహించి, సమాధి యందు ఆత్మభావమే మననైజతత్త్వమని తెలిసికొని, అటు పిమ్మట నీ మూడవస్థల యందలి అనుభవముల వలన సుఖదుఃఖములను పొందము.
సాధనతో గుర్వనుగ్రహంతో శాస్త్రచోదితమైన ఆత్మ తత్త్వమును పొంది మనలోని సారాంశమగు ఆత్మ తత్త్వమును అనుభవించిన పిమ్మట, మరల జాగ్రత్త్స్వప్న సుషుప్తులను ననుభవించుటకు వచ్చినను, తామరాకు మీద నీటి వలె, అంటీ అంటక యందు తగుల్కొనక, అందలి సుఖదుఃఖములను అనుభవిస్తామని పురాతన పరమాచార్యులు ప్రకటించినారు.
కారిక-6: ప్రభవః సర్వభావానాం సతామితి వినిశ్చయః ।
సర్వంజనయతి ప్రాణః చేతోంశూన్ పురుషః పృథక్.॥
భావం: సత్తయిన కారణమునుండి కార్యముద్భవించుచున్నదనుట నిశ్చయమే. ప్రాణము అచేతన పదార్థములను వ్యక్తపరచుచున్నది. పురుషుడు చేతన పదార్థములను, జీవులను ప్రత్యేకముగా, ప్రత్యేక రూపములలో సృష్టించుచున్నాడు.
__వివరణ: __ఆత్మను గురించి తెలియవలెనన్న, మొదట వస్తు ప్రపంచాన్ని గురించి తెలుసుకోవలెను. అందుకే ఈ ప్రపంచము ఎట్లు, ఎందుకు, ఏ విధంగా ఎందుండి వచ్చింది అనే దాన్ని వివరించకుండా ఆత్మతత్త్వాన్ని బోధించినా మనం అర్థం చేసుకోలేం. మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా చేతనాచేతనాత్మాకం. అంటే రెండు రకములు చేతనము - అచేతనము. ఈ రెండు రకములకు ఒకటే కారణము అనేది మనకు అర్థం కాదు. అందులో ఇవి రెండూ పరస్పరం భిన్నమైనవి. కారణములు కూడా రెండు విభిన్నమైనవిగా ఉండవలెననెడి మన బుద్ధికి తగినట్లుగా గౌడపాదులు ‘‘ఆత్మయొక్క చలనాత్మకమైన ప్రాణతత్త్వమునుండి అచేతన పదార్థములు ఉద్భవించినాయి. అట్లే చైతన్య తత్త్వమైన పురుషుని నుండి చేతనాత్మకమైన సమస్త ప్రపంచం ఉద్భవిస్తుంద’’ని వివరిస్తున్నారు.
__కారిక-7: __ విభూతిం ప్రసవంత్వన్యే మన్యన్తే సృష్టి చింతకాః ।
స్వప్నమయా సరూపేతి సృష్టిరన్యైర్వికల్పితాః ॥
భావం: కొంతమంది సృష్టి వాదులు ఈ సృష్టి ఈశ్వర విభూతిచే తయారైందని తలుస్తారు. మరి కొందరు ఇది స్వప్నము వంటిదని భావిస్తారు. దాన్నేమాయగా పేర్కొంటారు.
వివరణ: గౌడపాదుల మతానుసారం పరతత్త్వము అజము. దానినుండి జగత్తు సృష్టించబడలేదు. ఇదంతా మనమానసిక సృష్టి మాత్రమే. దీనినే అజాతవాదము అంటాం. ఇది మాండూక్య కారికల ద్వారా, యోగవాసిష్టము ద్వారా బోధింపబడిన ప్రాచీన వేదాంతము. కాని శంకరుడు తన నవీన వేదాంతములో వ్యావహారిక సత్యంగా అనుభవంలో ఉన్నంతవరకు సత్యమే అగునట్లు తెల్పినాడు. ఈ రెంటికీ భేదములేదు. మూలచ్ఛేదకమైన సిద్ధాంతము కాదు ఇది. రెండూ పరస్పరపోషకాలే స్వప్నము అనుభవములో ఉన్నంతవరకు యథార్థమే. జాగ్రత్తలోనికి వచ్చినప్పుడు మాత్రమే అది స్వప్నమని తెలుస్తుంది. అందుకే కొందరు సృష్టిని దీర్ఘ స్వప్నంగా తలుస్తారు. ఇదే ‘సృష్టి స్వప్న సదృశమని ’ చెప్పబడడం కూడా.
కారిక-8: ఇచ్ఛామాత్రం ప్రభోః సృష్టిః ఇవి సృష్టౌ వినిశ్చితః ।
కాలాత్ ప్రసూతింభూతానాం మన్వన్తే కాలచింతకాః ॥
భావం: కొంతమంది సృష్టివాదులు భగవంతుని యిచ్ఛ ప్రకారం సృష్టి జరిగిందని నిశ్చయిస్తున్నారు. మరికొంతమంది కాలప్రభావము చేతనే యీ జగత్తు సృష్టింపబడినది అని కాలాన్ని కారణంగా చెప్పుతున్నారు.
వివరణ: తనకాలంలో ప్రచారంలో ఉన్న విస్తారమైన సృష్టి వాదాలన్నింటి ఖండిరచి అజాతవాదాన్ని స్థాపించడానికి గౌడపాదులు వీటిని పేర్కొన్నారు. ఇది ప్రతి సిద్ధాంత కర్తకూ సహజమే. తన కాలంలోని వాటిని తర్కసహితంగా ఖండిరచి, తన సిద్ధాంతాన్ని స్థాపించవలసి ఉంటుంది.
__కారిక-9: __భోగార్థం సృష్టిరిత్యన్యే క్రీడార్థమితి చాపరే ।
దేవస్యైష స్వభావో-యమాప్తకామస్య కాస్పృహా! ॥
భావం: మరికొందరు భగవంతుని భోగార్థం సృష్టి జరిగిందని, భగవంతుని క్రీడలకై సృష్టి జరిగిందని, భావిస్తారు. కాని ఇది ఆ దేవుని యొక్క స్వభావమే అగుచున్నది. ఆప్తకాముడైన భగవంతునికి ఎట్టి కోరికలు ఉండవు కదా!
వివరణ: పరమాత్మ పరిపూర్ణమే. అతనిలో భోగ, క్రీడా కామములుండవు. నిష్కామతయే పరిపూర్ణత. అపుడు భగవంతునకు సృజనేచ్ఛను అంటగట్టుట మౌఢ్యమని గౌడపాదుల మతం. అతనికి ఇచ్ఛ కల్గినచో అక్కడ పూర్ణత్వం లోపించినట్టే. ఈ విధంగా గౌడపాదులు ఆరు ఉపనిషన్మంత్రములను వివరించే కారికలను ముగించినాడు. ప్రస్తుతం మనము ఉపనిషన్మంత్రమును చదువు తున్నాము. దీనిలో తురీయావస్థ మహత్తరంగా వర్ణించబడిరది.
__మంత్రం-7: __నాంతః ప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నో భయతః ప్రజ్ఞం
న ప్రజ్ఞాన ఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞ
అదృష్ట మవ్యవహార్యమగ్రాహ్యమలక్షణ చిన్త్య
మవ్య పదేశ్యమే కాత్మ ప్రత్యయసారం ప్రపంచో పశమం
శాంతం శివమద్వైతం చతుర్థం మన్యన్తే స ఆత్మా సవిజ్ఞేయః
__భావం: __అది అంతః ప్రజ్ఞ కాదు. బహిః ప్రజ్ఞ కాదు. ఉభయతో ప్రజ్ఞ కాదు. ప్రజ్ఞానఘనము కాదు ప్రజ్ఞయుకాదు అప్రజ్ఞయు కాదు. అది అదృష్టము. అవ్యవహార్యము. అగ్రాహ్యము. అలక్షణము. అచింత్యము. అవ్యపదేశ్యము. ఏకాత్మ ప్రత్యయసారము. ప్రపంచోపశమము. శాంతము. శివము. అద్వైతము. అదియే చతుర్థ పాదమని తలంచుచున్నారు. అదియే ఆత్మ. దీనినే తెలుసుకో వలయును.
వివరణ: సత్యతత్త్వము మాటలకు అందనిది. గుణవంతమే కాదు. పదార్థములన్నీ అశాశ్వతములే. మరి దీనిని ‘నేతి-నేతి’ అని ‘ఇది కాదు - ఇతి కాదు’ అనే పద్ధతిలోనే గ్రహించవలెను. తనలో గంభీర భావము నిముడ్చుకొని ధ్వని గర్భిత పదములతో ఆ పరతత్త్వాన్ని ఈ యుపనిషత్తు సూచిస్తుంది. మనము చూసి, అనుభవించు విషయములను నిరాకరించుట ద్వారా ఆ సత్త్వతత్త్వమును సూచించు వర్ణన ఇది.
విషయ ప్రపంచాన్ని మనో, బుద్ధి, ఇంద్రియములద్వారా గ్రహిస్తున్నాం. చిన్న తార్కాణం. చీకటిలో తాడును పాముగా భ్రమిస్తాం. కాని ఇది పాముకాదు. కట్టెపుల్ల కాదు. అని నిషేధిస్తూ చివరికి త్రాడుగా తేల్చినట్లుగానే ‘నేతి-నేతి’ ద్వారా ఆత్మతత్త్వాన్ని తెలుసుకోవలెను. అవి -
1) నాంతఃప్రజ్ఞం : తైజసుడు కాడు
2) న బహిష్ప్రజ్ఞం : విశ్వడు కాడు
3) న ఉభయతః ప్రజ్ఞం : పై రెండు అవస్థలమధ్యనున్నది కాదు.
4) న ప్రజ్ఞానఘనం : ప్రాజ్ఞుడు కాడు
5) న ప్రజ్ఞం : చేతనము కాదు
6) న అప్రజ్ఞం : అచేతనము కాదు
7) అదృష్టం : కనబడనిది (రూప, శబ్ద స్పర్శాదులు లేనిది)
8) అవ్యవహారం : వ్యావహారిక సంబంధం లేనిది. (సమస్త వ్యవహారాలు ఆత్మయందే
జరుగుచున్నవి అని అర్థం)
9) అగ్రాహ్యం : గ్రహింపశక్యం కానిది (ఇంద్రియాదులు గ్రహింప లేవు)
10) అలక్షణం : (లక్షణము అనగా ఇక్కడ ‘కార్యము’ అని అర్థం ఊహించి
తెలుసుకోలేము. (ఉదా॥ పొగ ద్వారా అగ్నిని ఊహించడం) పొగకు కారణం అగ్ని
11) అచింతనం : చింతింప శక్యం కానిది.
12) అవ్యపదేశ్యం : వర్ణింప శక్యం కానిది (మనో బుద్ధి ఇంద్రియాల ద్వారా గ్రహింపకుండా
దాన్ని మాత్రమే మాటలతో వర్ణించగలం)
పై విధంగా సమస్త గుణాలను, లక్షణాలను నిషేధించిన పిమ్మట విధి రూపమై తోచు ఆత్మ గుణాలను కొన్నింటిని ఈ క్రింది విధంగా పేర్కొంటున్నాడు. కాని ఆత్మ నిర్యాణమనియే గ్రహించవలెను.
1) ప్రపంచోపశమం : తురీయావస్థలో ప్రపంచమంతా నశిస్తుంది.
2) శాంతం : ప్రపంచం నుండి విమరించినంతనే మిగిలేది శాంతియే.
3) అద్వైతం : రెండవది లేనిది (ఏకము) ప్రపంచం లేనిచోటే అద్వైతానుభూతి.
4) శివమ్ : సర్వమంగళ కారకం. ప్రపంచం లోనే మంచి చెడ్డలు (తురీయంలో
మిగిలేది శివమే.) ఎక్కువగా నిషేధ రూపంలో తక్కువగా విధిరూపంలో చెప్తూ ఇదే తురీయం అదే ఆత్మ - దానినే తెలుసుకో వలయును అని దృఢముగా బోధిస్తున్నాడు.
సూచన:- ఇదంతా శ్రవణం - దీనిని మనన, నిధి ధ్యాసల ద్వారా సమాధిగా మార్చుకోవలెను. దానికి ధ్యానమే సాధనము. ఆధ్యాత్మిక జీవన అంతిమ ప్రాభవము ధ్యానమే. అందుకే యోగ సూత్రములో ‘నిర్విషయం ధ్యానం’ అన్నారు.
__కారిక-10: __నివృత్తేః సర్వదుఃఖానాం ఈశానః ప్రభురవ్యయః ।
అద్వైతః సర్వ భావానాం దేవస్తుర్యో విభుః స్మృతః ॥
భావం: అవ్యయమైన ప్రభువైన ఈశ్వర తత్త్వమందు ఈ సమస్త దుఃఖములు నివృత్తియగుచున్నవి. అదియే అద్వైతము. అదే తురీయము. సర్వవ్యాపి. అది దివ్యము.
__వివరణ: __వెనుకటి మంత్ర భావాన్ని గౌడపాదులు ఇంకా స్పష్టముగా దృఢ పరుస్తున్నారు. సమస్త విషయ ప్రపంచ దుఃఖాలన్నీ ఈశ్వర తత్త్వంలో లయ మౌతాయి. దీన్నే తురీయంగా దివ్య తత్త్వంగా ఆత్మ వస్తువుగా తెలుసుకోవలెను.
కారిక-11: కార్యకారణబద్ధౌ తావిష్యేతే విశ్వతైజసౌ ।
ప్రాజ్ఞః కారణ బద్ధస్తు ద్వౌతౌ తుర్యౌన సిద్ధ్యతః ॥
భావం: విశ్వతైజసులు కార్యకారణముల చేత బద్దులై ఉన్నారు. కాని ప్రాజ్ఞుడు కారణమాత్ర బద్ధుడు. తురీయంలో కార్యకారణములు రెండూ సిద్ధించవు.
వివరణ: కారణములో అవ్యక్తంగా కార్యము ఇమిడి ఉంటుంది. కార్యము వ్యక్తమైనప్పుడు కారణం మాయమైపోతుంది.
విశ్వుడు: కారణము (అవిద్య) కార్యము (విషయ ప్రపంచం) తానే అనుచున్నాడు.
తైజసుడు: కారణము (అవిద్య) కార్యము (సూక్ష్మ ప్రపంచం) తానే అగుచున్నాడు.
__ప్రాజ్ఞుడు: __కేవలం కారణమాత్ర బద్ధుడు. కార్యములైన స్థూల, సూక్ష్మ ప్రపంచాలు లేవు ఇక్కడ సంపూరణమైన అవిద్య మాత్రమే ఉంది.
__అవిద్య: __పరమాత్మ విషయక అజ్ఞానం
పై మూడూ కానిది తురీయం. దీనిని కార్యకారణాలు మలినపరచలేవు. పై మూడూ భ్రమచే తురీయంలో ఆరోపితమైనవే కాని సత్యములు కావు.
కారిక-12: నాత్మానం న పరాంశ్చైవ నసత్యం నాపి చానృతం
ప్రాజ్ఞః కించన సంవేక్తి తుర్యం నత్సర్వ దృక్సదా
భావం: ప్రాజ్ఞునకు సత్యం కాని, అసత్యంకాని ఆత్మకాని, అనాత్మకాని తెలియదు. తురీయము సదా సమస్తాన్ని చూచి తెలిసికొన్నదై ఉంది.
వివరణ: ‘కార్యము’ అన్నదాన్ని అన్యథా గ్రహణమ్ అని కూడా వివరిస్తారు. అంటే ఉన్నదున్నట్లుగా కాకుండా వేరొక విధంగా గ్రహించుట. సత్త్వ తత్త్వాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడమే ఇది (Misconcept) విశ్వతైజసులిద్దరూ అజ్ఞానం, అన్యథా గ్రహణం చేత బద్దులై ఉన్నారు. ప్రాజ్ఞుడు కేవలం అజ్ఞాన బద్ధుడు. కాని తురీయంలో అజ్ఞానం, అన్యథాగ్రహణం రెండూ లేవు.
ఇంకా వివరిస్తే సుషుప్తిలో ప్రాజ్ఞుడు సత్యాసత్యాలనుగాని, ఆత్మ అనాత్మలను గాని మంచి చెడ్డలనుగాని తెలుసుకోలేడు. అందుకే ఇది సర్వసంపూర్ణం కాదు. శుద్ధ చైతన్యం కాదు. కేవలం మూర్తిభవించిన అజ్ఞానం.
ప్రాజ్ఞ తురీయముల చీకటి వెలుగుల వలె పరస్పర విరుద్ధములు. సుషుప్తిలో ‘నాకేమీ తెలియలేదు’ అనే స్థితి. తురీయంలో ‘నాకన్నీ తెలుసు’ననే స్థితి. శుద్ధ జ్ఞానస్వరూపమే తురీయం. దాని నైజ తత్త్వము జ్ఞానమే. అందుకే అది సర్వదృక్.
కారిక-13: ద్వైతస్యాగ్రహణం తుల్యముభయోః ప్రాజ్ఞ తుర్యయోః
బీజనిద్రాయుతః ప్రాజ్ఞః సాచతుర్యే నవిద్యతే
భావం: సుషుప్తిలో, తురీయంలో ద్వైతమును గ్రహించడంలేదు. కాని ప్రాజ్ఞునికి అవిద్య కారణము. తురీయంలో అవిద్య లేనేలేదు.
__వివరణ: __సుషుప్తి తురీయముల భేదమును స్పష్ట పరుస్తున్నాడు. ప్రాజ్ఞుడు ‘తత్త్వం తెలుసుకోలేని అజ్ఞాన దశలో ఉన్నాడు. ఇదే విషయ ప్రపంచానికి కారణం. కాని తురీయంలో సదా సంపూర్ణ ప్రకాశమానమై జ్ఞాన స్వరూపమై సర్వవ్యాప్తమైన నిత్యసత్యజ్ఞాన తత్త్వము సర్వదా ఉంటుంది. దానికి పూర్వ, పరాలు ఉండవు. అట్లే అది దేనికీ కార్యము లేదా కారణము కాజాలదు. శుద్ధ జ్ఞాన స్వరూపమగుటచే అందు కారణ బద్ధమైన సుషుప్త్యవస్థ ఉండకూడదు.