శ్రీః
అపరోక్షిత పరతత్త్వస్య
శ్రీ మల్లికార్జున శాస్త్రినః కృతిః
శ్రీ పురుషోత్తమ శతకమ్
తాత్పర్యము
బ్రహ్మశ్రీ జోస్యము జనార్దనశాస్త్రి
తెలుగుసేత
డా॥ పాణ్యం శ్రీనివాస
పాణ్యంవారి ప్రచురణలు, కర్నూలు
2025
81-272-A2
వినతి
గురుస్సాక్షాత్ పరబ్రహ్మా.
గురుపాదంబులె నాకు దిక్కనుచు నే ఘోషల్ విదారింపగన్
గురునామంబె తరింప జేయుననుచున్ గొంతెండ బాడన్ దయన్
గురు వాక్యంబె సుధామయంబనుచు నే గ్రోలంగ నుద్విగ్నతన్
గురుదృష్టుల్ భవ తాప పాప హరముల్ కుల్యల్ పునీతంబులౌ
గురుసాన్నిధ్యమె భాగ్యమంచు నెడదన్ గూటస్థుగా నెంచుచున్
గురుతత్త్వంబు మదీయ భావనల సంకోశంబుగా నిల్పగన్
గురుమూర్తిన్ దగ చిత్తమున్ నిలిపి వాక్కుల్ లేక నే నిల్వగన్
గురుచిత్తంబున వత్సమై మనుట నా గోర్కిన్ ఫలింపన్ వెసన్
గురువే బ్రహ్మమటంచు నిల్పుటకు నే గుంభింపగా వాయువున్
గురుదేవుండొనరంగజేయు నను గోప్యంబుగా మోక్షమున్.
ఈ శతకమును గురించి, కవిని గురించి విపులమైన ‘పురోణి’ ఇప్పటికే
ఉన్నది. తాత్పర్యము వ్రాసిన బ్రహ్మశ్రీ జోస్యం జనార్దన శాస్త్రిగారు మా తండ్రిగారు బ్రహ్మశ్రీ పాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రిగారికి సన్నిహితులు. మాకు దూరపుజ్ఞాతులు కూడా. వారి పౌత్రిని మా మేనల్లునకు చేసుకున్నాము. ఆ రకమైన బంధుత్వము కూడానున్నది. ఇంక శతక కర్త మా పరమ గురువులే. వారి అనుగ్రహం వల్లనే నేను సాహసించి, ఈ అనువాద కార్యమును కొనసాగించినాను. అల్పజ్ఞుడను, పద్యరచనారంభక డిరభకుడనై ఇట్టి బృహత్తరకార్యమునకు నడుముకట్టడం కేవలం గుర్వనుగ్రహమే. మూలములో దాదాపు 25 ఛందస్సులను ప్రయోగించినారు బ్రహ్మశ్రీ మల్లికార్జున శాస్త్రిగారు. అనుకర్తగా నేను 14 ఛందస్సులనుపయోగించి నాను. మహాస్రగ్ధర, మధ్యాక్కర, తరువోజ, అంతరాక్కర, సుగంధి, త్రిపద వంటివాటి ప్రయోగములున్నవి. సహృదయ కవి పండిత లోకము నా ప్రయత్నమును పరిశీలించవలెనని మనవి.
గురుచరణారవిందార్పణమస్తు!
డా॥ పాణ్యం శ్రీనివాస
ప్రణుతి
శ్లో॥ గొల్లాపి న్న్యన్వయాంభోధి రాకాపూర్ణ నిశాకర ।
మల్లికార్జున విఖ్యాతః తత్త్వజ్ఞో ముక్త సంగతిః ॥
-
ఆసేతు హిమాచల భూ
వాసిత తత్త్వజ్ఞ సార్వభౌముఁడు, ముక్తి
శ్రీ సంయుతుండు, తత్త్వ
వ్యాసంగుం డయిన మల్లికార్జునుఁ దలతున్ ॥
-
సకలామ్నాయ కలావిధిజ్ఞుఁ డఖిలక్ష్మాపాలకాస్థాన దీ
పక విద్వన్మదనాగ దిగ్రమణ శుంభద్వాద దుర్దాంతుఁ డ
క్షకలాభిజ్ఞుఁడు, సర్వభూత సముఁ, డజ్ఞానాంధకారార్యముం
డు, కృపాపూర్ణుఁడు-మల్లి కార్జున సుధీంద్రున్ గొల్తు శ్రేయోర్థినై ॥
(శ్రీ గొల్లాపిన్ని రామచంద్రశాస్త్రి గారు స్తుతించినది.
వీరికి వారు వేలు విడిచిన పెద తండ్రి గారు)
డా॥ ఓగేటి అచ్యుతరామశాస్త్రి
M.A., Ph.D.
8-2-46, శ్రీనగర కాలనీ రోడ్,
పంజాగుట్ట, హైదరాబాదు-500 422
శ్రీ పురుషోత్తమ శతకము
పురోణి
సంస్కృతభాషలో వెలసిన శతకములు వందకు మించి లేవని పరిశోధకుల వక్కణ. ఇందులో ప్రథమశ్రేణికి చెందిన శతకములు వేళ్ళమీద లెక్క పెట్టవచ్చును. వీనిలో అమరు శతకము, మయూరుని సూర్య శతకము, భర్తృహరి నీతి శృంగార వైరాగ్య శతకములు, శతకములుగా పరిగణింపబడవలసినవైనను స్తోత్రములుగా ప్రసిద్ధి చెందిన శంకరుల శివానంద, సౌందర్యలహరులు మిక్కిలి ప్రధానమైనవి. ఇక ద్వితీయశ్రేణికి చెందిన వానిలో అర్వాచీనమైనదియు, అంతగా ప్రచారములో లేనిదియు భక్తిరచనలలో ఉత్తమమైనదియునగు శ్రీ కూర నారాయణ మునీంద్రుని సుదర్శన శతకము ముఖ్యమైనది. ఇప్పుడు కొత్తగా మరొక శతకము లభించుట మనయదృష్టము. అది శ్రీ పురుషోత్తమ శతకము.
ఈ పేర్కొనబడిన శతకములలో విషయభేదమునుబట్టి భక్తి శృంగార నీతి వైరాగ్య వేదాంత విషయక శతకము లున్నట్లు గమనింప గలము. ప్రాయికముగ సంస్కృత శతకము లన్నియు నిట్లే యుండునని భావింపవచ్చును. సాధారణముగా శతకములలో నూఱుగాని నూటినుండి నూట ఎనిమిదివఱకుగాని శ్లోకము లుండుట కద్దు. కొన్ని కొన్నియెడల ద్విశతి త్రిశతి సప్తశతి ఇత్యాదిగా శతకము లుండుట గూడ గలదు. తెలుగు శతకముల కున్నట్లు మకుట నియమము, వృత్త నియమము సంస్కృత శతకములకు లేదు, సంఖ్యా నియమము, రస నియమము ఉన్నచో చాలును, ఈ రెండు నియమములున్న కొన్ని గ్రంథములను వ్యవహారమును బట్టి స్తోత్రములనియో, శతకము లనియో చెప్పవచ్చును. శతక సాహిత్యమును గూర్చి చెప్పిన యీ లక్షణములకు భిన్నముగ కొన్ని యపవాదము లుండవచ్చును. ఇది స్థూలముగ సంస్కృత శతక సాహిత్యమును గూర్చిన పరామర్శ.
శ్రీ పురుషోత్తమ శతకము
ఈ శతకమును రచించిన మహనీయులు కీ॥శే॥ శ్రీ గొల్లాపిన్ని మల్లికార్జునశాస్త్రిగారు (కీ శ. 1871-1917). సుమారు ఎనుబది సంవత్సరముల నాడు వ్రాయబడి యిన్నేళ్ళుగా కాలగర్భమున నిద్రించి యిప్పుడు తొలిముద్రణ భాగ్యమునకు నోచుకొన్న ప్రౌఢ సంస్కృత శతక ప్రబంధమిది. అనేక విషయములలో తనదగు విలక్షణమైన ముద్రతో నావిర్భవించిన విశిష్ట శతకమిది. నూట ఎనిమిది శ్లోకములుగల శతకములో నాయకుడైన పురుషోత్తమనామమును కవి ఒకే ఒక చోట మిక్కిలి అపురూపముగ ప్రయోగించినాడు. ఆ ప్రయోగించిన శ్లోకము దాదాపు శతకము యొక్క నాభిస్థానమున నుండి ‘‘యజ్ఞోవై విశ్వస్యనాభిః’’ అను సూక్తమును స్ఫురణకు తెచ్చుచు అద్భుత రమణీయముగ నున్నది.
దేవపాళి సముల్లస ద్బహురత్నపాళి సమర్చితమ్
స్వచ్ఛ పాద సరోరుహం కనకాంబరం పురుషోత్త మమ్
శ్రీధరం శరదిందు సుందర మందహాస మముం హరిమ్
వందిషీయ సునీల వారిదధాస మక్షి సుఖావహమ్. (శ్లో.65)
దేవతా బృందము వెలుగులు విరజిమ్ము రత్నరాజతో పూజింపగా స్వచ్ఛమైన పాదపద్మములు గలవాడును, కనకాంబరుడును, శరచిందు సుందర మందహాసుడును, పురుషోత్తముడును, శ్రీధరుడును, నీలమేఘచ్ఛాయతో కనువిందు చేయుచున్నవాడును అయిన హరికి నమస్కరింతును అని యర్థము.
ఇచ్చట కవి వాడిన వృత్తమునకు నాల్గు పేర్లున్నవి. ఉజ్వల = ప్రకాశము. చర్చరీ = ఆనందముతో పాడుచున్న సంగీతము. బంధు ప్రియ = బంధుమిత్రులకు ప్రియమైనది, మాలికోత్తర మాలికా = మాలికలమీద మాలికలుగా నేర్పడిన వలయము, ఈ నాల్గు పేర్లను వాటి యర్థములను గమనించినచో కవి యీ భావమున కనుగుణమైన యీ వృత్తమును ఎందుకు వాడినాడో ఇట్టే అర్థమైపోవును.
దేవతలు ఆ పురుషోత్తముని పూజించు సమయమున అక్కడ విరజిమ్ముచున్న వెలుగులు, వారు పాడుచున్న పాటలు, వచ్చిన భక్త బంధుమిత్రుల ఆనంద కోలాహలము, సమర్పింపబడుచున్న పుష్పమాలలు, గుచ్ఛములు కన్నులకు కట్టుచు రసహృదయుల గుండెలు పులకరించి పోవును, ఇది యీ ‘‘పురుషోత్తమ’’ నామమును ఈ శ్లోకమున పొదిగి ఈ మహాకవి చేసిన శిల్పము!
ఈ శతకమును కవి దాదాపు 25 ఛందోరీతులలో నిర్వహించుట అత్యంతాశ్చర్య జనకము! ప్రాచీన శతక కర్తలెవ్వరుగాని, ఆమాట కొచ్చిన మహాకావ్య నాటక నిర్మాతలుగాని, యిన్ని వృత్తములు వాడిన వైనము కానరాదు. అనేక ఛందములను వాడి, ఆయా సన్నివేశ కల్పనలకు అనుకూలమైన భావములను పెట్టి చందఃశిల్పము ద్వారా కావ్యకళకు పతాకమెత్తుట కొఱకు ప్రతిభాశాలియైన కవి చేయు పని యిది. కాళిదాసు ‘‘రతీవిలాపమును’’ వియోగినీ వృత్తములో వాడినాడు. అదొక ఛందశ్శిల్పము. అయితే తెలుగువారి పద్యవిద్య. ఛందశ్శిల్ప కళావిద్య చాలా గొప్పవి, శ్రీ మల్లికార్జునశాస్త్రి గారిపై ‘‘ఆ ప్రభావము గాఢముగ నున్నదని నా తలంపు. అసలీ శతకమున ప్రధానమైనది. ఛందో వైవిధ్యము ద్వారా వారు పాటించిన కావ్య శిల్పమే. ప్రతి శ్లోకమునందును ఏదో ఒక మెలకువ, తకుకు స్ఫురించుచుండును. ఇప్పుడు మరొక విలక్షణమైన శ్లోకము సుదాహరింతును.
ఫణీపశయ, మణిమ ముఖఘృణి లసిత మాద్యం
గుణిన మురుభణితి నుతిమణి విదితచర్యం
గణిత మతిగణిత గుణమణి మవరవర్యం
గుణి సురపమణిలసితఘృణి మనమ మీశమ్. (శ్లో. 9)
ఫణిరాజుపై పవ్వళించువాడును. అణిమ మొదలగు అష్టసిద్ధులతో వెలుగొందు వాడును, ఆద్యుడును, మంచి గుణములు గలవాడును, మహావాక్యములయందు నుతింపబడి తెలియబడిన చర్యలు. గలవా డును, గణితమున కతీతమైన గుణమణులు గలవాడును, అతి ప్రాచీ నుడును, ఇంద్రనీలమణివంటి కాంతులతో ప్రకాశించువాడును అగు ఆయీశునకు నమస్కరింతును అని అర్ధము.
ఇందులో ఐశ్వర్యమునకు సంబంధించిన వస్తువు లన్నియు చెప్పబడినవి. ఫణిరాజు పడగలపై గల రత్నములు, అణిమ మొద లగు అష్టసిద్ధులు, మహావాక్య రత్నములు, ఇంద్రనీలమణి, సుగుణ రత్నములు - ఇత్యాది.
కవి యిక్కడ ‘‘వసుధారా’’ వృత్తమును వాడినాడు. వసు అనగా కిరణము, ఐశ్వర్యము, బంగారు మొదలగు నర్థములు గలవు. ఈ వృత్తమున 5 నగణములు, రెండు గురువులు ఉండును. అనగా వరుసగా 15 లఘువులు, రెండు గురువులు.
ఇచ్చట కేవలము ఉక్తి వైచిత్రియేగాదు. వారి దాంపత్యము నిత్యానపాయిని అను తత్త్వమును ధ్వనింప జేయుట వలన ఇది మరింత రామణీయకతను సంతరించుకొన్నది.
అట్లే 100 వ శ్లోకమున రాత్రియందు ‘‘శ్రీ వక్షోరుహ సుమ గుచ్ఛక ద్విరేఫములైన’’ పురుషోత్తముని కటాక్షములు పగటిపూట మాపై అరవిందములై ప్రసరించుగాక యనుట అలంకారికముగ నున్నది. 95వ శ్లోకములో విష్ణువు యొక్క నల్లవి కాంతికి భయపడి శేషుని పడగల యందలి రత్నముల యెఱ్ఱని కాంతి మరియొక చోటికి వెళ్ళి బడబాగ్నిగా మారినదని ఊహించుట రమ్యముగ నున్నది. 55వ శ్లోకములో భూమియను పీఠమునందు ప్రవహించుచున్న కృష్ణా యమునా నదులవలె శ్రీహరి చరణములు నా హృదయ పీఠము నందు నిరంతరము నిలిచి యుండును గాక యనుట కొత్త పోకడ.
అలంకారములు వాడుటలో మన మహాకవి మహానిపుణుడు, క్రమా లంకారము, శ్లేష, ముక్త పదగ్రస్తము, అర్ధాంతరము, ఉత్ప్రేక్ష, ఉపమ మొదలగు సుప్రసిద్ధాలంకారములను ఈతడు ప్రౌఢ సుందరముగా ప్రయోగించెను. 46వ శ్లోకములో విష్ణువునకు సింహవక్త్రము కలుగుటకు కారణము నుత్ప్రేక్షించిన విధము మిక్కిలి చమత్కార ముగ నున్నది. ఈ యుపమాలంకారమును చూడుడు,
వందే కందర్ప సౌందర్య కదర్యత్వ ప్రకాశికామ్
సౌందరీ మిందిరేశస్య జననీ మివ నందనః.
మన్మథుని సౌందర్యమును ధిక్కరించు ఇందిరాపతి సౌందర్య సుందరిని తల్లిని కొడుకు నమస్కరించినట్లు నమస్కరింతును అనుట పరమ స్వతంత్రమైన ఉపమ. ఇక్కడ కవిని కాళిదాసు ఆవేశించి నట్లు కాన్పించుచున్నది.
శ్రీ మల్లికార్జునశాస్త్రి గారిది నైదర్భీశైలి. అక్కడక్కడ పాంచాలియు సాక్షాత్కరించును. శబ్దశక్తి చాలా గొప్పది. ఎటు వంటి పెద్దభావమునైనను తగిన భాషాశైలిలో పాములవాడు పామును ఇట్టే బుట్టలోనికి తెచ్చినట్లు ఏ ఛందములోగాని యిట్టే యిముడ్చగల నేర్పరి. వారిది స్వచ్ఛమైన జాతీయ సంస్కృతము, సహజ సుందర మైనది. ప్రాచీన సంస్కృత కావ్య నాటకాదులు క్షణ్ణముగా చదివి ఆ భాషా సారమంతయు వడగట్టి తనదను నొక కొత శైలిని యేర్ప రచుకొన్న మేధావి, సాధారణముగా కొందరి కవుల గ్రంథములను చదువు నప్పుడు అందు తత్పూర్వ కవుల కావ్య సామగ్రి, భాషాముద్రలు మనకు గోచరించు చుండును. అట్టి దేదియులేని స్వంతభాషా -శైలి వీరి కున్నది. తన కవిత్వమును గూర్చి చెప్పుచూ వారు 81వ శ్లోకములో ‘‘వాజ్మేగాంగ రaురాయతే’’ నా వాక్కు గంగారaరి వంటిది’’ అని సాత్త్వికా హంకార గర్భితముగ చేసిన ప్రకటన నూటికి నూరు పాళ్ళు తగియున్నది. ఆట్టి సాత్త్వికాహంకారము అంతటి మహనీయు లకు గొప్ప యలంకారమే. గంగారaరికి వేగ మెక్కువ, కాని అది వివిధ దశలలో ఆగుచు ఆగుచు ప్రవహించినది. ప్రవహించుచున్నది అట్లే యీతని వాగ్జరియు ఎట్టి వైవిధ్యములేక నేల బారుగా ప్రవహిం చునదిగాను, ఎంత వేగమో అంత నిలకడ. ఒక్కొక్క శ్లోకము కడ ఆగి యాగి ప్రవహించును. శిల్ప సుందరముగ సుడులు తిరుగును. మరొకచోట పుంజుకొనుచు ఒక విశిష్టరీతిలో సాగిపోవును, ఈ మహాకవిది కేవల భక్తి గాదు; జ్ఞాన గర్భితమైన భక్తి. కేవల-కవి గాడు; విద్వత్కవి. అతని శైలికి ఉదాహరణగా ఒక్క పద్యము.
పూర్ణానంద మమంద సుందర తనుం దివ్యేందిరా సుందరీ
నేత్రేందీవర చందిరాభ వదనం గోవింద మానందతః
స్వాత్మానంద సనందనాది వినుతం వృందారకైర్వందితం
వందే చేతసి నంద నందన మముం దేవం ముకుందం సదా.(శ్లో.4)
ఈ శతకమునకు వ్రాయబడిన తెలుగు వాఖ్యానమును గూర్చి ఒక్క ప్రశంస. ఇది వ్రాసిన మహనీయు లెవ్వరోగాని మూలము నందలి భావమును చెక్కు చెదరనీయక కుదుళ్లతోసహతెచ్చి తెలుగులో భద్రముగ నిలుపుట మహానందకరముగ నున్నది. ఇట్టి గ్రంథములకు ఇటువంటి వ్యాఖ్యానము చాలా ఆవశ్యకము. ఈ వ్యాఖ్యాన సౌందర్యమును ప్రకటించు రెండుదాహరణల నిత్తును.
29వ శ్లోకము అనువాదము:
అనంత-అగాధ వేద వారాశిని బిట్టు తరవగా కనుపట్టు నఖండ సుగుణమణి అని ఆర్యు లెవ్వని బలికిరో ఆ ఇందిరా సుందరీ న్తన చందన కుంకుమాంకిత వక్షుడు శేషశాయి-సుఖదాయి- భగవానుడు-ఖగవాహనుడు, జయమందుగాక!
30వ శ్లోకము-అనువాదము:
ప్రాఁబలుకుల బంగరు బరణిలోని నిగనిగని నీలపుమణి మున్నీటి ముద్దు కూతు మురిపెంపు మగడు వెన్నుడు ప్రసన్నుడై నన్నోముగాత.
ఈ శతకము త్వరలో దేవనాగరి లిపిలో ప్రచురింప బడవలయునని మంగళా శాసనము చేయుచు విరమించుచున్నాను. ఇతిశమ్.
- ఓగేటి అచ్యుతరామశాస్త్రి
ఆచార్య బి.రామరాజుగారు విజ్ఞానసర్వస్వంలో పొందుపరచిన శ్రీశాస్త్రిగారి సంగ్రహ జీవితచరిత్ర
కీ॥శే॥ అల్కూరు గొల్లాపిన్ని మల్లికార్జునశాస్త్రిగారు (క్రీ.శ.1871-1917)
వీరు రాయచూరు మండల మందలి ఆలుకూరు వాస్తవ్యులు. వీరిది గొల్లాపిన్ని వంశము. శ్రీ వత్సస గోత్రము. ఆపస్తంబ సూత్రము. వీరు సుబ్బమాంబా వేంకట రామశాస్త్రుల కుమారులు. ఈ వంశమువారు ఏడు తరములనుండి పండిత కవులు. వీరి భార్య దొణేకల్లు. ఆలూరి వెంకట రామశాస్త్రి గారి కూతురు సుబ్బమాంబ.
వీరు తమ తండ్రిగారి చెంతనే నాటకాంత సాహిత్యమును, తత్త్వబోధినీ వ్యాఖ్యా సమేతముగా కౌముదిని, న్యాయవేదాంత శాస్త్ర ములను కూడా చదివిరి. వీరు తమ తండ్రిగారి వెంట బాల్యమందే గద్వాల, వనపర్తి, అత్మకూరు సంస్థానములు తిరిగి, పండితులను మెప్పించి, ‘‘భారతీ బాల లీలారూపు’’డను బిరుదు నందిరి. పితృ మరణానంతరము వీరు గదేహోతూరు వేంకట రామశాస్త్రులవారి చెంత జ్యోతిషము నేర్చుకొనిరి. తరువాత కాళహస్తి కేగి తద్వాస్తవ్యులగు రాఘవాచార్యులవారికి శుశ్రూష యొనర్చి మహాభాష్యాంత వ్యాకరణమునను, ముహూర్త జాతక సిద్ధాంత రూప స్కంధ త్రయ జ్యోతిష శాస్త్రమునను ఉత్తీర్ణులైరి. అప్పుడే గురువుల వారి యనుమతితో కలియుగాది దశ సహస్ర వర్షముల తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ, ఘటికా, విఘటికల ప్రమాణమును అతి శీఘ్ర కాలమున బోధించు ‘‘ఖచర మణి పేటి’’ అను జ్యోతిష గ్రంథమును రచించి గురువుల కర్పించిరి వీరు స్వగ్రామమగు అలుకూరునకు తిరిగివచ్చి పితామహులగు సుబ్బాశాస్త్రుల కడ సమగ్ర వేదాంత శాస్త్రము నధిగమించి ఇరువదియవ యేట విద్యా వ్యాసంగమును ముగించిరి.
వీరు బళ్ళారి, కడప మున్నగు ప్రదేశములందు శతావధాన ప్రదర్శనములు చేసిరి. గద్వాల, వనపర్తి, ఆత్మకూరు సంస్థానముల కేగి తమ పాండిత్యమును ప్రకటించి సన్మాన్యులైరి. వీరికి ‘కవితా సార్వభౌమ’, ‘సకల శాస్త్రాభిజ్ఞ’ బిరుదు లొసంగబడినవి. తరువాత వీరు కేశ వేశాంకితముగా ‘వాసుదేవానంద’ మను అలంకార గ్రంథమును రచించిరి. ఇది అముద్రితము. వీరి మరియొక గ్రంథము ‘జ్యోతిశ్శాస్త్ర సుధర్మసారము’. వీరు దీనిని కాలడి అగ్రహారమున శృంగగిరి నృసింహ భారతీ స్వాములవారు శంకర ప్రతిష్ఠ యొవర్చినపుడు జరిగిన పండితసభలో స్వామివారికి అర్పించిరి, స్వామి వారు మల్లికార్జునశాస్త్రిగారికి అగ్రతాంబూల మిచ్చి, ‘పండిత సార్వభౌమ’ బిరుద మొసగిరి. వీరు హంపీ విరూపాక్షేశ్వరానుగ్రహము నంపాదించి, అచట ‘బ్రహ్మసత్రము’ చేసి అవబృథము కాశీలో నొనర్చిరి.
- బిరుదరాజు రామరాజు
(విజ్ఞాన సర్వస్వము)
(4వ సంపుటము పేజి నెం. 968)
మనవి
అల్కూరు, కవీశ్వర, గొల్లాపిన్ని మల్లికార్జునశాస్త్రి గారి జీవిత సంగ్రహ చరిత్రను ఆచార్య బిరుదు రామరాజుగారు రచించి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వములో ప్రచురించినారు, ఈ శతకంలో వారి రచన పొందు పరచడమయినది, శ్రీ రామరాజు గారికి కృతజ్ఞతాభి వందనములర్పిస్తూ వున్నాను.
శ్రీ శాస్త్రిగారు అనేక రచనలు గావించినారు. వాటిలో ‘‘వాసు దేవానందము, పాతంజల భాష్యార్థం’’ మొదలయినవి ఉద్గ్రంథములు. ఆయన ‘‘సహస్రదళ పద్మము’’ ను విరచించినారు, అది వేయి గదులు గలది. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క అక్షరం పొందుపరచినారు. ఏ అక్షరం మొదలు పెట్టినా ఒక శ్లోకం రూపొందుతుందని ఒక ప్రతీతి.
శ్రీ శాస్త్రి గారు మహాకవులే కాదు, శతావధానులు కూడా. అక్ష విద్యావేత్త. దినముల కొలది సమాధి స్థితిలో గడిపిన మహా యోగి.
ఒక సంవత్సరం పాటు సత్రయాగం నిర్వహించిన ఋషి. అపుడాయన ఇచ్చిన తీర్థముతో కుష్ట్వాది రోగాలను నయము చేసినారట.
జన సమూహము ఎక్కువ కావడంతో తీర్థమును ఇవ్వలేక ‘‘మల్లప్ప’’ బావినే అభిమంత్రించి అందులో నుంచి తీర్థాన్ని గ్రహించ మన్నారుట!
శ్రీ శాస్త్రి గారి చిన్న కుమారులు శ్రీ రామశాస్త్రిగారు మహా పండితులు, పంచభాషా విచక్షణులు. ఆయన ఇంజనీరుగా పనిచేసిన వారు. ఆయన ఇపుడు లేరు. వారి ధర్మవత్ని శ్రీమతి లలితమ్మ గారు. ఈమె తమ మామగారి రచనలను వెలుగులోకి తేవడానికి గట్టిగా ప్రయత్నిస్తూ వుంది. ఈమె పట్టుదల - గట్టి కృషి మెచ్చుకో తగినవి.
ప్రకృతం శ్రీ శాస్త్రి గారి ‘‘పురుషోత్తమ శతకం’’ ప్రకటింపబడిరది. ‘‘అభినవ వేమ’’ నేత్యాది బిరుదాంకితులు, మహాపండిత కవులు అయిన శ్రీ జోస్యం జనార్ధనశాస్త్రిగారు దీనికి తెలుగులో తాత్పర్యం వ్రాసిరి. అంతే కాదు - వీరు - సావు ప్రతివ్రాయడము మొదలుకొని, ప్రూపులు దిద్దడం వరకు శ్రమించి ఈ శతకం రూపం సంతరించుకొనేటట్లు కష్టించిరి. ఈ విషయంలో వారి వయోభారం అడ్డురాలేదు. వారికి హృదయ పూర్వక కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాడను.
డా॥ ఓగేటి అచ్యుత రామశాస్త్రి గారు మహా పండితులు, విమర్శకులు, తమ నిశిత ప్రజ్ఞాపాటవాలతో ఈ గ్రంథానికి ‘‘పురోణి’’ వ్రాసి - ఇందులోని ఎన్నో రత్నములను వెలికి దీసిరి.
అంతే కాదు. శ్రీముఖ ఉగాదినాడు (24-3-93) గ్రంథావిష్కరణ మహోత్సవ సభకు అధ్యక్షత వహించి మహోపన్యాసము గావించి - సభ్యులను మంత్ర ముగ్ధులను జేసిరి. వారికి కృతజ్ఞతాభివందనములు.
శ్రీ కూరగాయల సత్యనారాయణగారు తాడిపత్రిలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు. ఆయన ఈ గ్రంథాన్ని ఆవిష్కరించి ఈ పండిత సన్మానములు గావించివారు. వారికి ‘‘గొల్లపిన్ని కవి కుటుంబము వారు’’ ధన్యవాదము లర్పిస్తూ వున్నారు.
ప్రత్యేక శ్రద్ధతో ఈ శతకాన్ని సర్వాంగ సుందరంగా ముద్రించిన శ్రీ రంగరామానుజ ప్రెస్, తాడిపత్రి అధినేతలకు - వారి సిబ్బందికి కృతజ్ఞతా పూర్వక శుభాకాంక్షలు.
__తాడిపత్రి, __
శ్రీముఖ ఉగాది శ్రీ గొల్లాపిన్ని రామకృష్ణశాస్త్రి
24-3-93
కులదేవతా - స్తుతి
-
కులదేవీం వల్లె లాంబాం
స్వేష్ట దేవో వృషాకపీ,
వందే వేంకట రామాఖ్యం
పితరం పండితోత్తమం.
-
శ్రీవాణిం కులదేవతాం ధృతపతీం శ్రీ వల్లెలాంబాకృతిం
వందే శ్రీహరి శంకరౌ చ జగతా మీశా వశా భక్తితః
తాతం వేంకట రామ పండితపరం, తద్భ్రాతరం పండితం
శేషాఖ్యం చ జగద్గురూస్మమ గురూ స్తత్త్వోప దేష్ట్రూవసి.
-
శేషాఖ్యం విబుధం పితృవ్యమపి మద్విద్యాగురుం, రాఘవా
చార్యం నౌమి షడ్గ వేద విదయాభిజ్ఞం యశో వారిధిం,
అన్యం వేంకటరామ నామక బుధం వందేగురుం జ్ఞానదా
మాచార్యానపి మల్లికార్జుననరో భక్తః మురారే రహం॥
(శ్రీ శాస్త్రిగారి ‘‘పాతంజలి భాష్యార్థం’’ మఱియు
‘‘వాసుదేవానందం’’ లో రచించినవి)
స్తుతి
-
ఘన వృక్షంబున నాకు లిన్నియని, రొక్కంబందు నాణెంబు లి
న్నని. ధాన్యంబున గింజ లిన్నియని ప్రత్యక్షంబు చూపించి - లా
లన మెప్పొందెడు నక్షవిద్యగల గొల్లాపిన్ని శ్రీమల్లికా
ర్జున శాస్త్రిన్ - భవబంధశస్త్రి ఋతుపర్ణుంబొలె కీర్తింపరే.
-
అనఘుండాతడు సత్రయాగమును చేయన్ వత్సరం బహ్లు త
న్మను తీర్థంబును పంచలేక యభిమంత్ర స్నిగ్ధతోయంబు వా
వి నిడన్ దాని గ్రహించి తీర్థ సమపావిత్య్రంబు కై సేసిరా
జనులే తచ్చరితంబు లన్న పరమాశ్చర్యంబు కల్గించెడున్.
(మహాకవి, కవితావసంత, శ్రీ గడియారం వేంకట శేషశాస్త్రిగారి
శ్రీ రఘునాథీయ మహాకావ్యంలో)
1. పరమగురువుల చరిత్ర
త్రికాలజ్ఞాని మహాయోగి - ’’గోల్లా పిన్ని మల్లికార్జున శాస్త్రి’’ సిద్ధయోగి పుంగవులు-
ఈ మహాత్ములు రాయపెద్ది అప్పాశేషశాస్త్రి (రిటైర్డ్ ప్రిన్సిపల్, ఆర్ట్స్ కాలేజ్ ఆదోని)గారి మాతామహులకు మాతామహులు.
పాత నిజాంరాష్ట్రం రాయచూరుజిల్లా అలుకూరు గ్రామంలో శ్రీవత్స గోత్రీకులైన గోల్లాపిన్ని అనే ఇంటి పేరున్న వైదిక బ్రాహ్మణులు ఉండేవారు. ఏడు తరాలకు పూర్వం మోటప్ప అనే ఈ వంశీకుడికి ‘వల్లెలాంబ’ అనే దేవత ప్రత్యక్షమై, బంగారు పలకా, బలపం ఇచ్చి, ఏడుతరాలవారు ఆ వంశంలో పండితులౌతారని దీవించింది. ఆ వంశంలో 1871 సం॥లో జన్మించిన వారే మన మల్లికార్జున శాస్త్రి. తండ్రి రామశాస్త్రి - తల్లి సుబ్బమ్మ.
నాలుగేళ్ల వయసులో వీథి బడికి పంపారు శాస్త్రిగారిని. ఆ సాయంత్రం పంతులుగారు ఈ బాలున్ని ఇంటికి తీసుకొని వచ్చి, తండ్రికి అప్పగించి, తనకు వచ్చిందంతా శాస్త్రి ఒక్క రోజులోనే నేర్చుకోన్నాడని ఇంకా తాను చెప్పవలసినదేమీ లేదని చెప్పాడు. అంతటి ‘బాల లీలా సరస్వతి’ మల్లికార్జునశాస్త్రి.
తండ్రి, పినతండ్రుల వద్ద నాటకాంత సాహిత్యాన్ని, తత్త్వబోధినీ వ్యాఖ్యతో కౌముది, న్యాయ వేదాంతశాస్త్రాలు నేర్చాడు. తండ్రి వెనక గద్వాల, వనపర్తి, ఆత్మకూరు సంస్థానాలు తిరిగి తన విద్యా వైదుష్యాన్ని ప్రదర్శించి ‘‘భారతీ బాల లీల స్వరూప’’ బిరుదు పొందాడు. జ్యోతిషం, భాష్యంత వ్యాకరణం ముహూర్త, జాతక, సిద్ధాంత రూప స్కంద త్రయ జ్యోతిషం గురుముఖతా నేర్చాడు. ఆనాటి జ్యోతిష పండితుడు విక్రాల రాఘవాచార్యులు ‘‘కన్నుస్వామి’’ అనే మారుపేరుతో Indian Ephemeris లో రాశాడు. ఆయనగారి అనుమతిపొంది మల్లికార్జునశాస్త్రి ‘‘10 వేల సంవత్సరాలకు సరిపోయే తిది, వార, నక్షత్ర, యోగ, కరణ, ఘటిక, విఘటికలకు సరైన ప్రమాణం ఉన్న ‘‘ఖచర మణిపేటి’’ అనే అత్యద్భుతమైన పంచాంగాన్ని తయారుచేశాడు. గురువు అనుమతి తీసుకొని ‘‘కాళహస్తీశ్వరాలయం’’ లో నిష్టగా కూర్చుని ‘‘శని అష్టవర్గు’’ వేస్తుంటే శనైశ్చరుడు ప్రత్యక్షమైనాడు. అలుకూరు తిరిగివచ్చి తాతగారివద్ద వేదాంత అధ్యయనంచేసి మొత్తం చదువునంతా 21 ఏళ్ళ వయస్సులోనే సాధించాడు.
ఈయన తమ్ముడు రామశాస్త్రి గొప్ప సూర్యోపాసకుడు, సూర్యోదయంనుండి మధ్యాహ్నం పన్నెండుగంటలవరకు రెప్పవాల్చకుండా సూర్యుని చూస్తూ ధ్యాన నిమగ్నమయ్యే వాడు. మల్లికార్జునిలానే ఈయనా త్రికాలజ్ఞాని.
మల్లికార్జున శాస్త్రి కడప, బళ్ళారి నగరాలల్లో అనేక ‘‘శతావధానాలు’’ చేశారు.
అనేక సంస్థానాల్లో తన పాండిత్య ప్రకర్ష చూపి ‘‘కవితాసార్వభౌమ’’ బిరుదు పొందారు.
ఆదిశంకరాచార్యుల జన్మస్థానం ‘కాలడి’లో శృంగేరి జగద్గురువులు ‘‘శ్రీనృసింహభారతీ స్వామి’’వారి ఆహ్వానంపై వెళ్లి జగద్గురువుల ‘‘శ్రుత్యంత గీతాల’’తో స్తుతిస్తూ తన్మయత్వంతో పాడుతూ ఉంటే వీరి బ్రహ్మాత్మానుభావాన్ని గుర్తించిన భారతీస్వామి అభినందించారు.
శృంగేరి స్వామి అనుజ్ఞతో తాను రచించిన ‘‘ఖచర మణి’’ గ్రంథాన్ని తెచ్చి అందులోనుంచి 2000 నాటి స్వాములవారు అడిగిన తిథికి పంచాంగ గణనం చేయమని సభాసదులను కోరారు. చాలా మంది చెప్పలేమన్నారు. కొందరు మూడుగంటల వ్యవధి కోరారు కానీ మల్లికార్జున శాస్త్రి ఇరవై నిమిషాలలో గణించి సరైన సమాధానం చెప్పి తన ప్రజ్ఞను రుజువు చేసుకొన్నారు. స్వామితో సహా అందరు ఆశ్చర్యపోయారు. జగద్గురువులు ‘‘పండిత సార్వభౌమ’’అనే బిరుదుతో సగౌరవంగా సత్కారం చేశారు.
‘‘ఉపాధి భేదం చేత మీరు అక్కడ మేము ఇక్కడ, మీరే మేము, మేమే మీరు’’ అని జగద్గురువుల చేత ప్రశంసలు పొందిన మల్లికార్జునశాస్త్రి ధన్యజీవి.
ఆయన సంస్కృతంలో ‘‘శ్రీవాసుదేవానందం’’ అనే అలంకారశాస్త్రాన్ని రాశారు. ఇది ఒక చిత్ర విచిత్ర కవితా భాండారం. అనేక కవితా బంధాలు అందులో ఉన్నాయి. అందులో బాగా ఆశ్చర్యపరచేది ‘‘సహస్ర దళ పద్మ బంధం’’ 1008 దళ పద్మాలతో అనేక శ్లోకాలు నిక్షిప్తమైన అపూర్వసృష్టి. ఇందులో 500 శ్లోకాలు, 16 ప్రకరణాలున్నాయి. అయితే ఇందులో నూరు శ్లోకాలున్న గ్రంథమే ముద్రితమైంది. దీనిని నలభై రోజుల్లో రాశారు. ఇరవై అయిదు వివిధ ఛందస్సులతో ‘‘పురుషోత్తమ శతకం’’ రాశారు.