శ్రీ పాణ్యం వాఙ్మయ నిధి పాణ్యం వంశ రచయితల సాహిత్యము

శ్రీ పురుషోత్తమ శతకమ్‌ › భాగము 5

భాగము 5

శ్రీ పురుషోత్తమ శతకమ్‌ · భాగము 5 / 5

తెనుగుసేత: నాకముజేసె మాధవుడు నమ్మిక జేయగ వేదకర్మలన్‌

    ఓకముగా సురాళికి, యథోక్తముగా నొనరించువారికిన్‌

    నాకమునోకము జేయుటది నైజముగాదె సురాళికిన్‌, స్వపా

    దైక శరణ్యులన్‌ దెలిసి దాటగ జేయు భవాంబుధిన్‌ దయన్‌.

శ్లో॥ శ్రితదయిత సురతరులతా

వదాన్యతా ప్రయుత గుణిత నియుత యుతా

తనురతనుత మహతాం హిత

మసితా,శుభదేవతా,మహితా.                   86

తాత్పర్యం: ఆశ్రితులకు కల్పవృక్షమనే విష్ణువు అగుణితమైన దానగుణము గలది.అణువు వలె సూక్ష్మము.నల్లనిది.మహీయమైనది.అందరూ కోరే

శుభస్వరూపము. తనభక్తులకు హితమును విస్తరింపజేయునది.

తెనుగుసేత: హితమును విస్తారముగా

నతభక్తులకిడు సురలత నల్లని దణువై

తతమహిమ గలిగి వేగమె

శ్రితులకు హరియను ఘనుండు చిరమగు పదమున్‌.

శ్లో॥ కారుణ్యామృతవర్షీ

విష్ణ్వాఖ్యః పాతు నీలజలదో-స్మాన్‌

ఊహ్యా యదురసి మాస్తన

కస్తూర్యస్తీతి పరిమళాదేవ.               87

తాత్పర్యం: సౌరభమువలననే కస్తూరిని దాల్చిన లక్ష్మీవక్షస్థలము సూచించబడును. అట్టి దేవినురమున దాల్చిన విష్ణువనెడి మేఘము మా పై కరుణను కురిపించును.

తెనుగుసేత: కరుణ గురిసెడి జలదము గాచు మమ్ము

    హరి యనబరగుచురమునన్‌ హత్తుకొన్న

    మృగమద పరిమళమిదె మించెననగ

    లక్ష్మి వక్షోజ శోభకు లక్ష్యమాయె.

శ్లో॥ దత్తాద్యోగం దత్తనామా ముకుందో

మూలాధారాద్వాయుముత్థాప్య మూర్ధ్ని

అథా యాక్షాణ్యంతరా కృష్య చిత్తై

కాగ్య్రా దాత్మానంద సింధౌ నిమగ్నః.           88

తాత్పర్యం: దత్తనామం గల ముకుందుడు, మూలాధారచక్రమునుండి సుషుమ్నా మార్గమున వాయువును పైకి వెడలించి సహస్రారమునుజేర్చి, హృషీకములను నియమించి, ఏకాగ్రచిత్తంతో ఆత్మానంద సముద్రమున మున్గి, మాకునునట్టి యోగమును ప్రసాదించు గాక.

తెనుగు సేత: మూలాధారము నుండి పైకెగసి, యామూలాగ్రసంక్షోభమున్‌

    వాలాగ్రమ్మున నిల్చి శీర్షమున నాపద్మాంతరంబందునన్‌

    జ్వాలారూప సుషుమ్న,శీతకరునిన్‌ స్పర్శించి సానందనై

    శ్చల్యాకారము నొందు దత్తగురుడిష్టార్థంబులన్‌ దీర్చెడిన్‌.

శ్లో॥ యస్స్వాం మాయాం శుద్ధ సత్త్వప్రధానాం

గృహ్ణన్నేతస్యా జగత్యా నిమిత్తం

స్వీయాం మాయాం  తామసీ మాదధాన

శ్చో పాదానం సో-వతా ద్వాసుదేవః.              89

తాత్పర్యం: శుద్ధసత్త్వప్రధానమైన మాయను గ్రహించి పురుషోత్తముడగు వాసుదేవుడు జగన్నిర్మాణమునకు నిమిత్త ఉపాదాన కారణములు తానై ధరించునో, ఆ ప్రభువు నన్ను రక్షించు గాక.

తెనుగుసేత: వాసుదేవుండు రక్షించు వదల కుండ

    శుద్ధ సత్త్వంబు తన మాయ చుట్టు గ్రమ్మ

    జగము సృష్టింప దనుదానె సాలె పురుగు

    వోలె, కారణములు రెండు పోగుబడగ.

శ్లో॥ పద్మాజానే సకల జగతాం స్వామినో దివ్యలీలాః

పుంసా భావ్యా శ్ళతమపి సహః ఇచ్ఛతా సాస్ను సౌఖ్యం

అజ్ఞాత్వైవం నఖలు యతతే మందధీ స్తత్క్రియాణాం

విజ్ఞో జ్ఞాత్వా -నిశమపి  ధియా భావయత్యేవ లీలాః.      90

తాత్పర్యం: జగత్పతి లక్ష్మీపతి దివ్యలీలలు మహాశక్తివంతములు. సుస్థిరసుఖం కోరే పురుషులకే సంభావ్యములు. మందబుద్ధులకు అవి భావింప నశక్యములు. విజ్ఞుడు మాత్రమే వానిని నిరంతరం భావింపగల్గును.

తెనుగుసేత: శక్తుడగున్‌,నిరంతరము శాశ్వతమౌ సుఖమున్‌ వరించు యా

    భక్తుడె, విష్ణులీలలకు పారమెరుంగగ, మందబుద్ధి సం

    రక్తుడు గాడు, చిత్తము రక్షకు మాధవు నిల్ప భావనన్‌,

    ముక్తిని గూర్చు నిద్దియె సమూలముగా హరణించి మౌఢ్యమున్‌.

శ్లో॥ పద్మాసనస్థ ధృతచక్ర గదాబ్జ పద్మ

పద్మోద్భవోల్లసిత కర్ణిక నాభి పద్మ

పద్మేశితు ర్భగవత స్తవపాదపద్మ

పద్మేక్షణస్యకలయే మమ చిత్త పద్మే.            91

తాత్పర్యం: పద్మాసనుండు,శంఖచక్రగదాపద్మధారి,పద్మోద్భవునిచే ప్రకాశించు కర్ణిక తోనున్న పద్మనాభుడు,పద్మకుభర్త,భగవంతుడగు హరి పాదపద్మములు నా హృత్పద్మమందు నిలుచు గాక.

తెనుగు సేత - సుగంధి:

పద్మనేత్ర పద్మనాభ పద్మనాథ చిత్తమన్‌

సద్మ మందు నిల్చి నాకు సత్తు చిత్తు సౌఖ్యమున్‌

పద్మపాద నిన్ను గోరి పాదముల్‌ భజింతు నే

పద్మహస్త నన్ను గావు పాప రాశి గాల్చుచున్‌.

శ్లో॥ యత్పాదాబ్జరజసా శిలావధూః

తస్య విశ్రుతగుణా రఘుప్రభోః

యస్య చేతసి న కుర్వతే ముదమ్‌

ధిన్మనో-స్య దృషదోపి కర్కశమ్‌.                   92

తాత్పర్యం: ఎవ్వని పాదధూళితో కర్కశశిల కమనీయకాంతగానైనదో, ఆ రఘురాముని ప్రసిద్ధ గుణములు ఎవని మనస్సును రంజింపజేయవో ఆ మూర్ఖుని మనస్సు శిలకన్న కఠినమైనది.

తెనుగుసేత: రాతి నాతిగ మారెను రామపాద

    రజము సోకిన క్షణమున,రక్ష సేయు

    విమల గుణసాంద్రు దగలని వెడగు మనము

    కఠిన శిలకన్న కఠినాతి కఠినతరము.

శ్లో॥ పాతు ప్రసిద్ధమహిమా

మహి మా నీలా ప్రియో మహాకుశలః

 కుశలవ తాతో-జనతో

జనతో దగ్రేష్టదో హరిర్భగవాన్‌.                   93

తాత్పర్యం:విఖ్యాతి చెందినమహిమలు కలవాడు, శ్రీభూనీలల మనోహరుడు, మహాకుశలుడు, కుశలవులతండ్రి, బ్రహ్మచే కొలువబడువాడు, భగవంతుడైన హరి ఉచితకామ్యములను తీర్చుగాక.

తెనుగుసేత: రక్షసేయును శ్రేష్ఠులు రంజిలంగ

    మహితకీర్తిని గల్గిన మాధవుండు

    నీల భూదేవి సహితుడై,నిత్య కృత్య

    మనగ రాఘవు డజనుతు డండ దండ.

శ్లో॥ యస్యాస్తి భక్తి ర్భగవత్యుపేంద్రే

స తత్ప్రసాదం లభతే, ప్రసాదాత్‌

జానా త్యసౌ సమ్యగుపేంద్ర తత్త్వమ్‌

తత్త్వావబోధాత్‌ న పతతే ద్భవాబ్ధౌ.               94

తాత్పర్యం: హరిభక్తి కల్గిన వానికి ఉపేంద్రుని కరుణ లభించును. ఆ కరుణా ప్రసారం వల్ల భగవత్తత్త్వమును గ్రహించగల్గును. ఆ తెలివిడి వల్ల సంసార సాగరమును తరించును.

తెనుగుసేత: హరిభక్తిన్‌ భగవంతు షడ్గుణములన్‌ యాధార్త్యరూపంబులన్‌

    పరమంబన్న మదిన్‌ గడిరతురు గదా భక్తావళుల్‌ దీక్షతో

    కరుణన్‌ శ్రీహరి గావగా నెఱిగి దా కైవల్యతత్త్వంబునున్‌

    చరజన్మంబిది యంచు దాటుదురు సంసారంబునున్‌ ధన్యులై.

శ్లో॥ అసితమహసావిష్ణోర్భూష్ణుః స్వతల్ప భుజంగ రా

డ్దశశతఫణాశ్రేణీ మాణిక్యభాస్వర శోణిమా

భయముపగత స్తూర్ణం స్థానం విసృజ్య సుదూరగః

కిల జలనిధేర్మధ్యే బుద్ధైవ బాడబ తాం దధౌ.         95

తాత్పర్యం: తనపాన్పుగా ఉన్న శేషునివేయిపడగలపైనున్న రత్నకాంతి,విష్ణువు యొక్క నల్లని దేహకాంతికి భయముజెంది వేరురూపమును దాల్చవలెనని తలచి, వెంటనే ఆ చోటు వదలి చాలాదూరము వెళ్ళి సముద్రమున బడబాగ్నిగా మారెను గదా.

తెనుగుసేత: తనతల్పంబుగనున్న శేషుని ఫణాద్రాఘిష్ఠమాణిక్యకాం

    తి, నిజాంగాసిత కాంతికిన్‌  భయము జెందెన్‌,వేగమే దూరమై

    తనరూపున్‌ దగ మార్పుజెందగ జనెన్‌ దా బాడబంబై సదా సంద్రమున్‌

    ఘనులన్‌ బోలగ జాలరే జడులు, సంఘర్షింపగా దల్తురే.

శ్లో॥ చరణస్మరణం విష్ణో

ర్నిర్వాణాభ్యుదయ కారణం కించ

అశరణ శరణం సుగుణా

భరణం భయహరణమితి జగుర్నిగమాః.             96

తాత్పర్యం: విష్ణువుయొక్క చరణస్మరణము మోక్షమునకు అభ్యుదయమునకు కారణము. అంతేగాక సుగుణాభరణుడైన ఆ శరణ్యుని శరణుజొచ్చుట భయహరణమని వేదములు చెప్పినవి.

తెనుగుసేత: వేదములు ఘోషలిడె గద విష్ణుచరణ

    స్మరణమపవర్గమునిడును, సంకటముల

    బాపుననుచు, చరణములు భవహరణము,

    లగణితసుగుణమణులౌను దిక్కు.

శ్లో॥ ప్రియా పద్మాలయా నాబ్జాదన్యత్ర స్థాతుమీహతే

ఇతి ప్రాయో హరి ర్మత్వా హృత్పద్మే కమలాం దధౌ.     97

తాత్పర్యం: తనకు ప్రియురాలైన పద్మాలయ పద్మముకన్న వేరైన చోట నిలువనిష్టపడదని తెలిసి కాబోలు,హరి కమలను తన హృత్పద్మమందే నిలిపెను.

తెనుగుసేత: సద్మము చేసెను విష్ణువు

    పద్మాలయకున్‌, మురిపెపు వలపున్‌ తనహృ

    త్పద్మంబున్‌, దాననిశము

    పద్మేతర వాసమునకు పద్మజ యొప్పదు ననుచున్‌.

శ్లో॥ కారుణ్య పీయూషరసం వమంతం

వక్త్రామృతాంశుం మమ దర్శయంతం

దురంతసంతాపలతా లవిత్రం

రథాంగపాణిం ప్రణమామ్యభీక్షం.                 98

తాత్పర్యం: కరుణామృతరసమును కురిపించుచున్న తన ముఖచంద్రుని నాకు కనిపింపజేయుచు,ఘోరమైన సంతాపమనెడి తీగలను ఛేదించు చక్రపాణికి నమస్కారము.

తెనుగుసేత: చక్రపాణి హరికి శతవందనములివె

    కరుణజిలికెడి ముఖకమలవైరి

    ఘోరపాపములను కూకటివేళ్ళతో

    నఱికి, గాచునట్టి నైష్ఠికునకు.

శ్లో॥ అక్ష్ణోః స్ఫుటం గోచరతాముపైతు

దీనస్యమే పుష్కరదృగ్దయాళుః

భక్త్యా ప్రణామైరపి మామకీనై

ర్ధ్యానైః స్తవైః ప్రార్థనయా-నయా చ.                  99

తాత్పర్యం: పద్మనేత్రుడు దయాళువైన ఆ వాసుదేవుడు నేను చేసెడి భక్తి ప్రణామములతోనైనను, లేకధ్యానములతోనైనను, లేక స్తోత్రములతోనైనను, లేక ఈ ప్రార్థనతో నైనను, నాకు ప్రత్యక్షమగుగాక.

తెనుగుసేత: ధ్యానము చేతగాని, నిధి ధ్యాసను చేతనుగాని, వేదనా

    నూన నిరీక్ష చేతను, మనోహరరూప దిదృక్ష చేతనన్‌

    మానని దీక్షతో జెలగు మౌనము చేతనుగాని, నేటి యీ

    గానము చేతనైన, హరి కన్నులకున్‌ దను గానిపింపడో!

శ్లో॥ అహ్నాయస్ఫుట దరవింద చక్షుషా మా

మీక్షంతాం భవరుగరుంతుదాః కటాక్షాః

లక్షణ్యాః సకల సుఖ ప్రదానదక్షాః

శ్రీ వక్షోరుహ సుమగుచ్ఛక ద్విరేఫాః.              100

తాత్పర్యం: లక్ష్మీదేవి వక్షోజములనే పూగుత్తులపై వాలెడి తుమ్మెదలు, సకల సుఖములను ప్రసాదించుటకు సమర్థములు, భవరోగములను ఛేదించునట్టివి, యగు హరి కటాక్షములు పగటివేళ విరిసిన పద్మములవలె మాపైప్రసరించుగాక.

తెనుగుసేత: శ్రీలక్ష్మీకుచపుష్పగుచ్ఛముల సుశ్రీకంబులౌ తుమ్మెదల్‌,

    మూలాజ్ఞానవిరోధముల్‌, సకలదుర్మోహాపహారుల్‌, శుభే

    చ్ఛాలాభాదికటాక్షవీక్షణములై సంతోషమున్‌ గొల్పుచున్‌

    లీలాలాలనదక్షముల్‌ గురియు దా లిప్సాసహస్రంబులన్‌.

శ్లో॥ లోకఖ్యాతాం నరహరి కృపా వైఖరీం వక్తుమేషా

సక్తా ప్యుక్తిర్మమ కథమిహా ల్పీయసీ స్యాత్సుశక్తా

జ్ఞాత్వా -ప్యేవం న హి విరమతి శ్రీమతశ్చక్రపాణే

రేతాదృశ్యద్భుతతర కృపావైఖరీ రక్షతా న్నః.         101

తాత్పర్యం: లోకఖ్యాతమైన నరహరి కృపావైఖరిని గురించి పలుకబూనిన నా వాక్కు, శక్తి వంతమైనప్పటికిని, ఇప్పుడేలనో చాలదయ్యెను. ఇది తెలిసికూడా నావాక్కు విరమించకున్నది. చక్రపాణియొక్క మహత్తరమైన ఇట్టి కరుణ మమ్ము రక్షించుగాక.

తెనుగుసేత: ఏమిది చిత్రమో పలుకనిప్పుడు రాదుగదా, భవత్కృపా

    సీమనుగూర్చి, మాధవ! విశేషమశేషమదీయశేముషీ

    భౌమము నీరుగారె హరి! బుద్ధి జనించదు, నాదువాక్కునన్‌

    తామసమయ్యదిన్‌ బొడమె, తత్కృప రక్షణ సేయు మమ్ములన్‌.

శ్లో॥ విష్ణుంవందే వారిభృత్సుందరాంగం

నానాభూషాలంకృతం నిత్యపూతమ్‌

క్షోణీ,నీలా సంగమోద్భూతరోషామ్‌

లక్ష్మీం గాఢాలింగనైస్తోషయంతం.                   102

తాత్పర్యం: మేఘమువలె సుందరాంగుడు,వివిధాభరణములచే అలంకృతుడు, నిత్యపవిత్రుడు, భూనీలలసంగమంతో రోషిల్లిన లక్ష్మిని గాఢాలింగనముతో సంతోషపెట్టువాడు అగు విష్ణువునకు నమస్సు.

తెనుగుసేత:- మధ్యాక్కర

నీలమేఘము బోలువాని, నిత్య పునీతుని హరిని

నీలను భూదేవి గూడి నిరుపమానందమొదవ, గ

నలిన లక్ష్మి ననునయింప, నర్మభాషణముల, కౌగి

లుల తోడ, మోదమున్‌ దేల్చు, లోకరక్షకుని నుతింతు.

శ్లో॥ దంతిరాజపరిపాలన దక్షమ్‌

తం సమీక్ష్య మునయః కమలాక్షమ్‌

మేనిరే స్ఫుటమభక్త విపక్షమ్‌

సర్వసేవక జనావన దీక్షమ్‌.                    103

తాత్పర్యం: గజరాజును పాలించుటయందు దక్షుడైన ఆ హరిని గాంచిన మునులు ఈ విధముగా తీర్మానించిరి. ఈ కమలాక్షుడు అభక్తులను శత్రువులవలె సంహరించును. సర్వసేవక జనులను రక్షించును.

తెనుగుసేత: గజము గాచినట్టి హరిని కమలనేత్రు

    గనుగొని మునులు చిత్తమున్‌ ఖాయపరచి

    రీతని నిజభక్తుల గాచు రీతి గనగ

    నబ్బురంబగు,దుష్టుల నణచుటయును.

శ్లో॥ కామితవరదం కరుణా

పూర్ణాంతఃకరణ మురుగణాభరణమ్‌

పురుషవరేణ్యం పుణ్యం

భజంతి తచ్చరణ భజనసరణి స్థాః.             104

తాత్పర్యం: కోరినవరములిచ్చువాడు, కరుణాంతరంగుడు, సుగుణాభరణుడు, పుణ్యుడైన పురుషోత్తముడు, ఐన హరిని తచ్చరణ భజన మార్గమందున్న వారు సేవించుచున్నారు.

తెనుగుసేత: పురుషోత్తముని హరిని దా

    నురుగుణ సమలంకృతున్‌,మహోత్తమున్‌,పుణ్యున్‌,

    చరణభజన సేయుదురా

    కరుణావరుణాలయున్‌,వికారదూరగున్‌.

శ్లో॥ వారాశిమధ్యశయితేన రమాధిపేన

సంరక్షితోస్మి న బిభేమి భవాబ్ధితో-హమ్‌

కింతు వ్రజామి భవవారినిధే రముష్య

పారం శుభం ద్రుతమనేన తు నావికేన.             105

తాత్పర్యం: సముద్రమధ్యమున శయనించియున్న రమాధిపుని చేత నేను రక్షింపబడినాను.భవసాగరమన్న నాకేమి భయము?విష్ణువనెడి నావికుడే నన్ను సంసారసాగరమును దాటింపగలడు.

తెనుగుసేత: క్షీరసాగరముననాదిశేషతల్ప

    శాయి, హరికిసేవకుడను జంకు లేదు

    భవజలధిని దాటగలను భయములేక

    నావికుండు హరియె గాదె,నన్ను బ్రోవ.

శ్లో॥ సకలేంద్రనీలశకల

ద్యుతి రతిధృతి రుత్తమః పురుషః

గోపాయతి గో పాయతి

గోపానితి కృష్ణమస్తువ న్మునయః.                   106

తాత్పర్యం: కళలతో గూడిన ఇంద్రనీలమణి కాంతికలిగినట్టి,మిక్కిలి ధైర్యముకల్గినట్టి, పురుషోత్తముడైన కృష్ణుడు గోపాలకుడై గోవులను కాపాడెనని మునులు స్తుతించిరి.

తెనుగుసేత: ధైర్యశాలి కృష్ణుండు గోధనము గాచె

    నీలమణి కాంతి నిగ్గులు నివ్వెరందు

    తనదు సంహనన సుషమ తళుకులీన

    ననుచు మునులు పొగడిరి యాహరిని మివుల.

శ్లో॥ శుభమరవిందనాభచరణాంబుజ సేవనతో

రaడితి లభేత పూరుష ఇతీశ్వర దివ్యగుణాన్‌

మురరిపు దేవసద్మసు కిలానిశ మార్యగణో

సమధిక దీక్షయా భజతి గాయతి తన్మయతః.           107

తాత్పర్యం: పద్మనాభుని సేవించుట వలన మానవులు వెంటనే శుభములు పొందగలరని ఆర్యులు విష్ణ్వాలయములలో పరమపురుషుని దివ్యగుణములను తత్పరులై గానము చేస్తూ కొలుచుచున్నారు.

తెనుగుసేత: క్షిప్రమె బొందగోరి హరిసేవఫలంబుగ క్షేమయోగముల్‌

    కప్రపు వాసనల్‌ విరియు కమ్రగుణాఢ్యుని మాధవున్‌ సదా

    విప్రతిపత్తిలేక ఘనువిష్ణుని దీక్ష వహించి రక్తులై

    విప్రులు గానముల్‌ జెలగ వీనులవిందొనరంగ గొల్వరే.

శ్లో॥ మల్లికార్జున నామో మే

సద్వచశ్చే ల్లసద్వచః

విష్ణుః ప్రసీదతు తరాం

వా స్తవైః స్వస్య వాస్తవైః.                      108

తాత్పర్యం: మల్లికార్జునాహ్వయుడనగు నా పలుకులు మంచివైన చో యధార్థమైన తన స్తోత్రములతో విష్ణుడు ప్రసన్నుడగుగాక.

తెనుగుసేత: మల్లికార్జున శాస్త్రి నామమమరగ,మ

    తల్లికావాక్కు తోడ నే తనియజేయ

    పొల్లుబోనివైన నుతులు పుష్టి గూర్చు

    నెల్లి స్వామి నాకు గరుణ నెడద నిల్చు.