శ్రీ పాణ్యం వాఙ్మయ నిధి పాణ్యం వంశ రచయితల సాహిత్యము

శ్రీ పురుషోత్తమ శతకమ్‌ › భాగము 4

భాగము 4

శ్రీ పురుషోత్తమ శతకమ్‌ · భాగము 4 / 5

    చవులొనరించు, శ్రేయమను చక్కనిదౌ మకరందమిచ్చి, దా

    నవిరళవాసియై కొలను నచ్చపుతెల్వి, ననంతశాయిగా

    సవిధమునున్న విప్రులకు సఖ్యము జూపుచు దాను వెల్గెడిన్‌.

తెలుగుసేత-2: సరసిజముల్‌ నవంబులవి సఖ్యము జూపవు చంద్రుతోడుతన్‌

    సరసములాడు షట్పదులసంగతి గోరును మోహమత్తతన్‌

    విరసముజూపుచున్‌ మధుపవిహ్వలహేతువులౌ విష్ణుపాదముల్‌

    శిరమున వెల్గుచున్‌ సుధలు చిప్పిలజేయును శాశ్వతంబులన్‌.

శ్లో॥ సదాముదాకదాపదారవింద మిందిరాపతే!

తవైవ వైష్ణవైః నవైః స్తవైః స్తుతం భవిష్యతి

ఇతీహమాన మాదరా దసౌ సుసార సారసా

భిమాన హృద్భి రీక్షణై స్సమీక్షతే న కిం ప్రభుః.           51

తాత్పర్యం: విష్ణుభక్తులు ‘‘ఓయీ! ఇందిరాపతీ! మేము ఎల్లప్పుడూ ఎడతెరపి లేకుండా ముదముతో నీ పదారవిందములనే నూతన వైష్ణవ స్తోత్రములతో స్తుతంపగలుగుదుము’’ అందురో అని కృపారసము ప్రసరించెడి కనుదమ్ములతో ఆ ప్రభువు నీరీక్షించుచునే యుండును.

తెలుగుసేత: వేచి చూచు విష్ణు వెపుడు విప్పు దమ్మి కనులతో

    కాచునట్టి సంద్రమంత కరుణ జాలువారగన్‌

    మెచ్చు కొంచు పాడగల్గు  మించు భక్త కోటికై

    అచ్యుతుండ! నీదు పాద మవన దక్ష మంచనన్‌.

శ్లో॥ శంఖచక్రగదాపద్మ శోభాతాః శ్రీహరేః కరాః

ఉపాయైః పాంతి సామాద్యైః చత్వారో భువనాన్యమీ.      52

తాత్పర్యం: శంఖచక్రగదాపద్మములతో శోభించు శ్రీహరి కరములు సామ దాన దండ భేద ములనెడి నాలుగుపాయములతో ఈ లోకములను పాలించు చున్నవి.

తెనుగుసేత: నాలుగు చేతులందొదుగు నాలుగు నాయుధముల్‌ ధరించి,తా

    నేలుచు నుండు విశ్వమును,నింపగు రీతిని బద్మనాభుడే

    పోలగ శంఖచక్రగదపుష్పము లెంతయొ నాల్గుపాయముల్‌

    వీలుగ సామదానములు,భేదము దండము నీతియంచనన్‌.

శ్లో॥ చరణౌ, సారస శోభా

పహారిణౌ, హీరహారిణౌ, భవతామ్‌

అఘహారిణౌ, వికుంఠే

విహారిణౌ హారిణౌ హరే శ్శరణౌ.                     53

తాత్పర్యం: పద్మములశోభను అపహరించేవి, రత్నహారములతో శోభించేవి, వైకుంఠమున విహరించేవి, మనోహరములైన హరిచరణములు శరణములగుచు పాపములను పరిహరించు గాక!

తెనుగు సేత: హరిచరణములు,వికుంఠ వి

    హరణములు,భవహరమున నవి శరణములౌ

    సరసిజ శోభా హరములు

    స్మరణము చేతనె మనుపును మరణ భయంబున్‌.

శ్లో॥ యద్విఖ్యాత యశః ప్రతాప విజితౌ శ్రీ పుష్పవంతౌ దృశౌ

యద్భూరిక్షమయా జితా వసుమతీ పాదద్వయం శ్రీమతః

తస్యేశస్య హరేః పురాణ పురుషస్యాయం స్తవో మంగళమ్‌

నిత్యం మే దిశతా ద్యత స్స భగవాన్‌ విష్ణు ర్జగన్మంగళం.        54

తాత్పర్యం: యశస్సుతో,ప్రతాపంతో, జయింపబడిన చంద్రసూర్యులు చూడ్కులై,క్షమాగుణంతో జయింపబడిన భూమి పాదములై న విష్ణువును ,జగన్మంగళ కారుని గూర్చి చేసే ఈ స్తోత్రము నాకు మంగళమునిచ్చుగాక.

విశేషములు: ‘‘భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే’’ అనెడి విష్ణు సహస్రనామ స్తోత్రధ్యానశ్లోక భావానికిది మనోహరమైన జోడిరపు. కీర్తితో చంద్రుని, ప్రతాపంతో సూర్యుని, సహనంతో భూమిని వశపర్చుకొని, తన నయన, పాద ద్వంద్వంగా మార్చుకున్న విష్ణువును గూర్చి చేసే స్తోత్రం మంగళప్రదం.

తెనుగుసేత: తరువోజ.3 ఇంద్ర, 1 సూర్య, 3 ఇంద్ర 1 సూర్య.

    యతిస్థానములు: 3,5,7 గణాద్యక్షరములు.

మంగళదాయకమౌనులే హరిని మంగళ రూపుని మానసాబ్జమున

మంగళమంచు సమంచిత రీతి మన్నన సేసెడి మాన్యభావమది

యంగములై శశి హంస ధారుణులు, నంబకముల్‌, చరణాంబుజంబులుగ

సంగతి నొందెను,శాసిత విష్ణు క్షమ,యశ,సుషమల శక్తుల తోడ.

శ్లో॥ లసంత్యౌ దరణీ పీఠే

శ్రీ కృష్ణా యమునే ఇవ

హృత్పీఠే లసతీ విష్ణోః

పాయాస్తాం చరణే సదా.                     55

తాత్పర్యం: భూపీఠంపై ప్రవహిస్తూ కృష్ణా యమునలు ప్రకాశించునట్లు, నాహృదయపీఠమందు కొలువై హరిచరణ యుగ్మము సదా రక్షించుచుండును.

తెనుగుసేత: ధరణిన్‌ బారుచు వెలుగు,ల

    హరులవి కృష్ణా యమునల హత్తిన బోల్కిన్‌

    హరి పాదయుగము వెలుగును

    నిరతము నా మనమునందు నిశ్చల దీప్తిన్‌.

శ్లో॥ సకలాభయదో మహానుపా

సక లాభప్రద ఈశ్వరో హరిః

వినతావన తత్పరో గురుః

వినతాసూను సువాహనో ?వతాత్‌.              56

తాత్పర్యం: అందరికీ అన్ని విధాల అభయమునిచ్చే మహాత్ముడు, ఉపాసకులకు లాభము చేకూర్చే హరి, తన భక్తులను రక్షించే గరుడారూఢుడు నన్ను కాపాడుగాక!

తెనుగుసేత: ఎల్లరకు నభయము నిచ్చు ఘనుడగు

    చుల్లమున్‌ దనిపెడు నుత్తము హరి

    యవన దక్షు డనగ నవనత శిరసుల

    వైనతేయతేజి వాసి కెక్కె.

శ్లో॥ హరిదంబర ఇష్టదో-స్తు మే

 హరిదంతర్బహి రుల్లసద్యశాః

వనమాల్యయ మీశ్వర శ్శ్రితా

వనమార్గైక కృతాదరో హరిః.                 57

తాత్పర్యం: పచ్చని వస్త్రములు కలవాడు, దిక్కుల లోపల వెలుపల ప్రకాశించు కీర్తి కలవాడు, వనమాలి, ఆశ్రితులను కాపాడవలెను నియమము కలవాడు నగు హరి నాకు వరదుడగు గాక.

తెనుగుచేత: పట్టుపీతాంబరంబును గట్టుకొనుచు,

    గట్టు లేనట్టి కీర్తితో ఘనత నొంది

    పట్టు బట్టెడి భక్తుల పట్టుగొమ్మ

    నట్టుగా నౌను వెన్నుడు నాకు సతము.

నట్టు-నివాసము

శ్లో॥ రమణీ రమణీయ విగ్రహా

సతతం శ్రీః పదయోర్యుగం హరేః

హృదయే హృదయేశితు ర్భజం

త్యతిభక్త్యా హృదయే-స్య రాజతే.                   58

తాత్పర్యం: రమణీయ మైన రూపం తో భార్య గా లక్ష్మి త న ప్రాణపతి హరి యొక్క పాదములను నిత్యము తన మనస్సు లో భక్తితో నిల్పుకొనుట వల్ల తానును ఆతని వక్షమునందే (హృదయమునందే) ప్రకాశించుచున్నది.

తెనుగుసేత: రమణి రమియించు మనమున లయము జెంది

    రమణు పదములు ధ్యానంబు రక్తి నిల్ప

    రమణి వెలుగొందు నెడదను రమణు తనియ

    రమణి రమణులు నద్వైత రసము గ్రోలి.

శ్లో॥ చతురా చతురాస్య శేముషీ

త్యలమేతద్విధినా యథేచ్ఛయా

పరిపుష్టమిదం జగద్ధరిః

పరిపాలీతి న కిం మహాద్భుతం?                  59

తాత్పర్యం: చతుర్ముఖుని బుద్ధి చాతుర్యాన్ని పొగడుట చాలు. ఇచ్చవచ్చినట్లు నాతడీ జగత్తును సృజించినాడు. ఈ అఖిల జగత్తును హరి పాలిస్తున్నాడు కదా. సృష్టించుటకన్నా పాలించుటే గొప్ప కదా.

తెనుగుసేత: చాలులే బొగడుట చాలు, చాతురి యని

    బ్రహ్మ కల్పమును గూర్చిన పలుకులేల

    కొకిబికిగ నున్న సృష్టిని కుదురుగ నడి

    పెడు హరి యొకడె ఘనుడగు,బెడద లేక.

శ్లో॥ సుమనస్సుమనః ప్రమోదకృత్‌

స్మృతిమాత్రా త్సకలేష్టదో హరిః

జగతామధిభూ ర్విలాసతో

జగతః పాతి విచిత్రమత్ర కిం?                  60

తాత్పర్యం: దేవతలకు, సత్పురుషులకు మోదము కలిగించువాడును, స్మరించినంతనే సకలాభీష్టముల నిచ్చువాడును జగత్ప్రభువైన హరి, సవిలాసముగ జగత్తును పాలించుననుటలో వింత ఏమున్నది?

తెనుగుసేత: జగదధిపుడునౌ విష్ణువు జగతిని పరి

    పాలనంబు సల్పు, దలచు భక్తుల కిడు

    నిష్టములను గోరిన రీతి, కష్టములను

    దీర్చి, గొనుచు భక్తులు జేయు నర్చనముల.

శ్లో॥ కోమలాంఘ్రియుగ సేవయా హరేః

కో మలాం తనుం అముష్య నేష్యతే

తత్పదాశ్రిత పదాగ్ర ధూళితో

ముక్తి ధామ్ని సతి హస్త చూతవత్‌.             61

తాత్పర్యం: హరి కోమలపాదసంసేవన వల్ల తన మల శరీరాన్ని అసహ్యించుకోనివాడెవడు? వాటినాశ్రయించిన భక్తులకు ఆపాదాగ్రధూళి యే ముక్తిని చేతిలోని మామిడిపండు వలె సులభముగా సిద్ధింపజేయుచున్నది.

తెనుగుసేత: సత్యసుందరకోమల సరసిజముల

    సేవజేసెడి భక్తుడి  కేవగింప

    గు తన కాయము గనకన, కుదురుకొనును

    కరతలామలకమగుచు కడపటిరవు.

శ్లో॥ సేవకచాతక జీవన

దాయీ నీలోవలాహకః కో-పి

స్మారం స్మారం భజతామ్‌

కస్మా దస్మాక మాశు న శరణ్యః                  62

తాత్పర్యం: సేవకులను చాతకము లకు జీవమును(నీటిని) ఇచ్చునట్టి అనిర్వాచ్యమైన నీలమేఘము (హరిని) తలచి తలచి భజింప నగును.అతడు మాకు శరణ్యుడేల కాడు?

తెనుగుసేత: శరణమాహరి యగు గాక మరణ రహిత

    పదము నిచ్చెడి వాడని ప్రస్తుతింప

    చాతకమునకు జలమును సంగ్ర హించి

    నోట బోసెడి జలదము సాటువనగ.

శ్లో॥ భాస్వన్నఖమణి శ్రేణీ ప్రణుమశ్చరణౌ హరేః

సద్వజ్ర లాంచితాచ్ఛేమ్ద్రనీలపీటే ఇవోజ్జ్వలౌ.         63

తాత్పర్యం:నఖములు వజ్రముల వలె ప్రకాశించెడి యా పాదములను నమస్కరిస్తాను.ఆ చరణములు వజ్రములు చెక్కిన ఇంద్రనీల పీటములా అన్నట్లు ప్రకాశించుచున్నవి.

తెనుగు సేత: తళతళ మెరయు నఖముల దలప నగును

    ఇంద్ర నీలపీఠము పైననింపెసగెడి

    వజ్రములుగ, హరి పదమౌ భాసమాన

    శోభితమనగన్‌, నిల్చును శుభము లొసగ.

శ్లో॥ పద్మే నేవార్చితం లక్ష్మీః పద్మహస్తా హరేః పదౌ

స్వహస్త కంకణ గణం ద్వోతయంతౌ స్వ కాంతిభిః         64

తాత్పర్యం:పద్మ హస్తములతో రమాదేవి హరిపాదములను అర్చించుచున్నది. అవి ఆమె చేతి కంకణములను నిజకాంతులతో ప్రకాశింపజేయుచున్నవి. అది ఎట్లున్నదంటే పద్మములన పద్మము తోపూజిస్తున్నట్లున్నది.

తెనుగుసేత: హరిపదకమలంబుల నర్చనంబుజంబు

    తోడ సేయునట్లుదోచె దొవరు జిగుల

    ప్రథమ కింకరి శ్రీదేవి పద్మహస్త

    కంకణంబులు వెలుగొంద గమ్రశోభ.

శ్లో॥ దెవపాళి సముల్లసత్‌ బహురత్నపాళి సమర్చిత

స్వచ్ఛపాద సరోరుహం కనకాంబరం పురుషోత్తమం

శ్రీధరం శరదిందుసుందర మందహాస మముం హరిం

వందిషీయ సునీలవారిదభాస మక్షి సుఖావహం.            65

తాత్పర్యం: దేవతాబృందము రత్నములతో పూజిస్తున్నారు హరి పాదములను. శ్రీధరుడు కనకాంబరధారి యై శరచ్చంద్రచంద్రికా సుందర మందహాసముతో, నీలమేఘఛాయతో కనువిందు చేసెడి హరికి నమస్కారం.

తెనుగు సేత: నతులర్పించెద దేవ! శ్రీధర! హరీ! నాకాధిపుండాదిగా

    నతులై దేవతలెల్ల బూజలిడగన్‌ నారాయణా యంచు,సం

    తతనీలాంబుదచాయతో మెరయుచున్‌ తారాధిపాశైత్యదృ

    క్తతి తోడన్‌ కనువిందు సేయుదువులే ధన్యంబు మా జన్మగా.

శ్లో॥ భుజగాధీశ శయాళుః

పరిపాలిత మాదృశాతి పతయాళుః

ప్రణతినత గ్రహయాళుః

పాయాన్మాం శౌరి రేష సదయాళుః.             66

తాత్పర్యం: పాపఱేని పై పవ్వళించువాడు, మావంటి పరిపాలితుల పక్షపాతి, వినమ్రుల స్తోత్రములను గ్రహించువాడు, దయాళువైన హరి మమ్ము పాలించుగాక.

తెనుగు సేత: శేషతల్పశాయి, మహిత చిత్స్వరూపి,

    భక్త కల్పతరువు, హరి, భయములేని

    బతుకు నొసగు దేవుండనవరతము, పరి

    పాలనంబుసేయు మనల పక్షమౌచు.

శ్లో॥ హరిమేకతాన మనసా

భజతే సద్యః శుభాని దదతే సః

కరుణార్ణవ పూర్ణరaరీ

తరంగ రింగణ సుమంగళ కటాక్షైః.             67

తాత్పర్యం: తదేకాగ్ర మనస్కుడై భజించు వానికి,కరుణాసముద్రములోని నిండు సెలయేటి తరగల నుండి దొరలు కరుణాకటాక్షములతో హరి వెంటనే

శుభముల నొసగును.

తెనుగుసేత: కరుణావరుణాలయమున

    తరగలుగ దొరలు కటాక్ష తైజస మూర్తీ!

    పరిణాహ రూప తమమును

    పరిమార్చుము హరి!యభయము వరముగ నిమ్మా!

శ్లో॥ అమర గురుణా విష్ణోః హృద్యానవద్య గుణావళీః

    కిల గణయతా--లోచ్యాలోచ్యాపి పరమజానతా

అమరగురుతా ప్రాప్తా వక్త్రాత్వనంత గుణాంబుధిః

హరి రితి మహోపాయాత్కిం వా స్త్యసాధ్య ముపాయతః     68

తాత్పర్యం: విష్ణువు యొక్క హృద్యములు, అనవద్యములు నైన గుణ గణములను లెక్కించుచు, ఆలోచించి ఆలోచించి అంతు కనుగొనలేక బృహస్పతి ‘‘హరి అనంత గుణాంబుధి’’ అని మహోపాయముతో పల్కెను. దాని ఫలితమే అతనికి అమర గురుత్వ ప్రాప్తి. ఉపాయమునకు అసాధ్యమేమున్నది.

తెనుగుసేత: అనవద్యంబులు విష్ణు సద్గుణము లంచా దేవతాచార్యుడే

    గణనంబున్‌ సలుపంగ లేక ,తుదకున్‌ గాద్గద్యకంఠోక్తి గా

    వినయంబొప్పగ బల్కె నీ విధముగా విష్ణుండు రత్నాకరుం

    డనగన్‌ దోచు గుణాళికిన్‌,ఫలితమే యాచార్యుడై వెల్గుటల్‌.

శ్లో॥ గిరాం దేవీ విష్ణోః అమలగుణజాలం గణయితుం

సముద్యుక్తా--రంభే సుశకమితి, మత్వాధ మహతి

అతీతే కాలే దుశ్శకమితి, పునశ్చాతి బహుళే

గతే-వాదీ విష్ణు ర్నిరవధి గుణానాం నిధిరితి.          69

తాత్పర్యం: సరస్వతీ దేవి హరి గుణములను లెక్కింప దలచి, సాధ్యముగాదని చాలాకాలమునకు నెఱంగెను.చివరకు విష్ణువు నిరవధిగుణనిధిగా ప్రకటించెను.

తెనుగుసేత: భారతి గోరె, మాధవుని భవ్య గుణంబులు లెక్కపెట్టగన్‌,

    భారము నయ్యె లే గణన బాధ్యత జూడగ రాను రాను,దా

    గోరిన రీతిగా నగుట గొంతెమ కోరిక యంచు దెల్సి,యా

    భారతి జెప్ప దొడ్గె,హరి భవ్యగుణంబు లనంతమంచనిన్‌.

శ్లో॥ మాహాత్మ్యం పరమేశ్వరస్య జగతాం స్రష్టావగంతుం హరేః

పూర్వం యత్నముపాయతః సకలయన్‌ కల్పాంత ముచ్చైస్తరామ్‌

అజ్ఞాత్వా కిల జోష మాప మురభిత్‌ తస్యాహ సత్సాహసమ్‌

వీక్ష్యాత్మావగతిం దదౌ భగవతః సేవావృధాస్యాత్కథం? 70

తాత్పర్యం: పూర్వము సృష్టికర్త యగు బ్రహ్మ భగవంతుని మాహాత్మ్యమును తెల్సుకొనుటకు కల్పాంతం వరకు యత్నించెను. కాని కృతార్థుడు కాలేదు. ఆతని నుత్సాహము గమనించి విష్ణువు స్వరూపావగతిని ప్రసాదించెను.భగవత్సేవ వ్యర్థమెట్లగును.

తెనుగుసేత: మును కల్పాంతము ముట్టు వరకున్‌ ముల్లోక నిర్మాతయే

    మనమున్‌ దల్చెను తీవ్రతాపమున యా మాహాత్మ్యమున్‌ గోరుచున్‌

    దన సాధ్యంబది కాదనంచు దెలిసెన్‌,దామోదరుండే దయా

    వనదక్షుండనగా నొసంగె నజుకున్‌ బ్రహ్మా నుభావంబునన్‌.

శ్లో॥ గోపాయః కుముదతమిందు ముకుంద వక్త్రే

దివ్యే కలానిధి తమో2పహ శబ్ద వర్ణ్యే

    ఇందుర్ముకుంద వదనేన తథాపి సామ్యం

    దోషాకరః కథముపైతి కళంకితశ్చ.                 71

తాత్పర్యం: శ్రీహరి ముఖము తో చంద్రుని సామ్యము కుదరదు కదా. ఇద్దరు కుముదకరులే యనుట కొంతవరకు వర్తించును.

ఎట్లన కు అంటే భూమి దానికి ముదము కలిగించువాడు హరి. కుముదము అంటే కలువ. దానిని వికసింప జేయును చంద్రుడు.

ఇంక దివ్య, కళానిధి పదములు ఇరువురికున్నా అన్వయించునది విష్ణువునకే. దివ్యం ఆకాశంలో ఉండేవాడు చంద్రుడు. కాని హరి ముఖము దివ్యతేజో విరాజితము. కళానిధి అన్నపదము అంతే.

నెలలో ఒక్కపూర్ణిమ రోజే కళలను కల్గి ఉంటాడు చంద్రుడు. ముఖ చంద్రుడైతే నిత్యము దివ్య కళ తో ప్రకాశిస్తాడు. ఇక తమోపహ శబ్దం వల్ల చంద్రునికిది పరిమితార్థంగానే ఉంది. హరి సమస్త అజ్ఞాన తమస్సును హరిస్తాడు.

చంద్రునికి దోషాకరుడు, కళంకితుడనే పేర్లున్నాయి. అవి ముకుందునకు అసలు వర్తించవు. దోషమ్‌ అంటే రాత్రి.

కళంకం అంటే మచ్చ. ఈ చర్చను బట్టి హరి ముఖమును చంద్రునితో పోల్చరాదని తేలుతున్నది గదా!

తెనుగుసేత: శశి, హరిముఖముల సామ్యము దలపగ

    నుచితంబనుటనెంత వంచితంబొ

    కుముద మోదకరులగుట యొకటె పొసగు

    దివ్యత, కళలందు తేలిపోవు

    తమమడిగించుటో దరిదాపులకు రాడు

    తారల చెలికాడు తత్పురుషుకు,

    దోషాకరుడును సంతోషమొదవజాల

    డనవరతము, సముడౌనె హరికి,

    నల్లమచ్చలె యొడలెల్ల నలుగు పిండి

    నెలకొకదినమె కళలన్ని నిగ్గు దేల

    వెలయు చంద్రుండు సముడౌనె విష్ణువునకు

    దలప రాదులె కలనైన దథ్యమిద్ది.

శ్లో॥ కృపామృత సరిచ్చల త్సలిల శీతలాపాంగ స

ద్విలోకన నిరస్త దుస్తర భవోష్మ భక్తావళిః

హరిస్సపది నృత్యతా దతుల తద్గుణాళీ మిళ

న్మదీయ హృది తన్ముదే యది భవే దిదం మమ వచః.        72

తాత్పర్యం: కరుణామృతప్రవాహంలో కదలాడేనీటి వలె చల్లని కడగంటి చూపులతో భక్తుల భవతాపమును పోగొట్టే హరి, నాస్తుతికి ప్రసన్నుడైనచో నా యంతరంగమందు వర్తించి నర్తించు గాక!

తెనుగుసేత: నర్తించున్‌ హరి యంతరంగమున సన్న్యస్తుండునై నిత్యమున్‌

    వర్తించున్‌ సురచక్రవర్తి ముదమున్‌ భాస్వంత రూపంబునన్‌

    హర్తుండై శరణార్థి తాపముల దా నవ్యాజమౌ ప్రేమతో

    పూర్తుండౌ కరుణాపగాచలిత సంఫుల్లంబునౌ దృక్తతిన్‌.

    (పూర్తం పాలనపూరణయోః ఇత్యమరః)

శ్లో॥ కమలా ప్రియస్య కమలాంచితే దృశౌ

జగదీశ్వరస్య జగదీప్సితార్థదే

భవతాం సుఖాయ భవతాం బుధాశ్చిరం

బహుశో ముదే బహు శోభనే మమ.                73

తాత్పర్యం: హరి జగదీశ్వరుడు కావున జగదీప్సితములను, కమలా ప్రియుడగుటవల్ల, కమలసన్నిభములైన కటాక్షవీక్షణములతో దీర్చును. బుధులకు మోక్షమునిచ్చును. ఆ వీక్షణములే బహుశోభనములై నాకుప్రియమును చేకూర్చుగాక!

తెనుగుసేత-మధ్యాక్కర:

కమలాప్రియుడగుటవలన,కమలసన్నిభములా దృక్కు

లమలములై,కరుణ గురియ ముదము నొందును బుధజ

నము,జగదీప్సితముల ననయము దీర్చు జగదీశుడుగ

సమ్మోదము నొందజేయు,శౌరి నాకు సుశోభతోడ.

శ్లో॥ ధత్తే వక్షసి తే పతి ర్భగిని! తేనేందుం కుతో భ్రాతరం?

స ప్రాయఃకుటిలః కళంక్యపి,తతః చింతామణిం నో కుతః?

చింతాం కోను వహేద్విచింత? ఇహతు శ్రీవత్సమంకం కుతో?

మద్వత్స స్స ఇతి ప్రియామణి వచః ప్రీతం నమామో-చ్యుతం.  74

తాత్పర్యం: భూదేవి,లక్ష్మీదేవి ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు.

భూదేవి: సోదరీ! నిన్ను భర్త వక్షమునందు వహించినాడు కదా.నీతో పాటే పుట్టిన చంద్రుని గ్రహించలేదేమి?

లక్ష్మి: వాడు కుటిలుడు.(వంకరగా ఉండేవాడు) అంతేకాక కళంకి కూడా.

భూదేవి: పోనీ చింతామణిని కూడా గైకోలేదే!ఏల?

లక్ష్మి: చింతే లేని వానికి చింతామణి (అంటే పెద్దచింత) ఏల?

భూదేవి: శ్రీవత్సమునేలగైకొన్నాడో?

లక్ష్మి: అది నా బిడ్డ కదా.

అనే లక్ష్మీదేవి వాక్చమత్కృతికి ప్రీతుడైన నచ్యుతునకు నమస్కారము.

తెనుగుసేత: ఎడదనుంచుకొనె నిన్నిట్లు కమల! మరి

    శశినెందులకు దోసె శౌరి యవల

    మున్నీటి తరగలు ముందుకు దోయంగ

    కొట్టుకొచ్చినవారె గట్టుజేర

    ఓయమ్మ! భూదేవి! ఉడురాజు కుటిలుండు

    మచ్చలు గల్గుట నచ్చలేదు

    చింతామణి వలదె?చింతలేని ధవుని

    కేలనో? శ్రీవత్స మేల గొనియె?

    నాదు వత్సమదియ గాదె?నా బలికెడి

    సవతుల సరస సల్లాప సరణి మెచ్చు

    నచ్యుతునకివె ప్రణతుల నంజలించె

    ద, మనమును జేర్చి, సుగతుల తతుల బొంద.

శ్లో॥ సత్యజ్ఞానమనంతమాద్య మచలం పూర్ణం సుఖం చేతి య

ద్బ్రహ్మోక్తం నిగమై స్తదేవ ఖలు తైర్విష్ణ్వాఖ్యయా భాషితం

తస్మాత్కోస్తి హి సంశయః శ్రుతిమతే బ్రహ్మైవ విష్ణుస్తదా

విష్ణు ర్బ్రహ్మ భవేదితీహ విషయే వేదాః ప్రమాణం యతః.       75

తాత్పర్యం: వేదములు బ్రహ్మమును సత్యం, జ్ఞానం అనంతం ఆద్యం పూర్ణం సుఖం అని పేర్కొన్నాయి. అట్లే విష్ణువనే పేరుతో కూడా పేర్కొన్నాయి. దీనిలో అనుమానమే లేదు. వేదమతానుసారం విష్ణువే బ్రహ్మము. బ్రహ్మమే విష్ణువు. దీనికి వేదమే ప్రమాణము.

తెనుగుసేత: నిగమములే ప్రమాణముగ నిత్యుని విష్ణుని బేర్కొనెన్‌ గదా

    యగునని, సత్యమై, మొదటిదై, సుఖరూపమనంతమై, సదా

    సగుణమునై, వెలింగెడిది, సత్పదమైనది బ్రహ్మమే యనిన్‌,

    నిగమ నిరూపితంబనుట నిశ్చయమౌ ఘన జ్ఞానరూపునిన్‌.

శ్లో॥ గోవిందపాదభజనామృత శాంతచిత్త

చాంచల్య దీర్ఘగద సేవక సంచయోగ్య్రాం

శ్రీవాసుదేవ మతిమేవ పఠన్నుపైతు

తూర్ణం మురారి కరుణార్ణవ మజ్జనాని.               76

తాత్పర్యం: గోవిందపాదసేవనమను నమృతముతో ఉపశమించిన చిత్తచాంచల్యం గల్గిన సేవక సంఘము, ముందుగా ఆవాసుదేవస్తోత్రమునే పఠిస్తూ, హరికరుణా సముద్రంలో మునుగుదురు గాక!

తెనుగుసేత: మతి చాంచల్యము దీర్ఘరోగమనెడిన్‌ మాటే వినంగ రా

    ము, తనున్‌ గొల్చెడి సేవకాళి కడ, దా మోహంబు బోగొట్టున

    చ్యుతు పాదంబుల బట్టుకోగలిగినన్‌, శోకంబు దాటంగ జే

    సి, తుదన్‌, తన్ను నెరుంగ జేయు, కరుణన్‌ శ్రీనాథుడే ప్రీతిమై.

శ్లో॥ అకర్కశమనోంబుజో భగవతో2చ్యుత స్యాశ్రయా

ద్యథా తదవలోకనం ద్రుతముపైతి నాన్యస్తథా

అయం భగవతో గుణో భవతి నైవదోషాయత

న్సమాశ్రయతి సంతతం మృదుమనా హరిం నా పరః.      77

తాత్పర్యం: మృదువైనమనస్సుగల సజ్జనుడు, భగవంతుడైననచ్యుతు నాశ్రయించి, తద్దర్శనభాగ్యము నొందును. ఇతరులకది సాధ్యము కాదు. ఇది భగవంతుని గుణమే కాని,దోషము కాదు.మృదుహృదయుడే హరినాశ్రయించును. పరుల శక్యము కాదు.

తెనుగుసేత: కోమల మానసుండె హరి గూడగ నర్హుడు సంశ్రయంబునన్‌

    దా, మది నిల్పగన్‌ బరులు దక్షులు గారు కఠోరచిత్తతన్‌,

    నీమము దప్పు నీచులను నిర్ఘృణుడై నశియింప జేసెడిన్‌,

    తామరసాక్షు సద్గుణము తా కరుణించుటె తత్పరులన్‌ సుమీ!

శ్లో॥ భూరాదీనా మధీశో భ్రమరవరరుచి,ర్భూరి భూభారహారీ,

భీరు త్రాతా శుభాంగో నిఖిలభువన సంభారభృ ద్భక్త భావ్యః

భోగా భోగ ప్రదాతా భుజగపతి మహాభోగ పీఠాధిరూఢ

శ్చాభీరాధీశ డిరభః ప్రదిశతు భగవాన్‌ భక్తి భాగ్యాదభీష్టమ్‌.       78

తాత్పర్యం: భూరాదులకు ప్రభువు, తుమ్మెద వర్ణం కలవాడు, గొప్పదైన భూభారాన్ని హరించేవాడు, ఆర్తత్రాణపరాయణుడు, శుభాంగుడు, శేషతల్పశాయి, గొల్లల రాజైన నందుని కుమారుడు అగు భగవానుడు, భక్తిభాగ్యమైన కోరకలను తీర్చుగాక.

తెనుగుసేత: భువనములన్నిటిన్‌ తనదు బొజ్జనిడెన్‌, భువిభారమున్‌ హరిం

    ప, వనజనేత్రుడే యురగ పాన్పును వీడెను, భోగభాగ్యముల్‌

    ప్రవరుల భక్తులన్‌ దనివి వారగ నిచ్చును, భ్రామరీ రుచిన్‌

    ప్రవిమల దేహకాంతి బరిభావన జేసెను, గొల్లపిల్లడై.

శ్లో॥ దేవేశేశ్రీనివాసే? ఖిలజగదధిపే సర్వయోగీంద్ర సేవ్యే

నిర్ణిద్రం మన్మనో-బ్జే విలసతి సతి తద్వీక్షణేన ప్రఫుల్లే

హిత్వా తత్పాదసేవా మహమతిశుభదా నింద్రియార్థాన్న కాంక్షే

క స్త్యక్త్వా గాంగమంభో నికటగ ముదకం క్షారమీహేత విజ్ఞః.       79

తాత్పర్యం: అఖిల జగదధిపతి,యోగీంద్రుడు, దేవేశుడైన శ్రీనివాసుడు తన చూపుతోనే వికసించిన నా మనఃపద్మమందు జాగరూకుడై వెలుగుచున్నందు వల్ల, అతి శుభప్రదమైన ఆతని పాదసేవను వదలి ఇంద్రియవిషయములను కోరను. వివేకి సమీపముననున్న గంగోదకమును విడిచి, ఉప్పు నీటిని గ్రహించడు కదా.

తెనుగుసేత: కోరను నేను తుచ్ఛమగు గుత్సిత లౌకిక మింద్రియార్థముల్‌

    కోరెద శ్రీనివాసుని సుకోమలపాదనవాంబుజంబులే

    మీరిన భక్తితో గొలువ,మేల్కొని వెల్గెడి యోగివంద్యుడే

    చేరెను నా హృదంతరము,చింతన సేయగ నిత్యభావనన్‌.

శ్లో॥ అమందరస సుందరై రమరబృందమానందతః

సదా సుగుణవారిధిం మృదువచో భరైః స్తౌతి యం

స్తవీమి మధుసూదనం మధురభాషితై స్సో?చ్యుతో

మమ స్తుతిభిరస్తు మే స్వపద భక్తితో వస్తుతః.          80

తాత్పర్యం: దేవతలందరు ఆనందంగా రసభరితమైన మృదువాక్కులతో ఎవరిని స్తుతింతురో,నేను గూడా ఆ మధుసూదనుని స్తోత్రము చేస్తాను.ఆనందించిన హరి నాకు తనపాదభక్తినొసగును గాక.

తెనుగుసేత-మధ్యాక్కర:

సుందరసూక్తుల గొలచి సురవరులందరు నిలిచి

చిందిన భక్తిన్‌ మెలగుచు శ్రీకరు మాధవు దలచి

పొందిన తన్మయ మరసి పొల్పుగ నిలుపుచు తనిసి

నందిత వందన శతము నైవేద్యము ననగ నిడుచు

నిందిరా రమణుని పదము నింపొసగగ నింపు కొంచు

మందిరమను మానసంబు మహిత మౌనము నందగింప

జెందెద సుగుణ సాంద్రునిని చిరమగు పదమని దలచి.

శ్లో॥ పద్మాదార పదారవింద యుగళప్రేమప్రవాహో దృఢో

భక్తిస్స్యాద్యది సాస్తి శౌరి రవతీ త్యాచక్షతే పండితాః

సా మే నాస్తి దురాత్మనో?పి తు స మాం గోపాయతీశో న చేత్‌

వాజ్ఞ్మే గాంగరaరాయతే కథమతః స్మృత్యైవ గోప్తా హరిః        81

తాత్పర్యం: శ్రీపతిపాదారవిందములందలి దృఢమైన ప్రేమప్రవాహమే భక్తి. ఆ భక్తి గల్గినవారినే హరి రక్షించును.దురాత్మునినైన నాకు భక్తి లేనప్పటికీ హరి నన్ను రక్షించుచున్నాడు. లేకున్న నావాక్కు గంగాప్రవాహము వలె నెట్లుండగలదు? తలచినంతనే హరి కాపాడును గదా!

తెనుగుసేత: సడలని ధారగా జనుచు, సారసనేత్రపదారవిందముల్‌

    విడువని ప్రేమ భక్తి యగు,విష్ణువు రక్షణ సేయు భక్తునిన్‌,

    తడయక గాచు నన్‌, హరియు త్రాష్ఠుని సాక్ష్యము నిద్దియే గనన్‌

    తడబడ కుండ సాగుగద! తత్పదస్తోత్రము నాదు వాక్కునన్‌.

శ్లో॥ కర్తవ్యం హరిభజనం

జనేన సుఖమిచ్ఛతా సఖే?న్యద్వా

యస్సుఖదో నిత్యసుఖీ

కిం సేవ్యః స ఉత తదితరో వద మే.               82

తాత్పర్యం: స్నేహితుడా!సుఖముగోరువారికి హరిభజనమే శరణ్యము.ఆతడే నిత్యసుఖము గలవాడు సుఖప్రదాత యు నాతడే. హరికంటే సేవింపదగిన వానిని మరొకనిని జూపుము.

తెనుగుసేత: సుఖమునొంద హరిభజన సుకరమనుట

    దబ్బ రగునె? మిత్ర! మితముదమును గూర్ప

    నెరుగు,నిత్యసుఖియతడె,యిచ్చు సుఖము.

    నితరులెవ్వరు సేవింప? నింగితజ్ఞ.

శో॥ కేచిచ్ఛ్రీదయితం వదంతి విబుధాః నీలాంబుజన్మోపమమ్‌,

కేచి ద్వాసవనీలఖండ సదృశం  నీలాంబుదాభం,పరే

వక్ష్యామస్తు వయం హరిం ప్రియసముద్వీక్షోత్సుక శ్రీసతీ

నీలాపాంగసమం యతోయమసిత స్తన్నైల్య సంగాద్విభుః.        83

తాత్పర్యం: లక్ష్మీపతిని కొందరు నల్లగలువతో,మరికొందరు ఇంద్రనీల శకలముతో, ఇంకొందరు నీలమేఘముతో పోల్చిరి. కానీ నేనే మందునన్నచో శ్రీదేవి కాటుకకంటినుండి వెల్వడు గాటంపు చూపులలోని నల్లదనమంటుకొని హరి నల్లనివాడైనాడు.

తెనుగుసేత: కారణమిద్దియంచు సరిగానకబోయి హరిన్‌ గురించి,దా

    గోరినయట్లు పోలికల గూర్చుచునుందురు వేత్తలెందరో,

    కారుమొయిళ్ళు, నింద్రమణికాంతులు, నల్లని గల్వలంచు, నే

    దీరిచెదన్‌, కనుంగవ సుదీర్ఘముగా వెడలించు నైల్యమే

    పారెను వంటినిండ, హరి వర్ణము నల్లగజేసె లక్ష్మిదే.

శ్లో॥ అయమస్తు వాసుదేవః

సుఖాయ మమ శాశ్వతాయ గురుః

అభయద హస్త చతుష్టయ

లసద్రథాంగాంబురుహ గదా కంబుః.             84

తాత్పర్యం: తన నాలుగు చేతులలో శంఖచక్రగదాపద్మములను ధరించి అభయప్రదుడై వాసుదేవుడు గురుడై నాకు శాశ్వతసుఖమునొసగుగాక!

తెనుగుసేత: నాలుగు కరముల నమరు, నైజములగు

    నాయుధములు, గదయు చక్రమంబుజమును

    శంఖమును గూడి, దీర్చుచు శంకలన్ని

    గురుడు, వాసుదే వుండొసగుత సుఖములు.

శ్లో॥ దివమమరనికాయః ప్రాప్య ధర్మై ర్యదుక్తెః

ప్రదిశతి నిగమోక్తాచారశీలేభ్య ఏతామ్‌

స నిజచరణసేవాసక్త చిత్తాంబుజేభ్యో

న దిశతి కథమీశః స్వావబోధం ముకుందః.           85

తాత్పర్యం: తనచేత బోధించబడిన వేదధర్మాచరణము వల్ల దేవతలు స్వర్గనివాసమునొంది, తదనుగుణవర్తనులకూ స్వర్గఫలమునిచ్చెదరు.తన చరణములనే ధ్యానించు భక్తశ్రేష్ఠులకు హరి తన్నునెరుగు జ్ఞానమును తప్పక ప్రసాదించును.