ముక్కంటి తలపువ్వు మొగము తోడ
వేడిన బ్రోచెడి యడుగు దమ్ములతోడ
తోరంపు కలువ కందోయి తోడ
కలుముల జవరాలి యలరెడి యెదపైన
గీసిన మకరిక గీత తోడ
కలసి, వెలుగుచున్న కఱివేల్పు తమితోడ
వెడద కస్తురి రొంపి యెడద తోడ
తోడగుచు నెడపక దోవల వెంబడి
తడబడక నడకల దగులు కొనుచు
తొలిచదువుల తుదలతొయ్యలితలమాని
కమన నన్ను గాచు క్రచ్చు దీర్చి.
శ్లో॥ శరత్పీయూషాంశు ప్రవిలసదశేషాంశు సుషమా
విశేషోన్మేష శ్రీముష ఇహ హృషీకేశ యశసామ్
ప్రసారా స్తస్యైవాంబుధి తనయాశ్లిష్ట వపుషో
ముదే సంవర్ణ్యంతే జగదధిపతేః కేచిదధునా. 16
తాత్పర్యం: హృషీకేశుని కీర్తికాంతి ప్రసారములు శరదృతువు నందలి చంద్రుని అశేష శోభను ధిక్కరించుచున్నవి. ఆ సిరికౌగిటిలోని జగదధిపతి అనంత కీర్తి ప్రసారములలో కొన్ని మాత్రమే ప్రకృతము వర్ణింపబడుచున్నవి.
తెనుగుసేత: కీర్తన సాధ్యమే యలఘు కేశవు విస్తృతవ్యాప్తమైన యా
కీర్తిని గూర్చి? యీ కొలది ,కేలును మోడ్చుచు సేయగల్గుదున్,
కర్తనసేయుగాదె శశికాంతిని సాంతము విష్ణుతేజమై
భర్తగ లక్ష్మికౌగిటిన బందిగ నుండు జగత్పతంచునే!
శ్లో॥ అవశ్యం వర్ణ్యా స్సత్పురుషహృదయార్ణోజ మిహిరా
జయంతి శ్రీవిష్ణో రమితయశస స్సద్గుణగణాః
త్యజం స్తాన్మూఢోయః కృపణనృపతీ న్వర్ణయతి సః
క్షరోక్తిః క్ష్వేళం భక్షయతి విసృజన్ క్షీరమమలం. 17
తాత్పర్యం: విష్ణుమూర్తియొక్క సద్గుణ సమూహములు, సత్పురుషుల హృదయపద్మములకు సూర్యుని వంటివి. అవి అవశ్యముగా వర్ణింపతగినవి. ఏ మూఢుడు వానిని వర్ణించుట మాని, దరిద్రులైన రాజులను వర్ణించునో, వాడు తన పలుకులను తానే నశింపజేసుకొనును. స్వచ్ఛము పుష్టికరమైన క్షీరమును విడిచి, ఆత్మహానికరమగు హాలాహలమును గ్రోలువాడగును.
తెనుగుసేత: సద్గుణశోభితున్ హరిని,సత్పురుషోత్తమ మానసాబ్జ భా
స్వద్గుణ జృంభితున్,విడిచి షండుల రాజులగూర్చి యూరకే
యుద్గతి స్తోత్రముల్ సలుపు నున్మదచిత్తుల మాటతీరు లే
సద్గతి నొంద నేరవు,విషమ్మును గ్రోలుటె క్షీరవర్జియై.
శ్లో॥ సాంగైర్వేదచతుష్టయై రపి కిలాలభ్యం హరేర్యత్పదం
తద్భక్త్యా సులభం భవేద్యత ఇదం శ్లాఘ్యం గరీయం తపః
క్షీరాన్నై ర్బహుమోదకైరపి కిలాలభ్యం చిరంజీవితాం
స్తోకేనా ప్యమృతేన కిం నలభతే చిత్రం కిమత్రేష్యతే. 18
తాత్పర్యం: విష్ణుదేవునియొక్క పరమపదము షడంగములతోడి వేద చతుష్టయముతో కూడా లభ్యముకాదు కదా. అనన్యభక్తితో అత్యంత సులభమగుటతో భక్తియే గొప్పతపస్సగుచున్నది. ఎట్లనగా పరమాన్నాది బహుభక్ష్యములతో లభ్యము గాని అమరత్వము కొంచెం అమృతం సేవించిన మాత్రమే లభించును గదా.
తెలుగుసేత: హరిపదమున్ బరమ్ము బడయన్ వశమే నిగమాదిమార్గమున్
హరిపదభక్తి చిత్తమున హత్తిన జాలు,రమాధవున్ గనన్
సురుచిర భక్ష్యభోజములు చోష్యములిచ్చునె స్వర్గవాసమున్?
సురలకు లభ్యమౌనటుల, సుంతసుధాశనమాత్రమే గనన్.
శ్లో॥ జయంతి శ్రీపతే లోకపాలపాలస్య కీర్తయః
వాసుదేవస్య సత్ప్రజ్ఞా చకోరీ చంద్ర రశ్మయః. 19
తాత్పర్యం: వాసుదేవుడు సమస్త లోకపాలకులకు యధిపతి. లక్ష్మీదేవికి ప్రాణపతి. ఆ దేవుని కీర్తిప్రసారములు సత్ ప్రజ్ఞ యనెడి చకోరాంగనకు చంద్రకిరణములై విజయమొందును.
తెలుగుసేత: సత్యపుప్రజ్ఞ యంచనెడి చందురువెల్గుపులుంగుదేవినిన్
శైత్యపు చంద్రికై దనుపు స్వచ్ఛపు యచ్చపు కీర్తిగల్గు యా
నిత్యుకు, దేవదేవునకు, నిష్కలుషాత్మకు, విష్ణుమూర్తికిన్,
భృత్యులు దిక్పతుల్, జయము బృంహితమౌను రమేశుకున్‌సదా.
శ్లో॥ శ్యామలకోమల నిర్మల దేహమ్
సుశ్రుతవిశ్రుత మాశ్రిత పాలమ్
వల్లవ తల్లజ ముల్లసితాంగమ్
ముక్తిద భక్తి యుతోక్తిభి రీళే. 20
తాత్పర్యం: ఆస్వామి నిర్మల దేహం శ్యామలకోమలం.ఆయన ఆశ్రిత పాలకుడు. గోపాలశ్రేష్ఠుడు. ఎఱుకగల వారందరి చేత ఎఱుగబడిన వాడు. ఆమిసమిసల మేని వెన్నుని ముక్తినిచ్చు భక్తిసూక్తులతో నుతించెదను.
తెనుగుసేత: సుగంధి:
నిర్మలంబు కోమలంబు నీరదాచ్ఛ శ్యామలా
ధర్మవర్ణ శోభితంబు,దాసత్రాణ దక్షమై
కర్మదేశకాలబద్ధకక్ష్యలంఘనంబదే
శర్మ దంబు నంచు నేను శౌరి నిన్ నుతించెదన్.
శ్లో॥ స్తవ్య ఏష నృహరి ర్న కిమీశో?
న స్తువంతి నిగమైః కిమజాద్యాః
అస్య కిం న మహిమా శ్రుతిషూక్తః
కిం మృషాస్యుః రమలాః శ్రుతి వాచః? 21
తాత్పర్యం: బ్రహ్మాదిదేవతలీ హరిని వేదవాక్కులతో స్తుతించిరి గదా! వేదములందీ మహనీయుని మహిమలు చెప్పబడినవి గదా! అమలములగు నాశ్రుతివచనములు అబద్ధములా? ఆ నరహరి వాసుదేవుడు బాగుగా స్తుతింపదగినవాడు.
తెనుగుసేత: మృషలె బ్రహ్మాదులొనరించు మిహిరకోటి
తేజు నృహరి మహిమలవి?తృప్తి దీర్ప
గలవె? నుతిసేయవలె దప్పక హరిని ఘను
వేద వాక్కుల తోడ సంవేద్యు ననఘు.
శ్లో॥ దేవా స్సంతు పరస్సహస్రమపరే లోకేషు లోకాధిపాః
కిం స్యా ద్భంగురభోగపూగపదవీ మాత్రప్రదై స్తై స్సుఖం
స్తోష్యే సర్వజగన్నివాస మభిత స్తోఘాయమానం సురైః
తై రేవాభిమతార్థ సిద్ధయ ఇమం శంభో స్సఖాయం హరిః. 22
తాత్పర్యం: లోకంలో వేర్వేరు లోకాధిపులైన వేల్పులు వేలకొలదున్నారు. క్షణభంగురములైన భోగపదవులనిచ్చు వారితో నేమి సుఖము? ఆ దేవతలే తమ అభిమతార్థసిద్ధి కొరకు శంభునికి సఖుడు, సర్వజగన్నివాసుడగునే హరిని స్తోత్రము జేయుదురో, ఆస్తోత్రములతోడనే నా కోరికలు దీరుటకు నేను స్తుతింతును.
తెనుగుసేత: లేరే వేల్పులు క్షుద్రకామ వరదుల్ లెక్కింపగా నెందరో
వారే స్తోత్రములన్ సదాశివుసఖున్ వైకుంఠునిన్ మెత్తురో
నీరేజాక్షు నభీప్సితంబు లొదవన్ నేనట్టి స్తోత్రంబులన్
దారేదీ నిది దప్ప లేదనుచు దామోదరున్ వేడెదన్.
శ్లో॥ సంతు దేవనిచయా బహవో-న్యే
విష్ణు మీశ మనిశం హృది సేవే
సేవితే సతి హరౌ సురసంఘా
స్సేవితే స్స్యురఖిలా అఖిలేశే. 22
తాత్పర్యం: దేవతల సమూహములెన్నో ఉన్నా నేను హరినే సేవిస్తాను.అఖిలేశుడైన హరిని సేవించడం వల్ల దేవతాసంఘములన్నీ సేవించబడినట్లే యగును.
తెనుగుసేత: సేవించిన నేమి ఫలమొ
గావించునొ దేవతాళి కన్గొన దానిన్
సేవించిన హరి యొసగును
సేవింతును నెడద యందు శ్రీపతి భక్తిన్.
శ్లో॥ సేవయా-స్తి ఫలమస్య హరేర్యత్
సేవయా-స్తి కిమశేష సురాణామ్?
సేవయా-స్తి యదశేష సురాణామ్
సేవయా-స్తి ఫలమస్య హరేస్తత్. 23
తాత్పర్యం: ఈ హరిసేవతో ఏ ఫలము కలదో అది అది సమస్తదేవతలను సేవించినా కల్గుతుందా? (కల్గదు) అశేషదేవతల సేవతో ఏ ఫలం కల్గుతుందో ఆ ఫలం హరిసేవ వలన కల్గుతుంది.
తెనుగుసేత: హరిసేవాఫలమందన్
సరిదూగుదు యా సురాళి సంసేవనమున్
శరణార్థులెసురలందరు, హరిపాదములాశ్రయించి నందుదు ముక్తిన్.
శ్లో॥ సేవయా దృఢమముష్య మురారేః
యద్యదిచ్ఛతి ఫలం తదశేషమ్
ఆశు సిద్ధ్యతి తథా శృతి వాచో
అఘోషయన్ కిమితర ద్బహువాచ్యమ్. 24
తాత్పర్యం: ఎవడు ఏఏ ఫలమును గట్టిగా కోరునో,అది మురారి సేవవల్ల సిద్ధించును అని వేదము ఘోషిస్తున్నది కదా.ఇంతకు మించి చెప్పడానికేముంది. (ఏమీలేదు)
తెనుగుసేత: కోరిన కోర్కుల దీర్చగ
మారని భక్తిన్ దనంత మాధవ సేవే!
వేరొక టేదీ లేదని
బోరన వేదము పలికెను బుడతని కైనన్.
శ్లో॥ మనస్స్యాన్నిర్మలం విష్ణు
సేవయా ధౌతవస్త్రవత్
భాత్యాత్మా నిర్మలే చిత్తే
నిర్గతాభ్రేం బరేర్కవత్. 26
తాత్పర్యం: విష్ణుసేవవలన శుభ్రపరచిన వస్త్రము వలె మనస్సు నిర్మలమగును.నిర్మలమైన మనస్సులో, మేఘములు తొలగిన ఆకాశమునందు సూర్య బింబము వలె ,ఆత్మ ప్రకాశించును.
తెనుగుసేత: త్రిపద.
హరిని సేవించిన హరియించి పాపంబు
చేకూర్చు సతతము చిత్తశుద్ధి
శుద్ధ చిత్తమునందు సూర్య
బింబము వోలె గన్పించు నాత్మస్వ
రూపావగతిగ నిర్ధూత మేఘ
మైనట్టి యాకస మందు.
శ్లో॥ తుష్టూవు స్సుగుణాన్ హరేః వురుగుణార్ణోధే ర్గమిష్యామ్యహమ్
మందాత్మా పదవీం వృథా విమనసాం హం తాపహాస్యాస్పదామ్
అస్త్వస్త్వత్రతు మేస్తి న క్షతి రపాస్తాశేషదోషోత్కరో
ధీరోదాత్తవిభుర్యల్ప మతిభిః విష్ణుః ప్రసీద త్యయమ్. 27
తాత్పర్యం: నేను నామందమతితో అనంతగుణసముద్రుడైన హరి సుగుణములను నుతింపబూని, చేతగాక, పగతుల పరిహాసమునకు గురైనాను కదా! కానీ దానితో నాకేమీ క్షతి (వినాశనము) లేదు, రాదు. ఏలన అశేష దోషరహితుడు ఆ పురుషోత్తముడు నా అల్పస్తుతులకే ప్రసన్నుడగును.
తెనుగుసేత: మందుడనై ననంతగుణమండితు మాధవు సద్గుణంబులన్
వందనమంచు కీర్తనల బాడగ లేక, పరాళిచేతిలో
బొంద పరాభవంబు, నది భూషయె,యల్పపు స్తోత్రముల్ వినన్
నందిత చిత్తుడై హరి,యనంతుడు నాకు ప్రసన్నుడయ్యెడిన్.
శ్లో॥ కచ్చరమపి చిత్తం హరి
సచ్చరణాశ్రయతో భవేత్పూతమ్
తచ్చ లభేత నరో హరి
సచ్చరితామృత నదీవగాహేన. 28
తాత్పర్యం: చెత్తకుప్పవంటి చెనటి చిత్తము గూడ శ్రీహరి చరణ సరోజ సమాశ్రయముతో పరమపవిత్రముకాగలదు.నరుడు మురహరి చరితామృత సరిదవగాహనమున దానినందుకో గలడు.
తెనుగుసేత-1- మధ్యాక్కర:
దుర్భావ దూషిత వికల దోషజుష్ట మనమునైన
నిర్భర రీతి మలచును నిర్మల మగునట్లు,నర్మ
గర్భిత పరిహాస శీలు,కమలా కుచాంకిత కుంకు
మార్భాట వక్షు సుచరిత మందాకినీ మున్క యొకటె.
తెనుగుసేత-2: చెనటి చిత్తమైన శ్రీహరి చరణమ్ము
లాశ్రయించి స్వచ్ఛ మౌను గదర!
నరుడు యంద గల్గు నయమున దానిని
హరికథలనెడి నది యందు మున్గ.
శ్లో॥ స జయతి భగవాననంత శాయీ
జలధిసుతా కుచకుంకుమాంకితోరః
సుమధిత నిగమాంబుధౌ సుదృష్టం
సుమణి మనంతగుణం యమాహురాద్యాః. 29
తాత్పర్యం: అగాధమైనవేదరాశిని బిట్టు తరవగా కనుపట్టు నఖండ సుగుణమణి అని ఆర్యులెవ్వరిని బల్కిరో, ఆ ఇందిరా దేవి స్తనచందన కుంకుమాంకిత వక్షుడు శేషశాయి, సుఖదాయి, భగవానుడు జయమందు గాక.
తెనుగుసేత: ఎవ్వడు వేదసాగరము నెంతయొ ద్రచ్చిన లభ్యమాయెనో
ఎవ్వని నార్యులందరును నెంతగ బాడిరొ యాద్యుడంచనిన్
ఎవ్వడు శేషశాయి,మరి యెవ్వడు నిత్యసుఖమ్మునిచ్చునో
అవ్వనమాలికిన్ జయము!హత్తిన శ్రీకుచకుంకుమోరుకున్.
శ్లో॥ ఉదన్వన్నందినీజాని,ర్మాం పాయాత్ పరమః పుమాన్
త్రయీ హాటక పేట్యంత ర్లసన్నీలమణి ర్హరిః. 30
తాత్పర్యం: క్షీరసాగరకన్యకైన లక్ష్మీదేవికి భర్తయైన ,ప్రాబలుకుల బంగరు బరిణ లోని నిగనిగని నీలపుమణి యైన హరి,పరమపురుషుడు నన్నోముగాత!
తెనుగుసేత: మున్నీటి మురిపెంపు సుతకు ముద్దు మగడు
వేదమనియెడి బంగారు పెట్టె లోని
నిగనిగ మెరయు హరియను నీలమణియె
యగుత నాకెన్న దిక్కుగా ననవరతము.
శ్లో॥ శౌరే!మాం శరణాగతం
ఆదరతః పాహి మోహితమపి త్వమ్
మచ్చరితం న విచింతయ
సుగుణా స్త్వయి సంతి మయి న సంతి ఖలే. 31
తాత్పర్యం: శౌరీ!నేనజ్ఞానమోహితుడను.ఐనను నీకు శరణాగతుడను.నీవు నన్ననుగ్రహించి రక్షింపుము.నాదుశ్చరిత్రమును పట్టించుకొనకుము.సుగుణములన్నీ నీయందే నిలచి యున్నవి.కావున నాయందు కన్పింపజాలవు.
తెనుగుసేత: శౌరీ!నే ఘనజ్ఞానహీనుడను,సంసారంబునన్ జిక్కితిన్
జారిత్రంబది నాది దుర్గుణగుణాజాలంబునన్ జిక్కెడి
న్నౌరా!నీకె వశంబు లా గుణములౌ నదృశ్యముల్ నాయెడన్
మారాడన్ దగదయ్య నీకు హరి!రమ్మా వేగమే గావగన్.
శ్లో॥ అవ్యాజమవ్యాద్భవ్యాని
భావ్యదివ్యాకృతి ర్హరిః
రమణీయాభ్యర్హణీయజి
గాణేయ మణికంకణః. 32
తాత్పర్యం: అందమై, అర్చింపదగినదై, గణనీయమైన మణికంకణములు కల్గి, భావమునందు దివ్యాకారముతో నిల్చు శ్రీహరి అవ్యాజానురాగముతో నన్ను రక్షించు గాక.
తెనుగుసేత: నన్నోముగాక!మాధవు
డున్నుతి సేయం గజాలె డుత్తమ మూర్తిన్
బ్రన్నని మణికంకణముల
గన్నారన్, నెపము గనని కారుణ్యముతోన్.
శ్లో॥ ప్రణమతాం కురుతే కమలాపతిః
శిరసా వకలంక మచంచలమ్
నిజ నియోజ్య శివంకర శింజితాం
చిత మణీమయ మంజులనూపురః. 33
తాత్పర్యం: తనభక్తులకు శుభమును కలిగించే ధ్వనులతో,మణులు చెక్కబడిన మవ్వపుటందెలు గల ఆ కమలాపతి తన్ను గొలచు వారలకు అచంచలమగు శ్రేయస్సు ప్రసాదించుగాక.
తెనుగుసేత: గుణనిధి మాధవుండు కను గొల్కుల జూపుల,శింజితాంచితా
మణిమయ నూపురంబుల సుమంజుల నిక్వణ శోభనంబులన్
ప్రణమతులై,సుభక్తియుతభావసమాహితనిత్యతృప్తని
ర్గుణులకు శ్రేయమున్నొసగి,గొబ్బున జేర్చు శివంకరస్థితిన్.
శ్లో॥ నిజాపాంగాలోకావిత సుజన జాలాంజలి పుటో
ల్లసన్మల్లీజాతీ ప్రముఖ కుసుమాలంకృత పదో
విచిత్రా సంసిద్ధీ జలరుహదృశ శ్చారు చరణౌ
విధత్తో యోగిభ్యః సపది ధృతవద్భ్యో హృది ముదా. 34
తాత్పర్యం: విష్ణువు తన కృపాకటాక్షములతో సుజనులను రక్షించును. వారు తమ దోసిళ్ళతో జాజులు, మల్లెలు మొదలైన పుష్పములను దెచ్చి హరి పాదముల నర్చించుచున్నారు.
ఆపాదపద్మములను యోగులు తమ హృదయములందు ధరింతురు.అట్టి యోగులకు అద్భుతమైన సిద్ధులను ఆ హరి ప్రసాదించును.
తెనుగుసేత:- మహాస్రగ్ధర, ఛందస్సు:- స-త-త-న-స-ర-ర-గ యతి:-9,16.
తమదోసిళ్ళన్ సుమాళిన్ దనియుచు నొసగన్,దమ్మి గందోయి గాంచున్
సమలంకారంబు నొందెన్ సరసిజపదముల్ ,శౌరి భక్తావనుండే
మము గాచంచున్ పదంబుల్ మనమున నిలుపన్ ,మౌనులన్ బ్రోవగన్,వే
గమె సిద్ధులన్నొసంగున్ గరివరదుడు తా గమ్యమై ధ్యానంబునన్.
శ్లో॥ క్వ విష్ణు సంగః పరమః
క్వ చ గో గోప గోపికాః
అతః ప్రసాదం కృష్ణస్య
కృష్ణో జానాతి నా పరః. 35
తాత్పర్యం: పరమైన విష్ణుసహవాసమెక్కడ? గోవులు, గోపాలురు, గోపికలెక్కడ? కృష్ణుని అనుగ్రహము కృష్ణునికే తెలియును.మరెవ్వరూ తెలియజాలరు.
తెనుగుసేత: పరమపదమైన వైకుంఠు భవ్య సంగ
మునకు, గో గోప గోపికా మోక్షమునకు
నేమిసంబంధమున్నదో నెవరికెఱుక
కృష్ణు కరుణాప్రసాదము కృష్ణు డెఱుగు.
శ్లో॥ దశరూపధరో మమస్తవైః
దశపాపాని హరిర్హరత్యసౌః
దశపాపహరేతి విశ్రుతా
దశమీ వారిణి మజ్జనైరివ. 36
తాత్పర్యం: దశపాపహరగా ప్రఖ్యాతమైనది జ్యేష్ఠశుద్దదశమీతిథి. ఆ నాటి గంగాస్నానం వలె దశరూపధరుడైన(పది అవతారములను దాల్చిన)హరి పదింబదిగ నా పాపములను హరించుగాక.
తెనుగుసేత: జ్యేష్ఠ శుద్ధ దశమి శ్రేష్ఠమై యొనగూరె
దశవిధముల నఘపు విశసనమన
హరి దశావతారు డనగ వెలసి నిలను
హరణ సేయు మామ కంహ చయము.
అంహము-పాపము.
శ్లో॥ సర్వేపి త్రిదశా హరిం పరిచరంత్యాత్మేష్టదం తావతా
కా శ్లాఘాస్య? పరస్తు సాస్తు యశసాం పారం న యాంతీ త్యతః
దోగ్ధ్రీం గాం పరిపాలయంతి బహవః కా తావతస్యాః ప్రధా?
జాతా? కింతు సమర్చయంతి సుధియో-పీ త్యస్తి తస్యాః ప్రథా! 37
తాత్పర్యం : సమస్తదేవతలు తమకు ఇష్టార్థములిచ్చు హరిని సేవించుచున్నారు. ఈ పొగడ్తతో ఆ పరాత్పరుని కీర్తి శిఖరాన్ని తాకలేము. పాడియావును పలువురు పాలింతురు. అందులో విశేషమేమున్నది. జ్ఞానులు నిష్కామముగా సేవింతురన్నదే హరికి నిజమైన నివాళి యగుగాక!
తెనుగుసేత: కానేకాదు విశేషకీర్తన సురల్ కామ్యార్థతీవ్రేచ్ఛులై
యా నారాయణునిన్ సదా గొలుతు రంచన్నట్టిదిన్, నీరజా
క్షున్, నిష్కామత గొల్చు జ్ఞానఘనులా గోవిందపాదారవిందా
నూనానందమరందతుందిలమదే ప్రస్తుత్యమౌ నిత్యమై.
శ్లో॥ హృది జాగ్రతా స్వభక్తా
గ్రేసర వశగేన సేవకో హరిణా
నిరవగ్రహ మామోదమ్
గ్రహపతినా లోక ఇవ నకిం లభతే. 38
తాత్పర్యం: హరి తన భక్తులకు వశుడై వారిహృదయములందే జాగరూకుడై నిలచి యుండును. ఆ దేవదేవుని వలన నిజభక్తుడు అపరితమైన ఆనందాన్ని పొందును. సూర్యుడు లోకమునంతటిని జాగృతపరచుట లేదా ఏమి? (జాగృతము చేయుచున్నాడని అర్థం)
తెనుగుసేత: భక్తవశంకరుండు హరి ,భక్తుల మానసమందిరంబునన్
రక్తిగ నిల్చియుండి ,కడురమ్యముగా నతిజాగరూకుడై
యుక్తిగ నిత్యమోదముననోలగ నాడగ జేయు నొప్పగన్
సక్తుడు భాస్కరుండు జనజాగృతినొందగ సేయునట్లుగన్.
శ్లో॥ వందే కందర్ప సౌందర్య
కదర్యత్వ ప్రకాశికామ్
సౌందరీ మిందిరేశస్య
జననీమివ నందనః 39
తాత్పర్యం: మన్మథుని అందాన్ని క్రిందుసేసే ఇందిరాపతి యొక్క సౌందర్యసుందరిని, తల్లిని కొడుకు నమస్కరించినట్లు ప్రణమిల్లుదును.
విశేషములు: ఈ ఉపమానము నాన్యతోదర్శనీయము.కవి పరమస్వతంత్రమైన రచనకు ఒక ఉదాహరణ.అందాన్ని సుందరిగా భావించడం.దానికి తల్లికి కుమారుడు నమస్కరించినట్లు నమస్కరిస్తాననడం కాళిదాసమహాకవిని స్ఫురింపజేస్తుంది.
మన్మథుడు విష్ణుని కుమారుడే. ఐనప్పటికి జగన్మోహనమైన హరి సౌందర్యం ముందు వాని అందం వెలవెలబోతున్నది.మరొకటి జగన్మాత లక్ష్మీదేవి పరమ లావణ్యము గూడా భర్తసౌందర్యానికి సాటి రాదన్నట్లుగా పేర్కొనడమొక విశేషం.
తెనుగుసేత: మనసిజు సొబగును మసిబా
రెననగ జేయుచు ననయము రేగుచు నున్నా
డను హరిసింగారమునకు
మనసా నతులిత్తు,సుతుడు మాతకు బోలెన్.
శ్లో॥ వాసుదేవ!తవపాదపంకజం
యోగినో మధుకరా ఇవాంబుజం
ఆశ్రయంత ఇహ యోగినో?స్పృహాః
సంతరాం మధుకరా మధుస్పృహాః. 40
తాత్పర్యం: దేవా! తుమ్మెదలు తామరలను వలె యోగులు నీ పాదపద్మముల నాశ్రయింతురు. భేదమేమన తుమ్మెదలు మధువు నాశించి పద్మములనాశ్రయించును. యోగులు ఏ ఆశయు లేకనే నీయడుగుదమ్ములనాశ్రయింతురు.
తెనుగుసేత-1: మధువును గోరి పద్మమును మానక జేరును బంభరాళిదే
మధునసురున్ నిజోరువున మ్రందగ జేసిన పాదపద్మముల్
బుధనుతరీతి జేరుదురు బుద్ధిని నిల్పుచు యోగులప్పుడే
యధములు గోర్కి బోవుదురు, యాంతర దృష్టులు గోర్కి లేకయే.
తెనుగుసేత-2: మధువును గోరి పద్మమును మానక జేరును బంభరాళి, త
న్మధురిపు పాదముల్ మహిత మౌనము తోడుత నిత్యదీక్షతో
బుధనుతరీతి జేరుదురు బుద్ధిని నిల్పుచు యోగివర్యులా
యధములకున్ మహోత్తముల కాంతరవృత్తుల రీతులేర్పడన్.
శ్లో॥ గోష్ఠీషు పాపినాం విష్ణో ర్గుణా గాయంత్యసద్గుణాః
ఆజ్యధారా విషాయంతే జఠరేషు శునాం న కిం? 41
తాత్పర్యం: పాపాత్ముల గోష్ఠులందు విష్ణుని సద్గుణములు తలక్రిందులై, దుర్గుణములుగా చెప్పబడును. ఆజ్యధారలు కుక్కలకు విషసమానములగును కదా. (నేతిని తింటే కుక్కలు కక్కుకుంటాయి)
తెనుగుసేత: విష్ణుమూర్తి సద్గుణములు వికట రూపు
నొందు పాపుల గోష్ఠుల నొప్పు దప్పి
కుక్కకాజ్యమ్ము కడుపున గుదరు లేక
విషము పగిది బైటకు దానె వెడలు నట్లు.
లేదా
హరికథలఘమతులసభల
దురర్థకములగుచునుండు దుర్భోధనలన్
వరమగు యాజ్యము కుక్క కు
దరమున నిమడక వమనపు తాపము బోలన్.
శ్లో॥ శ్రీశస్య కరాబ్జానాం సుగంధ సౌందర్య సంపదోల్లసతాం
కమలా కుచయో ర్మృగమద మకరీ లేఖన మదభ్ర మౌపయికమ్. 42
తాత్పర్యం: మాధవుని కరపద్మములకు సుగంధ సౌందర్య సంపదలు ఏల కల్గెనో కారణము తెలిసెను.ఏమన లక్ష్మీదేవి వక్షోజములపై కస్తూరీ మకరికా లేఖనక్రమాభ్యాసఫలితమే అది.
తెనుగుసేత - మధ్యాక్కర:
కమల కుచములకు మకరికా పత్రరచన నిపుణత
గమలధవుడు నొందెను కరకమలయుగ్మమునకు మించు
నమల గంధము మార్దవమును,నంచిత రీతిని గనగ
గమల సహజ గుణము లవి,కనులవిందును సేయ సాగె.
శ్లో॥ ఆనందసాంద్ర మనవద్యగుణం హరిం త్వా
మారాధయంత మధమం బిభృహి ప్రమోదాత్
విశ్వంభరస్య తవ మద్భరణేన భారో
భూయాన్ భవేత్కిమిహ కారుణికావతంస! 43
తాత్పర్యం: ఓ పరమపురుషా! ఆనందసాంద్రుడవు, అనవద్యగుణుడవునగు నిన్ను నిరంతరమారాధించు నన్ను, అల్పుని మోదముతో భరించుము. విశ్వం భరుడవగు నీకు నేను బరువగుదునా?
తెనుగుసేత - మహాస్రగ్ధర:
భరమేమౌదున్ ప్రభూ!నీవఖిలభువనసంభారమున్ దక్షతన్ వే
శిరమందున్ దాల్ప,నే సంచితదురితసమాశ్రిత్య చిత్తుడనైనన్
కరుణాసాంద్రా!మహద్దుఃఖమపహరణమౌ,గావగన్ నీవెగా,ది
క్కురుభక్తిన్ బూజసేతున్ గుమతినభయమున్ గోరగా సాహసింతున్.
శ్లో॥ కరుణా వరుణాలయో హరిః శరణం మే భవతా దుదారధీః
ధృత సుందర హీర మాలికాంతర సందీప్త విశాల కౌస్తుభః. 44
తాత్పర్యం: అలంకరించుకున్న సుందర రత్నమాలికల నడుమ వెలుగు లీనెడి విశాలమైన కౌస్తుభము కలిగి,కరుణా సముద్రుడైన హరి ఉదారబుద్ధితో నాకు శరణమగు గాక!
తెనుగుసేత: అంతరాక్కర. 1 సూర్య, 2 ఇంద్ర, 1 చంద్ర గణములు
యతి: 3 వగణం చివరి అక్షరం, ప్రాస నియమం కలదు.
ఎరుపు మెరుపుల మురిపెమీ రతనబేరు
లరుదగు ననగ వెలిగెడా కౌస్తుభము
నురమున ననువున దాల్చు నురుగుణుడు
హరి యొసగు రక్ష కరుణాయతనుడనగన్.
శ్లో॥ గృహ్ణాతు మత్ప్రణతి బృంద మమంద కీర్తిః
సూర్యేందు దృగ్గుణవతాం గురు రాదివిష్ణుః
శ్రీవత్స కౌస్తుభ పృథగ్విధ రత్నహార
భాభిః ప్రియాం హృది రమాం శబలాం దధానః. 45
తాత్పర్యం: తనయెదపై శ్రీవత్సపు కాంతులు వేరు వేరు రకముల రత్నహారముల కాంతులతో చిత్రవర్ణ శోభితమైన రమాదేవిని ధరించువాడును, రవిచంద్రులే నయనములైనవాడును, గుణవంతులకు గురువును, కీర్తనీయుడైన ఆది విష్ణువు నా నమశ్శతము నందుకొను గాత!
తెనుగుసేత: సేగియె లేదు!చేకొనగ జెందొవజూపుల నాదు జోతలన్
శ్రీగురు డాదివిష్ణువిదె,శ్రీసతినిన్ బ్రియమారురంబునన్
రాగము తోడ నిల్పి,మణిరంజిత చిత్రిత శోభలెల్లెడన్
సాగగ, కీర్తనీయగుణసాంద్రుడు దిక్కగు నంచు వేడగన్.
శ్లో॥ చంద్రాస్యాబ్ధిసుతా లలాట ఫలకం దూరాదవేక్ష్య,ప్రియా
నేత్రౌపమ్యÑ వివాదశీల హరిణం మత్వాÑ రుషా తద్రిపోః
ధృత్వాస్యంÑ త్వరితం ప్రియాంతిక గతో రోషం జహే తథ్యవి
ద్విషుస్తచ్చరితం వదంత్యభినవాః పౌరాణికా స్త్వన్యథా. 46
తాత్పర్యం: హరి నరసింహుడెందుకైనాడో సరసంగా ఈ శ్లోకములో ఊహింపబడిరది. ఎట్లన రమాదేవిని విష్ణువు దూరంనుండి చూచినాడు. ఆమె ముఖం నిండు చంద్రుని పోలియున్నది. ఆ ముఖము నందలి తిలకము మృగమద రచితము. అది ముఖచంద్రునందలి జింకయే అనిపించింది. చంద్రుడు మృగాంకుడు కదా. ఆ జింక తనకన్నులతో సమానముగా నున్న యిందిర కందోయితో వివాదమునకు కాలుదువ్వుచున్నట్లు హరికి తోచినది. ఆయనకాజింకపై కోపము గలిగినది. దానిని బెదరించి అదలించుటకై దానికి శత్రువైన సింహ ముఖమును కల్పించుకొని వేగంగా తనభార్యను సమీపించినాడు.అపుడు తెలిసినది అది మృగము కాదని. అంతట తన కోపమునుపసంహరించు కున్నాడు. ఇదీ ఆయన సింహ ముఖుడగుటకు కారణము.
వ్యాసాదులైన పౌరాణికులు వేరువిధముగా ,హిరణ్యకశిపుని జంపి ప్రహ్లాదుని గాచుటకని వర్ణించుచున్నారు.
తెనుగుసేత: దూరము నుండి జూచి,తన తొయ్యలి చంద్రముఖస్థ కస్తురీ
చారుసుశోభితాతిలకచర్య,రమానయనారి జింకగా
పోరుకు వచ్చెనో యనుచు బుట్టిన సందియమొప్ప ,కేసరీ
చారుముఖంబునున్ దొడిగె,రాక్షసు జంపగ గాదులే గనన్.
శ్లో॥ నఖమణి కిరణాళీ చుంబితా శాంగనాస్యం
వరముదధి కుమారీ ప్రేయసః పాదయుగ్మం
ప్రణదమరమౌళి ప్రోల్లసద్రత్నభాభి
ర్న బహు లసతి,భాస్వా నృక్షభాభిః యథా-సౌ. 47
తాత్పర్యం: సముద్రరాజతనయా ప్రియుడైన శ్రీహరి యొక్క పాదముల జంట తన కాలి గోళ్ళ మణి కిరణములతో దిగ్వధూ వదనమును చుంబించుచున్నది. ఆయన పాదములకు నమస్కరించు దేవతల కిరీటరత్నకాంతులు ఆ పాదనఖ కాంతుల ముందు వెలవెల బోవుచున్నవి.ఎట్లనగా నక్షత్రముల కాంతి సూర్యకాంతిని మెరుగుపర్చలేవు గదా!
తెనుగుసేత: చుంబనమొందె మాధవుని శుభ్రపదాంబుజ దీధితుల్ విశా
లాంబరదిగ్వధూ వదన లక్ష్మిని,ధిక్కృతి సేయగా వెసన్
జృంభణ తగ్గె దేవశిరసంస్థిత రత్నకిరీట కాంతికిన్,సదా
గుంభన రీతి సూర్యుకడ నొద్ది కవెల్గెడి తార బోలుచున్.
శ్లో॥ వాసుదే వాదిదేవ త్వయా కుత్రభోః
శ్యామలం కోమలం రూపమాపాదితమ్
నేక్షితం న శ్రుతం సుందరం త్వీదృశం
యత్ర కుత్రా ప్యతో వేద్మి నైసర్గికమ్. 48
తాత్పర్యం: ఓ వాసుదేవా ఆదిదేవా నీ రూపము శ్యామలకోమలము. ఇట్టిదాని నెక్కడి నుండి స్వీకరించితివి.
లోకమునందెక్కడను ఇట్టి సుందరాకారాన్ని వినలేదు కన లేదు.కనుక నీకిది స్వాభావికమనియే భావింతును.
తెనుగుసేత: కనగ లేము, వినగలేము కడు నిరుపమ
శ్యామలంబు, కోమలంబు, సహజ సుంద
రంబు, నీదు రూపమొసగు రంజనంబు
వాసుదేవాదిదేవ! యొప్పంగ జూడ.
శ్లో॥ ప్రకామ లలితాలాపైః కేళికా గోపికా జనైః
సమాకలయ్యా ప్యశ్రాంతో ముకుందః పాతు మాం ముదా. 49
తాత్పర్యం: ముకుందుడు నిత్యము గోపికలతో అంతులేని సరస లలితా లాపములతో, క్రీడలతో మునిగి యున్నప్పటికినీ, నన్నాదరించి పాలించుగాక!
తెనుగుసేత: వ్రజయువతులతో నిరతము వలపు గురియు
సరస సల్లాప కేళికా సక్తుడయ్యు
నన్ను శరణాగతుని గాచు నయము మీర
గోపికా వల్లభుండు ముకుందు డౌచు.
ముక్తిం దదాతీతి ముకుందః
(ముక్తి నిచ్చు వాడు ముకుందుడు)
శ్లో॥ భక్తేందిందిర పాళయే ప్రదిశతీ శ్రేయో మరందం వరం
జ్ఞానాఖ్యే సరసి స్థితే ప్రవిమలే పద్మేశ పద్పంకజే
నిశ్చిన్వే ప్రతనాంబుజే ఇతియతో నవ్యాబ్జపుంజాదిమే
ఆధిక్యం ద్విజరాజ సఖ్యమధుపా సఖ్యాం చితత్వాద్గతే. 50
తాత్పర్యం: లక్ష్మీపతి పాదపద్మములు జ్ఞానమనెడి సరస్సులో బురదనంటక, భక్తులనెడి తుమ్మెదలకు శ్రేయస్సనెడి మకరందమును ప్రసాదించును. అందువలన అవి ప్రాచీనములని తలంతును. నవీనములైన పద్మముల కన్న ఇవి రెండు విశేష గుణములు కల్గి ఉన్నవి. ఒకటి ద్విజరాజసఖ్యము. రెండు మధుపాసఖ్యం.
విశేషములు: ద్విజరాజ అనేది నానార్థము.చంద్రుడు, బ్రాహ్మణ శ్రేష్ఠుడు.
అట్లే మధుపము కూడ. ఒకటి తుమ్మెద. రెండు తాగుబోతు.
ఈ రెండర్థములతో సమన్వయిస్తే ఈ శ్లోకం విశిష్టత తెలుస్తుంది. విష్ణు పదములు బ్రాహ్మణశ్రేష్ఠుల (పండిత)తోసఖ్యము కల్గినవి.ప్రాచీనములు గావున మధుపములతో (తాగుబోతులతో) సఖ్యముండదు. అప్పుడే విచ్చిన పద్మములపైననే తుమ్మెదలు వాలును అనుట ప్రసిద్ధమే.
అట్లే నూత్నపద్మములకు చంద్రుడు శత్రువు.
కవి గారి ఆధ్యాత్మిక యోగానుభవం కూడా ఇందు సూచితము.
సహస్రారకమలం లో చంద్రమండలం పైనున్న గురుపాదయుగ్మమే విష్ణు పాదములుగా కవి తన యోగానుభవాన్ని వెలువరించినారు.
ఇంత విస్తార భావాన్ని విడగొట్టి తెనుగుసేత రెండు పద్యాలుగాచేయడం జరిగింది.
తెలుగుసేత-1: ప్రవిమల పాదపద్మములు బంభర భక్తజనాళికిన్ సదా