శ్రీలక్ష్మీనరసరామణీయకం › హంసతత్త్వ ప్రకాశిక — 2
హంసతత్త్వ ప్రకాశిక — 2
శ్రీలక్ష్మీనరసరామణీయకం · భాగము 4 / 37
ఆంజనేయుడనంగ యమాది యోగ
సంభవ గ్నాన తేజంబె సత్త్వదర్శి
బ్రహ్మనాడి సుషుమ్న నాబడు నుదాన
వాయు నాడీస్వరూపంబు బ్రహ్మగామి
సీతారాముల వియోగాన్ని తొలగించి, తిరిగి జతచేయడానికి సుషుమ్నా నాడిగా కుండలినీ యోగసాధనచేసి, పరబ్రహ్మతత్త్వం తెలిసిన యోగీశ్వరుడు ఆంజనేయుణ్ణి రామతత్త్వం నియమించింది. అసలు సుందరకాండ అంతా కుండలినీ యోగమే. దీన్ని నిరూపిస్తూ గుంటూరు శేషేంద్రశర్మ ఒక యోగ సమన్యయాన్ని తన ‘‘రామాయణ రహస్యాలు’’ అనే గ్రంథములో వివరిస్తారు. అట్లె కొతులన్నీ మనశరీరములోని నాడులే. యోగశాస్త్రపద్ధతిలో మనశరీరంలో 72000 నాడులున్నాయి. అవన్నీ ఆత్మ ఆదేశానుసారంగా పనిచేస్తుంటాయి. వీటిలో మూడు ముఖ్యమైనవి. ఇడ, పింగళ, సుషుమ్న. ఆంజనేయుడు సుషుమ్న. వాలి సుగ్రీవులు ఇడ, పింగళ. మీగిలిన ప్రధాన నాడులు అంగదుడు మొదలైనవారు. కోతి స్వభావమే నిత్యం చలిస్తూ వుండడం. నాడులూ అంతే గదా! శరీరశాస్త్ర (అనాటమీ) పరిభాషలోని సిరలు, ధమనులు నాడులు కావు. తల వెంట్రుక వంటివి, ఇంకా సూక్ష్మమైనవి ఎన్నో నాడులున్నాయి. వాలి సుగ్రీవులకు నిత్య వైరం ఎందుకు? అవి ప్రాణాపాన వాయువులు కాబట్టి. ఉచ్చ్వాస, నిశ్శ్వాసలు ఒక దానికొకటి వ్యతిరేకం కదా. ప్రాణాయామములో ఉచ్చ్వాసను పూరించి (నిండుగాలోపలికి పీల్చి) కదలక బంధించడం కుంభకం. ఇదే వాలి వధ. సుగ్రీవునితో మైత్రి నిశ్శ్వసించడం.
హనుమ సముద్ర లంఘనములోని ఆటంకాలను దాటుతూపోవడం అంతా సుషుమ్న మూలాధార చక్రం నుండి ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ సహస్రారచక్రం చేరడం సీతను చేరడం.
తగువిధంబున బుద్ధి చెంతకును జేరి
చూచి ఆత్మాభిరాముని శుభము దెల్పి
అభయమొసగియు గడగి దానంత బోక
కరము శోభిల్లుతున్న యప్పురము జూచె
దేహమందలి సంప్రీతి దిగవిడచుటె
లంక గాల్చుట; దుర్గుణరాశి విడుటె
దనుజుల గూల్చుటన; బుద్ధి గనుటె సీత
జూచుటన; సిద్ధయోగుల చొప్పు లిట్ల
విభీషణ, రావణ, కుంభకర్ణులు, క్రమంగా సత్త్వ, రజ, స్తమోగుణాలకు ప్రతీకలు. సత్త్వగుణ యుక్తుడైన విభీషణునికి రాముడు శరణమివ్వడం ఆత్మ సత్త్వాన్ని ఇష్టపడడమే. మనసును జయించడానికి, ముందుగా సంసారం (ఈజగత్తు)ను దాటాల. అదే సముద్రం. సంసారసాగరం అనేది అందుకే! యోగ నిష్టయే సేతువు. దానికి కావలసిన నాడీ శుద్ది, నాడుల సత్సంచారం. అదే వానర సైన్యం వారధి కట్టడం. రాగ ద్వేషాది దుర్గుణాలు ఇంద్రజిత్ వంటి రాక్షస వీరులు. తమోగుణం కుంభకర్ణుడు. ఇవన్నీ క్రమంగా స్వాధీనం చేసుకుంటూ మనస్సును జయిస్తాడు యోగి. ముందుగా వీరి వధ జరిగింది. మనస్సును జయిస్తేగాని సమాధి కుదరదు. ఇంద్రియాలను జయించాల శమ దమాలతో. పది ఇంద్రియాలే రావణుని పదిముఖాలు. తలలు నఱుకుతుంటే మళ్ళీ, మళ్ళీ పుట్టుకొస్తున్నాయి. ఇది ఇంద్రియాల ప్రభావం. చివరకు బ్రహ్మాస్త్రంతో నాభి చీలిస్తే కాని రావణుడు చావలేదు. బ్రహ్మ విద్యే బ్రహ్మాస్త్రం. ఈవిధంగా మనస్సు అంతరించి, ఆత్మ బుద్ధులు ఐక్యమైనాయి. ఇదే సీతారాముల పునస్సమాగమము.
క్షేత్రము తెఱగును మరియును
క్షేత్రజ్ఞుని తెఱగు దెలియజేసిరి కథలన్
సూత్రముగ ఋషులు ధీశ్రీ
పాత్రులు రామాయణాది బహు గ్రంథములన్
భారత చరిత్ర నిటులే
పారాశర్యుడు వచించె బావన తత్త్వ
శ్రీ రాజిల ఋషివర్యుల
సారస్వతమెల్ల దత్త్వసారమె సుండీ
ఆర్ష సాహిత్యమంతా తత్త్వాన్ని కథల రూపం లో బోధిస్తుంది. వాటిని కేవలం కథలుగా, ఆ పాత్రలను దేవతలుగా మాత్రమే భావిస్తే ఏమీ లాభం లేదు. అందులోని పరమార్థాన్ని పట్టుకున్నప్పుడే ప్రయోజనం. ఈ మధ్యన ఒక ప్రచారం జోరుగా సాగుతుంది. మన నిత్య జీవితానికి పనికి వచ్చేందుకు మాత్రమే వీటిని గ్రహించాలని, అనవసరమైన తాత్త్విక, ఆధ్యాత్మిక సమన్వయం అవసరం లేదని. ఎంత మూర్ఖత్వం! జీవితానికంతా మూలం తత్త్వమే కదా! ఇంద్రియాలు, ప్రాణం, మనస్సు, బుద్ధి వీటి వ్యవహారమే కదా జీవితం. వీటి గురించిన శాస్త్రీయత(భారతీయ ఋషులను బట్టి) తెలిస్తే జీవితంలో ఆందోళన, విచారం, భయం, సంకోచం, వంటి వాటిని సులభంగా జయిస్తాం. అపజయాలు ఎదురైనా దీటుగా ఎదుర్కొంటాం. డిప్రెషన్లు, ఆత్మహత్యలు, విడాకులు వంటివి ఉండవు. దేన్ని ఎలా చూడాలో, దేనికి ఎలా స్పందించాలో, దేనికి యెంత ప్రాధాన్యతివ్వాలో, ఏది నిజంగా విలువైనదో వంటి వివేకం కల్గుతుంది. ఈ ప్రయోజనాలను పొందడానికి తగిన దృష్టిని కలిగిస్తుంది రామతత్త్వ రహస్యం.
ఓమ్ తత్సత్
శ్రీమత్త్రిపురసుందరీ జయతు.
మనవి మాట
ఆస్తికవరేణ్యులారా! పరతత్త్వముం దెలుపు గ్రంథము లనంతములు. సామాన్యులకు దురవగాహములు. పరతత్త్వమే దురవగాహమైనది. ప్రాక్తన జన్మసంస్కార ప్రతిభచే నయ్యది యొక్కొక్క వ్యక్తికిఁ గొంతకొంత తెలియుచుండును. తెలిసినదానిని విజ్ఞానాతిశయమున ననుభవమున నుంచుకొని తాననుభవించి యితరులకు నుపదేశించి ధన్యుఁ డగుట యరుదు. భుక్తిముక్తిసాధకంబులు పెక్కులు గలవు. కాని యవి సద్గురు సేవచే లభించునే గాని యూరక వచ్చునవి కావు. తెలిసితిమి తెలిసితి మనువారేగాని యేమి తెలిసితిరి? దానిని దెల్పుఁ డనఁగా నేదేదో అస్తవ్యస్తముగ వాగి జిజ్ఞాసువుల మనంబులను తికమకలు చేయుదురేగాని సుస్పష్టముగఁ దెలుపఁజాలని వారు పెక్కురు గలరు. లోకమున నట్టివారిని జేరి పెక్కురు పెడమార్గములఁ ద్రొక్కి, తబ్బిబ్బుపడి గమ్యముఁ జేరక భ్రష్టులగుట యెల్లరకుఁ దెలిసినవిషయమే. బయలువేదాంతములని ప్రసిద్ధికెక్కిన యొక పంథ దిక్కు తెలియని త్రోవకుఁ దీసికొనిపోయి, ‘‘అంధం తమః ప్రవిశంతి యే అవిద్యా ముపాసతే’’ అనురీతిగ తీరము లభింపని యగాధకూపంబునఁ ద్రోయు చున్నది. పాటలు పాడుచుఁ దందనాలు వేయుచు లోకమును వంచించు వేషధారులు కాషాయాంబరధారులు, గడ్డములు పెంచినవారు, సాధువుల మని చెప్పుకొనువారు గావించు నుపదేశములు ఎంతవఱకు లోకము నందలి యమాయకులగు జిజ్ఞాసువుల నెట్టిపాటులఁ బడఁద్రోయు నున్నవో జగమున నెఱుక కాకపోలేదు.
నిరాడంబరులై నిజము నెఱింగినవారికడఁ జేరి శుశ్రూష మొనరించి వారి యుపదేశములు కరము భక్తిశ్రద్ధలతోఁ గైకొని తదాచరణము ననుసరించువారు మిక్కిలి తక్కువ యని చెప్పవచ్చును. అట్టి యుపదేశకులు దేశ సంచారులు గాక తమ మహిమను బయలుపఱపక ప్రకటనములు చేసికొనక యంతర్ముఖు లయి యాశ్రయించినవారి నను గ్రహించుచుందురే గాని జనపదాదులఁ దిరిగి శిష్య సంగ్రహణేచ్ఛకుఁ గడంగరు. ‘న రత్న మన్విష్యతి మృగ్య తేహి తత్’ రత్నము ఇతరులను వెదకుచుఁబోదు. వలసినవారు దానిని వెదకుచు వచ్చి సంపాదింపవలసి నదే యనునట్లుందురు. ఇది నిజమయిన యాత్మజ్ఞానిలక్షణ మనవలయును. జ్ఞానులు ‘‘స్వయం తీర్ణః పరాన్ తారయంతి’ యనునట్లు తాము గట్టున కెక్కి యితరులను గట్టున కెక్కించుట లక్షణముగ మెలఁగుచుందురు. అట్టివారి సందర్శనము బహుప్రయత్నసాధ్యము. వారు సర్వదా సర్వధా పరమాత్మతత్త్వమును వెదకి వెదకి విమర్శించి విమర్శించి నిజమును గనుఁగొని తదానందమగ్నులయి సర్వము మఱచుచుందురు. తాదృశులగు గురువులను సంపాదించుకొని త త్త్వబోధ నందుట మనుష్యలక్షణము, పురుషార్థము. అట్టిగురువు లూరకయుండక గ్రంథావలోకనము చేసి యందలితత్త్వమును బ్రజల కందించి తరింపఁజేయవలయు నను తాత్పర్యమున నుందురు. అట్టి సద్గురుగరిష్ఠులలో బ్రహ్మశ్రీ పాణ్యము లక్ష్మీనరసయ్యగారొక్క రనవలయును.
వీరు కేవలము పరమార్థదృష్టితో లోక సేవయే ముఖ్యసాధనముగ నెంచి తమ యనుభవమున నార్జించిన జ్ఞానధనమును దమతోడి వారికి బంచి పెట్టి ధన్యులగుటకుఁ దలంచిన మహనీయులు. పెద్దలు చూపిన త్రోవను వదలక కడుంగడు శ్రద్ధతో గ్రంథముల నారసి యందుఁ గల తాత్పర్యమును దెలిసికొని దాని నాత్మానుభవమున నిష్ఠితులై తదానంద సుధను నితరులకును నాస్వాదింపఁ జేయఁబూని యందలి సారమును ప్రకటింపఁబూనిన కృతార్థులు. వీరి రచనలు పెక్కులు గలవు. వానిని బఠించినవారును, తత్సారమును గ్రహించినవారును, తరించినవారును, అనేకులు గలరు. మనస్సునందు ననుభవ పూర్వకముగఁ దెలిసిన విషయమును దాఁచక గద్య పద్యరూపములగు గ్రంథములుగా సంతరించి వెలయింప నుద్దేశించిన వీరికృషి యమేయము. నిరుపమాన మని చెప్ప వలయును. వీరు రచించిన యీ శ్రీరామతత్త్వరహస్యము, హంసతత్త్వ ప్రకాశిక, విశ్వేశ్వర నక్షత్రమాలయనుగ్రంథములు ఆకృతిని చిన్నవిగఁ గన్పట్టినను వీనియందుఁ గల విషయములకుఁ బరిమితి నిర్ణయించుటకు నావంటివానికి సాధ్యముగాదు. ఊహాతీతము అని చెప్పుటలో నతిశయోక్తిలేదు. సాంఖ్యతత్త్వము ననుసరించి సంఖ్యలను గుదిరించి యాతత్త్వమును జోడిరచి పరతత్త్వమును దర్శింపఁ జేసిన వీరి కృషి, వీరి జీవిత వైశద్యము నుతింపఁదగిన దనవలయును. శ్రీరామచంద్ర మూర్తి జీవిత చరిత్రమును ఆధ్యాత్మ రామాయణమున నాధ్యాత్మికముగ బోధించినను వీరి యీ శ్రీరామతత్త్వ రహస్యమును నొకమాఱు పఠించి మననముఁ జేసి కొనినచో సుసులభ మగు పరతత్త్వవివేచనము కలిగి పరబ్రహ్మాను సంధాత యగుటకు లోపము లేదనవలయును. కథాసంవిధానమును జోడిరచుటలో వీరి యద్భుతమగు దృష్టిపాటవము గణ్యము. ఉదాహరణముఁ జూపఁబూనుట సముద్రము నేతముతోఁ దోడఁబూనుటవంటి దగు ననియు, నాయల్పజ్ఞత కసాధ్య మనియు మానుకొంటి నని విన్నవింప జంకుచున్నాఁడ.
హంసతత్త్వప్రకాశిక యనునది ముప్పది గీతములలోనే యున్నను ముప్పదిమూఁడుకోట్ల దేవతలకు నాధారమును వివరించునది యనవలయును. ప్రణవస్వరూపము, తద్వివరణము, హంససంచారము, తదాధారము, తత్తత్త్వ మెఱుంగుటవలనఁ గలుగు ఫలము, హంసః అనుపదము, తదుత్పత్తి, దానఁ గనఁబడు మహిమలు విస్తృతరీతిని దెలుపఁబడినవి. ఈరీతులేమియుఁ దెలియని నా కగమ్యములయ్యును గొంతకొంత బోధ గలిగించినవి. ఇఁకఁ జదువఁ జదువ మననముఁ జేయఁగాఁ జేయఁగాఁ గలుగు నానందము నిపుడు తెల్పఁజాలను. గురుముఖమునఁ దెలియఁదగిన యీ విషయముల నింత సులభముగ సరళమగు పదజాలముతోఁ దెలుపఁ బూనిన వీరిప్రజ్ఞ యసదృశము. స్థితప్రజ్ఞుఁడయిన యోగియే దీనిని వివరింప నర్హుఁడు కాని యితరులకు సాధ్యము కాదు. ఇట్టి విషయమును విశదీకరించుటలో శ్రీ లక్ష్మీనరసింహయ్య గారి పరమార్థజ్ఞానము కొలతకు మీఱినదని నుతించుచున్నాను. ఇది స్తుతి యని యనుకొనకుఁడు. నా భావమునందుఁ యానందముచే నీ వాక్యములు నాకలము వ్రాయించినది. ‘హంస స్సోహం హంసః’ అను తత్త్వవిమర్శనము నిందు గమనింపఁదగినది, అనుభవమున నవలంబింపఁదగినది, అనుష్ఠింపఁదగినది, మననము చేయఁదగినది.
ఇఁక విశ్వేశ్వర తారావళి యను స్తోత్రరూపక మగు శార్దూల విక్రీడిత వృత్తము లిరువదియేడును వ్యత్యయముగా ఇరువదియేడు నెంచిన డెబ్బది రెండు అగును. శ్రీరామ సైన్యమువలె డెబ్బది రెండు వెల్లువలవలె నసంఖ్యేయమగు దివ్యజ్ఞానమును దెల్పుచున్న రచన. ఇందు జన్మము మొదలు నింతదనుక మనుష్యజన్మ యెత్తిన వ్యక్తి యనుభవించిన యను భవము సంపూర్ణముగ వివరింపఁబడినది. గ్రంథకర్త తన యనుభవమును సైత మిందుఁ దెల్పినట్లుగ లోక చరిత్రమును వర్ణించుటనువలె గోచరించును.
ఈ పద్యములు స్వాభావికముగఁ గవివర్యుని కలమునుండి ప్రసరించిన వనవలయు. అందెందును బలవదాకర్షణము లేదనవలయు. ఎంత చులకనగ సరళములయిన పదములతో రచన సాగినదో తలంపునకు మీఱినపని. ప్రతి వ్యక్తియు నేయే విధముగఁ దన జీవితమును గడుపుచు నందలి యనుభవములను మఱి మఱి తలంచుకొనునో ఆ విషయమును బ్రత్యక్షముగఁ గనఁబఱచుటలో శ్రీ లక్ష్మీనరసింహయ్య గారి వైదుష్యము కీర్తనీయము. ప్రతివ్యక్తియుఁ దప్పక వాంఛింపఁదగిన యర్థము స్పష్ట ముగ నీ తారావళియందు ప్రకాశితమయియున్నది. వీరి ప్రపంచాను భవము, స్వాత్మానుభవము, సాంసారిక పరిణామములు, ఆధ్యాత్మిక చింత, వాంఛితార్థము - ఈ గ్రంథమును బఠించిన సుసులభముగఁ దెలిసి కొనవచ్చును. ఈ పద్యము లన్నియుఁ గేవల పఠనము మాత్రము గాదు, కంఠపాఠము చేసి యనుక్షణము మననము చేయఁదగిన వని ముమ్మాటికిని నిరాఘాటముగఁ దెల్పుచున్నాఁడను. అంత్యానుప్రాసములతో మాటలాడినట్లు సరళకవిత సమాజశిక్ష కెంతయుఁ దగియున్న పద్యములని దెల్పుచున్నాను. రుచి భేదములచే భాష పలుపాట్లుపడుచు నానాత్వముం జెందునీకాలంబున శ్రీ లక్ష్మీనరసింహయ్యగారు భాషాభిమానులగుటం ప్రాచీన సంప్రదాయమున కవిరుద్ధముగఁ జక్కని సలక్షణ భాషలో గ్రంథములు రచించుట యెంతయు స్తుతింపఁదగినది. ధర్మ నియమబద్ధులయిన వీరికి నా నమోవాకములు. వీరీ శ్రీరామతత్త్వరహస్యమునే గాక తక్కినవానిని గూడ ముద్రింపించి లోకోపకారము చేయుదురుగాక.
ఇట్టి లోకోపకారకములును, పరతత్వవివేచనమున కనువగునవియును, పరమార్థప్రాపకములు నగు గ్రంథములను నిబంధించుటకుఁ బరమేశ్వరుఁడు వీరి కాయురారోగ్య భాగ్యాదులఁ బ్రసాదింపఁజేయుఁ గాత మని కోరుచు నా వందన సహస్రములు పరమపితయగు నాదిదేవునకు నర్పించుచుఁ దమ సెలవు నర్థించుచున్నాను. పరతత్వజిజ్ఞాసువులగు మహనీయులు వీరి కృషికిఁ జేదోడు వాదోడై గ్రంథ ప్రకటనము గావింతురని మనవి.
ధర్మో రక్షతి రక్షితః.
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః.
శ్రీ లలితావిలాసము భక్తజన విధేయుడు
కడప విద్వాన్, కావ్య పురాణతీర్థ
__ప్లవ మార్గశీర్ష శుక్ల ప్రతిపత్తు. జనమంచి __
1883 శా.శ. వేంకట సుబ్రహ్మణ్యశర్మ.
సాంఖ్య రహస్యము
అతిరహస్యములైన విషయము లక్ష రసంఖ్యచే సాంకేతిక ముగ వెల్లడిరచుట యనాది సిద్ధముగ వచ్చుచున్న సంప్రదాయమే. భారతములో
శ్లో॥ చతుర్భిశ్చ చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభి రేవ చ,
హూయతే చ పున ర్ద్వాభ్యాం స మే విష్ణుః ప్రసీదతు.
అని గలదు. అనఁగా నాల్గింటిచేత, మరల నాల్గింటిచేత, రెండిరటి చేత, ఐదింటి చేత, మరల రెండిరటిచేత ఎవరిని గూర్చి హోమము చేయఁ బడుచున్నదో ఆ విష్ణుమూర్తి నాకుఁ బ్రసన్నుఁ డగుఁగాక అని తాత్పర్యము. ఇందులో నాల్గు, నాల్గు, రెండు, ఐదు, రెండు అనునవి యేవో చెప్పఁబడలేదు. కాని యిట్టి వానితో హోమము చేయవలయు సనునది మాత్ర మిక్కడఁ గనఁబడుచున్నది. ఇదియే యిందలి రహస్యము. ఈ రహస్యమును వేదము వివరించింది. ఎట్లనఁగా
। । ।
ఆశ్రావ యేతి చతురక్షర మస్తు శ్రౌష డిత్తి చతురక్షరం
। । ॥
యజేతి ద్వ్యక్షరం యేయజామహ ఇతి పంచాక్షరం
।
ద్వ్యక్షరో వషట్కారః. (యజుస్సంహిత 1-6-11-39)
ఆశ్రావయ, అస్తు శ్రౌషట్, యజ, యేయజామహే, నౌషట్ అను పదములతో హోమము చేయవలయు ననుట. ఆశ్రావయ నాల్గక్షరములు, ఆస్తుశ్రౌషట్ నాల్గక్షరములు, యజ రెండక్షరములు, యేయజా మహ ఐదక్షరములు, వౌషట్ రెండక్షరములు. ఈ పదములతో యజ్ఞములందు అధ్వర్యుఁడు, ఆగ్నీధ్రుఁడు, హోత ప్రేష యిచ్చుకొనుచు హోమము చేయవలసినట్లు విధి. ఈ సాంకేతిక మెంత రహస్యమో చూడుఁడు. ఇట్లే యక్షర సాంకేతికముగ ననేకధర్మములు నిబంధింపఁబడి యున్నవి.
ఇట్టి సంప్రదాయముతో వెలసిన శ్రీరామతత్త్వ రహస్యమును తత్త్వజ్ఞులు గాన బ్రహ్మశ్రీ పాణ్యం లక్ష్మీనరసింహయ్యగారీ గ్రంథములో వెల్లడిరచి తత్త్వాన్వేషులకు మార్గదర్శకు లగుట ప్రశంసనీయము. వీరి యితర గ్రంథములు గూడ నిట్లే యుండును. అవియుఁ బ్రకటితము లగుఁగాక.
కవితాసామ్రాజ్యము ఇట్లు
నంద్యాల, 15-3-63. మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి
శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః
శ్రీరామతత్త్వ రహస్యము
క. శ్రీరామనామతత్త్వము
నారూఢగిఁ దెలిసి భక్తి । నధిక శ్రద్ధన్
బారాయణ మొనరించిన
వారికి బ్రహ్మత్వసిద్ధి । బహుసులభ మగున్. 1
తే. రామనామంబు మూఁడుప । ర్యాయము లన
నది యొసంగును రామస । హస్రనామ
ఫల మటం చని శివుఁడు పా । ర్వతికిఁ దెల్పెఁ
దత్త్వవిదు లిట్టు లందురు । దానివిధము. 2
తే. రామ యన నక్షరాంక సూ । త్రంబు చేత
రెండు నై దగు; గుణకార । రీతి వెలసి
పది యగున్ సంఖ్య; మఱియును । బల్క నూఱు;
నటుల మఱియును బల్క వె । య్యగును సంఖ్య. 3
ఆ. అక్షరముల కెల్ల । నంకములను దెల్పు
శాస్త్రవిధిని రామ । శబ్దమునకు
నిరువ దేనుసంఖ్య । యేర్పడుఁ గ్రమగతిఁ ;
దత్త్వవిదులు గండ్రు । దానిమహిమ. 4
క. రా యనఁగ సంఖ్య రెండగు;
మా యనఁగా నైదుసంఖ్య; । మానుగ నీసం
ఖ్యాయుగముఁ గ్రమతఁ గూర్చిన
ధ్యేయంబగు తత్త్వసంఖ్య దీ । పించుఁ దగన్. 5
క. రెం డైదు గూడ నే డగుఁ ;
బండితు లీ సప్త సంఖ్య । పరిపూర్ణతకున్
నిండుగ సూచక మని; రీ
మండితములు సప్తధాతు । మయములె జగముల్. 6
మ. పదియా రెండిటి నైదు సంఖ్య గుణియిం । పన్ బ్రహ్మబోధింపఁగా
నది గుర్తౌ; నెటు లన్న నందొకఁడు బ్ర । హ్మంబయ్యె; నాపైనిను
న్నదిశూన్యం; బది సర్వశూన్య; మిటు వే । దాంతర్యమైయొప్పుఁగో
విదు లాతత్త్వము నూఁది నిత్యమును త । ద్వేద్యం బుపాసింప రే? 7
క. ఇరువదియైదవ తత్త్వము
పరమాత్మను దెల్పు సాంఖ్య । పద్ధతి; రామా
క్షరములు నిరువదియై దని
స్ఫురియించెడి నక్ష రాంక । సూత్రముచేతన్ . 8
ఉ. రావణనామమందుఁ బ్రచు । రంబగు మూఁడగు నక్షరాంకముల్
కోవిదు లెన్నుచున్ బదునొ । కొండుగఁ గూడిరి సంఖ్య; దానిచే
రావణుఁ డన్నమానసము । రాజుగ నింద్రియపంక్తి నోమెడున్;
ధీవరు లీవిధానమును । దెల్పుచు నుందురు సాంఖ్య పద్ధతిన్. 9
క. ఏకాద శేంద్రియం బని
వాకొందురు మానసమును । బండితవర్యుల్;
లోకంబు లెల్ల దానికి
లోకువయై దానియాజ్ఞ । లో వర్తించున్. 10
తే. నిర్గుణాత్మయె పూర్ణమౌ; । నిశ్చలాభి
సృష్టి కామన యందులోఁ । జెలఁగు తరఁగ;
అందు లేచిన జలకణ । మాత్మ యనఁగ
విశ్వతత్త్వంబు దెల్పును । వేద మిట్లు. 11
ఆ. మంచుగడ్డ కరఁగి । మంచునీరుగ మాఱు,
మంచుగడ్డగ మాఱు । మంచునీరు;
సగుణనిర్గుణముల । జాడలు రెండైనఁ
దత్త్వ మొక టె యండ్రు । దార్శనికులు. 12
ఆ. తలఁపు గలిగినంతఁ । దనరు నంతఃకర
ణంబె దశరథుండు । నాఁ జెలంగు;
ఆపరాత్మహృదయ । మదె యయోధ్యాపుర
మనఁ జెలంగుఁ దత్త్వ । మరసి చూడ. 13
మ. సదయత్వానుగ సాత్వికేచ్ఛ యగుఁ గౌ । సల్యామహా దేవి; స
త్పద మాసించెడి రాజసేచ్ఛయె సుమి । త్రా దేవి; కై కేయి మో
హదమైపొల్చెడి తామసేచ్ఛ యగు; ని । ట్లామువ్వు రెంచన్ సుఖా
స్పదబుద్ధిన్ జెయిపట్టి రాదశరథ । క్ష్మాపాలునిన్ భర్తగన్. 14
తే. దహరత త్త్వస్వరూపుఁడౌ । దశరథునకు
సాత్వి కేచ్ఛాస్వరూప కౌ । సల్యయందుఁ
బ్రభవమందిన యాత్మత । త్త్వంబె రామ
మూర్తి యన నొప్పె విశ్వవి । స్ఫూర్తిఁ దలఁచి. 15
తే॥ జాగ్రదనుకృతి యయ్యే ల । క్ష్మణుఁడు; స్వప్న
మయ్యె భరతుండు; శత్రుఘ్నుఁ । డౌ సుషుప్తి;
ఆతురీయంబె శ్రీరాముఁ । డనఁగ వెలసె;
నాల్గువిధముల నాత్మ దా । వెల్గె నిట్లు. 16
శా. శ్రీరామాఖ్యుఁడె యాత్మ; బుద్ధి యనఁగా । సీతామహాదేవి; కా
ర్యారంభమ్ము లొనర్చుచుండు మనసే । యారావణబ్రహ్మ; త
త్సారగ్రీవము లింద్రియుబు లగుఁ; ద । త్తత్కామరోషాదు లే
యారక్షఃపతి సైన్యపంక్తి; తనువే । యాలంక తత్త్వస్థితిన్. 17
తే. ప్రౌఢ రాజసగుణమె యా । రావణుండు;
విమలసత్త్వగుణంబె వి । భీషణుండు;
కుంభకర్ణండు నాఁ దమో । గుణమె; మనసు
త్రిగుణమయవృత్తిచే మూఁడు । తెఱఁగు లొప్పు. 18
తే. ప్రౌఢ రాజసగుణ మను । రావణుండు
దశవిధేంద్రియముఖములఁ । దా నగణ్య
రూపశబ్దాది విషయ ని । రూఢ భోగ
మనుభవించుచు సంతృప్తి । నందఁ డెపుడు. 19
తే. పార మింతయు లేని సం । సారజలధి
మధ్యమున దేహ మను లంక । మాననీయ
రాజధానిగఁ జేకొని । రాజ్య మేలు
ప్రబలగర్వుండు మానస । రావణుండు. 20
ఉ. ఏవిభుసత్కృపన్ దనకు । నిట్టిపదంబు లభించియున్నదో
భావమునన్ దలంచుచు శు । భస్థితి నుండక మానసంబు దా,
కావర మొంది గర్వమునఁ । గార్య మెఱుంగక తారతమ్యమున్
బో విడనాడి పైపదవిఁ । బొందినబుద్దిని లాగెఁ గ్రిందికిన్. 21
తే. ఆత్మతోఁ గూడి క్రీడిరచు । నట్టి బుద్ధి
కెడము గల్పించి మ్రుచ్చిలి । యెత్తి తెచ్చి
కామరోషాదిగణములఁ । గాపు పెట్టి
తనువునందె చెఱన్ బెట్టె । మనము గదిసి. 22
ఉ. చింతల ఁ గూర్చుమానసము । చేఁతకుఁ జిక్కినదౌట బుద్ధి తా
సుంతయు నాత్మతోఁ గలిసి । చొక్కు విధం బొకయింత లేక ప్రా
ణాంతదురంతదుఃఖము ల । నంతములై తను వెంబడిరప నొ
క్కింతయు శాంతిలేక కృశి । యించుచుండెను దైన్య మేర్పడన్. 23
ఉ. దిక్కొక యింత లేక యతి । దీనదశన్ జెఱనున్న బుద్ధికిన్
జిక్కు దొలంగఁజేసి తనుఁ । జేరువిధం బొడఁగూర్ప నాత్మ దాఁ
జక్కనిప్రాణయోగసువి । చారపథంబున సంచరింప నం
దొక్క మహాబలోత్థిత స । మున్నత తేజము గానుపింపఁగన్. 24
తే. ఆంజనేయుం డనంగ య । మాదియోగ
సంభవజ్ఞాన తేజంబె । సత్త్వదర్శి
బ్రహ్మనాడి సుషుమ్న నాఁ । బడు నుదాన
వాయునాడీస్వరూపంబు । బ్రహ్మగామి. 25
తే. వాలి సుగ్రీవు లనఁ బ్రాణ । వాయ్వపాన
నాడులే యగు; నా రెంటి । నడుమ వెలుఁగు
బ్రహ్మనాడీస్వరూపంబె । పవనజుండు
పరమయోగప్రసిద్ధుఁడౌ । బ్రహ్మచారి. 26
ఉ. ప్రబ్బినవిద్యఁ బండితులు । పల్కిరి మేనఁ జెలంగునాడులన్
డెబ్బది రెండు వేలుగ గ । ణించి; కవీంద్రులు పల్కి రట్టులే
కబ్బములందు రామునకుఁ । గల్గిన వాసరసైన్యసంఖ్య త
బ్బిబ్బొకయింత లేక; కపి । వీరు లనంగను నాడులే యగున్. 27
ఉ. నాడులు దేహమంతటఁ బె । నంగుచు డెబ్బది రెండు వేలు, బల్
జాడల స్థూలసూక్ష్మగతు । లన్ జని, యాత్మసమాశ్రయంబు చే
కూడ మెలంగుచుండి తమ । కున్ విధియించిన కార్యజాతమున్
వేడుక నిర్వహించుచును । విశ్వమయాత్ముని సేవ సల్పెడున్. 28
క. ఇడ పింగళయు సుషుమ్నయుఁ
గుడియెడమల మధ్య భాగ । కుండలియందున్
బొడమియు మూఁడుఁ బ్రధానతఁ
బడసెను ఘన కార్యవిధుల । వర్తించుట చేన్. 29
ఉ. ఈవిధి మూఁడునాడులును । నెన్నిక కెక్కుచు నుండు వాలి సు
గ్రీవ మరుత్తనూజు లనఁ; । గేవలనాడులె యంగదాదినా
మావళి నొప్పు; సంచలన । మందుట వానిస్వభావ మౌటచే
నేవిధముల్ తలంచినఁ గ । పిత్వము నాడుల కొప్పుఁ జెప్పఁగన్. 30
తే. వాలిసుగ్రీవులకు నెప్డు । వైర మనిన
నొప్పు నుచ్ఛ్వాసనిశ్శ్వాస । యుగము; ప్రాణ
పాయ్వపానము లను పేరఁ । బరగి యెపుడు
ఘర్షణము నొందుచుండుట । గాదె తలఁప. 31
ఉ. యోగ విచార పద్ధతి స । ముద్భవమై గనుపట్టు తేజమున్
బాగుగ నాదరించి ప్రియ । భావముఁ జూపి తదీయసంఖ్య సం
యోగము నొంది యూర్ధ్వగతి । నొందెడు వాయువుఁ గ్రిందుఁ జేసి క్రిం
దౌగతి నుండుదాని కభ । యం బిడెఁ జెంతకుఁ జేరఁదీయుచు. 32
ఉ. చేవ దలిర్ప నూర్ధ్వగతిఁ । జెందెడు వాయువె వాలి నాఁగ; సు
గ్రీవుఁ డనంగఁ గ్రిందికిఁ జ । రించెడు వాయువె; వాలిఁగూల్చి సు
గ్రీవునిఁ జేరఁదీసె నన । రేచక పూరక కుంభక క్రియా
భావముదోఁచు సూక్ష్మముగ । భావమునన్ దలపోసిచూడఁగన్. 33
మ. తన భావించిన కార్యమున్ సలుప ను । త్సాహంబు సేకూరఁ ద
ద్ఘన సాహాయ్యము నొంది బుద్ధి నరయం । గా నెంచి త త్తేజమున్
గని ధైర్యంబుఁ బ్రియంబుఁ దెల్పి, వెదకం । గాఁ బంపఁ దోడ్తోడ నే
చని సంసారసముద్రమున్ గడచి వి । జ్ఞానంబు దీపింపఁగన్. 34
మ. కనె దేహం బనులంక నొక్క దెస; వి । జ్ఞానైక తేజంబు నా
హనుమానుండు చరించి బుద్దియను హృ । ద్యన్ సీత నత్యుగ్రకో