శ్రీ పాణ్యం వాఙ్మయ నిధి పాణ్యం వంశ రచయితల సాహిత్యము

శ్రీలక్ష్మీనరసరామణీయకం › హంసతత్త్వ ప్రకాశిక — 3

హంసతత్త్వ ప్రకాశిక — 3

శ్రీలక్ష్మీనరసరామణీయకం · భాగము 5 / 37

పన కామాదిగుణంబులన్‌ బ్రబలపా । పవ్యగ్ర దైత్యాంగనా

జనసందోహముచుట్టుముట్టి భయకృ । చ్చర్యల్‌ గడున్‌ సల్పఁగన్‌.        35

తే. తగువిధంబున బుద్ధి చెం । తకును జేరి

చూచి యాత్మాభి రాముని । శుభము దెల్పి

యభయ మొసఁగియుఁ గడఁగి దా । నంతఁ బోక

కరము శోభిల్లుచున్న య । ప్పురముఁ జూచె.               36

ఉ. చూచియు మానసంబుఁ గను । చొప్పు నెదన్‌ దలపోసి కామదో

షాచరులన్‌ గలంపఁగ వె । సన్‌ బలగంబులు పట్టి కట్టి బల్‌

నీచముగా మనంబుకడ । నిల్పిన మానసరావణుండు సం

కోచము లేక తోఁక దరి । కొల్పఁగ దానన గాల్చె నప్పురిన్‌.            37

తే. దేహమందలిసంప్రీతి । దిగవిడుచుటె

లంక గాల్చుట; దుర్గుణ । రాశి విడుటె

దనుజులను గూల్చు టన; బుద్ధి । గనుటె సీతఁ

జూచు టన; సిద్ధయోగుల । చొప్పు లిట్ల.                 38

మ. చని యాబుద్ధి తెఱం గెఱింగి శుభస । త్సందేశమున్‌ దెల్ఫి బు

ద్ధిని బాధించు ప్రచండదుర్గుణములన్‌ । దీపించువిజ్ఞానధై

ర్యనిరూఢన్‌ి బరిమార్చి ప్రస్ఫుటమనః । ప్రాబల్య మూహించి దే

హనితాంత ప్రియమున్‌ దహించి చని కా । ర్యం బాత్మకుం దెల్పఁగన్‌.        39

చ. తెలిపినమాత్ర సత్కరుణ । తేజము పెంపెసలార నాత్మ దాఁ

జలమునఁ బ్రాణవాయుముఖ । సర్వచమూతతి నెంట గొంచు నా

మలినమనస్స్వరూపమును । మ్రందఁగఁ జేయుట కుద్యమింపఁ ద

త్సలలిత సాత్వి కాంశము వె । సన్‌ శరణంబును గోరి వచ్చినన్‌.        40

క. వచ్చిన సత్త్వాంశము గొని

మచ్చిక నభయం బొసంగి । మనమును గూల్పన్‌

చెచ్చెఱ బలమును నడపఁగ

నచ్చట సంసారజలధి । యడ్డం బయ్యెన్‌.                   41

ఉ. మానసమున్‌ జయింపఁజను । మార్గమునం దిది యడ్డ మయ్యె; నె

ట్లేనియు దీని దాఁటవలె । నెల్ల బలంబులు; వేఱుమార్గ మే

దైనను గల్గఁబో; దనుచు । నాత్మఁ దలంచియు వేగ నాడికా

వానరపంక్తి నూల్కొలిపి వారిధిఁ గట్టఁగఁజేసె నత్తఱిన్‌.            42

తే. సేతు వనఁగను సంసార । చింత నెల్ల

నెట్టి వేసెడి యాయోగనిష్ఠ । గాదె;

యోగనిష్ఠకు మూలంబు । యోగ్యులైన

భావితాత్ముల తెఱఁగు నాడీవిశుద్ది.                    43

చ. యమనియమాది యోగ విధి । యందు ఘనంబుగ దీక్ష నాత్మ యు

త్తమగతి సేయ మానసముఁ । దార్కొని యవ్విధి సాగనట్టి వి

ఘ్నములొనరించే గోరిక లఁ । గ్రమ్మఁగఁజేయుచుఁగొంతకాల మీ

సమరమె యాత్మకున్‌ మదికి । సాగె జయం బెటు మొగ్గకుండఁగన్‌.      44

చ. తలపడి నిగ్రహించినను । దార్కొని పోరు మనఃప్రవృత్తికిన్‌

బల మిడునత్తమోంశమని । భావమునం దలపోసి యెంతయున్‌

జలము వహించి క్రూరతర । సాయకశక్తిని దత్తమోంశ మి

య్యిలఁ దెగటార్చె; దానిఁ । గని యేపుఁ దొలంగి మనంబు మ్రందఁగన్‌.    45

చ. మనము లయింపకుండిన స । మాధి లభింపదు; గాన దాని నే

యనువుననైనఁ గూల్పవలె । నంచుఁ దలంచి కలంచి పొంచి సా

ధనపటుశక్తిపాతమునఁ । దచ్ఛిరముల్‌ దెగటార్చ వెంబడిన్‌

జననము నొందుచుండె నవి । సారెకు సారెకు నేలఁ గూల్చినన్‌.       46

క. పదియింద్రియములప్రభు వగు

పదియు నొకం డిరద్రియంబె । పౌలస్త్యుఁ డనన్‌;

బదియింద్రియములె వానికి

వదనంబులు; వానిఁ గూల్ప । వర్ధిలుచుండున్‌.                47

చ. చలము వహించి ఘోరతర । సాధనశక్తులఁ దచ్ఛిరంబులన్‌

బొలియఁగఁ జేసినన్‌ మఱియుఁ । బుట్టుచునుండుటఁగాంచి యివ్విధిన్‌

ఫల మిఁకఁ గల్గఁబో దనుచు । బ్రహ్మశరంబును బూని నాభికుం

డలి గుఱిచేసి వేసిన క్ష । ణంబునఁ గూలె మనంబు తూలుచున్‌.       48

మ. తనస్వాతంత్య్రము స్వప్రభూత్తమునితాం । తప్రేమవాత్సల్యముల్‌

గొని వర్తించుట చేత నెల్ల పుడు నె । గ్గున్‌; జెల్లునేగాక; చె

ల్లునె? తత్ప్రాభవమౌ విశేషమును గ । ల్లోలంబుఁ గావింప నా

శన మొందింపక యుండునే? ప్రభువు । దుష్టత్వంబు సైరించునే?       49

ఉ. మానస మంతరింపఁగ నె । మాయలఁ బన్నెడి కామ రాగ దు

ర్మాన మదాది రాక్షసప । రంపర మాయమునొందె; నంత న

మ్మేనఁ జెలంగె శాంతి; సుస । మిద్ధకృపామతి బుద్ధిఁ జేరు సం

ధాన మొనర్ప నాత్మ ప్రమ । దంబుగఁ జేరెను బుద్ధి కూడఁగన్‌.      50

తే. ఉదధిజలసంభవంబైన । యుప్పుగల్లు

ఉదధిఁ గలిసినవిధమున । నొప్పుఁ గాదె

బుద్ధి యాత్మను జేరెడి । పొలుపు గాంచ

నాత్మతో బుద్ధి చేరుట । యదె సమాధి.                   51

ఆ. శరణు వేఁడియున్న । సాత్విక గుణవిభీ

షణుని లంక నిల్పి । సమ్మదముగ

బుద్దితోడఁ గూడి । పురి సయోధ్యను జేరి

యొకటిగా వెలుంగు । చుండె నాత్మ.                  52

క. క్షేత్రము క్షేత్రజ్ఞుని తెఱఁ

గాత్రయి బోధించుచుండు; । నదియే త్రేతన్‌

జిత్రింపఁబడియె రామచ

రిత్రము గా నాకుభవుని । ప్రియవాక్యతతిన్‌.                53

క. క్షేత్రము తెఱఁగును మఱియును

క్షేత్రజ్ఞుని తెఱఁగుఁ దెలియఁ । జేసిరి కథలన్‌

సూత్రముగ ఋషులు ధీశ్రీ

పాత్రులు రామాయణాది । బహుగ్రంథములన్‌.                54

క. భారత చరిత్ర నిటులే

పారాశర్యుఁడు వచించెఁ । బావనతత్త్వ

శ్రీ రాజిల; ఋషివర్యుల

సారస్వత మెల్లఁ దత్త్వ । సారమె సుండీ.                    55

తే. బహువిధంబుల ఋషు లెప్డు । పల్కినదియు

వివిధ వేదంబులన్‌ వెల్లి । విఱిసినదియు

బ్రహ్మసూత్రపదంబులఁ । బరగినదియు

రామత త్త్వరహస్యంబె । ప్రస్ఫుటముగ.                   56

గ్రంథ సమర్పణము

చ. ప్రచరిత మంచు నేఁ దొలుత । రామునితత్త్వములో రహస్యమున్‌

వచనముగా రచించితిని; వాసిగ దానిన పద్యరూపమౌ

రచన మొనర్చి నే నిపుడు । రాముని కర్పణఁ జేసితిన్‌ మదిన్‌

సుచరితుఁ డాపరాత్పరుఁడు । శోభనలీలఁ బరిగ్రహించుతన్‌.          57

చ. తలఁపు ఘటించి రామపద । తత్త్వరహస్యము నెల్ల భక్తితో

నొలసి పఠించినన్‌ వినిన । నొప్పుగ వ్రాసిన భ క్తకోటికిన్‌

దెలిపిన నర్థత త్త్వము మ । దిన్‌ గుదియించిన వారి కెంతయున్‌

సలలిత కామితార్థములు । సద్గతి బ్రహ్మపదంబు సేకుఱున్‌.         58

చ. అరయఁగ శాలివాహన శ । కాబ్దములున్‌ గజదంక సంఖ్యలన్‌ (3881)

బరఁగుచునున్న యట్టి ప్లవ । వత్సర శ్రావణశుద్ధపంచమిన్‌

బరఁగ లిఖించి యీకృతికి । భర్తగఁ జేసితి రామమూర్తి ని

త్తరుణిఁ బరిగ్రహించి నను ధన్యునిఁ జేసి యనుగ్రహించుతన్‌.

శ్రీరామచంద్రార్పణ మస్తు.