గ్రంథకర్త
ఆర్షధర్మ ప్రచారకులును, కోదండ రామశతకాది గ్రంథ కర్తలు
శ్రీయుత పాణ్యం లక్ష్మీ నరసయ్య
ఉయ్యాలవాడ. (కర్నూలు జిల్లా.)
ప్రచురణ
పాణ్యంవారి ప్రచురణలు, కర్నూలు
2022
ధర్మమే శాశ్వతం!
బ్రహ్మ శ్రీ పాణ్యం లక్ష్మీ నరసయ్యగారి రచనలలో బృహద్గ్రంథం ధర్మజ్యోతి. దీనికి ప్రేరణ వారి బాల్యాదిగానున్న ధర్మ తత్పరత, ధర్మ మీమాంస. సమకాలీన అధర్మ, అవినీతి, వికారపు పోకడలకు భీతిల్లి, తగిన పరిష్కారమునకై సంవేదిస్తూ కలతనిద్ర బోవునప్పుడు స్వప్నములో కలిగిన భావనాస్ఫూర్తిని ఈ విధంగా అర్థం చేసుకున్నారు. చాతుర్యుగముల పరిభ్రమణకు గుణ కర్మ స్వభావములే కారణం. ప్రథమ సృష్టిలో యే యుగములో యే కాలంలో యే స్థలంలో యే యే నామరూపాలతో యే యే ప్రకారంగా వ్యవహరించిన ప్రాణులన్నీ, తిరిగి ఆయా యుగాలల్లో యథాతథంగానే మళ్ళీమళ్ళీ పరిభ్రమిస్తున్నాయి. దీనికి ఋజువుగా యోగ వాశిష్టంలోని భుసుండోపాఖ్యానం పేర్కొనవచ్చు. భుసుండుడు కాకి రూపములో నున్న చిరంజీవి. అతడు 26 రామావతారాలను తాను చూసినట్లుగా, చిన్న చిన్న మార్పులతో అవి పునరుక్తమౌతున్నట్లుగా చెప్తాడు. దశావతారాలు మాత్రమే కాకుండా భాగవతంలోని 21 అవతారాలు కూడా ప్రతి సారీ ఆయా యుగాలల్లో సంభవిస్తాయి. ‘‘ధాతా యథాపూర్వమకల్పయత్’’ అనే ఉపనిషద్వాక్యం కూడా దీన్నే తెల్పుతుంది. భగవద్గీతలోని కొన్ని సంధర్భాలలో కూడా ఈ వివరాలున్నాయి. ఆ సిద్ధాంతమాధారంగా వ్రాయబడిరది ఈ గ్రంథం. దీనికి శతావధాని గడియారం వెంకటశేషశాస్త్రిగారు పరిచయ వాక్యం వ్రాసినారు.
ఈ గ్రంథం చాలావిషయాలను లోతుగా, శాస్త్రీయంగా చర్చించింది. దీనిలోని అంశక్రమాన్ని చూస్తే తెలుస్తుంది. దాదాపు 40 రకాల విశేషాలను వివరించినారు. ధర్మ శబ్దార్థం, భరతఖండ ప్రశస్తి, సాంఖ్య, యోగములు, మానవ జీవితం, దాంపత్యం, అస్పృశ్యత, వంటి సాంఘికాంశాలు, గీతోపదేశం, మహర్షుల కృప, వేదమంత్రములు వంటి వాని మొదలు విశ్వేట్ (ఇస్పేట్, పేకాట) వరకు అన్ని స్థాయిలలో వివేచించబడినాయి. వాటి మూలసిద్ధాంతాలు, భారతీయార్షేయ సంప్రదాయంలో తాత్త్విక వ్యాఖ్యతో కూడుకున్నాయి. వీటిలో కొన్నింటిని స్థాలీపులాక న్యాయంగా చూద్దామా?
__ధర్మం: __
ధర్మాత్సుఖం చ జ్ఞానం చ జ్ఞానాన్మోక్షమధిగమ్యతే
ధర్మం వల్ల సుఖం, జ్ఞానం పొందుతారు. జ్ఞానం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. మానవ జీవిత వ్యవహారమంతా, ఆమాటకొస్తే సర్వ సృష్టి వ్యవహారమంతా ధర్మము పైనే ఆధారపడి నడుస్తుంది. శాస్త్రాలన్నీ ధర్మం అనుసరించే యేర్పడినాయి. మానవునికి మిక్కిలి సన్నిహితంగా ఉండేది ధర్మమే. అందుకే పురుషార్థాలు ధర్మంతో మొదలైనాయి. ధర్మం, అర్థం, కామం, మోక్షం. అర్థం కామం ధర్మ బద్ధమైనప్పుడే మోక్షార్హత కల్గుతుంది. లోక కల్యాణం ధర్మంపైనే ఆధారపడిరది. ‘‘ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా’’ విశ్వరూపమున ఉండెడి జగత్తునకు సుస్థిరమైన స్థితినిచ్చేది ధర్మము. గీతలో పరమాత్మ అర్జుని స్వధర్మమునందే నియోగించినాడు. నిష్కామకర్మనే కర్మయోగంగా బోధించి ధర్మ స్వరూపాన్ని వివరించినాడు.
‘‘అనచేత్వమిమం ధర్మ్యం, సంగ్రామం న కరిష్యసి
తతస్సధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి’’ (గీత, 2-3)
ఓ అర్జునా! నీవొకవేళ ధర్మబద్ధమైన ఈ యుద్ధం చేయకుంటే నీ ధర్మాన్నీ కీర్తిని పోగొట్టుకోని, పాపాన్ని పొందుతావు.
ధర్మం యెన్నెన్నో విధాలుగా లోకంలో వ్యాప్తి చెందింది. దేశధర్మాలు, కులధర్మాలు, జాతిధర్మాలు, వయోధర్మాలు, గుణధర్మాలు, శరీరధర్మాలు, కాలధర్మాలు, ఆపద్ధర్మాలు, యుగధర్మాలు. దేశ కాల పాత్రములను బట్టి కొన్ని మార్పులున్నా మూలధర్మం మారరాదు. ఆపద్ధర్మాలుగా, ధర్మ సూక్ష్మాలుగా కొన్ని మార్పులకు లోనౌతాయి. ఉదాహరణకు
సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్ సత్య మప్రియం
నిజమే చెప్పు, ఇష్టమైనదే చెప్పు, ఇష్టం కానిదాన్ని చెప్పొద్దు.
వీటిని మనకు అనుకూలంగా మార్చి గందరగోళం చేసుకోవడం సబబు కాదు. ఈ విధమైన ధర్మమీమాంస, ధర్మ విచారం ఈ గ్రంథంలో విస్తారంగా కనిపిస్తుంది.
మానవ జీవితం:
తల్లి గర్భంలో పడినప్పటి నుండి మరణించే వరకు జీవితంగా మనం అనుభవంలో చూస్తున్నాం. దాని ముందు వెనుకలు గురించి చాలా ఉన్నా, ఇప్పుడది ప్రసక్తం కాదు. మాతృగర్భంలో శుక్ల శోణిత సమ్మిశ్రంగా యేర్పడిన పిండ దశలో ఆత్మ, బుద్ధి, మనస్సు, ప్రాణం, ఇంద్రియాలు వంటివన్నీ అవ్యక్త దశలో ఉన్నాయి. భూపతనమై, శైశవంలో కూడా మూఢావస్థే ఇది. శూద్ర వర్ణ ప్రతీక. క్రమంగా మనో బుద్ధి శక్తులు పెరిగి త్రైవర్ణికంగా మారుతుంది. ఈ బుద్ధి శక్తి, మనోదార్యత లేనివారు సహజంగానే శ్రామిక జీవులై ఉంటారు. ఈ సమర్థత, దేహ పటుత్వం, కష్ట సహిష్ణుత వంటివి లేనివారు బుద్ధిజీవులై ఉంటారు. ఈ మాటలు వింటేనే మనం ఉలికిపడనవసరం లేదు. సంఘములో అందరి భాగస్వామ్యం ఉన్నప్పుడే సుస్థితి. వారి వారి శారీరక, మానసిక, బౌద్ధిక సామర్థ్యాలను బట్టి తగినట్లుగా వృత్తులను యెన్నుకొని పరస్పర సహాయ సహకారాలతో ప్రశాంత సుఖజీవనం మన ప్రాచీన గ్రామీణవ్యవస్థలో ఉండేది. దాన్ని మనం పొగొట్టుకున్నాం. యెప్పుడూ ఆందోళన భయం చికాకులతో ఉన్న వానికి తీవ్ర బుద్ధితో ఆలోచించి, సమర్థతతో నిర్వహింపదగిన పనిని అప్పగిస్తే యేమైతుంది? ఆ పని విఫలమైతుంది, వాడు ఉన్మాదిగా మారుతాడు. ఈ లక్షణాలన్నీ కేవలం వ్యక్తిగతమేనా? లేక వర్ణ జాతి గత గుణాలుగా ఉంటాయా అంటే దానికి యోగ మనస్తత్వ శాస్త్రాలు తగిన సమాధానం చెప్తాయి. ఈ విభజనకు అతీతంగా అనంత కాలానికి కలిసి ఉన్న ఎవరో ఒకరిద్దరిని ఉదాహరణగా చూపుతూ అసలు మూల సిద్ధాంతాన్నీ దుర్వాఖ్య చేయడం సరికాదు. ‘‘అన్ని పనులకు అందరూ అర్హులే. యెవరైనా యేమైనా చేయొచ్చు.’’ వంటి వెర్రి మొర్రి మాటలకు లోనై ధర్మ భ్రష్టులం, కర్మ భ్రష్టులం కారాదని ఈ గ్రంథం హెచ్చరిస్తుంది.
గుణ కర్మలు:
‘‘చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణకర్మ విభాగశః’’ అని గీత వచనం. గుణములను బట్టి, చేసే పనులను బట్టి నాలుగు వర్ణాలుగా సృష్టి జరిగింది. గుణాలు మూడు. సత్త్వం, రజస్సు, తమస్సు. వీటి సమ్మేళనశాతంలోని హెచ్చు తగ్గులే ఈలోకంలోని, మనలోని అనంత భేదాలు. యోగశాస్త్ర విధానంలో మూడు శరీరాలుగా, తత్త్వాలుగా ప్రాణులు, జగత్తు ఉన్నాయి. అవి కారణ, సూక్ష్మ, స్థూలములుగా పిలువబడుతున్నాయి. కారణం మన పూర్వజన్మల వాసనలు. సూక్ష్మం అంతః కరణ చతుష్టయం, ఇంద్రియాలు. స్థూలం కాళ్ళు చేతులు వంటి అవయవాలతో కంటికి కనిపించే భౌతికం. వీటిలో సూక్ష్మకారణాలు గుణ విభాగం. స్థూల శరీరం కర్మ విభాగం.
‘‘భూత భావోద్భవకరః విసర్గః కర్మసంజ్నికః’’ (గీత-8-2)
భూత భావనలంటే ప్రాణుల శరీరాలు. వీటిని బుట్టించేడిది విసర్గం - అంటే శుక్ల శోణిత విభాగ వ్యవస్థ. విసర్గను (:) 2 చుక్కలు గా చూపిస్తాం. రెండు బిందువుల విభాగం ఇది.
గుణ కర్మ
శుక్లం శోణితం
పురుష స్త్రీ
స్వతంత్రం అస్వతంత్రం
పొషక పోష్య
సేవ్య సేవక
ఆత్మ కారణంగా గుణ కర్మలు కలియడం వల్లే సర్వ భూత సృష్టి జరుగుతుంది. సూక్ష్మ కారణ శరీరాలు తెలియబడవు. స్థూలం మాత్రమే ప్రత్యక్షానుభవం. ఈ రెండు స్త్రీ పురుష తత్త్వములుగానున్న దేహజీవులకన్నా వేరుగా అంతరాత్మగా వెలుగొందు వాడే ఈరెండిరటికి భర్త, భోక్త, అధిపతిగానున్నాడు. గీతలోని 18వ అధ్యాయంలోని 12 వశ్లోకం దీన్నే తెల్పుతుంది.
‘‘ఉపద్రష్టాను మంతాచ భర్తాభోక్తా చ మహేశ్వరః
__ పరమాత్మేతి చాప్యుక్తో దేహే-స్మిన్ పురుషః పరః’’__
మన శరీరాన్ని సాధనంగా చేసుకొని, పరమాత్మను సేవించడమే జీవుని కర్తవ్యం. దాని ఫలితంగా జీవభావం వదలి ఆత్మభావం పొందడమే మోక్షం.
జన్మ కర్మ సిద్ధాంతము:
గీతలో దీన్ని గురించి 8వ అధ్యాయం 6వ శ్లోకంలో
__‘‘యంయం వాపి స్మరన్ భావం త్యజ్యత్యంతే కళేబరం । __
తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితాః ॥’’
జీవుడు స్థూల శరీరాన్ని విడిచేటప్పుడు (మరణ సమయంలో) యే భావాన్ని నిలుపుకొని ఉంటాడో ఆ భావాన్నే (ఆ నామరూపాలనే) మరుజన్మలో పొందుతాడు. జీవిత కాలమంతా యే భావాలను మనసులో నిత్యంస్మరిస్తూ ఉంటాడో అవే చివరిలో నిలిచే అవకాశాలు యెక్కువ. వీటికి మళ్ళీ త్రిగుణాలలోనున్న భేదం కారణంగా ఉంటుంది. ఆయా గుణ ప్రభావంతో తగిన చాతుర్వర్ణ దేహాలు ప్రాప్తిస్తాయి. చాతుర్వర్ణం అంటూనే కేవలం మనుషులే కాదు. పశుపక్ష్యాది ప్రాణులే కాకుండా స్థావరాలైన వృక్షలతాదులు కూడా. దీనిలో ఉన్న శాస్త్రీయత గమనిస్తే మరణం అంటే సూక్ష్మ దేహం స్థూల దేహాన్ని వదలిపెట్టడం. జీవునిగా ఉన్న అంతఃకరణ చతుష్టయం పాప పుణ్య ఫలాన్నిపొంది తిరిగి తగిన జన్మను పొందుతుంది. చినిగిన వస్త్రాన్ని వదలి కొత్త బట్టలు కట్టినట్టుగా శిథిలమైన శరీరాన్ని వదలి కొత్త శరీరాన్ని పొందడమే పునర్జన్మ. పునర్జన్మను నిర్ధారించేది ప్రారబ్ధకర్మే. గీతలో ఒక్క అభ్యాస యోగికి మాత్రమే ఉత్తమ మానవ జన్మను హామీ ఇచ్చినాడు పరమాత్మ. అందుకే ‘‘యోగీ భవార్జున’’ అన్నాడు. స్కాందపురాణ హేమకూట ఖండంలో ఇట్లుంది.
‘‘విప్రో భవతి పూర్వస్మిన్ ఇదానీం పూర్వజన్మవాన్
శూద్రో విప్రత్వ మాయాతి విప్రసంకర జన్మ వాన్’’
పూర్వజన్మలో శూద్రుడు ఈ జన్మలో బ్రాహ్మణుడగుచున్నాడు. ఈ జన్మలో బ్రాహ్మణుడు మరుజన్మలో శూద్ర యోనిలో జన్మిస్తున్నాడు. ప్రాణుల కర్మగతి యెవ్వరికీ తెలియదు కదా! దీనికి ప్రమాణంగా ఒక కథ. పంపా క్షేత్రంలో ఒక వేశ్య యోగినిగా మారి జనులను అనుగ్రహిస్తూ ఉంది. అది చూసి శండిలుడనే ఋషి ఆమెను మనస్సులో నిందించినాడు. దివ్యశక్తి గల్గిన ఆయోగిని వానితో అదే మాట అడిగింది. వేశ్యా కులంలో పుట్టినదానికి ఆత్మజ్ఞానమెక్కడిది అని పరిహసించినాడు. దానికామె జన్మ కర్మ రహస్యం యెవ్వరికీ తెలియదు. కేవలం జన్మను బట్టి గర్వించకు అని బదులిచ్చింది. ఒక చెప్పులు కుట్టేవాడు సంతానం కోసం ఆ యోగినిని ఆశ్రయించినాడు. ఆమె వానితో మంచి పాదుకలను తయారుజేసి శండిల ఋషికి సమర్పించమని చెప్పింది. అతడట్లే చేసినాడు. శండిలునికి వాటిపై వ్యామోహం కల్గి, వాటి భావమే నిలిచినప్పుడు మరణించినాడు. ఆ ప్రభావంతో ఆ చెప్పులు కుట్టే వాని భార్యాగర్భంలో చేరినాడు. కానీ ప్రసవ సమయంలో పూర్వజ్ఞానంతో బయటికి రాకుండా ఉన్నాడు. అప్పుడా ఛండాలుని ప్రార్థన మేరకు ఆ యోగిని వచ్చి, గర్భస్థ శిశువుతో నిన్ను కేవలం ఆవుపాలతోనే పెంచే యేర్పాటు చేస్తానని పల్కడంతో శండిలుడు శిశువుగా జన్మించినాడు. క్రమంగా పెరిగి పెద్దైనాడు. పూర్వపుణ్య ప్రభావముతో ఆత్మజ్ఞానిగా వర్తించే వాడు. ఒకసారి రాత్రి జాగరణకు తండ్రి బదులు తానే పోవలసివచ్చి, ప్రజలను తనజ్ఞాన బోధతో జాగృతులను చేసినాడు. రాజు వానిని పిలిచి నీవెవ్వడవని అడిగితే పంపాక్షేత్రంలోనున్న యోగిని ద్వారా తెలుసుకొమ్మన్నాడు. వాని పూర్వ వృత్తాంతం విని, ఆత్మజ్ఞానం పొంది ధన్యుడైనాడు ఆ రాజు.
‘‘అంత్యకాలేతు యం భావం స్మరంతి విబుధా అపి
ప్రప్నువంతి తద్భావ మితివేదవిదో విదుః
యం యం స్మృత్యా త్యజంత్యంతే కళేబరమనన్య ధీః
తం తం దేహాం సమాప్నోతి పురుషో భావన బలాత్’’
సంగ్రహంగా చెప్తే చివరిక్షణంలో యే భావంతోనుంటూ చస్తావో అదే పునర్జన్మగా సిద్ధిస్తుంది. అందుకే మరణాన్ని జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఉలిక్కి పడినారా? మీరు చదివినది నిజమే. మరణాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సిందే. ఐ.సి.యు.లో వెంటిలేటర్‌పైన ప్రాణం వదలేది ఎవ్వరికీ తెలియకుండా చచ్చినాక యెప్పటికో నర్సులు చూసి చెప్తే నీ పెండ్లాం పిల్లలు (నీ ఖర్మ బాగుండి ఐ.సి.యు. బైటే ఉంటే) ఫార్మాలిటీస్ పూర్తిచేసుకొని బాడీ తీసుకొని పోతే శివ శివా ఏమ్ చావు రా నాయనా! ఇదీ ఒక చావేనా? అనే నిస్సహాయంగా జుగుప్సావహంగా అనుకోక తప్పని చావుని తప్పించుకునే ప్లాన్ చేయాలి. దానికి నీ కుటుంబ సభ్యులకు నీ పైన భక్తి గౌరవాలు లేకపోయినా, కనీసమైన అయ్యో పాపం అనే సానుభూతి, జాలి, దయ వుంటే చాలు. నీవు కోరిన చావు నిన్ను చావనిస్తారు. ముందుగా నీకు దానిపైన శ్రద్ధా తత్పరతలుండాల. అప్పుడే అది కుదురుతుంది. నీవాళ్ళను ఒప్పించాలి. చివరి క్షణంలో నీ ఇంటిలోనే నీవాళ్ళంతా చుట్టూ ఉండి నారాయణ స్మరణచేస్తూ గంగాజలం తులసి తీర్థంగా నోట్లో పొస్తూ ఉంటే (నీవు విస్మృతిలో పడకుంటే), నారాయణ నామోచ్చారణ చెవుల్లో పడుతూ ఉంటే, ప్రాణం విడిచి పెట్టడానికి ఎంత సుకృతం ఉండాలో కదా! కనీసం మనం ఈ స్పృహగల్గి, చరమదశలోనైనా నిత్య దైవనామ స్మరణచేస్తూ ధన్యమైన మరణాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ గడపడం అవసరం, దాన్ని ఒక సాధనగా మల్చుకోవాలి. భాగవతంలోని జడభరత, అజామిళోపాఖ్యానాలు దీన్నే బోధిస్తున్నాయి.
ఈ విధమైన యెన్నో గొప్ప విషయాలతో నిండిన గ్రంథం ధర్మజ్యోతి. స్వస్తి....
విషయ సూచిక
ధర్మమే శాశ్వతం! 58
విజ్ఞప్తి 66
పరిచయ వాక్యము-గడియారం వేంకటశేషశాస్త్రి 73
గ్రంథపోషక ప్రశంస 74
ధర్మ శబ్దార్థము 78
ధర్మ శబ్దభావములు 78
పంచవింశతి తత్త్వములు 84
భూతపంచీకరణ విధానము 84
ధర్మము 86
గీతోప దేశ హేతువు 87
వ్యాసమహర్షి 88
మహర్షుల కృప 91
బ్రహ్మ విష్ణు మహేశ్వ రావతారములు 92
సాంఖ్య శబ్ద నిర్వచనము 97
యోగ శబ్దనిర్వచనము 98
వేదాధికారము 100
వేదమంత్రములు 101
మంత్రవర్ణముల విధి ప్రయోజనము 103
నవీనుల మంత్రపరిశోధన 109
మానవ జీవితము 110
యజ్ఞతత్వము 112
జగచ్ఛక్రము 117
విశ్వేట్ 118
విశ్వేటు విశేషములు 120
ధర్మరక్షణము భగవత్కుృత్యము 122
గుణకర్మ విభాగము 122
దాంపత్యము 123
వేద జాతులు 127
బ్రాహ్మణ నింద 132
కలిధర్మము 133
జాతులు - కర్మలు 140
ధర్మనిర్ణయము కష్టమైనది 141
తొలి మలిజన్మల సంబంధము 145
జాతి భేధములు 154
నియతి 155
ఉత్పాత లక్షణము 155
ధర్మవ్యాధుని చరిత్ర 158
అస్పృశ్యత 159
బాధ్యత అధికారము 172
రాజు - ప్రజలు 173
ప్రజాప్రభుత్వ సిద్ధాంతము 174
వాస్తు విద్య 180
ఆచార లక్షణము 182
భరతఖండ ప్రశస్తి 184
విజ్ఞప్తి
శ్లో॥ శ్రీపరబ్రహ్మణే సాధుశ్రీనివాసాఖ్యశర్మణే ।
చిదాత్మ నేనమస్తే-స్మద్గురవే ధర్మసాక్షిణే ॥
నా హృదయమున జిఱుతప్రాయముననే ధర్మమీమాంసయు ధర్మతత్పరతయు మొలకలెత్తుచు, ప్రతిచిన్న విషయము నిది శాస్త్రీయమగునా? కాదా? యనివివేచించుటయు, విజ్ఞలగు పెద్దలనడిగి తెలుసుకొనుటయు ధర్మమని తెలిసినదానిని యధాశక్తి నాచరించుటయు, స్వభావదోహదమై వయస్సు బెఱిగినకొలది నదియు వృద్ధిగా జొచ్చెను.
ఒకనాడు రాత్రి ప్రచండ వేగమున లోకమునందిపుడు బరువెత్తుచున్న సాంఘిక రాజకీయ ధర్మవిప్లవ గతులు దలంపునకువచ్చి, భయవిషాద పరితాపము లలముకొని ప్రొద్దుబోవునంతకు నిదుర బట్ట దయ్యెను. చివర కెటులనో నించుక నిదురించితిని. ప్రభాతమయ్యెను ధ్యాననిమగ్నుడనై యుండ నజ్ఞాన మేఘావృతమైన నాహృదయా కాశమున విద్యుల్లేఖవలె నదేలనో తలవనిదలంపున నొక క్రొత్త భావము స్ఫురించెను మఱియాభావము లోకమునకు క్రొత్తదియో కాదోగాని; నాకుమాత్రమది క్రొత్తదియై నామనశ్శాంతికై భగవానుడు బ్రసాదించిన ప్రేరణమే యని దోచినది, ఆ భావమీది; ‘‘చతుర్విధములగు గుణ-కర్మ-స్వభావములతో నొప్పుచున్న చతుర్యుగములు నొక్కొక్కటియు, ‘‘టాకీఫిలుంరీల్’’ వలె దానియందు క్రమబద్ధమై యుండిన నామరూపాదిక చరిత్రను తనభ్రమణముచే తు.చ. దప్పకుండా ప్రదర్శించుచు నొకయుగము వెంట నొకయుగ మెప్పటి కిట్టులనే పరిభ్రమించు చుండుటయే స్వభావము.’’
ఏయుగమునందే కాలమున నేస్థలమునం దేనామరూపములుగల భూతము లెట్లెట్లు వ్యవహరించునో; ఆయుగ మెపుడువచ్చినను ఆకాలమున నాస్థలము నందాయా నామరూపములుగల భూతము లట్లట్లనే వ్యవహరించుచుండుననియే దాని తాత్పర్యము.
నాకీభావమెంతయో మనశ్శాంతి బ్రసాదించినది మఱియు నా గ్రంథా న్వేషణమున నిందుల కెన్ని యో యుపపత్తులును లభించెను. అందులో ముఖ్యములు:-
- ‘‘ధాతాయధాపూర్వ మకల్పయత్’’ అనెడి శృతియును.
- భగవద్గీతయందల (2-12) (2-28) (4-5) (8-16) (8-19) (9-7) (9-8) శ్లోకములును.
- జ్ఞానవాసిష్ఠమున భుసుండోపాఖ్యానము.
- పద్మపురాణము ఐంద్రసు వ్రతో పాఖ్యానము.
- భవిష్యపురాణమున ప్రతిసర్గ పర్వము.
- స్కాందపురాణమున పూర్వకలియుగ వర్ణనము.
- నాడీగ్రంథములలోని జాతకములును.
- సంసృతమహాభారతాశ్వమేధపర్వము.
ఇంకనుయొన్నియో యాధారములు గాన్పించినవి. విస్తర మగునని విరమించితిని నా యీభావమును సాహిత్యపత్రికలమూలమున లోకమున కెఱుక పఱుపదలచి తొలుత సంగ్రహమగు వ్యాసమును రచించితిని, గాని పత్రికలందు ప్రకటింపబడు వ్యాసములు వార్తలు ‘‘బౌద్ధుల యాత్మలవలె క్షణికములేయగునని యెంచి, మఱియు నాయెఱింగిన కొన్ని ధర్మములను పొందుబఱచి, యీ పుస్తకమును రచించితిని.
పిదప నొకప్పుడు డోన్ తాలూక వెలుదుర్తి గ్రామము నందుండిన నా సోదరకుటుంబమును జూడనగుట ఘటిల్లెను. అచట నాగ్రామవాస్తవ్యులగు శ్రీపెరుమాళ ఎల్ల రామయ్య శ్రేష్ఠిగారికి పౌరాణికగోష్ఠిలో నీ ధర్మజ్యోతిని వినిపింప; నతడు దీనిని ముద్రణము నొనరింప హర్షముతో నంగీరించెను. అప్పుడు కర్నూలు జైహింద్ ప్రెస్ వారికి ముద్రణమునకిచ్చుటయ్యెను. కర్నూలు బ్రహ్మశ్రీ చెన్ను భొట్ల వెంకటకృష్ణశర్మగారీ ముద్రణమున కెంతయో సహాయమొనరించిరి. వారికెంతయుగృతజ్ఞుడను.
ముఖ్యముగ నా యీధర్మజ్యోతికి జక్కనిపరిచయవాక్యము నొసంగి మన్నించిన సుహృదయములు, సువిశృతనామధేయులు, శివ భారత గ్రంథకర్తలు బాల్యమిత్రులు ప్రొద్దుటూరు వాస్తవ్యులునగు బ్రహ్మశ్రీ గడియారము వెంకట శేషశాస్త్రీగారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు సమర్పించుచున్నాను.
కృతిసువర్ణ పరీక్షకు పండితహృదయఫలకములే నికషోఫలములు. గాన పండితలోక మెంతవెల నీకృతి కొసంగునో కాలమే దెలుపగలదు. గుణగ్రహణ పారీణులగు మనీషులిందేమైన గుణలేశమున్నచో గైకొని, దోషముల బరిహరింతురని ప్రార్థించుచున్నాను. నాకిట్టిప్రేరణము నొసంగి నా మూలమున నిట్టికార్యమును సాగించిన భగవానునకు నాశతసహస్ర నమోవాకములు.
-: శ్రీగురుశ్శరణం :-
ఇట్లు, విన్నవించు సుధీజన విధేదేయుడు,
పాణ్వం లక్ష్మీనరసింహయ్య.
ఉయ్యాలవాడ గ్రామం,
నందన కార్తీక శుక్ల త్రయోదశి, తేది. 31-10-1952
శ్రీ
‘‘ధర్మ జ్యోతి’’
పరిచయవాక్యము
‘‘ధర్మజ్యోతి’’ యనఁగా ధర్మమను జ్యోతి యనవచ్చును. ధర్మమునకు జ్యోతి యసుటయుఁదగును. స్వయంప్రకాశకమై మానవుల కన్నులు వచ్చి మార్గము చూపించు వెలుఁగని తాత్పర్యము. ఇది యొక యుద్గ్రంథము. సూర్యచంద్ర తారకామండలములు యథాపూర్వముగా వెలుఁగుచున్నను. విశేషించి యీనాఁడు విద్యుద్దీపము లింటింట వీథివీథుల మిఱుమిట్లు గొలుపుచున్నను, మానవ ప్రపంచమేదో గాఢాంధకారా వృతమైనట్లుగా గ్రహించి, తదుప యోగార్థమి వాఙ్మయ ప్రచురమైన ధర్మజ్యోతి వెలిగించినాఁ డీగ్రంథకర్త. యీనాఁడు వెలువడుచున్న వివిధ వాఙ్మయ రూపములఁ జూచుచున్నపుడీ గ్రంథావిష్కరమున కెంత యావశ్యకత యున్నదో యంతసాహసము గూడాఁ గలదని తోఁపక మానదు. గ్రంథరచన స్వప్రతిభా పాండిత్య ప్రకటనకును, లోకుల తాత్కాలికాభిరుచులఁ దనియించు టకును, దన్మూలక భౌతికార్థ సాధనకుఁ గాక, ఆవశ్యకత గుర్తించి ప్రయోజనము లక్షించి యీశ్వరాదిష్ఠ విజ్ఞానము స్వవిధినిర్వహణ కుపయోగించుటగా భావించి నపుడే యిట్టిగై ర్వాణమైన శాస్త్రానుసంధానము ప్రాతికూల్య ప్రతి ఘటనలతోఁ జేయవలసి వచ్చును. భారతమున నిప్పుడు పొరలు పొరలుగాఁ గ్రమ్మిన చీఁకటి తెరలు చెదరఁగొట్టి సత్యార్థ దర్శనముతో స్వస్త్యయనము చేకూర్చుటకే యీధర్మజ్యోతి వెలిగించితి ననుచున్నాఁడీ గ్రంథకర్త. కనుకనే యిది సాహసోపేతమైన యుదాత్త ధర్మానుష్ఠానమైనది. యిఁక నీవెలుఁగు నుపయోగించుకొనుట లోకము వంతు.
‘‘మానవజీవిత మందిప్పుడు భౌతిక దృక్పథము ప్రబలి, ప్రత్యక్షములైన యైహిక భోగములకు భావములకు ననుభూతులకుఁ బ్రాధాన్య మీయబడుచున్నది. ఇది సవ్యము శ్రేయస్కరముగాదు. సత్యము పరమార్థమునైన యాధ్యాత్మిక దృక్పథముతో వివేచించి విధించిన ధర్మానుష్ఠానమే శ్రేయోమార్గము. శాస్త్రాను గతముగా సంప్రదాయ సిద్ధముగా నాధర్మము తెలిసికొనుట కర్తవ్యము.’’ ఈ యీవివేచనతో గ్రంథకర్త యీరచన కుపక్రమించుచున్నాఁడు. వీరి ధర్మమీమాంస చక్కని ప్రజ్ఞతో నుపజ్ఞతో శాస్త్రవాదముతో సంప్రదాయోప పాదనముతో సవిస్తరముగా సమగ్రముగా సాఁగినది. ఆవిశేషము లన్నియుఁ బాఠకులు గ్రంథమునఁ జదువఁగలరు, దాని సంగ్రహ స్వరూపమిట్లు చెప్పవచ్చును.
‘‘సత్యమై చర్మచక్షువుల కగోచరమై సర్వవ్యాపక మైన బ్రహ్మపదార్థ మొకటి గలదు. అది నాణెమున నొక వైపు బొమ్మ - కేవల జ్ఞానరూపము-అనాణెమున రెండవవైవు ప్రవృత్తి మయమైన ధర్మము లిపిముద్రాచిహ్నితము - అది కర్మ రూపమైనది. లోక ప్రవృత్తి యంతయు నీధర్మముపై నాధారపడినది. ధర్మమనఁగా లోకమును ధరించునది-తరింపఁజేయునది. యీపదమున కెన్నో తాత్పర్యార్థములు గలవు. అవన్నియు ప్రకరణ ప్రయోజనములఁ బట్టి సంగతము లగుచుండును. ఆధర్మతత్వముఁ దెలియవలయునన్న ముందు సృష్టితత్వము నెఱుఁగవలెను. ఎందుకనఁగా, ధర్మతత్వవిశేషమంతయు సృష్టితత్వము యొక్క బహుముఖ విధాన సంధానములందే యమరియున్నది. ఆ సృష్టితత్వ మీక్రమమున నున్నది.
మొదటిది బ్రహ్మ, లేక ఆత్మయను పదార్థము. దాని నుండి పంచ భూతములు. వాని నుండి ప్రపంచము. ఇది బ్రహ్మాండము. దీనివలె పిండాండము, పంచ భూతములకు సత్వరజస్తమములను మూఁడు గుణములుగలవు. పంచీకరణ విధానములో నివియన్నియుఁగలిసి యిరువది నాలుగు తత్వముల క్షేత్రమై, యిరువదే నవతత్వము క్షేత్రజుఁడగును. అతఁడే యీక్షేత్రమును నడుపును. అదియే ధర్మము.
యీభూత సృష్టియందలి గుణకర్మ విభాగ వైవిధ్యమును బట్టి చాతుర్వర్ణ్య మేర్పడుచున్నది. ఇది స్యభావజమేగాని కల్పితమ గాదు; బ్రహ్మవిష్ణ్వాది దేవతలయందుఁ గూడా నీచాతుర్వర్ణ్యము పోలికలు గలవు. మానవులందుఁ పశుపక్ష్యాది ప్రాణులందు జడపదార్థములందు నీయన్నింటి ప్రవృత్తులందును జాతుర్వర్ణ్య విధానము గలదు. కనుకనే సృష్టియంతయుఁ జాతుర్వర్ణ్యమయమై, తత్తద్గుణ కర్మవిభాగాను గుణవృత్తుల వెంట నడచుచున్నది. యీపరిస్థితి యీ శ్వరుఁడుగానీ మానవుఁడుగానీ కల్పించినది కాదు. సహజపరిణామ ఫలితము, అది కేవలము సహజ పరిణామ ఫలితము.
యీరహస్య మంతయుఁ దెలియుటకును దదనుగుణము గాననుష్ఠించి తరించుటకును రెండే మార్గములుగలవు. ఒకటి జ్ఞానము లేక సాంఖ్యము. రెండవది కర్మము - లేక - యోగము యీసాంఖ్యమే యోగమును గూడా నడుపును. సాంఖ్యము అక్షరసంఖ్యా ప్రచురము వేదమయము. ఆవేదాధికారము త్రివర్ణముల కేగాని నాలుగవ వర్ణమునకు లేదు. అట్లగుట స్వభావసిద్ధమేగాని పక్షపాత ప్రేరితముకాదు. వేదమంత్రమల సృష్టియే విలక్షణమైనది. ఆమంత్రములలోఁ బ్రతియక్షరము ప్రతి స్వరము, ఉచ్చారణక్రముము. అక్షర దేవతలు, వారి రంగులు మొదలగు సామగ్రియంతయు నలౌకిక భావ ప్రభావ ప్రయోజన సంకలితము. యీ విషయము ప్రత్యక్షానుమాన ప్రయోగ పరీక్షితమై సర్వాంగీ కృతమగుటయేగాదు వేదాధికారము త్రివర్ణములకే యను సంశమును ధృవపఱచుమన్నది. మానవులలో శరీరకర్మ ప్రధానులు కొందఱు బుద్ధికర్మ ప్రధానులు కొందఱుఁగలరు. బుద్ధికర్మ ప్రధానులకే వేదాధికారము. అది గుణ విభాగనిష్టన్నము వేదోదితమే ధర్మము దానినే యనుష్ఠింపవలెను.
మానవ కర్మలన్నియు యజ్ఞములే. అవి వేదోక్త ములు. యజ్ఞములచే దేవతలు సంతసింతురు వారివలన మానవులకు శుభములు, సుఖజీవనములు గలుగును. కావున మానవ కర్మలన్నియు వేదోక్తములై, ధర్మబద్ధములై యుండవలెను.
ఈజగచ్చక్ర మంతయుఁ బదుమూడంగములచే నడుచుచున్నది. అవి పది యింద్రియములు. మనస్సు, బుద్ధి, జీవుడు, - లేక - ఆత్మ యనునవి. వీనిలో నొకదానికంటే నొకటి యుత్తరోత్తరము ప్రధానమైనది ఇందు గుణకర్మ విభాగముతోడి చాతుర్వర్ణ్యము సంప్రదాయసిద్ధమై కనఁబడును. మానవ జీవితమునందువలెనే ‘కుమ్మరిసారెయను యంత్రమందును, ‘విశ్వేట్’ అను నాటయందుఁగూడఁ జాతుర్వర్ణ్యవిభాగ మెట్లు కుదిరియున్నదో పోలికలు చూచి గ్రహింపవచ్చును. సృష్టికి మూలమయిన దాంపత్యమునందు, స్త్రీ పురుషులయందు శుక్ల శోణితములందు, దేహజీవులయందు, వానివాని ధర్మ కర్మ యందు, తత్ప్రతిపాదకములైన వేదములందు, వేదపురుషునందును గుణకర్మ విభాగములతోడి చాతుర్వర్ణ్యము-సేవ్యసేవక పోష్యపోషక భావములు-స్వతంత్రతా పరతంత్రతలు నెంత చక్కగా నమరియున్నవో విజ్ఞులు పరిశీలించి తెలియగలరు. ప్రతియొక కార్యసిద్ధికి ముఖ్యాంగములైన యైదింటిలో నైదవది దైవము. తక్కినవి శరీరము, జీవుడు, నింద్రియములు, వాని కార్యములు నను నాల్గు. ఇదియుఁ జాతుర్వర్ణ్యయోగమే ఇందులో మొదటిదైన శరీరము కేవలోపకరణము కావున, దానికి వేదాధికారము లేదు. తక్కిన, ‘‘వేదోక్త ధర్మము సనుసరింపవలెను. ఇట్టి వివరణములతో నీగ్రంథము జాతుర్వర్ణ్య ప్రవృత్తియు. దానికి మూలమైన వేద ధర్మములే మానవ జీవితమును సుభిక్షము చేయగలవని విస్తరించి చెప్పినది.
మఱియు ‘‘జన్మముతో మానవులందఱు సమానులు, కర్మముతోవచ్చిన వర్ణవ్యవస్థ కృత్రిమ’’మను కొందఱి భావమును ఖండిచుచు, ‘‘జన్మచేతనే జాతి యేర్పడినది కర్మచేఁగాదు, ఆ జాతికి ప్రాగ్జన్మ కర్మలు కారణములు. వానినుండి వర్ణ వ్యవస్థ వచ్చినది. తన్మూలకములే యిప్పటి కర్మలు. యీ వర్ణ వ్యవస్థ మానవులందే గాదు చేతన జడాదిక పదార్థములందంతటఁ గలదని ముందే చెప్పబడినది. అది స్వభావజము ఏదోయొక నియతి దాని నడుపుచున్నది. దాని నుల్లంఘించి జాతి సాంకర్యము చేయుట ప్రమాదకరము. భిన్న ప్రకృతిగల జడపదార్థములఁ గలిపినను గుణభేదముతో గర్మభేదమేర్పడి విపరీత ఫలము కలుగుచున్నట్లు మానవజాతి సాంకర్యముతో ననర్థకములెన్నో పుట్టుకొనిరాఁగలవు. ఈ ధర్మ స్వరూపము నిగూఢ దురవగాహము గావున దానిని వేదములవలనఁ ద్ఞులవలనఁ దెలిసికొని కర్మానుష్ఠానము చేయుటే శ్రేయ’’ మని యీ గ్రంథము నిరూపించుచున్నది.