ప్రసక్తాను ప్రసక్తముగా నిప్పటి కులమత వర్ణవర్గాది భేదములుండరాదను వాదము, అస్పృశ్యత, సంఘసంస్కారము, దైవ పౌరుష స్వాతంత్య్రములు, బాధ్యత, అధికారము, ప్రజలు-ప్రభుత్వము, దేశ గ్రామ గృహాది వ్యవస్థలు, గృహరాజ్యము, వాస్తుశాస్త్రము, గ్రామజాతి లక్షణములు, ఆచార ధర్మ సంప్రదాయములు మున్నగు ననేకాంశములు చర్చించఁబడి భారత జాతీయ సంస్కృతి విశిష్టత చక్కగా వర్ణింపబడినది. ఈ విమర్శమునందంతట బ్రదిపాదితమైన ప్రతి విషయమునకు శృతిస్మృతులనుండి భగవద్గీతా పురాణములనుండి బహుళ ప్రమాణము లీయఁబడినవి. సహేతుకములైన వివరణములు, సముచితములైన యుపపత్తులు సమగ్రములైన లౌకిక దృష్టాంతము లుల్లేఖంపబడినవి. స్వవాద సమర్థనము నందును, బ్రతివాద ఖండమునందును, నడచిన సుకుమార భాషాభావ వాక్య ప్రయోగము శాస్త్రీయ చర్చకుఁదగిన మర్యాదతో నందగించినది. ఇందలి ప్రతి విషయము గ్రంథకర్తకుఁగల ప్రతిభా పాండిత్యములను వివేచనావిశిష్టతను లోక శాస్త్రానుభవములను ధర్మ కర్మాభిరతిని వెల్లడిరచుచున్నవి. ఈయన తానేమి చెప్పినను ‘‘ఏవముపాసితవ్యమ్ ఏవం చైతదుపాస్యమ్’’ అన్నట్లు స్పష్ట ప్రతిపాదనము చేసి విడచును. ఈ విధముగా నీగ్రంథకర్త యీ ప్రయత్నమున స్వవిధిని జక్కగా నిర్వహించి కృతార్థుఁడైనాడనియే నాభావము.
ఈయనగూడా నట్లే తృప్తి పడుచున్నాడు. కాని లోకము దీనిని సవ్యముగ గ్రహించునా? చక్కగ ననుష్ఠించునా? యను విచికిత్స యాయనకు లేకపోలేదు. ఆయనకేగాదు వాఙ్మయ స్రష్టలగు నందఱికినిఁ తన హృదయ పరిమళము లోక మాస్వాదించి యానందింపవలెనను యాకాంక్షయుండుట సహజము. నిజముగా నట్టి రచనల కింతకంటే మిక్కిలిగా సత్కార మేమున్నది? ‘విశ్వ శ్రేయః కావ్యమ్! అను మాటకుఁ దాత్పర్యమదియేగదా? కాని ఈయనకా యూఱట కూడా నున్నట్లు లేదు. ‘లోకము వెఱ్ఱివానిగా భావించి వదలుటయో దూషణ తిరస్కా రాదులచేత చుట్టుముట్టుటయో చేయకపోదు’ అని స్పష్టముగనేయన్నాడు. నేఁటి లోక ప్రవృత్తి యాయనచే నట్లు బలికించినది. కాని ధర్మ ప్రతిష్ఠావసరమున నీ ప్రతికూల పరిస్థితి క్రొత్త గాదు నిష్ఠాపరుఁడు దీనికి నిరుత్సాహపడరాదని నాతలంపు. ఇట్టి సందర్భముననే ప్రతికూల పరిస్థితిని ధిక్కరించుచుఁ బరమ స్వతంత్రుఁడైన భవభూతి మహాకవి యేమన్నాడో వినుఁడు, ‘‘యేనామకేచిదిహనః ప్రథయఁత్యవజ్ఞాం జానంతుతే కిమపితాన్ప్రతినై షయత్నః । ఉత్పత్స్యతే మమతు కోపి సమాన ధర్మా కాలోహ్యయం నిరవధిర్విపులాచపృథ్వీ’’ - నారచన జదువనివారి కొఱకు నేను వ్రాయలేదు. ఇది చదువువాఁడు, నావంటి వాడొకఁడెప్పుడో ఎచ్చటనో పుట్టగలడు’’ ఆమహామహుని యచంచలమైన యాత్మ ప్రత్యయము మనకొరవడి కావలెను భారతర్షుల పవిత్ర తేజః కిరణలేశము మనలో మన వాక్కులో నున్నపుడు మనము భావించినదే ధర్మమైనప్పుడది యెప్పుడో యెట్లో పొటమరించి చిగిరించి పుష్పించి ఫలించి విశ్వ కల్యాణము చేకూర్పకపోదు ధర్మనైష్ఠికుల హృదయములలో విశ్వాసము జాగరూకమైనచో నంతట నమృతవర్షము కురియును.
భారతలోకము చెప్పవలసియున్నది. మన నిత్యజీవితమున సర్వాంతరముల భారతజాతీయ ధార్మిక సంప్రదాయము నేఁటివరకు నిండుగా నమరియున్నది. యుగ యుగముల నుండి తర తరముల వెంట వచ్చిన దీనిలో దేశకాలోపగతమైన మాలిన్య మేదో పేరికొని యుండకపోదు. యెంత సహయజమో సత్యముగా నిందులో నంతర్వాహినియై యాత్మ ధర్మజ్యోతి వెలుఁగుచున్నది. ఆ మాలిన్యము తొలగించి యాజ్యోతి వెలిగించు మన కర్తవ్యము మన మనుభవించుచున్న వెలుపలి భౌతిక పదార్థములు వాని రుచులు రూపురేకలు భోగించుచున్నంతవరకే ఉత్తర క్షణముననే యన్నియు సదృశ్యమైపోవును. మంచి చెడ్డ ప్రయోగ పరిపాకములు నీయింద్రియములుగూడ స్వయముగ నెఱుఁగజాలవు. మహాశక్తియేదో లోపలనుండి యీ యన్నింటిని నడుపుచున్నది. దాని నెఱుగకున్న మన జీవితమంతయు వట్టి బొమ్మలాట. దాని నెఱుఁగుటకీ వెలుపలి భౌతిక సామగ్రి - యంత్ర ప్రయోగము లేవియుఁ జాలవనుటయను భవసిద్ధము. ముందుకు తొంగిచూచిననేమున్నది? కనుకనే యిచ్చటినుండి వెనుకకుఁజూచి, యీరహస్యము దెలుపు శాస్త్రములను తద్విదులైన పెద్దలను వారేర్పఱచిన యాచార సాంప్రదాయములను పునః పరిశీలించి సత్యాన్వేషణము చేయవలసియున్నది. ప్రయత్నములో ధర్మజ్యోతి యొక వెలుగు బాట చూపగలదని సమ్మకము, నీవిశ్వాసము నన్వేషణము మేలుకొనవలెనని కోరుచున్నాను.
ఈ గ్రంథకర్త బ్రహ్మశ్రీ పాణ్యము లక్ష్మీనరసింహశాస్త్రి గారు నాకు బాల్యమిత్రుడు. తన విద్యకు వివేచనకు విజ్ఞానమునకుఁ బరిశోధనమునకు ఫలితముగా ధర్మజ్యోతి వెలయుంచినందుకు హృదయ పూర్వకముగా నభినందించు చున్నాను. ఇట్లే లోకోపకార కృషి యితోధికముగా నిర్వహింప భగవంతుఁడీయనకు దీర్ఘాయురారోగ్యములను గ్రహింపవలెనని నా యాకాంక్ష.
ప్రొద్దుటూరు గడియారము వేంకట శేషశాస్త్రి,
వందన కార్తీక శతావధాని.
గ్రంథపోషకులు:
వెలుదుర్తి గ్రామం శ్రీయుత, పెరుమాళ్ల యెల్ల రామయ్యగారి ప్రశంస
మ॥ విలసిల్లున్ వెలుదుర్తి నామపురముర్విన్ సర్వసౌభాగ్యశో
భల నొప్పారుచు, బ్రహ్మగుండశివభవ్యక్షేత్ర పశ్చాద్భువిన్
కలవాయూరను బేరముల్ సలుపు సౌకర్యంబు లెన్నేని వై
శ్యులు వాణిజ్యధనప్రపూర్ణులును భక్త్యుత్సాహధర్మోన్నతుల్ ।
గీ॥ అప్పురంబునఁ దొల్లినే నన్న దాన
వంశకూపారచంద్రుఁడై వాసిఁగన్న
సుబ్బ శాస్త్రుల పూర్ణ విశుద్ధకృపను
చదువుకొంటిని కొన్నేండ్లు సంస్కృతమును॥
ఉ॥ అన్నయుఁ దమ్ముడచ్చట గృహాదులతో నివసించియుండుటన్
జిన్నతనంబునన్ జదువు నేర్చిన మద్గురు వాసమౌట నా
కన్ని విధంబులన్ కడుసుఖాస్పదులచ్చట నుంటఁజేసి నా
కన్న పురమ్ముకన్న అదిగన్నులపండువొనర్చు నెప్పుడున్॥
క॥ సారస్వతాభిమానుల్
భారతరామాయణాది భగవత్కథలన్
గూరిమితోవిన గోరెడి
వారల్ వెలుదుర్తిలోని వైశ్య ప్రవరుల్॥
చ॥ ప్రియుఁడును యెల్ల రామపదవిశ్రుతనాముఁడు గీర్తి కాముఁడున్
నయము వివేకమున్ గలిగి నావలనన్ భగవత్కథాదు లెం
తయు వినుచుండువాఁడు నిజధర్మపథంబుననుండువాఁడువి
క్రయక్రయశాలివైశ్యకులగణ్యుఁడుధన్యుఁడుమాన్యుఁడప్పురిన్.
సీ॥ వరమోర కులగోత్ర పెరుమాళ్ళవంశంబ
యెవ్వని జన్మకు హేతువయ్యె
వితతస్వధర్మైక రతుడు వెంగనశ్రేష్ఠి
దనరె నెవ్వని బ్రపితామహుండు
విమలపావనగుణాన్వితుడు మాసుము శ్రేష్ఠీ
నామించే నెవని పితామహుండు
వెంకటరామాఖ్య వెలసె నెవ్వనితండ్రి
నారమ్మకెవఁడు జిన్నారికొడుకు॥
గీ॥ కడుహితాత్మకుఁడైన నాగయ్యశ్రేష్ఠి
బరగ నెవ్వని కన్నయై వరలె నట్టి
ప్రథిత వృత్తంబుగల యెల్ల రామశ్రేష్ఠి
శ్రవణగొష్ఠిని భక్తి తోఁ జేయుచుండ॥
శా॥ కర్మజ్ఞాన పురాణ సత్కథలు వక్కాణించి యొక్కప్పుడేన్
ధర్మజ్యోతి విధానమున్ దెలుప నంతన్ సంతసంబంది యీ
దుర్మాలిన్య కలి ప్రచేష్టలను బెన్ దూలించు నీ గ్రంథమున్
బేర్మిన్ ముద్రణ మొందఁ జేయుమనిదెల్పెన్ దాసముత్సాహియై॥
కం॥ అప్పుడు నేనిట్లంటిని
యొప్పుగనిది ముద్రణంబు నొనరింపుము నే
నిప్పగిది వ్రాసియున్నవి
యొప్పారెడు బెక్కు ముద్ర నొనరించినచోన్॥
సీ॥ ఉత్ఫలమాలల నురుభక్తి నీశ్వర శతకంబు
గూర్చితి శైశవమున
వ్రాసితి కోదండరామాఖ్య శతకంబు
తర్వాత సీస పద్యములు జెలఁగ
నది ముద్రణంబయ్యె నామీద శార్దూల
విక్రీడితంబుల విశ్వనాథు
మదినెంచి నక్షత్రమాల రచించితి
మఱి లిఖించితి గుణమంజరియును
గీ॥ రామతత్వ రహస్యంబు వ్రాసినాడ
గౌరి వ్రత కథ పాటగాగ విరచించి
వ్రాయుచున్నాఁడ నిప్పుడు పంపమహిమ
ముద్రణ మొనర్ప బుణ్యులు బూని రేని॥
మ॥ సతతంబున్ ఖిల మొందనట్టి దవుటన్ సంతాన వర్గంబు
గృతియే బెద్దని పెద్దలందురుగదా, యీ గ్రంథ సంతాన
క్షితి వర్ధిల్లగ జేయు మీశ్వరుఁడు శ్వశ్రేయోర్థ సౌభాగ్య
తతులన్నీ కిడు సద్యశంబు భువి నత్యంతంబు రాజిల్లెడున్॥
మ॥ అని నేదెల్పగ సంతసంబునను మీ యా దేశమే మైన జే
తును, మీరెప్పుడు నెట్టి కార్యమును నాతోఁజెప్ప లేదింత
మునుపీరీతి నటంచు గ్రంథమిటులన్ ముద్రింపగాఁజేసె న
ప్పని లోకైక హితంబుగాఁదలఁచి సద్భావంబు దీపింపగన్॥
కం॥ జగతిన్ ధర్మజ్యోతిని
నెగడంగా జేసినట్టి నిర్మల చరితుం
డగు యెల రామశ్రేష్ఠికి
ఖగ వాహనుఁడిచ్చు గాక కడుశ్రేయంబుల్॥
ఓం తత్సత్
ధర్మజ్యోతి
శ్లో॥ యంశైవాస్సముపాసతే శివఇతి బ్రహ్మేతి వేదాంతినః।
బౌద్ధాబుద్ధ ఇతిప్రమాణ పటివః కర్తేతి నైయాయికాః
అర్హన్నిత్యధజైన శాసనరతాః కర్మేతి మీమాంస కాః॥
సోయం వోవిదధాతు వాంఛితఫలం త్రైలోక్యనాథోహరిః॥
ఓం అధాతోధర్మ జిజ్ఞాసా । అధాతో బ్రహ్మజిజ్ఞాసా
ఆనందస్థితి నందుటకు మానవుడెఱుంగవలసిన తత్వములు రెండు గలవు,
అందొకటి కర్మస్వరూపమగు ధర్మతత్వము రెండవది జ్యోతిస్వరూపమగు బ్రహ్మతత్వమై యున్నది.
బ్రహ్మతత్వమునకు ధర్మతత్వ మంగమైయున్నందున ముందు ధర్మతత్వము నెఱుంగుట యుక్తము గనుకనే శాస్త్రకారులు ముందు ‘‘అథాతోధర్మజిజ్ఞాసా’’ అనివచించుచున్నారు.
శ్లో॥ ధర్మాత్సుఖంచజ్ఞానంచ జ్ఞానాన్మోక్షోధిగమ్యతే॥
తా॥ ధర్మమువల్ల సుఖము జ్ఞానము లభించును జ్ఞానము వల్ల మోక్షము సిద్ధించును.
పరామార్థమునం దీరెంటికిని భేదము లేకున్నను వ్యవహార స్థితియందు భేదమును శాస్త్రకారులు నిరూపించుచున్నారు
పరమార్థమున తత్వమొక్కటియేగాన, బోధించునది యొకటియు బోధింప బడునది మఱియొకటియు నుండుట కవకాశములేదు.
వ్యావహారిక స్థితి నాశ్రయించియే. శాస్త్రములన్నిటికిని ప్రవృత్తి యేర్పడినది.
వ్యవహారమంతయును. ధర్మముపైననే ప్రవర్తించుచున్నది. గాన శాస్త్రము లన్నియును ధర్మతత్వము నాశ్రయించియే తత్వమునుబోధించుచున్నవి.
మానవునకు మిక్కిలి సన్నిహితముగ నుండునది ధర్మతత్వము దాని నాశ్రయించి బ్రహ్మత్వము నొందవలసి యున్నది.
ఈ రెండిటినే శ్రీమద్భగవద్గీతయందు. భగవానుడు సాంఖ్య యోగములనియు జ్ఞానకర్మలనియును బేర్కొనుచున్నాడు.
ధర్మముపైననే లోక కల్యాణమంతయు నాధారపడియున్నది గనుకనే వేదము.
‘‘ధర్మంచర’’
ధర్మము నాచరింపుమని యా దేశమిచ్చునున్నది.
- శ్రుతి -
‘‘ధర్మో నిశ్వస్య జగతః ప్రతిష్ఠా’’
తా॥ విశ్వరూపమున నుండు జగత్తునకు స్థిరమగు సుస్థితి నొసఁగునది ధర్మము.
- స్మృతి -
‘‘ధర్మోరక్షతి రక్షితః’’
తా॥ ధర్మము. తనను రక్షించెడి వానిని రక్షించుచున్నది.
-: ధర్మ శబ్దార్థము :-
శ్లో॥ ధారణాద్ధర్మ మిత్యాహుః ధర్మోధారయతీ ప్రజాః
ప్రభ వార్ధాయ భూతా నాం ధర్మ ప్రవచనం కృతం ॥
ధారణోద్ధర్మ విత్యాహుః ధర్మేణ విదృతాః ప్రజాః
యస్స్యాద్ధారణ సంయుక్తః సధర్మ ఇతి నిశ్చయః॥ (శాంతి పర్వము)
తా॥ ధరించుటవల్ల ధర్మమనుచున్నారు. ధర్మము ప్రజలను ధరించుచున్నది, భూతములయొక్క సంభవము కొరకు. ధర్మము ప్రవచింపబడినది. ధర్మముచేత ప్రజలు ధరింపబడుచున్నారు. ఏది ప్రజలనుద్ధరించునో అది ధర్మము - ధర్మమనగా శరీరధారియగు ప్రతిప్రాణిని యతడుండిన స్థానము నుండి యుత్కృష్ఠమగు స్థానమునకు-గొనిపోయెడి సాధనమని భావము.
-
: ధర్మశబ్దభావములు :-
-
దరిద్రునకు ధర్మమొసగు మనినప్పుడు దానము చేయు మనెడు భావము నిచ్చుచున్నది-
- దహించుట, అగ్ని యొక్క ధర్మము. అనినప్పుడు. స్వభావము అనెడి, భానమును సూచించుచున్నది.
- కలహించెడి వారిద్దరిలో ధర్మమెవని పక్షమునందు గలదు అనినప్పుడు, ఆధర్మశబ్దము. న్యాయమనెడి భావమును దెల్బుచున్నది-
- ధర్మమువల్ల స్వర్గలోకము గల్గును. అనినప్పుడు, అది. పుణ్యమనెడి భావమును దెల్పుచున్నది.
- యుద్ధము, రాజుయొక్క ధర్మము. అనినప్పుడు విధివిహిత కృత్యము అనెడి భావము నొసంగుచున్నది.
ధర్మశబ్దమిట్లు గంభీరోదాత్త సద్భావముల కాశ్రయమైయొప్పుచున్నది.
ప్రతిమానవునకు ధర్మ మవశ్యకర్తవ్యమనుటలో సామాన్యముగ నెవ్వరి కెట్టియాక్షేపణయును లేదనియే దలంపవచ్చును.
అది యందఱకును సమ్మతమగు విషయమే. గాని ‘‘ధర్మమనగ నెట్టిది? దానికి నిర్వచనమేమి? దానికి నిజమగు తాత్పర్యమెద్ది?
అనుటలో మాత్రము.
‘‘ఎవరికివారే యమునా తీరే’’ యన్నట్లు బహువిధాభిప్రాయములును వివాదములును చెలరేగుచున్నవి.
ధర్మతాత్పర్యము నొకరొక రొక్కొక విధముగ స్వభావాను గుణ్యముగ ప్రవచించి నిరూపించుచుండుటవల్ల యుద్ధములు, రక్త పాతము లెన్నియో ధర్మము పేరనే సంభవించుచున్నవి.
కలహించెడి ప్రతివారును తమది ధర్మమనియు నితరునిది యధర్మమనియు దానిని తానిట్లుయెదిరింపకయున్న ధర్మము నశించుననియును బలుకుచుందురు.
లోకమునందెట్టి కార్యమునైనను, కొందఱు ధర్మమనియును కొందఱ ధర్మమనియును బలుకుచుండుట పరిపాటిగా నొప్పుచున్నది.
ధర్మమిట్లుండునా? మానవులకు పరస్పర మిట్లు కలహములను జనింప జేయునది ధర్మమగునా? ‘‘అట్టిదియే ధర్మమగునెడల భగవదుక్తమగు వేదమునందు దానికంతటి యున్నత స్థానముండునా. అద్దానిని పలువురు పలువిధముల భావించుటకు హేతువేమి?
ఇట్టివిషయమును ప్రతిమానవుడును విచారించవలసి యున్నది?
ఏలనన ధర్మము లోపించి యుండుటవల్లనే లోకమునందిపుడిరతటి యశాంతి ప్రళయరూపమున తాండవించుచున్నది.
శుష్క వాగాడంబరముల వల్ల నిదియెంతమాత్రమును చల్లారజాలదు.
ధర్మమనగ భూతములయొక్క ప్రకృతి సహజమైయున్న నియత వ్యాపారము (లేక) విధివిహితకర్మయని యర్థము.
సర్యోపనిషత్సారమై వెలసిన భగవద్గీతయం దర్జునునకు శ్రీకృష్ణభగవానుడు, కర్మయోగరూపమగు ధర్మతత్వమును బోధించి యతనిని, సహజకర్మయందు నియోగించి యున్నాడు.
మఱియును శ్రీకృష్ణుండాగీతయందు. మానవునకు సహజమై యొప్పిన జాతి విధివిహిత కర్మను ధర్మశబ్దముతో నిట్లుచ్చరించి వ్యాఖ్యానించి యున్నాడు.
శ్లో॥ స్వధర్మమపిచాపేక్ష్య నవి కంపితు మర్హసి॥
ధర్మ్యార్థి యుదా్ధచ్ఛేయోన్యత్ క్షత్రియస్య నవిద్యతే ॥గీత॥ 2॥ 31॥
తా॥ నీవు స్వధర్మమునైనను జూచి భయకంపితుడవుగా కూడదు. క్షత్రియునకు స్వాభావిక ధర్మమగుయుద్ధమునకం టే వేఱగు శ్రేయస్సు లేదు.
శ్లో॥ అనచేత్వమిమం ధర్మ్యం సంగ్రామంనక రిష్యసి॥
తత సధర్మం కీర్తించ హిత్వాపాపమ వాప్స్యసి॥ గీత। 22 33॥
తా॥ నీనొక వేళ యీధర్మయుక్త మగు యుద్ధమును జేయనియెడల, నీధర్మమును కీర్తిని కోలుపోయి పాపమును బొందగలవు.
ధర్మము భగవత్స్వరూపము. దానినతీంద్రియజ్ఞానులును ద్వంద్వా తీతులగు మహర్షులు మాత్రము గాంచగలుగుడు రేగాని క్రామక్రోదాదులకు వశులగు మానవులకది గోచరించుట దుర్లభము.
దేశ కాలావస్థాది భేదములతో, బహువిధముల నొప్పుచున్న ధర్మముయొక్క సత్యస్వరూపనిర్ణయమును. శాస్త్రముల యందు మహర్షులు. లోకాను గ్రహబుద్ధితో నిరూపించియున్నారు. ధర్మభేదములు భారతాను శాసనిక పర్వముననిట్లు వర్ణింప బడినది.
శ్లో॥ ధర్మాబహువిధాలో కే శ్రుతి భేదముఖోద్భవాః
దేశధర్మాశ్చదృశ్యంతే కులధర్మాస్తథై వచ
జాతిధర్మావయోధర్మాః గుణధర్మాశ్చశోభనే
శరీర కాలధర్మాశ్చఆపద్ధర్మాస్తథైవచ
ఏతద్ధర్మస్య నానాత్వం క్రియతే లోక వాసిభిః ॥ (ఉమామహేశ్వరసంవాదం)
తా॥ ఓపార్వతీ, లోకమునందు. శ్రుతి భేదములవల్ల జనించిన ధర్మములు, బహువిధములుగ నొప్పుచున్నవి. దేశధర్మములు, కులధర్మములు, జాతిధర్మములు. వయోధర్మములు. గుణధర్మములు. శరీరధర్మములు. కాలధర్మములు ఆపద్ధర్మములు. ఇట్లు నానానిధ ధర్మములోకముచే నాచరింప బడుచున్నది.
మఱియును ధర్మములు సాధారణములనియు నసాధారణములనియు ద్వివిధములై యున్నవి.
సాధారణధర్మములు బృహస్పతిచే నిట్లు బేర్కొనబడుచున్నవి
శ్లో॥ దయాక్షమానమాయాచ శౌచావొయాస మంగళం ॥
అకార్పణ్యో స్పృహిత్వేచ సర్వసాధారణోఇమే
తా॥ కృపగల్గి యుండుట. సైరణగల్గియుండుట. అసూయలేక యుండుట, శుచియును, శాంతియును, శుభాకాంక్షయు గల్గియుండుట, కార్పణ్యము లేక యుండుట, కోరిక లేక యుండుట. యివి సర్వులకును సాధారణ ధర్మములు.
అసాధారణ ధర్మములు బృహస్పతి
శ్లో॥ స్వాధ్యాయోధ్యాపనం చేవ యజనం యాజనం తధా।
దానం ప్రతి గ్రహశ్చాపి షట్కర్మాణ్య గ్రజన్మః
తాః వేదములు చదువుటయను. చెప్పుటయును కర్మలు చేయుటయు చేయించుటయును, దానమిచ్చుటయు, పుచ్చుకొనటయు నివి బ్రాహ్మణ ధర్మములు.
శ్లో॥ వేదాధ్యయన దానేచ ప్రజావాంపరిపాలనం
శస్త్రా స్త్రధారణంసేవా కర్మాణిక్షత్రియ్యస్యతు॥
తా॥ కర్మలుచేయుట. వేదములు చదువుట, దానమిచ్చుట, ప్రజలను పాలించుట. శస్త్రాస్త్రములు ధరించుట, లోకమును సేవించుట. యివి క్షత్రియ ధర్మములు.
శ్లో॥ స్వాధ్యాయోయజనందానం పడూనాంపాలనంతధా
కుసీనగృషి వాణిజ్య వైశ్యకర్మాణిపస్తవై
తా॥ వేదములు చదువుట. కర్మలు చేయుట, దానమిచ్చుట, పశువులను పాలించుట. వడ్డియు, కృషియు, వ్యాపారము నీయేడును వైశ్యధర్మములు.
శ్లో॥ శౌచంబ్రాహ్మణశుశ్రూషా సత్యమక్రోధ ఏవ చ॥
శూద్రకర్మత ధామంత్రో నమస్కారోప్యచోదితః
తా॥ శుచిగనుండుట. బ్రాహ్మణులను సేవించుట, సత్యము క్రోధరాహిత్యము మంత్ర రాహిత్యము నమస్కారము ప్రేరేపింప కుండుటయు నివిశూద్రధర్మములు.
ఇట్లనేక విధముల నొప్పుచున్న ధర్మతత్వము నెఱుంగుటకు ముందు, సృష్టితత్వక్రమము నెఱింగిన యెడల ధర్మతత్వము, నెఱుంగుట సులభమగును. గాన ప్రకృతి సహజమైయున్న సృష్టి క్రమము విచారించవలయును.
ఐతరేయోపనిషత్తునందిట్లుగలదు
శ్లో॥ ‘‘ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్’’
తా॥ సృష్టికి పూర్వమందు యీజగత్తు ఆత్మగానే యుండును.
ఛాందోగ్యోపనిషత్తునందు
శ్లో॥ ‘‘సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్
తదైక్షతబహు స్యాంప్రజాయేయ’’
తా॥ సృష్టికి పూర్వమునం దీజగత్తు సన్మాత్రముగానే యుండెను ఆ బ్రహ్మ బహువికరూపములగుటకు సంకల్పించెను.
తైత్తిరీయోపనిషత్తనందు
తన్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశిస్సంభూతః
ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాప
అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధి .... ఓషధివ్యోన్నం
అన్నాత్పురుషః
తా॥ ఆయీప్రత్యగ భిన్నమైన ఆత్మవలన ఆకాశము జనించెను. ఆకాశమువల్ల వాయువును వాయువువల్ల అగ్నియును అగ్ని వలన ఉదకములును ఉదకముల వలన భూమియును భూమివలన ఓషధులును ఓషధులవలన అన్నమును అన్నమువలన పురుషుడు జనించెను.
మొదట ఆత్మ ఒక్కడుగనే యుండి తాను బహువిధ సామరూపములగుట సంకల్పించుల వల్ల ఆబ్రహ్మనుండి ఆకాశాది పురుషపర్యంత భూతములు ఒకదానినుండి యొకటి జనించినట్లు పైశ్రుతులయభిప్రాయము తేటపడుచున్నది.
ఏకము అద్వితీయము అనంతము నిర్గుణము నామరూప క్రియారహితమగు తత్వమొక్కటియే గలదు.
ఆతత్వమనిర్వాచ్యమైనదియేయైయున్నను వ్యవహారత నాశ్రయించి యాతత్వమును వేదములాత్మయనియు పరబ్రహ్మమనియు బేర్కొనుచున్నవి.
ఆపరబ్రహ్మనుండి ఆకాశాది భూతములు జనించిన వనగు భ్రాంతిచేత. త్రాటియందు సర్పమువలెను ముత్యపుచిప్పయందు వెండివలెనా పరబ్రహ్మయందు బహువిధ నామరూపములతో నాకాశాదిభూతములు తోచుచున్నవని భావము. ఈయాకాశాది పంచ భూతములును ఆత్మకుఁ బంచకోశములుగాఁ జెప్పబడినవి. అందొకటి సత్యమగు ఆత్మ, రెండవది మిధ్యయగు ప్రపంచము నా నొప్పుచున్నవి. లోకవ్యవహారమంతయును మిథ్యయగు పంచభూతాత్మక ప్రపంచమునకు సంబంధించినదే గాని వేఱుగాదు.
ఆత్మవలనఁ గ్రమముగ నాకాశాది పంచభూతములు నుత్పత్తియై, ఆపంచ భూతములయొక్క పరస్పర సమ్మేళనమువలన నామరూపములుగల సమస్త చరాచర భూతకోటులును, గలుగుచున్నవి. ఇందవరోహణక్రమము ననుసరించి, యేభూతము నుండి యేదిజనించినదియో, దానికి జనకమగు భూతము సేవ్యముగ, ఉద్ధారకముగ, పోషకముగ నొప్పుచుండును. మఱి జనక భూతమునకు జన్యభూతము పోష్యము సేవకమునై యొప్పారుచున్నది. ఇట్లుండు పంచభూతాత్మక మగుటవలననే లోకము ప్రపంచమని వ్యవహరింప బడుచున్నది.
శ్లో॥ పురుషోయం లోక సమ్మితః
(పురుషుఁడు లోకముతో సమానుఁడు)
పిండాండ వద్బ్రహ్మండమ్.
(పిండాండమగు పురుష దేహమువలెనే బ్రహ్మాండ మున్నది.)
అను నీసూక్తి ద్వయము ననుసరించి, పిండాండ తత్వము బ్రహ్మాండము నందును, బ్రహ్మాండతత్వము పిండాండమునందును గలవని రూఢయిగుచున్నది గదా! కాబట్టి లోకధర్మము నెఱుంగుటకు ముందు దానికి జనకమగు భూతధర్మ మెఱుంగుట యవశ్యమగుచున్నది. ఈ యాకాశాది పంచభూతములకును మూడు సహజములై ప్రత్యేకములైన లక్షణము లోప్పుచున్నవి.
-
ఆకాశము:- ఇది సర్వమునకు బీజమై యత్యంత సూక్ష్మ మైనదగుట సర్వాధారశక్తి గలదై యున్నది. అట్లుండియు దీనిశక్తి రూపములేమాత్రము దెలియఁ బడకుండును. సత్వగుణము దీని ప్రత్యేక ప్రధానగుణమైయుండి యొక జాతికిఁ జెందినదిగాఁ జెప్పఁబడును.
-
వాయ్వగ్ని జలభూతములు:- ఇవిమూడును భిన్న గుణలక్షణములు గలవియై మూడు ప్రత్యేక జాతులుగా నగుపడుచున్నను మూడిరటికినిఁ జలనము సమానగుణమై యుండుటఁ బట్టి, వీనినొక వర్గము గానే చెప్పుదురు. సూక్ష్మరూపము ప్రసిద్ధవ్యవహారము వీనికిఁగలవు. ఈమూటిలో మొదటిదగు వాయుభూతమునకు దానిపై నుండు సత్వగుణ మధికమైయుండును. రెండవదగు నగ్నిభూతము ప్రధానమైన రజోగుణముతో నొప్పుచుండును. మూడవదగు జలభూతమునకుఁ గ్రిందఁ దమోగుణ ప్రధానముగు పృథివీభూతముండి తత్సంబంధముగల దగుట వలన దీనియందుఁ దమోగుణ మెక్కువగఁ జేరియుండును. అట్లుండియు నీమూడును, రజోగుణ సంబంధమునుబట్టి సజాతీయతంగలవై యొప్పుచున్నవి.
-
పృథివీభూతము:- దీనికి సుస్ఫష్టమగు స్థూలరూపము గలదు, ప్రసిద్ధమగు చలనగుణము దీనియం దగుపడకున్నది. (అచలయని పేరు) తమోగుణము దీని ప్రత్యేక ప్రధాన లక్షణము. ఇదియొక్కటే యొక్క జాతిగఁ జెప్పఁబడును.
పిండాండస్వరూపుఁడగు పురుషునియం దీపంచభూతములును పైఁదెలిపినట్లు ప్రత్యేకములగు మూడులక్షణములతో, ఆత్మ, మసస్సు, స్థూలరూప దేహముగా నొప్పుచున్నవి. మరొక విధముగాఁ జూచిన నాకాశము కారణ శరీరముగను, వాయ్వగ్ని జలములు మూడునుకలసి సూక్ష్మశరీరముగను, పృథివీభూతము స్థూలదేహముగను వ్యవహరింపఁబడుచున్నవి, ఈధర్మమే బ్రహ్మాండమనఁబడు నీలోకము నందును వెలయుచున్నది. ఎట్లన, లోకము ఆద్యము, సర్వాధారము, ఆవర్ణమునని త్రివిధముగా చెప్పబడును. అందున గోచరమగు నాకాశభూత మీశ్వరలక్షణముగ జెప్పఁబడు. వాయ్వగ్ని జలభూతములు ద్విజజాతికిఁ జెందిన బ్రహ్మ, క్షత్ర, వైశ్య వర్ణము లనఁబడుచున్నవి. ఇఁక మిగిలినపృథివీభూతము, శూద్రవర్ణముగఁ జెప్పఁబడును.
- పంచవింశతి తత్వములు-
ఆకాశాది పంచభూతముల పంచీకరణములతో వివరముగ వ్రాయఁబడు చున్నవి.
-పంచభూతముల గుణవివరణము-
- ఆకాశమునకు శబ్దమును; 2. వాయువునకు శబ్దస్పర్శములును; 3.అగ్నికి శబ్దస్పర్శ రూపములును; 4. జలమునకు శబ్దస్పర్శ రసములును; 5. పృథివికి శబ్దస్పర్శరూప రస గంధములును, వరుసగా గుణములుగాఁ జెప్పఁబడును.
- భూతపంచీకరణ విధానము -
ఆకాశాది సూక్ష్మపంచభూతములు నొక్కొక్కటి యైదు సమభాగములు కాగా నందు మొదటిభాగము, ఆభూతప్రత్యేకగుణము గలిగినదైయుండ మిగిలిన యర్ధభాగమును తదితరములగు నాల్గుభూతముల యష్టమాంశగుణములు గలదై యుండును. ఇందులకు విష్ణు యామిళ మిట్లు చెప్పుచున్నది,
శ్లో॥ ఆథాకాశస్య భూతస్యసార్థం జ్ఞాతేతికథ్యతే
శేషార్థంతు చతుర్భాగాన్ కృత్వాసం మిశ్రమాచరేత్॥ 1
పవనే మిళితాకాశం భాగం మానస ముద్యతే
అనలే మిళితాకాశం బుద్ధి రిత్య భిధీయతే ॥ 2
జలేన మిళితాకాశం చిత్తమిశ్య భిధీయతే
పృథివ్యాం మిళితాకాశం ఆహంకార ఇతీరతః॥ 3
భావము:- ఆకాశములోని మొదటి యర్ధభాగము ప్రకాశించెడియాత్మ, జ్ఞాత, పురుషుడు క్షేత్రజ్ఞుడు, ఈశ్వరుఁడు అని పిలువఁబడుచున్నది. ఇక మిగిలిన యర్ధభాగములోని ప్రతియష్టాంశమిట్లు మారును, వాయుయుక్తాకాశము మనస్సనియు, అగ్నియుక్తాకాశముబుద్ధియనియు, జలయుక్తాకాశము చిత్తమనియు, పృథివీయుక్తాకాశ భాగము అహంకారమనియు వ్యవహరింపఁబడును,
శ్లో॥ తధాచవాయోరర్థంచ వ్యాసంచ సంకీర్తితమ్
శేషార్ధేత్వేక భాగంచ సమానం ద్యోమమిశ్రితమ్॥ 4
ఆగ్నేన మిశ్రితమ్ భాగం ఉదానమభిధీయతే
జలేనమిశ్రితం భాగం తత్ప్రాణ మితికథ్యతే ॥ 5
పృథివ్యాం మిశ్రితం భాగం అపాన మితికీర్తితమ్
భావము:- వాయుభూతనుందలి శుద్ధార్థ భాగమునందలి యాత్మ వ్యాన వాయువనఁబడును. దానిలోని యితర భాగమందలి ఆకాశయుక్త వాయువు సమానవాయువనియు. అగ్నియుక్తము ఉదాన వాయువనియు, జలయుక్తము ప్రాణవాయువనియు, పృథివీయుక్తము అపానవాయువనియు చెప్పఁబడుచున్నవి.
శ్లో॥ ఆగ్నిమధ్యార్థభాగంతు అక్షీరిత్యభిధేయతే॥ 6
తధావ్యోమ గతంభాగం శ్రోత మిత్య భిధీయతే
వాయునా మిశ్రితం భాగం త్వగింద్రియ మితీరితం॥ 7
జలేన మిశ్రితం భాగం జిహ్వ ఇత్యభిధీయతే
పృథివ్యామిశ్రితం భాగం ఘ్రాణేంద్రియ మితీరితమ్॥ 8
భావము:- అగ్ని భూతములోని శుబ్ధార్థములోని యాత్మ నేత్రేంద్రియమనియు దానిలో మిగిలిన ఆకాశయుక్తాగ్న్యంశము శ్రొత్రేంద్రియమనియు, వాయుయుక్తము త్వగీంద్రియమని, జలయుక్తము జిహ్వేంద్రియమని పృథివీయుక్తము ఘ్రాణేంద్రియమని చెప్పఁబడును.
శ్లో॥ జలేప్యర్థం సంజ్ఞేౖయం శబ్దం వ్యోమేచ మిశ్రితం
వాయునా మిశ్రితం భాగం స్పర్శం భవతి నిశ్చయం॥
అగ్నౌసమ్మిశ్రితం భాగం రూప మిత్యభిధీయతే
పృథివ్యా మిళితం భాగం గంధమిత్యభిధీయతే॥
భావము:- జలభూతములోని శుద్ధమైన యర్థమునందలి యాత్మ మనఁబడు చున్నది. ఇఁక జలములోని యాకాశయుక్తము శబ్దమనియు, వాయుయుక్తము స్పర్శమనియు, అగ్నియుక్తము రూపమనియును, పృథివీయుక్తము గంధమనియుఁ బిలువఁబడుచున్నవి.
శ్లో॥ పృథివ్యా మర్ధ భాగంతు పాయురింద్రియ ముచ్యతే
వ్యోమేసమిళితం పృథ్వీభాగం వాగీంద్రియం మతం
వాయునామిళితం పృథ్వీభాగం పాణీంద్రియం తథా
అగ్ని నామిళితం భాగం పాదేంద్రియ మితిస్మృతం?
జలేన మిళితం భాగం ఉపస్థ ఇతికథ్యతే
భావము:- పృథ్వీభూతముయొక్క శుద్ధమైన యర్థములోని ఆత్మ పాయువనఁ బడును, మిగతలోని యాకాశయుక్త పృథివి వాక్కనియు వాయుయుక్తము పాణియనియు, జలయుక్తము ఉపస్థయనియు పిలువఁబడుచున్నవి.
అట్లు పంచభూతములును పంచీ కరణమునందుంచుట వలన నొక్కొక్క భూతము నైదు ప్రత్యేకతత్వములుగలదై పంచవింశతి తత్వము లేర్పడుచున్నవి. అందు నాకాశము యొక్క శుద్ధమగు నర్ధ భాగము, పై వివరణమునుబట్టి క్షేత్రజ్ఞతత్త్వ మగుచున్నది. అదిపోను మిగిలిన చతుర్వింశతి(24) తత్వములును క్షేత్రమనఁబడును, ఇట్టిక్షేత్రము నెఱింగినవాఁడు ఇరువదైదవతత్వ మనదగు నీశ్వరుఁడై యున్నాడు. అట్టి మూలతత్త్వ మగు పరమాత్మ నిర్గుణము, నిష్క్రియము (గుణములు క్రియలులేనిది) అగుటవలన సర్వప్రపంచమునకు నీశ్వరుఁడు, నియామకుఁడగు కర్తయై సర్వభూతములను తమతమ నియతమివ్యాపారములం దుంచెడి బాధ్యతను వహించియున్నాడు, అందువలననే ధర్మోద్ధరణ భగవత్కృత్యమై యున్నది. మఱి భగవంతునిచే నుద్ధరింపఁబడు ధర్మమెట్టిదో విచారింతము.
-ధర్మము-
ధర్మమనగా భూతములకు నియతమై సహజమై యేర్పడి యుండిన వ్యాపారము లేక వాని విధివిహిత కర్మయని వివరణముఁజెప్పవచ్చును. ఇంతవఱకు వివరించిన భూతముల సృష్టిపరిశీలనము వలన తేలిన సారాంశ మెట్టిదో మరల నొకమారు సింహావలోకనము చేసిచూతము.
సర్వభూతములకును జన్యజనక, పోష్యపోషక, సేవ్యసేవకత్వము లున్నవనియు, వానికి నియతమగు కర్మకలదనియు, వానియందు తరతమ భేదము కేవలము వ్యవహారమునకుమాత్ర ముండుననియు సహజసమాన గుణలక్షణములు గల భూతము లొకేవర్గముగలేక జాతిగ నొప్పుచుండుననియుఁ దెలియఁగలిగితిమి. ఇంకను క్రిందిజాతి భూతమునకుఁ బైజాతిభూతము పోషకముగను క్రిందిజాతి భూతము పై దానిని సేవించునదై యుండుననియుఁ దెలియనయ్యెనుగదా! భూతముల యీనియతికే ధర్మమని వేదశాస్త్రములందు వచింపఁబడినది. వేదాంతసారమని ప్రసిద్ధినొందిన శ్రీమద్భగవద్గీతాశాస్త్రమునందు శ్రీకృష్ణభగవానుఁ డర్జునునకుఁ గర్మయోగమనుపేర ధర్మతత్వమునే బోధించి పార్థుని నిజకర్మలయం దనురక్తుఁ గావించి, ధర్మోద్ధరణ మొనరించియున్నాఁడు. జాతికి సహజముగ నొప్పియుండిన విధివిహిత కర్మను ధర్మశబ్దముచే నుచ్చరించి భగవానుడే ధర్మశబ్దమునకు వ్యాఖ్యానము గావించినాఁడు.
శ్లో॥ స్వధర్మమపిచావేక్ష్య నవికంపితు మర్హసి
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోన్యత్ క్షత్రియస్య నివిద్యతే॥ 2-31
అనగా అర్జునా! నీవు నీస్వధర్మమునైనను గుర్తించి, భయపడకుము, క్షత్రియునకు ధర్మమగు యుద్ధమునకంటే వేఱక శ్రేయస్సని లేదు. మఱియును,
శ్లో॥ అథచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం నకరిష్యసి
తతస్వధర్మం కీర్తించి హిత్వా పాప మవాప్స్యసి॥ 2-33
అనగా ఒక వేళ నీవీధర్మయుక్తమగు యుద్ధమును జేయక పోయితివిపో, నీస్వధర్మమును కీర్తినిఁ గోలుపోవుటయేగాక, పాపమును పొందుచున్నావు సుమా!
ఈవిధముగా హితోపదేశము నొనరించి యర్జునుని, తద్వారా లోకమును ఉద్ధరించిన శ్రీకృష్ణ భగవానుఁడు ధర్మసంస్థాపనార్థ మవతరించిన సగుణమూర్తి యగు పరమేశ్వరుఁడే! ఇఁక నర్జునుఁడన్ననో పరమేశ్వరున కతిసన్నిహితస్థితి నందుకోఁగలిగిన జీవుడగుచున్నాఁడు. తన కత్యంతసమీపవర్తియై సేవించుచున్న జీవు నుద్ధరించు బాధ్యత యీశ్వరునిదేగదా!